Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సతీ తిరుగుబాటు
#1
సతీ తిరుగుబాటు
-  Teju Parnika
"ఒసేయ్ పిల్లా ఎక్కడ సచ్చావే. నట్టింట్లో మొగుడి పీనుగ పెట్టుకుని గదిలో కులుకుతున్నావా దొంగముండా బయటకురావే."
బిడ్డ గుక్కపట్టి ఏడుస్తుంది అత్తయ్యగారు అందుకే పాలు పట్టడానికి వెళ్ళాను.
మొగుడు సచ్చాడన్న దిగులులేదు కానీ పాపిష్టిది ఏడుస్తోందని వెళ్ళావా? దిక్కుమాలిన దాని పాదం దరిద్రపు పాదం కాబట్టే నా కొడుకు ఇలా పీనుగై పడున్నాడు. ముదనష్టపుదాన అని కోడలు జుట్టుపట్టుకుని లాక్కెళ్లి కొడుకు కాళ్లదగ్గర పడేసింది 90ఏళ్ళ అత్తగారు.
కిందపడేటప్పుడు చంకలో ఉన్న బిడ్డకి దెబ్బతగులుతుందేమో అని బిడ్డని కాచుకుంది కానీ తనని తాను నిలువరించుకోలేకపోయింది. ఫలితంగా నుదిటి మీద రక్తపు మరక ప్రత్యక్షం అయ్యింది.
పన్నెండేళ్ల కూతురు చంకలో బిడ్డను పెట్టుకుని భయం భయంగా ఏడుస్తుంటే ముప్పైఏళ్ళ ఆమె తల్లి తల్లడిల్లిపోయింది.
భర్త పోయాడన్న బాధకన్నా అత్తగారు మళ్ళీ కొడుతుందేమో అన్న భయంతో చిగురుటాకులా వొణికిపోతున్న బిడ్డని దగ్గరకు తీసుకుంటే భర్త చేతిలో తన పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసినదై చీర చెంగు నోట్లో కుక్కుని నిశ్శబ్దంగా రోదిస్తోంది.
కన్న కూతురు కళ్ళముందు పడే బాధలను చూడటం ఒకెత్తయితే చనిపోయిన అల్లుడుతో పాటు కూతురుని కూడా చితిలో వేసి ఎక్కడ చంపేస్తారో అన్న భయం మరో వైపు.
తొమ్మిదేళ్ల కూతురుని అరవైఏళ్ళ ముసలివాడికి ఇచ్చి పెళ్లి చెయ్యొద్దని మొత్తుకుంది. రక్తమోడేలా తన్నులు కూడా తింది. కానీ పెళ్లి జరక్కుండా ఆపలేకపోయింది. పెళ్ళికొడుకు ఇచ్చే కన్యాశుల్కానికి ఆశపడి కడుపున పుట్టిన కూతుర్ని బలిచేసాడు. తన కన్నా రెట్టింపు వయసు ఉన్న వ్యక్తిని అల్లుడుగారు అని పిలిచి మర్యాద చేసినా వాడు చూసే వక్రపు చూపులకు తనే వొణికిపోయేది. అలాంటిది తన కూతురు ఎన్ని బాధలు పడిందో అర్థంచేసుకోలేని వెర్రిబాగులది కాదు.
                                                                                                                                                                                                                                                                                                                                                ***
 నలుగురు బిడ్డల తండ్రి అయినటువంటి షావుకారు లక్ష్మిపతి ఇద్దరు కొడుకుల పెళ్లి అయ్యాక భార్యావియోగం చెందటంతో తొమ్మిదేళ్ల గంగని ఎదురుకట్నం ఇచ్చి పెళ్లిచేసుకున్నాడు.
తనకన్నా పెద్దవారయినా కొడుకులు చూసే వికృత చూపుల గురించి తెలియని పసితనంలోనే ఇంట్లో అడుగుపెట్టింది గంగ. లేని కుటుంబం నుండి వచ్చిందని అత్తగారికి అలుసు. తమ కన్నా చిన్నది తమ మీద అత్తగారి హోదాలో పెత్తనం చేస్తుందేమో అన్న భయంతో ఎవరికీ తెలియకుండా గంగ ని హింసించేవారు ఇద్దరు కోడళ్ళు. తెల్లని పసిమి ఛాయతో మెరిసిపోయే గంగలో తల్లిని చూడటానికి బదులు కామంతో కళ్ళుమూసుకుని ఆడదాన్ని చూసేవారు కొడుకులు. అత్తగారు పెట్టె ఆరళ్ళు, కోడళ్ళు పెట్టె బాధలు శారీరకంగా వివశురాలిని చేస్తే సంభోగం అంటే తెలియని వయసులో రాత్రయితే చాలు మీదపడి క్రూరంగా అనుభవించే భర్త వల్ల శారీకంగా, మానసికంగా కూడా కృంగిపోయింది.
                                                                                                                                                                                                                                                                                                                                                ***
వారం రోజుల నుండి మంచం మీద ఉన్న భర్తకి సేవ చేస్తూ,మరోవైపు ఇంటెడు చాకిరీ చేస్తూనే తన బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటున్న గంగ తన గురించి పట్టించుకునే సమయం లేదు. అది కాక భర్తని చూడటానికి వచ్చే బంధువులకు ఊరిజనానికి మర్యాదలు చెయ్యటంతో తినటానికి కూడా సమయం చిక్కలేదు. అసలే నీరసంగా ఉన్న గంగ పరిస్థితి అత్తగారి దెబ్బలతో మైకం కమ్మినట్టు అయ్యింది.
ఏడ్చి ఏడ్చి బరువెక్కిన కనురెప్పలు సోలిపోతుంటే బలవంతంగా ఆపుకుంటూ ముక్కుని ఎగబీలుస్తూ ఏడుస్తోంది. కానీ శక్తి సరిపోక కళ్ళుమూసుకున్న గంగని చూసి చాచిపెట్టి వీపు మీద కొట్టింది అత్తగారు.
"అమ్మా"! అన్న పిలుపు నోటిని దాటి బయటకు రాకుండా చీరకొంగుని గొంతులోకంటా కుక్కుకుంది.
కానీ కన్నపేగు ఆగక పరుగున వెళ్లి కూతురుని పొదువుకుంది గంగ తల్లి.
ఏడుస్తున్న తల్లిని చూసి బెదిరిపోతున్న మనవరాలిని ఒక చేత్తో పట్టుకుని కూతుర్ని దగ్గరకు తీసుకుని వియ్యపురాలి వంక చూసింది.
ఏంటి అలా చూస్తున్నావ్? కూతురిని ఎలా పెంచాలో కూడా తెలియదు. దరిద్రపు సంత మా నెత్తినెక్కి కూర్చోవటానికొచ్చినట్టుంది. మొగుడు పొతే ఏడుస్తూ కూర్చోకుండా నిద్రపోతుందా అని మరి రెండు దెబ్బలు వెయ్యబోయింది.
వచ్చిన వాళ్లు చాల్లేవమ్మా! దానికేం తెలుసు అదే చిన్నపిల్ల అయితే అంటూ నాలుగు మాటలు అనేసరికి అక్కసు ఎలా తీర్చుకోవాలో తెలియక నోటికి పని చెప్పింది.
కూతురు వీపు నిమురుతుంటే ఉబ్బుగా తగిలిన ప్రదేశాన్ని తడుముతూ అది వియ్యపురాలు కొట్టిన దెబ్బ ఫలితం అని తెలిసినా, గట్టిగా మాట్లాడలేక నోరుమూసుకుని బిడ్డని ఓదార్చింది తల్లి.
దరిద్రపు ముండ దీన్ని పెళ్లి చేసుకుని తెచ్చాకే నా కొంపకి అరిష్టం దాపురించింది. దీని పాదమే దరిద్రపు పాదం. ఇది అడుగుపెట్టాకే నా మొగుడు సచ్చాడు. ఇప్పుడు నా బిడ్డ కూడా సచ్చాడు. అయినా బాధ వుందా దీనికి. టింగురంగా అంటూ కళ్ళొత్తుకుంటూ కూర్చుంది. మొగుడు పోయాడన్న బాధ ఉంటేగా. ఇదిగో మొగుడు సచ్చాడుగా ఇంకా హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నావేమో నువ్వు కూడా నా బిడ్డతో పాటే   "సతీ సహగమనం చెయ్యాలి."  నువ్వు బ్రతికినంతకాలం తేరగా మేపటానికి నువ్వు తెచ్చిన మూటలేమి మూలగట్లేదు అంటూ అడ్డుఆపూ లేకుండా కోడలిని సాధిస్తూనే వుంది.
ఆవిడ మాటలకు భయంతో భర్త వంక చూసింది గంగ తల్లి. మనకేం సంబంధం లేదన్నట్టు వచ్చినవాళ్లతో మాట్లాడుతున్న ఆయన్ని చూసి నిస్సహాయంగా కూతురి వంక చూసింది. అప్పటికే మెడ వాల్చేసిన గంగని చూసి అమ్మా గంగా! అంటూ లేపటానికి ప్రయత్నించింది.
ఏవండీ!.. అమ్మాయి స్పృహ తప్పింది అని అరిచింది. కానీ ఎవరికీ పట్టలేదు. వచ్చినవాళ్లు కూడా తలోమాట అనటంతో షావుకారు పెద్దకోడలు కాసిని నీళ్లు తెచ్చి మొహం మీద కొట్టింది. మెల్లగా కళ్ళు తెరవటానికి ప్రయత్నిస్తోంది కానీ తనవల్ల కావటంలేదు.
ఇంక కూతురిని అలా చూస్తూ ఉండలేక చేతిలో ఉన్న మనవరాలిని కింద పడుకోపెట్టి గంగని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టబోయింది కానీ..
                                                                                                                                                                                                                                                                ***
 "ఒకసారి కూతురిని చూడటానికి వచ్చినప్పుడు మంచం మీద కూర్చోబోతే అమ్మా అక్కడ కూర్చోవద్దు అంటూ ఆపేసి కింద పక్క వేసి ఇక్కడ కూర్చో అమ్మ. మంచం మీద ఆయన తప్ప వేరేవాళ్లు కూర్చుంటే ఊరుకోరు.
ఊరుకోరా!? అంటే నువ్వు ఎక్కడ పడుకుంటున్నావ్?
కిందనే పడుకుంటాను అమ్మా.
మరి అల్లుడుగారు నీ దగ్గరకు రారా?
అన్ని పనులు చేసుకుని వచ్చాక శుభ్రంగా స్నానం చేసి రమ్మంటారమ్మా. అప్పుడు కాసేపు మంచం మీద పడుకోబెట్టి ఏదేదో చేస్తారు. అప్పుడు నాకు చాలా నొప్పిగా ఉంటుంది. చాలా ఏడుపొస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన కొత్తలో ఏడిస్తే కొట్టారమ్మా అందుకే ఎంత బాధపెట్టిన ఓర్చుకునేదాన్ని. కాసేపటికి నన్ను పక్కకి తోసేసి వెళ్లి కింద పడుకోమనేవారు. ఒకవేళ స్నానం చెయ్యకుండా గదిలోకి వచ్చినా ఊరుకునేవారు కాదు. నా చెంపలు వాయించి స్నానం చేసి రమ్మనేవారు. రాత్రి పూట నీళ్లు ఎంత చల్లగా ఉంటాయో తెలుసా అమ్మా అయినా కూడా అలాగే చేసి ఒణుకుతూ వచ్చేదాన్ని. కొన్నిసార్లు జ్వరం కూడా వచ్చేది. జ్వరమని చెప్తే అది జ్వరం కాదు. నీకు మదమెక్కి కొట్టుకుంటున్నావ్. అంటూ ఇష్టం వచ్చినట్టు కొట్టేవారు అమ్మా. అందుకే జ్వరమొచ్చినా ఎవరికీ చెప్పేదాన్ని కాదు."
పదేళ్లకే ఎన్నో బాధలు పడిన కూతురు ఇప్పుడు పదమూడేళ్లకే మొగుడ్ని పోగొట్టుకుందన్న బాధ మనసుని మెలిపెడుతుంటే అలానే నేల మీద పడుకోబెట్టి చన్నీళ్లతో మొహం అంతా తుడిచింది.
                                                                                                                                                                                                                                                                                                                                ***
మెల్లగా రెప్పలు తెరుస్తున్న కూతురిని చూసి చెంపల మీద మెల్లగా తడుతూ అమ్మా గంగా లేమ్మా అంటూ మృదువుగా పిలిచింది.
కళ్ళు బలవంతంగా తెరుస్తూ, అమ్మా ఆకలేస్తుంది అమ్మా ఏమన్నా పెట్టు అమ్మా లేవలేకపోతున్నా అంటూ నీరసంగా మాట్లాడింది.
కూతురు మాటలకి కళ్లలోనుండి పొంగుకొస్తున్న కన్నీటిని ఆపుకోలేక గంగని గుండెలకు హత్తుకుంది.
అమ్మా పోనీ కాసిని నీళ్లయినా ఇవ్వవా.
ఇప్పుడే తెస్తాను తల్లి అంటూ ఇంటికి కాస్త బయట వెనుక వైపు ఉన్న చుట్టింటి (వంటగది) వైపు వెళ్తుంటే, గబగబా వచ్చిన వియ్యపురాలు.. "ఎక్కడికి వెళ్ళిపోతున్నావ్ ఇదేదో నీ సొంత ఇల్లన్నట్టు."
క్షమించండి మంచి నీళ్లకోసం. గంగ కళ్ళు తిరిగిపడిపోయింది అందుకే.
అయితే మాత్రం నువ్వు వంటగదిలోకి ఎల్లిపోతావా? ఇక్కడే తగలడు అని ఆవిడే వెళ్లి ఒక లోటాలో నీళ్లు తెచ్చింది.
లోపల నుండి మనవరాలి ఏడుపు వినిపిస్తుంటే, దరిద్రపు సంత దరిద్రపు సంత అదేమో ఏడవటానికి నొప్పొచ్చి కళ్ళు తిరిగిపడిపోయినట్టు నాటకం ఆడితే ఇదేమో ఎప్పుడు ఏడుపుగొట్టుదానిలా ఏడుస్తుందని ఆవిడ తిట్టుకుంటూ వెళ్తుంటే పసిపిల్ల ఆకలికి ఏడుస్తోందేమో కాసిని పాలు ఉంటే ఇవ్వండమ్మా పడతాను అని వియ్యపురాలితో అంది
నువ్వేమి మూటలు పంపలేదు నీ కూతురుతో పాటు, అడగంగానే ఇవ్వటానికి. పో ముందు ఇక్కడ నుండి అని కసురుకుంది.
అది కాదండి గంగ రొమ్ముల్లో పాలు లేవనుకుంటా పాలు తాగిన కాసేపటికే ఏడుస్తోంది. అలాగే ఏడిస్తే నోరారుకుపోతుందని అడిగాను.
పొతే పోయిందిలే నా బిడ్డతో పాటు దాన్ని కూడా నీ కూతురుతో కలిపి చితిలో పడేస్తాను. పో అవతలికి అంటూ గయ్యిమని వంటగాదికి తాళం వేసుకుని కొడుకు శవం దగ్గరకు వెళ్ళింది.
మనవరాలిని కూడా చంపేస్తారేమో అన్న భయంతో గుండెలు చిక్కబట్టుకుని లోపలికి వెళ్ళబోతూ, ఎడమవైపు ఉన్న తులసికోటవంక చూసింది.
ముందు రోజు పెట్టిన పటికబెల్లాన్ని చూసి ఎవరు చూడకుండా చెంగున చుట్టుకుని బొడ్లో దోపుకుని కూతురు దగ్గరకి వెళ్ళబోతూ మనవరాలిని కూడా తీసుకెళ్లింది.
కూతురు పక్కనే మనవరాలిని పడుకోబెట్టి చీరకొంగుతో సహా పటికబెల్లాన్ని నోట్లో పెట్టుకుని పళ్లతో పొడిలా చేసి దాన్ని మంచినీళ్లలో కలిపి వేలితోనే గిలకొట్టి కూతురికి పట్టించటానికి గంగ వంక చూసింది.
కూతురి పొత్తిళ్ళలో ఉన్న మనవరాలు తల్లి స్తన్యాన్ని పట్టుకుని లాగుతోంది పాలకోసం. దృశ్యాన్ని చూసి కడుపు తరుక్కుపోతుంటే, మనవరాలిని గుండెలకు హత్తుకుని కూతుర్నిలేపి పటికబెల్లం కలిపిన నీళ్ళని తాగించి అడుగున కాసిని నీళ్లు అట్టిపెట్టి..  అప్పటికే ఆకలికి తన రొమ్ములను తడుముతున్న మనవరాలికి చిన్నగా నోట్లో పోసింది.
తియ్యగా ఉండటంతో వాటినే పాలనుకుని గుటకలు వేసింది చిన్నారి.
గంగా!.. పాపని నేను చూసుకుంటాను నువ్వు బయటకు వెళ్ళమ్మా.
అమ్మా నాకు భయం వేస్తోందమ్మా అని లేచి కూర్చుంది.
ఏం కాదమ్మా వెళ్లి కూర్చుని ఏడుస్తుండు. అని మనవరాలిని ఒళ్ళో వేసుకుని ఊపుతూ గంగ తొడ మీద చెయ్యి వేసింది.
అమ్మా నొప్పి అంటూ తల్లి చేతిని విసిరికొట్టింది.
ఏమైందమ్మా అంటూ చీర కొంచెం పైకి లేపగానే మోకాళ్ళ కింద ఉన్న మచ్చలు, కాలిన గాయాలు కనిపించాయి. ఇంకాస్త పైకి లేపేసరికి ఎర్రగా కమిలిపోయిన తొడని చూసి రెండో కాలు కూడా చూసింది. అది కూడా అలానే ఉండటంతో ఏమైందమ్మా అని ఏడుస్తూ అడిగింది.
మొన్న బియ్యం కడుగుతుంటే కాస్త ఒలికాయని అత్తయ్యగారు తొడపాశం పెట్టారు. ఇంకా ఆలస్యంగా లేచిన చెప్పిన పని వెంటనే చెయ్యకపోయినా వాతలు పెడతారు. నా కోడళ్ళు కూడా నన్ను కొడతారమ్మా, నా జుట్టు పీకుతారు నన్ను నానామాటలు అంటారు అని ఏడుస్తూ చెప్పింది.
ఏమే దరిద్రపు ముండా ఇంకా గదిలోనే పడి ఏడుస్తావా లేక బయటకు చస్తావా అన్న అత్తగారు కేకకిఅమ్మా పాపని చూసుకో అమ్మ అంటూ పరుగున అత్తగారిదగ్గరకి వెళ్ళింది.
దరిద్రపు ముండా నీకు కొంచెం కూడా బాధలేదే నా కొడుకు చచ్చాడని అంటూనే గంగ సిగ పట్టుకుని పెరట్లోకి లాక్కెళ్ళింది.
అక్కడ సిద్ధంగా ఉన్న ముత్తయిదువులకి గంగని అప్పచెప్పి జాగ్రత్తగా సిద్ధం చెయ్యండని చెప్పివెళ్ళింది.
పసుపు నీళ్లతో స్నానం చేపించి, పట్టుచీర కట్టారు. మొహమంతా పసుపురాసి, నుదిటి మీద పెద్ద బొట్టు పెట్టారు. ఒత్తయిన కేశాలని ముడివేసి మల్లెలు తురిమారు. చేతినిండా ఎర్రని మట్టిగాజులు వేసి మెడలో నల్లపూసలు వేసి లోపలికి తీసుకెళ్లారు.
కోడలిని చూసి తృప్తిగా తల ఊపి నగలు ఉన్న పెట్టె ఒకటి తెచ్చి అలంకరించమని మనవళ్ల భార్యలను పురమాయించింది.
పాపిటబిళ్లను పెట్టి అటు,ఇటు సూర్యచంద్రులు అలంకరించారు. ముక్కుకి ముక్కుపుడక పెట్టి బెసర తగిలించారు. పెద్దపెద్ద బుట్టలు, మాటీలు, చెంపసరాలు చెవులకి పెట్టి, కంఠానికి అంటుకునే జిగిని, గుండెలమీద పడేలా రాణిహారం, దాని కింద కాసులపేరు అలంకరించారు. భుజాలకి దండవంకీలు, నడుముకి వడ్డాణం, చేతులకి బంగారు గాజులు వేసి, వెండి కడియాలను కాళ్ళకి తొడిగారు. అంత సిద్ధం చేసి వాళ్లు పక్కకి తొలగగానే, వేశారు కదా అని అన్ని మెళ్ళోనే ఉంచుకుని చితిలో దుకేవు, చచ్చినా వదిలిపెట్టను. దారిలో వెళ్తూ అవన్నీ నీ కోడళ్ళకి ఇవ్వు అంటూ హుంకరించినట్టు చెప్పింది అత్తగారు.
ఒక పక్క భర్త పాడే సిద్ధమవుతుంటే వచ్చినవాళ్లు అందరు గంగకీ ధైర్యం చెప్తూ, భయపడకు ఏం కాదు. నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావ్ అందుకే నీ భర్త తో పాటు నువ్వు కూడా స్వర్గానికి వెళ్తున్నావ్ అంటూ రకరకాలుగా పొగుడుతున్నారు.
తల్లి దూరమయిపోతుందని కల గన్నదేమో నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడ్చింది గంగ బిడ్డ.
కళ్ళముందే కూతురు కాలిపోతుందన్న బాధతో నిద్రపోతున్న మనవరాలిని ఒళ్ళోపెట్టుకుని మౌనంగా రోదిస్తున్న గంగ తల్లి పాప ఏడుపుతో బాహ్యంలోకి వచ్చి పాపని సముదయిస్తోంది కానీ ఎంతకీ పాప ఏడుపాపటంలేదు.
అయితే ముత్తయిదువులు మధ్య ఉన్న గంగ పాప ఏడుపు విని పరుగున వెళ్ళి పాపని గుండెలకు హత్తుకుని తన స్తన్యాన్ని ఇచ్చింది.
ఒసేయ్ పాపిష్టిదానా అలా వెళ్ళకూడదే అని వెనుకే వెళ్తున్న అత్తగారిని ఆపేసారు అక్కడవున్న ఆడవాళ్లు.
కడుపున పుట్టిన కూతుర్ని మళ్ళీ చూసుకోలేదుగా ఆఖరి సారి పాలుపట్టనీ అని వాళ్లు అనటంతో గంగని తిట్టే కార్యక్రమానికి విరామం ఇచ్చింది అత్తగారు.
పచ్చని ఛాయతో మొహమంతా పసుపు రాసుకుని, పట్టు చీరకట్టుకుని, ఒళ్ళంతా నగలతో ఉన్న కూతురు గంగని చూసి గుళ్లో అమ్మవారే తన కూతురిగా పుట్టిందేమో అని ఒక్కక్షణం తన అదృష్టానికి మురిసిపోయినా, మరునిమిషమే ఇంకాసేపట్లో కూతురు కూడా అల్లుడి చితితో కలిసి బూడిదవుతుందన్న విషయం గుర్తొచ్చి విలవిలలాడిపోయింది.
గంగ మాత్రం ఇవేమి పట్టనట్టు మళ్ళీ ఇలాంటి రోజు తనకి రాదని కూతురిని మురిపంగా చూసి, వొళ్ళంతా తడుముతూ ముద్దులుపెట్టింది.
ఇంతలో పక్కగదిలో మాటలు వినిపించటంతో తల్లీకూతురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
                                                                                                                                                                                                                                                                                                ***
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
వినిపిస్తున్న మాటలను బట్టి మాట్లాడుకుంటుంది తన భర్త కొడుకులని అర్దమయ్యి వారి మాటలను వినసాగింది గంగ.
ఒరేయ్ అన్నయ్యా నాన్న ఎలాగో చచ్చాడు. ఇంక ఇప్పుడయినా ఆస్తిని భాగాలుగా చేసి పంచుకుందాం అన్నాడు నాలుగోవాడు.
పంచుకుంటాం బానే ఉంది. మరి ముసలిదాన్ని ఏం చేద్దాం? అన్నాడు రెండోవాడు.
అదెన్ని రోజులు బ్రతుకుతుంది. ఒకవేళ బ్రతికినా మన దారికి అడ్డుపడితే అర్ధరాత్రో పీకపిసికేద్దాం సరిపోతుంది. అన్నాడు మూడోవాడు.
అంతాబాగానే వుంది మరి పిన్నవ్వ పరిస్థితి ఏంటిరా? మళ్ళీ అడిగాడు నాలుగోవాడు.
పిన్నవ్వ ఎవర్రా? నాన్నగారు దాన్ని కొనుక్కుని వచ్చారు. అంటే అది మనకి బానిస. అయినా అది ఎలాగో చస్తుంది కదా ఇంకా దాని పరిస్థితి ఏంటి. అన్నాడు రెండోవాడు.
రేయ్ అది చస్తుంది కానీ దాని బిడ్డ, మన చెల్లి బ్రతికే ఉంటుంది కదా అన్నాడు మొదటివాడు.
అవును అన్నయ్య మరి దాన్నేం చేద్దాం? మిగిలిన వాళ్ళ ప్రశ్న.
ఏం చెయ్యక్కరలేదు. దాని అమ్మని మీ నాన్న ఎలా కొనుక్కొచ్చాడో దాన్ని పదేళ్లు పెంచి ముసలి షావుకారుకో అమ్మేస్తే సరిపోతుంది. అప్పుడు సొమ్ము వస్తుంది. లోపు మన పిల్లల్ని ఆడించటానికి పనికొస్తుంది అన్నది పెద్దకోడలు.
అందరు నిర్ణయానికి ఏకీభవిస్తున్నట్టు ఒప్పుకున్నారు.
ఇప్పుడు అందరు బయటకు వెళ్ళాక మీ నాన్న చచ్చినందుకు బాధపడుతూ ఏడుస్తూ వుండండి. మీ పిన్నవ్వని ఓదారుస్తున్నట్టు నటించండి అని చిన్న కోడలు చెప్పినదానికి అందరు సరే అన్నారు.
తర్వాత, మాటలు ఆగిపోవటంతో వాళ్ళు వెళ్ళిపోయారని అర్దమయ్యి గంగ భుజం మీద చెయ్యి వేసి కదుపుతుంది ఆమె తల్లి.
వాళ్ళ మాటల వల్ల ఏర్పడిన భయం నుండి తేరుకుని ఒళ్ళో ఉన్న బిడ్డని గుండెలకు హత్తుకుని లేదు నీకేం కానివ్వను అంటూ పిచ్చిపట్టినట్టు ఏడవసాగింది.
ఏడుపు విని అక్కడికి వచ్చిన అమ్మలక్కలు ఆశ్చర్యంగా చూసారు గంగని.
ఒక చేత్తో బిడ్డని గుండెలకు హత్తుకుని మరోచేత్తో ఒంటి మీద ఉన్న నగలు పీకి గిరాటుకొడుతూ, లేదు నేను చావను. నేను బ్రతికే ఉంటాను. నా బిడ్డ కోసం బ్రతికే ఉంటాను. నాకు పట్టిన దుస్థితిని నా బిడ్డకు కూడా రానీయను. నేను బ్రతికే ఉంటాను.నేను లేకపోతే నా బిడ్డను బ్రతకనివ్వరు అంటూ నగలన్నీ కోడళ్ల మొహాల మీద కొట్టి, తీసుకోండి వాటికోసమేగా మీ నాటకాలు. నాకు మీ దబ్బు ఒద్దు. మీ ఆస్తి ఒద్దు నన్ను నా బిడ్డని బ్రతకనివ్వండి అంటూ రంకెలు వేసింది.
ఏయ్ దొంగముండా నీకేమన్నా పిచ్చి పట్టిందా నాటకాలు ఆడుతున్నావా అంటూ అత్తగారు జుట్టుపట్టుకోబోతే, ఆవిడ చేతిని విసిరికొట్టి నాకు కాదు నీకు పిచ్చి, నీ మనవళ్లు నిన్ను కూడా చంపాలని చూస్తున్నారు, ఆస్తిని భాగాలు చేసి నా కూతురిని కూడా అమ్మేద్దాం అనుకుంటున్నారు. జరగనివ్వను అది ఎప్పటికీ జరగనివ్వను. నా దుస్థితి నా కూతురికి రాకూడదు అంటూ గదిలో మూలకి వెళ్లి ముడుచుకుని కూర్చుంది.
గంగ చెప్పిన మాటలు విని మనవళ్ల భార్యల వంక చూసింది కానీ వాళ్లు మాకేపాపం తెలియదు అన్నట్టు చేతులు జోడించి చెప్పటంతో ఎక్కడలేని కోపంతో కోడలు మీదకు వెళ్లి ఇష్టం వచ్చినట్టు కొట్టింది.
గంగ తల్లి అడ్డుకోబోతే ఆమెను పక్కకు తోసేసి, నువ్వే నీ కూతురికి నేర్పావు. మొగుడి చితిలో దూకకుండా ఇక్కడే ఉండి మా ఆస్తి మొత్తం దోచెయ్యమని నేర్పినట్టున్నావు అంటూ ఆమె మీద గయ్యిమంటూ దూకింది.
నాకేపాపం తెలియదని ఆవిడ మొత్తుకున్నా, లేదు గదిలోకి వచ్చాకే ఇలా మాట్లాడింది. ఇప్పటివరకు మొగుడుతోపాటే సహగమనం చేస్తానంది. ఇక్కడికి వచ్చాకే దాని బుద్ది మారింది. నువ్వే చెప్పావు దానికి అంటూ ఆవిడ జబ్బ పట్టుకుని బయటకు లాక్కెళ్లి వియ్యంకుడి ముందు పడేసి,
"దాన్ని తీసుకుపో ఇంకోసారి ఇది కానీ నువ్వు కానీ నా గడపలో కాలుపెట్టారంటే నరికిపోగులు పెడతాను ఏమనుకున్నారో" అంటూ పనివాళ్లని పిలిచి వాళ్ళని బయటకు గెంటేయమంది.
ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా, ఏంచేసి చచ్చావే లోపల అంటూ పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి లాక్కెళ్లిపోయాడు గంగ తండ్రి.
ఎవరు ఎన్నిరకాలుగా చెప్పినా, భర్త శవంతో చితిలో ప్రవేశించకపోతే నరకానికి వెళ్తావని బెదిరించినా ఒప్పుకోలేదు గంగ.
తంతు చూసి కోపంతో ఊగిపోయి ఎందుకు చావవే, నేనే దగ్గరుండి నిన్ను నా కొడుకు చితిలో పడేస్తాను అని కాలు దువ్విన అత్తగారిని విసిరికొట్టి, నీ మొగుడు కూడా చచ్చాడు. మరి నువ్వెందుకు చావలేదు. ముందు నువ్వు చితిలో దూకు. అప్పుడు నేను కూడా నీకు తోడుగా వస్తాను అంటూ గొడవకి బెదిరిపోతున్న బిడ్డని మరింతగా తనలోకి పొదువుకుంది గంగ.
నేను నువ్వు ఒక్కటేనా అని కోపంతో బుసలుకొడుతున్న అత్తగారిని చూసి, నువ్వు ఆడదానివే నేను ఆడదాన్నే. ఇంకా నీకు నాకూ తేడా ఏముంది. నా బిడ్డ పెరిగి పెద్దదయ్యేవరకు నేను చావను. కావాలంటే నా బిడ్డకి ఒక యోగ్యుడిని చూసి పెళ్లి చేసాక అప్పుడు నువ్వే చితిలో దూకమన్నా దూకుతాను. కాదు కూడదని అంటే నాకన్నా ముందు నువ్వు చితిలో దూకు అప్పుడు నేను కూడా నీ వెనుకే వస్తాను అని రౌద్రంగా పలికింది.
అప్పటికే అక్కడ చేరిన అమ్మలక్కలు నిజమేగా అని చెవులు కొరుక్కోవటంతో గంగని ఏం చెయ్యలేక, చూస్తానే రేపటినుండి నువ్వు ఎలా బ్రతుకుతావో అంటూ విసురుగా బయటకు వెళ్లి గదిలో నుండి అందరు బయటకు రావటంతో బయట నుండి గొళ్ళెం పెట్టేసి, ఎవరన్నా తాళం తీసి దానికి అన్నం, నీళ్లు పెట్టారంటె చెమడాలు ఒలిచేస్తాను అని బెదిరించి కొడుకు పాడె పైకెత్తమని చెప్పింది.
 
 "నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కాపాడుకుంటాను" అంటూ కూతురిని గుండెలకు హత్తుకుని సరికొత్త తిరుగుబాటుకు ఆద్యం పోసింది గంగ..                                                                                                                                                                                                                                                                                      **సమాప్తం**
భారతదేశ చరిత్రలో ఎంతోమంది సతులు చనిపోయిన తమ భర్తతో చితిలో దూకి భర్తతోపాటు సహగమనం చేశారు. 1515 సంవత్సరంలో పోర్చుగీసు వారు సతిసహగమన ఆచారాన్ని మొదటిసారి నిషేదించారు. అయినా కూడా దురాచారం అంతమొందలేదు. తరువాత బ్రిటిష్ వారు 1798లో కలకత్తాలో దురాచారాన్ని నిషేధించినా, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సంఘసంస్కర్తలకు ఎందరో సతిసహగమనాన్ని రూపుమాపడానికి ఎంతో కృషి చేసారు. అలనాటి నేపధ్యాన్ని తీసుకుని రాసినదే కథ.
  మీ..  తేజుపర్ణిక
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
#3
Wow..super andi chala Baga rasaru..adi chaduvtuntene chala feeling vachindi .. rajaram mohanroy... British governor general ayina William bentick sahakaram tho sati nishedha chattam tesukocharu...superb..meru Baga rasaru....
Deepika 
[+] 1 user Likes Deepika's post
Like Reply
#4
కథ చాల బాగుంది yourock
[+] 1 user Likes sri7869's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)