Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తృప్తి
#1
తృప్తి - పార్ట్ 1
 
రచన: శ్రీపతి లలిత






"అమ్మా!" గుమ్మం లో నిలబడ్డ ఆదిత్యని చూసి, కళ్లనుంచి నీళ్లు కారాయి సుభద్రకు.



ఎలా ఉండే పిల్లాడు ఎలా అయిపోయాడు అనుకుంటూ "ఆదీ! రా నాన్నా!" అంటూ చెయ్యిపట్టుకుని లోపలికి తీసుకుని వచ్చింది.



"నాన్న ఏమన్నా అంటారేమో?" అంటూ చూస్తున్న ఆదిత్యకి లోపల దిగులుగా చూస్తున్న రాజారాం కనిపించాడు.



"అయామ్ సారీ నాన్నా, మిమ్మల్ని నిరాశపరిచాను" కళ్ళనీళ్ళతో అంటున్న కొడుకుతో "ఆదీ! నీకంటే మాకు ఏదీ ఎక్కువ కాదు నాన్నా!" అంటూ హత్తుకున్నాడు రాజారాం ఆదిత్యని.



అమెరికాలో మంచి ఉద్యోగం వదిలి వచ్చినందుకు తల్లి, తండ్రి ఏమి అంటారో అంటూ భయపడుతూ వచ్చిన ఆదిత్యకి ధైర్యం వచ్చింది.



"అమ్మా! ఆకలి దంచేస్తోంది. సరిగ్గా భోంచేసి వారమైంది, ఏం చేసావు వంట?" అంటూ భోజనాల బల్ల మీద చూసాడు.



"అన్నీ నీకిష్టమైనవే" అని తల్లి అంటుంటే ఒకో గిన్నె మూత తీసి "వావ్! వంకాయ కూర, మామిడికాయ పప్పు, కొబ్బరి పచ్చడి. నేను స్నానం తర్వాత చేస్తాను. అన్నం పెట్టేయి" అని చెయ్యి కడుక్కుని కూర్చున్నాడు.



ఆదిత్య తినే పద్దతి చూసి సుభద్ర, రాజారామ్ కి కళ్ళలో నీళ్లు తిరిగాయి. తిని వారం కాదు.. సంవత్సరం అయినట్టు, తిండికి ముఖం వాచినట్టు, మాటా, పలుకూ లేకుండా తింటుంటే బాధగా అనిపించింది.



ముగ్గురికీ వండిన వంట అంతా తనే తినేసి" అమ్మా! అంతా నేనే తిన్నట్టున్నాను. మళ్ళీ వండుకో " అంటూ తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి, తండ్రిని హత్తుకుని "నేను పడుకుంటాను, లేపకండి. సరి అయిన నిద్ర పోయి ఎన్ని రోజులయిందో" అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.



ఆదిత్య లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాక సుభద్ర దుఃఖం ఆపుకోలేకపోయింది.



"ఊరుకో భద్రా! వచ్చేసాడుగా, ఇంక వాడి సంగతి మనం చూసుకుందాము" అంటూ ఓదార్చాడు కానీ, అతనికీ కంటి నుంచి నీరు కారుతూనే ఉంది.



ఆదిత్య వీళ్ళకి ఒక్కగాని ఒక్క కొడుకు. పదోక్లాస్, ఇంటర్ లో స్టేట్ ఫస్ట్, ఐఐటీ లో మొదటి రాంక్, క్యాంపస్ లోనే అమెరికాలో పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ వాళ్ళు దాదాపు రూపాయల్లో సంవత్సరానికి రెండు కోట్ల జీతంతో ఉద్యోగం ఇచ్చారు. అన్ని పేపర్ల లోనూ ఆదిత్య ఫొటోలే.



చిన్నప్పటి నుంచి తన అంతట తనే చదువు మీద శ్రద్ధతో బాగా చదివేవాడు. అమ్మా, నాన్నా, చదువు తప్ప వేరే లోకం లేదు, పెద్ద స్నేహితులు లేరు.



సుభద్ర కానీ, రాజారామ్ కానీ, పెద్దగా స్నేహితులతో ఆడుకోమనీ, తిరగమనీ ప్రొత్సాహించిందీ లేదు. చదువుకోమని వెనక పడాల్సి రాకపోయినా, సినిమాలకి కానీ బంధువుల ఇళ్లలో పెళ్లి, పేరంటాలకు కానీ తీసుకెళ్లకుండా, చదువు తప్ప వేరే లోకం లేకుండానే పెంచారు.



ఎవరైనా పిల్లలు దగ్గరికి వద్దామని ప్రయ్నతించినా, వాళ్లు అల్లరి పిల్లలు, పెద్ద చదవరు అంటూ దూరం పెట్టేవారు. తాము ఇంట్లో టీవీ చూసినా, సినిమాకి వెళ్లినా ఆది కి ఇబ్బంది అని వీళ్ళు ఎక్కడికీ వెళ్లేవారు కాదు.



అమెరికా వెళ్లిన కొత్తల్లో వారానికి రెండు,మూడు సార్లు ఫోన్ చేసి తల్లి తండ్రులతో బాగా కబుర్లు చెప్పేవాడు. జీతంలో తన ఖర్చులకు ఉంచుకుని, అంతా తండ్రికే పంపేవాడు.



రాజారామ్ కూడా ఆ డబ్బులతో మంచి విల్లా, రెండు, మూడు స్థలాలు కొన్నాడు. వికారాబాద్ వేపు ఫార్మ్ హౌస్ కోసం రెండు ఎకరాల స్థలం కొని అందులో ఒక రెండు బెడ్ రూంల ఇల్లు, పనివాళ్ళకోసం ఒక చిన్న ఇల్లు కట్టించి, ఆ స్థలంలో మామిడి, జామ, కొబ్బరి చెట్లు కొన్ని వేయించాడు.



ఉద్యోగంలో చేరిన మూడేళ్ళలో రెండు సార్లు వచ్చి ఒక రెండు రోజులు ఉండి వెళ్ళాడు ఆదిత్య.



అది కూడా ఆఫీస్ పని మీదే. రాను రాను ఫోన్లు తగ్గాయి. చేసినా కూడా "ఎలా ఉన్నారు?" అని అడిగి పెట్టేసేవాడు.



ఒకసారి విడియో కాల్ లో చూసి సుభద్ర అడిగింది "అలా ఉన్నావేమిటి ఆదీ? సరిగ్గా తింటున్నావా? నీ ముఖం చూస్తే చాలా అలసటగా ఉంది" అంది.



"నాకేమిటో జీవితంలో ఆనందం, తృప్తి ఉండటం లేదమ్మా?" అన్నాడు ఆది.



ఇంకోసారి "ఎందుకమ్మా? నన్ను చూస్తే అందరూ దూర దూరంగా వెళతారు? నాతో ఎవరూ కలవరు? " అడిగాడు తల్లిని.



"నువ్వు మంచి చదువు, ఉద్యోగం కదా! వాళ్ళందరూ ఏదో సామాన్యమైన వాళ్లు. నువ్వు పెద్ద బాధ పడక్కర్లేదు, నీ లెవెల్ వాళ్లతో కలు" సలహా చెప్పింది సుభద్ర.



"నా లెవెల్ వాళ్ళు అంతా పెద్దవాళ్ళు. వాళ్ళు నన్ను చూస్తూనే చికాకు పడతారు." కోపంగా అంటూ ఫోన్ పెట్టేసేడు.



రాజారామ్ తో కూడా మధ్యలో ఒకసారి "నేను ఉద్యోగం మానేస్తాను నాన్నా! నాకు ఇక్కడ చాలా ఒత్తిడి గా ఉంది" అంటే ఆయన కోప్పడ్డాడు.



తరవాత వారం అయినా ఆదిత్య ఫోన్ చెయ్యలేదు. వీళ్ళు చేసినా ఎత్తలేదు.



ఇద్దరూ భయపడ్డారు. ఇంకో రోజు సుభద్ర ఆపకుండా ఫోన్ చేస్తే "నాకు చచ్చిపోవాలని ఉంది అమ్మా!" అంటూ ఫోన్ పెట్టేసాడు.



సుభద్రకి గుండె ఆగినంత పని అయింది. రాజారాం కూడా ఆదిత్య మాట్లాడినది విని హతాశుడయ్యాడు. "భద్రా! వాడిని వచ్చేయమని చెప్పు" అన్నాడు. 

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
తృప్తి - by k3vv3 - 17-01-2024, 05:32 PM
RE: తృప్తి - by BR0304 - 18-01-2024, 02:58 PM
RE: తృప్తి - by sri7869 - 19-01-2024, 02:41 PM
RE: తృప్తి - by Uday - 24-01-2024, 02:14 PM
RE: తృప్తి - by k3vv3 - 30-01-2024, 04:26 PM
RE: తృప్తి - by k3vv3 - 30-01-2024, 04:28 PM
RE: తృప్తి - by sri7869 - 31-01-2024, 11:39 AM
RE: తృప్తి - by Uday - 31-01-2024, 02:21 PM
RE: తృప్తి - by BR0304 - 31-01-2024, 10:12 PM
RE: తృప్తి - by k3vv3 - 18-02-2024, 06:45 PM
RE: తృప్తి - by k3vv3 - 18-02-2024, 06:48 PM
RE: తృప్తి - by sri7869 - 18-02-2024, 07:44 PM
RE: తృప్తి - by BR0304 - 19-02-2024, 09:09 PM



Users browsing this thread: 1 Guest(s)