Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
స్వేచ్ఛా సమరం
- Kolla Malleswar
బ్రేకింగ్ న్యూస్......
"గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నగరంలో వివిధ ప్రాంతాల్లో వరుసగా రెండు హత్యలు చోటు చేసుకున్నాయి. వారిలో ఒకతను ఆటో డ్రైవర్ కాగా మరొకతను పద్దెనిమిదేళ్ల విద్యార్థి. వీరిద్దరినీ గుర్తు తెలియని వ్యక్తి అతి కిరాతకంగా చంపారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఫోరెన్సిక్ నిపుణులు ఇద్దరినీ చంపింది ఒకరే అని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా అసలు హంతకుడు ఎవరు? అతనెందుకిలా చంపుతున్నాడు? ఈ హత్యలు వెనుక కారణం ఏంటి అన్న విషయాలు తేలాల్సి ఉంది. ఈ కేసును ఎసిపి భార్గవ్ చంద్ర గారు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి......" అని మాటలతో దూసుకుపోతోంది టీవీలో న్యూస్ రీడర్
అప్పటి వరకూ హాల్లో కుటుంబ సభ్యులతో కూర్చుని టీవీ చూస్తున్న స్వేచ్ఛ చిన్నగా నవ్వుకుంటూ బయటకు వెళ్లడానికి పైకి లేచింది.....
"ఎక్కడికెళ్తున్నావే ఈ టైంలో? అసలే బయట వర్షం పడేలా ఉంది" అడిగింది వాళ్లమ్మ మాలతి
"చిన్న పనుంది అమ్మా త్వరగా వచ్చేస్తాను" అంటూ హ్యాంగర్ కి వేలాడించిన రెయిన్ కోట్ తీసుకుని బయటకు నడిచింది స్వేచ్ఛ
"ఏంటండీ మీరేం మాట్లాడరు అమ్మాయి ఈ టైంలో బయటకు వెళ్తుంటే? అసలే రోజులు బాలేవు. పైగా నగరంలో హత్యలు కూడా జరుగుతున్నాయంట. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లడం అవసరమా? అంత పనులేమున్నాయి దానికి?" అంది మాలతి కొంచెం కోపంతో కూడిన గొంతుతో
"మాలతి..... మన అమ్మాయేం చిన్నపిల్ల కాదు తప్పిపోవడానికి. తను క్షేమంగా ఇంటికి వస్తుంది. నువ్వేం కంగారు పడకు" అన్నాడు ప్రకాష్ ధైర్యం చెబుతూ
"అదికాదండీ. ప్రతిరోజూ టీవీలో ఎన్ని చూడట్లేదు ఆడపిల్లల మీద అఘాయిత్యాల గురించి. ఇలాంటి సమయంలో అది ఒంటరిగా వెళ్లడం అవసరమా. దానికేమైనా జరిగితే మనమందరం ఏమైపోవాలి?" అంది మాలతి
"చూడు మాలతి. నేను నా కూతురికి స్వేచ్ఛ అని పేరు పెట్టింది ఎందుకనుకున్నావు? తన పేరులో ఉన్న స్వేచ్ఛ తన జీవితంలో కూడా ఉండాలని. ఆడపిల్లలకి స్వేచ్ఛను ఇవ్వాలి మాలతి. అప్పుడే వాళ్లు ఆకాశంలో విహరించే పక్షుల్లా తమ ఆశయాలను సాధించుకుని ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతారు. అయినా మన అమ్మాయి ధైర్యవంతురాలు. ఎలాంటి సమయంలో అయినా ధైర్యంగా ముందుకు దూసుకెళ్లగలదు. ఆ నమ్మకం నాకుంది" అన్నాడు ప్రకాష్ గర్వంగా
"సరిపోయింది. మీ కూతురు తానా అంటే మీరు తందానా అనేరకం. మొన్నటికి మొన్న అది కాలేజీకని వెళ్లి రాత్రంతా ఇంటికి రాలేదు. మరుసటి రోజు సాయంత్రం వచ్చి వర్షం వల్ల ఫ్రెండ్ ఇంటిలో ఆగిపోయా అని చెప్పింది. ఆడపిల్ల సాయంత్రానికి ఇంటికి రాకపోతే ఎంత భయంగా ఉంటుంది. అదేమో పేరుకు తగ్గట్టు స్వేచ్ఛగా బయట తిరగటం, మీరేమో దానికి వంత పాడటం. నా మాట వినిపించుకునేవాళ్లే లేరు ఈ ఇంట్లో " అంది మాలతి నిష్ఠూరంగా
తల్లి మనసును అర్థం చేసుకున్న ప్రకాష్ మౌనంగా ఉండిపోయాడు......
స్వేచ్ఛ వేగంగా స్కూటీ నడుపుతోంది. తన స్కూటీ వేగం కన్నా మనసులో ఆలోచనల వేగం ఎక్కువైంది. రోడ్డుపై ఒక్కో మీటరు దాటే కొద్దీ తనకు రెండు రోజుల క్రితం జరిగిన విషయాలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి.....
రెండు రోజుల క్రితం.....
సమయం సాయంత్రం అయిదు గంటలు.......
బయట ఒకటే హోరుగా కురుస్తోంది వర్షం......
ఆకాశం నల్లటి దుప్పటి కప్పుకున్నట్టు మహా గంభీరంగా ఉంది.......
గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలితో, అరగంట నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.....
అలాంటి సమయంలో ప్రకృతితో తీవ్ర పోరాటం చేస్తున్నట్టుగా ముక్కుతూ మూలుగుతూ కదులుతున్న ఆటోలో, ఇరువైపుల నుంచి ఈడ్చుకొస్తున్న ఈదురు గాలికి గజగజ వణికిపోతూ, విసుగ్గా ఒకవైపుకి ముడుచుకొని కూర్చుంది స్వేచ్ఛ......
తన విసుగుకు కారణం ఇందాక కాలేజీలో జరిగిన సంఘటన......
సరిగ్గా గంట క్రితం....
అప్పుడే కాలేజ్ వదలడంతో ఇంటికి వెళ్లడానికి ఆటో స్టాండ్ దగ్గరకు నడుస్తోంది స్వేచ్ఛ.....
ఇంతలో చేతిలో రోజా పువ్వుతో తన ముందుకు వచ్చి నిలబడ్డాడు తన క్లాస్మేట్ అయిన కిషోర్......
అతన్ని చూడగానే అతనెందుకు వచ్చాడో, ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అర్థమైన స్వేచ్ఛ మౌనంగా తన తీక్షణమైన కళ్లతో చూసింది అతని వైపు......
తన మౌనాన్ని అర్ధాంగీకారంగా తీసుకున్నాడేమో వెంటనే మోకాళ్లపై కూర్చుని "స్వేచ్ఛ.... ఎన్నో రోజుల నుంచి నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇష్టం కలగగానే పరిచయం పెంచుకుని పోయే మనస్తత్వం కాదు నాది. బాగా ఆలోచించిన తర్వాతే ఏ పనైనా చేస్తాను. నీతో నాకు పరిచయం, పలకరింపులు లేకపోయినా నన్ను రోజూ క్లాస్ రూమ్లో చూసుంటారు. ఈపాటికే నా మీద మీకొక అభిప్రాయం ఏర్పడి ఉండాలి. నువ్వు నాకు బాగా నచ్చావు. నీక్కూడా నేనంటే ఇష్టమయితే మీ ఇంట్లో మాట్లాడుతాను. ఏమంటావ్? "అన్నాడతను
అది విని స్వేచ్ఛ సింపుల్ గా " నో " అని చెప్పి ముందుకు కదిలింది.....
"ఎందుకు కాదంటున్నావో కారణం తెలుసుకోవచ్చా?" అడిగాడతను తన వెంటే నడుస్తూ
"ఇలాంటి ప్రేమ సంబంధిత విషయాల్లో నాకు ఆసక్తి లేదు. నా ఆలోచనలు, ఆశలు, ఆశయాలు వేరు. దయచేసి నన్ను డిస్టర్బ్ చెయ్యకండి " అంది స్వేచ్ఛ ధృడంగా
అది విని తన రంగుల కలలన్నీ చెదిరిపోయినట్టు అనిపించింది కిషోర్ కి. బాధతో అక్కడే ఉండిపోయాడు......
ఇక కిషోర్ తో మాట్లాడాల్సింది ఏమీ లేనట్టుగా అక్కడి నుంచి ఆటో స్టాండ్ దగ్గరకు వస్తుండగా వర్షం మొదలవడంతో త్వరత్వరగా ఆటో ఎక్కి ఇంటికి ప్రయాణమయ్యింది స్వేచ్ఛ.......
జరిగినదంతా తల్చుకుంటున్న స్వేచ్ఛ మనసులో తనలా కిషోర్ ని తిరస్కరించి ఉండాల్సింది కాదు అని అనిపించింది....
వెంటనే ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి తేరుకుని బయటకు చూసిన స్వేచ్ఛకు ఆటో ఆగిపోయి కనిపించింది...
అది చూసి "ఏమైంది భయ్యా?" అడిగింది స్వేచ్ఛ చలికి వణుకుతూ
అయినా డ్రైవర్ పలకలేదు.....
దాంతో అసహనంగా రోడ్ వైపు చూసిన స్వేచ్ఛ ఆటో ఎదురుగా నిలబడి ఉన్న ముగ్గురిని చూసి మనసులో అనుమానం మొదలవగా వెంటనే ఆటో దిగి పారిపోవడానికి ప్రయత్నించింది........
వెంటనే ఆ ముగ్గురూ తనని చుట్టుముట్టేసారు ఎటూ కదలకుండా......
తన అనుమానం నిజమవడంతో భయంతో గట్టిగా కేక వేసింది స్వేచ్ఛ.....
కానీ గొంతు దాటి కూత బయటకు రాకముందే ఆ ఆటో డ్రైవర్ స్వేచ్ఛ ముక్కుకు క్లోరోఫామ్ అద్దిన కర్ఛీఫ్ తాకించగానే మతిలేనిదానిలా స్పృహ తప్పింది స్వేచ్ఛ........
వెంటనే ఆ నలుగురు ఎవరికీ అనుమానం రాకుండా స్వేచ్ఛను ఒక కారులో బంధించి ఊరి చివరన ఇలాంటి అక్రమాలకు పాల్పడేందుకు అణువుగా ఉన్న ఒక పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లారు.........
మరుసటి రోజు ఉదయం పది గంటలకు కళ్లు తెరిచిన స్వేచ్ఛకు తన కళ్ల ముందు ఈ ప్రపంచం ముందులా కనిపించడం లేదు......
అసలు ప్రపంచం ఉన్నట్లే అనిపించడం లేదు....
ఎందుకంటే తను ఇన్నాళ్లు చూసిన ప్రపంచం ఇలా లేదు. తన ప్రపంచంలో ఎన్నో ఆశలు, ఆశయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడవన్నీ పటాపంచలయ్యాయి......
తన జీవితం ఆ కామాంధుల చేతిలో బలైపోయింది. తనకోసం రాత్రి ఆ నలుగురు నువ్వా నేనా అని కొట్లాడుకున్నారు. అది గుర్తు రాగానే ముఖం అర చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది స్వేచ్ఛ......
అలా ఏడ్చి ఏడ్చి తన కన్నీళ్లు ఇంకిపోయాయి. ఇప్పుడు తన కళ్లల్లో కన్నీళ్లు రావడం లేదు ఏడవటానికి. మౌనంగా మోకాళ్లపై చేతులు పెట్టుకుని దీనంగా ఆకాశం వైపు చూస్తోంది స్వేచ్ఛ......
ఎన్నో ఆలోచనలు తన మనసులో ఒకదానితో మరొకటి పోటీ పడుతూ పరిగెడుతున్నాయి. అన్ని ఆలోచనల్లో తన మెదడును కొన్ని ప్రశ్నలు తొలిచేస్తున్నాయి...
"ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్లాలి? నాకు జరిగింది తెలిస్తే ఇంట్లో వాళ్లు చేరదీస్తారేమో కానీ ఈ సమాజం నన్ను చేరదీస్తుందా? మునుపటిలా నా స్నేహితులు నాతో కలివిడిగా మాట్లాడుతారా? రోజూ కాలేజీకి వెళ్లే ముందు నవ్వుతూ బాయ్ చెప్పే ఇరుగుపొరుగు అమ్మలక్కలు రేపటి నుంచి నన్ను చూసి గుసగుసలు మొదలు పెట్టి మాటలతో పొడుస్తారేమో? రోజూ ఆఫీసులో తన కొలీగ్స్ అందరూ నన్ను పొగుడుతుంటే గర్వంతో ఇంట్లోకి అడుగు పెట్టే నాన్న రేపటి నుంచి వాళ్ల మాటలకు మనసులో వ్యథతో ఇంటికి చేరుకుంటాడేమో ? ఈ ప్రశ్నలన్నింటికీ పరిష్కారం ఏది?" అని ఆలోచిస్తున్న స్వేచ్ఛ మనసులో ఒక ఆలోచన వచ్చింది.....
వెంటనే "అవును. వీటన్నింటికీ చావే పరిష్కారం. నేను చావాలి. వెంటనే చచ్చిపోవాలి" అని దిగ్గున పైకి లేచింది స్వేచ్ఛ
తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించింది. కానీ ఎంతసేపటికీ తనెక్కడుందో అర్థం కాలేదు. మెల్లగా నడక ప్రారంభించింది. ఒంట్లోని శక్తినంతా ఎవరో లాగేసినట్టు కాళ్లు ముందుకు సాగడం లేదు. కొద్ది దూరం నడిచాక దూరంగా ఏదో ఇల్లు కనిపిస్తే అక్కడెవరైనా ఉన్నారేమోనని అటువైపు కదిలింది.....
కొద్దిసేపటికి ఆ ఇంటిని చేరుకుంది. అదొక పాడుబడిన బిల్డింగ్. అక్కడెవరూ లేరు. అప్పటికే కాళ్లు పీక్కుపోతుండటంతో ఇక ఓపిక లేక ఒక స్తంభానికి జారబడి కూర్చుంది స్వేచ్ఛ.......
దూరంగా పగిలిన బీరు సీసాలు కనిపించాయి....
ఆ రాత్రి అక్కడే వాళ్లు తన చేతులు, కాళ్లు కట్టేసి తమ పైశాచికత్వాన్ని చూపించిన తర్వాత నలుగురు కూర్చుని బీరు తాగుతూ తాము పొందిన అనుభవం గురించి అసభ్యంగా మాట్లాడుకోసాగారు......
వాళ్ల మాటలన్నీ గుర్తు రాగానే కోపంతో ఊగిపోయింది స్వేచ్ఛ. పిడికిలి బిగించింది. కోపం వల్ల తన ముఖం మరింత ఎర్రబడింది.....
"రేపు తనలా ఇంకో అమ్మాయి వాళ్లకు బలైతే?" అన్న ఆలోచన మనసులో మొదలవగానే నిలువునా కంపించిపోయింది స్వేచ్ఛ....
"ఇంకెవరికీ నాలా జరగకూడదు. ఏ ఆడపిల్ల నాలా బాధ పడకూడదు. అంటే ఏం చెయ్యాలి? నేను బ్రతకాలి. అవును చావకూడదు" అని ధృడంగా నిశ్చయించుకుంది. ఆ ఆలోచన తనలో ఏదో తెలీని శక్తిని నింపింది.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
వెంటనే ఆ నలుగురి ముఖాలను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంది స్వేచ్ఛ. కానీ ఆటో డ్రైవర్ని తప్ప మిగిలిన ముగ్గురుని తనింతవరకూ ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అసలు ఆ ఆటో డ్రైవర్ ఎక్కడుంటాడో కూడా తెలీదే? అని ఆలోచిస్తున్న తనకు ఎవరో వస్తున్న అలికిడి కావడంతో వెళ్లి ఒక స్తంభం వెనుక దాక్కుంది.....
ఒక చేతిలో బీర్ బాటిల్, మరో చేతిలో బిర్యానీ ప్యాకెట్ పట్టుకుని వచ్చాడు ఆటో డ్రైవర్. అతన్ని చూడగానే కోపంతో ఊగిపోయింది స్వేచ్ఛ....
ఇంకొక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా వెళ్లి రాత్రి వాళ్లు తాగి పగలగొట్టిన బీరు సీసాను ఆయుధంగా చేతిలో పట్టుకుని అతని ముందు నుంచుంది......
స్వేచ్ఛను అక్కడ చూసిన ఆటో డ్రైవర్ బీర్ తాగుతూ "ఏంటి మళ్లీ ఇక్కడికి వచ్చావు? రాత్రి జరిగింది సరిపోలేదా? "అన్నాడు చూపులతోనే కాల్చుకు తింటూ
అతని మాటలకు, చూపులకు స్వేచ్ఛ అసహ్యంగా వాడి వైపు చూస్తూ "రాత్రి నేను నీకేం తిరిగి ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఇద్దామని వచ్చా" అంటూ తన చేతిలో ఉన్న బీర్ సీసాతో అతని గుండెల్లో పొడిచింది....
నొప్పితో విలవిల్లాడిపోయాడు అతను. స్వేచ్ఛ అతని దగ్గరకు వచ్చి గుండెపై సీసాతో గుచ్చుతూ "ఎన్నాళ్ల నుంచి చేస్తున్నారు ఇలా? నీతో పాటు ఉన్న మిగిలిన ముగ్గురి డీటెయిల్స్ చెప్పు" అని గర్జించింది....
ఆ క్షణం అతనికి స్వేచ్ఛలో ఉగ్రకాళి కనిపించింది. వెంటనే భయంతో "మేము నలుగురూ అనుకోకుండా ఒకసారి బార్లో కలిసాం. అప్పుడే మాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా అమ్మాయిలను తెచ్చుకుని పాడు చేసి మరుసటి రోజు వాళ్లను దూరంగా వదిలేస్తాం" అన్నాడతను నొప్పితో
"వాళ్ల పేర్లు, అడ్రస్ చెప్పు" అంది స్వేచ్ఛ కోపంగా
"నా పేరు యాదగిరి, మిగిలిన వాళ్ల పేర్లు కిరణ్, రాజేష్, సులేమాన్....." అంటూ వాళ్ల గురించి అన్ని వివరాలు చెప్పాడు అతను
ఆ తర్వాత స్వేచ్ఛ అతని గుండెల్లో మరోమారు బీరు సీసాను దింపింది. నొప్పితో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు అతను.....
అది చూసి స్వేచ్ఛకు భయం వేయలేదు. ఇంకా గర్వంగా అనిపించింది.....
ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఇంటికెళ్లింది.....
తనను చూడగానే ఇంట్లో అందరికీ ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. అందరూ తనని చుట్టుముట్టేసారు.......
"ఏమయ్యావే రాత్రంతా ఇంటికి రాకుండా? ఈ బట్టలేంటి? ఈ రక్తం ఏంటి? "అడిగింది మాలతి కంగారుగా స్వేచ్ఛ అవతారాన్ని చూస్తూ
"అమ్మా.....రాత్రి వర్షం ఎక్కువగా పడుతుండటంతో ఫ్రెండ్ ఇంట్లో ఆగిపోయాను. ఇక ఇందాక నడిచి వస్తుంటే కుక్కపిల్లకి ఆక్సిడెంట్ అవబోతుంటే కాపాడబోయి కింద పడ్డాను. అప్పుడే తగిలాయి ఈ దెబ్బలు" అంది స్వేచ్ఛ తన ఒంటి మీద ఉన్న గాయాలను చూసుకుంటూ
"కనీసం ఒక ఫోన్ చేసి చెప్పాలి కదమ్మా. నీకోసం మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా?" అన్నాడు ప్రకాష్
"క్షమించండి నాన్న. ఫోన్ అందుబాటులో లేదు. అందుకే చెప్పలేకపోయాను" అంటూ స్వేచ్ఛ వాళ్లమ్మ మాలతి వైపు తిరిగి " అమ్మా నాకు వేడి నీళ్లు పెట్టు. స్నానం చెయ్యాలి. చాలా చిరాగ్గా ఉంది" అంటూ వడివడిగా తన గదిలోకి వెళ్లిపోయింది
కూతురు క్షేమంగా ఇంటికి వచ్చిందన్న ఆనందంలో వాళ్లు ఇంకేం ఆలోచించలేదు.....
ఆరోజు సాయంత్రం.......
యాదగిరి చెప్పిన వివరాల ప్రకారం ఒక ఇంటిని వెతుక్కుంటూ వెళ్లింది స్వేచ్ఛ.....
తన నడకలో తొందరపాటు, భయం లేదు......
ఆ ఇల్లు రాగానే వరండాలోకి వెళ్లి తలుపు తట్టింది...
"ఎవరూ?" అంటూ వచ్చి తలుపు తీశాడు ఒకతను
"అప్పుడే నన్ను మర్చిపోయావా?" అంది స్వేచ్ఛ చొరవగా లోపలికి వెళ్తూ
"నువ్వు...... నువ్వు..... నువ్వెందుకొచ్చావ్?" అన్నాడతను తడబడుతూ
"నీకొక గిఫ్ట్ ఇద్దామని" అంటూ మరోమాటకి అవకాశం ఇవ్వకుండా కత్తిని అతని గుండెల్లో దింపింది స్వేచ్ఛ
"వద్దు. నన్ను చంపొద్దు" వేడుకున్నాడు అతను
"నీలాంటి కుక్కకు ఇదే గతి పట్టాలి" అంటూ మరోమారు అదే రంధ్రంలో కత్తిని దింపింది స్వేచ్ఛ
ప్రాణాలు విడుస్తూ నేలకొరిగాడు అతను....
జరిగినదంతా తలచుకుంటూ స్కూటీ నడుపుతున్న స్వేచ్ఛకు నాలుగు అడుగుల దూరంలో ఒకతను లిఫ్ట్ అడుగుతూ నిలబడి ఉండటం కనిపించింది........
అతన్ని చూడగానే వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు అనిపించింది స్వేచ్ఛకు....
మెల్లగా స్కూటీని అతని ముందు ఆపింది. అసలే నగరంలో జరుగుతున్న హత్యల గురించి కంగారుగా ఉన్నాడేమో స్వేచ్ఛ మొహం కూడా చూడకుండా స్కూటీ ఎక్కేసాడు అతను......
అతను ఎక్కడికెళ్లాలో చెప్పేలోగా స్కూటీ వేగం పెంచి స్కూటీని వెనక్కి తిప్పింది స్వేచ్ఛ.....
తన డ్రైవింగ్ చూసి కంగారుగా "ఏయ్...ఎవరు నువ్వు? మా ఇంటికి వెళ్లాల్సింది అటైతే ఇటువైపు ఎక్కడికి తీసుకెళ్తున్నావు?" అడిగాడతను
"నేనెవరో తెలీదా?" అంటూ వేసుకున్న రెయిన్ కోట్ తీసి అతని వైపు తిరిగింది స్వేచ్ఛ
"నువ్వు..... నువ్వు....." అంటున్నాడు కానీ అతని గొంతు లోంచి మాట పెగలట్లేదు భయంతో
అదే అదణుగా స్వేచ్ఛ మరింత స్పీడుని పెంచి ముందుకు దూసుకెళ్తూ "మొన్న నాతో స్వర్గం చూశానని సంబరపడిపోయావు కదా? ఇప్పుడు నేను చూపించే స్వర్గాన్ని చూడు " అంది
"వద్దు నన్నేం చెయ్యద్దు. బండాపు. నేను దిగిపోతాను" అన్నాడతను భయంగా
"నేను కూడా ఆరోజు నిన్ను ఇలాగే బతిమాలాను కదరా. అప్పుడు నువ్వు వినిపించుకున్నావా నా బాధను? ఇప్పుడు నేనెందుకు వినిపించుకోవాలి?" అంటూ స్కూటీని స్లో చేసి వెనక్కి తిరిగి కత్తిని అతని గుండెల్లో దింపింది స్వేచ్ఛ
అతను నొప్పితో గుండె పట్టుకుని కిందకు ఒరిగిపోయాడు....
వెంటనే స్వేచ్ఛ కిందకు దిగి మరోమారు కత్తిని అదే రంధ్రంలోకి బలంగా తోసింది....
బాధతో విలవిల్లాడుతూ ప్రాణం విడిచాడు అతను...
ఆ దృశ్యాన్ని చూసి నవ్వుతూ స్కూటీ స్టార్ట్ చేసి వేగం పెంచి దూసుకెళ్లిపోయింది స్వేచ్ఛ....
తను ఇంటికి వెళ్లేసరికే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది నగర శివారులో మరో దారుణమైన హత్య జరిగిందని..
మౌనంగా వెళ్లి ప్లేట్లో భోజనం పెట్టుకుని వచ్చి సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ తింటోంది స్వేచ్ఛ....
టీవీలో ఎసిపి భార్గవ్ చంద్ర విలేకరులతో మాట్లాడుతున్నాడు.....
"అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు సర్? ఎందుకు చేస్తున్నారు? "అడిగాడు ఒక విలేకరి
"ఈ హత్యలు డబ్బు కోసం చెయ్యట్లేదు మరే ఉద్దేశ్యంతో చేస్తున్నారో మాక్కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే హత్య చెయ్యబడిన ముగ్గురు సామాన్య పురుషులు. ఒకతను ఆటో డ్రైవర్, మరొకతను విద్యార్థి, ఇంకొకతను హోటల్ నడుపుతుంటాడు. వీరిలో ఒకరితో మరొకరికి సంబంధం లేదు. కానీ ఈ మూడు హత్యలు చేసింది ఒకరే" అన్నాడు భార్గవ్ చంద్ర
"అంటే ఈ వ్యక్తిని చంపింది కూడా అతనేనా?" అడిగింది ఒకామె
"అవును. ఎందుకంటే అందర్నీ ఒకే రకంగా గుండెల్లో పొడిచి చంపారు" అన్నాడు భార్గవ్ చంద్ర
"ఈ హత్యలు ఇలాగే కొనసాగుతాయంటారా లేక ఇంతటితో ఆగిపోతాయా? " అడిగాడు ఒకతను
"హంతకుడిని పట్టుకోవడానికి మా సెక్యూరిటీ ఆఫీసర్ డిపార్ట్మెంట్ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇకపై నగరంలో ఎలాంటి హత్యలు జరగకుండా మేము చర్యలు తీసుకుంటున్నాము. దయచేసి సహకరించండి" అంటూ లోపలికి వెళ్లబోయాడు భార్గవ్ చంద్ర
"సార్...సార్....ఒక్క నిమిషం ఆగండి" అంటూ విలేకరుల గుంపులో నుంచి అరిచాడు ఒకతను
ఏమిటన్నట్టుగా వెనక్కి తిరిగి చూసాడు భార్గవ్ చంద్ర....
"ఒకవేళ మీరు జరగబోయే హత్యలను ఆపలేకపోతే మీరు , మీ డిపార్ట్మెంట్ అసమర్థులని ప్రజల ముందు ఒప్పుకుంటారా? " అడిగాడతను
ఆ మాట విని భార్గవ్ చంద్ర సూటిగా అతని వైపు చూస్తూ "ఒకవేళ మేము ఇకపై జరిగే హత్యలను ఆపలేకపోతే ప్రజల ముందు అసమర్థులమని ఒప్పుకోవడమే కాదు నా ఉద్యోగాన్ని కూడా వదులుకుంటాను" అంటూ శపధం చేసాడు
అది చూసి స్వేచ్ఛ నిట్టూరుస్తూ టీవీ ఆఫ్ చేసి మౌనంగా తన గదిలోకి వెళ్లిపోయింది....
పడుకుందన్నమాటే కానీ నిద్ర పట్టడం లేదు. శూన్యం లోకి చూస్తూ గడిపేసింది స్వేచ్ఛ ఆ రాత్రంతా.....
ఇక్కడ భార్గవ్ చంద్ర మాటలను విని మిగిలిన సెక్యూరిటీ ఆఫీసర్ సిబ్బంది నివ్వెరపోయారు. ఎందుకంటే ఇన్నేళ్లలో భార్గవ్ చంద్ర సాల్వ్ చెయ్యనటువంటి కేసు లేదు. ఎలాంటి కేసునైనా తన ఆలోచనా విధానంతో, తెలివి తేటలతో సులువుగా సాల్వ్ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు ఈ కేసులో రెండు రోజులు అవుతున్నా హంతకుడి గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. అంతేకాక మరో హత్య ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ భార్గవ్ చంద్ర ఆ హత్యను ఆపలేకపోతే అన్న ఊహ కూడా భారంగా తోచింది వారందరికీ.
భార్గవ్ చంద్రకు ఈ కేసు సవాలుగా మారింది. అందుకే నగరంలోని సెక్యూరిటీ ఆఫీసర్లందరినీ ప్రతి వీధిలోనూ కాపలాగా ఉండమని ఆదేశించాడు. ఆ రాత్రి వారందరికీ స్వేచ్ఛ లాగే కంటి మీద కునుకు లేదు.....
మరునాడు ఉదయాన్నే అందరూ ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమయ్యారు........
ఒంట్లో నీరసంగా ఉండటంతో, ఇంట్లోనే ఉంటే ఆలోచనలు మనసును తొలిచేస్తుంటే కార్లో బయలుదేరింది స్వేచ్ఛ....
తనెక్కడికి వెళ్తోందో తనకే తెలీదు. కానీ ఎక్కడికైనా వెళ్లాలి. ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి గట్టిగా అరుస్తూ,ఏడుస్తూ గుండెల్లోని బాధనంతా దింపుకోవాలనుంది తనకు.....
ఆలోచనలతో పాటు ప్రయాణిస్తున్న స్వేచ్ఛ ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో సడెన్ గా బ్రేక్ వేయగా ముందున్న బైక్ ని డాష్ ఇస్తూ ఆగింది తన కార్....
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
దానితో ఆ బైకతను కోపంగా బైక్ దిగి వెనక్కి తిరిగి తిట్టబోతూ ఒక్క క్షణం స్వేచ్ఛ మొహాన్ని చూసి కంగారు పడ్డాడు......
సారీ చెప్పాలని తల ఎత్తిన స్వేచ్ఛకు అతన్ని చూడగానే కళ్లు ఎర్రబడ్డాయి కోపంతో....
అంతే ఒక్క క్షణం తానెక్కడుందో కూడా మర్చిపోయి కార్ స్పీడ్ పెంచింది. అది చూడగానే అతనికి అర్థమైంది స్వేచ్ఛ తనను చంపడానికి వస్తోందని....
వెంటనే బైక్ స్టార్ట్ చేసి ట్రాఫిక్ రూల్సుని ఉల్లంఘిస్తూ వేగంగా డ్రైవ్ చెయ్యసాగాడు అతను.......
స్వేచ్ఛ కూడా తన కారు వేగం పెంచింది.....
వారిద్దరూ అలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ వేగంగా ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నట్టు వెళ్లడం గమనించిన ట్రాఫిక్ సెక్యూరిటీ ఆఫీసర్లు వాళ్లను ఫాలో అవ్వసాగారు.......
ముందు తను చంపాలనుకున్న వ్యక్తి, వెనుక తనను తరుముతున్న సెక్యూరిటీ ఆఫీసర్లు... అయినా కూడా స్వేచ్ఛ కళ్లల్లో భయం లేదు. ఆ కళ్లల్లో ఉన్న భావం అతన్ని చంపాలన్న కసి, ప్రతీకారం మాత్రమే.....
ఆకలితో ఉన్న వేటకుక్కలా అతన్ని తరుముతోంది స్వేచ్ఛ. అతను స్వేచ్ఛ నుంచి తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు....
ఆ క్రమంలో వాళ్లిద్దరూ ఎదురుగా వస్తున్న దేన్నీ పట్టించుకోవడం లేదు. అది చూసి రోడ్డు మీద వెళ్తున్న జనం ఒక్క క్షణంలో ఫుట్ పాత్ మీదకి ఎక్కి అదురుతున్న గుండెలతో వాళ్లను చూడసాగారు.....
సినిమాల్లో చూపించే ఛేజింగ్ సీనులాగా ఉంది ఆ దృశ్యం. ప్రాణాలు కాపాడుకోవాలని అడ్డదిడ్డంగా వెళ్తున్న అతను సిగ్నల్ దగ్గర బైక్ టర్న్ చెయ్యబోయాడు. అతనేం చేస్తున్నాడో ఊహించిన స్వేచ్ఛ అతనికి రివర్స్లో వెళ్లి గుద్దేసింది....
ఊహించని పరిణామానికి అతను బైక్ మీద నుంచి ఎగిరి కింద పడ్డాడు. వెంటనే స్వేచ్ఛ తన కారుని కసితీరా అతని మీదకు ఎక్కించింది. అతనక్కడే నుజ్జునుజ్జయిపోయాడు.....
అక్కడున్న జనం భయభ్రాంతులై కారులో ఉన్న స్వేచ్ఛను చూడసాగారు. కొన్ని క్షణాల్లోనే ఆ ప్రాంతం సెక్యూరిటీ ఆఫీసర్ సైరన్ కూతలతో నిండిపోయింది.....
అయినా పారిపోయే ప్రయత్నం చెయ్యలేదు స్వేచ్ఛ. తృప్తిగా అతని శవాన్ని చూసి చిరునవ్వు నవ్వుతోంది...
సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి స్వేచ్ఛను స్టేషన్ కు తీసుకెళ్లారు. మరికొద్ది నిమిషాల్లోనే ఆ వార్త నగరమంతా పాకింది....
టీవీలో న్యూస్ చూస్తున్న మాలతి స్వేచ్ఛ ఫోటో చూసి కొయ్యబారిపోయింది......
ఆఫీసులో వర్క్ చేసుకుంటున్న ప్రకాష్ విషయం తెలుసుకుని పరిగెత్తుకుంటూ స్టేషన్ దగ్గరకు వెళ్లాడు...
కొద్ది నిముషాల్లోనే మాలతి కూడా ఏం జరిగిందో అర్థం కాక ఏడుస్తూ సెక్యూరిటీ అధికారి స్టేషన్లోకి వచ్చింది.......
స్టేషన్లో భార్గవ్ చంద్ర స్వేచ్ఛను విచారిస్తున్నాడు.....
"ఎందుకు అతన్ని చంపావు?" అడిగాడు భార్గవ్ చంద్ర
ఏం మాట్లాడలేదు స్వేచ్ఛ...
"నువ్వు ఒక హత్య చేసావు. దీనికి శిక్షేమిటో నీకు తెలుసా?" గద్దించాడు భార్గవ్ చంద్ర
"ఒకటి కాదు నాలుగు" అంది స్వేచ్ఛ నింపాదిగా
"అంటే ఇంతక ముందు ముగ్గురిని కూడా చంపింది నువ్వేనా?" అనుమానంగా అడిగాడు ఎసిపి
అవునన్నట్టు తలాడించింది స్వేచ్ఛ......
అది చూసి సెక్యూరిటీ ఆఫీసర్లు ఆశ్చర్యపోగా మాలతి, ప్రకాష్లు నిర్ఘాంతపోయారు.....
"ఎందుకు చేసావు ఈ పని?" కోపంగా అడిగాడు భార్గవ్ చంద్ర
అయినా స్వేచ్ఛలో చలనం లేదు. మౌనంగా అలాగే కూర్చుంది. తనని చూసిన భార్గవ్ చంద్రకు ఏదో సందేహం కలిగింది....
అతను ఏదో ఆలోచిస్తుండగా అప్పటి వరకు తాను విన్నది నిజమా కాదా అన్న సందేహంలో ఉన్న మాలతి ఏడుస్తూ వచ్చి స్వేచ్ఛను చుట్టేసింది.....
"ఎందుకమ్మా ఎందుకు చంపావు వాళ్లని?" అడిగిందామె ఏడుస్తూ
తల్లి ఏడుపు వినగానే చలించిపోయింది స్వేచ్ఛ. కానీ తన కళ్లల్లో కన్నీళ్లు రావడం లేదు. నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పడం మొదలు పెట్టింది.....
రెండు రోజుల ముందు తను కాలేజీ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఇందాక నడిరోడ్డుపై ఒకతన్ని చంపడం వరకు జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పింది స్వేచ్ఛ......
అది విని అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్లందరి కళ్లు చెమ్మగిల్లాయి. ఆఖరికి భార్గవ్ చంద్రకు కూడా. కానీ ఎవరూ నోరు మెదపలేదు....
మాలతి, ప్రకాష్లు కన్నీరు మున్నీరయ్యారు. భార్గవ్ చంద్ర ఇద్దరికీ ధైర్యం చెప్పి అతి బలవంతం మీద ఇద్దరినీ ఇంటికి పంపించాడు వారికి తోడుగా మరో ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లను తోడుగా పెట్టి......
అప్పటికే ఎలాగో విషయం నగరమంతా పాకింది. మరికొద్ది నిమిషాల్లోనే దేశమంతా పాకింది........
ఏ న్యూస్ ఛానెల్లో చూసినా స్వేచ్ఛ గురించే మాట్లాడుతున్నారు. మహిళా సంఘాలు స్వేచ్ఛకు అండగా పోరాటం చేస్తున్నారు. మరికొందరు స్వేచ్ఛ చేసింది తప్పా ఒప్పానని చర్చలు పెట్టారు........
కొందరు ఆడపిల్ల అయ్యి ఉండి స్వేచ్ఛ చేసింది ఒక గొప్ప సాహసమే అని కొనియాడుతుంటే మరికొందరు ఆడపిల్ల అయి ఉండి అంత నిర్ధాక్షణ్యంగా ఎలా చంపింది అని విమర్శిస్తున్నారు.......
ఎవరెన్ని మాట్లాడినా, ఎంత పొగిడినా, ఎంత విమర్శించినా దేశంలోని ప్రజలందరూ కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.......
ఆఖరికి ఆరోజు రానే వచ్చింది........
ఎసిపి భార్గవ్ చంద్ర స్వేచ్ఛను తీసుకుని కోర్టుకు తీసుకుని బయలుదేరుతుండగా అక్కడికి వచ్చారు మాలతి,ప్రకాష్ ఇద్దరూ.......
"సార్.....మా అమ్మాయికి ఏమీ కాదుగా" ఆశగా అడిగింది మాలతి
"ఏమీ కాదమ్మా. మీరు భయపడకండి" అన్నాడు భార్గవ్ చంద్ర ధైర్యం చెబుతున్నట్టుగా. నిజానికి అతనికి కూడా ఏం జరుగుతుందోనన్న ఆందోళన మనసులో ఎప్పటినుంచో ఉంది.....
"అమ్మా స్వేచ్ఛ.... తిరిగి వస్తావు కదూ. నువ్వు లేకపోతే మేము బతకలేము" బేలగా అడిగింది మాలతి స్వేచ్ఛను పట్టుకుని ఏడుస్తూ
"అమ్మా. ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. నువ్విలా ఏడిస్తే నాకు ధైర్యముండదు. నువ్వు ఇలా అయిపోకు" అంది స్వేచ్ఛ
తర్వాత వాళ్ల నాన్న ప్రకాష్ వైపు చూసి "నాన్న....... అమ్మని జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్పి వెళ్లి జీప్ ఎక్కింది
మాలతి వెక్కి వెక్కి ఏడవసాగింది. అది చూసిన భార్గవ్ చంద్ర గుండె తరుక్కుపోయింది. వెంటనే ఆవిడ దగ్గరకు వెళ్లి "అమ్మా.... మీరిలా బాధ పడకండి. ధైర్యంగా ఉండండి " అన్నాడు
"ఎలా ఉండమంటారు సర్ బాధ పడకుండా?" విరక్తిగా అడిగాడు ప్రకాష్
"చూడండి. మీ అమ్మాయి ఉన్న పరిస్థితిలో తను చేసింది కరెక్టే. కానీ జరిగిన దానికి న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఇదివరకెపుడూ ఇలా జరగలేదు. మంచి జరగాలనే ఆశిద్దాం" అని వెళ్లిపోయాడు భార్గవ్ చంద్ర అక్కడ నుంచి ఇంకేం చెప్పలేక
స్వేచ్ఛను తీసుకుని కోర్టు దగ్గరకు వెళ్లేసరికే అక్కడంతా కోలాహలంగా ఉంది. ఇసుక వేస్తే రాలనంతగా జనం గూమిగూడారు.......
కొందరు స్వేచ్ఛ వైపు జాలిగా, బాధగా చూస్తుంటే మరికొందరు ఆమె తెగింపుకి గౌరవంగా చూస్తున్నారు.....
ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు స్వేచ్ఛ ముందు నడుస్తుంటే పక్కన ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ తన చేతులని పట్టుకుని వెళ్తుండగా వెనకాల కొందరు సెక్యూరిటీ ఆఫీసర్లు, వారితో పాటు స్వేచ్ఛ తల్లిదండ్రులు వెళ్తున్నారు......
అక్కడ ఉన్న విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.....
స్వేచ్ఛ ఎవరి వైపూ చూడటం లేదు. అలాగని సిగ్గుతో తలదించుకోలేదు. ధైర్యంగా తల ఎత్తుకుని ముందుకు నడుస్తోంది.....
కొన్ని అడుగులు వేసేసరికే తనకు ఎదురుగా కనిపించాడు కిషోర్. స్వేచ్ఛ అతన్ని చూసినా ఏమీ మాట్లాడలేదు. మౌనంగా లోపలికి వెళ్లిపోయింది. తను వెళ్తున్న వైపే బాధగా చూస్తూ నిలబడ్డాడు కిషోర్.....
అందరూ కోర్ట్ లోపలికి ప్రవేశించారు. ప్రకాష్, మాలతి అక్కడున్న బెంచ్ పై కూర్చుని ఏం జరుగుతుందో,జడ్జి గారు ఎలాంటి తీర్పుని ఇస్తారో అని ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ స్వేచ్ఛకు వ్యతిరేకంగా తీర్పు వస్తే తన ప్రాణాలను తీసుకోవడానికి మాలతి చీర కొంగులో నిద్రమాత్రలు దాచుకుంటే చొక్కా జేబులో నిద్రమాత్రలను దాచుకున్నాడు ప్రకాష్ మాలతికి తెలీకుండా......
బయట అందరూ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో జడ్జిగారు కోర్ట్ లోపలికి ప్రవేశించారు.....
స్వేచ్ఛను బోనులో ప్రవేశ పెట్టమని ఆదేశించారు. అప్పటి వరకు మాలతి, ప్రకాష్ల మధ్యలో కూర్చుని ఉన్న స్వేచ్ఛ వెళ్లడానికి పైకి లేచింది.....
కానీ అడుగు ముందుకు వెయ్యలేకపోతోంది. కారణం మాలతి తన చేతిని గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది భయంతో.....
అది చూసి స్వేచ్ఛ చిన్నగా జీవం లేని ఒక నవ్వు నవ్వి మాలతి చెయ్యి విడిపించుకుని వెళ్లి బోనులో నిలబడింది.........
తన కళ్లల్లో ఏ భావమూ లేదు. తన కళ్లు సూటిగా చూస్తున్నాయి.......
జడ్జి గారు స్వేచ్ఛ తరపున లాయర్ ఎవరైనా వాదించడానికి ఉన్నారేమోనని చూశాడు. కానీ ఎవరూ ముందుకు రాలేదు.......
"ఏమ్మా నీ తరపున లాయర్ని పెట్టుకోలేదా?" అడిగారాయన
"లేదు సర్....." అంది స్వేచ్ఛ
"ఎందుకమ్మా?" అడిగారాయన
"నేను ఎందుకు లాయర్ని పెట్టుకోలేదో ముందు ముందు మీకే అర్థమవుతుంది సర్. మీరు అడగాలనుకున్న ప్రశ్నలు నన్నే అడగండి. నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను...." అంది స్వేచ్ఛ
దానికి ఆయన అంగీకరిస్తున్నట్టుగా పక్కనే ఉన్న బంట్రోతు వైపు చూసాడు.....
విషయం అర్థమైన బంట్రోతు భగవద్గీత తీసుకెళ్లి స్వేచ్ఛ ముందు ఉంచి "ఈ భగవద్గీత మీద ఒట్టేసి చేసి అంతా నిజమే చెప్తానని ప్రమాణం చెయ్యి" అన్నాడు
ఆ మాట విని స్వేచ్ఛ విరక్తిగా ఒక నవ్వు నవ్వి "మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా సర్?" అంది జడ్జి వైపు చూస్తూ
"అడుగమ్మా" అన్నారాయన స్వేచ్ఛ వైపు చూస్తూ
అందరూ స్వేచ్ఛ ఏం అడుగుతుందా అని ఉత్కంఠగా చూస్తున్నారు.....
"ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి ఎవరేం చెప్పినా మీరు నిజమని నమ్ముతారా?" అడిగింది స్వేచ్ఛ
"అవును తల్లీ" అన్నారాయన
"ఒకవేళ ప్రమాణం చేసి కూడా అబద్ధం చెప్తే ఏం చేస్తారు?" అడిగింది స్వేచ్ఛ
దానికి ఆయన సమాధానం చెప్పలేక మౌనాన్ని ఆశ్రయించారు. నిజానికి అక్కడున్న ఎవరికీ ఏం సమాధానం చెప్పాలో తెలీదు. ఎందుకంటే భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పినా, అబద్ధం చెప్పినా వాళ్లు దాన్ని నిజంగానే పరిగణిస్తారు కాబట్టి.......
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 2,225
Threads: 149
Likes Received: 7,404 in 1,458 posts
Likes Given: 4,228
Joined: Nov 2018
Reputation:
555
అందరి మౌనంతోనే తనకు సమాధానం దొరకడంతో స్వేచ్ఛ భగవద్గీత మీద చెయ్యి పెట్టి అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసింది........
"ఏం జరిగిందో చెప్పమ్మా" అన్నారు జడ్జి గారు ఆయనకు తెలిసినా మరోసారి కనుక్కోవాలనే ఉద్దేశ్యంతో......
జరిగినదంతా పూసగుచ్చినట్టు మరోసారి వివరించింది స్వేచ్ఛ.......
ఈసారి అందరి కళ్లతో పాటు జడ్జిగారి కళ్లు కూడా చెమ్మగిల్లాయి. కానీ ఆయన దాన్ని కనపడనీయకుండా "నీ మీద అఘాయిత్యం జరిగితే సెక్యూరిటీ ఆఫీసర్లకు కంప్లైంట్ చెయ్యాలి కానీ వాళ్లని చంపేస్తావా?" అన్నారు గంభీరంగా
"నేను సెక్యూరిటీ ఆఫీసర్లకు కంప్లైంట్ చేసుంటే ఏం జరిగేది సర్?" అడిగింది స్వేచ్ఛ
"వాళ్లకు తగిన శిక్షను న్యాయస్థానం విధించేది" అన్నారాయన
అది విని స్వేచ్ఛ జీవం లేని నవ్వు నవ్వుతూ "తగిన శిక్ష విధిస్తారా? అంటే ఏం శిక్ష విధిస్తారు సర్. వీలైతే ఏడు సంవత్సరాల జైలు శిక్ష, లేదా పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, అదీ కాకపోతే ఉరి తీస్తారు అంతేగా. ఇది సరైన శిక్ష అని మీరు అనుకుంటున్నారా? కానీ నాకలా అనిపించలేదు సర్. ఎందుకంటే మీరు వాళ్లకి జైలు శిక్ష విధిస్తే ఏడేళ్లో లేక పద్నాలుగేళ్లో మీరు జైల్లో ఆదివారం పెట్టే బిర్యానీలు, గురువారం పెట్టే చపాతీలు తింటూ గడిపేస్తారు. కానీ ఆ తర్వాత బయటకొచ్చి ఆడదంటే విలువ లేని అలాంటి నీచులు కూడా మరో ఆడదానితో కాపురం చేసి ఆడపిల్లలని కంటారు. ఇదేనా వారికి తగిన శిక్ష?" అంది
ఆ ప్రశ్నకు జడ్జి గారు ఏం మాట్లాడలేకపోయారు.......
"మీకు కొన్ని విషయాలు చెప్పొచ్చా సర్?" అడిగింది స్వేచ్ఛ
"చెప్పమ్మా....." అన్నారాయన
"ఈ సమాజంలో కామాంధుల చేతిలో బలైపోయిన ఆడదాని పరిస్థితి, మనస్థితి, దుస్థితి ఎలా ఉంటుందో మీకు తెలీదు సర్. ఎందుకంటే మీది మగ జన్మ కాబట్టి. కానీ మగాడి చేతిలో బలైపోయిన ఆడదంటే ఈ సమాజంలో అందరికీ చులకనే. తనను చూస్తే గడ్డం, మీసం మొలవని వాడికి కూడా తనో మగాడినని గుర్తుకు వస్తుంది. మా లాంటి సగటు ఆడపిల్లే కదా అన్న ఆలోచన కూడా లేకుండా మిగిలిన ఆడవాళ్లు అసహ్యంగా చూస్తారు. కొందరు మగాళ్లు ఆశగా చూస్తుంటారు. కానీ ఎవ్వరూ కూడా ఆడవాళ్లని హింసించే దుర్మార్గులను అసహ్యించుకోరు. పైకి పెద్ద మనుషుల్లా కనిపిస్తూ లోపల చెడు పనులు చేసేవాళ్లను అసహ్యించుకోరు.
అఘాయిత్యానికి గురైన ఆడది దేనికీ పనికిరానట్టు చూస్తారు. బయటకు వెళ్తే చాలు వెనకాల గుసగుసలు మొదలు పెడతారు. ఆడదంటే ఆట బొమ్మ అనుకుంటారు కొందరు. పోనీ అన్యాయం జరిగిందని కోర్టుకు వస్తే ఇక్కడ అందరి ముందు లాయర్లు ఎలా జరిగింది? ఎవరేం చేసారు? అప్పుడు నువ్వేం చేసావు? అంటూ ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు మా మనసును ఎంత చిత్రవధకు గురి చేస్తాయో ఎవరికీ తెలీదు. కానీ న్యాయం జరుగుతుందనే చిన్న ఆశతో నోరు తెరిచి జరిగింది చెప్పుకుంటాం. అప్పటికీ న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు" అంది స్వేచ్ఛ
"మీకోసమే కదమ్మా నిర్భయ చట్టం, దిశ చట్టం అని రకరకాల చట్టాలు తీసుకువచ్చింది ప్రభుత్వం. అయినా కూడా మీకు న్యాయం జరగదని ఎందుకు అనుకుంటారు?" అన్నారు జడ్జి గారు
అది విని స్వేచ్ఛ ఒక నవ్వు నవ్వి "నిర్భయ చట్టమా.......
కూనలను తన్నుకుపోయే గద్దలు.....
మాటలతో పొడిచే కాకులు......
బతికుండగానే పీక్కుతినే రాబందులు.....
కపట గుంట నక్కలు......
మాటు వేసి వేటాడే పులులు.....
"లేడి"లను కాటేసే కాలకూష విషనాగులు.......
అన్నీ అరణ్యములోని మృగాలే......
పొలిమేర అవతల ఒక అరణ్యం......
పొలిమేర ఇవతల ఒక అరణ్యం......
ఆ అరణ్యంలో మాటలు రాని మృగాలు ఉంటే.....
ఈ అరణ్యంలో (మానవారణ్యంలో) మాటలు నేర్చిన మృగాలు ఉన్నాయి......
అంతే సర్. మీరు చెప్పినట్లు చట్టాలు చాలానే ఉన్నాయి. కానీ ఆ చట్టాలు వచ్చాక ఒక ఆడపిల్ల మీద కూడా అఘాయిత్యం జరగలేదని మీ మనసు మీద ప్రమాణం చేసి చెప్పండి సర్. చెప్పలేరు. ఎందుకంటే మీక్కూడా తెలుసు. ఈ దేశంలో డబ్బు, పరపతికి ఇచ్చినంత విలువ ఆడదాని శీలానికి ఉండదు. పైకి మాత్రం ఆడవాళ్లను దేవతలతో పోలుస్తారు. ఈ లోకంలో ఎవరూ దేవతలను కామంతో చూడరు. మరి వాళ్లతో సమానంగా పోల్చే ఆడవాళ్లను మాత్రం ఎందుకు కామంతో చూస్తారు? అసలు ఇక్కడ నేరం ఎవరిది సర్?
ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? లేక నన్ను ఆడపిల్లగా సృష్టించిన ఆ దేవుడిది నేరమా? లేక ఆడపిల్లలని గౌరవంగా చూడాలని అలాంటి నీచులకు నేర్పించనటువంటి తల్లిదండ్రులది నేరమా? ఎవరూ తమది నేరం అని ఒప్పుకోరు......
కానీ అందరూ అబలగా మారిన ఆడదాన్ని మాత్రం నేరం చేసినదానిలా వేలెత్తి చూపిస్తారు. ఇలాంటి వాటికి భయపడి ఎందరో ఆడవాళ్లు బయటకు చెప్పుకోలేక మనసులో దాచుకోలేక బతికున్న శవాలుగా జీవిస్తున్నారు.
చెదిరిపోయిన తమ కన్నె కలల పంటకు తమను తాము నిందించుకుంటున్నారు....
కూలి ధ్వంసమైన తమ స్వప్న సౌధాలకి క్రుంగి కృశిస్తున్నారు.....
అందుకే నేను వాళ్లను చంపేసాను....కసితీరా చంపేసాను" అంది స్వేచ్ఛ తనను కబళించిన ఆ చీకటి రాత్రి గుర్తుకు రాగా కసిగా
"అంటే నువ్వు చేసింది కరెక్ట్ అని సమర్థించుకుంటున్నావా?" అడిగారు జడ్జి గారు
"నేను సమర్థించుకోవడం లేదు సర్. కానీ నేను చేసిన పని వల్ల ఈ సమాజంలో ఆడపిల్లల మీద కొన్నైనా అఘాయిత్యాలు తప్పుతాయని భావించాను. అందుకే చంపేసాను" అంది స్వేచ్ఛ
"ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసేవారిని చంపడమే ఈ సమస్యకు పరిష్కారం అంటావా?" అడిగారు జడ్జి గారు
"ఈ సమాజంలో మనమెంత చేసినా ఇంకా నిర్మూలించాల్సింది మిగిలే ఉంటుంది. చంపడమే పరిష్కారం అని నేను అనట్లేదు సర్. కానీ చంపడం వల్ల ఇంకోసారి ఆడదాన్ని చెడు దృష్టితో చూసే ముందు మగాళ్లు నన్ను తలచుకుని జంకేలా వాళ్ల గుండెల్లో నిద్రపోయాను. దీని వల్ల కొన్నైనా అఘాయిత్యాలు జరగకుండా ఉండొచ్చు. లేదా మరో ఆడపిల్ల ధైర్యంగా తన మీద జరిగే అఘాయిత్యాన్ని అడ్డుకోవచ్చు....." అంది స్వేచ్ఛ
"కానీ నువ్వు నలుగురిని హత్య చేసావు. దీనికి నువ్వు చట్టరీత్యా శిక్ష అనుభవించాలి" అన్నారు జడ్జి గారు
ఆ మాట వినగానే మాలతి,ప్రకాష్ ఇద్దరూ కొయ్యబారిపోయారు. ఏడుస్తూ స్వేచ్ఛను చూడసాగారు.....
కానీ స్వేచ్ఛ ముఖంలో ఎలాంటి భయమూ లేదు. ఆయన మాటలకు తిరిగి "ఈ ప్రపంచంలో ఏ చట్టమైనా శారీరక పరమైన హింసకు మాత్రమే శిక్షిస్తుంది సర్. కానీ ఒక వ్యక్తిని మానసికంగా హింసకు గురిచేసిన వారిని శిక్షించదు. ఎందుకు సర్ ? వాళ్లు నలుగురు కలిసి నా మనసును హత్య చేసారు. దానికి శిక్ష నేను జీవితాంతం అనుభవించాలి. ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాను సర్...." అంటూ స్వేచ్ఛ తన గుండెపై చెయ్యి పెట్టుకుని
"ఇక్కడ ఎంత నొప్పిగా ఉందో మీకెవరికైనా తెలుసా సర్. మూడు రోజుల ముందు వరకు నేను చూసిన ప్రపంచం వేరు. ఆ ప్రపంచంలో నేను ఎన్నో ఆశలు, ఆశయాల సౌధాలను నిర్మించుకున్నాను. కానీ ఒక్క రాత్రితో అవన్నీ కూలిపోయాయి. రేపటి నుంచి నేను చూడబోయే ప్రపంచం వేరు. ఈ ప్రపంచంలో నేను ప్రతి క్షణం ఎన్నో ఈసడింపులు, ఎన్నో అసహ్యమైన చూపులను ఎదుర్కోవాలి. అడుగడుగునా ఈ సమాజం నా కాళ్లకు సంకెళ్లను బిగిస్తుంది. వాటన్నింటినీ తెంచుకుని స్వేచ్ఛగా బ్రతకాలని ఉంది నాకు. కానీ ఈ సమాజం నన్ను స్వేచ్ఛగా బ్రతకనిస్తుందా సర్. అసలు నేనేం తప్పు చేసానని నాకు ఈ శిక్ష. నా జీవితాన్ని కబళించిన వాళ్లు ఇంకెవరి జీవితాన్ని కబళించకూడదనే ఉద్దేశ్యంతో వారిని నేను అంతమొందించడం తప్పైతే మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ కన్నీళ్లతో ఇక మాట్లాడే ఓపిక లేక దైన్యంగా చేతులు జోడించింది స్వేచ్ఛ.......
స్వేచ్ఛను అలా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు.......
ఇంతలో జడ్జి గారు ఆఖరి తీర్పు చెప్పడానికన్నట్టు గొంతు సవరించుకున్నారు.....
ఆయనేం చెప్తాడోనని అందరూ ఊపిరి బిగబట్టి ఎదురు చూడసాగారు.....
జడ్జి గారు మౌనంగా పైకి లేచి స్వేచ్ఛ ముందుకు వచ్చి నిలబడి చేతులు జోడించి దైన్యంగా కన్నీళ్లతో నిలుచున్న స్వేచ్ఛ కన్నీళ్లను తుడిచారు......
స్వేచ్ఛ ఆయన వైపు చూస్తుంటే ఆయన చేతులెత్తి స్వేచ్ఛకు నమస్కరిస్తూ " అమ్మా స్వేచ్ఛ..... చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరించాలని ఉందమ్మా. మన పెద్దలు ధైర్యే సాహసే లక్ష్మీ అని ఎందుకు చెప్పారో నిన్ను చూస్తుంటే అర్థమవుతోంది. ఎక్కడైతే ఆడవాళ్లు ధైర్యంగా తమ ముందున్న సమస్య ఎంత పెద్దదైనా సాహసంగా ఎదుర్కొంటారో వాళ్లు దేవతలతో సమానులు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే నీ మానసిక ధైర్యం ఎంత గట్టిదో తెలుస్తోంది. ప్రతి ఆడపిల్ల నీలా ఒక సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటే ఈ సమాజంలో అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలు జరగవు తల్లీ......." అన్నారు
ఆ మాటలు విని అందరి ముఖాల్లో ఆనందాశ్చర్యాలు తాండవం చేసాయి......
అయినా స్వేచ్ఛ కన్నీరు ఆగట్లేదు. ఇన్నిరోజుల తన మానసిక సంఘర్షణను కన్నీళ్ల రూపంలో తీర్చుకుంటోంది......
అది చూసి జడ్జి గారు "చూడమ్మా స్వేచ్ఛ. నువ్వు ఇలా ఏడవకు. జరిగినదాంట్లో నీ నేరం ఏమీ లేదు. నీ శరీరం మలినమైందని నువ్వు బాధ పడుతున్నావు. కానీ నీ మనసు ఎంత పవిత్రమైనదో ఈ దేశానికి నువ్వు ఈరోజు నిరూపించావు. నీ శరీరానికి అంటిన మలినాన్ని నీ కన్నీళ్లతో ఎప్పుడో ప్రక్షాళన చేసేసావు అమ్మా. ఇక దేనికీ బాధ పడకు. ఇదే ధైర్యంతో నీ ఆశలను, ఆశయాలను సాధించు. నీ బంగారు భవిష్యత్తుకి సంకెళ్లు వేసే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు" అన్నారు
ఆ తర్వాత జడ్జి గారు ప్రజలను ఉద్దేశించి " ఎక్కడైతే స్త్రీలు స్వేచ్ఛతో, సుఖసంతోషాలతో ఉంటారో అదే నిజమైన మానవ సమాజము మరియు నిజమైన ప్రపంచమని నమ్ముతూ, అఘాయిత్యాలకు గురైన ఆడవాళ్లు అనుభవించే శిక్ష ముందు కామాంధులకు చావు కూడా చిన్నదే. కాబట్టి స్వేచ్ఛ చేసింది ముమ్మాటికీ సరైనదేనని భావిస్తూ తనని నిర్దోషిగా భావించి ఈ కేసును ఇంతటితో క్లోజ్ చెయ్యడం జరిగినది....." అన్నారు
ఆ మాటతో కోర్ట్ హాలు మొత్తం కరతాళ ధ్వనులతో నిండిపోయింది......
మాలతి, ప్రకాష్ ఇద్దరూ ప్రేమగా స్వేచ్ఛను చుట్టేసారు......
అది చూసి భార్గవ్ చంద్ర మనస్పూర్తిగా నవ్వాడు.....
దేశం మొత్తం స్వేచ్ఛకు అభిమానులైపోయారు. ప్రతి ఇంట్లోనూ స్వేచ్ఛ ధైర్య సాహసాలను కొనియాడారు...
స్వేచ్ఛ తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్లిపోయింది.......
ఎంతో మంది తనను కలవడానికి ఇంటికి వెళ్లేవారు. ఒక్కసారి తమ ఛానెల్లో ఇంటర్వ్యూ ఇవ్వమని ప్రాధేయపడ్డారు. కానీ స్వేచ్ఛ దేనినీ అంగీకరించలేదు.....
కారణం తనకు కావాల్సింది పాపులారిటీ కాదు. సమాజంలో మార్పు......
స్వేచ్ఛ జరిగినదాని నుంచి కోలుకునేవరకు మాలతి, ప్రకాష్ లు కంటికి రెప్పలా చూసుకున్నారు......
వారి ప్రేమాప్యాయతలతో కొద్ది రోజుల్లోనే శారీరకంగా, మానసికంగా పూర్తిగా కోలుకుంది స్వేచ్ఛ.....
మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీకి బయలుదేరింది...
మాలతికి మనసులో భయంగానే ఉన్నా ప్రకాష్ ధైర్యం చెప్పడంతో ఒప్పుకోక తప్పలేదు.......
ఇంటి నుంచి బయటకు రాగానే ఎప్పటిలాగే ఇరుగుపొరుగు వారు బాయ్ చెప్పారు కానీ తన వెనుక గుసగుసగా మాట్లాడుకోలేదు.....
కాలేజీలో అడుగు పెట్టిన స్వేచ్ఛకు గేట్ దగ్గరే ఎదురయ్యాడు కిషోర్......
కానీ చూడనట్టు క్లాస్ రూమ్లోకి వెళ్లిపోయింది. వెళ్లగానే తన స్నేహితులంతా చుట్టుముట్టేసారు ప్రేమగా......
వారందరి కళ్లలో తను ఊహించిన మార్పులు లేవు. ముందు తనతో ఎలా మెలిగేవారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు......
కానీ జరిగింది గుర్తొచ్చి ఒక్కసారిగా తలవంచుకుని మౌనంగా ఉండిపోయింది స్వేచ్ఛ.....
అప్పటి వరకు తననే గమనిస్తూ కూర్చున్న కిషోర్ స్వేచ్ఛ డల్ అయిపోవడంతో తన దగ్గరకు వచ్చి తనను నవ్వించడానికి విశ్వ ప్రయత్నాలు చేసాడు. కానీ అవేవీ ఫలించలేదు.....
దానితో లేచి స్వేచ్ఛ పక్కన కూర్చున్నాడు కిషోర్.....
"స్వేచ్ఛ..... ఇటు తిరుగు. ఒకసారి నా కళ్లలోకి చూడు" అన్నాడు కిషోర్
అయినా స్వేచ్ఛ తలెత్తలేదు.....
"నన్ను ఇంకా నిరసిస్తున్నావా స్వేచ్ఛ?" అడిగాడు కిషోర్
చివాలున తలెత్తి కిషోర్ కళ్లలోకి చూసింది స్వేచ్ఛ.....
ఆ కళ్లల్లో తన మీద అభిమానం, ఆరాధన స్పష్టంగా కనిపిస్తున్నాయి......
అది చూసి వెంటనే తల తిప్పేసింది స్వేచ్ఛ......
"స్వేచ్ఛ.... ఒక్కసారి మాట్లాడు ప్లీజ్. నీ గుండెల్లో నాకు చోటుందని చిన్నమాట చెప్పు చాలు. నీ ప్రతి ఆశలోనూ,ఆశయంలోనూ నీకు తోడుగా ఉంటాను. నాకు నీ శరీరంతో పనిలేదు స్వేచ్ఛ. నాతో స్నేహంగా ఉండు చాలు" అన్నాడు కిషోర్
అవేవీ స్వేచ్ఛ తలకు ఎక్కట్లేదు. తన ఇరుగుపొరుగు వారి అదే అభిమానపు మాటలు, ఎప్పటిలాగే తన స్నేహితులు తన మీద చూపే ప్రేమ, కిషోర్ కళ్లల్లో ఎప్పుడూ కనిపించే తనపై ఆరాధన దగ్గరే ఆగిపోయాయి తన ఆలోచనలు......
అన్నీ తలచుకున్న స్వేచ్ఛ మనసులో "ఇదే కదా నేను కోరుకున్న సమాజం" అని చాలా రోజుల తర్వాత మనస్పూర్తిగా నవ్వింది......
స్వేచ్ఛ మాట కోసమే ఎదురు చూస్తున్న కిషోర్ తన నవ్వుని అర్ధాంగీకారంగా భావించి స్వేచ్ఛ నవ్వుతో శ్రుతి కలిపాడు.........
సమాప్తం***
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,761 in 5,134 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
Nice revenge story
Superb ending
|