Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Kadapa Ruchulu
#1
కడప లో పెరిగి, ఒకసారి ఇక్కడ రుచులకు నాలుక అలవాటు పడ్డాక, మరే ఊరిలోని వంటకాలు తిన్నా సరే! దాన్ని తృప్తి పరచడం మహా కష్టం. బయటి ఊరి వాల్లెవరైనా కడప గురించి విన్నపుడు, అబ్బే కరువు ప్రాంతం కదా ఇక్కడి వంటలు ఏం రుచి గా ఉంటాయి లే అనుకుంటారు, కానీ ఒక్కసారి కడప గడప లో అడుగుపెట్టి ఇక్కడి ఆతిథ్యం స్వీకరించాక గానీ నమ్మరు, కడప లో రుచులు అద్భుతస్యహ అని. సీమ లో జనాలకు ఆతిథ్యం ఇవ్వడం అంటే మహా ఇష్టం, ఇంట్లో వాల్లకు లేకపోయినా సరే, అథితి కి మాత్రం ప్రేమ తో చుక్కలు చూపించాల్సిందే, అందుకే సీమ లో మంచినీల్లడిగితే మజ్జిగిస్తారు, అన్న సామెత పుట్టుక్చొచ్చింది. 

ఇక పోతే, కడప లో బాగా ఫేమస్సు గా దొరికే కొన్ని తినుబండారాల గురించి ఈ పోస్టు, వంటా వార్పు గురించి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల అవి ఎలా చేస్తారో నేను వివరించలేకపోవచ్చు గానీ అవి ఎక్కడ దొరుకుతాయో, ఏ ఏ స్పెషల్స్ దొరుకుతాయో మాత్రం వివరించడానికి ట్రై చేస్తా!

కడప గురించి మాట్లాడుకునేటప్పుడు దోశె తోనే మొదలెట్టాలి, ఇక్కడ దోశెల్లో కారమే కాదు, మమకారం కూడా బాగానే దట్టిస్తారు, అందుకే కల్లలో నీల్లు కారిపోతున్నా సరే, కంచెం లో దోశె ను ఒక పట్టాన వదలబుద్ది అవ్వదు. చాలా చోట్ల దోశె అంటె ఒక వైపే కాలుస్తారు, కానీ కడప లో రెండు వైపులా కాల్చి, ఒక వైపును  ఎండు  మిరపకాయలతో చేసిన ఎర్రకారం, పుట్నాల పప్పులతో చేసిన పొడి, బొంబాయి చట్నీ, (కొన్ని చోట్ల దీన్ని 'పిట్లా' అంటారు) ని దోశె మొత్తం బాగా పూసి బాగా ఎర్ర గా కాల్చి చేస్తారు. ఈ దోశెలు చెన్నూరు బస్ స్టాండ్ దగ్గర చాలా ఫేమస్, పది పదిహేనేల్ల కిందట, ఒకే వరుసలో మూడు బండ్లు ఉండేవి, అప్పట్లోనే ఒక్కో దోశె 6 రూపాయలు, ఇప్పుడు 40 రూపాయలనుంచి వండ రూపాయల దాకా ఉంది, బండ్లు పోయి స్టాల్లు వెలిసాయి. దోశెల్లో అక్కడ దొరకని వెరైటీ ఉండదు, దోశె దొరకాలంటే ఎలాంటి టైం లో అయిన కనీసం అరగంట వెయిట్ చేయాల్సిందే.  

బీకేయం వీధి లో లక్ష్మీ నారాయణ స్వామి గుడి పక్కన ఒక చిన్న హోటల్లో పొద్దున మాత్రమే 'పచ్చి కారం దోశె ' దొరుకుతుంది, దీని రుచి గురించి కనీసం ఒక గంట చర్చించుకోవచ్చు. ఇక్కడే 'చిట్లం పొడి దోశె, చింతాకు పొడి దోశె, కరివేపాకు పొడి దోశె ' లాంటి వెరైటీ లు దొరుకుతాయి. 

ఊటుకూరు గేటు దాటె చమ్మిమియ్యా పేట లో దొరికే పాలకూర దోశె, టాప్ క్లాస్. ఇంకా యెర్రముక్కపల్లె లో దొరికే సమీర్ దోశె, గాంధీనగర్ స్కూల్ దగ్గర దొరికే రాగి దోశె కూడా ఫేమస్సే. మామూలుగా కడప దోశెలంటే బాగా పల్చగా ఉండి వాటి లోపల పూసిన టాపింగ్స్ మొత్తం కొంచెం ట్రాస్పరెంట్ గా బయటికి కనిపిస్తూ, చాలా క్రిస్పీ గా ఉంటాయి, కాని పెద్ద దర్గా దగ్గర దొరికే సోమయ్య దోశెలు మాత్రం దీనికి భిన్నం, చాలా మందం గా కారం దట్టం గా పూయబడి, నెయ్యి లో స్నానం చేయబడిna ఒక్క దోశె తిన్న కడుపు నిండిపోతాయి. 

  
కడప లో ఇడ్లీ లు మాత్రం తక్కువా? కానీ ఇక్కడ రవ్వ ఇడ్లీ కన్నా పిండి ఇడ్లీ లు బాగా ఫేమస్సు, రవ్వ ఇడ్లీలు పెద్ద హోటల్ల లో మాత్రమే దొరుకుతాయి, కాని ప్రతీ వీధి దగ్గరా బండి లో పిండి ఇడ్లీలు దర్శనమిస్తాయి, కోటి రెడ్డి సర్కిల్ నుంచి నారాయణ కాలేజ్ కి వెల్లే దారిలో దొరికే శ్యాం బండి ఇడ్లీలు చూడటానికి మల్లె పువ్వు లా తెల్లగా ఉండి, తినటానికి దూది కన్నా మెత్తగా ఉండి, నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయి, ఇంకా దొంగల చెరువు కట్ట మీద సాయంత్రం దొరికే ఇడ్లీ ఖుడా దాదాపు గా ఇదే రుచి తో ఉంటుంది, దేవుని కడప మాడ వీధుల పక్కన దొరికే ఎర్ర కారం ఇడ్లీ కూడా యమా టేస్టీ. 

ఇక కడప బిరియానీ, 21 వ శతాబ్దపు సరికొత్త సంచలనం, ఇరవై సంవత్సరాల కిందట, చెన్నూరు లో శివరాం అనే ఒక వ్యక్తి చిన్న పందిరి వేసి ఒక బిరియానీ హోటల్ మొదలెట్టాడు, అది కడపా, హైదరాబాదు నేషనల్ హైవే కావటం తో కస్టమర్ల ప్రవాహానికి ఇబ్బంది ఉండదు, జనాలకు ఈ బిరియాని ఎంత నచ్చేసిందంటే, పదేల్లు తిరక్కుండానే ఒక్క కడప నగరం లోనే చెన్నూరు బిరియానీ పేరుతో వందకు పైగా హోటల్లు వెలిసాయి, కానీ ఒరిగినల్ బ్రాంచ్ మాత్రం చెన్నూరు లో నే ఉంది, ఇది ఎంత ప్రాచుర్యం లోకి వచ్చిందో తెలియడానికి రెండు ఉదాహరణలు చాలు, రోడ్డు పక్కన చిన్న స్టాలు పెట్టుకుని బిరియానీలు అమ్ముకునే చోటికి ఐటి అధికారులు లెక్కలు చూపించమని రైడు కు రావడం, అమెరికా లోని ఓ పేద్ద హోటల్ మెను లో చెన్నూరు బిరియానీ అన్న రెసిపీ దొరకడం.

 కడప జిల్లా మొత్తం కలిపి, చెన్నూరు బిరియానీ పేరుతో రమారమి ఓ 500 హొటల్ల దాకా ఉండొచ్చని అంచనా!

కడప నుంచి రాయచోటి వెల్లే దారిలో గువ్వల చెరువు ఘాట్ దిగగానే ఓ ఇరవై ముప్పై పాలకోవా సెంటర్లు కనిపిస్తాయి, ఇక్కడ నుంచి విదేశాలకు కోవా ఎగుమతి అవుతుండంటె నమ్మండి, అక్కడికెల్లి నించోగానే ఓ చిన్న కప్పులో కోవా వేసి పైన, కొన్ని బాదం పలుకులు వేసి ఇస్తాడు, దాని రుచి నచ్చితేనే మనం కొనుక్కోవచ్చు, లేదా కొనుక్కోకుండా వెల్లిపోవచ్చు కూడా, డబ్బులు అడగరు.

 ఆరేడెల్ల క్రితం నాగరాజు పేట లో ఓ బండి లో బొరుగుల మిచ్చర్ దొరికేది, బాగా ఫేమస్సు, కడప మాజీ మంత్రి అహ్మదుల్లా గారి ఇంటి నుంచి రోజు ఆ బొరుగుల కోసం కారు వచ్చేది, ఎమయిందో తెలీదు గానీ ఇప్పుడు ఆ బండి అక్కడ కనిపించటం లేదు, రాజారెడ్డి వీధి లో సీయస్సై గ్రౌండు వెనక పక్క ఓ బొరుగుల బండి లో 30 వెరైటిలు దొరుకుతాయి.

కృష్ణా హాలు నుంచి దేవుని కడప వెల్లే రోడ్లో దొరికే సమోసా  భలే ఉంటుంది, ఇక్కడ మరో స్పెషల్ ఏంటంటే స్వీట్ సమోసా, బూంది ని స్టఫ్ గా పెట్టి సమొసా వేసి దానికి పాకం పడతారు, చాలా బావుంటుంది. 

వైవీ స్ట్రీట్ దగ్గర దొరికే అలంకార్ లస్సీ, కొంచెం లోపలికి వెల్లగానే దొరికే బాసుంది కడప ఐకానిక్ డిజర్ట్స్. నల్లమల అడువుల్లో మాత్రమే దొరికే నన్నారి వేర్లతో తయారు చేసే షర్బత్ చాలా కమ్మగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కడప నుంచి ఈ నన్నారి షర్బత్ బాటిల్లు విదేశాలకు చాలా రెగ్గులర్గా పార్సిల్ అవుతుంటాయి, నేనే నా స్నేహితులకు చాలా సార్లు పంపించాను. షర్బత్ తో పాటు నానబెట్టిన సబ్జా గింజలు కలుపుతారు, చూడటానికి చాలా కలర్ పుల్ గా ఉంటుంది. 

ఇంతేనా........రాయటానికి చలా చాలా ఉంది, గుర్తొచ్చినపుడల్లా కాస్త పొడిగిస్తూ వెల్తా,

 మరి ఇన్ని రుచులకు అలవాటు పడిన ప్రాణం, వేరే ఊరికెల్లి అక్కడేదైనా కంటికి ఇంపు గా కనిపించగానే ఆత్రం గా తినేసి, చేయి కడుక్కునేప్పుడు మాత్రం, '  చ..చ..దోశె అంటె కడప లో నే తినాలి రా..ఇవేం దోసే లు అనుకుంటూ, అసంతృప్తి గా లేచి వచ్చేయడo తప్ప ఏం చేస్తుంdi.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)