Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అహం తుభ్యం ప్రణయామి
#1
అహం తుభ్యం ప్రణయామి... –
గణేష్ బెస్త
"నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావో, లవ్ మ్యారేజ్ చేసుకుంటావో..అది నీయిష్టం. అరేంజ్డ్ అయితే బంధువులను, తెలిసిన వారిని అడిగీ, సంబంధాలు వెతికి, అమ్మాయిని చూసి, తర్వాత ఇద్దరూ ఒప్పుకుంటే పెళ్లి చేస్తాం. కనీసం సంవత్సరం కష్టపడి వెదకాలి. లవ్ మ్యారేజ్ అనుకో..అంతా నీ చేతుల్లోనే. అమ్మాయిని చూపించు..అక్షింతలేసేస్తాం."
"ఎంత ఈజీగా చెప్పావ్ నాన్న. ముందు అమ్మాయి ఒప్పుకోవాలి. దానికే తపస్సు చేయాలి. తరువాత వాళ్ళ ఇంటివాళ్లను ఒప్పించాలి. దీనికోసం యుద్ధం చేయాలి. అంత ఈజీ కాదు."
"నీకా బాధ కూడా లేదు కదరా.. అమ్మాయి పేరేంటి? ..! లోపాముద్ర. తను నేరుగా ఇంటికొచ్చి నిన్ను పెళ్లిచేసుకుంటానని చెప్పిందిగా. అమ్మాయి కూడా బాగుంది. ఓపెన్ మైండెడ్, ఇంకా మంచిది కూడా. తన సంగతేంటి..?"
"మీకు ముందే చెప్పానుగా..మళ్ళీ తన గురించి అడుగుతావ్?"
"మరి నీ బాధేంటి పుత్రరత్నా..?"
"మనం ఒకరిని ప్రేమించామంటే..వాళ్ళు మనకు నచ్చేలా ఉన్నారని, మనకు నచ్చిన విషయాలున్నాయని. మనకు నచ్చిన వాళ్లకోసం ఏమైనా చేస్తాం..అందరికీ కాదు. అలాలేకుంటే మనం వాళ్ళని ఇష్టపడం, ప్రేమించం. అంటే దీనిలో ఒకరకంగా స్వార్థం ఉంది. ప్రేమ కాదు."
"నువ్వు మాట్లాడేది ఒక్కముక్క కూడా అర్థంకాలేదు. ప్రేమేంటి...స్వార్థమేంటి? వీడికి తాగటానికి నీళ్ల బాటిల్ ఇచ్చావా లేకా మందు బాటిల్ ఇచ్చావా?"
"మీరు చాల్లే ఆపండి. తినేటప్పుడు గోలెందుకు? ప్రశాంతంగా తిననివ్వరూ...
"అమ్మా నేను అలా బయటకెళ్లొస్తా.."
"ఇంత రాత్రెందుకురా..?"
"వెళ్లనీ...వే..”
*****
 ఆరు నెలల క్రితం
"నమో నమః...", అంటూ మాముందర నలుగురు ప్రత్యక్షమయ్యారు. మేము రావడం దూరం నుంచే చూసినట్లున్నారు. చుట్టూవున్న వాతావరణం ఎంత ప్రశాంతంగా వుందో వాళ్ళు కూడా అంతే ప్రశాంతంగా వున్నారు.
"తాతయ్య...! ఏమని బదులివ్వాలి?", పక్కనే వున్న తాతయ్యను గిల్లాను.
"నాక్కుడా తెలీదు మనవడా...హా..! నన్ను చూసి ఫాలో అయిపో."
"ఓం నమో నారాయణాయ."
"ఓం నమః శివాయ", వెంటనే అందుకున్నాను.
ఇంతలో..."అరేయ్ బడుద్దాయి. బానే ఘనకార్యం చేశారు లేండి. పక్కకి జరుగు.", అని వెనకాల వున్న మా నాన్నమ్మ నన్ని తోసి ముందుకొచ్చింది.
"నమో నమః...మమ నామ రేవతి."
"మీ నాన్నమ్మ ఎప్పటి నుంచి సంసృతం నేర్చుకుంటుంది రా?", చెవి కొరికేశాడు తాతయ్య.
ఇంట్రెస్ట్ వల్లనేగా మనల్ని ఇక్కడకు పట్టు వదలని విక్రమార్కుడిలా తీసుకొచ్చింది. చెవిలో చిన్నగా చెప్పా.
"ఓహ్...తెలుగు వారా! నమస్కారం. నా పేరు హరిశ్చంద్ర. ప్రయాణం బాగా జారిందా అండి?", కుశల ప్రశ్నలు అడిగారు.
తెలుగు మాట్లాడి బతికించారండి. లేకుంటే రెండు రోజులు ఇక్కడ సంసృతంలో ఎలాగా... అనుకున్నాను.
"తెలుగే కాదండీ... దక్షిణ భారతదేశంలో భాషలన్నీ మాట్లాడగలం. ఇక్కడికి వచ్చే వారికి ఇబ్బంది కలగరాదుగా. మీరు మొత్తం ఎనిమిది మందా?", నవ్వుతూ అన్నాడు నాలుగురిలో ఇంకొకరు.
"లేదండీ... ఐదుగురం. వీళ్ళింకో ఫ్యామిలీ", అన్నారు నాన్న.
సరిగ్గా అప్పుడే నేను, ఎవరబ్బా ఇంకో ఫ్యామిలీ అని వెనక్కి తిరిగి చూసాను.
సరిగ్గా అప్పుడే ఆవలిస్తూ ఒకమ్మాయి కనిపించింది. ఒక క్షణం పాటు మా చూపులు కలిసాయి. అదేంటో తెలియదు కానీ... నేను కూడా వెంటనే ఆవలించా. మరది ఎలాగో నాకు తెలీదు.
"ఇక్కడకొచ్చిన వారికి ముందుగా ప్రాంతం గురించీ, ప్రాముఖ్యత గురించి వివరిస్తాం. మత్తూర్ అను గ్రామం కర్నాటకలోని శివ మొగ్గ అను జిల్లాలో వుంది. గ్రామం తుంగా నదికి అతిచేరువలో నెలకొంది. భారత దేశంలోనే సంస్కృత భాష మాట్లాడే ఏకైక గ్రామం ఇది. ఇక్కడున్న ప్రతీ ఒక్కరూ సంస్కృతం లోనే మాట్లాడతారు. ఇక్కడ మొత్తం ఐదు వేల మందిపైనే నివసిస్తున్నారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను, సంస్కృత భాష గురించి తెలుసుకొనుటకు ఎంతో మంది వస్తుంటారు. భాష నేర్చుకొనుటకు ఆసక్తి చూపిన వారికి ఇరువది దినములలో నేర్పిస్తాం.", గ్రామ ప్రాముఖ్యతను ఎంతో గొప్పగా వివరించారతను.
"భేషుగ్గా చెప్పారు సుమండీ...ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది.", వెనకల నుంచి గొంతు వినిపించింది. అమ్మాయి వాళ్ల నాన్నగారనుకుంటా.
"అందుకే మా అమ్మగారు పట్టుపట్టి తీసుకొచ్చారు.", మాట కలిపాడు నాన్న.
ఇంతకూ సంస్కృతంలో ' లవ్ యూ'ని ఏమంటారు...? నాకెందుకో తెలుసుకోవాలనిపించింది.
"ఇంకా అడగలేదే అనుకున్నా. అడిగేసావు...", అతను అన్న దానికి వెనుక నుంచి గజ్జెలు శబ్దం చేసినట్లు ఒక నవ్వు. ఎంతో వినసొంపుగా వుంది.
"త్వరలోనే తెలుసుకుంటావులే నాయనా... అయినా ఇన్ని భాషాలుండగా సంస్కృతంలో ప్రేమను వ్యక్త పరచాలన్న నీ వాంఛ బాగుంది. ఇక్కడ కానీ నువ్వు ఇరువది దినములు వున్నావంటే తరువాత చకచకా సంస్కృతంలో సంభాషిస్తావ్.", అన్నారు హరిశ్చంద్ర.
"ఇక్కడ హోటల్, లాడ్జి లాంటివి వుండవు. చక్కగా మా ఇంట్లో ఉండవచ్చు. అందరూ స్నానాలు కానిస్తే...గుడికి బయల్దేరుదాం." అని వెంట తీసుకువెళ్లారు.
*****
అక్కడి ఇండ్లు మనుషుల హృదయాల్లాగే చాలా విశాలంగా, మన సంస్కృతిని కనబరిచేలా వున్నాయి. మాతో పాటు వచ్చిన వారు అవతలి గదిలో వున్నారు. చకచకా స్నానాలు కానిస్తున్నారు మా ఇంట్లో వారంతా.
"అందరివీ అయిపోయాయి...ఇక నువ్వు కూడా కానివ్వు...వెళ్లరా..", మా అమ్మ అప్పుడే తొందర పెడుతుంది. నాకైతే తిరుపతి వసతి గదుల్లో చేసే హడావిడే గుర్తొస్తుంది.
  దివిలో విరిసిన పారిజాతమో..
 
కవిలో మెరసిన ప్రేమగీతమో...
 
నా మదిలో నీవై నిండిపోయెనే...
నా మది ఎఫ్ఎమ్ ఆన్ అయ్యింది. అంత అందం ఒక్కసారిగా చూస్తే వుండాలా...పోవాలా. అనంత తేజస్సు ముందు నేను శూన్యంలో కలిసిపోతున్నట్లుగా అనిపించింది.
"నువ్వు కూడా రెడీ అయ్యావా అమ్మ...మీ వాళ్ళు కూడా కదూ..?"
"హా.. అందరూ రెడీ ఆంటీ. నేనే లాస్ట్. ఇప్పుడు నాది కూడా అయిపోయింది."
తెలుగు భాష ఇంత మధురంగా వుంటుందా...ఇంత కమ్మగా వుంటుందా...ఇంత తీయగా వుంటుందా...రోజూ అమృతం తాగితే గానీ అలాంటి గొంతు రాదు.
"చీరలో చక్కగా... మహా లక్ష్మిలా వున్నావమ్మా..."
"కదా...", లోపల అనుకున్న మాట తెలియకుండానే బయటకు చెప్పేసా. హంసకు చీర కట్టినట్లుంది. తన నడుము ప్రవహించే నది వొంపులాగుంది. అంత అందాన్ని నాకళ్ళు తట్టుకోలేకున్నాయి.
ఇద్దరూ ఠక్కున నావైపు తిరిగారు.
"చూసింది చాలు గానీ... వెళ్లి బాత్రూం లో తగలడు. నా పరువు తీయకు...", అమ్మాయికి వినిపించకుండా తిట్టింది మా జనని.
తప్పక అక్కడినుంచి కదిలాను. కంటి చూపు మాత్రం ఇంకా వీడలేదు.
"నీ పేరేంటమ్మా..?", మా అమ్మ అడిగిన ప్రశ్న నన్ను వెళ్లనీవకుండా ఆపివేసింది. గోడ చివరినుంచి చెవి పెట్టి వింటున్నా...
"మేఘమాల", పేరు విన్న నా చెవులు ధన్యమైపోయాయి.
*****

ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
అహం తుభ్యం ప్రణయామి - by k3vv3 - 23-12-2023, 07:16 PM



Users browsing this thread: 1 Guest(s)