Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు
#1
*'కృతికారక దీపిక'!*
★★★★★★★★★
సరస్వతీ పుత్ర
పుట్టపర్తి నారాయణాచార్యులు
28-3-1914    1-9-1990
(ఈరోజు వారి జయంతి)
◆◆◆◆◆◆◆◆◆◆
సుప్రసిద్ధతెలుగు కవి, బహుభాషావేత్త,
సరస్వతీ పుత్ర బిరుదాంకితులైన
పుట్టపర్తినారాయణాచార్యులు వారు
1914, మార్చి28,నఅనంతపురం జిల్లా 
అనంతపురం మండలంలోని
చియ్యేడు గ్రామంలో జన్మించారు. 
ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు, 
(వీరు గొప్ప సంస్కృత పండితులు)
తల్లి లక్ష్మిదేవి (కొండమ్మ)  
అసలు వారి ఇంటి పేరు తిరుమలవారు. 
శ్రీకృష్ణదేవరాయల రాజగురువు 
తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులవారు గొప్ప  పండితులు. ఆయన గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులుచిత్రావతీ నదీతీరంలో 
పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది.

నారాయణాచార్యులు గారు 
చిన్న వయసులోనే భారతం,భాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆయన తిరుపతి సంస్కృత కళాశాలలోసంస్కృతం నేర్చుకున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, 
డి.టి. తాతాచార్యులు లాంటి 
గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణం, ఛందస్సు, 
తదితరాలు నేర్చుకున్నారు. 
పెనుగొండలో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర భరత నాట్యం నేర్చుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం ఆయనలో త్రివేణీసంగమంలా మిళితమయ్యయి. 
చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేయడమే గాక సన్నివేశాల మధ్య తెర లేచేలోపు నాట్యం చేసే వారు. 
పెనుగొండలో పిట్ దొరసాని వద్ద ఆంగ్లసాహిత్యం నేర్చుకున్నారు

ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. 
మొదటఆయనపనిచేసింది
అనంతపురంలో.అప్పటికింకా 
స్వాతంత్ర్యంరాలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కి సమయం దొరికితే చాలు, ఆంగ్లేయుల్ని తనివితీరా పొగడడం,గాంధీ వంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది. అది సహించలేని పుట్టపర్తి ఆయనతో వాగ్యుద్ధానికి సిద్ధపడడమే గాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు 
తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ,
ప్రొద్దుటూరు లోనూ పనిచేసి చివరకు కడపలోస్థిరపడ్డారు. 
కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు.
సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది.

ఆయన బహుభాషావేత్త, అనేక భాషల్లో పండితులు.తుళు, ఫ్రెంచి, పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. ఆయనకి పాలీ (బౌద్ధ, జైన సాహిత్యాలు) భాషలో మంచి ప్రావీణ్యం ఉండేది. 

అనువాదాలు:
అవధీ భాషనుండి తులసీదాస్ రామయణం, బ్రజ్ భాషనుండి సూరదాస్, రసఖాన్ మొదలైన వారి రచనలు, పాత అవధీ, బ్రజ్ భోజ్ పురీ భాషల మిశ్రమంనుండి కబీర్ దోహాల హింది. ఇలా పుట్టపర్తి వారు ఆనేక ప్రసిద్ధ తమిళ, కన్నడ, మలయాళ, 
మరాఠీకావ్యాలను తెలుగులోనికి అనువదించారు.

హృషీకేశ్ లో ఆయన పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి ఆయనకు 'సరస్వతీపుత్ర' బిరుదునిచ్చారు. ఆయనకు లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా 
ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి ఆయన ఉంచుకున్నారు.

'లీవ్స్ ఇన్ ది విండ్', దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన 'ది హీరో' ఆంగ్లంలో ఆయన స్వంత రచనలు. ఆయన ఆంగ్లంలో మరిన్ని రచనలు చేసి ఉండేవారే. ఆయనకు ఆంగ్లం నేర్పిన 
వి.జె. పిట్ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్ కలెక్టర్ భార్య. 
ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బ్రౌనింగ్ పై రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందింది. అప్పట్లోనే ఈయన వ్రాసిన 'లీవ్స్ ఇన్ ది విండ్'
 కావ్యం చూసి హరీంద్రనాథ్చటోపాధ్యాయ 
పెద్ద కితాబు ఇచ్చారు.

అయితే పిట్ దొరసాని మాత్రం 
"ఇంగ్లీషులో వ్రాయడానికి అనేక మంది ఇండియన్స్ ప్రయత్నించి ఫెయిలైనారు. మీరెంత కష్టపడినా మిమ్మల్ని క్లాసికల్ రైటర్స్ ఎవరూ గౌరవించరు. అందుకే బాగా చదువుకో. కానీ ఇంగ్లీషులో వ్రాసే చాపల్యం పెంచుకోవద్దు." అని చెప్పింది. 
దాంతో ఆయన చాలా రోజులు 
ఆ ప్రయత్నమే చేయలేదు. అయితే 
ఆ తర్వాత చాలా కాలానికి భాగవతాన్ని ఇంగ్లీషులోకి అనువదించడంతో బాటు 
'ది హీరో 'నాటకాన్ని వ్రాశారు. 
కథంతా స్వీయ కల్పితమే.

ఆయన చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేశారంటే చరిత్రకారులకు ఆయన పట్ల గొప్ప గౌరవముండేది. ఒకసారి ఆయనకు కమ్యూనిస్టులు సన్మానం చేసినప్పుడు,
ఆంధ్రుల చరిత్రలో గాఢమైన అభినివేశమున్న 
మల్లంపల్లి సోమశేఖరశర్మ 
"ఆయన్నుకవిగా కంటే 
చారిత్రకునిగా గౌరవిస్తానని" 
సందేశం పంపారు. 

తర్వాత పుట్టపర్తి వారు చారిత్రకులను ఇరుకున పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుణ్ణి ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ "సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడుఅని ఉంది కదా వీడెవడు ఈ సంపెట నరపాల గాడు?" అని అడిగి, ఆయన దిగ్భ్రాంతుడై నిలబడి పోతే, తనే సమాధానం చెప్పాడు. "కృష్ణదేవరాయలేనయ్యా, వాళ్ళ వంశం తుళు వంశం, ఇంటివాళ్ళు సంపెట వాళ్ళూ" అని సమాధానమిచ్చారు.

భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీపురస్కారాన్నిచ్చింది. ఆయితే ఆయన నిజానికి జ్ఞానపీఠ అవార్డు పొందడానికి అన్నివిధాలా అర్హులనీ, ఆయనకు ఆ అవార్డు రాకపోవడం తెలుగువారి దురదృష్టమనీ పలువురు పండితులు భావిస్తారు. 
గుర్రం జాషువా 
"పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్వడు?" అని ప్రశ్నించారు.

కేవలం పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని ఐన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా 
'పెనుగొండ లక్ష్మి' అనే గేయ కావ్యం రాశారు. చిత్రంగా తర్వాత ఆయన విద్వాన్ పరీక్షలు వ్రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యాన్నే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక కమనీయ ఘట్టం. చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. 
దానికి కారణం 'పెనుగొండ లక్ష్మి' కావ్యం నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి 
ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూఉండిపోవడంతో సమయం అయిపోవడం. ఆ ప్రశ్నకు 'పూర్తి'
 మార్కులు (అంటే 2 మార్కులు) వచ్చినా ఆ మార్కులతో ఆయన పాస్ కాలేకపోయారు. ఆయన బడికి వెళ్ళే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు వ్రాశారు.

తాను కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విశ్వనాథసత్యనారాయణ 
నవల ఏకవీరను మలయాళం లోనికి అనువదించారు. పండితులు ఒకరి పాండిత్యాన్ని మరొకరు మెచ్చరని అంటారు. కాని పుట్టపర్తివారి విషయంలో మాత్రం దీనికి విరుద్దం. ఒక సారి విజయవాడలో పుట్టపర్తి వారు తన 'శివతాండవం' గానంచేసినప్పుడు 
విశ్వనాథ సత్యనారాయణ గారు,
ఆనంద పరవశుడై ఆయనను భుజాలపైన కూర్చోబెట్టుకుని ఎగిరారు. 
ఇంకొక సారి వైజాగ్ యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం ఐపోయాక ప్రాకృత భాషలలో పాండిత్యం గలపంచాగ్నుల ఆది నారాయణ రావు సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశారు.

తెలుగులో ఆయన వ్రాసిన 'శివతాండవం' ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది. దీనిని అనేకమంది పండితులు ఆధునిక మహా కావ్యంగా అభివర్ణిస్తారు. ఇది ఆరు భాగాలుగా ఉంది. దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ శివతాండవం గానం చేయమనే వారు. తెలుగు అర్థం కాని వారు సైతం 
ఆ మాత్రాచ్ఛందస్సు లోని 
శబ్దసౌందర్యానికి పరవశులయ్యేవారు. 
ఆయన గాత్ర మాధుర్యం ఎటువంటిదంటే శివతాండవాన్ని ఆయన స్వయంగా గానం చేయగా విన్న వాళ్ళు "ఆ శివుడు ఆడితే చూడాలి-ఆచార్యులవారు పాడితే వినాలి" అని భావించేవారు.

మచ్చుకు ఒక ఉదాహరణ:
"కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల
తుందిలా కూపార తోయపూరము దెరల
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప
వన కన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!"

ఆయన 140 పైగా గ్రంథాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి.

దేశంలోనిఅన్నిప్రాంతాలలో
హైదరాబాదు, చెన్నై, కలకత్తా లాంటి 
అన్ని నగరాలలో ఆయన సత్కారాలు పొందారు. 
శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్. ప్రదానం చేశాయి. 

చిరుప్రాయంలోనే కావ్య రచనకు శ్రీకారం
చుట్టి ,ఏడు దశాబ్దాలకు పైగా అనేకానేక రచనలతో , తెలుగు సాహితీ కళామతల్లి
కంఠసీమను అలంకరించిన పుట్టపర్తి వారు
1990 సెప్టెంబర్ 1న స్వర్గస్థులయ్యారు.

*సాహిత్య దీపిక*
28-3-2019
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు - by Yuvak - 29-03-2019, 12:16 PM



Users browsing this thread: 1 Guest(s)