Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#23
పరీక్షిత్తు – కలి – ధర్మదేవత :

పరీక్షన్మహారాజు సార్వభౌముడు అయ్యాడు. మహారాజు అయి దేశాన్నంతటినీ కూడా ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. ధర్మరాజు పరిపాలించిన నాడు దేశం ఎంత శోభతో, ఎంత కళ్యాణ ప్రదంగా ఉన్నదో అంత ఆనందంగా ఉన్నది. ఎక్కడ చూసినా మూడు పువ్వులు ఆరుకాయలు. నెలకి మూడు వానలు! ఎక్కడా ధర్మమునకు లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు. తన మేనమామగారయిన ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని వివాహం చేసుకున్నాడు. నలుగురు కుమారులు జన్మించారు. వారిలోని వాడే సర్పయాగం చేసిన జనమేజయుడు. తాను జయించని రాజ్యం లేదు. కురు, పాంచాల, కోసల, కాశి, మల్ల, అంగ, మగధ, మత్స్య, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర మొదలయిన రాష్త్రముల నన్నిటిని జయించాడు. ఏకచ్ఛత్రాధిపత్యంగా విశాలమయిన సామ్రాజ్యమును తన పతాకఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు.

పరీక్షిన్మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాడు. పరీక్షిత్తు యాగములు చేశాడు. పరీక్షిత్తు యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఆయన దేవతలను పిలుస్తుంటే దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చునేవారట! యాగం చెయ్యని వాళ్ళు కూడా ఆ యాగశాలలోకి వచ్చి కూర్చుని, దేవతలు అందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకుని వెళ్ళడం చూసేవారు. అంత నిష్ఠాగరిష్ఠుడై యాగములు చేశాడు. ఆయన దిగ్విజయయాత్రకు వెడుతుంటే, శిబిరము వేసుకుని ఉంటే, ఆయా ఊళ్ళల్లో ఉన్న జానపదులు వచ్చి ‘మహానుభావా’ మీ పెదతాతగారయిన ధర్మరాజుగారు ఇలాగే దిగ్విజయ యాత్రకు వచ్చి శిబిరం వేసుకుని ఉంటే, తరువాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ, శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని, శిబిరం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. కృష్ణుడు మీ తాతలని అంతలా రక్షించాడు. అదే కృష్ణుడు సారధ్యం చేస్తుంటే పాండవ మధ్యముడయిన అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదంతో కృష్ణుడిని డొక్కలో చిన్నగా తన్నేవాడు. తన్నితే కృష్ణుడు వెనక్కి తిరిగి చూసి ఫల్గునా, రధం ఎటు తిప్పాలి’ అని అడిగేవాడు. అర్జునుని పిలిచి ‘బావా’ అని హాస్యం ఆడేవాడు. ‘శ్రీకృష్ణుడు నిజంగా పాండవులను ఎంత ఆదరించాడో! ఒక మహాశివరాత్రి నాడు అర్జునుడు పాలచెంబు పట్టుకుని గబగబా పరుగెడుతున్నాడు. అతనిని చూసి కృష్ణుడు బావా, ఎక్కడికి పరుగెడుతున్నావు?’ అని అడిగాడు. అపుడు అర్జునుడు ‘శివాలయానికి వెడుతున్నాను. ఈవేళ శివరాత్రి. అభిషేకం చెయ్యాలి’ అన్నాడు. అపుడు కృష్ణుడు శివాలయంలోనే ఉన్నాడని అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా’ అని పంచెను పైకి తీశాడు. శ్రీకృష్ణుని మోచిప్పలో శివలింగం కనపడింది. అంత శివకేశవ అభేదం! కృష్ణ భగవానుడి మోచిప్పను చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. ‘నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో?” అంటూ శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి పొంగిపోతాడు. అంతటి మహాత్ముడు.

కృష్ణుడు పాండవులను కంటికి రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడు. పరీక్షిత్తు ఆ కృష్ణ కథలు విని, తన తాతలు కృష్ణుడితో గడిపిన మర్యాదా పురస్కృతమైన విశేషములను విని, కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు, చీని చీనామ్బరములు తెప్పించి పాండవులతో కృష్ణుడు గడిపిన రోజులు గురించి చెప్పిన వాళ్ళందరికీ బహుమానములను ఇచ్చేవాడు. ఆ కృష్ణుని పాదములయందు నిరంతరమూ రమించి పోతూ ఉండేవాడు. అంతటి మహాత్ముడయిన పరీక్షిత్తు పరిపాలిస్తూ ఉండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందముతో ఉన్నది.

పరీక్షిన్మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. అలా చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన చూశాడు. దీనిని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దీనిని మీరు కేవలము ఒక పురాణ కథగా చదివితే దానివలన ఎంత ప్రయోజనము వస్తుంది అంటే మనం చెప్పలేము. ఈ ఘట్టమును మీరు చాలా సునిశితంగా పరిశీలించాలి. భాగవతము భాగవతముగా మీకు అర్థం కావాలి అంటే ఇది చాలా కీలకమయిన ఘట్టం. ఒక మహాపురుష ప్రవేశం జరిగేముందు దాని వెనకాతల ఒక కీలకమయిన సందర్భం ఉంటుంది. ఇపుడు శుకుడు వచ్చి కోర్చోవలసిన సందర్భం వస్తోంది. అలా రావడానికి గాను దాని వెనక ఏదో మహత్తరమయిన సంఘటన జరుగుతోంది. మీరు ఆ కోణములో పరిశీలన చేయకపోతే భాగవతమును వ్యాసుడు అలా ప్రారంభం చేసిన రహస్యం మీకు అందదు.
భాగవతమును విన్నంత మాత్రం చేత జీవితం మారిపోతుంది.
పరీక్షిన్మహారాజు దిగ్విజయ యాత్రలో తిరుగుతూ తిరుగుతూ ఒక ప్రదేశమునకు వచ్చాడు. అక్కడ ఒక ఆవు, ఎద్దు నిలబడి వున్నాయి. ఈ ఆవు పిల్లల పక్కన లేక పిల్లలు కనపడక, పిల్లల క్షేమవార్త తెలియక ఏడుస్తున్న తల్లి ఎలా ఉంటుందో అలా ఉంది. ఇటువంటి ఉపమానమును తండ్రికి వెయ్యరు. తల్లికి మాత్రమే వేస్తారు. అమ్మ అనే మాట చాలా గొప్పది. మాతృత్వంలో ఉన్న ప్రేమ అంతటినీ తీసుకువచ్చి మీరు ఒక ముద్దగా పెడితే ఆ ముద్దను మీరు చూడాలి అనుకుంటే, ఆ ముద్దయే భూమి. భూమి అమ్మ. ఇందుకే భూమి గురించి ఎక్కడయినా చెప్పవలసి వస్తే ఋషులు పొంగిపోతారు. వాల్మీకి మహర్షి అయితే
‘క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షీ’ అంటారు. అమ్మకి ఉండే గొప్ప లక్షణము ఓర్పు. అమ్మకి ఒర్చగలిగిన గుణం ఉంటుంది. కలియుగ ప్రారంభంలో ఇవాళ భూమి దానిని కోల్పోయింది. అందుకని బిడ్డ కనపడని ఆవు ఏడ్చినట్లు ఆవిడ ఏడుస్తోంది. ఇది కలియుగానికి ప్రారంభం. అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమయింది. దీనిని మీరు గుర్తుపట్టాలి. ఆవు అలా ఏడుస్తుంటే పక్కన ఒక ఎద్దు వచ్చి నిలబడి ఉన్నది. ఆ ఎద్దు ఒక కాలితోనే ఉంది. ఎద్దుకు నాలుగు కాళ్ళూ లేవు. ఒక కాలిమీద ఎద్దు నిలబడగలదా? ఒక కాలితో ఉన్న ఎద్దు భూమిమీద డేకుతూ ఉంటుంది. నిలబడినట్లు కనపడుతుంది అంతే. అలా నిలబదినట్లుగా ఉన్న ఎద్దు తన మూడుకాళ్ళు పోయాయని ఏడవడం లేదు – ఆవు ఏడవడం చూసి ఆశ్చర్యపోయింది. ఇదీ మీరు గుర్తుపట్టవలసిన రహస్యం. ఆవు ఎందుకు ఏడుస్తోంది అని గోమాత వంక తిరిగి అంది – ‘నీవు ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా’ అని అడిగింది. ‘మంగళప్రదురాలా’ అంటే ‘శుభం ఇవ్వడం మాత్రమే తెలిసివున్నదానా’ అని అర్థం.

మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గునపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతారు. శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంటుంది. మనం అన్నం తినడానికి నాగలిపట్టి అమ్మ గుండెలమీద గాట్లు పెడతాం. అమ్మ పంటలు పండించి మనకి కడుపు నిండేటట్లుగా అన్నం పెడుతోంది. మీరు ఎంత బాధ పెట్టినా కన్నులవెంట నీరు పెట్టుకోవడం ఆమెకు తెలియదు. మీరు బ్రతకడానికి ఇవ్వడం ఆవిడకు తెలుసు. ఇపుడు ఆ గోవు ఏడుస్తుంటే ఎద్దు అడిగింది. ‘నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి బాధ కలిగింది? నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి కదా!’ అడిగితే భూమి అంది, ‘నేను దేనికి ఏడుస్తున్నానో తెలుసా? నాకు ఏదో బాధ కలిగిందని ఏడవడం లేదు. కృత యుగమయినా, మరొకటి అయినా నా బాధ ఎప్పుడూ అలానే ఉంటుంది.’ ఇక్కడ గోవు బాధ పడుతోంది. కలియుగ ప్రారంభంలో ఎందుకు గోవు అలా ఏడుస్తున్నాడో ఇప్పుడు చెప్తున్నారు. ఆవు ఎద్దుతో చెప్తోంది ‘కలి ప్రవేశించాడయ్యా – నేను ఏడుస్తున్నా నంటావేమిటి? నీకు మూడు కాళ్ళు లేని తనమును చూసి నేను ఏడుస్తున్నాను’ అంది. ఆయనకీ మూడు కాళ్ళు లేకపోతే ఈవిడ ఏడవడం ఎందుకు?
ఆవిడ అంది –
కలి బలవంతంగా రాలేదు. ఈశ్వరుడు అనుగ్రహించాడు. కలియుగం అంటే అతను రావాలి. అతను రావడానికి కాలము దారిని ఇచ్చింది కాలము ఈశ్వరరూపం. ఆ కలి లోపలి అడుగు పెట్టి పాదములు ఇంకా పూన్చుకోలేదు – పరిస్థితి మారిపోయింది. పూర్వము నీకు నాలుగు పాదములు ఉండేవి. ఇప్పుడు నీకు ఒక పాదమే ఉన్నది. మూడు పాదములు లేవు. కలిపురుషుడు వచ్చేయడం వలన నీకు మూడు పాదములు పోయాయి’ అంది.

అది మామూలు ఎద్దు కాదు. ఆ ఎద్దు ధర్మము. ధర్మమునకు, భూమికి ఎంత దగ్గర సంబంధమో చూడండి. ధర్మమునకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే నాలుగు పాదములు ఉండేవి. ఈ నాలుగు పాదములతో ధర్మం నడుస్తుంది. అది ఇలా నడిచే నాలుగు పాదములు కలిగిన ధర్మమనబడే వృషభము. అందుకే శంకరుడు వృషభమును ఎక్కుతాడని అంటారు. అనగా ఆయన ధర్మమును అధిరోహించి నడుస్తారని భావము. ఆవు చెపుతున్న మాటలను చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ‘నేను దేవతల గురించి ఏడుస్తున్నాను. హవిస్సులు పొందని దేవతలు తయారవుతారు’ అంది. రాబోయే కాలములో యజ్ఞయాగాదులను విమర్శించే వాళ్ళు ఎక్కువయిపోతారు. యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి. ఇంకెక్కడా లేవు. యజ్ఞం చేయడం, అగ్నిహోత్రంలో హవిస్సు వెయ్యడం మున్నగు కార్యక్రమములు జరగవు. మీరు మరల సంపదను పొందడానికి అగ్నిహోతము ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే, ప్రీతిచెందిన దేవతలు మరల వర్షమును కురిపించి మనకు సంపదలను ఇస్తారు. మీరు తిరిగి వారిపట్ల కృతజ్ఞతను ప్రకటించనప్పుడు దేవతల ఆగ్రహమునకు గురి అవుతారు. కలియుగంలో దేవతలకు హవిస్సులు ఇవ్వబడవు. ‘హవిస్సులు ఇవ్వని మనుష్యులకు శుభమును మేము చేయము’ అని దేవతలు శుభములను చేయరు.

ఏది సనాతన ధర్మమో, ఏ సనాతన ధర్మము ఈ గడ్డ మీద నిలబడిందో, ఆ సనాతన ధర్మము ఈ గడ్డమీద విమర్శకు గురి అయిపోతుంది. కాబట్టి యజ్ఞ యాగాది క్రతువులు నశించిపోవడం ప్రారంభమవుతుంది. ఎవరు వేదమును కష్టపడి చదువుకుని, స్వరం తెలుసుకుని చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెపుతారో అటువంటి వారికి ఆదరణ తగ్గిపోతుంది. లోకంలో అసలు ఆ వేదమును ఆదరించాలనే బుద్ధి నశించిపోతుంది. ఎవరు తపస్సుతో ఉన్నాడో, ఎవరు లోకంలో ఈ విషయ సుఖములు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని యందు ఉన్నాడో వానిని లోకులు రాళ్ళుపెట్టి కొట్టే రోజు వస్తుంది. అలాంటి వానిని చూసి నిష్కారణంగా నిమర్శ చేసే రోజులు బయలుదేరి పోతాయి. పితృదేవతలకు తద్దినములు పెట్టేవాళ్ళు కరువైపోతారు.

ధర్మం పోతుంది. ఆవులు అవమానింపబడతాయి. ఆవుల్ని కొడతారు, అమ్ముతారు, తోళ్ళు తీసేస్తారు. ఆవుమాంసం తింటారు. ఈ మాటలను కలియుగ ప్రారంభంలోనే చెప్పేసింది. ‘వీళ్ళందరూ బాధలకు గురి అవడం ప్రారంభం అయిపోతున్నది. అందుకు ఏడుస్తున్నానయ్యా’ అని అంటూ ఒకమాట చెప్పింది. ‘నీకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే నాలుగు పాదములు ఉండేవి. ఇందులో మూడు పాదములు పోయాయి’ అంది.

ఇక్కడ ఎద్దును ధర్మ స్వరూపంగానూ, ఆవును భూస్వరూపం గానూ మనం తలంచాలి. ధర్మ స్వరూపమునకు మూడు పాదములు పోయాయి అంటే ఏమిటి? మీరు ధర్మమన్నా ఆచరించాలి లేదా అధర్మమన్నా ఆచరించాలి. మీరు ధర్మంగా ఉండాలి. అలా ఉండకపోతే మీరు అధర్మం చేసినట్లు. అధర్మమయినవి మూడు తిరగకూడనివి ఇక్కడ తిరుగుతున్నాయి. అవి తిరగబట్టి ధర్మమునకు ఉండే ఈ మూడు పాదములు తెగిపోయాయి. కాని సత్యము అనే పాదము మాత్రము ఎన్నటికీ తెగదు. దీనిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇన్ని అధర్మములు చేసినా, దేవుడి గురించి తిట్టేవాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి వాడు తిడుతున్నాడు. లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే వాడు కృతఘ్నుడై తిట్టగలుగుతున్నాడు.

ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈలోకం ఉన్నది. కాబట్టి మారని పదార్థము ఇంకా కాపాడుతోంది. కాబట్టి నాలుగు పాదములలో సత్యమనే పాదము ఒక్కటే నిలబడింది. మరి పోయినవి ఏమిటి? శౌచము – దుష్టజనులతో కూడిన సంగమము వలన పోయింది. జీవితములో అన్నిటికన్నా మీరు స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటికి తమంత తాముగా 50మంది రావచ్చు. వారంతా మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడూ మీరు మీ స్థితి నుండి జారిపోకూడదు. ఒకనాడు దుష్టుడయిన వాడు మీ ప్రమేయం లేకుండా మీకు తారసపడతాడు. మీతో వచ్చి మాట్లాడతాడు. వాని మాటలను ఒక తామరాకు మీద నీటిబొట్టు పట్టినట్లు పట్టాలి. ఆ మాటలు వెంటనే జారిపోవాలి. వాని మాటలను ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప వాటికి మనసులో స్థానం ఇవ్వకూడదు. అలా స్థానం ఇస్తే శౌచము పోతుంది. శౌచము అంటే ఆచారము, నడవడి, వ్యవహారము. ఇవన్నీ నశించిపోతాయి.

మూడవ పాదము దయ. దయ దేనివలన పోయినది? దయ పోవడానికి ప్రధాన కారణము అహంకారము. అహంకారము వలన దయ నశించి పోతుంది. తనలో ఫాల్స్ ఈగో ఒకటి వృద్ధి చేసుకుంటాడు. ఎప్పుడూ నిన్ను పొగిడేవాడిని ఎక్కువగా నీ దరికి చేర్చకు’ అని చెపుతారు. నీకు తెలియకుండా నీవు నిర్మించుకున్న నీ శీలము అహంకారము వలన నశించిపోతుంది. మీ పక్కన కూర్చున్న వాడు నిరంతరం మిమ్మల్ని పొగడడం మొదలు పెట్టాడనుకోండి – అపుడు మీకు ‘నా అంతటి వాడిని నేను’ అన్న అహంకారం వచ్చేస్తుంది. ఈ అహంకారము ప్రబలిపోవడం వలన భూతదయ నశించిపోతుంది. కాబట్టి దయపోవడానికి అహంకారము కారణమయింది. దయ స్థానంలో అహంకారం కనపడుతూ ఉంటుంది. కలిపురుషుడు ఉన్నచోట అహంకారము కనపడుతూ ఉంటుంది. ధర్మము స్థానంలో అధర్మము ప్రవేశిస్తోంది. మూడవది తపస్సు, తపస్సు సమ్మోహము వలన పోయింది. సమ్మోహము అనేది ఒక విచిత్రమయిన లక్షణము. కాబట్టి ఇప్పుడు ఈ మూడూ పోయాయి. ధర్మమూ పాదములు పోయి అధర్మము పాదములు వచ్చాయి. అధర్మము పాదములు ధర్మమునకు అంటుకుని ఉండవు. అది ధర్మ స్వరూపమయిన వృషభము. అది కలియుగంలో మూడు పాదములు లేకుండా కనపడుతోంది. ఈ మూడు పాదములు ఇంకొక చోట ఉన్నాయి. ‘ఆ మూడు పాదములే ఇప్పుడు తిరుగుతున్నాయి. కాబట్టే ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. నేను ఏడవడానికి కారణం నీమూడు పాదములు లేకపోవడం’ అంది ఆవు.

అక్కడ ఆవు, ఎద్దు అలా ఏడుస్తున్నాయి. ఏడుస్తుంటే ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆ ఆవు, ఎద్దు దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చిన వాడు మిక్కిలి క్రోధంతో ఉన్నాడు. వాని క్రోధం సామాన్యమయిన క్రోధం కాదు. అపారమయిన కోపం ఉన్నవాడు. పైగా చేతిలో కత్తి, కర్ర పట్టుకున్నాడు. ఎంత ప్రమాదమో చూడండి! చూడడానికి రాజుగారిలా ఉన్నాడు. రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకున్తాడో, ఎటువంటి కిరీటము పెట్టుకుంటాడో అటువంటివి పెట్టుకుని పరిపాలకుని వలె ఉన్నాడు. కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు. ఎందుకు అంటే వానిలోపల పరిపాలనాంశ లేదు. పరిపాలించడానికి తగిన సంస్కార బలం లేదు. కానీ పరిపాలకుడు అయ్యాడు. ఇది కలియుగ లక్షణం. నృపాకారంలో వచ్చినవాడు బిడ్డ కనపడక ఏడుస్తున్న తల్లిలా శుష్కించి పోయివున్న, ఏమీ చేయకుండా అలా నిలబడిపోయి వున్న ఈ ఆవుని, అపారమయిన కోపంతో తన కాలు ఎత్తి ఒక్కతన్ను తన్నేడు. ఆ ఆవు నేలమీదికి తిరగబడి పోయింది. అక్కడే ఉన్న ఒక కాలుమీద నిలబడిన ఎద్దును మరో తన్ను తన్నేడు. ఎద్దు కూడా క్రింద పడిపోయింది. అలా పడిపోతే వాడు ఊరుకోలేదు. తన చేతిలో ఉన్న దండముతో ఆ రెండింటినీ కొట్టడం ప్రారంభించాడు. అంటే వాడు భూదేవిని కొడుతున్నాడు. భూమి వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయమును మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. ధర్మమును దెబ్బతీస్తున్నాడు. అదేపనిగా కొడుతున్నాడు. అవి ఏడుస్తూ, కన్నులవెంట నీరు కారుస్తూ కిందపడి లేచి కుంటుతూ ఉన్నాయి. ఆతను కొడుతున్న ఆవు కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనయిన ఆవు. కైలాసము ఈశ్వరుని ఆవాసము. ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు. అమంగళంగా ఉన్నట్లు కనపడతాడు. పుర్రెల మాల వేసుకున్నట్లు, శ్మశానంలో ఉన్నట్లు, శవ విభూతి రాసుకున్నట్లు ఉంటాడు. కానీ ఆయనంత మంగళప్రదుడు వేరొకరు లేరు. అందుకని ఆయనకు ‘శివ’ అని పేరు. పైకి అమంగళంగా కనపడతాడు. ఇప్పుడు రెండు పరస్పర విరుద్ధమయిన విషయములు ఒకరియందు ఎకకాలమునందు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ మంగళమునే చేస్తాడు. శివుడు ఎప్పుడూ అమంగళమును చెయ్యడు. ఆవుకూడా ఎప్పుడూ అమంగళమును చెయ్యదు.

నిరంతరమూ ఉపకారము తప్ప వేరొకటి తెలియని ఆ ఆవుని చూసి పరీక్షిత్తు అన్నాడు – ‘నిన్ను ఇలా కొట్టిన వారు ఎవరు? నీవు చేసిన ద్రోహం ఏమిటి? నువ్వు పాలను ఇస్తావు. నీ పేడ ఉపయోగపడుతుంది. నీ మూత్రము ఉపయోగ పడుతుంది. ఎవ్వరికీ పనికిరాని గడ్డిని ఎద్దు తింటోంది. ఎక్కడో జనం వెళ్ళి నీరు తెచ్చుకోని చోట మూతి పెట్టి నీరు త్రాగుతుంది. ఇందులో ఒక రహస్యం వుంది. ఎద్దును పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు. కానీ మూతిమీద కరిస్తే మాత్రం చాచిపోతుంది. అందుకే ఆవుకి ఆహారం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. పుట్టలమీద గడ్డి చాలా బాగా పెరుగుతుంది. అలా పుట్టల మీద పెరిగిన గడ్డిని తినడం ఆవుకి, ఎద్దుకి చాలా ప్రమాదకరం. ఆవు కాని, ఎద్దు కాని పుట్టలమీద గడ్డి తిని గబుక్కున ఎందులోకయినా జారితే గభాలున పైకి రాలేవు.

ఎద్దును చూసి, ‘వీధిలో గడ్డితిని ఏట్లో నీరు త్రాగి కాలం గడుపుకొనే నీ మూడు కాళ్ళను తెగగోట్టిన వాడెవడు? ఎలా నువ్వు అపరాధం చేశావని నమ్మాడు? వాడు భూమిలో దాగున్నా, ఆకాశమునకు ఎగిరిపోయినా, వాడు మణులు పెట్టుకున్న భూషణములతో కూడిన వాని భుజములను నా కత్తితో నరికేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతిని వాని పాదములను నరికేస్తాను’ అన్నాడు పరీక్షిత్తు. అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పరీక్షిత్తు వరకు పూనిక ఉన్న రాజు వున్నాడు భూమి మీద.

ఈ మాటలు అనిన తరువాత పరీక్షిత్తు వాటి స్వరూపమును చూసి అక్కడ వున్న వృషభము, గోవుల అసలు రూపములను గుర్తుపట్టారు. గుర్తుపట్టి అన్నాడు – ‘అమ్మా, నువ్వు ధరణీదేవివి. ఆయన ధర్మమూ... మీ ఇద్దరు ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను. కానీ ఎవరు ఇలా మీ పాదములు తెగగొట్టాడు?’ అని అడిగాడు.

అపుడు వృషభము అంది – ‘కొందరు కాలము అన్నారు. కొందరు కర్మ అన్నాడు. ఇది యుగసంధి అన్నారు. ఇది యుగలక్షణం అన్నారు. ‘ఏవేవో కారణములు చెప్పారు. నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి’ అని చెప్పింది.
అంతే, ఆయన అటూ ఇటూ చూస్తున్నాడు. ఇప్పటివరకు నృపాకారంతో ఉన్నవాడు గభాలున వెళ్ళి పరీక్షిత్తు పాదముల మీద పడిపోయి ‘అయ్యా, నన్ను రక్షించండి. తప్పయిపోయింది. ఆ మూడు పాదములు నేనే నరికేశాను’ అన్నాడు. ధర్మము మూడు పాదములు కలి వలన పోయాయి. అనగా కలి తెంచలేదు. కలి మీలోకి వస్తే మీచేత తెంపించేస్తాడు ధర్మాన్ని. కాబట్టి ఇపుడు కలి ప్రవేశం జరిగింది.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం) - by Vikatakavi02 - 08-09-2019, 09:31 PM



Users browsing this thread: 1 Guest(s)