Thread Rating:
  • 6 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం)
#41
పంచమ స్కంధము – ప్రియవ్రతుని చరిత్ర:

భగవత్కథ అనే దానికి అర్థం భగవంతుడిని నమ్ముకుని జీవితమును నడుపుకున్న మహా భాగవతుల చరిత్ర. భగవత్సంబధమైన కథ కనుక దీనికి భాగవతం అని పేరు వచ్చింది. భాగవతం తెలిసి వినినా తెలియక వినినా కేవలం కథా స్వరూపంగా వినపడినా జీవితమునకు ఒక గొప్ప అదృష్టమే! 

స్వాయంభువ మనువుకు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు. కుమారులు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ప్రియవ్రతుడు జన్మతః విశేషమయిన భక్తితత్పరుడు. చిన్నతనంలోనే వైరాగ్య సంపత్తిని పొందాడు. దీనికి తోడూ బంగారు పళ్ళెమునకు గోడ చేరువబ్బినట్లు ఆయనకు నారద మహర్షి గురుత్వం లభించింది. నారద మహర్షి ఆయనను గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోబెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. ఇంత జ్ఞానమును పొంది ఇంత భక్తి పొంది ఇంత వైరాగ్యమును పొందినవాడు స్వాయంభువ మనువు రాజ్యమును స్వీకరించమంటే స్వీకరిస్తాడా? స్వీకరించడు. ఒకరోజున తండ్రిగారు వెళ్ళి కుమారుడిని అడిగాడు. ‘నాయనా, నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. నీ తోడబుట్టిన వాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇంకా ఈ రాజభోగములయందు విరక్తి చెంది వున్నాను. తపస్సుకు వెళ్ళిపోతున్నాను. అందుకని నీవు వచ్చి రాజ్యమును స్వీకరించు’ అన్నాడు. ఇలా మాట్లాడడం చాలా కష్టం. కథలో చెప్పినంత తేలిక కాదు. అపుడు ప్రియవ్రతుడు ‘నాకు ఈ ప్రకృతి సంబంధము, దీని బంధనము గురించి బాగా తెలుసు. ఈ శరీరములోనికి వచ్చినది బంధనములను పెంచుకుని అవిద్యయందు కామక్రోధములయందు అరిషడ్వర్గములయందు కూరుకుపోవడానికి కాదు. పైగా నేను ఒకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను. అందుకని నాన్నగారూ, నాకు రాజ్యం అక్కరలేదు. నేను ఇలాగే ఉండి ఈశ్వరుడిని చేరుకుంటాను. భగవంతుడి గురించి తపిస్తాను అన్నాడు.

ఈమాట వినగానే చతుర్ముఖ బ్రహ్మగారు గబగబా కదిలివచ్చారు. ఎందుకని వచ్చారు అంటే ప్రజోత్పత్తి చేసి, రాజ్య పరిపాలన చేసి ధర్మమును నిర్వహించమని స్వాయంభువ మనువును బ్రహ్మగారు సృష్టించారు. ఇపుడు ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు. అపుడు బ్రహ్మగారు ఊరుకున్నట్లయితే ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది. గృహస్థాశ్రమమునందు ప్రవేశించడమనే అత్యంత ప్రమాదకరమయిన చర్య అని కాబట్టి దానియందు ప్రవేశించరాదు అని ప్రజలు భావిస్తారు. అపుడు వైదిక సంప్రదాయంలో వివాహం అనేది పవిత్రమయిన చర్యగా భావించబడదు. ఇక వంశోత్పత్తి ఉండదు. అందుకు కదిలారు బ్రహ్మగారు. ‘నాయనా ప్రియవ్రతా, సంసారములో ప్రవేశించనని నీ అంతట నీవు ఒక నిర్ణయమునకు వస్తున్నావు. నీకు, నాకు సమస్త లోకపాలురకు బ్రాహ్మణులకు ఎవరి వాక్కు శిరోదార్యమో ఒక ప్రమాణమేమయినా ఉన్నదా? ఇదియే ప్రమాణము అని చెప్పడానికి వేదమే ప్రమాణము అయి వుంటుంది. ఈశ్వరుడు లేదన్న వాడిని నాస్తికుడు అనరు. వేదము ప్రమాణము కాదు అన్న వాడిని నాస్తికుడు అంటారు. అందుకే వేదము కనపడినా వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించాలి. సత్యం అంటే మారనిది, ధర్మం అంటే మారునది. మారిపోతున్న దానిని పట్టుకుని మారని దాంట్లోకి వెళ్ళాలి. ప్రతిక్షణం మారిపోయే దానిని ధర్మం అని పిలుస్తారు. మారుతున్న ధర్మమును అనుష్ఠానం చేయడానికి నీవు ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తరువాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమయిన జ్ఞానము. అందుకని నీవు అందులోకి ప్రవేశించు. లేకపోతే నీవు ఈశ్వరాజ్ఞను ఉల్లంఘించిన వాడవు అవుతావు. అయితే గృహస్థాశ్రమం లోకి వెళ్ళకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అందరూ తప్పుచేసిన వారా అనే సందేహం కలుగవచ్చు. మహాపురుషులు అయిన వారికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. అపుడు ఆయన అన్నాడు – మహానుభావా, మీరు వచ్చి ఈ మాట చెప్పారు. కాబట్టి నేను తప్పకుండా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి రాజ్యపరిపాలన చేస్తాను అన్నాడు. ఇదీ ధర్మం అంటే! పెద్దలయిన వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినే లక్షణం ఎవరికీ ఉన్నదో వాడు బాగుపడతాడు. బ్రహ్మగారు చెప్పిన వాక్యమును విని ప్రియవ్రతుడు తగిన భార్యను చేపట్టాడు. ఆమె విశ్వకర్మ కుమార్తె. విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువే. ఆమె పేరు బర్హిష్మతి. ఆమెయందు పదిమంది కుమారులను, ఊర్జస్వతి అనే కుమార్తెను కన్నాడు. దీనిచేత ఆయన తరించాడు. ఊర్జస్వతిని శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు. వారిరువురికీ దేవయాని అనబడే కుమార్తె జన్మించింది.

ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చుని తాను చేసిన పనులన్నింటిని ఈశ్వరానుగ్రహాలుగా భావించాడు. ఆయన ఏది చేసినా భగవంతుడిని తలుచుకుని చేశాడు. అందువలన గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు, సంసారమును వదిలిపెట్టి వెళ్ళి హిమాలయములలో కూర్చుని కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన ఒక మహాయోగి ఎంతటి తేజస్సుతో కూడిన స్థితిని పొందుతాడో అంతటి స్థితిని పొందేశాడు. ఇప్పుడు ఆయనకు ఒక విచిత్రమయిన కోరిక పుట్టింది. మేరుపర్వతమునకు ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నపుడు భూమికి దక్షిణం దిక్కు చీకటిగా ఉంటుంది. సూర్యుడు దక్షిణ దిక్కుగా వుంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది. ‘నేను గృహస్థాశ్రమంలో ఉంది ఈశ్వరారాధనము చేసి శ్రీమహావిష్ణువు అనుగ్రహం చేత ఇంతటి తేజస్సును పొందాను. గృహస్థాశ్రమ గొప్పతనం ఏమిటో శాశ్వతముగా లోకమునకు తెలిసేటట్లు చేయాలి. ఏడు రోజులు ఈ భూమండలమునందు చీకటి లేకుండా చేస్తాను. సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత వేగంతో అలసిపోని రథమునెక్కి అంట తేజోవంతమయిన రథం మీద, సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో అంట తేజస్సుతో, సూర్యుడు ఉత్తరమున వుంటే నేను దక్షిణమున ఉంటాను. సూర్యుడు దక్షిణమునకు వచ్చేసరికి నేను ఉత్తరమునకు వెళ్ళిపోతాను. అలా ఏడురోజులూ అవిశ్రాంతంగా తిరుగుతాను. చీకటి లేకుండా అపర సూర్యుడనై తిరుగుతాను. గృహస్థాశ్రమంలో ఉంది పూజ చేసినవాడు ఈ స్థితిని పొందగలడని నిరూపిస్తాను’ అని రథం ఎక్కాడు. అలా ఏడురోజులు మేరువు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆ ఏడురోజులు బ్రహ్మాండమునందు చీకటి లేదు. 

ఆయన మేరువును చుట్టి ప్రదక్షిణం చేస్తుంటే ఆయన రథపు జాడలు పడ్డాయి. ఏడుసార్లు ప్రదక్షిణంలో ఏడు జాడలలో లోతుగా పడిన చారికల లోనికి వచ్చి ఏడు సముద్రములు నిలబడ్డాయి. అవి – లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, దధి సముద్రము, మండోదసముద్రము, శుద్దోదక సముద్రము, ఘృత సముద్రము. రథపు గాడికి గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది. అటూ ఇటూ నీరుండగా మధ్యలో ద్వీపములు ఏర్పడ్డాయి. ఇలా సప్త ద్వీపములు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ద్వీపములు అన్నీ ప్రియవ్రతుడు తిరిగినపుడు ఏర్పడిన ద్వీపములు. ఆవిధంగా రథపు గాడి మధ్యలో జంబూ, ప్లక్ష, శాల్మలీ, కుశ, క్రౌంచ, శాక, పుష్కర ద్వీపములు అను ఏడు ద్వీపములు ఏర్పడ్డాయి. ఈ ద్వీపముల పేర్లు వినినంత మాత్రం చేత పాపములు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు. ఇంత సాధించిన తర్వాత ఇంకా సంసారంలో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదు. ఇక నేను ఇప్పటివరకు అనుభవించిన భోగముల వలన కలిగిన సుఖము ఏది ఉన్నదో ఆ సుఖము తాత్కాలికము. దేనివలన ఈ సుఖములు కలిగాయో అది శాశ్వతము. ధర్మానుష్ఠానము వలన సత్యమును తెలుసుకున్నాడు. సత్యమునందు నేను లీనమయిపోతాను అని ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఈవిధంగా అరణ్యములకు వెళ్ళి ఘోరమయిన తపమాచరించి తనలోవున్న తేజస్సును ఈశ్వర తేజస్సుతో కలిపి మోక్షమును పొందాడు. బ్రహ్మగారు చెప్పిన మాటలను విని వాటిని మీరు ఆచరించగలిగితే గృహస్థాశ్రమమునందు మీరు సాధించలేనిది ఏదీ ఉండదు.

ప్రియవ్రతుని పెద్దకొడుకు ఆగ్నీధ్రుదు. అతడు రాజ్యమునకు ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తున్నాడు. ఈయనకు కూడా వివాహం కావలసి ఉంది. అందుకని యోగ్యమయిన భార్యను పొందడం కోసమని హిమవత్పర్వత ప్రాంతంలో కూర్చుని బ్రహ్మగారి గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ఈయన యోగ్యతాయోగ్యతలను పసిగట్టి ఒక అప్సరసను పంపించాడు. ఆమె పేరు ‘పూర్వచిత్తి’. పూర్వచిత్తి అంటే సుఖమును సుఖముగానే తలుచుకొనుట. పూర్వచిత్తి ఉన్నచోట మోక్షం ఉండదు. మీరు ఏ స్థితిలో ఉన్నారు అనే దానికి మీరే ఉదాహరణ. సుఖములే జ్ఞాపకం ఉంది వానియందే పూనిక ఉన్నట్లయితే మనసు ఈశ్వరుడు వైపుకి తిరగక పోయినట్లయితే ఆ సుఖములు సుఖములు కావనే భావన కలగక పోయినట్లయితే మీరు పూర్వచిత్తికి లొంగుతున్నట్లు భావించుకోవాలి. దానివలన ఫలితం తెలుసుకోవాలంటే ఆగ్నీధ్రుడి చరిత్ర వినాలి. 

ఆగ్నీధ్రుదు ఒక కన్యకామణి కొరకు బ్రహ్మగారిని గురించి తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మగారు వచ్చి చెప్పేవరకు వేచి వుండాలి. కానీ ఈయనకు సుఖము అన్నడ అక్కడ కనపడితే చాలు అక్కడ మనసు లగ్నమవుతుంది. ఆయనకు అదొక అలవాటు. కాబట్టి ఆయన పూర్వచిత్తి గజ్జెల చప్పుడు విన్నాడు. కళ్ళు విప్పి చూసి ఆమె అంగాంగ వర్ణన చేశాడు. ఆమెతో మభ్యపెట్టే మాటలు మాట్లాడాడు. ఫలితంగా పూర్వచిత్తి లొంగింది. ఆమెతో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఇలా గడపగా గడపగా ఆయనకీ నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భ్రద్రాశ్వువు, కేతుమానుడు అనే తొమ్మండుగురు కుమారులు జన్మించారు. వారు తొమ్మండుగురు అతి బలిష్ఠమయిన శరీరం ఉన్నవారు. పూర్వచిత్తి చాలాకాలం ఆగ్నీధ్రుడితో సంసారం చేసి ఆఖరుకి తన లోకం వెళ్ళిపోతానని చెప్పి ఈయనను విడిచిపెట్టి తన లోకం వెళ్ళిపోయింది. తరువాత ఆగ్నీధ్రుదు పూర్వచిత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో అక్కడికి వెళ్ళిపోవడం కోసం అనేక యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. చివరకు ఆమె వున్న లోకమును పొందాడు. 

ఇపుడు ప్రియవ్రతునికి ఆగ్నీద్రుడికి ఉన్న తేడాను ఒకసారి గమనించండి. ప్రియవ్రతుడు తానూ చేస్తున్న పని గురించి ప్రశ్న వేసుకుని భార్యను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళాడు. ఆగ్నీధ్రుడు పూర్వచిత్తి వున్న లోకమును పొందాడు. ప్రియవ్రతుడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్యమును పొందాడు. 

ఆగ్నీధ్రుడి పెద్ద కుమారుడు నాభి. ఆయన మేరుదేవి అనబడే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆవిడతో కలిసి సంతానమును పొందాలి అనుకున్నాడు. ఆయన అనేక యజ్ఞయాగాది క్రతువులను చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే తపస్సు చేసి కొడుకును పొందాడు ఆగ్నీధ్రుదు. యజ్ఞము చేసి కొడుకును పొందాడు నాభి. నాభి పరిపాలించాడు కాబట్టి ఈయనకు వచ్చిన రాజ్యమును ‘అజనాభము’ అని పిలిచారు. ఈయన చేసిన యజ్ఞమునకు సంతసించి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షం అయ్యారు. ఈ సందర్భంలో అక్కడ ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. అక్కడ యజ్ఞం చేస్తున్న వాళ్ళని ఋత్విక్కులు అంటారు. శ్రీమన్నారాయణ దర్శనం కలుగగానే వారందరూ లేచి నిలబడ్డారు. నాభి కూడా లేచి నిలబడి ‘స్వామీ, నీవు పరాత్పరుడవు. నేను నిన్ను ఒక కోరికతో ఆరాధన చేసి యజ్ఞం చేశారు. నీవు ప్రత్యక్షం అయినపుడు నిన్ను మోక్షం అడగడం మానివేసి ఒక కొడుకును ప్రసాదించమని అడగడం ఒక ధనికుడిని దోసెడు ఊకను దానం చేయమని అడగడంతో సమానం. అయినా నేను అదే అడుగుతాను’ అన్నాడు. గృహస్థాశ్రమం పట్ల నాభికి వున్న గౌరవం అటువంటిది. తను ఒక కొడుకును కంటే తప్ప పితృఋణం నుండి తాను విముక్తుడు కాదు. కానీ ఆ కొడుకు తనను ఉద్ధరించే కొడుకు కావాలి. అటువంటి కొడుకును పొందాలనుకున్నాడు.

శ్రీమహావిష్ణువు ‘అల్పాయుర్దాయం ఉన్న ఉత్తముడు కావాలా లేక దీర్ఘాయుర్దాయం ఉన్న మహాపాపి కావాలా’ అని అడిగాడు. అపుడు నాభి ఒక తెలివైన పని చేశాడు. నాభి అన్నాడు ‘ఈశ్వరా, నాయందు వున్న భక్తిని నీవే ప్రచోదనం చేసి నాకు దర్శనం ఇచ్చి నన్ను ఉద్ధరించావు. ఇంతగా భక్తికి లొంగేవాడివి కాబట్టి నిన్నొక కోరిక కోరుతున్నాను. నీలాంటి కొడుకును నాకు ఒకడిని ప్రసాదించవలసినది అని కోరాడు. అపుడు శ్రీమహావిష్ణువు ‘నీవు ఇటువంటి స్తోత్రం చేసినందుకు లొంగాలో, ఈ ఋత్విక్కులు నీవు అలా అడుగుతున్నప్పుడు తథాస్తు అనినందుకు లొంగాలో – ఏమయినా నేను నీకు లొంగవలసిందే. కానీ నేను ఒకటే ఆలోచిస్తున్నాను. నేను ముందు నాభి తేనె ఆహారంలోంచి నాభిలోనికి వెళతాను. నాభి జీర్ణం చేసుకున్న తరువాత నాభి వీర్యకణములను ఆశ్రయిస్తాను. నాభి తేజస్సుగా నాభిలోంచి నాభి బార్య అయిన మేరుదేవి లోకి వెళతాను. మీరు తథాస్తు అన్నందుకు పది నెలలపాటు గర్భస్థమునందు అంధకారంలో పడివుంటాను. నాభి కుమారుడనని అనిపించుకుని మేరుదేవి కడుపులోంచి ప్రసవమును పొంది పైకి వస్తాను’ అన్నాడు. భక్తితో కొలిచిన వారికి ఈశ్వరుడు ఎందుకు లొంగడు!

ఈమాట వినిన తరువాత నాభి చాలా సంతోషించాడు. మేరుదేవి గర్భమును ధరించింది. ‘నల్లనివాడు’ నేను పుడతాను అని వరం ఇస్తే తెల్లగా వచ్చాడు. అంటే లోకానికి ఏదో జ్ఞానబోధ చేయడానికి వచ్చాడన్నమాట! అన్ని రంగులు తెలుపులోంచి పైకి వచ్చి మరల తెలుపులోకి వెళ్ళిపోతాయి. అనగా సృష్టి ఎందులోంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతోందో చెప్పే మహాజ్ఞానిగా రాబోతున్నాడు. దానివలన తనను కొడుకుగా కావాలని అడిగినందుకు పైన వంశం అంతా తరించిపోవాలి. జ్ఞాని పుట్టుకచేతనే కదా ఏడుతరాలు తరిస్తాయి! అందుకని ఇపుడు తెల్లటివాడిగా వచ్చాడు. ఈ పిల్లవాడిని చూసి మురిసిపోయి నాభి కొడుక్కి ‘ఋషభుడు’ అని పేరు పెట్టుకున్నాడు. 

ఋషభుడు బాహ్యపూజ చేసేవాడు కాదు. అంతరమునందు విశేషమయిన యోగమును అనుసంధానం చేస్తూ ఉండేవాడు. ఋషభుడు బాహ్యకర్మలు చేయడం లేదని ఇంద్రునికి కోపం వచ్చి వర్షం కురిపించడం ఆపేశాడు. ‘మన రాజ్యంలో వర్షం పడడం లేదు. క్షామం వచ్చేటట్లు ఉంది’ అని తండ్రి వెళ్ళి కుమారుని వద్ద బాధపడ్డాడు. అపుడు ఋషభుడు ఒకనవ్వు నవ్వి తన యోగబలంతో మేఘములను సృష్టించి తన రాజ్యం ఎంత వరకు ఉన్నదో అంతవరకూ వర్శములను కురిపించాడు. దానిచేత ఎక్కడ చూసినా పంటలు పండి సస్యశ్యామలమై పోయి నాభి పరమసంతోష పడేటట్లుగా ఈ ఋషభుడు ప్రవర్తించాడు. పరమ సంతోషమును పొంది ఋషభుడికి పట్టాభిషేకం చేసి తపస్సు చేసుకునేటందుకు నాభి ఇల్లు విడిచి పెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి తపస్సు చేసి బ్రహ్మమునందు కలిసిపోయాడు.

గర్ల్స్ హైస్కూల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ఆధ్యాత్మికం — శ్రీమదాంధ్ర మహా భాగవతం (ప్రవచనం) - by Vikatakavi02 - 19-03-2020, 08:27 AM



Users browsing this thread: 2 Guest(s)