25-12-2022, 07:34 PM
రుణం
అవినాభావ సంబంధం...రుణానుబంధం...!!
- తిరుమలశ్రీ
***
రోజూ ఆ ఇరుకు వీధినుంచే ఆఫీసుకు వెళ్ళవలసియుంటుంది నేను. వాహనాల రద్దీ ఎక్కువ. పాదచారుల కోసం ఓ పక్క పేవ్మెంట్ లాంటిది ఉన్నా ఛోటా మోటా వెండర్సు, అడుక్కునేవాళ్ళూ ఆక్రమించుకోవడం జరిగింది. పానీ-పూరీ, ఛాట్ వగైరా బళ్ళ దగ్గర జనం గుమికూడియుండడంతో పేవ్మెంట్ అంచున బ్యాలెన్స్ చేసుకుంటూ డిస్కో డాన్సర్ లా అడుగులు వేయవలసి వస్తుంది. బిచ్చగాళ్ళంతా ఓ వైపు వరుసగా కూర్చునియుంటారు. వాళ్ళంతా బిచ్చం కోసం ఒకేసారిగా అరుస్తూంటే చికాకుగా అనిపిస్తుంటుంది. కొందరైతే బిచ్చం వేసేంత వరకు వెంటపడి వేధిస్తారు.
వాళ్ళలో ఓ ముసలి బిచ్చగత్తెను చూస్తే నాకు తెలియకుండానే జాలి వేస్తుంటుంది. బహుశః ఆమె వద్దనున్న పసిపాపను చూసి కావచ్చును. ఆమె వయసు యాభై – అరవై మధ్యలో ఉండవచ్చును. తైలసంస్కారంలేని నెరసిన చింపిరిజుట్టు, మాసిన అతుకుల చీర, ముడతలుపడ్డ వడలిన దేహం, లోతుకుపోయిన కళ్ళు, చెంపమీద కొట్టవచ్చినట్టు కనిపించే అంగుళం పొడవు నల్లటి పుట్టుమచ్చ…
గోనెసంచి మీద పరచిన గుడ్డ పైన ఓ ఆరు నెలల పాప పడుకునియుంటుంది. ఒంటిపైన సరైన దుస్తులు లేక చలికి వణుకుతుంటుంది. పోషణ లోపించి పీలగా ఉంది. ఎప్పుడూ నిద్రపోతూ ఉంటుంది. మెలకువగా ఉంటే గాజు కళ్ళతో మనుషుల వంక చూస్తుంటుంది. ఏడిస్తే గొంతుక కీచుగా ఉంటుంది. ఆ పిల్లను చూస్తే, ‘పాపం!’ అనిపిస్తుంది.
బిచ్చగత్తె వయసుకు, ఆ పసిదాని వయసుకు పొంతన లేకపోవడంతో, అడుక్కోవడానికి ఆ పిల్లను ఎక్కణ్ణుంచో అద్దెకు తెచ్చిందేమో అనిపిస్తుంది…ఆ ముసల్ది నన్ను చూస్తే చాలు, ‘బాబూ! పసిపిల్ల ఆకలితో సొమ్మసిల్లిపోయింది. ధర్మం చెయ్యండి. దీని ప్రాణం నిలపండి’ అంటూ, ఎముకలాంటి చేతిని నా ముఖంలోకి చాపుతూ, లేచి వచ్చిన అస్థిపంజరంలా నా వెంట పడుతుంది.
బిచ్చగాళ్ళంటే అసహ్యం నాకు. బిచ్చం వేసి వాళ్ళలో సోమరితనాన్ని పెంపొందించుతున్నామనిపిస్తుంది. అందుకే, బిచ్చం అడుక్కునేవాళ్ళపైనే కాక, బిచ్చం వేసేవాళ్ళ పైన కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలన్నది నా నిశ్చితాభిప్రాయం. ఓసారి అదే మాట నేను ఓ కొలీగ్ తో అంటే, ‘నీకో విషయం తెలుసా? ఏదో జన్మలో మనం రుణపడి ఉన్నవాళ్ళే ఈ బిచ్చగాళ్ళు. ఈ జన్మలో ఇలా ఆ బాకీ తీర్చుకుంటున్నామన్నమాట!’ అంటూ నవ్వేసాడు. అతని లాజిక్ నాకు నచ్చలేదు.
ఎమ్బీయే పాసై ఓ ఆడిట్ ఫర్మ్ లో పనిచేస్తున్నాను నేను. డిగ్రీ చేతికి రాగానే ఉద్యోగం దొరకడమే అదృష్టమనుకుంటే, నెలకు పాతికవేల జీతం. నా కుటుంబపు ఆర్థిక పరిస్థితికి అది చాలా ఎక్కువే. ఉద్యోగంలో చేరి మూణ్ణెల్లయింది.
నా తల్లిదండ్రులు రాజమహేంద్రవరంలో ఉంటారు. నాన్న ఆటోరిక్షాని నదుపుతుంటాడు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ కి వచ్చాను నేను. ఓ వర్కింగ్ మెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. అక్కడ నుండి ఆఫీసుకు డైరెక్ట్ బస్ సర్వీస్ లేనందున కొంతవరకు సిటీ బస్ లో వచ్చి, అక్కడ నుండి సుమారు కిలోమీటరు దూరం నడవవలసియుంటుంది. ఆ మధ్యలోనే ఆ వీధి తగులుతుంది.
మొదటినెల జీతం అందుకోగానే అమ్మ, నాన్నలను నా దగ్గరకు వచ్చేయమన్నాను. వాళ్ళు ఇక కష్టపడనవసరంలేదనీ, విశ్రాంతి తీసుకోమనీ చెప్పాను. తమకు ఉన్న ఊరే బావుంటుందనీ, కష్టమనిపించినప్పుడు తామే వస్తామనీ అన్నారు…
ఓ రోజున ఆ ముసలి బిచ్చగత్తె చంటిపిల్లను పట్టుకుని నా వెంట పడింది. పిల్ల గుక్కపట్టి ఏడుస్తోంది. రెండు రోజులుగా దీని కడుపులో పాలు పడలేదు బాబూ! ఆకలితో చచ్చిపోతుందేమోనని బయంగా ఉంది. దరమం సెయ్ బాబూ! సచ్చి నీ కడుపున పుడతాను అంటూ ప్రాధేయపడింది. చిరాకు వేసింది నాకు. తప్పించుకుని పరుగులాంటి నడకతో ముందుకు సాగిపోయాను.
వీళ్ళకు మనం ఏదో రుణపడివున్నట్టు వెంటపడి జలగల్లా విడిచిపెట్టరు సార్! అన్నాడు నా పక్కనే నడుస్తున్న ఒకతను. కొందరు ఆగి ఆ పిల్లను, ముసలిదాన్ని తమ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసారు, అదేదో కళాఖండం అయినట్టు! బహుశః ఆ ఫోటోని ఏదో పత్రికకు పంపి అచ్చులో తమ పేరు చూసుకుని మురిసిపోవడానికేమో! ఐతే ఒక్కరూ ఆ ముసలిదాని చేతిలో డబ్బులు పెట్టినట్టు కనిపించలేదు.
ఆఫీసులో కూర్చున్నానన్న మాటే కాని, నా మనసు పని మీద లగ్నం కావడంలేదు. ఎన్నడూ లేనిది, ఆ సంఘటనే గుర్తుకు వస్తోంది. పసిదాని హృదయవిదారకమైన ఏడ్పు, ముసలిదాని వేడుకోలు చెవుల్లో మ్రోగుతున్నాయి. ఒకవేళ జాలిపడి ఓ పది రూపాయలు ఇచ్చినా, ముసల్ది దాన్ని నిజంగానే పసిదాని పాలకోసం వెచ్చిస్తుందో, లేక కొంగున ముడివేసుకుంటుందో చెప్పడం కష్టమని సరిపెట్టుకోజూసాను.
ముందే నుడివినట్టు, బిచ్చగాళ్ళను ప్రోత్సహించడం నాకు ఇష్టం ఉండదు. మనిషి శ్రమించి తన ఆహారం తానే సంపాదించుకోవాలి – పక్షులు, జంతువులలా. ఊరకే లభించిన తిండి వారిని సోమరిపోతులను చేస్తుందన్నది నా నిశ్చితాభిప్రాయం. తిరుపం ఎత్తడాన్ని అరికట్టవలసింసిగా న్యాయస్థానాలు సైతం పలుమార్లు ప్రభుత్వాలను ఆదేశించడం కద్దు. ఆ దిశగా ప్రభుత్వాలు పెద్దగా చర్యలు తీసుకున్నట్టు కనిపించదు. కనికరమో, ఒక రూపాయితో పుణ్యం ఆర్జించుకోవాలన్న అత్యాశో తెలియదుకాని, బిచ్చం వేసేవారి సంఖ్య ఎక్కువే.
ఆరోజు నేను ఆఫీసు నుండి బైట పడేసరికి రాత్రి దాదాపు తొమ్మిది గంటలు అయిపోయింది. సాధారణంగా ఆ సమయానికి పేవ్మెంటు మీది బిచ్చగాళ్ళు అదృశ్యమయిపోతుంటారు…ముసలమ్మ కూడా గూటికి చేరుకున్నట్టుంది. మర్నాడు నా సిద్ధాంతానికి తాత్కాలికంగా ముసుగు కప్పి పసిదానికోసం ఆ ముసలిదానికి బిచ్చం వేయాలని నిశ్చయించుకున్నాను.
మర్నాడే కాదు, వరుసగా రెండు రోజులపాటు ముసలిదాని స్థానం ఖాళీగా ఉంది. బహుశః ఏ గుడి ముంగిటకో మకాం మార్చేసియుంటుందనిపించింది. అయినా మనసు ఉండబట్టలేక, ఆమె పక్కను కూర్చునే ముసలాణ్ణి అడిగాను, ‘ఆమె కనిపించడంలేదేమని’. అతను చెప్పింది ఆలకించి చలించిపోయాను నేను.
‘మూడు రోజుల క్రితం పసిబిడ్డ ఆకలితో చచ్చిపోయింది. అప్పట్నుంచీ ఆమె అక్కడకు రావడంలేదు’.
చంటిపిల్ల ఆకలితో చచ్చిపోయిందనేసరికి నా మది విలవిల్లాడిపోయింది.
వారి వయసులు చూస్తే ఆ పిల్ల ఆమె బిడ్డలా లేదు. అడుక్కోవడం కోసమని ఎవరి పిల్లనైనా అద్దెకు తీసుకువచ్చిందా? అడిగాను ముసలాణ్ణి. ‘నేదు బాబూ!’ అంటూ అతను చెప్పిన సంగతులు నన్ను నిర్ఘాంతపరచాయి.
‘ఆ ముసలిదాని పేరు రాములమ్మ. ఆ బిడ్డ ఆమె బిడ్డ కాదు. అలాగని అద్దెకూ తీసుకురాలేదు. ఆర్నెల్ల క్రితం ఎవరో – ఆడపిల్ల అని కాబోలు – అప్పుడే పుట్టిన పసిగుడ్డును రోడ్ పక్కను తుప్పల్లో పడేసారు. కాలు మడచుకోవడానికి అటువైపు వెళ్ళిన రాములమ్మ ఏడుస్తూన్న పసిగుడ్డును చూసింది. దాన్ని ఎత్తుకుని, దాని తాలూకువాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని చుట్టుపక్కల వెదికింది. ఎవరూ కనిపించలేదు. రాములమ్మ మొగుడు కూడా బిచ్చగాడే. ఆ పిల్లను ఎక్కడనుంచి తెచ్చిందో అక్కడే వదిలేసి రమ్మన్నాడు అతను. ఆమె అందుకు ఒప్పుకోలేదు.
తమవి ముష్టి బతుకులు. తమతో ఉంటే ఆ పిల్లకూ అదే గతి పడుతుందని, ఎవరైనా పెంచుకుంటారేమోనని చూసింది. ఎవరూ ముందుకు రాలేదు. ఓ సెక్యూరిటీ ఆఫీసర్ జవాను కనిపిస్తే పిల్లను గురించి చెప్పింది. ‘పిల్లను ఎక్కణ్ణుంచి ఎత్తుకొచ్చావే ముసలిముండా? పద, స్టేషన్ కి’ అంటూ రాములమ్మను బూతులు తిట్టి, కొట్టాడు జవాను. జెయిల్లో పెడతారన్న భయంతో, రాములమ్మ మొగుడు తాను దాచుకున్న వందరూపాయల నోటును ఆ జవానుకు సమర్పించుకుని కాళ్ళు పట్టుకున్నాడు. డబ్బులు తీసుకుని పచ్చిబూతులు తిడుతూ వెళ్ళిపోయాడు జవాను.
రాములమ్మ మొగుడు పెళ్ళాన్ని తిట్టి, పిల్లను వదిలేసి రమ్మన్నాడు. పసిగుడ్డును కుక్కలు చంపేస్తాయని ససేమిరా అందామె. ఇద్దరి మధ్యా పెద్ద గొడవే జరిగింది. కోపంతో దాన్ని చితగ్గొట్టి, తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయాడు మొగుడు. ఐనా రాములమ్మ బెసగలేదు. సెక్యూరిటీ ఆఫీసర్ కాన్ స్టబుల్ తో ఐన చేదు అనుభవంతో, మళ్ళీ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్ళడానికి భయపడింది. ఆ పిల్లను పెంచుకునేవారు దొరికేంత వరకు దాన్ని తానే సాకడానికి నిశ్చయించుకుంది.
నానాటికీ ముసలిదానికి బిచ్చం దొరకడం గడ్డు అయిపోయింది. మొగుడు వదిలేసాడు. తృణమో పణమో దొరికితే తన కడుపు మాడ్చుకుని పసిదానికి పాలు కొని పోసేది. చూస్తుండగానే ఆర్నెల్లయిపోయింది. ఆ పిల్ల రాములమ్మ బిడ్డ అయిపోయింది. అది ఏనాటి బంధమో!... సరైన తిండిలేక ఇద్దరూ చిక్కి శల్యమయ్యారు. తన నిర్ణయానికి రాములమ్మ ఎన్నడూ విచారించలేదు. ఆమె బెంగంతా, తాను చనిపోతే ఆ పసిగుడ్డు ఏమయిపోతుందోనన్నదే!...’
నా మనసంతా మెలిపెట్టేసినట్టయింది – ఆ వాస్తవ చిత్రం కళ్ళముందు కదలాడుతుంటే…ముష్టిదైనా ఆమెది గొప్ప మనసు! కన్నవారే కాదనుకున్న…తనకు ఎటువంటి సంబంధమూలేని…ఓ పసిబిడ్డ కోసం మొగుడితో తెగతెంపులు చేసుకుంది. పేగుబంధం కాకపోయినా, తన పేగులు మాడ్చుకుంది.
ఆ రోజు ఆమె అంతగా ప్రాధేయపడుతుంటే పారిపోకుండా నేను డబ్బులు ఇచ్చివుంటే పసిపాప ప్రాణాలు నిలిచేవేమో! దాని మరణానికి నేనూ ఓ కారణం అనిపించింది. అపరాధభావన నా గుండెల్లో ముల్లులా గ్రుచ్చసాగింది.
ఓ వారం తరువాత – రాములమ్మ మళ్ళీ యధాస్థానంలో కనిపించింది. ఒంటరిగా, నిర్జీవప్రతిమలా కూర్చుంది. మునుపటి చురుకుదనం కానరావడంలేదు మనిషిలో. జీవంలేని కళ్ళతో ఎటో చూస్తోంది. ఆమె ముందు పరచబడియున్న గుడ్డ మీద కొన్ని చిల్లర నాణాలు ఉన్నాయి.
ఆమెను చూస్తే జాలివేసింది నాకు. దగ్గరగా వెళ్ళి పదిరూపాయల నోటు ఒకటి ఇవ్వబోయాను. తీసుకోలేదామె. నావంక శూన్యంగా చూసింది. మౌనంగా నోటును గుడ్డపైన వేసాను…రోజూ ఆఫీసుకు వెళుతూ ఆమె దగ్గరకు వచ్చేసరికి పసిపాప గుర్తుకువచ్చి తెలియకుండానే నా గుండె బరువెక్కేది.
మరో వారం
రోజులు గడచాయి. ఓ రోజున ఉదయమే బైలుదేరి ఓ క్లయెంట్ దగ్గరకు వెళ్ళి, మధ్యాహ్నం ఆఫీసుకు తిరిగి వెళుతున్నాను నేను. బిచ్చగాళ్ళు ఉండే చోట జనం గుమిగూడి ఉన్నారు. ఏమయిందా అని వెళ్ళి చూస్తే – రాములమ్మ శవం పడివుంది!
ఉదయం పదకొండు గంటల సమయంలో ఉన్నట్టుండి పడిపోయిందట. డాక్టర్ని తీసుకువచ్చేసరికే ప్రాణం పోయిందట.
ఓ బిచ్చగత్తె మరణం ఎవరినీ పెద్దగా కదలించకపోవడంలో వింతలేదు. శవాన్ని తీసుకు వెళ్ళేందుకు మునిసిపాలిటీవాళ్ళకు తెలియపరచారట. కుతూహలంతో గుమిగూడినవారు కొందరైతే, శవాన్ని సెల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసేవారు మరికొందరు!
రాములమ్మ శవాన్ని చూస్తుంటే ఆమె గురించి నేను తెలుసుకున్న సంగతులు నా మదిలో ఝుమ్మన్నాయి. ఆ క్షణంలో నాలో ఏదో కదలిక. విచిత్రంగా! బిచ్చగాళ్ళను గర్హించే నాకు…ఆ దయామయురాలి శవాన్ని అనాథప్రేతంగా మునిసిపాలిటీవాళ్ళకు అప్పగించడానికి మనసు ఒప్పలేదు. అప్పటికప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేసాను.
నా నిర్ణయాన్ని ఆలకించి కొందరు తెల్లబోతే, మరికొందరు పిచ్చివాణ్ణి చూసినట్టు చూసారు. ఇంకొందరు, ‘ముష్టిదాని కోసం నీ సొమ్ము, సమయము వేస్ట్ చేసుకోవడం తెలివితక్కువతనం, బ్రదర్!’ అంటూ హెచ్చరించారు. రాములమ్మ శవానికి నేను దహనకాండ జరుపబోతున్నట్టు తెలియగానే బిచ్చగాళ్ళంతా హర్షం వ్యక్తం చేసారు.
నేను డబ్బులు ఇవ్వడంతో చకచకా అవసరమైన ఏర్పాట్లు చేసేసారు బిచ్చగాళ్ళు. సమీపంలోని స్మశానవాటికకు రాములమ్మ పాడె తరలించబడింది. ఆమెకు తలకొరివి పెట్టడానికి నేను సిద్ధపడడం మరింత అచ్చెరుపాటుకు గురిచేసింది అందరినీ. చితిపైన ఉన్న రాములమ్మను నా సెల్ లో ఫోటో తీసాను. అప్రయత్నంగానే ఆమె కాళ్ళకు దణ్ణం పెట్టి చితికి నిప్పంటించాను. అది ఏనాటి రుణమో!?
మనసు బావుండక మూడు రోజులు ఆఫీసుకు సెలవు పెట్టాను. రాములమ్మ అస్థికలను సేకరించి ఓ ముంతలో వేసి ఆ వాటికలోనే భద్రపరచాను…
ఆఫీసుకు వెళ్ళి వస్తున్నానే కాని, ఇదమిద్ధమని తెలియని అశాంతి నాలో. హఠాత్తుగా అమ్మ మీద ధ్యానమారింది. వారం రోజులు సెలవు పెట్టి, రాములమ్మ అస్థికలతో ఇంటికి బైలుదేరాను.
రాజమహేంద్రవరంలో రైలు దిగగానే తిన్నగా కోటిలింగాలరేవుకు వెళ్ళి రాములమ్మ అస్థికలను గోదావరిలో కలిపేసి నమస్కారం చేసాను.
హఠాత్తుగా వచ్చిన నన్ను చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. అమ్మను చూడగానే దుఃఖం ముంచుకువచ్చింది నాకు. ఒడిలో తల పెట్టుకుని భోరుమన్నాను.
అమ్మ చలించిపోయింది. ఏం జరిగిందిరా, కన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? అనడిగింది కంగారుగా, నా తల నిమురుతూ.
జరిగిందంతా పూస గ్రుచ్చినట్టు చెప్పాను. నేను తప్పు చేసానా, అమ్మా? అనడిగాను బేలగా.
నన్ను తన గుండెలకు హత్తుకుని నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంది అమ్మ. నువ్వు చేసిన మంచిపనికి గర్విస్తున్నానురా, శివా! ఓ అనాథప్రేతానికి దహనసంస్కారం జరపడం పుణ్యమే. నీ మనసు సున్నితమైనది. అందుకే దిగులు చెందుతున్నావు. చావుపుట్టుకలు మన చేతుల్లో లేవు. పసిదాని మరణానికి, ముసలమ్మ చావుకు నువ్వు కారకుడివి కావు. నీ చేతుల్లో గౌరవంగా సాగిపోవడానికి ఆ వృద్ధురాలు పుణ్యం చేసుకుంది అంటూ ఓదార్చింది.
అప్పుడుగాని నా మది కుదుటపడలేదు. నా సెల్ లోని రాములమ్మ ఫోటోని అమ్మకు చూపించాను.
కొద్ది క్షణాలపాటు ఆ ఫొటో వంక తేరిపారజూసింది అమ్మ. తన ముఖంలో ఆశ్చర్యం ద్యోతకమయింది. ఈమె పేరేమిటో తెలుసా? అనడిగింది. చెప్పాను.
లేచి పడగ్గదిలోకి వెళ్ళింది. పాత ట్రంకుపెట్టెను తెరచి దేనికోసమో వెదకింది. కాసేపటికి పాత ఫొటో ఒకటి పైకి తీసింది…ఆ ఫోటోను చూసిన నా భ్రుకుటి ముడివడింది…ఓ యువతి ఫొటో అది. ఆమె ఎడమ చెంప పైన అంగుళం మేర నల్లటి పుట్టుమచ్చ! ఫోటో క్రింద, ‘రాములమ్మ’ అన్న వెలసిపోయిన అక్షరాలు, పాతికేళ్ళ క్రితపు తేదీ ఉన్నాయి…అయోమయంగా అమ్మ ముఖంలోకి చూసాను.
అమ్మ ఓ నిట్టూర్పు విడచి, చెబుతుంటే నోరు తెరచుకుని ఆలకిస్తూ ఉండిపోయాను…’పాతికేళ్ళ క్రితపు మాట అది. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలరేవు దగ్గర రాములమ్మ అనే ముప్పయ్యేళ్ళ యువతి అడుక్కునేది. ఓ రోజున ఆమెకు చెత్తకుండీలో రెండు రోజుల పసిబిడ్డ కనిపించింది. కన్నతల్లి మగబిడ్డనే వదలుకున్నదంటే, ఏదో బలమైన కారణమే ఉండివుంటుందనుకుంది. పసివాణ్ణి వికలాంగుణ్ణి చేసి అడుక్కుందామన్నాడు రాములమ్మ మొగుడు. వాడి ఒత్తిడికి లొంగలేదు ఆమె. ఎవరైనా పెంచుకుంటే ఇచ్చేయాలని ప్రయత్నించింది.
ఆటో డ్రైవర్ అప్పలరాజు దంపతులకు పెళ్ళై మూడేళ్ళైనా సంతానం కలుగలేదు. రాములమ్మ దగ్గర ఉన్న బిడ్డ సంగతి తెలిసి పెంచుకునేందుకు ముందుకు వచ్చారు దంపతులు. ప్రతిఫలంగా కొంత సొమ్ము ఇవ్వబోతే, ‘నేను బిడ్డను అమ్ముకోవాలనుకోలేదు. వాడికో అమ్మను ఇవ్వాలనుకున్నానంతే!’ అంటూ తిరస్కరించింది రాములమ్మ. మున్ముందు ఎటువంటి గొడవలూ రాకుండా రాములమ్మ ఫొటో తీయించి, ఆమె పేరు, పిల్లాణ్ణి తీసుకున్న తేదీ రాసి జాగ్రత్తగా దాచివుంచారు. ఆ పిల్లాణ్ణి ప్రేమతో పెంచుకున్నారు. ఆ బిడ్డ మీద వాత్సల్యం తగ్గిపోకూడదన్న ఆలోచనతో, తమకు సంతానం కలుగకుండా జాగ్రత్తపడ్డారు…’
అమ్మా…!? నిర్ఘాంతపోయాను నేను. నేను…నేను…మీ కన్నబిడ్డను కానా, అమ్మా?
ప్రేమగా నా తల నిమిరింది అమ్మ. కనకపోయినా, నువ్వు మా కంటిపాపవురా, కన్నా! ఆనాడు రాములమ్మ మాకిచ్చిన బిడ్డవు నువ్వే! ఈ రహస్యం ఇన్నాళ్ళూ నీకు తెలియకుండా దాచాము మేము. కాని, రాములమ్మ ఔన్నత్యం నీకు తెలియాలనే ఇప్పుడు బైటపెట్టాను… అంది. కొన్నేళ్ళ క్రితం బిచ్చగాళ్ళు కొందరు రాజధానికి తరలిపోయారని ఆలకించాను. వారిలో రాములమ్మ, దాని మొగుడు కూడా ఉన్నారని ఇప్పుడే తెలుస్తోంది… తెలియకుండానే, నీకు ప్రాణభిక్ష పెట్టిన రాములమ్మకు నువ్వు తలకొరివి పెట్టడం విధివిలాసం కాక మరేమిటి!
కన్నతల్లి నన్ను చెత్తకుండీ పాలుచేస్తే, కాపాడి ప్రాణం పోసి ఓ మంచి జీవితానికి పునాది కల్పించిన రాములమ్మ రుణం ఎన్ని జన్మలెత్తితే తీర్చుకోగలను నేను!? బిచ్చగాళ్ళను అసహ్యించుకునే నేను అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్నది ఆ అవినాభావ సంబంధమా…!! రుణానుబంధం అంటే ఇదేనా!?... నివ్వెరపోయాను నేను.
*********

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ