Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తుమ్మచెట్టు
#1
1511.     1-8.    2302b. 3-7.
261023-4.
???????????


                   తుమ్మచెట్టు
                  ➖➖➖✍️

తుమ్మచెట్టు అనగానే మొహం వికారంగా పెట్టకండి. ఈ చెట్టు గురించి తెలుసుకుంటే వెంటనే ఒక తుమ్మచెట్టు నాటాలి అనుకుంటారు. నేను చెప్పేది పిచ్చితుమ్మ, అదే సర్కార్ తుమ్మ గురించి కాదు! నల్లతుమ్మచెట్టు గురించి.

మా చిన్నపుడు మాకెన్నో చెట్లతో అనుబంధం వుండేది. చింత, తుమ్మ, మామిడి, రేగు, వేప, జామ, రావి, మర్రి ఇలా ఎన్నో చెట్లతో...!

పైటేలకి(పగటి వేళకి) బడిలో బువ్వ గంట కొట్టంగానే నేను, మా అక్కొల్లు అంటే మా పెదనాయన కూతుళ్ళు నలుగురు ఇంటికి లగేత్తేవాళ్ళం. ఎందుకంటే మేము బువ్వ తిని, పొలాన పని చేస్తున్న మా నాయన వాళ్ళకు బువ్వ ఇచ్చి రావాలి. మళ్ళి  గంట కొట్టేసరికి బడిలో ఉండకపోతే     మా లెక్కల పంతులు అంతయ్య పంతులు గారు గోడకుర్చీ ఏపిత్తారు మరి.

బువ్వమూటలు నెత్తిన పెట్టుకుని, మజ్జిగ ముంతలు చేతిలో పట్టుకుని మా వూరెమ్మటి చేనుకి గబగబా నడిచేవాళ్ళం. చేలో మా పెదనాయన, మా నాయన పని చేస్తూ వుండేవాళ్ళు. మేము పొయ్యే దారిలో ఒణుకులు [స్మశానం]ఉండేవి. అక్కడకు రాంగనే మా బాలక్క నన్ను 'ఒసే,నువ్వసలే ఉత్త కొక్కిరాయి ముండవు. ఆ ఒణుకుల కల్లా చూసేవంటే ఉచ్చ పోసుకుంటావ్. దడుపు జెరం వచ్చిందంటే మీ నాయన మమ్మల్ని తిడతాడు. పెద్దక్కా, దాన్ని మద్యలోకి పంపించి నువ్వు దాని ఎనక నడువ్!” అనేది.

భయపడతా, భయపడతానే ఒణుకుల కల్లి తల తిప్పి చూసేదాన్ని. పగిలిపోయిన కుండపెంకులు, చేటలు, వాడిపోయిన పూలు, సగం కాలిన కట్టెలు, బూడిద కనపడేవి. అమ్మో అని తల తిప్పెసుకునే దాన్ని.

మా వూరెమ్మటి చేలోనే పెద్దతుమ్మచెట్టు వుండేది.  ఇది చేలో చాలాతావు ఆక్రమించింది. అంత మేరా     పంట పండేది గాదు. దాని ముళ్ళు రాలి కాళ్ళకు గుచ్చుకునేవి. మా నాయనతో… 'నాయనా, ఈ చెట్టు కొట్టేయరాదా, ముళ్ళుగుచ్చుకుంటున్నాయి, అన్నా.”

”అమ్మీ, అది మా తాతలు ఎప్పుడో నాటిన  చెట్టు. .దాన్ని కొట్టేయకూడ దమ్మీ, చనిపోయిన మన పెద్దలు చెట్ల రూపంలో మనల్ని చూస్తా వుంటారు, కాపాడతా వుంటారు. వాళ్ళు పెట్టిన చెట్లు మనం కొట్టేసే హక్కు మనకు లేదు. మీరు గూడా కొట్టేయగూడదు!”  అని  చెప్పేవాడు.

మా నాయన నాకు పసుపుకుంకుమల కింద ఈ చేనే ఇచ్చాడు.  మా నాయన పోయినా మా నాయన గుర్తుగా ఆ చెట్టు కొట్టేయలేదు.

మా నాయనోల్లు బువ్వ తింటా వుంటే, నేను, మా అక్కోళ్ళు ఆచెట్టు కున్న బంక గీకి మా జోబులు నింపుకున్నాం.    ఈ బంకని, మేము బాగా తినేవాళ్ళం. తింటా వుంటే పళ్ళకి అతుక్కుపోయి వచ్చేదికాదు. ఒక  చిన్న కుండలో ఈ బంక  వేసి కొద్దిగా నీళ్ళు పోసేవాళ్ళం. అది మా పుత్తకాలు అంటించు కోవటానికి, కోటప్పకొండ తిరణాలకు పిల్లలం కట్టే, బాలప్రభలకు పనికొచ్చేది.

ఇంతలో చేను దగ్గరకు మా మేనత్త వచ్చింది. మా నాయనతో.. 'అన్నా, కొద్దిగా తుమ్మబెరడు కొట్టియ్యి. చిన్నమ్మి తలలో పేలు పడి, సల్ది[పుండ్లు] అయింది” అన్నది.

ఆమాట వినగానే పెదనాయనకు బాగా కోపం వచ్చింది. “పుండ్లు పడేదాకా ఏమి చేస్తున్నావ్ అమ్మీ, అప్పుడప్పుడు గుంటూరు హాస్టల్ కి పోయి పిల్లని చుసుకోవద్డా?  సెలవులు అయిపోయి మళ్ళి పోయేసరికి, నాలుగైదు సార్లు తుమ్మచెక్క ఉడక బెట్టి ఆ కషాయంతో, తల కడుగు. ఎంత బ్రహ్మ రాక్షసి పుండు అయినా, ఇట్లే మాడిపోతుంది!” అన్నాడు.

ఈ తుమ్మకట్టెతో  కొడవళ్ళు, నాగళ్ళు, కొయ్యలు, బండి ఇరుసు, మొత్తం బండినే ఈ కట్టెతో చేస్తారు. తుమ్మపూలు గుండ్రంగా, బంతుల్లాగా బంగారు రంగులో వుండి, మంచి వాసన వస్తూ, వుంటాయి. మా పెద్దక్కకు ఈ పూలు  అంటే చాలా ఇష్టం.   కోసి తల్లో పెట్టుకునేది.
           
ఇంకా ఈ తుమ్మచెట్ల మీద జీరంగులు అనే పురుగులుండేవి. ఇవి చక్కటి ఆకుపచ్చ రంగులో, కొన్ని      ఆకుపచ్చ ఎరుపు కలిగిన రంగులో ఉండేవి. చాలా అందంగా మెరుస్తూ, ఉండేవి. మేము వీటిని పట్టుకుని అగ్గిపెట్టేలలో పెట్టేవాళ్ళం. రోజు తుమ్మ ఆకు వేసేవాళ్ళం. ఇవి తెలుపు, లేత పసుపు, ఎరుపు రంగుల్లో గుడ్లు పెట్టేవి.
       
ఆ రోజుల్లో పుస్తకాల సంచితో పాటు ఈ జీరంగుల[రంగరిపురుగులు]అగ్గిపెట్టెలు గూడా బడికి తీసుకుని పోయేవాళ్ళం. ఎవరి జీరంగి ఎక్కువ గుడ్లు పెడితే వాళ్ళు అంత గొప్ప అన్నమాట.

ఒకపక్క పంతుళ్ళు పాటాలు చెబుతుంటే మేము చాటుగా వీటితో ఆడుతూ, వుండేవాళ్ళం. అవి భలే దొమ్మరిగుంతలు వేసేవి. కొన్నిసార్లు ఎవరి పురుగన్నాతప్పించుకుని, మా తలల మీదనో, పంతుల గారి తల మీదనో వాలేవి. దాంతో పంతులు గారు వరసబెట్టి, మా వీపులు విమానం మోత మోగించే వాళ్ళు.

తుమ్మకాయల్ని కాళ్ళకు గజ్జేలుగా కట్టుకుని డాన్స్ చేసేవాళ్ళు. అవి అచ్చం అందెలు మోగినట్లు మొగేవి. ఈ తుమ్మకాయల్ని మేకలు చాలా ఇష్టంగా తింటాయి. అవి వాటికి చాలా బలవర్ధకమైన ఆహారం. మా చిన్నాయన ఎప్పుడూ, రెండు మేకల్ని మా తుమ్మచెట్టుకి కట్టేసి, తుమ్మాకు, కాయలు తెంచేసి మేపుతూ, ఉండేవాడు. వాటినే మా ఇంట్లో పెద్దపండుగకు కోశేవాళ్ళు.

ఈ తుమ్మచెట్లకి ఒక రకమైన పురుగు వుండేది. ఇల్లు కట్టటంలో దాని ముందు మయబ్రహ్మ గూడా చాలడు. ముళ్ళు చక్కగా గుండ్రంగా పేర్చి, మట్టిని దాని నోట్లోని  వుమ్మితో తడిపి వాటిని అంటించేది. ఎవరూ దాని జోలికి రాకుండా చక్కగా ముల్లిళ్ళు కట్టుకునేది.

ఇలా తుమ్మచెట్టు రైతుకే గాకుండా అందరికీ ఉపయోగకరంగా వుండేది. ఈ చెట్టు మొత్తం, బెరడు, ఆకులు, పూలు, కాయలు ఆయుర్వేద మందుల్లో   ఉపయోగిస్తారు. తుమ్మ పుల్లతో పల్లు తోమితే ఎలాంటి నొప్పులు రావని మాతో పల్లు తోమించేవాళ్ళు.
    
ఆ రోజుల్లో మాకు చెప్పులు ఉండేవి కాదు. వట్టి కాళ్ళతోనే నడిచే వాళ్ళం. కాళ్ళలో బాగా ముళ్ళు ఇరిగేవి. ముళ్ళు తీయటంలో  నాది అందె వేసిన చెయ్యి. మా నాన్నకి నొప్పి తెలియకుండా బహు నేర్పుగా ముళ్ళు తీసేదాన్ని. తీయటమే కాదు, కాదు, అది దొంగాముల్లా? దొర ముల్లా  చెప్పేదాన్ని. కనురెప్ప వెంట్రుక పీకి  ఆ ముల్లుకు అంటిస్తే, అంటుకుని పైకి లేపితే లేస్తే, అది దొంగ ముల్లు, లేవకపోతే  దొరముల్లు అన్నమాట.                    మా నాయన కాల్లో ఎప్పుడూ దొంగ ముళ్ళే గుచ్చుకునేవి.

మీరు గూడా మీ పిల్లలకు తుమ్మచెట్లు చూపించండి, వాటిని పరిచయం చేయండి.. .✍️                                                                               
                 సే:వల్లూరి సూర్యప్రకాష్.
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

   ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.
లింక్ పంపుతాము.?
[+] 1 user Likes Yuvak's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)