Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చివరి బోనం..
#1
చివరి బోనం..
-  Bhoga Harinadh
 
ఎనభై ఏళ్ళ యాదమ్మ ఇంట్లో బోనాలు. చిన్న కొడుకుకు సర్కారు కట్టించిన ఇంట్లోనే ఉంటుంది యాదమ్మ.
 
ఏటేటా పట్నంలోనే ఉంటూన్న పెద్ద కొడుకులు ఇద్దరు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు. ఊళ్ళో ఉన్న చిన్న కొడుకు బోనాల పండుగకి రమ్మని చెప్పగానే.. రేపనగానే వచ్చి మూడు కుటుంబాలు కలిసి బోనాలు చేసి ఏటేటా ముగ్గురు అన్న తమ్ములు మాతమ్మకు, పోచమ్మకు బోనాలు చేసి మొక్కు తీర్చుకుని, రెండు మూడు రోజులు మటను, చికను, మందు దావతులతో సంతోషంగా పండుగ చేసుకుని అన్న తమ్ములు కుటుంబాలతో తిరిగి పట్నం వెళ్ళే వారు.
 
ఈ ఏడు కొడుకులకు, కోడళ్ళకు, బిడ్డకు, అల్లుడుకు, మనుమల్లకు, చిన్న కొడుకు ఫోను చేసి బోనాల పండగకు రమ్మని చెబితే '' నీకు తెలవంది ఏముంది.. అంతటా కరోనా రావట్టే, పట్నంలనే కాకుండా మండలాల్లో, ఊర్లో కరోనా పాకిందట కదా, మనూర్ల కూడా నలుగురైదుగురికి వచ్చిందట కదా' మేము రామని చెప్పారు.
 
ఏ కులానికి ఆ కులం వారిగా, కుల పెద్దలు దూరం దూరంగా కూర్చుని, ముక్కులకి, మూతికి, మాస్కులు వేసుకుని పొలిమేర దేవతలందరికీ ఏటేటా బోనం మొక్కులు తీర్చుకున్నట్టే, ఈ ఏడు బోనం మొక్కులు తీర్చుకుందాం. కానీ, బ్యాండు, డప్పులు, బోనాలతో ఆడవారందరూ గుంపులు గుంపులుగా వెళ్ళవద్దని ఎవరింటికి వారే వేరే వాల్ల్లతో కలువకుండా బోనం మొక్కు తీర్చుకోవాలని తీర్మానం చేసుకున్నారు.
 
చికెను, మటనూ, మందు, అన్నీ ఉన్నాయి కానీ డప్పు సప్పుల్లు, ఖరీదైన బట్టలు, సొమ్ములు, సోకులు లేకుండా బిడ్డలు, అల్లుండ్లు బయట పట్నాలలో బ్రతుకుతున్న కొడుకులు, కోడళ్ళు ఊర్లొకి వచ్చి మొక్కు తీర్చుకుందామనుకున్న వారంతా కరోనా ధాటికి రాకుండానే ఊర్లో బోనాలు తీసారు.
 
కొన్ని కులాలు కిందటి ఆదివారమే బోనాలను మొక్కుబడిగా, ఏ సందడి లేకుండా ముక్కుకి, మూతికి, మాస్కులు వేసుకుని బోనాలు నెత్తిలో పెట్టుకుని గబగబా నడుచుకుంటూ ఊరి పొలిమేర దేవుళ్ళ గుళ్ళకు వెళ్లి బోనం మొక్కు అయిందనిపించి వచ్చారు.
 
ఈ గురువారం ఇంకొన్ని కులాలు బోనాలు తీస్తున్నారు.
ఈ రోజే పించన్ రూపాయలు ఇస్తున్నారని తెలిసి ప్రొద్దున్నే పోస్టాఫీసు వద్దకు యాదమ్మ వచ్చింది. పోస్టుమాన్ ఇంకా రాలేదు కానీ, అప్పటీకి అక్కడికి వందలాది మంది ముసలోలు వచ్చి వేప చెట్ల కింద కూర్చున్నారు. పించన్ బుక్కులని వచ్చిన వారివి వచ్చినట్టుగా, వరుసగా కట్టలు కట్టలుగా పెర్చినవి ఏడెనిమిది ఉన్నవి. యాదమ్మ ఆ వరుస కట్టలలో పించన్ బుక్కు పెట్టి, వేప చెట్టు కింద అందరితో పాటే కూర్చుంది. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. పించన్ బుక్కులు తమ వరుస కట్టల్లో పెడుతూనే ఉన్నారు. వచ్చి చెట్ల నీడనే కూర్చుంటున్నారు.
 
పదకొండు దాటింది. ఇంకా పించను ఇచ్చే సారు రాలేదు. కొందరు ప్రొద్దున్నే తిని వచ్చారు. కొందరు తిని రాలేదు. వందలాది మంది ముసలాల్లు యాభై ఏళ్ళ నుండి తొంభై అయిదేళ్ళ వాండ్లు అందరూ ఉన్నారు. కొందరు ముసలాల్లు నడవలేని వారు మనవల్ల సాయంతో, కిరాయి ఆటోలో వచ్చారు. ఇంకొందరు ముసలాల్లు కర్ర ఆసరాతో మనవల్ల సహకారం తో వచ్చారు.
 
వందలాది ముసలాల్లు.. వారి ముఖాలలో వెనుకటి ముసలాల్ల లాగా ఏ చీకు చింతా లేదు. వారి ముఖాలన్నీ ముడతలు పడి ఉన్నా, పసి పిల్లల ముఖాలు గానే వెలిగి పోతూనే, రేపటి కెట్లా అనే దిగులు ఏ మాత్రం లేనే లేదు వారి ముఖాల్లో..
 
అక్కడున్న చానా మంది ముసలాలల్లో రెండు వేల పదహారు రూపాయలు రాకముందు కిమ్మనకుండా నోరు లేని పరిస్థితి. బుక్కేడేస్తే కిమ్మనకుండా తినే పరిస్థితి. ఇప్పుడు వారందరిలో స్వతంత్ర భావాలు. పించన్ ఇచ్చే మా అయ్యా ఉండురా, మీరెంత లెక్క అని కొడుకులను, కోడళ్ళను ఎదురించే ధైర్యం.
 
అందరూ ముక్కులకు, మూతులకు మాస్కులు వేసుకున్నారు. అప్పుడప్పుడు ముక్కుకు సరిగా గాలి ఆడక ఇబ్బంది అయి మరిచి పోయి చేతులతో ముక్కుపై ఉన్న మాస్కును తీసివేస్తూ, మరలా కరోనా రోగం గుర్తుకు వచ్చి వెంటనే మాస్కు వేసుకుంటున్నారు.
 
ఎవరి గ్రూపుల వారిగా వారు వెనకటి ముచ్చట్లు, ఇప్పటి ముచ్చట్లు, కొడుకులు, కోడళ్ళ ముచ్చట్లు, ఊరు ముచ్చట్లు, ఉల్లాసంగా ఆనందంగా అకరు పికరు లేకుండా రేపటి కెట్లా అనే ఆలోచన లేకుండానే సంతోషంగా మాట్లాడుకుంటున్నారు.
 
డెభై అయిదేళ్ళ రాజమ్మ వయసు మీద ఉన్నప్పుడు ఊళ్ళో లీడరు. పది సంవత్సరాల నుండి నోరు పడిపోయింది. మొదటి సారిగా రెండు నెలల పించను  నాలుగు వేల ముఫై రెండు రూపాయలు చేతికి రాగానే పడిపోయిన నోరు అమాంతం వచ్చింది. వొళ్ళంతా కుంచుకు పోయి, దిక్కులేని దానిలా ఉన్నది కాస్తా పించను రూపాయలు రాగానే పడిపోయిన నోరు వచ్చి, ముసలి తనం చాయలు కాస్త తగ్గి, కాస్త నిటారుగా అయి ఊళ్ళో అందరితో మునుపటిలా స్వతంత్రంగా ఉండసాగింది.
 
ఈ రాజమ్మకు ఎనిమిది ఎకరాల భూమి, ఈమె ఊళ్ళో ఏ పంచాయతులు జరిగినా ఈమె వద్దకు వస్తే ముక్కు సూటిగా తీర్మానాలు చేసేది. మంచిని మంచి అనేది. చెడును చెడు అనేది. నోరు పెద్ద. కాస్త గయ్యలితనం. ఎనిమిది ఎకరాలు ముగ్గురి కొడుకులకు సమానంగా పంచింది. ఇద్దరి బిడ్డల పెళ్ళిళ్ళు చేసింది. అరవై ఏళ్ళు దాటాయి. కూలికెలుదామంటే కాళ్ళు, చేతులు ఆడటం లేవు.. వంతుల వారిగా నెల నెల కొడుకుల వద్ద ఉండేది. నోరు మూసుకుని మేము పెట్టిన తిండి తిను. ఏం సంపాదించినావు. బంగళాలు, రూపాయల కట్టల కట్టలు.. కొడుకు కోడళ్ళ సూటి పోటి మాటలు.
 
ఎంత స్వతంత్రంగా బతికింది. కష్టం చేసుకొనే చేతగాని ప్రాణానికి రకరకాల అవమానపు మాటలు పడుతూ కోడళ్ళు వాళ్ళ పని తీరినప్పుడే ఇంత తిండి గిన్నెలో వేయడమూ, మెల్ల మెల్లగా ఇంటికే పరిమితమైంది. ఇంతేస్తే తిన్టూంది. కిక్కురు మనకుండా ఓ మూల పడి ఉంటూంది. డెభై ఏళ్లది ఎనభై ఎల్లలా తయారైంది.
 
నాలుగు వేల ముఫై రెండు రూపాయలు చానా ఏళ్ల తరువాత కంట చూసింది. ఆ రూపాయలు చూడగానే కుంచుంచుకు పోయినది కాస్తా నిటారుగా అయ్యింది. పది ఏళ్ల నుండి పడిపోయిన నోరు యదా స్థానానికి రాసాగింది. ఇంటికి రాగానే కొడుకులకు కోడళ్ళకు రూపాయలు చూయిస్తూ..' అరేయ్.. నా పెద్ద కొడుకు పంపించిండు రా.. నా కూడు నేనే వండుకుంటాను అని అదే రోజు నుండి వండుకు తింటూ అందరిలాగే వేప చెట్ల కింద కూర్చుని మునుపటి  లీడరులా వ్యవహారించ సాగింది.
 
ఆ పక్కనే డెభై అయిదేళ్ళు దాటిన బర్ల కిష్టయ్య ఉండు. కిష్టయ్య పక్కనే కూర్చున్న ఇంకో ముసలాయన ఆ గుంపులనే కిష్టయ్యని చూస్తూ, నోరు పెద్దగా చేసి ఏమే కిష్టన్నానీకు రెండు వేల పదహార్లు రాకపోతే నీ దూరపు కోడలు వండి పెట్టక పొతే, నువ్వు మూడేండ్ల కిందనే సద్దువు. నీ బొంద మీద గడ్డి పెరుగు, అందరికి వినబడేటట్టు అరిచాడు.
 
వెంటనే కిష్టయ్య, 'ఆయుస్సు పోసే కనబడని బ్రహ్మయ్య ఎక్కడుండో కాని, ఈ రెండు వేల పదహార్లు పంపించే ఆ బ్రహ్మయ్య తోటే ఇంకా బ్రతుకుతున్నాను. ఆయన సల్లంగ బతుక. రెండు చేతులు జోడించి నెల నెల రెండు వేల పదహార్లు పంపే బ్రహ్మయ్య ను తలుచుకుంటూ దండం పెట్టుకున్నాడు.
 
ఈ బర్ల కిష్టయ్య కు పిల్లలు లేరు. చిన్నపాటి ఇల్లుంది. సంతానం లేదు. ఇద్దరికీ డెబ్బై ఏళ్ళు దాటాయి. రెక్కల కష్టమే జీవనాధారం. అయిదారు సంవత్సరాల నుండి రెక్కలుడిగి కూలికి వెల్లడం లేదు. సరియైన ఆహారము పోషణ లేక, మందులు లేక మంచానికే పరిమితమై భార్య చనిపోయింది. ఊళ్ళో వారు చూసేందుకు వెలితే భర్త కిష్టయ్య మంచం మీది నుండి లేవలేక మాట్లాడలేక మంచాన్నే పడి ఉన్నాడు. సరిగ్గా అదే రోజున ఊళ్ళో రెండు నెలల పించన్ కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టారు. ముసలామె చావు కాగానే లేవలేని కిష్టయ్య ను ఆటోలో తీసుకు వెళ్లి రెండు నెలల పించను వేలిముద్ర వేయించి తీసుకువచ్చి, కొంత మంది గ్రామ పెద్దలు ముసలాయన దూరపు పాలాయన కోడలును పిలిపించి 'ఈ రూపాయలు తీసుకో, ఇంకా నాలుగయిదు రోజులే బ్రతికేతట్టున్నాడు, ముసలోన్ని ఈ నాలుగు రోజులు చూడమని చెప్పారు.
 
'అయ్యో.. ఎందుకు చూడనూ.. మాక్కూడా రోజూ కూలికి పోతేనే కుండల ఉడికే, మేము మంచిగా ఉంటే ముసలామేకి, ముసలోనికి ఇంత తిండి పెట్టి మంచిగా చూడక పోదుమా, ఈ రూపాయలు తీసుకొని మంచిగా చూస్తా' పదిమందిలో చెప్పింది. మాట మీద ఉన్నది.
 
కోడలు ముసలోన్ని ఆటోలో తీసుకెళ్ళింది. మందులు ఇప్పించింది. మంచి సంరక్షణ చేసింది. నెల నెల పించను తోటి ముసలాయన ఆయుష్షు పెరిగింది.
 
'అంతా పించన్ మహిమ' గుంపులో ఒకరి నోట్లోంచి వెలువడింది. అంతల్నే ఎనభై ఏళ్ల కొమురమ్మ అందుకుంది. 'పించను రాకపోతే రెండేళ్ళ క్రితమే నా బొంద మీద గడ్డి మొలుసు..' చెప్పుకు పోతుంది తన గాధ.
 
కొమురమ్మకు ఇద్దరు బిడ్డలు. ఇంత తిండి పెడితే తిని మూలకు పడి ఉంటూందని రెక్కలుడగగానే అల్లుండ్లు తీసుకెల్లారు. మాటంటే పడదు, కయ్యానికి వెనక్కి పోదు, మొదటి నుండి పెద్ద గయ్యాళి తనం.
 
ఈమె గయ్యాళి తనం భరించలేక అల్లుండ్లు, మనవలు వెల్లగోడితే ఆటోలో సచ్చిన పీనుగులా వచ్చింది. వాడకటోల్లను ఇసారాతో పిలిచింది. దమ్ము, ఆయాసం తీస్తూ మెల్ల మెల్లగా మాట్లాడుతూ.. 'నా అల్లుళ్ళూ, బిడ్డలూ, మనుమలూ అందరూ సచ్చిండ్రు.. నేను రేపో మాపో సస్తా. ఈ పెయ్యి మీది తులం బంగారం అమ్మి నా సావు చెయ్యిండ్రి, ఇప్పుడే చనిపోతున్న అన్నట్టుగా చెప్పింది.
 
తెల్లారి రెండు నెలల పించను వాడకట్టు వారి సహకారం తో  ఆటో లో వెళ్లి రెండు నెలల పించను ఒక్కసారే తెచ్చుకుంది. డాక్టరును ఇంటీ రప్పించుకుంది. బట్టలు ఉతికేందుకు ఓ పనిమనిషిని పెట్టుకుంది. మంచి ఆరోగ్యంగా అయ్యింది. వాడకట్తోళ్ళు ఆమెతో ఎవ్వరూ మాట్లాడకున్నా ఆ గుంపులో చెప్పుకు పోతూనే ఉంది.
 
మొత్తానికి అక్కడున్న గుంపులన్నీ నెల నెల పించను తోటి ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నామని, ఇంకా కొంత ఎక్కువ కాలం బ్రతుకుతున్నామని అందరూ ఓ తీర్మానానికి వచ్చారు.
 
అంతల్నే తొంభై అయిదేళ్ళ ముసలమ్మ మెల్లి మెల్లిగా చెబుతూంది. ' భూమ్మీది అరువై ఏళ్ళు ఎదురైన కూలి చేసిన. కొడుకుల, బిడ్డల పెళ్ళిళ్ళు చేసిన, మనువళ్ళ పెళ్ళిళ్ళు చూసిన. ముసల్దాన్నైనంక చేతిలో ఒక్క పైసా లేదు. ఎకాన ఆకులు, కాసు సున్నం కొందామంటే పైసలు లేకపాయె. ఎప్పుడన్న మనుమల చేతిలో పావుల బిళ్ళ పెడదామంటే లేకపాయే. ఈ రెండు వేల పుణ్యాన కొన్ని రూపాయలు దగ్గర ఉంచుకొని, మిగతా రూపాయలు కోడల్ల చేతుల్లో పెడితేనే పువ్వోలె చూసుకుంటున్నారు' చెప్పుకు పోతూంది.
 
ఈ నెల నెల పించను తోటి నూరేళ్ళు దాటుతావులే' గుంపులో ఒకరు అందరికీ వినబడేట్టు అరిచాడు.
 
పన్నెండు గంటలకు పించన్ సారు వచ్చాడు. అతని తోటి గ్రామ సెక్రెటరి, కావలాయిన ముగ్గురు వచ్చారు. ముక్కుకు మూతికి మాస్కుల తో పించన్ సారు చేతిలో వెలి ముద్రల మిషన్ తో.
 
పించన్ సారును చూడగానే ముసలాల్లందరూ చేతులు భూమిపై పెట్టి లేవబోయారు.  పించన్ సారు రెండు చేతులు కదిలిస్తూ ' లేవకండి.. ఎక్కడి వాల్లు అక్కడే కోర్చోండి. ముక్కులపై ఉన్న మాస్కులను ఎవరూ తీయకండి. ఎవరూ గట్టిగా మాట్లాడకండి. మనూరు సెక్రెటరీ వచ్చాడు. వీరే మీ అందరి వేలిముద్రలు వేస్తాడు. మీరెవరూ వెలి ముద్రలు వెయ అవసరం లేదు. మీ పేరు పిలవగానే వచ్చి పించన్ రూపాయలు తీసుకు వెళ్ళగలరు'. అందరికీ వినబడేట్టు గట్టిగా చెప్పాడు.
 
యాదమ్మ కు పించన్ ఇచ్చేందుకు ఇంకా రెండు గంటలు పట్టొచ్చు. పించను ఇచ్చేటప్పుడే రూపాయలు కల్ల చూసేది. ఇంటికెళ్ళగానే కోడలి చేతిలో పెట్టాలి. పించను రాకముందు. నెల నెల వంతుల వారిగా కోడళ్ళ వద్ద ఉండేది. పట్నంల చిన్న చిన్న కిరాయ గదులు జైల్లో ఉన్నట్లు ఉండేది. ఊళ్ళో ఉంటే ఈ వాడ, ఆ వాడ ఎక్కడ లేని ముచ్చట్లు పొద్దు పోయేది. రెండు వేల పదహార్లు పించను వచ్చాక కోడళ్ళు ఓ ఒప్పందానికి వచ్చారు. ఎన్ని నెలలైనా ఏ కోడలి దగ్గర ఉండబుద్ది అయితే ఆ కోడలికి నెల నెల వచ్చే పించను ఇచ్చి వారి ఇంట్లోనే ఉండాలి.
పట్నం పోలేక, ఉన్నోళ్ళు వృద్దాశ్రమం లోకి తల్లి దండ్రిని ఉంచి నెల నెలా డబ్బులు ఇచ్చే కొడుకులు, కోడల్ల లాగా, సర్కారు ఇచ్చే పించను రూపాయలు కోడలు చేతిలోనే పెడుతూంది.
 
కరోనా లాక్ డౌన్లో తన ఒక్కదాని పేరునే ఉన్న రేషన్ కార్డు ద్వారా రెండు మూడు నెలలు వచ్చిన పదిహేను వందల రూపాయలు ఇవ్వనంటే చేతుల్లోంచి గుంజుకుంది. ఇయ్యాక పొతే పెద్ద కొడుకుల వంతున పట్నం పో బస్సు ఎకిస్తా నీకు వండి పెట్టను..' గట్టిగా అరిచింది. ఈ కరోనా తో అయిదు నెలల నుండి ఒక్క రూపాయి లేకుండా ఒక్కొక్కరికి పన్నెండు కిలోల బియ్యంతో బయట బియ్యం కొనుక్కు రాకుండా అందరికీ సరిపోతున్నాయి. ఒకప్పుడు బోనం చేసేందుకు అడ్డెడు బియ్యానికి ఎంత కష్టపడ్డదో గతం గుర్తుకు రాసాగింది.
 
 
జంద్యాల పున్నం వెళ్లి వారం రోజులు అఫుతూంది. వినాయక చవితి ముందు వచ్చే అమావాస్య లోపు బోనాలు తీయాలి. ఇంకో వారం రోజుల లోపులే బోనాలు తీయాలి. వారం రోజుల నుండి వాన ముసురు వేలువడం లేదు. సర్కారు బాయ పక్కనే ఉన్న చింత చెట్టు కింద కుల పెద్దలు కూర్చుని రెండు రోజుల్లో వచ్చే ఆదివారం బోనాలు తీయాలనుకున్నారు.
 
యాదమ్మ కత్తెర ఎడగారు వరి కోతలకు ముసురులోనే తల పైన గొనె సంచి కొప్పరతో కూలికి వెళ్ళగా, కుండెడు వడ్లు ఈ రోజే ఇంటికి తీసుకు వచ్చింది. ఎల్లుండే బోనాలు. వడ్లు చూస్తె వర్షపు నీళ్ళకు ఉబ్బి ఉడక బెట్టిన గుడాల లాగ ఉబ్బి మెత్తగా ఉన్నాయి. రేపు మాపు ఎండ వచ్చే సూచన లేదు. వడ్లు అలాగే తట్టలో ఉంచితే మొలక వస్తూంది. గిర్నికి వెళ్లి గంపెడు ఊక తెచ్చి వారం రోజులుగా పడుతూన్న వర్షంతో అక్కడక్కడా పలిగి పోయిన పై కప్పు పెంకుల పగుల్ల నుండి వర్షపు నీరు ఇల్లంతా కురువగా, నేలంతా తడిగా ఉండగా ఊక నేలపై బెత్తెడు ఎత్తు పరచి, ఊకపై ఈత కమ్మల పక్క చాప పరిచి, పచ్చి వడ్లను చాప నిండా పరిచింది.
 
ఆ వడ్లపై ఇంకో పక్క సాప పరచి, ఆ సాపపై బొంతలు పరిచి రెండు రాత్రిళ్ళు పిల్లలతో బొంతలపైన పడుకున్నారు. వడ్లు మొలక రాకుండా, కొంత వరకు పచ్చిదనం తగ్గేందుకు.
 
పటేలు వద్ద జీతమున్న భర్తకు నెలకు వచ్చే అయిదు బుడ్ల జోన్నలతో రోజు జొన్న గటుక వండుతూంది. ఇంట్లో బియ్యం లేవు. బోనాల పండుగ ఖర్చుకు మరుసటి రోజునుండే విడవకుండా పడుతూన్న ముసురులోనే వరి నాట్లకు తల మీద గొనె సంచితోనే వెళ్ళింది.
 
ఆదివారం నాడు కూడా కూలికి వెళ్ళిన యాదమ్మ సాయంత్రం ఆరు గంటలకు రెండు రోజుల కూలీ డబ్బులు తీసుకుని అటునుంచి అటే కుమ్మరి వారింటికి వెళ్లి బోనం కుండ గురిగి, దీపంత తీసుకొని, అక్కడి నుండి దుకాణం వద్దకు వెళ్లి కొబ్బరికాయ, అగరుబత్తీలు, సున్నం పసుపు, కుంకుమ, కోడి కూరలకు వండే దినుసులు కొని ఇంటికి వచ్చింది.
 
వస్తూనే పొయ్యి మండించి, ఇంటి వెనకాల గోడ కొయ్యకు వేళ్ళాడుతున్న మూతి నిండుగా ఉండి సగం పగిలి పోయిన కుమ్మరి కుండను, మండుతూన్న పొయ్యిపై పెట్టి మానెడు మానెడు చొప్పున, పది పన్నెండు వాయిల్లు వేయించి వడ్లపై పొట్టు నల్లగా మాడి లోపలి బియ్యం గింజ గట్టిగా కాగా, ఆ వడ్లను జల్లెడతో తింపి, చాటలో మలిసి వడిపిలి, మట్టి, రాల్లు, తాలు, పచ్చిదనం, ఇరవై అయిదు శాతం తరుగు కాగా వడ్లను తట్టలో పోసుకుంది.
 
అప్పటికే చీకటి పడి మిగతా ఇండ్లలో బోనాలు తయారు అయి డప్పు చప్పుల్లతో నెత్తిపైన బోనాలతో ముందుగా వచ్చే బొడ్రాయి వద్దకు చేరుకున్నారు, యాదమ్మ బోనం తప్ప.
 
యాదమ్మ బోనం కుండలో ఎసరు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టింది.
 
వడ్లు వేయించుచున్ననుండి ఎనిమిది నెలల పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు పాల గురించి. యాదమ్మ ఏమీ ఆలస్యం చేయకుండా, తన ముసుగు కొంగును తీసి నడుము చుట్టూ రెండు వరుసలు చుట్టి గట్టిగా నడుము కట్టు కట్టుకుంది. వడ్ల తట్టను నెత్తిలో పెట్టుకుంది. ఏడుస్తూన్న పిల్లవాడ్ని అమాంతం చంకలోకి ఎత్తుకుని పాలిచ్చే రొమ్ముల కింద ఉన్న రైక ముడి విప్పి ఒక పొరను పక్కకు జరిపి రొమ్మును ఏడుస్తున్న పిల్లవాడి నోట్లో పెట్టి, ఓ చేత్తో పిల్లవాడిని పట్టుకుని, ఇంకో చేతిలో పైనున్న తట్టను పట్టుకుని, పరుగు లాంటి నడకతో వస్తూ, అంత దూరాన వడ్ల గిర్ని ఉందనగానే బజారు నుండే 'రుషయ్యో.. ఓ.. రుశయ్యా.. పొయ్యిమీద బోనం కుండ పెట్టిన. నీళ్ళు మసిలి ఎసరు వస్తూండోచ్చు.. బోనాలన్నీ ఎల్లినావి. బోనాలల్లో మా బోనం కలవాలి. కాల్మొక్త బాంచను, జల్ది వడ్లు పట్టమ'ని నడుస్తూనే బజార్లో అరవసాగింది.
 
పరిస్తితిని అర్ధం చేసుకున్న ఋషి, వడ్లు గిర్ని లోకి రాకముందే ఋషి గిర్ని వద్దకు వెళ్లి హైన్డీలు ఇంజను రాడుకు తగిలించి హైన్దీలుతో ఇంజను పయ్యను నాలుగైదు చుట్లు తిమ్పగానే ఇంజను స్టార్టు అయ్యింది. ఇంకా గిర్ని లోకి రాని యాదమ్మ వడ్లు గిర్ని బయట నుండే నెత్తి మీది తట్టను అందుకుని అల్లరుపై కుందేనలో పోసి బియ్యం తయారు చేసాడు.
 
ఆ లోపులే పాలు తాగుతున్న పిల్లవాడి నోట్లో నుండి తలను గుంజి కుడి రొమ్ము నోట్లో పెట్టింది. ఎదో ఆపదలో అవసరానికి పెళ్ళిలో మొగడు కట్టిన బంగారు పుస్తె అమ్ముకోగా అప్పుడప్పుడు ఊళ్లోకి వచ్చే ఇత్తడి పుస్తె, కేటెండి (కేటి వెండి) మట్టెలు అమ్మే దాసరాయిన వద్ద కొన్న పుస్తె యాదమ్మ మెడలో రొమ్ముల పైన నూలు దారం తాడుకు ఉన్న ఇత్తడి పుస్తెను పిల్లవాడు ఓ చేత్తో లాగుతూ ఆకలి మంటకు పళ్ళతో రొమ్ములను గట్టిగా గుంజుతూ పాలు తాగుతున్నాడు.
 
బియ్యం తట్టని నెత్తిలో పెట్టుకుని గబ గబా ఇంటికి వచ్చింది. పిల్లవాడు రొమ్ము పట్టి పాలు తాగుతూనే ఉండు. పిల్లవాడికి ఏ సమయాన పాలిస్తూందో వాడికి మూడు నెలల వయసు నుండే తెలిసినట్టూంది. తల్లి ప్రొద్దున కూలీకి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకు, సాయంత్రం ఆరున్నరకు మధ్యలో ఎంత ఆకలైనా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి తోట్టేల్లో నిద్ర పోవుడే తప్ప తల్లి పాలు ఎరుగడు. అందుకే వాడు పాలు ఇచ్చే టప్పుడే గభ గభా పాలు తాగి కడుపు నింపుకుంటాడు.
 
బోనాలు మెల్లి మెల్లిగా నడి ఊర్లో చౌరస్తా వద్ద ప్రతి దసరాకు జాతీయ జెండా ఎగరేసే జండా పక్కనే మహాత్మా గాంధీ విగ్రహం అక్కడికి చేరుకున్నాయి బోనాలన్నీ. పిల్లవాడిని తట్టను దించి చాటలోకి అడ్డెడు బియ్యం ఎత్తి మసులుతున్న కుండలోకి బియ్యం జారవిడిచి తెడ్డుతో కలియ బెట్టింది. ఆలస్యం చేయకుండా వెంటనే తల వెనకాల ఉన్న సిగముడి విప్పి గురిగిలోని నూనెను చేతుల్లో తీసుకుని తల వెంట్లుకలకు పట్టించి పది వేల్లను వెంట్రుక పాయలోజి జొప్పించి సరి చేసుకుని అద్దం దువ్వెన లేకుండానే సిగ ముడిసింది. పిల్లలందరికీ తలకు నూనె అద్దింది. చేతులు కడుక్కుని మరోసారి కుండలోని బువ్వను తెడ్డుతో కలిపి పొయ్యిలో కట్టెలు వెనక్కు గుంజింది.
 
బోనం ఎత్తుకుని తొందరగా వెళ్ళాలి. వారి బోనం కుండల లోని పడి బువ్వ తీసినప్పుడే, నా బోనం కుండలోని పడి బువ్వ తియ్యాలి. అందరి పడి బువ్వ ఒక్కసారే నైవేద్యం పెట్టాలి. నా ఒక్క ఒంటి పడి బువ్వ నైవేద్యం దేవతకు ఎక్కరాదు. అందరితోటే ఎక్కాలి. పదే పదే మనసులో అనుకుంటుంది.
 
నాలుగు కూడలి చౌరస్తా నుండి నడి ఊర్లో ఉన్నగండి మైసమ్మ గుడి గద్దె వరకు వెళ్ళాయి బోనాలన్నీ. గండి మైసమ్మ వద్ద బోనాల గుంపంతా కొంతసేపు ఆగి బోనాల గుంపులోని ముందరి బోనాలు ఎత్తుకున్న ఆడవారు నెత్తి మీది కుండలను చేతులతో పట్టుకోకుండా రెండు చేతులలో ఉన్న వేప కొమ్మలతో, పెద్దగా డప్పులు చప్పుడు చేస్తుండగా చేతులు ఊపుతూ, కాళ్ళను లయబద్దంగా నాట్యం చేయుస్తూ, కొద్దిసేపు సిగాలు ఊగి తరువాత గండి మైసమ్మ గద్దె నుండి నడవ సాగారు.
 
యాదమ్మ కుంకుమ తీసుకుంది. ప్రతి రోజూ నుదుట పెట్టుకొనని యాదమ్మ పండుగలూ, పబ్బాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలకు ఎప్పుడన్నా పోరుగూర్లకు వెళ్ళినప్పుడు మాత్రమే నుదుట కుంకుమ బొట్టు పెట్టుకునేది. ఈ బోనాల పండుగ రోజున అద్దం లేకుండానే నొసట బొట్టు పెట్టుకుంది. పిల్లలందరికీ బొట్టు పెట్టింది. మొగుడికి పెట్టింది.
 
పొయ్యి మీద నుండి కుండ దించింది. మంట పొగకు ఎర్రటి కుండ నల్లగా అయ్యింది. కాలుతున్న కుండ చుట్టూత కొన్ని నీళ్ళు చిలకరించి, ఎన్నడూ ఉతకని మసిగుడ్డతో కుండపైన చుట్టూతా ఉన్న మసి పోయేందుకు తుడిచింది. మసిగుడ్డ కు ఉన్న మసి కుండకే అంటిందో, కుండకే ఉన్న మసి, మసి గుడ్డకే అంటిందో, కుండ ఇంకింత నల్లగా అయ్యింది. దుకాణంలో కొనుక్కు వచ్చిన సున్నం నీళ్ళతో కలిపి బోనం కుండకు మధ్యన చుట్టూత బెత్తడు విడిచి కింద, పైన చుట్టూతా రుద్దింది. కుండ చుట్టూత రుద్దగానే తెల్లటి సున్నం నల్లగా మారింది. మధ్యన కుండ చుట్టూతా రెండేసి వరుసల కుంకుమ, పసుపు బొట్లు పెట్టింది. కుండ పై చుట్టూతా వేప రిబ్బలు ఉంచి, ఆపై గురిగి, గురిగి పై దీపంతలో నూనె వేసి దీపం వెలిగించింది.
 
గుంపు బోనాలు చప్పుళ్ళతో, సిగాలతో ఊరి బయటికి వెళ్ళాయి.
 
ఇంకా బోనమే ఎత్తుకోని యాదమ్మ ఇంటి ముందరే పెంచుకున్న కోడిపుంజు, కత్తి భర్తకు ఇచ్చి పోచమ్మ గుడి వద్ద కోసుకువచ్చి బూరు పీకి, కాపి తునకలు, తునకలుగా చేయమని పంపింది. వచ్చిన తరువాత కూరవండుతానంది.
 
పన్నెండు సంవత్సరాల పెద్ద కొడుకు, చంకలోకి ఎనిమిది నెలల చిన్న కొడుకుని ఎత్తుకోమని ఇచ్చింది. కొబ్బరికాయ, అగరుబత్తీలు తొమ్మిదేళ్ళ రెండో కొడుకుకి ఇచ్చింది. అయిదేళ్ళ బిడ్డని అన్నల వెనకాల రమ్మని చెప్పింది.
 
బోనాలన్నీ ఊరు బయట నుండి మెల్లి మెల్లిగా మాతమ్మ గుడికి వెళ్ళాయి.
 
యాదమ్మ ముసుగు కొంగు చివరను రెండు చుట్లుగా చేసి తలపై పెట్టుకుని కాలే కుండను రెండు చేతులతో పైకి లేపి నెత్తిల పెట్టుకుంది.
 
సరిగ్గా అప్పుడే..
ముందుగా వెళ్ళిన గుంపు బోనాలన్నీ మాతమ్మ గుడి చుట్టూ మూడు చుట్లు తిరిగి అప్పుడే ఒక్కొక్కరు కిందికి దించుతున్నారు.
 
తలపైన వేడిగా ఉన్న బోనం కుండతో బజారున పరుగు లాంటి నడకతో వెళ్తూంది యాదమ్మ ఒంటి బోనంతో
 
తల్లి వెనకాల పిల్లలు పరిగెత్తుకొస్తున్నారు. వారం పది రోజులుగా విడువకుండా పడుతున్న ముసురులో చిత్తడి చిత్తడిగా ఉన్న రోడ్డు బురద కాళ్ళతో, ఊరి బయట కొచ్చారు తల్లీ పిల్లలు. చిమ్మ చీకటి, రోడ్డు పక్కన పిల్ల బాట నుండి మాతమ్మ గుడికి దారి, పిల్ల బాటకు ఈ పక్కన, ఆ పక్కన ఎత్తైన గడ్డి, బాటలో జానెడేత్తు బురద. బోనాన్ని ఓ చేత పట్టుకుని కూతుర్ని ఓ చేత పట్టుకుని నడిపిస్తూ వెనకాల కొడుకులను జాగ్రత్తగా నడవమని చెప్పి గుడికి చేరుకుంది.
 
అప్పటికే గుంపు బోనాలు మాతమ్మకు అరగంట పూజా కార్యక్రమాలు చేసి ఆ తరువాత ఒక్కో బోనం కుండలో చేయిపెట్టి చేతికి పట్టినంత పడిబువ్వ తీసి జబ్బ తట్టలో వేస్తున్నారు.
 
యాదమ్మ బోనం కుండతో గుడికి మూడు చుట్లు తిరిగి బోనం కిందికి దించింది. అప్పుడే మిగతా కుండల పడి బువ్వ తీసుడు అయిపోతూ చివరి యాదమ్మ కుండలో పడి బువ్వ చివరగా తీసారు. మాతమ్మ గుడి ఎదురుగా, పోతలింగం రాయి ముందర అందరి బోనాల పడిబువ్వ రతి పోసి, అందరి కొబ్బరికాయలతో పాటు యాదమ్మ కొబ్బరి కాయ కూడా పగిలింది.
 ********
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice superb story  clps
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: