Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నారదుని పూర్వజన్మ వృత్తాంతము
#1
070923c2017.   090923-3.
???????????08.
కలియుగంలో   కేవలం   భాగవతం చదివినంత మాత్రాన,    విన్నంత మాత్రాన,కృష్ణ నామం స్మరించినంత మాత్రాన     పంచ మహాపాతకాలే కాదు, సమస్త పాపరాశి  ధ్వంసమై కృష్ణ లోకమైన  మోక్షాన్ని చేరుకుంటారు.✍️

చాగంటి వారి…
             శ్రీ మదాంధ్ర భాగవతం
                   ➖➖➖✍️
                     8వ భాగం


శ్రీమదాంధ్ర భాగవతం - నారదుని పూర్వజన్మ వృత్తాంతము:

“వ్యాసా! నా చరిత్ర నీకు చెపుతాను వింటే నీవు తెల్లబోతావు!” అని తాను నారదుడెలా అయ్యాడో చెపుతాడు.

నారదుడు ఒక దాసీపుత్రుడు. ఆయన తల్లిగారు చిన్నతనం నుంచీ బాగా ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగం  చేసేది.   వాళ్ళ ఇల్లు తుడవడం, వాళ్ళ గిన్నెలు తోమడం, ఆవులకు పాలు పితికి పెట్టడం మొదలగు పనులు చేసేది. 

తల్లి ఎక్కడికి వెడితే అక్కడికి వెళుతూ ఆ బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు. 

వారు వేదవేదాంగములను చదువుకున్నవారు. ఆ ఇంటికి వర్షాకాలంలో కొంతమంది సన్యాసులు చాతుర్మాస్యమునకు వచ్చారు. వస్తే అమ్మతోపాటు ఈ పిల్లవాడు కూడ అక్కడ ఉన్నాడు. యజమాని  ఈ పిల్లవానికి  రోజూ ‘నీవు ఉదయముననే స్నానం చేసేసి, వాళ్ళకి పీటలు వెయ్యడం, దర్భాసనములు వెయ్యడం, వాళ్ళ మడిబట్టలు తీసుకురావడం, ఇటువంటి పనులు చేస్తూ ఉండవలసినద’ ని చెప్పాడు.

దాసీ పుత్రుడైన నారదుడు రోజూ స్నానంచేసి వాళ్ళ మడిబట్టలు తీసుకువచ్చి అక్కడ పెడుతూ ఉండేవాడు. 

వాళ్ళు సన్యాసులు అంటే లోకం అంతటా పరబ్రహ్మమును చూసేవాళ్ళు. ఆ పిల్లవాని దాసీపుత్రునిగా చూడలేదు. అయిదు సంవత్సరముల పిల్లవాడు తమకు చేస్తున్న సేవచూసి వారు తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్ఠమును నారదునికి ఇచ్చేవారు. 

మహాభాగవతులయిన వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవత శేషమును తినేవాడు. 

ఆ వచ్చిన  సన్యాసులు  పొద్దున్న లేవడం, భగవంతుడిని  అర్చన చేసుకోవడం, వేదవేదాంగములు చదువుకోవడం, వాటిని గూర్చి చర్చ చేసుకోవడం, మధ్యాహ్నం అయేసరికి భగవంతుని స్మరిస్తూ సంతోషముతో పాటలు పాడుతూ నాట్యం చేయడం చేస్తూ ఉండేవారు. 

ఆఖరుకి చాతుర్మాస్యము అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోతూ పిల్లవాడయిన నారదుని పిలిచి –

‘అపచారంబులు లేక నిత్యపరిచర్యాభక్తి యుక్తుండనై
చపలత్వంబును మాని నే గొలువగా సంప్రీతులై వారు ని
ష్కపటత్వంబున దీనవత్సలతతో గారుణ్య సంయుక్తులై
యుపదేశించిరి నాకు నీశ్వరరహస్యోదారవిజ్ఞానమున్!!’

ఆ పిల్లవానికి ఏమీ తెలియకపోయినా, ఏ తాపత్రయం లేకుండా మనస్సులో వాళ్ళమీద ఉన్న అపారమయిన భక్తిచేత అతడు వారిని సేవించగా – వారందరు కూడ కారుణ్యమని చెప్పడానికి కూడ వీలు లేదు – మిక్కిలి వాత్సల్యచిత్తముతో నారదుని వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుని వానికి కృష్ణ పరమాత్మమీద ద్వాదశాక్షరీ మహామంత్రమును ఉపదేశము చేసి ప్రణవోపదేశం చేసేసి ఆ పిల్లవానిని ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో, సత్యం ఎలా ఉంటుందో చెప్పారు. ఇంతకాలం అటువంటి వారిని సేవించి ఉండడము వలన నారదునికి సత్పురుష సాంగత్యం కలిగింది.

‘సత్సంగత్వే నిస్సంగత్వం – నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం – నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||’

సత్పురుషులతో తిరగడం వలన హృదయము అంతా పరిశుద్ధమై వెంటనే ఈయనకు మనసులోకి అందింది. చాతుర్మాస్యము అయిపోయి ఆ సన్యాసులు వెళ్ళిపోయారు. తాను లోపల ఆ శ్రీమన్నారాయణుని తలుచుకొని పొంగిపోతూ రోజూ అమ్మతో వెళ్ళేవాడు. 

ఒకరోజు చీకటిపడిపోయిన తరువాత గృహయజమానులయిన బ్రాహ్మణులు పిల్లవాని తల్లిని పిలిచి పెరట్లోకి వెళ్ళి ఆవులపాలు పితికి పట్టుకుని రమ్మని చెప్పారు. 

ఆవుపాలు పితుకుదామని వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద త్రాచుపాము పడుకున్నది. ఆవిడ చూడకుండా పొరపాటున దానిమీద కాలువేసింది. త్రాచుపాము ఆవిడని కరిచేసింది. తల్లి చచ్చిపోయింది. పిల్లవాడు – ‘ నాకు ఉన్న ఒకే ఒక బంధం తెగిపోయింది. అమ్మ అన్నది ఒకర్తి ఉండడం వలన నేను ఈ ఇంట్లో అమ్మతోపాటు తిరగవలసి వచ్చింది. ఇప్పుడు నేను స్వేచ్ఛావిహారిని. అంతా ఈశ్వరుణ్ణి చూస్తూ వెళ్ళిపోతాన’ ని వెళ్ళి వెళ్ళి చివరకు ఒక మహారణ్యములోకి వెళ్ళాడు. 

అక్కడ పెద్దపులులు, కౄరసర్పములు తిరుగుతున్నాయి. ఆయన – ‘నాకు ఏమిటి భయం! ఈలోకం అంతటా నిండి నిబిడీకృతమై శాసించే కారుణ్యమూర్తయిన శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఉన్నాడని వాళ్ళు నాకు చెప్పారు. 
నా స్వామి ఉండగా నాకు ఏ ఆపదా జరగదు’ అనుకున్నాడు. 

ఆ సమయములో అతనికి విపరీతమయిన దాహం వేసింది. అక్కడ ఒక మడుగు కనబడింది. అక్కడ నీళ్ళు తాగి స్నానంచేసి ‘ఇక్కడ నా స్వామి ఒకసారి నాకు సాకారముగా కనపడితే బాగుండున’ ని ఒక రావిచెట్టు క్రిందకూర్చుని ద్వాదశాక్షరీ మంత్రమును తదేకముగా ధ్యానం చేస్తుంటే లీలామాత్రముగా ఒక మెరుపులా శ్రీమన్నారాయణుని దర్శనం అయింది. 

పొంగిపోయి పైనుంచి క్రిందకి మెరుపును చూసినట్లు చూశాడు. అంతే! స్వామి అంతర్ధానమయి ఆయన యొక్క వాణి వినపడింది ‘ఈజన్మలో సత్పురుషులతో తిరిగిన అదృష్టంచేత, వాళ్ళ మాటలు పట్టించుకున్న కారణంచేత, నీకు లీలామాత్ర దర్శనము ఇచ్చాను. నీవు చూసిన రూపమును అలా బాగా చూడాలని కోరుకుంటూ, నువ్వు నా గురించే చెప్పుకుంటూ, నా గురించే పాడుకుంటూ, నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి తిరిగి దేహధర్మమును అనుసరించి ఒకరోజున ఈ శరీరమును వదిలేస్తావు. అలా వదిలేసిన తరువాత నిన్ను గుప్తముగా ఉంచుతాను. ఒకనాడు నీవు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని కుమారుడిగా జన్మిస్తావు. ఆనాడు నీకు ‘మహతి’ అనే వీణను బహూకరిస్తాను. దానిమీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకములయందు విహరిస్తావు. నీకీ కానుకను ఇస్తున్నాను’ అన్నాడు.

‘ఆనాడు శ్రీమన్నారాయణున్ని దర్శనం చేస్తూ దేశమంతటా తిరిగి స్వామి గురించి చెప్పుకుని, చెప్పుకుని దేహధర్మం కనుక ఒకనాడు ఈ శరీరము వదిలిపెట్టి సంతోషముగా బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళిపోయాను. మళ్ళీ కల్పాంతం అయిపోయిన తరువాత నారాయణుని నాభికమలంలోంచి మరల చతుర్భుజ బ్రహ్మగారు సృష్టింపబడ్డారు. మొట్టమొదట ప్రజాపతులను సృష్టించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను సృష్టించారు. నాకు ‘మహతి’ అను వీణను ఇచ్చారు. ఆ వీణ సర్వకాలములయందు భగవంతునికి సంబంధించిన స్తోత్రమే పలుకుతుంది. నేను నారాయణ నామము చెప్పుకుంటూ లోకములనంతటా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను. నేను వైకుంఠమునకు, సత్యలోకమునకు, కైలాసమునకు వెళతాను. ఏ ఊరుపడితే ఆ ఊరు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమమును ఆవిష్కరిస్తాను. భగవంతుని శక్తి గురించి మాట్లాడతాను. అదితప్ప మరొకటి నాకు రాలేదు.

వ్యాసా! దాసీపుత్రుడనయిన నాకు నలుగురు సన్యాసులు ఉపదేశించిన జ్ఞానము ఇవ్వాళ నన్నీస్థితికి తెచ్చింది. రెండవజన్మలో నారదుడను అయ్యాను. 

నీవు భాగవతమును, భగవత్కథను చెప్పగలిగితే విన్నవాడు ఉత్తరజన్మలో ఎందుకు మహాజ్ఞాని కాలేడు? ఎందుకు భక్తుడు కాలేడు? అందుకని నీవు భగవద్భక్తి గురించి చెప్పవలసింది. దుర్యోధన ధృతరాష్ట్రులగురించి చెప్పకపోయినా ప్రజలకందరకు వారిని గురించి తెలుసు. అందుకని భక్తి గురించి చెప్పు. భక్తికి ఆలవాలమయిన భాగవతమును రచించు’ అన్నారు.

మహానుభావుడు వ్యాసభగవానుడు నారదుని మాటలు విని పొంగిపోయి ‘నారదా! ఎంతగొప్పమాట చెప్పావు. నేను భగవంతుని గురించి, భగవంతుడి విశేషముల గురించి, ఈ బ్రహ్మాండముల ఉత్పత్తిగురించి, ఆయనను నమ్ముకున్న భాగవతుల గురించి, ఈశ్వరుడు వాళ్ళవెంట పరుగెత్తినటువంటి వృత్తాంతముల గురించి నేను రచన చేస్తాను. 

ఇది ఎవరు చదువుతారో, ఎవరు వింటారో వాళ్ళు నీవు తరించినట్లు తరిస్తారు. అటువంటి భాగవతమును రచన చేయడం ప్రారంభిస్తున్నాన’ ని ఆచమనము చేసి కూర్చుని వ్యాసభగవానుడు తన ఆశ్రమములో భాగవత రచన ప్రారంభము చేశారు.✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: