Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
19-09-2019, 10:52 AM
(This post was last modified: 19-09-2019, 12:18 PM by Vikatakavi02. Edited 2 times in total. Edited 2 times in total.)
ఆధ్యాత్మిక చింతన
ఆధ్యాత్మికత... అంటే దైవ చింతన.
అంటే ఏ మతంలో ఉంటే ఆ మతానికి సంబంధించిన దేవుళ్లు, దేవతలను పూజించడం ఆధ్యాత్మిక అని అనుకుంటారు చాలా మంది. అందుకే ఓ దేవుడిని ఎంచుకుని ఆయననే పూజిస్తుంటాం కదా.
అయితే ఈ మతాలకు అతీతంగా భక్తిని ఏర్పరుచుకోగలిగితే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని సాధించినట్టవుతుంది.
మత వర్గాల చర్చ ముగింపుతోనే ఆధ్యాత్మిక చింతన ప్రారంభమవుతుంది. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక స్థితిని చేరుకోగలము. ఓ వ్యక్తి అభివృద్ధి చెందడానికి మొదటి అడుగు మతంగా చెప్పవచ్చు.
ఆధ్యాత్మికం ముక్తికి మార్గం...
ఎప్పుడైతే ఈ మతకట్టుబాట్లను వదిలి ముందుకు సాగుతాడో అప్పుడే అతనికి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముక్తి మార్గానికి ఈ ఆధ్యాత్మిక చింతన ఒక బాటని ఏర్పరుస్తుంది.
ఇక ఈ దారంలో నేను కొన్ని ఆధ్యాత్మిక శీర్షికలను, కథలను, విశేషాలను క్రమముగా పొందుపరిచెదను.
మిత్రులందరూ కూడ తమ వంతుగా తమకు తెలిసిన, విన్న, చదివిన ఆధ్యాత్మిక విశేషాలను ఈ దారము ద్వారా అందరితో పంచుకోగలరు.
గమనిక: మతపరమైన వివాదాలను చర్చించడానికి, విభేదించడానికి ఇది వేదిక కాదు. అటువంటివి తలపుతో ఎవరూ ఈ దారములోకి అడుగుపెట్టవద్దని మనవి చేసుకుంటున్నాను.
సర్వేజనా సుఖినోభవంతు
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
19-09-2019, 12:30 PM
(This post was last modified: 19-09-2019, 12:35 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
'నేను' పోతే...!
భోజ మహారాజు ఒక నాడు తన ఆస్థాన పండితులతో “మోక్షానికి పోగలిగే వాడెవ్వడు” అంటూ ప్రశ్నించారట. కొందరు 'మహా క్రతువులతో పోవచ్చునని మరికొందరు 'జ్ఞానం పొందితే పోవచ్చునని', ఇంకొందరు 'భక్తితో పోవచ్చునని, సత్సంగముతో పోవచ్చునని,' అలా దానితో పోవచ్చు దీనితో పోవచ్చు అంటూ ఒక్కొక్కరు ఒక్కో విధముగా చెప్పుకు పోతున్నారు.
కాళిదాసు లేచి “నేను పోతే పోవచ్చు” అని అన్నాడు.
ఆ మాట తక్కినవారికి చుర్రుమనిపించింది. “ఇతడేనా మోక్షానికి పోయే వాడు” అంటూ ఆక్షేపణలు మొదలయ్యాయి.
కాళిదాసు వెంటనే “మహా ప్రభూ! 'నేను' అనే అహంకారం పోతే, ఎవడైనా సరే పోవచ్చును అన్నాను గాని, నేను పోతానంటు చెప్పలేదండీ” అని సమాధాన మిచ్చాడు.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
రాజుగారు — మూడు ప్రశ్నలు
ఓ దేశాన్ని పాలించే రాజు మనసులో మూడు ప్రశ్నలు ఉదయించాయి. ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు జవాబులు యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు.
తాను మూడు ప్రశ్నలను సంధిస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది.
చాలారోజుల తర్వాత ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు.
రాజాస్థానం చేరుకొన్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు. పశువుల కాపరి, రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేసాడు.
"మహారాజా! చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. కనుక, గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి...
కాబట్టి మహారాజా! మీరు సింహాసనం దిగండి అన్నాడు."
దానికి రాజు ఏమంటాడోనని అందరూ చూస్తుండగా రాజు నవ్వుతూ సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనాన్ని అధిష్ఠించి, "మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు" అన్నాడు.
మొదటి ప్రశ్న
దేవుడు ఎక్కడ చూస్తున్నాడు?
దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు.
వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు.
మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు.
‘‘అన్నివైపులకు చూస్తుంది’’ అని జవాబిచ్చాడు రాజు.
ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మనే.
ఇక రెండవ ప్రశ్న
దేవుడు ఎక్కడ ఉంటాడు?
అన్నాడు రాజు.
‘‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’’ అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు.
‘‘మహారాజా ! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’’ అని అడిగాడు.
‘పాలను బాగా మరుగబెట్టాలి. వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధం అవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’’ అన్నాడు రాజు.
‘సరిగ్గా చెప్పారు మహారాజా! అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, మనస్సు అనే తోడు వేసి, స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది.
ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’’ అన్నాడు కాపరి.
సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.
మూడవ(చివరి) ప్రశ్న
దేవుడు ఏం చేస్తాడు? అని.
నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. క్రింద వున్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు. పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల.
సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు.
సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
నీ దేహం ?
64 లక్షల జీవ కణాలు అత్యంత వేగంగా ఒక తల్లిలోకి ప్రవేశిస్తే అందులో కేవలం ఒకే ఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై మళ్లీ బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటానికి దేవుడిచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..
అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది.
ఈ దేహాన్ని నేనే అంటాం.
కానీ ఎలా?
నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?
ఏ భాగము వినదు.
వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.
చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6 అడుగులు అవుతుంది.
అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.
ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?
ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?
ఎందుకంటే ఈ దేహం నీది కాదు. నీకు ఆదేవుడిచ్చిన పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే.
ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ దేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.
ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో.
రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.
రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.
చివరికి ధరించిన రూపం ఇక్కడే వదిలి వెళ్ళిపోతాం.
ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం ఔతాయి.
రూపానికి ముందు నువ్వున్నావు.
రూపంలో నువ్వున్నావ్.
రూపం వదిలేశాకా నువ్వుంటావు.
ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు.
ఈ దేహం దేవుడిచ్చిన ఓ అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు. ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు. ఈ దేహంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ అయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి, అయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి.
కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్.
ఈశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు!
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
20-09-2019, 11:20 AM
(This post was last modified: 20-09-2019, 11:23 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
ధ్యానం అంటే ఏమిటి?
ఇది ఒక చిన్న పిల్లవాడిని వెంటాడిన ప్రశ్న. ఆ బాలుడు అర్థం చేసుకోగలిగే సరళమైన భాషలో వివరించలేనందున అతని తల్లిదండ్రులు విచారణలో పడ్డారు.
ఒకసారి ఆ కుటుంబం శ్రీ రమణ మహర్షి వారి దర్శనం కోసం వెళ్లారు. అప్పుడు ఆ బాలుడు తన ప్రశ్నను రమణ మహర్షికి అడిగాడు.
శ్రీ రమణ మహర్షి తనలో తాను నవ్వుకున్నారు. అలాగే నవ్వుతున్న ముఖంతో, ఆయన శిష్య గణంలో ఒకరిని వంటగది నుండి ఆ బాలుడికి దోస తెచ్చి వడ్డించమన్నారు.
ఒక ఆకు మీద దోస వడ్డించారు. శ్రీ రమణ గురువు బాలుడి వైపు చూస్తూ,
"ఇప్పుడు నేను 'హ్మ్' అని చెప్తాను
అప్పుడు నువ్వు మాత్రమే తినడం ప్రారంభించాలి. అప్పుడు మళ్ళీ నేను 'హ్మ్' అని చెప్తాను, ఆ తరువాత దోస ముక్కను నీ ఆకు మీద ఉంచకూడదు."
బాలుడు అంగీకరించాడు. అతను నేర్చుకోవాలనే ఉద్దేశంతో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అక్కడున్న మరికొందరు కుతూహలముతో చూస్తున్నారు. ఇప్పుడు బాలుడు శ్రీ రమణ ముఖాన్ని చూసి ఆయన ఆజ్ఞ కొరకు ఆత్రంగా ఎదురు చూశాడు. అతను "హ్మ్" అని ఆజ్ఞాపించగానే బాలుడు తినడం ప్రారంభించాడు. ఇప్పుడు అతని దృష్టి శ్రీ రమణని పై ఉంది. అతను మరల ఆజ్ఞ రాకముందే దోస పూర్తి చేయాలనుకున్నాడు. బాలుడు ఆతృతలో దోస తినడం, దోసని పెద్ద ముక్కలుగా చేసి తినడం చేస్తున్నాడు. కానీ, అన్ని సమయాలలో శ్రీ రమణులపై మాత్రమే దృష్టి ఉంది. ఆకులోని దోస క్రమంగా తగ్గుతోంది. ఒక చిన్న ముక్క మాత్రమే మిగిలి ఉంది. బాలుడు రెండవ ఆజ్ఞ కోసం శ్రీ రమణుల వైపు ఆత్రుతగా చూస్తున్నాడు. అతను ఆజ్ఞాపించిన క్షణం, బాలుడు వెంటనే దోసను నోటిలో పెట్టాడు.
ఇప్పుడు శ్రీ రమణులు ఆ బాలుడిని అడిగారు. "ఇప్పటివరకు నీ దృష్టి ఎక్కడ ఉంది? నా మీద లేదా దోస మీద?"
బాలుడు "రెండింటి మీద" అని బదులిచ్చాడు
శ్రీ రమణుల "అవును. నీవు దృష్టిని నా మీద ఉంచుతూ దోస పూర్తి చేయడంలో నిమగ్నం ఆయి ఉన్నావు కనుక నీవు అస్సలు పరధ్యానం చెందలేదు.
ఇలాగే మీ రోజువారీ కార్యకలాపాలను చేస్తూ మీ దృష్టి మరియు ఆలోచనలు దేవునిపైన ఉంచాలి. దీనినే ధ్యానం అంటారు."
Posts: 138
Threads: 3
Likes Received: 53 in 43 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
(21-09-2019, 07:55 PM)oxy.raj Wrote: excellent
ధన్యవాదాలు మిత్రమా...
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
ఉర్వారుక మివ బంధనం అంటే.....
ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు. పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు. అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లిపోతారు. ‘త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే. ‘జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో...ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో. ఆట ముగిసే సమయానికి, వాటిని అదేవిధంగా సునాయాసంగా తెంచుకో’ అని ఆ మంత్రం బోధిస్తుంది. వాటికి, మనిషికి మధ్య ముడి ‘ఉర్వారుక మివ బంధనం’లా ఉండాలంటుంది. పచ్చి దోసకాయ ముచికకు, దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే- ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది. అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి.
అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకొని ఉంటాడు. పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు. దోసపండు మిగలముగ్గేనాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది. అప్పడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది. ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచుకోగలిగితే, ‘ఈ ఆత్మ నిత్యం’ అని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర మహోపదేశం! ‘దేహం వీడి వెళుతున్నాను’ అనేది అసురీ భావం. ‘అద్దె గృహాన్ని వీడుతున్నాను’ అనేది అమృత భావన! అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది. మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది. అందుకే దాన్ని ‘జీవన్ముక్తి’ అంటారు...
|| ఓం నమః శివాయ ||
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
లక్ష్మణ దేవర నవ్వు!
అది రావణుని సంహరించిన తరవాత కపి సైన్యంతో విభీషణ, అంగద, సుగ్రీవులతో, సీతా లక్ష్మణులతో అయోధ్య చేరి రామ పట్టాభిషేకం జరుపుకుంటున్న సందర్భం.
పట్టాభిషేకం అట్టహాసంగా జరుతోంది. రాముని పక్కనే సింహాసనానికి దగ్గరగా నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. ఆ పరిస్థితులలో లక్ష్మణుడు ఒకసారి దీర్గంగా చిరునవ్వు నవ్వేడు. లక్ష్మణ దేవర నవ్వినది అందరూ చూశారు. ఆ సందర్భంగా సభలో ఉన్న ఒక్కొకరు ఒక్కో విధంగా అనుకున్నారా నవ్వు చూసి.
'ఆనాడు రాముని అడవులపాలు చేసి, భర్తను చంపుకుని, భరతునిచే తిట్లు తిని, నేడు అందరికీ ఆహ్వానం పలుకుతోందని, నా గురించే నవ్వేడా?' అనుకుందిట కైక.
సుగ్రీవుడు, 'అన్నను చంపించి రాజ్యాన్ని సంపాదించాడని నన్ను చూసినవ్వేడేమో' అనుకున్నాడట.
'తండ్రి ని చంపించిన పిన తండ్రి పంచ చేరినందుకు ఆక్షేపిస్తున్నాడా' అనుకున్నాడట అంగదుడు.
'ఇంటి గుట్టు చెప్పి అన్నను చంపుకుని రాజ్యం సంపాదించుకున్నానని ఎగతాళీగా నన్ను చూసినవ్వేడా' అనుకున్నాడట విభీషణుడు.
'రాముడి బాణాలను తండ్రి వాయుదేవుని అనుగ్రహంతో వక్ర మార్గాన నడిపించానని పరిహాసం చేస్తున్నాడా' అని హనుమ అనుకున్నాడట.
'బంగారు లేడిని తెమ్మన్ని కోరినందుకు నవ్వుకుంటున్నాడేమో' అనుకుందిట సీత.
''బంగారు లేడి ఉండదని తెలిసీ భార్య కోరిక తీర్చడానికి బయలుదేరి వెళ్ళి చిక్కులలో పడినందుకు నవ్వుతున్నాడా' అని శ్రీరాముడు అనుకున్నాడట.
తనకులాగే అందరి మనసుల్లోనూ నెలకొన్న అనుమానాలను గ్రహించిన రాముడు, తమ్ముడి నవ్వు విశేషార్ధాలకు దారి తీస్తుందని లక్ష్మణుని "ఏందుకు నవ్వేవు సోదరా?” అని అడిగాడు. దానికి లక్ష్మణదేవర “అన్నా! అరణ్యవాసములో సీతారాముల సేవలో ఏమరుపాటు లేకుండేందుకుగాను నిద్రాదేవిని ఒక వరం అడిగాను. నన్ను వనవాస సమయంలో పదునాల్గు సంవత్సరాలూ ఆవహించవద్దని.! దానికి నిద్రాదేవి అనుగ్రహిస్తూ ‘పదునాలుగేళ్ళయిన తరవాత నిన్ను ఆవహిస్తానని’ వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆవహించని నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో నన్ను ఆవహిస్తానని వచ్చింది. దానితో నిలబడే ఒక చిన్నకునుకు తీశానన్నయ్యా! నిద్రాదేవి మరచిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు నేను నవ్వేను, మరేమీ కాదు” అన్నాడు.
దానితో అందరూ తమతమ మనసులలో అనుకున్నది నిజం కాదని అనవసరంగా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నామనుకుని నవ్వుకున్నారట.
అందరి మన్సులూ తేలికపడ్డాయి.సమయమూ సందర్భమూ కాని నవ్వు అపార్ధాలకి దారి తీస్తుంది కదా! తస్మాత్ జాగ్రత!!!
జై శ్రీరాం
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
అన్నం పరబ్రహ్మ స్వరూపం
అన్నం గురించి ఓ ఉపాఖ్యానం వుంది.
అన్నం వండేవారు ఏ మనస్సుతో, ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద , దాన్ని తినేవారి మీద కూడా ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వంట చేసేవారు కనీసం దాని రుచిని ఆఘ్రాణించను కూడా ఆఘ్రానించరు. అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవెద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల దాన్ని దేవుడు ఆరగించటంవల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది.
వంట చేసేవారు కోపంగా, విసుగ్గా వంట చేస్తే, ఆ వంటకాలకు సరైన రుచి రాకపోగా, దాన్ని భుజించిన వారి మనస్సు కూడా కోపతాపాలకు నిలయమవుతుంది. అందుకే వంట చేసేటప్పుడు ఆ వంట చేసేవారు మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా వంటచేస్తే, దానికి రుచితోపాటు ఆ వంట తిన్నవారి మనస్సులు సంతోషంగా వుంటాయన్నది పూర్వూకుల విశ్వాసం.
లోకంలో మానవులు దాత, అదాత అని రెండు రకాలుగా వుంటారు. ఇతరులకు అన్నం దానం చేసి తాను తినేవాడు దాత. ఇతరులకు దానం చేయకుండా విషపూరితమైన అన్నాన్ని తినేవాడు అదాత. దాతకు కాలంతరాన అన్నం లభిస్తుంది. అదాతకు కాలాంతరాన అన్నం లభించకపోగా, అగ్ని నశింపచేస్తాడని తైత్తిరీయబ్రాహ్మణం వివరిస్తుంది.
ఇతరులకు అన్నం పెట్టకుండా తానే తింటే, ఆ అన్నం విషంతో సమానం. దాత, అదాత ఇద్దరూ అన్నసంపాదనకు ప్రయత్నిస్తారు. కాని దాత ఇతరులకు దానం చేయడం కోసం అన్నం సంపాదిస్తాడు. అది ఉత్కృష్టమైనది. అదాత తాను తినడంకోసమే సంపాదిస్తాడు. అతను పాపాత్ముడు అని శ్రుతి పేర్కొంటోంది.
అన్నం దేవతే కాకుండా మృత్యురూపమైంది కూడా. మనం తినే అన్నాని బట్టే మనకు రోగాలు, ముసలితనం లభిస్తాయి. అన్నమే సంతానోత్పత్తికి కారణమని కూడా చెపుతుంది ఆయుర్వేదం. కాబట్టి ఇంత మహిమగల అన్నం ఇతరులకు పెట్టకుండా తాను మాత్రమే తినేవాడు ఒక రకంగా విషాన్ని భుజిస్తున్నట్టే.
యజ్ఞయాగాది క్రతువుల్లో అగ్నికి ఆహుతి చేసే అన్నం 'మేఘం' అవుతుంది. అన్నమే మేఘం. సూర్యుడు తన కిరణాలచే భూమిమీదున్న నీటిని స్వీకరించి ఔషధులను, అన్నాన్ని సృష్టిస్తున్నాడు. ఆ అన్నంతోనే ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. శరీరం బలాన్ని సంపాదిస్తుంది. ఆ బలంతోనే తపస్సు చేయగలుగుతున్నారు.
పరిశుద్ధమైన, ఏకాగ్రమైన మనస్సుగలవారికి తపస్సు సత్ఫలితాలనిస్తుంది. ముందు మేధస్సు, తర్వాత శాంతి, జ్ఞానం, విజ్ఞానం, ఆనందం, పరమానందం లభిస్తాయి.
కాబట్టే ఇన్నింటినీ సమకూర్చే అన్నదానం వల్ల సర్వ వస్తువులనూ దానం చేసిన ఫలితం వస్తుంది.
సృష్టిలోని సమస్తమైన దానాల్లో అన్నదానం శ్రేష్ఠమైనదిగా పేర్కొనబడినది. మనం ఏం దానమిచ్చినా... ధనం, బంగారం, విద్య, ఇంకేదైనా సరే పుచ్చుకునేవారికి తృప్తినీయదు. ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ఐతే, ఒకరికి అన్నం పెట్టామంటే కడుపు నిండిన తర్వాత వాళ్ళు 'ఇక చాలు' అంటారు. మరికొంత తీసుకోమన్నా వద్దంటారు. అలా అన్నదానం వలన అటు దాతకి, ఇటు పుచ్చుకున్నవాడికీ సంతృప్తి కలుగుతుంది.
ఆకలి అన్నవాడికి అన్నమే పరబ్రహ్మ స్వరూపం! కనుక, అన్నాన్ని దయచేసి వృధా చేయకండి. చేయనీకండి. చేతనయినంత వరకు ఆకలన్నవాడికి పట్టెడన్నం పెట్టేందుకు ప్రయత్నించండి.
సర్వేజనా సుఖినోభవంతు
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
హోమం విశిష్టత:
ప్రతి మనిషికీ ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. నిజమే కానీ, కేవలం మన కోసమే మనం బ్రతకడంలో అర్ధం లేదు. తోటివారి శ్రేయస్సును కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. అందరూ బాగుంటేనే, మనమూ బాగుంటామని గుర్తించి, నడుచుకోవాలి.
మహర్షులు ఎన్నో సందర్సాలలో 'పరోపకారార్ధమిదం శరీరమ్' అని చెప్పారు. చెప్పడమేకాదు, ఆచరణాత్మకంగా చేసి చూపించారు. బహుశా అందుకే కావచ్చు మహర్షులకు వాక్ శుద్ది వుండేది. వారు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం ఎంతో కొంత చేసేవారు. మహర్షులు మాట్లాడేది తప్పకుండా జరిగేది. సత్ప్రవర్తన, సత్యవాక్కుల మహత్తు అది.
మహర్షులు వివిధ ప్రయోజనాల కోసం రకరకాల హోమాలు చేసేవారు. తమ ఆశయాలను నేరవేర్చుకునేవారు. ఇక్కడ గమనించవలసింది ఏమంటే మహర్షుల కోరికలన్నీ నేరుగా కానీ, అంతర్గతంగా కానీ ప్రజల కోసమే ఉద్దేశించి వుండేవి. అంటే లోక కళ్యాణం కోసం అన్న మాట! ఆమధ్య శ్రీశైలం దగ్గర జరిగిన హోమం సందర్బంగా ఆకాశంలో పెను పరిమాణంలో పెద్ద శిల నదీ జలాల్లో పడటం, జాలరులు తాటి చెట్టు ఎత్తున పైకి లేవటం పేపర్లలో కూడా వచ్చింది.
హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి వుంటుంది. ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించినదై వుంటుంది. అంటే అన్ని గ్రహాలూ సమతుల్య స్థితిలో వుంటేనే సృష్టి సక్రమంగా వుంటుంది. కొన్నిసార్లు వాతావరణం సానుకూలంగా ఉండదు. వ్యాధులు సోకటం, వరాలు సక్రమంగా పడకపోవటం లాంటివి జరుగుతాయి. ఏ ఒక్క గ్రహానికి సంబంధించిన శక్తి (ఎనర్జీ) భూమిమీద తక్కువగా వున్నా అసమతుల్యతలు ఏర్పడతాయి. అందుకే ఆయా గ్రహాలకు సంబంధించిన మూలికలు, ధాన్యాలతో, ఇతర వస్తువులతో హోమం చేస్తారు. స్థూలంగా ఇదీ హోమం చేయటంలో ఉద్దేశ్యం. హోమ ఫలాలు సమిష్టిగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా అందుకునే విధంగా జ్యోతిష్యవేత్తలు కొన్ని సూచనలు చేశారు. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాలలో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా వుంటే దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేయిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. సూర్య గ్రహ ప్రభావం బాగా తగ్గిపోయి, అదే సమయంలో ఇతర గ్రహాలు కూడా అననుకూలంగా మారితే, ఆ వ్యక్తి అకాల మృత్యువాతన పడవచ్చు లేదా ఆరోగ్య పరంగా తీవ్ర నష్టం జరగవచ్చు. దీనిని నివారించేందుకు సూర్యగ్రహానికి సంబంధించిన శాంతి చేయమని సూచిస్తారు. తరచుగా హోమాలను చేసినట్లయితే ఏ రకమైన ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురుకావు.
హోమాలలో రకరకాల మూలికలు వాడతారు. శని గ్రహం అనుకూలత కోసం శమీ వృక్ష సమిధను, రాహువు కోసం గరిక ఉపయోగిస్తే, సూర్యానుగ్రహం కోసం అర్క సమిధను ఉపయోగిస్తారు. కేతు గ్రహ ఉపశాంతికోసం దర్భను ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టు వ్యాధిని నయం చేసే శక్తి వుంది. శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ మూలికకు వుంది. అలాగే చంద్రగ్రహ శాంతి కోసం మోదుగను వాడతారు. అటు వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింప చేసే శక్తి మోదుగకు వుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రావి చెట్టు కలపను గురు గ్రహోపశాంతి కోసం ఉపయోగిస్తారు. ఇది వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో వుంది. హోమంవల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి, పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుందని అర్థం అవుతుంది. మరో ముఖ్య సంగతి ఏమంటే, హోమ క్రమం గురించి క్షుణ్ణంగా తెలిసినవారు హోమం చేస్తేనే హోమ ఫలం అందుతుంది.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
ఏది నీది?
ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.
దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.
మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!
దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.
మనిషి: ఆ పెట్టెలో ఏముంది స్వామీ?
దేవుడు: నీకు చెందినవి ఈ పెట్టెలో ఉన్నాయి.
మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?
దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి
మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?
దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి
మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!
దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు
మనిషి: నా స్నేహితులున్నారా అందులో?
దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే
మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?
దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు
మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!
దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.
మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?
దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.
మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.
మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.
మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?
దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి.
పశ్చాతాపులను క్షమించాలి.
తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
29-09-2019, 09:40 PM
(This post was last modified: 29-09-2019, 09:45 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
పరోపకారం ఇదం శరీరం
ఒక విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటాము.
భోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము. తిన్న మరుక్షణం విస్తరి ఆకును మడిచి దూరంగా పడేస్తాం. మనిషి జీవితం కూడ అంతే! ఊపిరి పోగానే ఊరిబయట పారేసి వస్తారు.
పారేసినప్పుడు విస్తరాకు ఎంతో సంతోషపడుతుంది. ఎందుకంటే పొయేముందు ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న తృప్తి ఆకుకు ఉంటుంది.
విస్తరాకుకు ఉన్న ముందు ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సేవచేసే అవకాశము వచ్చినపుడు తప్పక చేయండి.
మళ్లీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని వాయిదా మాత్రం వేయకండి. ఆ అవకాశము మళ్లీ వస్తుందని అనుకుంటే మన ఊపిరి కుండ ఎప్పుడైనా పగలవచ్చు. అప్పుడు విస్తరాకుకు ఉన్న తృప్తి కూడ మనకి ఉండదు.
అప్పుడు ఎంత సంపాదించి ఏమి లాభం?
ఒక్కపైసా కూడా తీసుకుపోగలమా?
కనీసం మన ఒంటిమీద బట్టని కూడా మిగలనివ్వరు. వ్యర్ధమైన కట్టెగా మిగిలిపోవాలసి వుంటుంది.
అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించండి. సాటి మనుషులలో భగవంతుణ్ణి చూడండి. వాళ్ళనీ చూడనివ్వండి.
ధర్మో రక్షతి రక్షితః
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
కర్మ
కర్మ సిద్థాంతం చాలా కఠినమైనది. అది ఎవ్వరికీ
అర్థం కాదు. మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది. కర్మను అనుభవించాలి. నిందిస్తే
ప్రయోజనం లేదు. రమణ మహాశయులు కాశీలో ప్రతిదినము గంగా స్నానం కొరకు పోతుండేవారు.
ఆయన వెంట కృష్ణ అను భక్తుడు పోయెడివాడు. ఒకనాడు రమణ మహాశయులు గంగానదికి పోతూ ఉన్నట్టుండి, " కృష్ణా! నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు" అని అన్నారు.
కృష్ణకు అర్ధం కాలేదు. వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు. ఇంతలో ఒక
ఇటుక వచ్చి రమణ మహాశయుల కాలి వేలు
మీద పడినది. కాలి వేలు చితికింది. రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహాశయులు పంచెను చింపమన్నారని గ్రహించాడు .
వెంటనే రమణ మహాశయుల పంచెను కొంచెం చింపి, దెబ్బ తగిలిన చోట కట్టు కట్టాడు. ఆనుకోకుండా జరిగిన ఆ సంఘటను గుర్తించి రమణ మహాశయులతో —
"మహారాజ్ ! ఇటుక వచ్చి మీ కాలివేలు మీద
పడుతుందనే విషయము ముందే మీకు తెలుసు కదా! మరెందుకు ఆ ఇటుక దెబ్బనుంచి తప్పుకోలేదు?" అని ప్రశ్నించారు. అప్పుడు రమణ మహాశయులు నిర్మలంగా నవ్వుతూ " ఆలా జరగదు కృష్ణా ! పక్కకి తప్పుకొంటే, ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే. ఎప్పటి రుణం అప్పుడు తీరిపోవాలి. ఎంత తొందరగా
తీరిపోతే అంత మంచిది!" అని అన్నారు.
కనుక, కర్మ శేషాన్ని ఎవరయినా అనుభవించాలసిందే.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
'మకరతోరణం' అంటే ఏమిటి?
దాని విశేషం ఏమిటి?
దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణ మధ్యభాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనబడుతుంది. దానికే 'మకరతోరణం' అని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణం మధ్యభాగంలో అమర్చటానికి గల కారణము గురించి స్కందమహాపురాణంలో ఒక కథ వుంది....
పూర్వం "కీర్తిముఖుడు" అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేకవరములను పొంది తద్వారా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు పరమశివుని పత్ని అయిన 'జగన్మాతను' కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని అతిభీకరమైన అగ్నిని సృష్టించాడు. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది.
మరణంలేకుండా వరం పొందినా, శివుని ఆఙ్ఞమేరకు ఆబడబాగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలూ తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడేడు. భక్తసులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట మూడవ కన్నుగా ధరించాడు.
ఆ తరువాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదనీ, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు "నిన్ను నువ్వే తిను" అని చెప్పాడు. శివుని ఆనతి మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోకభాగంనుంచి మొదలుపెట్టి కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలాతినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు.
ఆప్రార్ధన ఆలకించిన పరమశివుడు, ఈనాటినుంచి అన్ని దేవతాలయాలలో దేవతామూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్రభాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురఃహంకారాన్ని, ఆశను, తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చాడు.
ఆనాటినుంచి కీర్తిముఖుడు దేవతాలయాలలోని దేవతా విగ్రహాల వెనుక వున్న తోరణామధ్యభాగాన్ని తన రాక్షస మకరముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తున్నాడు. ఈ కారణంగానే దేవతా మూర్తుల వెనుక మధ్యభాగంలో అమర్చబడిన తోరణానికే 'మకరతోరణం' అని పేరు వచ్చింది.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
నమ్మకం ఎవరి పైన?
మనకు ఒక సమయంలో ఎంతో అనందం కలిగించిన వారే మరో సమయంలో ఎంతో బాధ కలిగిస్తూ ఉంటారు. మరి మన ఆప్తుల పట్ల, మన చుట్టు ఉన్న వారి పట్ల మనకు అంచనాలు ఉండడం అందుకు కారణం..
మనకు ఒకప్పుడు ప్రేమ కలిగిన వారి పట్లే మరో సందర్భంలో కోపం, ద్వేషం ఎందుకు కలుగుతున్నాయి..
ఒకసారి, మీరెవరు లేదా మీరేమిటి అన్నదానికి మీరు ఇతరులని ఎవరినైనా కారణంగా భావిస్తే, ఆ వ్యక్తి మీకు తప్పకుండా పలు విధాలుగా ఆశాభంగం కలిగిస్తాడు.
ఏ వ్యక్తీ కూడా 100% మీకు కావలసిన విధంగా ఉండరు. మీ చుట్టూ ఉన్నవారి పట్ల మీ అంచనా ఎంత పెద్దదయితే, అంత ఎక్కువ ఆశాభంగం కలుగుతుంది. వాళ్ళు మీకు ఆశాభంగం కలిగించినప్పుడు లేదా మీరు అనుకున్న విధంగా పనులు కాకపోయినప్పుడు, దాని వల్ల కలిగే మీ బాధకి వారే కారణమని మీరు నిజంగా నమ్మితే, సహజంగానే కోపం వస్తుంది. ఒకసారి కోపం మొదలై క్రమంగా పెరిగిందంటే, అది ద్వేషం అవుతుంది. ద్వేషంతో పనిచేస్తే, అది హత్య అవుతుంది. మీరెవరు అన్నదానికి లేదా మీ జీవితంలో మీరు పొందే అనుభూతులకు ఇతరులు కారణమని మీరు అనుకున్న క్షణం నుండి ఈ ఆట మొదలవుతుంది. .
మొదట్లో ఈ ఆట బాగానే మొదలయ్యుంటుంది. 'ఓఁ..నేను మీవల్ల చాలా ఆనందంగా ఉన్నాను!’ అని మీరని ఉంటారు. కానీ, ఈ ఆట చెడిపోయి మీకు బాధ కలిగించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఇవాళ కొన్ని పనులు చేసి మిమ్మల్ని సంతోషపెట్టాడో, ఆ వ్యక్తే రేపు అతనికి కావాల్సిన కొన్ని పనులు చేసి, మిమ్మల్ని బాధపెడతాడు. ఎందుకంటే మీ అంచనాలను ఏ వ్యక్తీ అందుకోలేరు. ఎవరూ కూడా అందుకోలేరు.
ఈ భూమ్మీద ఉన్న ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా ప్రవర్తించరు. అయినప్పటికీ ఎవరైనా మీరనుకున్నట్లు ప్రవర్తించకపోతే, వారే మీ బాధకు కారణమని అనుకుంటారు. ఎప్పుడైతే మీ బాధకూ, వేదనకూ ఇంకొకరు కారణమని మీరు నమ్ముతారో, అప్పుడు సహజంగానే మీలో కోపం, ద్వేషం కలుగుతాయి.
అందుకే ఒకరిపై మరొకరు ఎక్కువ నమ్మకాలు.. ఆశలు.. పెట్టుకుని ఆధారపడి ఉండకూడదు
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
ఈరోజు వాల్మీకి జయంతి
మనిషిని మలిచిన మహర్షి
ఏనాటి రామకథ... ఇప్పటికీ ప్రాతఃస్మరణీయమే.
ఏం వింటే ధర్మం కరతలామలకమవుతుందో, సత్య స్వరూపం ఆవిష్కృతమవుతుందో, హృదయం ఆనందంతో నిండిపోతుందో... అలాంటి కథకు రూపకర్త వాల్మీకి. కావ్య రూప తపస్సు చేసి మానవ జాతికి మహోపకారం చేసిన మహర్షి ఆయన
తపస్సు అంటే తపించడం. తాననుకున్న లక్ష్యం కోసం కష్టతరమైన సాధన చేసి ఓ లక్ష్యాన్ని చేరుకోవడం. తపస్సు అంటే దహించేది అని కూడా అర్థం ఉంది. అహంకార మమకారాలను, దేహాభిమానాన్ని, హింస, కుటిలత్వం వంటివాటిని దహించడమే తపస్సు.
రామనామాన్ని జపిస్తూ తీవ్ర తపస్సు చేసి, తన పూర్వ కర్మలను అందులో దగ్ధం చేసి రామాయణ మహాకావ్యాన్ని రచించిన మహర్షిగా వాల్మీకి గురించి చెబుతారు.
బోయవాడైన ఈయన రుషిగా మారిన తరువాత ఓ వేటగాడి చేతిలో క్రౌంచ పక్షుల జంటలో ఒకటి మరణించడం చూసినప్పుడు కలిగిన ఆవేదన రామాయణ రచనకు కారణమైందని అంటారు.
మనిషికి పుట్టుకతోనే పితృ రుణం, దేవరుణం, రుషి రుణం అనే మూడు రకాల రుణాలుంటాయి.
రుషులకు ఎందుకు రుణ పడి ఉండాలనే దానికి సనాతన ధర్మం వివరణనిస్తోంది. ఆ రుషులు మానవాళికి మార్గదర్శక సూత్రాల్లాంటి శాస్త్రాలను అందిస్తారు. జాతి హితం కోసం విజ్ఞానాన్ని రూపొందిస్తారు. దీనికోసం అంతులేని తపస్సు చేస్తారు. కాబట్టి మనిషి రుషికి పుట్టుకతోనే రుణపడి ఉండాలి. అలాంటి రుషుల్లో ఒకరు రామాయణకర్త వాల్మీకి మహర్షి.
‘వేద వేద్యే పరే పుంసిజాతే దశరథాత్మజే!
వేదః ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా’
ఈ శ్లోకంలో రామాయణం సాక్షాత్తు వేద సమానమని, ప్రాచేతసుడు దీన్ని రచించాడనే అర్థం కనిపిస్తుంది. భారతీయ సనాతన సంప్రదాయంలో ప్రాచేతస గణం అనే రుషి వంశాలున్నాయి. అందులోనివాడే రామాయణకర్త అయిన వాల్మీకి అని పండితాభిప్రాయం.
జై శ్రీమన్నారాయణ
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
అక్షర శిల్పాలు
కవి చెక్కే అక్షర శిల్పం కావ్యం. విశ్వశ్రేయస్సుకు తోడ్పడేది కావ్యమంటారు పెద్దలు. రుషితో సమానమైనవాడు కవి. ఆయన తన జీవిత సారాన్నంతా అక్షరీకృతం చేస్తాడు. పాఠకులు ఆ గ్రంథం చదవడంతో రచయిత అంతరంగాన్ని దర్శించినవారవుతారు.
బోయవాడు అయిన రత్నాకరుడు దైవానుగ్రహం చేత వాల్మీకి అయ్యాడు. ఆయన చేతిలో రూపుదిద్దుకొన్న అపూర్వ కవితాశిల్పం రామాయణం. వాల్మీకి బాటలోనే వ్యాస మహర్షి భారతమనే మరో ఇతిహాస శిల్పానికి ప్రాణంపోశాడు. ఈ రుషి కవులు ఇద్దరూ ఆయా గ్రంథాల్లో పాత్రలూ అయ్యారు. కవికి భగవదనుగ్రహం కలుగుతుందని వీరి చరిత్రలు తెలియజెబుతాయి. తరవాతి కాలంలో కాళీమాత కృపచేత మహాకావ్య శిల్పిగా పేరుపొందాడు కాళిదాసు. ఆయన రఘువంశం అన్న కావ్యసృజన చేసి రాముడి వంశకీర్తిని గానం చేశాడు. ఆరంభ శ్లోకంలో శివపార్వతులు వాగర్థాలవంటివారని అర్ధనారీశ్వర తత్వాన్ని రమ్యంగా తెలియజెప్పాడు. కుమార సంభవ కావ్యం ద్వారా తారకాసుర వధ కోసం శివుడు గృహస్థుగా మారిన వైనాన్ని వివరించాడు. సంస్కృతంలోని పంచమహాకావ్యాల్లో చోటు పొందినవి ఈ రెండు కావ్యశిల్పాలు. ఉత్తర రామచరితంతో కరుణరసం ప్రాధాన్యాన్ని చాటిచెప్పాడు భవభూతి. దశకుమార చరిత్ర అనే కావ్య శిల్పం నిర్మించి గద్యంలోని అందాన్ని హృద్యంగా ప్రపంచానికి చాటాడు దండి మహాకవి.
కాళిదాసు, భవభూతి, దండిల ప్రతిభా సామర్థ్యాలను ఒక ఐతిహ్యం తెలియపరుస్తుంది. ముగ్గురు మహాకవుల మధ్య ఎవరు గొప్ప అన్న ప్రశ్న తలెత్తింది. కవి పండితుల్లో తామే గొప్ప అన్న భావన ఉండటం సహజం. దాన్నే ధిషణాహంకారం అంటారు. తమ పాండిత్యాన్ని అంచనా వెయ్యగలిగింది ఒక్క సరస్వతీమాతే అన్న నిర్ణయానికి వచ్చి, వాగ్దేవి ఆలయానికి వెళ్ళారు. తమ తగవును తీర్చమని ప్రార్థించారు. సరస్వతి వాక్కు రూపంలో దండి మహాకవి అంటూ తన మొదటి నిర్ణయాన్ని చెప్పింది. భవభూతిని గొప్ప పండితుడంటూ శ్లాఘించింది. ఆమె నిర్ణయాలు విని కాళిదాసు కోపగించుకున్నాడు. మరి నేనెవరినంటూ ప్రశ్నించాడు. ఆ తల్లి చల్లని చిరునవ్వుతో నీవు నేనేనంటూ సమాధానం ఇచ్చింది. కాళిదాసు పురుషుడి రూపంలో ఉన్న సరస్వతి అవతారమని తేల్చింది. సరస్వతీదేవి మెప్పు పొందిన ఆ కవుల కావ్య శిల్పాలు సాహిత్య చరిత్రలో మణిదీపాలు.
నిరుపేద కుటుంబంలో జన్మించిన తెనాలి రామలింగడు అమ్మవారి కరుణకు పాత్రుడైన ఘట్టం సుప్రసిద్ధం. కుమార భారతిగా ప్రఖ్యాతుడైన ఆ మహాకవి ‘పాండురంగ మాహాత్మ్యం’ చక్కటి భక్తి ప్రభోదకం. సరస్వతీ కటాక్షం పొందిన మరొక గొప్పకవి పిల్లలమర్రి పినవీరభద్రుడు. అతడిని మహారాజు నెలరోజుల్లో శాకుంతల కావ్యం రాయమని ఆజ్ఞాపించాడు. ఇరవై తొమ్మిది రోజులపాటు ఘంటం కదల్చలేదు పిన వీరభద్రుడు. చివరి రోజు రాత్రి పూజామందిరం శుభ్రం చేసుకొని కావ్యరచనకు పూనుకొన్నాడు. సరస్వతీ మాత ప్రత్యక్షమైంది. ఎవరూ తనను చూడకుండా తలుపుల్ని వెయ్యమని పిన వీరభద్రుడిని కోరింది. స్వయంగా ఆవిడే ఘంటం పట్టుకుని కవితారచనకు పూనుకొంది. సమయం గడిచేకొద్దీ పిన వీరభద్రుడి అన్న మనసులో ఆందోళన పెరిగింది. తమ్ముడు ఏం చేస్తున్నాడో చూద్దామని తలుపు సందులోంచి తొంగి చూశాడు. బావగారు చూస్తున్నారంటూ పలికి సరస్వతి అంతర్థానమైంది. తక్కిన కావ్యం పిన వీరభద్రుడు పూరించాడు. అనంతర కాలంలో వాణి నా రాణి అంటూ ప్రకటించాడు పిన వీరభద్రుడు.
పై సంఘటనలు నిజం లేదా ఊహాజనితం కావచ్చు. కానీ ఆ మహాకవుల ప్రజ్ఞ తిరుగులేనిది. వారి ఆలోచనా మథనం నుంచి పుట్టిన కావ్య శిల్పాలు మన భారతీయులందరికీ సరస్వతీ సాక్షాత్కారాలు.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
సంస్కరణ
ప్రతీ మనిషికి సంస్కరణ అనేది చాలా అవసరం.
రాతిబండ నేలపై ఉన్నపుడు అందరూ తొక్కుకుంటూ నడుస్తారు. కానీ అదే బండను ఓ దైవ విగ్రహంగా చెక్కినపుడు చేతులెత్తి మెుక్కుతారు.
రెండింటిలో ఉన్నది ఒకే రాతిబండ. కానీ సంస్కరణ వలననే దానికి పూర్వం కన్నా అరుదైన గౌరవం దక్కింది.
జడ వస్తువుకే సంస్కరణ వలన అంతటి విశిష్టత లభిస్తే భగవత్ సృష్టిలో మహా జ్ఞానవంతుడు, భగవత్ సంకల్పంను నెరవేర్చుటలో ముఖ్య పాత్రధారుడైన మానవునికి సంస్కరణ ఎంత అవసరమో, ఎంతటి విశిష్టతను సంపాదించి పెడుతుందో మనం ఆలోచించుకోవాలి.
మంచి ఆలోచనలతో మనసును నింపుకోవాలి. మనసులో మంచి భావాలు కలిగి ఉన్నపుడు మనసు దానికదే భగవంతుని వైపునకు మరలుతుంది.
చిత్తం స్థిరమౌతుంది. మోక్షమునకు ద్వారములు తెరచుకుంటాయి.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
మనస్సు బయటికి వెళితే.. బంధం.
లోపలికి వెళితే.. మోక్షం.!
ప్రాపంచిక మార్గమైన సరే.. పారమార్ధిక మార్గమైన సరే.. మన జీవన గమనంలో బయట.. లోపల ప్రతిబంధకాలు ఉంటాయి. ఇవి సహజం. ఇవన్నీ ఓర్పు , దైర్యం , నమ్మకం , ఏకాగ్రత లాంటి సద్గుణములతో ఎదుర్కొని పయనించినప్పుడే గమ్యమును చేరుకోగలం.
జీవితం లో కష్టాలు, దుఃఖం, ఆవేదన. ఇత్యాదులు అనుభవిస్తేనే.. ఆనందములోని పరిపూర్ణత.. అమృతత్వం అర్ధమౌతాయి. ఇవన్నీ అనుభవిస్తేనే.. మనిషి మనస్సును అదిగమించే ధైర్యవంతుడు కాగలడు. ఇవన్నీ అనుభవించి.. అనుభవించి చివరికి ఆత్మజ్ఞానియై ప్రాజ్ఞుడౌతాడు.
హృదయంలో భగవంతుడు ఉన్నాడని.. తెలిసిన దాని గురించి ఆలోచించం. "ఇదే మాయ." శారీరకంగా.. మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి.
దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ.. ఈ దేహం శిధిలమవ్వకముందే.. హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి. మానవుడు ఆనందం అనుభవించాలంటే.. అతనికి రెండు విషయాలు కావాలి. అవి "ప్రేమ, జ్ఞానం.!" ప్రేమ, జ్ఞానం ఉన్నప్పుడే.. ఏకత్వస్థితి వస్తుంది.
మానవుని నడత నవగ్రహాల మీద ఆధారపడిలేదు. రాగద్వేషాలనే రెండింటి మీదే ఆధారపడి ఉంది. మన ఆలోచనల్లోగానీ.. మాటల్లోగానీ.. పనిలోగానీ రాగద్వేషాలు ఉండకూడదు. అప్పుడే మనస్సులో మాలిన్యాలు తగ్గి.. మనస్సు పవిత్రంగా.. నిర్మలంగా.. నిశ్చలంగా ఉంటుంది.
ఒకోసారి అన్పిస్తుంది - భగవంతున్నే నమ్ముకున్నాను.. ఎన్నెన్నో పూజలు చేస్తున్నాను.. ఎంతగానో ప్రార్ధిస్తున్నాను.. మంచిగా జీవనగమనం సాగిస్తున్నాను.. ఎంతో సాధన చేస్తున్నాను.. అయినా.. నాకెందుకు ఈ కష్టాలు.? అనుకోని సంఘటనలు ఎందుకు నాకెదురౌతున్నాయి.? ఏమిటీ బాధలు..అని.!
అసలు పూజ, సాధన, ప్రార్ధన అంటే ఏమిటి.?
దేవుడిచ్చిన ప్రతీదానిని నిరసనలు లేకుండా, ప్రసాదంలా స్వీకరించడమే.. నిజమైన పూజ.
దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల.. చేస్తున్న వృత్తి పట్ల.. ప్రవృత్తి పట్ల.. ప్రకృతి పట్ల.. మన చుట్టూ ఉన్న ప్రతిదాని పట్ల.. కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ.
అహం.. మనస్సు.. రాగద్వేషాలు నాశనమవ్వడమే.. నిజమైన సాధన.
అంతఃకరణను శుద్ధి చేసుకోవడమే.. సాధన.
సత్కార్యమే.. అత్యుత్తమ ప్రార్ధన. సర్వులయందు.. ప్రేమగా, దయగా ప్రవర్తించడమే.. నిజమైన ప్రార్ధన.
భూమి మీద కొన్ని అనుభవాలు పొందటానికే శరీరం వచ్చింది.
ఆ అనుభవాలు పొందటం ద్వారా.. ఈశ్వరుడు మిమ్మల్ని వివేకవంతులను చేస్తాడు. చెరుకుగడ.. గెడలాగే ఉంటే.. రసం రాదు. దానిని యంత్రంలో (మిషన్లో) పెట్టి పిప్పి చేస్తేనే.. తియ్యటి రసం వస్తుంది. అలాగే మీ దేహం.. అనేక కష్టాలకు గురి అయితే గానీ, దాని నుండి "అమృతత్వం" రాదని "గురువు" అంటారు.
నీకు కష్టాలు వస్తే.. కంగారుపడకు.
నీ ప్రారబ్ధం పోగొట్టడానికీ, నీలో విశ్వాసం పెంచటానికీ కొన్ని కష్టాలు పంపుతాడు. నీకు ఇష్టమైనది చేస్తాడనుకో, గర్వం వచ్చి.. నీవు పాడైపోతావు. నీకు ఏది మంచిదో.. నీకంటే భగవంతుడికే బాగా తెలుసు. నీకు ఇష్టం లేని సంఘటనలు పంపినా, భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అనుకోకు, అన్నీ నీలోపల సౌందర్యం పెంచటానికి, నిన్ను మహోన్నతుడుని చేయటానికి, నీకు శిక్షణ ఇవ్వడానికీ, నీ జ్ఞానం.. పూర్ణం చేయటానికి భగవంతుడు ఇలా చేస్తున్నాడు అని అర్ధం చేసుకోగల్గితే.. నీలో ఆవేదన, ఆందోళన అణిగిపోతుంది. అంతేగానీ,భగవంతుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టకు.
|