Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#17
భీష్ముని చరిత్ర:

కుంతీదేవి ప్రార్థన తరువాత ధర్మరాజుగారు కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందఱో రాజులను తెగతార్చాను. దానివలన నాకు కలిగిన పాపం ఏవిధంగా పోతుంది’ అని బాధపడుతున్న సమయంలో, ‘ధర్మసూక్షములు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్యమీద పడుకుని ఉన్నాడయ్యా మహానుభావుడు భీష్ముడు – అక్కడికి వెడదాం పద’ అని మహానుభావుడు కృష్ణభగవానుడు ధర్మరాజును తీసుకొని వెళ్ళినప్పుడు, భీష్ముడు ధర్మరాజుకు ధర్మములను ఉపదేశించి తదుపరి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయిన సంఘటనను మాత్రమే వివరించారు. అప్పుడు భీష్ముడు కృష్ణ భగవానుని చేసిన స్తోత్రం భాగవతంలో వివరించ బడింది.

భీష్ముని చరిత్ర మహాభారతము, దేవీ భాగవతము ఇత్యాది గ్రంథాలలో చెప్పబడింది. భీష్ముని జీవితం అంత తేలికయిన విషయం కాదు. ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టమయిన విషయం. భాగవత అంతర్భాగం కానప్పటికీ అవగాహన కొరకు భీష్ముని గురించి మనం కొంత తెలుసుకోవడం మంచిది.

ఒకానొకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభనొక దానిని తీర్చారు. ఆ సభకు ఋషులు ప్రజాపతులు మొదలయిన వారందరూ విచ్చేశారు. వారు ఆ సభయందు కూర్చుని ఈ లోకములో కళ్యాణము జరిగేటట్లు చూడడం ఎలాగా, భగవంతునియందు భక్తి కలిగేటట్లుగా ప్రవర్తించడం ఎలాగా అని చర్చ చేస్తున్నారు. ఈశ్వరుని గుణములను ఆవిష్కరించి ప్రజలలో భక్తి పెంపొందితే ఆ భక్తి వలన వారికి కావలసిన సమస్త కామములు చేకూరుతాయి. అంతేకాక వారు నడవవలసిన పథంలో నడిచినవారు అవుతారు. అందుచేత వీళ్ళందరికీ ఏవిధంగా కళ్యాణమును సాధించిపెట్టాలి అని సభ జరుగుతోంది.

ఆ సభ జరుగుతున్న సమయంలో ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. సభలోకి గంగాదేవి ప్రవేశించింది. గంగమ్మ పరమ పవిత్రురాలు. ఆమె హిమవంతుని పెద్దకూతురు. సహజంగా ఆవిడ చాలా సౌందర్యరాశి. పార్వతీదేవికి తోబుట్టువు కనుక విశేషమయిన అందగత్తె. మహాసౌందర్యరాశి అయిన గంగ అక్కడ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీచింది. ఒక పెద్దగాలి వచ్చింది. ఆ గాలికి గంగాదేవి పమిట తొలగింది. ఇటువంటి సంఘటనలు అనుకోకుండా జరిగినవి కావు. వీటి వెనుక ఆదిపరాశక్తి అయిన అమ్మవారి ప్రణాళిక ఏదో ఉంటుంది.

గంగాదేవి పమిట తొలగగా బ్రహ్మగారి సభలో వున్న అందరూ తలలు వంచుకుని కూర్చున్నారు. కాని ఆ సభలో కూర్చున్న గోభిషుడు అనే ఒక రాజర్షి మాత్రం తదేక దృష్టితో గంగమ్మను చూస్తున్నాడు. ఆశ్చర్యకరంగా గంగమ్మ కూడా రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తోంది. వారిద్దరి యందు కామము అతిశయించింది. వారిరువురు కూడా తాము చతుర్ముఖ బ్రహ్మగారి సభయందు ఉన్నామన్న విషయమును మరచిపోయారు. ఈ సంఘటన వెనుక ఏదో పెద్ద ప్రణాళికా నిర్మాణం జరిగిందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సంకల్పములు మనకి అర్థం అయ్యేవి కావు. కథ నడిస్తే మనకి అర్థం అవుతుంది.

అపుడు బ్రహ్మగారికి వారి ప్రవర్తనను చూసి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మ ఇలా ప్రవర్తించడమేమిటి, రాజర్షి అలా ప్రవర్తించడమేమిటా అని అనుకున్నారు. అనుకుని వారిద్దరినీ శపించారు. ‘ఇలా సమయాసమయములు లేకుండా కామ ప్రచోదనం కలిగి ప్రవర్తించావు కాబట్టి నీవు భూలోకమునందు జన్మించెదవు గాక’ అని రాజర్షిని శపించారు. గంగమ్మను ‘నీవు కూడా ఆ రాజర్షికి భార్యవై కొంతకాలం భూలోకమునందు జీవించెదవు గాక’ అని శపించారు. తదనంతరం ‘శరీరం విడిచిపెట్టిన తరువాత మరల స్వర్గలోకమునకు వస్తావు’ అని శాపవిమోచనం చెప్పారు. ఆకారణం చేత రాజర్షి తానూ ఎవరి కడుపున జన్మించాలి అని చూస్తున్నాడు.

ఆ కాలంలో భారత వర్షంలో ప్రతీపుడు అనే గొప్ప మహారాజు భరతవంశంలో జన్మించాడు. మహాధర్మమూర్తి. బిడ్డలు లేరు. ప్రతీపుడిని చూసి ఆయనకు కుమారుడిగా జన్మించాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఆ నిర్ణయం తీసుకొని ప్రతీపుడి కుమారుడిగా జన్మిద్దామని భూలోకంలో ప్రవేశించే సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి క్రిందికి వస్తోంది. ‘అయ్యో నేనెంత పొరబాటు చేశాను. నేనయినా ఆ సమయంలో పమిట సర్దుకుని సరిగా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి అన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు. నేను చాలా పొరపాటుగా ప్రవర్తించాను. నేను చేసిన పొరపాటు పని సరిదిద్దుకోవాలంటే బ్రహ్మగారు ఇచ్చిన శాపం వలన మర్త్యలోకంలో జన్మించి ఆ రాజర్షి ఎవరిగా జన్మిస్తున్నాడో ఆయన భార్యగా కొంతకాలం ఉండాలి’ అనుకుంది. ఈ సంకల్పం చేసి వస్తున్నప్పుడు అష్ట వసువులు ఆమెకు రోదన చేస్తూ కనపడ్డారు. ఆవిడ వారిని చూసి ‘మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు అంత బాధగా ఉన్నారు’ అని అడిగింది. అపుడు వాళ్ళు ఒక చిత్రమయిన విషయమును ప్రతిపాదన చేశారు. ‘మేము అష్టవసువులము. భార్యలతో కలిసి ఆకాశమార్గములో వెళ్ళిపోతున్నాము. అలా వెళ్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా మేము ప్రయాణం చేస్తున్నాము. మేము వసిష్ఠ మహర్షి ఆశ్రమమును చూశాము. అందులో ‘నందిని’ అనే కామధేనువు ఉంది. అది తెల్లని పర్వతాకారంలో ఉండి మెరిసిపోతూ మిక్కిలి ప్రకాశంతోనూ, తేజస్సుతోనూ ఉంది. దానిని ‘ద్యు’ అనబడే వసువు భార్య చూసి ‘అది మామూలు ఆవేనా’ అని భర్తను అడిగింది. అపుడు ఆయన అది మామూలు ఆవు కాదు – దానిని కామధేనువు అంటారు – దాని పాలు త్రాగితే ఎటువంటి కోరికయినా తీరుతుంది’ అని చెప్పాడు. అపుడు ‘ద్యు’ భార్య అంది –‘నాకు ‘ఉసీనర’ అనే స్నేహితురాలు వుంది. ఆమె కొద్దిగా రోగగ్రస్తయై వార్ధక్యమును పొందింది. ఆవిడకు మరల యౌవనం వస్తే నాతోపాటు సంతోషంగా గడుపుతుంది. అందుకని మనం ఈ కామధేనువుని అపహరిద్దాం. వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు. కామదేనువును అపహరించి తీసుకువెళ్ళి దానిపాలు ఉసీనరకి పట్టిద్దాము’ అంది. భార్య మాట కాదనలేక తోటి వసువులతో కలిసి ‘ద్యు’ ఆ కామదేనువును అపహరించి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వశిష్ఠమహర్షి సాయంకాలం పూజకోసమని దర్భలు మొదలయినవి సేకరించదానికని వెళ్ళారు. వారు తిరిగివచ్చి ఆశ్రమంలో చూశారు. నందినీధేనువు కనపడలేదు. అంతటా వెతికారు. వెతికి ఒకసారి తపోనిష్ఠలో కూర్చుని ఆచమనం చేసి దివ్యదృష్టితో చూశారు. అష్టవసువులు కామదేనువును అపహరించినట్లు తెలుసుకున్నారు. ఆయన అష్టావసువులను మీరు భూలోకమునందు జన్మించెదరు గాక’ అని శపించారు. ఈ వార్తా తెలిసి అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్ఠమహర్షి పాదాలమీద పడి మీరు మాయందు అనుగ్రహించి మాకు శాపానుగ్రహమును తగ్గించేతట్లు చేయండి’ అని ప్రార్థించారు. అపుడు ఆయన అన్నారు – ‘మీరు ఎనమండుగురు వసువులు. మీ ఎనమండుగురిలో ఏడుగురియందు పాపము తీవ్రత తక్కువగా ఉన్నది. వారు కేవలం ‘ద్యు’కి సహకరించారు. కానీ అపహరించడానికి ప్రధానమయిన కారణము ‘ద్యు’. అందుచేత మీరు ఏడుగురు పుట్టినటువంటి వెంటనే మరణిస్తారు. నరులుగా జన్మిస్తారు. కానీ జన్మించిన కొద్ది గంటలలో శరీరం వదిలిపెట్టేస్తారు. అలా వదిలి పెట్టేసి వసువులు అయిపోతారు. కానీ ప్రధాన పాత్ర పోషించిన ‘ద్యు’ మాత్రం పరాక్రమవంతుడై, కనీవినీ ఎరుగని చరిత్రను సృష్టించి భూలోకము నందు కొంతకాలము ఉండి తరువాత తిరిగి బ్రహ్మైక్యమును పొందుతాడు. అందుకని ‘ద్యు’ మాత్రము కొంతకాలము భూలోకము నందు ఉండవలసినదే’ అని ఆయన శాపవిమోచానమును కటాక్షించారు.

ఆ ఎనమండుగురు ఇపుడు భూలోకంలో జన్మించాలి. అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. వారికి గంగమ్మ ఎదురయింది. ‘అమ్మా నీవు భూలోకమునకు ఎందుకు వెడుతున్నావు’ అని అడిగారు. అపుడు గంగమ్మ జరిగిన విషయం వారికి చెప్పి – ‘రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడ ఆయన భార్యను కావాలని వెళుతున్నాను’ అంది. అపుడు వాళ్ళు –‘అయితే అమ్మా, మాకు ఒక ఉపకారం చేసిపెట్టు. నీవు ఎలాగూ భూలోకం వెళుతున్నావు కనుక నీకడుపున మేము ఎనమండుగురం పుడతాము. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శాపవిమోచనం కోసం మాకొక సహాయం చేసిపెట్టాలి. భూలోకంలో ఏ తల్లి కూడా పుట్టిన బిడ్డలను చంపదు. కన్నతల్లికి ఉండే మమకారం అటువంటిది. మాకు శాపవిమోచనం కలగాలి. మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాము. నీవు మాయందు అనుగ్రహించి పుట్టిన వెంటనే మేము వసువుల స్థానమును అలంకరించడానికి వీలుగా ఆ శరీరం విడిచి పెట్టేటట్లుగా మమ్మల్ని కటాక్షించు’ అని కోరారు. అపుడు గంగమ్మ ‘తప్పకుండా అలాగే చేస్తాను’ అని వారికి అభయం ఇచ్చింది. కాబట్టి గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుందో చూసి ఆవిడ కడుపులోకి వద్దామని వసువులు ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా జరిగితే గంగాతీరము నందు భారతవంశములో జన్మించిన ప్రతీపుడు అనే చక్రవర్తి పుత్రార్థియై తపిస్తున్నాడు. ఆయనకీ సామ్రాజ్యం ఉంది. సత్యం ఉంది, ధర్మం ఉంది. అన్ని భోగములు ఉన్నాయి. కానీ సంతానము లేదు. ఈశ్వరానుగ్రహమును ఆపేక్షించి ఆయన గంగాతీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈయనను గంగమ్మ చూసింది ప్రతీపుడే తాను ఇంతకుపూర్వం బ్రహ్మసభలో చూసిన వ్యక్తి ఆయనే ఈ జన్మ తీసుకున్నాడు అనుకుంది. ఆయనను వివాహం చేసుకోవాలని అనుకుంది. ఆయన తపస్సులో కళ్ళు మూసుకుని ఇంద్రియములను వెనక్కు తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. గంగమ గబగబా బయటకు వచ్చి ఆయన కుడి తొడమీద కూర్చుంది. ఎంత ఆశ్చర్యకరమయిన విషయమో చూడండి. కూర్చుంటే ఆయనకు బాహ్యస్మృతి కలిగింది. తన తొడమీద కూర్చున్న స్త్రీ ఎవరా అని చూశాడు. ఆ కూర్చున్న ఆమె గొప్ప సౌందర్యరాశి. ఆయన అన్నాడు – అమ్మా నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు ఇలా నా కుడి తొడమీద కూర్చున్నావు అని అడిగాడు. ఆవిడ అంది – నన్ను గంగ అంటారు. నేను గంగానదికి అధిష్ఠాన దేవతను. నీకు భార్యను కావాలని వచ్చాను. అందుకని నీ ఒళ్ళో కూర్చున్నాను అంది. అపుడు ఆయన అన్నాడు. నీవు నా భార్యవి కావాలని అనుకున్నావు. క్షత్రియులను, విశేషించి రాజులను దక్షిణ నాయకులు అంటారు. దక్షిణ నాయకునికి ఒకరికంటే ఎక్కువమంది భార్యలు ఉంటారు. నీవు నన్ను భర్తగా పొందాలని వచ్చావు. కానీ ఒక పొరపాటు చేశావు. వచ్చి నా కుడి తొడమీద కూర్చున్నావు. కుడి తొడమీద కూర్చునే అధికారం ఒక్క కూతురికి కోడలికి మాత్రమే వుంది. ఎప్పుడయినా భార్య కూర్చోవలసి వస్తే భర్త ఎడమ తొడమీద కూర్చోవాలి. కానీ ఇపుడు నీవు వచ్చి నా కుడి తొడమీద కూర్చున్నావు. ఇపుడు నీవు నా కోడలితో సమానం లేక నా కూతురితో సమానం. నిన్ను నా కూతురితో సమానం అనడానికి వీలులేదు. నీవు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు. కాన నాతో సామానమయిన వాడు నా కొడుకు. ‘ఆత్మావై పుత్రనామాసి’ నా తేజస్సు నా కుమారునియందు ఉంటుంది. అందుకని నీవు నా కుమారుడికి భార్యవు అవుదువు గాని. అలా నీకు వరం ఇస్తున్నాను అన్నాడు.

ఇప్పుడు ఆ పైనుంచి వస్తున్నా గోభిషుడు అనే రాజర్షి చూశాడు. ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. గంగమ్మను భార్యగా పొందాలి కాబట్టి నేను ఈ ప్రతీప మహారాజుగారి కుమారుడిగా జన్మిస్తాను’ అని ఆయన తేజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజు అనే పేరుతో జన్మించాడు.

శంతన మహారాజు పెరిగి పెద్దవాడయిన తరువాత అతనికి ప్రతీపుడు పట్టాభిషేకం చేసి ఒకమాట చెప్పాడు. ‘నేను ఒకప్పుడు గంగాతీరమునందు తపస్సు చేస్తూ ఉండగా నాకొక స్త్రీ కనపడింది. ఆమె నా కుడి తొడమీద కూర్చుని నన్ను భర్తగా పొందాలని అనుకుంది. నిన్ను నా కోడలిని చేసుకుంటాను అని ఆమెకు మాట ఇచ్చాను. అందుకని గంగాతీరములో మెరుపు తీగవంటి ఒక కన్య కనపడుతుంది నీవు ఆ కన్యను భార్యగా స్వీకరించు’ అని చెప్పి ఆయన తపోభూములకు వెళ్ళిపోయాడు.

శంతన మహారాజు గారికి వేట అంటే చాలా ఇష్టం. ఒకనాడు వేటాడదానికి వెళ్ళాడు. వెళ్ళి తిరిగి వస్తూ విశ్రాంతికోసమని గంగాతీరంలో కూర్చున్నాడు. అక్కడ ఆయనకు గంగమ్మ కనపడింది. కనపడితే తన తండ్రిగారు చెప్పిన స్త్రీ ఈమెయే అనినమ్మి ఆవిడను వివాహం చేసుకోవదానికని ప్రయత్నించి ఆవిడతో మాట కలిపాడు. బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు శరీరం వదిలిపెట్టేటట్టు చూస్తానని ఆవిడ వసువులకి మాట ఇచ్చి ఉన్నది. ఇప్పుడు రేపు భర్త అడ్డుగా నిలబడితే వాళ్లకి తానిచ్చిన మాట నిలబెట్టుకోవడం కుదరదు. అందుకని ఆవిడ అంది – ‘నేను నీకు భార్యను అవుతాను. కానీ నాదొక షరతు’ అంది. ‘ఏమీ నీ షరతు’ అని అడిగాడు శంతనుడు.

నే ఏపని చేసినా అది శుభం కావచ్చు, అశుభం కావచ్చు. నేను ఏది మాట్లాడినా నువ్వు దానికి ఎదురు చెప్పకూడదు. నేను ఏ పనిచేసినా నువ్వు అంగీకరించాలి. నువ్వు ఏనాడు నాకు ఎదురుచెప్పుతావో ఆనాడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలాగయితే నేను నిన్ను వివాహం చేసుకుంటాను’ అంది.
శంతనమహారాజు బాహ్యసౌందర్యమును చూసి ప్రేమించాడు. వివాహం చేసుకున్నాడు. మొట్టమొదట కొడుకు కలిగాడు. కొడుకు పుట్టగానే ఆయన స్థితి మారింది తండ్రి అయ్యాడు. కాబట్టి ఆయన ప్రేమంతా కొడుకు మీదకు వెళ్ళింది కొడుకు బహు అందగాడు. అందునా పెద్దకొడుకు. మొట్టమొదట పుట్టిన వాడు. కొడుకులు లేక తన తండ్రి ఎంత బాధపడ్డాడో తనకి తెలుసు. కొడుకు పుట్టాడు. పుట్టీ పుట్టగానే నెత్తురుతో ఉన్న బిడ్డను రెండు చేతులతో పట్టుకుని గంగమ్మ వెళ్ళి గంగలో వదిలి పెట్టేసింది. అనగా ఆవిడ ఇచ్చిన మాట అటువంటిది. ఏడుగురు వసువులకి ఆవిడ మరల స్వస్తితిని కల్పించాలి. అందుకని పుట్టిన బిడ్డను నీటిలో విదిచిపెట్టేసింది. శంతనుడు గంగమ్మకి వరం ఇచ్చాడు కాబట్టి ఏమీ అనలేకపోయాడు. ఊరుకున్నారు.

అలా ఒకసారి రెండుసార్లు మూడుసార్లు కాదు ఏడు సార్లు అయిపోయింది. ఏడుగురు కొడుకులను తీసుకువెళ్ళి గంగలో కలిపేసింది. ఎనిమిదవసారి మహా తేజోవంతమయిన కుమారుడు జన్మించాడు. ఎనిమిదవ మారు ఆ బిడ్డను తీసుకుని గంగవైపు వెళ్ళిపోతోంటే ఆయన అన్నాడు – ‘ఛీ రాక్షసీ! ఎవరయినా మాతృత్వమును కోరుకుంటారు. నీవేమిటి ఎంతమంది కొడుకులు పుట్టినా గంగలో పారేస్తూ ఉంటావు. ఇప్పుడు ఈ పని ఎనిమిదవ మాటు చేస్తున్నావు. ఇంక నేను సహించను. నువ్వు ఆ పని చేయడానికి వీలులేదు’ అన్నాడు.

అప్పుడు గంగమ్మ నవ్వి అంది – ‘నువ్వు నేను చేసినపనికి ఎప్పుడు అడ్డుపెడతావో అప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతానని ముందరే చెప్పాను. ఇవాళ నువ్వు అడ్డుపెట్టావు. అందుకని నేను వెళ్ళిపోతాను’ అంది. ‘నీవు వెడితే వెళ్ళిపో. నా కొడుకును నాకు ఇచ్చి వెళ్ళు’ అన్నాడు. అంటే ఆవిడ అంది – ‘అది కుదరదు. నీకొడుకు కాదు. అతడు నాకు కూడా కొడుకే. పిచ్చి మహారాజా! నేను ఏదో చేసేశానని అనుకుంటున్నావు. నేను ఏడుగురు వసువులకి సహజస్థితిని ఇచ్చాను. వీడు ఎనిమిదవవాడు. వీడు బతకాలి. వీనిని తీసుకువెళ్ళి వసిష్ఠమహర్షి దగ్గర పరశురాముడి దగ్గర అస్త్ర విద్యనంతటినీ నేర్పి అపారమయిన ధనుర్విద్యా ప్రావీణ్యము వచ్చిన తరువాత తెచ్చి నీకు కొడుకుగా అప్పజెప్పుతాను. అప్పటి వరకు వీనిని నాదగ్గర ఉంచుకుంటాను’ అని చెప్పి కొడుకును తీసుకుని గంగమ్మ గంగలోకి వెళ్ళిపోయింది.

తరువాత శంతన మహారాజు ఒక్కడే ఉండేవాడు. రాజ్యం ఎలుతున్నాడు. వేటకి వెడుతున్నాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. గంగమ్మ చెప్పిన మాటను మరచిపోయాడు.
ఒకనాడు గంగాతీరంలో తిరుగుతున్నాడు. అక్కడ మంచి యౌవనంలో వున్న వ్యక్తి అద్భుతంగా బాణ ప్రయోగం చేయడం చూశాడు. ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది. ‘నాకొడుకు కూడా వుంటే ఈ పాటికి ఇదే వయస్సులో ఉంటాడు’ అని 'బాబూ నీవెవరు ఏమిటి’ అని ఆరా తీశాడు. అపుడు గంగమ్మ వచ్చి ఈయనకు దేవవ్రతుడు అని పేరు పెట్టాను. ఈయన గాంగేయుడు. గంగాసుతుడు కనుక గాంగేయుడు. ఈయన వశిష్ఠమహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య, ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అన్ని విధములుగా రాశీ భూతమయిన రాజనీతిజ్ఞుడు. ధర్మమూ తెలిసి ఉన్నవాడు. పైగా విలువిద్యా నేర్పరి. నీ కొడుకును నీకు అప్పజెప్పుతున్నాను’ అని ఆ కొడుకును ఆయనకు అప్పజెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది.
అప్పటికి శంతనుడు వార్ధక్యంలోకి వచ్చేశాడు. కొడుకు దొరికినందుకు ఏంటో సంతోషంతో ఉన్నాడు. సభచేసి ఆ కొడుకును పరిచయం చేశాడు. ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. 

ఒకరోజు శంతనుడు మరల వేటకు వెళ్ళాడు. అక్కడ యోజనగంధి కనపడింది. సత్యవతీ దేవి యోజనగంధి. అంతకుముందు ఆవిడ దగ్గర చేపల కంపు వచ్చేది. వ్యాసమహర్షి జన్మించినపుడు పరాశర మహర్షి ఆమెకు వరం ఇచ్చాడు. ఆవిడ నిలబడిన చోటునుండి ఒక యోజన దూరం కస్తూరి వాసన వస్తుంది. ఆవిడ గంగాతీరంలో పడవమీద అందరినీ అటూ ఇటూ చేరుస్తూ ఉంటుంది.
శంతనుడు సత్యవతీ దేవిని చూసి వివాహం చేసుకోమని అడిగాడు. ఆవిడ అంది – ‘ నేను స్వేచ్ఛా విహారిణిని కాను. నా తండ్రి దాశరాజు ఉన్నాడు. నువ్వు నా తండ్రిని అడుగు. నా తండ్రి సమ్మతిస్తే నన్ను చేపట్టు. నా తండ్రి అంగీకరించకపోతే అప్పుడు నన్ను రాక్షస వివాహంలో పాణిగ్రహణం చేసి తీసుకు వెడుదువుగాని. నా తండ్రి అనుమతి తీసుకోనవలసినది’ అని చెప్పింది.
అప్పుడు శంతన మహారాజు గారు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. శంతనుని చూసి దాశరాజు వంగివంగి నమస్కారములు చేసి ‘అయ్యా, మీకు నేను ఏమి చేయగలవాడను’ అన్నాడు. అపుడు శంతనుడు ‘నీ కన్యకా రత్నమును నాకు ఈయవలసింది’ అన్నాడు. అప్పుడు దాశరాజు – ‘నాకూతురు సత్యవతిని నీకిచ్చి వివాహం చేస్తాను. కానీ రేపు పొద్దున్న నా కూతురు కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యం ఇస్తావా?” అని అడిగాడు. అపుడు శంతనుడికి దేవవ్రతుడు ఒక్కసారి మనస్సులో మెదిలాడు. పెద్దకొడుకు ఉన్నాడు. అతడు మహానుభావుడు. ధర్మజ్ఞుడు. గొప్ప విలువిద్యా విశారదుడు. అటువంటి కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా ఇంత ముసలితనంలో ఈ సత్యవతీ దేవి కోసం తను కొడుకును ఎలా విడిచి పెట్టేసుకుంటాడు? మాట ఇవ్వలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.

కానీ శంతనుడికి సత్యవతీ దేవి మీద మనస్సు ఉండిపోయింది. సరిగా నిద్రపట్టడం లేదు. ఆహారం తీసుకోవడం లేదు. అస్థిమితంగా తిరుగుతున్నాడు. కుమారుడు వెళ్ళి ‘నాన్నగారూ ఏమయింది’ అని అడిగాడు. ఈ విషయమును సూచాయిగా చెప్పాడు. మహానుభావుడు దేవవ్రతుడు తండ్రిగారి పరిస్థితిని గురించి మంత్రులను అడిగాడు. అడిగితే ‘మీనాన్న గారికి ఈ వయస్సులో మరల వివాహం మీదికి మనస్సు మళ్ళింది. సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ దాశరాజు ఒక నియమం పెట్టాడు’ అని ఆ విషయములను తెలియజేశారు.

అపుడు దేవవ్రతుడు దాశరాజు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ‘అయ్యా మీ కుమార్తె అయిన సత్యవతీ దేవిని మా తండ్రిగారికి ఇచ్చి వివాహం చేయండి’ అని అడిగాడు. అడిగితె దాశరాజు అన్నాడు – తప్పకుండా చేస్తాను. కానీ నా కుమార్తెకు పుట్టే కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా?’ అని అడిగాడు. అప్పుడు దేవవ్రతుడు ‘తప్పకుండా వస్తుంది. అసలు రాజ్యం నాకు కదా రావాలి. నేను రాజ్యమును పరిత్యాగం ఆచేసేస్తున్నాను. నేను రాజ్యం తీసుకొను. మానాన్నగారి కోర్కె తీరడం కోసం నీ కుమార్తెను ఆయనకిచ్చి వివాహం చేయండి’ అన్నాడు. అపుడు దాశరాజు ‘ఇప్పటివరకు బాగుంది. కానీ రేపు నీకొక కొడుకు పుడతాడు. నువ్వు సహజంగా చాలా పరాక్రమ వంతుడవు. నీకు పుట్టే కొడుకు చాలా పరాక్రమవంతుడు అవుతాడు. అంత పరాక్రమ వంతుడయిన నీ కొడుకు సత్యవతీ దేవికి పుట్టిన కొడుకు రాజ్యపాలన చేస్తే ఊరుకుంటాడా? అందుకని భవిష్యత్తులో నీ కొడుకు నుంచి ప్రమాదం రాదనీ ఏమిటి హామీ?” అని అడిగాడు.

అపుడు దేవవ్రతుడు ప్రతిజ్ఞచేశాడు. ‘నీకు ఆ అనుమానం ఉన్నది కనుక తండ్రి మాట నిలబెట్టి, తండ్రి గౌరవమును, తండ్రి కోరుకున్న కోర్కెను తీర్చలేని కొడుకు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత! మా తండ్రిగారి కోసం నేను భీష్మమయిన ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అన్నాడు. అది సామాన్యమయిన ప్రతిజ్ఞకాదు. వృద్ధుడయిన తండ్రికోసం ఇటువంటి ప్రతిజ్ఞచేశాడు. ఈ ప్రతిజ్ఞ చేసేసరికి దేవదుందుభులు మ్రోగి పైనుంచి పుష్ప వృష్టి కురిసింది. భీష్మించి ప్రతిజ్ఞచేశాడు కనుక ఆ రోజునుంచి ఆయనను భీష్ముడు అని పిలిచారు. ఆచరించి చూపించాడు కనుక ఆయనను భీష్మాచార్యుడు అని పిలిచారు.

ఈ విషయమును తండ్రిగారయిన శంతన మహారాజు విని తెల్లబోయాడు. ‘నీవు నాగురించి ఏంటో త్యాగం చేశావు. అందుకని నీకు రెండు వరములను ఇస్తున్నాను. ఒకటి – యుద్ధభూమిలో నీవు చేతిలో ధనుస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. రెండు – నీకు మరణము లేదు. స్వచ్ఛంద మరణమును నీకు ప్రసాదిస్తున్నాను. మరణము నీవు కోరుకుంటే వస్తుంది, లేకపోతే రాదు’ అని.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం - by Vikatakavi02 - 06-08-2019, 06:48 PM



Users browsing this thread: 1 Guest(s)