Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పటంలో దెయ్యం (హరర్ కథ)
#1
పటంలో దెయ్యం(హరర్ కథ)
-                      sasirekhaa lakshmanan
అర్థరాత్రి పన్నెండు గంటలకు హర్రర్ కథ రాయడమంత హర్రర్ వేరే ఉండదేమో..!!
స్వగతంగా అనుకుని నవ్వుకుంది రాధిక.
 
చెల్లెలు హాయిగా నిద్రపోతోంది.రాధిక రైటింగ్ టేబుల్ ముందు కూర్చుని రాసుకుంటోంది.హర్రర్ కథలపోటీకి రేపే పోస్ట్ చేయాలి.
 
అందుకే మనసులో అనుకున్న కథకు సగం రూపమందించి "దెయ్యాలబావి" అనే కథ రాయడం మొదలుపెట్టింది.
 
కథ మంచి రసపట్టులో ఉండగా కిటికీ శబ్దమయ్యింది.టపటపా కొట్టుకుంటుంటే వెళ్ళి కిటికీ మూసి వచ్చింది.
 
రాద్దామనుకుంటే కలం కదలడం లేదు.ఏవేవో ఆలోచనలు అలలు అలలుగా మదిలో మెదలుతున్నాయి.
దాంతో ఒక్కసారి తల విదిలించి "టీ" త్రాగి మొదలెడదామనుకుని వంటింట్లో కెళ్ళింది.అక్కడ పాలు ఒక అరగ్లాసు పాలగిన్నెలో ఉండిపోయింది.
 
"టీ" చేయడానికి ఆ మాత్రం పాలు చాలు అనుకుని టీ గిన్నె తోమి నీళ్ళు ..టీ పొడి వేసి మరగనిచ్చి,కొంచెం అల్లం,మిరియాలపొడి,చక్కెర కలిపి పాలు వేడి చేసి టీ నీళ్ళల్లో కలిపి టీ కప్పులో ఒంపింది.
 
చేతిలో టీ కప్పు తీసుకుని వంటింటి నుండి హాలు దాటుకుంటూ తన గదిలో కెళ్ళింది.హాల్లోని అందమైన చిత్రపటంలోని బొమ్మ మారిపోయి బుగ్గలు,నుదురు,మెడ కాలిన చర్మంతో రాధికను దీనంగా చూస్తోంది.
 
పైగా ఒక కన్ను నల్లటిగుడ్డు లేకుండా తెల్లటి గుడ్డు భాగం మాత్రం వికృతంగా కనబడుతోంది.
 
రాధిక హతాశురాలైయ్యింది.చేతిలోని టీ కప్పు వణకసాకింది.అదిరిపడే మనసుతో తోడుగా చెల్లెలు ఉంది కదా అని గదిలోకి వడి వడిగా అడుగులు వేసింది.
 
రితిక హాయిగా నిద్రపోతోంది.
 
హాల్లో చిత్రపటం కేసి బెడ్ రూమ్ నుండే చూసింది.
గుండె గుభిల్లుమంది.అయినా భయపడకుండా ఆంజనేయుని హనుమాన్ చాలీసా చదువుకుంటూ గది తలుపులు వేసింది.
 
గది తలుపులు వేసే ముందు ఆ చిత్రపటం మామూలుగా గతంలో నున్న సుందరమైన రూపం సంతరించుకుంది.
 
ఏ.సీ.గాలి చల్లగా వీస్తోంది.తన రైటింగ్ టేబుల్ ముందు కూర్చుని బెడ్ లాంప్ వెలుతురులో టీ త్రాగడం ప్రారంభించింది.
 
మెల్లమెల్లగా టీ త్రాగుతూ..ఎంత వరకు రాసానా..??
అని తను రాసిన స్క్రిప్ట్ పేపర్ చూడసాగింది.
 
ఒక్క క్షణం అదిరిపడింది.
కారణం తను రాసేప్పుడు శ్రీలత బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది అని రా..సిం..ది..!!
 
కానీ ఆ కాగితంపై పెన్నుతో శ్రీలతది ఆత్మహత్య కాదు.."హత్య"...అని రాసి ఉంది.
వేరే ఎవరో రాసిన చేతివ్రాత.
 
భయవిహ్వలురాలై చెల్లెలు వంక చూసింది.
తను హాయిగా నిద్రపోతోంది.
మిగిలిన టీని కప్పులో నుండి వేడి మీదనే గబగబా త్రాగేసింది.
 
కప్పు టేబుల్ మీద పెట్టి గది మొత్తం పరికించ సాకింది.
ఎక్కడా ఏ శబ్దం లేదు.అంతా మామూలుగానే ఉంది.
 
అనుమానంతో తమ మంచం క్రింద చూసింది.
ఎవరూ లేరు.మంచం సొరుగు నుండి చిన్న టార్చ్ లైట్ తీసి మరోసారి మంచం క్రింద చూసింది.
 
అహ..!!!ఎవరూ లేరు..!!
మరి ఎవరుంటారబ్బా..???
అనవసరంగా భ్రమలో పరిభ్రమిస్తున్నానా..??
పరి పరి విధాలా ఆలోచించి తిరిగి రాయడం మొదలు పెట్టింది.
 
కథ లోని శ్రీలత ఆ ఇంట్లో గతంలో నివసించిన పాతికేళ్ళ యువతి.
శ్రీలత మతిభ్రమించి బావిలో పడి చనిపోయింది.
 
దాంతో ఆమె భర్త ఈ ఇల్లు అమ్మేసి దుబాయ్ కెళ్ళి ఉద్యోగం చేసుకోసాగాడు.
శ్రీలత ఉన్న ఇంట్లో ఉంటే ఆమె జ్ఙాపకాలు వెంటాడతాయని ఆ ఇల్లు అమ్మేసాడు.
ఆ ఇల్లు కొన్నతను ఆ ఇంట్లో ఏదో మర్మం ఉన్నట్లనిపించి రాధిక నాన్నగారికి కోటిరూపాయలకు అమ్మేసాడు.
 
రాధిక నాన్న పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి.
కాబట్టి ఏ మాత్రం భయపడకుండా కొనేసాడు.ఏదైనా సమస్య వస్తే అమ్మేద్దాం అనుకున్నాడు.
 
ఇంటికి మరమ్మత్తులు చేసి తన ఇద్దరు కూతుర్లతో..భార్య పారిజాతంతో నివసించసాగాడు.
 
ఆ ఇంట్లో హాల్లో చనిపోయిన శ్రీలత తైలవర్ణచిత్రం అద్భుతంగా ఉంటుంది.
దాంతో దాన్ని అలాగే ఉండనిచ్చాడు.
శ్రీలత భర్త సురేష్ ఆ చిత్రపటాన్ని దుబాయ్ కి తీసుకెళ్ళలేదు.
 
కారణం గతంలో శ్రీలత మోడలింగ్ చేసేప్పుడు ముచ్చట పడి కొన్న తైలవర్ణచిత్రం.
ప్రముఖ చిత్రకారుడు ఫణి మోడల్ గా శ్రీలత నటించిన యాడ్ ఫోటో చూసి కాన్వాసుపై తన కుంచెకు వివిధ వర్ణాలతో శ్రీలత బొమ్మకు అందమైన రూపం కల్పించాడు.
ఆ తరువాత సురేష్ తో శ్రీలత పెళ్ళి జరిగింది.
ఇదంతా గతం.
 
———— ****************————
 
రాధిక ఇరవైమూడేళ్ళ అందమైన అమ్మాయి.
ఆ ఇంటికి వచ్చి మూడునెలలవుతోంది.
ఆ ఇల్లు రాధిక నాన్న ప్రకాశ్ కొన్నాడు.
రాధిక చెల్లెలు ..,రితిక,రాధిక ఇద్దరే పిల్లలు ప్రకాశ్ కి.
రితిక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.
రాధిక ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో 25,000_జీతానికి పన్జేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్.
అప్పుడప్పుడు కథలు,కవితలు,వ్యాసాలు రాసి వార,మాస పత్రికలకు పంపుతుంది.
కొన్ని అచ్చయ్యి చిన్నపాటి రచయిత్రిగా పేరు తెచ్చుకుంది.
అమ్మనాన్నలిద్దరూ బంధువులింటి పెళ్ళికి రెండురోజులు విశాఖపట్నం వెళ్ళడంతో వీళ్ళిద్దరూ ఆ ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది.
—————————*********———————
రాధిక మళ్ళీ కథ రాయడం మొదలు పెట్టింది.
శ్రీలతది ఆత్మహత్య కాదు అని హత్య అని ఎవరో అజ్ఞాతవ్యక్తి రాసారు.
మరి ఎవరు హత్య చేసారు...???
ఎందుకు హత్య చేసారు..???
 
ఒకవేళ శ్రీలత భర్త సురేష్ ఆమెను హత్య చేసి కేసు క్లోజ్ చేసి ఇల్లు అమ్మేసి దుబాయ్ వెళ్ళిపోయాడా..???
 
అలా ఆమె మనసులోనే అనుకోసాగింది.
అలా అనుకోగానే ఆమె పక్కన నల్లటి స్త్రీ వచ్చి కూర్చుని చెంపల పై చేయి వేసుకుని,
"లేదు రాధిక..!!
సురేష్ నన్ను చంపలేదు.అతనికి నేనంటే ప్రాణం.నన్ను అన్యాయంగా చంపి సురేష్ తో నిండుజీవితం అనుభవించకుండా చేసిన నీచుడు...!!"
 
అంటూ ఆ నల్లటి స్త్రీ ఆకారం పలుకులు ఆ గదిలో ప్రతిధ్వనించగానే...ఆ అదురుకు రితిక నిద్ర లేచింది.
 
అప్పుడు సమయం ఒంటిగంటవుతోంది.
రాధిక బిత్తరబోయి తన ప్రక్కనే కూర్చుని విరబోసుకున్న జుట్టుతో ఉన్న నల్లటి ఆకారాన్ని చూడసాగింది.
 
వికృతమైన ఆ రూపానికి ఒక కనుగుడ్డు లేదు.ఆ స్థానంలో తెల్లటి గుడ్డే ఉంది.
మరో వంక నుదురు,మెడ,చెంపలు కాలి చర్మం రాచుకునిపోయి ఉంది.
 
పైగా ఆ రూపం హాల్లోని అందమైన శ్రీలత చిత్రపటాన్ని పోలి ఉంది.
రితిక నిద్ర లేచి, "రాధక్కా..!!ఎవరితో మాట్లాడుతున్నావ్.???
ఏమయ్యింది..??"
అని అడగసాగింది.
 
ఆ నల్లటి ఆకారం రెప్పపాటు క్షణంలో ఎగురుకుంటూ మాయమయ్యింది.
రాధిక నోటమాట రాలేదు.
బెడ్ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ పైనున్న మంచినీళ్ళ బాటిల్ నుండి నీళ్ళు గటగటా త్రాగేసింది.
ఏం జరిగిందో అర్థం కాక రితిక అయోమయంగా చూడసాగింది.
"ఏం లేదు..!!నేనే కథ రాస్తూ మైండ్ వాయిస్ లో మాట్లాడుకుంటూ పైకి అనేసానంతే..!!"
చెల్లిని బుజ్జగించి మాట మార్చింది రాధిక.
—————————*******————————
భళ్ళున తెల్లవారింది.
రాత్రి జరిగింది కలా..??నిజమా..??భ్రమా..??
కల కాదు.నిజం.భ్రమ అసలే కాదు అని రాధికకు సగం రాసిన కథ తరువాతి వాక్యాలు చదవగానే అర్థమయ్యింది.
 
ఆలోచిస్తూ చెల్లెలికి బ్రెడ్ టోస్ట్ చేసి జూనియర్ కాలేజ్ దగ్గర స్కూటీలో దింపి వచ్చింది.
తరువాత ఇంట్లో అన్ని గదులు కలియ తిరిగింది.
 
స్టోర్ రూమ్ లో శ్రీలత వస్తువులేమయినా ఉన్నాయా అని వెతికింది.
అన్నీ విరిగిన ఫర్నిచరు,పాత సామాన్లు.
అటువంటి సమయంలో ఆ గది నుండి బయటకి వస్తుండగా వినబడిందో మాట.
 
"అక్కడేం వెతుకుతావు రాధికా..!!
నీ టేబుల్ గతంలో నాదే!!
ఆ టేబుల్ సొరుగులో వెతుకు..!!
నా డైరీలో ఆ నీచుడి వివరాలు దొరుకుతాయి." రాధిక నిరుత్తరురాలయ్యింది.
 
ఒక్క క్షణం ఆమె మైండ్ బ్లాక్ అయ్యింది.
ఆ మాటలు ఎక్కడ నుండి వచ్చాయి అని చుట్టూ పరికించింది.
హాల్లోని చిత్రపటం లోని శ్రీలత బొమ్మ దీనంగా చూస్తూ కనబడింది.
 
రాధిక ఇప్పుడు కొంచెం కొంచెం ఆ పరిసరాలకు అలవాటవుతోంది.
 
ఆ ఇంట్లో శ్రీలత ఆత్మ సంచరిస్తోంది.తనను చంపినవారిని చట్టానికి పట్టించాలనో లేదా అంతమొందించాలనో రాధిక సాయం కోరుకుంటోంది.
 
ఆమె ఆత్మ సాయం కోసమని హృదయవిదారకంగా ఏడుస్తోంది.
ఆ రోజుకి రాధిక ఏదో వంట కానిచ్చి కొంచెం ఎంగిలి పడింది.
 
మనసంతా కకావికలమయిపోయింది.
ఆ రాత్రికి రాధిక తల్లిదండ్రులు ఊరు నుండి రావడంతో హాయిగా ఊపిరి పీల్చుకుంది.
 
"అమ్మా..!!
పెళ్ళి బాగా జరిగిందా..??"
ఆప్యాయంగా అడిగింది రాధిక.
"ఆ జరిగింది.!!"
నిర్లిప్తంగా అంది పారిజాతం.
ఆ పెళ్ళి పారిజాతం అన్న కొడుకుది.
రాధికను ఎంతో ఇష్టపడ్డాడు.అయితే రాధిక ససేమిరా ఒప్పుకోకపోవడంతో పారిజాతం నిరాశ చెందింది.
 
అప్పటి నుండి కూతురు ఎంత బాగా మాట్లాడినా నీరసంగా జవాబివ్వడం మొదలెట్టింది.
 
రాధికకు చూచాయగా అర్థమయినా తన జీవితం తల్లి మనోభీష్టం నెరవేర్చేందుకు పణంగా పెట్టడం ఇష్టం లేక పోయింది.
అందుకే పారిజాతం అన్న కొడుకుని పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించలేదు.
దాంతో వేరే పెళ్ళి సంబంధం చూసి పెళ్ళి జరిపించారు.అదీ సంగతి.
—————————*******————————
ఆ రాత్రి పదకొండు గంటలకు కథ ప్రారంభించబోయింది రాధిక.
కారణం శ్రీలత డైరీ తన టేబుల్ సొరుగులో ఒక రహస్య అరలో దొరికింది.
దాని ప్రకారం శ్రీలతను ప్రముఖ చిత్రకారుడు ఫణి గాఢంగా ప్రేమించాడు.అయితే శ్రీలత సురేష్ ను పెళ్ళి చేసుకోవడంతో విలవిల లాడిపోయాడు.
 
సురేష్ కు దుబాయ్ లో జాబ్ రాగానే శ్రీలతకు మళ్ళీ దగ్గరవ్వాలని ప్రయత్నించ సాగాడు.
శ్రీలత అతని దురాలోచనని పసిగట్టి అతనిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచింది.
అయితే తనకు దక్కని శ్రీలత సురేష్ కు దక్కడం ఫణికి మంటగా ఉంది.
 
అంత వరకు డైరీ లో చదివిన రాధిక,
"ఆ తరువాత ఏమయ్యిందని..!!" ఆలోచించసాగింది.
 
ఆ రాత్రి రాధిక కథ సగం రాసి నిద్రపోయింది.
నిద్దట్లో ఎవరో గొంతు నులుముతున్నట్లనిపించి ఉక్కిరిబిక్కిరి అవసాగింది.
కళ్ళు తేలేసింది.
 
చనిపోతానేమో అనుకుంది.
ఇంతలో ఆ అపరిచిత ఆకారం ఏదో దెబ్బ తగిలినట్లు "అమ్మా..!!"అంటూ గగ్గోలు పెడుతూ ఆ గది నుండి గునగున బయట కెళ్ళి తలుపేసుకుంది.
రాధికకు అసలేమీ అర్థం కావడం లేదు.
ఏదో మార్మికమైన లోకం నుండి భూలోకంలోకి వచ్చినట్లు ఫీల్ కాసాగింది.
————————********—————————
మరో రెండురోజులు గడిచింది.
ఆ రాత్రి రాధికకు కొంచెం ధైర్యం వచ్చింది.శ్రీలతను రప్పించాలని ఆమె రాసిన డైరీని కావాలనే చింపసాగింది.
 
చిత్రపటంలో దెయ్యం_2
**************************************
కొన్ని పేజీలు చింపగానే శ్రీలత నల్లటి వికృత ఆకారం రాధిక చెంప చెల్లుమనిపించింది.
రాధిక కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.
భయాందోళనలతో శ్రీలతనే చూడసాగింది.
"ఎందుకే చింపావు..???
ఆ దుర్మార్గుడిని రక్షిద్దామనా..??"ఎడాపెడా రాధిక చెంపలు వాయించేసింది.
రాధిక కూడా ఆగ్రహంతో ఊగిపోయింది.
"లేదు శ్రీలతా..!! నేనెందుకు వాడిని రక్షించాలి..???నాకు నీపై జాలి.నీకు విముక్తి కలిగించాలనే నా ఆరాటం.అందుకే నిన్ను రప్పించాలని ఈ పథకం వేసాను."చెంపలు తడుముకుంటూ అంది రాధిక.
"అయితే విను..!!ప్రముఖ చిత్రకారుడు ఫణి నేను మోడలింగ్ చేసిన యాడ్స్ చూసి నాపై మోజు పెంచుకున్నాడు.
అయితే అప్పటికే నేను సురేష్ ప్రేమలో పీకల దాకా మునిగి ఉన్నాను.
దాంతో అతడిని తృణీకరించాను.
అయిదేళ్ళు నేనూ సురేష్ హాయిగా కాపురం చేసుకుంటూ రోజులు గడిపేసాం.
సురేష్ కు దుబాయ్ లో జాబ్ రాగానే వెళ్ళిపోయాడు.అక్కడి నుండి వీడియో చాట్ ,స్కైప్ లలో,వాట్సప్ లలో మేం ముచ్చట్లాడుకునేవాళ్ళం.
అయిదేళ్ళయినా నన్ను మరువలేక ఫణి నాకు మళ్ళీ గాలం వేయడం మొదలెట్టాడు.
అసలు ఫణి వేసిన ఈ చిత్రపటం చూసే సురేష్ నన్ను ఆరాధించి నన్ను వెతికి మరీ ప్రేమించాడు.
ఈ పెయింటింగ్ ను సురేష్ పాతికవేలు పెట్టి కొన్నాడు.
ఇక్కడున్నన్ని రోజులు ఆ బొమ్మ చూస్తూ సురేష్ మురిసిపోయేవాడు.
ఒకరోజు ఫణి ఈ ఇంటికి వచ్చాడు.
సురేష్ కు డైవర్స్ ఇచ్చేసి తనను పెళ్ళి చేసుకోమని బ్రతిమలాడాడు.
నేను ముందు మర్యాదగానే నిరాకరించినా వినకుండా నన్ను బలవంతంగా అనుభవించాలని చూసాడు.
ఆ పెనుగులాటలో నేనూ కటువుగా మాట్లాడుతూ ఫణిని క్రింద తోసేసాను.
నీ గదిలోని టేబుల్ మొనకు అతని తల తగిలి బాధతో అరిచాడు.
నేనూ కంగారుగా వీథిలోకి పరుగుపెట్టబోయాను.
నాకు దక్కని నీవు ఆ సురేష్ గాడికి దక్కకూడదని నన్ను చంపాలని ఎక్కడ దాచాడో తెలీదు నా ముఖంపై యాసిడ్ పోసాడు.
భయంకరంగా అరుస్తూ..గుండెలు పగిలేలా ఏడుస్తూ నేనూ అపరిమితమైన బాధతో నేల మీద పడిపోయాను.
నా కనుగుడ్డు అందవికారంగా మారిపోయింది.
నా చెంపలపై,నుదురుపై,మెడపై యాసిడ్ మరకల వల్ల కాలిన గాయాలయ్యాయి.
అయినా ఫణి నన్ను వదలలేదు.
నన్ను జుట్టు పట్టుకుని గోడకేసి బాది చంపేసాడు.
తరువాత బావిలో పడేసి అస్తవ్యస్తంగా గందరగోళంగా ఉన్న హాల్ ,వంటింట్లోని ప్రదేశం,బెడ్రూమ్ లలోని రక్తం తుడిచేసాడు.
ఆధారాలన్నీ మాయం చేసాడు.
బావిలోని నా శవం దుర్వాసనకి రెండ్రోజులకి ఇరుగుపొరుగు కనుక్కుని సెక్యూరిటీ ఆఫీసర్లకీ మరియు సురేష్ కు ఇన్ఫర్మ్ చేసారు.
పోస్ట్మార్టమ్ రిపోర్ట్ లో భర్త నుండి దూరంగా ఉండడం వల్ల నాకు మతి భ్రమించి పొరబాట్న బావిలో పడి మరణించినట్లు లంచంగా పదిలక్షలిచ్చి రాయించాడు."
చాలాసేపు మాట్లాడడం వల్ల వగరుస్తూ అంది శ్రీలత.
రాధిక చెంపలకు ఆల్మండ్ మరియు ఆలోవెరా గల లోషన్ రాసుకుంటూ వింటోంది.
శ్రీలత ఆమెను చూస్తూ నెమ్మదించిన స్వరంలో మళ్ళీ సంభాషణ మొదలెట్టింది.
"రాధికా..!!
ఇవేవి తెలీని సురేష్ ఈ ఇల్లు,ఇంట్లోని వస్తువులతో సహా అమ్మేసి దుబాయ్ వెళ్ళిపోయాడు.
మీ నాన్న బాగున్న ఫర్నిచర్ అమ్మేసి కొత్తది కొన్నాడు.
నీవు వాడే రైటింగ్ టేబుల్ మరియు కొన్ని స్టోర్ రూమ్ లోని పాత ఫర్నిచర్ ఓ లెక్స్ లో సేల్ కు పెట్టాడు.
హాల్లోని నా పాతికవేల ఖరీదు గల చిత్రం అలానే ఉంచేసాడు.
నీకు నేను కనబడడం,నా మాటలు నీకు వినబడడంతో ఆ ఫణి మీద నా పగ తీర్చుకోవడానికి పనికొస్తావని పించింది.
అందుకే నీ చుట్టూ తిరుగుతున్నాను."
ఆశగా అంది శ్రీలత.
"నా చుట్టూ తిరిగితే నీకేమోస్తుంది..??
పైగా పోస్టుమార్టమ్ రిపోర్టు రీత్యా నీవు ఆత్మహత్య చేసుకున్నట్లే కదా..??"విసుగ్గా అంది రాధిక.
"ఆ రిపోర్టు రాసిన వాడిని చంపేసాను."చావు కబురు చల్లగా చెప్పింది శ్రీలత.
"వ్వ్వ్ వావ్వా వ్వ్ ట్ ..???భయకంపితురాలై అంది రాధిక.
"అవును.కరెంట్ షాక్ కొట్టేట్లు చేసి చంపేసాను."
"శ్రీలతా..!!
అయితే నన్ను కూడా చంపుతావా..??
అందుకే నా గొంతు నులిమి చంపాలని చూసావా..??"బాధగా అంది రాధిక.
"నీ గొంతు నులమాలని చూసింది నేను కాదు..!!"
"మరి..!!"రాధిక స్వరంలో వేయి ప్రశ్నలు.
"మీ........అ.....మ్మ....!!"
"ఆ....!!!
మా....అమ్మ....నా...????"
దుఃఖం ఆశ్చర్యం మిళితమైన గొంతుకతో గద్గదికంగా అంది రాధిక.
"ఎందుకు నన్ను చంపడం..???"
"నీవు తన అన్న కొడుకుని పెళ్ళి చేసుకోలేదుగా..??
అందుకు..??"
"అయితే ఏమి..???"
"నీవేమన్నా కన్నకూతురివా..???ప్రాణంలా చూసుకోవడానికి..???సవతికూతురివి..!!తన అన్న కొడుకుకి ఇచ్చి ఆస్తి కొట్టేద్దామనుకుంది.
వీలు కాలేదు.దాంతో నిన్ను చంపి తన స్వంత కూతురు రితికను ఆస్తంతటికి వారసురాలిని చేయాలనుకుంది."
మనుషులలో నీచత్వాన్ని చిన్నప్పటి నుండి చూడడం వల్ల శ్రీలతకు ఈ విషయం పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు.
కానీ రాధిక నే తట్టుకోలేకపోయింది.
నమ్మశక్యంగా లేదు.తన పదేళ్ళప్పుడు అమ్మ క్యాన్సర్ తో చనిపోవడంతో నాన్న పారిజాతంను పెళ్ళి చేసుకున్నాడు.
తనూ అమ్మ అనే ఇన్నాళ్ళు పిలుస్తోంది.ఆ మాటకు విలువ లేదా..??
దెయ్యాల కన్నా మనుషులే హారర్ గా అనిపించసాగారు.
రాధిక కళ్ళు వర్షిస్తున్నాయి.
చాలా సేపటి తరువాత శ్రీలత అంది.."ఆ ఫణి గాడు మాంత్రికుల సాయంతో నన్ను ఈ ఇంటికే కట్టడి చేసాడు.దాంతో నేను వాడిని చంపలేను.అయితే వాడికి తగిన శిక్ష విధిస్తే గానీ నా ఆత్మ శాంతించదు.పై లోకానికి వెళ్ళదు.
అందుకే నీ సాయమడిగాను."వేడుకోలుగా అంది శ్రీలత ఆత్మ.
శ్రీలత నల్లటి అనాకారి వికృతమైన ఆత్మ రాధికకు దయనీయంగా అనిపించింది.
ఆమె నల్లటి కురులు పాదాల వరకు వేలాడుతోంది.తెల్లటి కంటి గుడ్డు ఇప్పుడు భయంకరంగా అనిపించడం లేదు.యాసిడ్ తో కాలిన మెడ,నుదురు,చెంపలలో దైన్యం కనబడుతోంది.
ఆమె కన్నా తన అందమైన అమ్మ పారిజాతమే వికృతంగా అనిపిస్తోంది.
రాధిక బాగా ఆలోచించసాగింది.
శ్రీలత రాధిక ఎదురుగా విరబోసుకుని ఉన్న జుట్టుతో ఆతృతగా చూస్తోంది రాధిక ఏం చెబుతుందా అని.
"ఆ ఫణి గాడి మీద నేను కేసు వేస్తాను.నీ హత్య గురించి కాదు.స్త్రీలను నగ్నంగా చిత్రించి ఆ చిత్రాలను అమ్మకానికి పెట్టాడు.ఆ విషయంగా వాడిని బొక్కలో తోయించి యువతను పెడత్రోవలో పెడుతున్నాడని శిక్ష వేయిస్తాను.ఆ సమయంలో జైలు లోనే వాడి జీవితం గడిచేట్లు చూస్తాను.-కక్షగా అంది రాధిక.
"లేదు.అదంతా వృధా ప్రయాస.జామీనుతో బయటకు వస్తాడు.మళ్ళీ స్త్రీల జీవితాలతో ఆడుకుంటాడు."నిరాశగా అంది శ్రీలత.
వారికి ఆ అవసరం లేకుండా మరునాడు అనూహ్యమైన సంఘటన జరిగింది.
———————————****————————
మరుసటి రోజు దినపత్రికలో వార్త.
"ప్రముఖ చిత్రకారుడు ఫణి కారు యాక్సిడెంట్ .అతిగా మద్యం సేవించి కారు నడుపుతూ ఎదురుగా వచ్చే లారీని ఢీ కొట్టి ఘోరమైన విపత్తుకు లోనయ్యాడు.
దాంతో అతని రెండు కాళ్ళు డ్రైవింగ్ చేస్తుండగా నుజ్జు నుజ్జు అయ్యాయి.హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ప్రస్తుతం ఐ సీయూ లో ఉన్నాడు.
రాధిక చదవగానే ఆనందంతో గంతులు వేసింది.
హాల్లోని శ్రీలత చిత్రపటం కేసి చూస్తూ..రాధిక అంది.
"చూసావా..!!నిన్ను చంపినందుకు జీవితాంతం అవిటివాడిగా ఫణి బ్రతకాల్సొచ్చింది.శ్రీ..!!
నీ ఆత్మ ఇప్పటికైనా శాంతించిందా..??"
"లేదు.నిన్ను రక్షించే బాధ్యత ఉంది.రాధికా..!!
రేపు కారులో ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళకు.నీ కారు బ్రేకులు నీ సవతి తల్లి తీయించింది.జాగ్రత్త."
అదృశ్యంగా మాటలు రాధికకు మాత్రం వినిపించాయి.
రాధిక తల్లి పారిజాతంకి తన సవతి కూతురు ఎందుకు చిత్రపటంతో మాట్లాడుతోందో..ఏమని మాట్లాడుతోందో అర్థం కావడం లేదు.
రాధిక పారిజాతం దగ్గరకి వచ్చి,"అమ్మా..!!కన్నప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎక్కువంటారు.ఈ ఇల్లు..ఇంకా నాన్న ఇరవై కోట్ల మిగిలిన స్థలాలు,ఇల్లులు మీకే ఇస్తున్నాను.
నేను గోకులకృష్ణ అనే మా ఆఫీసులో పని చేస్తున్నతడిని ఇష్టపడుతున్నాను.
అతడిని పెళ్ళి చేసుకోవాలని ఆశిస్తున్నాను.
నాన్నకు ఈ విషయం చెప్పాను.నీకు ఇప్పుడు చెప్తున్నాను.
నన్ను చంపే ప్లానులు మానుకుని రితికను డాక్టరుగానో ఇంజనీరుగానో లేదా తనకిష్టమైన చదువు చదివేట్లు చేయి.నీకు పుణ్యం ఉంటుంది."చీదరంగా అని వెళ్ళి పోయింది.
పారిజాతం నోటమాట రాలేదు.
రాధికను చంపాల్సిన అవసరం లేకుండా తన భర్తతో మాట్లాడి రితిక పేరు మీదే ఆస్తంతా రాయమనడంతో పారిజాతం అవమానభారంతో కృంగిపోయింది.
—————————*****——————————
రాధికకూ గోకులకృష్ణకు నిరాడంబరంగా పెళ్ళయ్యింది.
ఆ రోజు రాధికకు ఆ ఇంట్లో శోభనం.
గోకులకృష్ణ గదిలో ఎదురు చూస్తున్నాడు.హాల్లో చిత్రపటం వంక చూస్తూ "శ్రీలత ..శ్రీలత..." అని పిలిచింది రాధిక.
"రాధికా..!!నా బాధ్యత తీరింది.నీ స్వాంతనలో ఇన్నాళ్ళు హాయిగా గడిచింది.
నేను పగ తీర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఫణికి అవిటితనం ప్రాప్తించింది.
నేను మరో జన్మ ఎత్తడానికి తగిన క్షేత్రం వెతుకుతూ వెళ్ళబోతున్నాను.
ఫణి ఈ ఇంట ఇన్నాళ్ళు బంధించాడు.
ఆ ప్రభావం ఆ మాంత్రికుడి మరణంతో పోయింది.
నిన్న ఆ మాంత్రికుడు గుండెపోటుతో మరణించాడు.
ఆ మాంత్రికుడు ఆత్మగా మారి నన్ను ఈ ఇంటి నుండి బంధవిముక్తుడిని చేసి తన పాపానికి పరిహారం చేసుకున్నాడు.
నన్ను ఫణి హత్య చేసిన వైనం తెలుసుకుని తీవ్రంగా మధన పడ్డాడు.
నీ సవతి తల్లి వల్ల ఇక నీకు ఏ ప్రమాదం రాదు.నీ తండ్రికి చూచాయగా విషయం తెలిసి ఆమెను తీవ్రంగా మందలించాడు.
కారు బ్రేకులు ఫెయిల్ అయిన విషయం ఆ కారు డ్రైవ్ చేసిన రాము మీ నాన్నకు చెప్పేసాడు.
ఆ పని మెకానిక్ పరాంకుశంకి డబ్బు ఇచ్చి మీ అమ్మ చేయించిందని నిరూపించేసాడు.
ఇక నీవు గోకులకృష్ణతో హాయిగా జీవించు.
గతజన్మ జ్ఙాపకాల మచ్చలు మరుజన్మకు కొందరికి వస్తాయి.
ఎవరైనా పాప నీ వంక కృతజ్ఞతతో చూస్తూ నుదుట మచ్చతో కనబడితే అది నా మరుజన్మని గుర్తించు.నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి.
నేను వెళుతున్నాను."
అంటూ కిటికీ గుండా శ్రీలత నల్లటి జుట్టు విరబోసుకున్న ఆత్మ ఎగిరిపోయింది.
రాధిక అలానే చూస్తుండిపోయింది.
గోకులకృష్ణ పిలుపుతో గదిలోకి భారమైన మనసుతో అడుగు పెట్టింది.
హాల్లో గోడ మీద శ్రీలత పేయింటింగ్ స్వచ్ఛతకు మారుపేరుగా అందంగా నవ్వుతూ ఉండిపోయింది.
---ॐॐॐॐॐ*శుభం*ॐॐॐॐॐ-----
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 4 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Superb story   clps
[+] 1 user Likes sri7869's post
Like Reply
#3
Superb story
[+] 1 user Likes BR0304's post
Like Reply
#4
దెయ్యం వుంది కాబట్టి హారర్ కథైంది కానీ దెయ్యాలవంటి మనుషులున్న సమాజం మనది, దీన్నేమనాలి "హారర్ ప్రపంచం"
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply




Users browsing this thread: