Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఒక భక్తుని జీవితంలో జరిగిన అద్భుతమైన లీలలు
#1
ఒక భక్తుని జీవితంలో జరిగిన అద్భుతమైన లీలలు

నేను చెన్నై లోని మైలాపూరులో చదువుకునే రోజుల్లో, ఒక ఇంట్లో అద్దెకుండేవాడ్ని, ఆ ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళ ఇంట్లో విరుపాక్షి అనే 80 ఏళ్ళ బామ్మ గారు ఉండేవారు. జన్మతః తెలుగువారే అయినా ఎన్నో తరాలకు ముందే చెన్నైలో స్థిరపడిన తెలుగు బ్రాహ్మణ కుటుంబం వారు. ఇంట్లో అందరిలోనూ దైవభక్తి ఎక్కువే, ప్రతీ రోజూ మైలాపూరులో కొలువై ఉన్న శ్రీ కపాలేశ్వర స్వామి వారిని దర్శించుకోనిదే పాచి గంగ కూడా ముట్టేవారు కాదు. 80 ఏళ్ళ వయసులో కూడా ఆ బామ్మగారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు, వారి ఇంటి నుండి స్వామి వారి ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళేవారు. ఆవిడ ద్వారా ఎన్నో అత్యద్భుతమైన లీలలు వినే భాగ్యం అప్పట్లో నాకు కలిగింది. ఎంతో ఓపికగా ప్రతీ విషయమూ విడమర్చి శ్రద్ధగా చెప్పేవారు. ఎన్ని విన్నప్పటికీ తనివి తీరేది కాదు. ఆవిడ చెప్పిన ఒక అద్భుతమైన లీలను ఇప్పుడు వ్రాస్తున్నాను. ఆవిడ శివైక్యం చెంది చాలా సంవత్సరాలయ్యింది. కానీ ఇప్పటికీ ఆవిడను తలచుకుంటే కళ్ళముందు కదలాడుతున్నట్లు, ఎదురుగా కూర్చుని అనేక విషయాలు చెబుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఆవిడకు అనేక నమస్సులతో ...

ఆ బామ్మగారి తాతగారి తరంలో ఒక భక్తుని జీవితంలో జరిగిన లీలలు. వారిది తిరుచ్చి పట్టణం. తమిళ అయ్యర్ ల కుటుంబం. ఇంట్లోని వారంతా శివ భక్తి తత్పరులే. వీరి తాతగారి స్నేహితులు ఒకాయన సదాశివం అయ్యర్ కు చిన్నతనం నుండే భగవంతుని పట్ల అనేక సందేహాలు ఉండేవి. అసలు భగవంతుడు ఉన్నాడా ? ఈ పూజలు చేయడం వలన ప్రయోజనం ఏమిటి ? మనం చేసేవి భగవంతునికి చేరుతాయా ? ముల్లోకాలు ఎక్కడ ఉంటాయి ? ఏ దేవుడు గొప్ప ? వంటివి. ఎవరైనా పెద్దలను ఈ విషయాల గురించి ప్రస్తావిన్చినప్పుడలా నీలో నాస్తిక భావాలు పెరుగుతున్నాయి, పెద్దలను ఎదిరించి మాటలాడకు, ఈ వయస్సులో నీకు చెప్పినా అర్ధం కాదు వంటి సమాధానాలే వింటూ పెరిగాడు. అందువలన భగవంతుడు లేడనే నిర్ధారణకు వచ్చాడు కానీ ఇంట్లో వారు తిడతారనే భయంతో, విశ్వాసం లేనప్పటికీ నిత్య కర్మలు ఆచరించేవాడు. ఎదుటు వారికి సహాయం చేయడానికి మించిన పూజ లేదని నమ్మేవాడు. అప్పట్లో బాల్య వివాహాలు చేసేవారు. పన్నెండు సంవత్సరాలకే సదాశివానికి కూడా వివాహం జరిగిపోయింది. వయసు పెరిగే కొద్దీ తన ఆలోచనా ధోరణి కూడా మారుతూ వచ్చింది. పెద్దలతో వాదిస్తూ, భగవంతుని ఉనికిని గూర్చిన ప్రశ్నలు అడుగుతుండేవాడు. తగిన సమాధానం చెప్పలేని వారిని కూడా తన మాటల ప్రభావంతో నాస్తికులుగా మార్చేవాడు. తన భార్యకు మాత్రం ఎనలేని భక్తి విశ్వాసాలు ఉండేవి. తను ప్రతిరోజూ శివాలయానికి వెళ్ళేది, తోడుగా సదాశివం కూడా వెళ్ళేవాడు కానీ ఆలయం బయటనే ఉంటూ, నేను ఆలయం లోకి రాను అనేవాడు. ఎన్ని విధాలుగా చెప్పినా తన మాట తనదే. తన భార్య సాత్వికురాలు, భగవంతుడిని త్రికరణ శుద్ధిగా అర్చించేది. ఆలయానికి వెళ్ళిన ప్రతీ రోజూ సదాశివం, బయట ఒక బిక్షకునికి దానం చేస్తుండేవాడు. తన భార్య దర్శనం చేసుకుని వచ్చేంత వరకూ ఆయనతోనే అక్కడ కాసేపు కాలక్షేపం చేసి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు సదాశివానికి ఆ బిక్షకునితో ఒక వాదన జరిగింది.

అందరితోనూ వాదిస్తున్నట్లే ఆ బిక్షకునితో కూడా భగవంతుడు లేడు, ఈ వెర్రి జనాలు కనిపించిన ప్రతీ రాయినీ రప్పనూ మొక్కుతుంటారు, వారు చేసేవి భగవంతుడికి చేరుతున్నాయా లేదా అని కూడా ఎవరూ ఆలోచించరు. చెప్పినా వినరు మూర్ఖులు అన్నాడు. అందుకు ఆ భిక్షకుడు భగవంతుడే ప్రతీ జీవియందు ఉన్నాడు, సత్కర్మలు చేయడానికి ప్రోత్సహిస్తుంటాడు, దుష్కర్మలు చేయాలనే ఆలోచన కలిగినప్పుడు హెచ్చరిస్తుంటాడు, వినిన వారిని రక్షిస్తాడు, వినని వారిని కర్మ ఫలం అనుభవించేలా శిక్షిస్తాడు అన్నాడు. ఈ మాటలు విన్న సదాశివానికి ఆగ్రహం కలిగింది. తాను వేస్తున్న బిక్షపై ఆధారపడేవాడు కూడా తన మాటను లేక్కచేయకపోవడంతో తట్టుకోలేకపోయాడు. నీకు ప్రతీ రోజూ దానం చేస్తున్నది నేను, నా బుద్ధి నన్ను ప్రేరేపించినందువల్ల చేస్తున్నాను. ఇందులో భగవంతుని ప్రమేయం ఏమీ లేదు అన్నాడు. భగవంతుని ప్రేరణ, మన మధ్య రుణానుబంధం, అనుభవించవలసిన కర్మ ఫలం, సమయం అన్ని నిర్ణయించినవాడు పరమాత్ముడే, వీటికి మనం కారణ భూతులం కాదు, నీవు బిక్ష వేసినా వేయకున్నా నా ప్రారబ్ధాన్ని బట్టి నాకు అందవలసినవి సమయానికి అందుతాయి. నేను భగవంతుడిని విశ్వసిస్తున్నాను కనుక ఆయనే నా అవసరాలను ఏదో ఒక రూపంలో వచ్చి తీరుస్తాడు అని సమాధానం చెప్పాడు. కానీ సదాశివానికి ఆగ్రహం అప్పటికే కట్టలు తెంచుకుంది. సరే నీవు చెప్పినది నిజమే అయితే నీ దగ్గర ఉన్నదంతా ఈ కోనేటిలో పడెయ్యి, రేపు ఉదయం నుండీ ఎవరినీ బిక్ష కూడా అడగకు, నువ్వు చెప్పినట్లు నీ అవసరాలను భగవంతుడు ఏమాత్రం తీరుస్తాడో నేనూ చూస్తాను అన్నాడు సదాశివం. అలానే అన్నాడు ఆ బిక్షకుడు. సరే రేపటి రోజంతా నేనూ నీతోనే ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు.

మరుసటి రోజు ఉదయం అయిదు గంటలకు వచ్చేసాడు సదాశివం, వచ్చీ రాగానే ఆ బిక్షకునితో మనం ఈరోజు ఈ ఊరి నుండి బయటకు వెళుతున్నాం. ఈ ఊరిలో నీ గురించి అందరికీ తెలుసు గనుక ఎవరో ఒకరు నీకు బిక్ష వేస్తూనే ఉంటారు, అదే బయటకు వెళితే నీ గురించి వాళ్లకు తెలియదు కనుక నువ్వు అడిగితేనే తప్ప ఎవరూ ఏమీ వేయరు అన్నాడు. ఆ బిక్షకుడు నవ్వుతూ అలాగేనని చెప్పి ఇద్దరూ బయలుదేరారు. సదాశివం ముందుగానే తనకు ఆరోజుకి కావలసిన ఆహార పదార్ధాలు, పానీయాలు తెచ్చుకున్నాడు. ఆ బిక్షకుడు భగవంతుడు లేడు అని ఒప్పుకుంటే తనకు కూడా ఆహరం, నీళ్ళు ఇస్తాననీ, దక్షిణ కూడా ఇస్తాననీ చెప్పాడు. కానీ ఆ బిక్షకుడు మాత్రం నా అవసరాలు భగవంతుడే తీరుస్తాడు అని పలికి నడక సాగించారు. కాస్త దూరం నడిచాక అలసిపోయాడు సదాశివం. తనతో తెచ్చుకున్న చల్లని మజ్జిగ తాగి సేదతీరాడు. ఆ బిక్షకుడు మౌనంగా కుర్చుని ఉన్నాడు. భగవంతుడు లేడని ఒప్పుకో చల్లని మజ్జిగిస్తాను అన్నాడు సదాశివం. అయినా ఆ బిక్షకుడు మౌనం వీడలేదు. అదే దారిలో ఒక ఎడ్ల బండిపై వస్తున్న ఒక వ్యక్తి వీరిని చూసి ఆగాడు, బండి దిగి వచ్చి వీరి వివరాలు అడిగాడు, జరిగింది దాచిపెట్టి సదాశివం ఏవో కల్పిత కధలు చెప్పాడు. అదంతా విన్న తరువాత ఆ బిక్షకుని చూసి, మిమ్మల్ని చూస్తుంటే అచ్చం మా తాతగారిలానే అనిపిస్తున్నారు, నేను కొబ్బరి బొండాలు అమ్ముతుంటాను, మీరు త్రాగండి అని చెప్పి కొబ్బరి బొండాం కొట్టిచ్చాడు. సదాశివం మాత్రం తాను త్రాగానని చెప్పేసాడు. కానీ లోలోపల ఆ బిక్షకునికి అడగకుండానే కొబ్బరి నీళ్ళు దొరికాయని కాస్త ఆశ్చర్యపడ్డాడు. ఆ వర్తకుడు వెళ్ళిపోయాడు, వీరు మళ్ళీ ప్రయాణమయ్యారు.

అలా ఇంకాస్త దూరం వెళ్ళి ఒక నిర్మానుష్య ప్రదేశాన్ని చూసుకుని, మనుషులు ఎక్కువగా రారని నిర్ధారణ చేసుకున్నాక, ఇక్కడే కాసేపు విశ్రమిద్దాం అని చెప్పి తన అల్పాహారం భుజించాడు సదాశివం. అలా వారు ఆ ప్రాంతంలోనే కుర్చుని ఉండగా, ఉన్నట్లుండి మేళతాళాల చప్పుడు వినిపించింది. ఉలిక్కిపడి లేచి చూసాడు సదాశివం, ఎవరో కొంతమంది మేళతాళాలతో, భాజా భజంత్రీలతో వీళ్ళ వైపుగా వస్తున్నారు. వీళ్ళకు కాస్త దూరంలో ఆగి ఏదో పూజ మొదలుపెట్టారు. కాసేపటికి వారిలో ఒకతను వీరి దగ్గరకు వచ్చి ప్రసాదంగా రుచికరమైన పదార్ధాలు ఇచ్చాడు. వీళ్ళు బస చేసిన చోటుకి దగ్గరలోనే ఒక నాగుల పుట్ట ఉన్నదనీ, వారి ఇలవేలుపు కనుక ఆ తిధి రోజున పూజ చేస్తామనీ చెప్పాడు. అయాచితంగానే ఆ బిక్షకునికి అల్పాహారం కూడా లభించడం చూసి మరల ఆశ్చర్యపోయాడు సదాశివం. ఈసారి అడవిలోకి వెళితే గానీ ఈ బిక్షకునికి ఏమీ దొరకదు అనుకుని, ఇద్దరూ కలిసి అడవి వైపు నడిచారు. కాస్త దట్టమైన అడవిలోకి వెళ్ళగానే వారికి పులి గాండ్రింపు వినిపించింది, సదాశివం ఉన్న పళాన అన్నీ వదిలేసి పరుగు తీసాడు, బాగా పరిగెత్తి అలసిపోయాక, ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చున్నాడు. తనకు పులి గాండ్రింపులు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి, చెట్టు దిగాలంటే భయం, కాసేపటికి బాగా ఆకలి వేసింది. తినడానికి ఏమీ లేదు, తెచ్చుకున్నదంతా అక్కడే వదిలేసి వచ్చేసాడు. షుమారు 8 గంటలగా తిండీ తిప్పలు లేని కారణంగా సదాశివం నీరసించిపోయాడు. ఆ బిక్షకుని జాడ కనిపించలేదు, కాస్త చెట్టు పైకెక్కి చూసాడు, ఎక్కడా దారి కనిపించడం లేదు, అడవి మధ్యలో ఉన్నాడు, దారి తప్పిపోయాడు, ఇక తిరిగి ఇంటికి వెళ్ళగలడనే నమ్మకమూ సన్నగిల్లింది. అనవసరంగా ఆ బిక్షకుని పరీక్షిద్దామని తలచి కోరి కష్టాలు తెచ్చుకున్నాను అని లోలోపలే బాధపడుతున్నాడు.

ఇక చీకటి పడుతోందనగా ఆ బిక్షకుడు మరో వ్యక్తితో కలిసి సదాశివం ఉన్న చోటుకి వచ్చాడు. వారిని చుస్తూనే ఎంతో ఆనందంతో చెట్టు పైనుండి ఒక్క దూకు దూకాడు. ఆ పులి బారి నుండి ఎలా బయటపడ్డావు, నేను వచ్చేసాక ఏమి జరిగింది, ఇంత సేపు ఎక్కడున్నావ్ అని అడిగాడు సదాశివం. ఆ బిక్షకుడు నువ్వు చూడడానికి బాగా నీరసంగా కనిపిస్తున్నావు, ముందు ఈ నీరు త్రాగు అని త్రాగడానికి నీరిచ్చి , కొన్ని పండ్లు, తేనే కూడా ఇచ్చాడు. అవి తిన్నాక కాస్త శక్తి వచ్చింది సదాశివానికి. ఆ తరువాత ఆ బిక్షకుడు ఇలా చెప్పాడు, పులి గాండ్రింపు నేను కూడా విన్నాను, ఒకవేళ నన్నే ఆ పులికి ఆహారంగా రప్పించాడేమో ఆ భగవంతుడు అనే ఆలోచనతో అక్కడే ఉన్నాను. పులి నా వైపే వస్తున్నట్లు అనిపించింది, నేను నిశ్చలంగా కుర్చుని దానినే చూస్తూ ఉన్నాను. అది నాకు అతి సమీపంలో ఉండగా ఎవరో బాణాలతో కొట్టి దాన్ని చంపేశారు. నా కళ్ళ ముందే ఆ పులి చనిపోయింది. అప్పుడు కొందరు వేటగాళ్ళు నా దగ్గరకు వచ్చారు. తామే ఆ పులిని చంపేసాము అని చెప్పారు. తరువాత మేమందరం నీ కోసం వెతకడం మొదలుపెట్టాము, వారే నాకు తినడానికి కొన్ని పండ్లు, పుట్ట తేనే ఇచ్చారు. మరల నిన్ను వెతకడం ప్రారంభించాం, ఈ సమయానికి నిన్ను చేరుకున్నాం అన్నాడు. ఆ బిక్షకుని మాటలు విన్నాక సదాశివంలో మార్పు కలిగింది. భగవంతుడిని నమ్మిన ఆ బిక్షకునికి అన్నీ సకాలంలో అందాయి, పైగా ఆపదల నుండి రక్షింపబడ్డాడు. మరి నేను ఆకలి దప్పులతో, ప్రాణ భయంతో గజగజలాడుతూ అల్లాడిపోయాను. అన్నిటికీ కారణం భగవంతుడే అని గ్రహించాడు సదాశివం. తనలోని అహంకారం అంతరించింది. కానీ అంతటితో పూర్తి కాలేదు, ఇప్పుడే తన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలయ్యింది. వారిద్దరూ కలిసి క్షేమంగా తమ ఊరు చేరుకున్నారు, ఇంటికి చేరిన తరువాత కూడా సదాశివానికి జరిగినవే గుర్తొస్తూ నిద్ర పట్టలేదు. ఆరుబయట పడుకుని ఉన్న సదాశివానికి ఒక పిలుపు వినిపించింది.

ఇప్పటికైనా భగవంతుడు ఉన్నాడనీ, తననే విశ్వసించేవారిని కాపాడతాడనీ అర్ధమయ్యిందా అని ఎవరో అన్నట్లు అనిపించింది. ఆ మాటలు వినిపిస్తున్న వైపు చూసాడు, కానీ ఎవరూ కనిపించలేదు. ఎవరు మీరు అని అడిగాడు సదాశివం, నువ్వు ఎవరి గురించైతే లేడు, లేడు అని అందరికీ చెబుతున్నావో తనే నేను అన్నది ఆ శబ్దం. నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తోంది అన్నాడు సదాశివం, నేను ఉన్నాను అని నీకు ఆచరణాత్మకంగా నిరూపించిన ఆ బిక్షకుడినే అడుగు, తనే దారి చూపిస్తాడు అని మరల వినిపించింది . ఆ తరువాత ఎన్ని సార్లు పిలిచినా ఆ గొంతు మళ్ళీ వినిపించలేదు. అప్పుడు సదాశివానికి ఒక అనుమానం వచ్చింది, ఇదంతా చాటుగా ఉండి ఆ బిక్షకుడే మాట్లాడాడా, లేక అది భగవంతుని స్వరమేనా, నిజంగా ఆ బిక్షకునికి భగవంతుడిని చూపే శక్తి ఉందా, ఒకసారి పరీక్షించించి చూద్దాం అనుకున్నాడు. ఆ రాత్రిలోనే ఆ బిక్షకుని గుడిసె దగ్గరకు బయలుదేరాడు. కాస్త దూరంలో ఆ గుడిసె కనిపించింది. ఆ గుడిసె నుండీ అమితమైన వెలుగు ప్రసరిస్తోంది. నిదానంగా నడుస్తూ వెళ్ళి ఆ గుడిసె కిటికీ నుండీ లోపలకు చూసాడు, ఆ బిక్షకుడు భూమి పై అయిదు అడుగుల ఎత్తులో గాలిలో ధ్యానం చేస్తూ కుర్చుని ఉన్నాడు. తన శిరస్సు నుండీ వెలుగు ప్రసరిస్తోంది. ఎంతో ఆశ్చర్యం కలిగింది సదాశివానికి, తను చూస్తున్నది కలో, నిజమో అర్ధం కాలేదు. సదాశివం స్పృహ తప్పి పడిపోయాడు. కాసేపటికి తను స్పృహలోకి వచ్చాక, కళ్ళు తెరిచి చూసాడు, ఎదురుగా ఆ బిక్షకుడు నవ్వుతూ ఉన్నాడు. ఆ బిక్షకుని పాదాలపైన వాలిపోయాడు సదాశివం. మీ గురించి తెలియక తక్కువగా అంచనా వేసాను, మీరు మహాత్ములు, నాకు భగవంతుడిని చూపించండి అని ప్రార్ధించాడు.

భగవంతుడిని చూడడం అంత తేలిక కాదు, దానికి ఎంతో భక్తి, విశ్వాసము, ఓర్పు కలిగి, కటోర సాధన చేసి ఉండాలి. నేను చెప్పేవి జాగ్రత్తగా పాటించు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా భగవంతుడిని చూస్తావు అని మంత్రోపదేశం చేసాడు ఆ బిక్షకుడు. నేను యాత్రలకు బయలుదేరుతున్నాను, నీ కర్మ పరిపక్వం చెందాక, నీకు భగవంతుని దర్శనం కలుగుతుంది, అప్పటి వరకూ నేను చెప్పినవి ఆచరిస్తూ, ధర్మంగా జీవించు, సత్సంగం చేస్తూ ఉండు, శక్తి వంచన లేకుండా దాన ధర్మాలు చేస్తూ ఉండు, సాదు జీవులను ఆదరించు, నాస్తికులుగా మార్చిన వారిని తిరిగి ఆస్తికులను చేయి, భగవంతుని అనుగ్రహంతో నీవు చేయాలనుకునే ప్రతీ సత్కర్మ జయప్రదం కాగలదు. సదాశివం ఆ బిక్షకుడిని ఒక గురువుగా భావించాడు, తను చెప్పినవి 36 సంవత్సరముల పాటు ఆచరించాడు. ఎన్నో గ్రంధాలు చదివాడు, ఇదివరకు భగవంతుడు లేడు లేడు అని వాదించిన వారితోనే, భగవంతుడు ఉన్నాడని చెప్పి వారిని మార్చగలిగాడు. ప్రతీ రోజూ ఆలయానికి తన భార్యతో పాటుగా వెళ్ళి, తన గురువు గారు ఉన్నారేమో అని ఆ గుడిసెలోకి చూసేవాడు.

అలా 36 సంవత్సరాల పాటు నియమ నిష్టలతో ఆరాధించిన తరువాత ఒక రోజు రాత్రి తనకు ఒక స్వప్నం వచ్చింది. అందులో తన గురువు దర్శనభాగ్యం కలిగింది, నీవు చేస్తున్నవి నేను గమనిస్తూనే ఉన్నాను, నీకు త్వరలోనే భగవంతుని దర్శన భాగ్యం కలుగుతుంది అని చెప్పారు. ఆ మరుసటి రోజు యధాప్రకారం ఆలయానికి వెళ్ళాడు సదాశివం. ఎంతో ఉద్వేగంతో గుడిసె వైపు పరిగెత్తాడు, కానీ అందులో తన గురువు లేడు, చుట్టూ వెతికాడు, ఎక్కడా కనిపించలేదు, తట్టుకోలేనంత ఏడుపొచ్చింది తనకి. ఇన్ని సంవత్సరాలుగా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నా భగవంతుడు సంతుష్టి చెందలేదా, గురువు గారు నాకు త్వరలో దర్శన భాగ్యం కలుగుతుంది అని చెప్పారు, కనీసం ఆయనైనా కనిపించలేదే, ఇంకెన్ని సంవత్సరాలు ఇలా ఎడురుచుడాలి, చిన్నతనంలో తెలిసీ తెలియక చేసిన దైవ దూషణ చేసినందుకు ఇంతటి పరీక్ష, ఇక నాకు తట్టుకునే శక్తి లేదు, అలసిపోయాను అని లోలోనే విలపిస్తున్నాడు.

మేఘావృతమై భోరున వర్షం పడుతోంది, బరువెక్కిన హృదయంతో నిదానంగా నడుస్తూ ఆలయంలోకి ప్రవేశించాడు కాస్త నిరుత్సాహంగానే ఆలయం లోనికి వెళ్ళాడు. అక్కడ చూసిన దృశ్యానికి నివ్వెరబోయాడు. రోజూ గర్భ గుడిలో కనిపించే శివ లింగం ఉండే చోట, తన గురువు గారు కుర్చుని ఉన్నారు. ఆలయ పూజారి ఆయనికి హారతులిస్తున్నాడు. తక్షణమే వెళ్ళి గురువుగారి పాదాల మీద వాలిపోయాడు. అప్పుడు అర్ధమయ్యింది, ఇన్నాళ్ళుగా ఎవరి దర్శనం కోసం పరితపించాడో ఆ దైవం తన గురువేనని. ఆనందభాష్పాలతో తన గురు పాదాలను అభిషేకించాడు. అప్పుడు ఆ గురువు తన విశ్వరూప దర్శనం అనుగ్రహించాడు, భగవంతుడే స్వయంగా ఒక బిక్షకుని రూపంలో తనకు పరిచయమయ్యాడు, యుక్తితో సందర్భాలను కల్పించి, తన అహంకారం, నాస్తికత్వం నిర్ములించి, జ్ఞానోదయం కలిగించి గురువయ్యాడు, తగిన దిశానిర్దేశం చేసి, గమ్యాన్ని చేరుకునేలా చేసాడు. అలా సదాశివానికి ఎన్నో అనుభవాలు కలుగుతూనే ఉన్నాయి. అని చెప్పి ఆ బామ్మగారు ముగించారు. సమయం దొరికినప్పుడల్లా ఇటువంటి లీలలు చెప్పి సత్సంగం చేసేవారు.

భగవంతుడు మనందరి జీవితాలలోనూ ఏదో ఒక రూపంలో నేటికీ సవ్యమైన మార్గాన్ని నిర్దేశిస్తుంటాడు, మన ఆలోచనల్లో మంచిని ప్రోత్సహిస్తుంటాడు, ఆయన చెప్పేవి గ్రహించి, జరిగేవి మన ఉన్నతి కొరకే నని విశ్వసించి, ఆయన పట్ల అచంచల భక్తి విశ్వాసాలు కలిగి ఉంటే, ఆయన దర్శనం మనకు కూడా అసాధ్యం కానే కాదు.

మనం కూడా ప్రయత్నిస్తే తప్పకుండా సఫలీకృతం కాగలం. మీరు కూడా మీ జీవితాలలో, మీకు తెలిసిన వారి జీవితాలలో జరిగిన లీలలు దయచేసి అందరికీ తెలియజేయండి, మీకు తెలిసిన లీలలు కూడా పోస్ట్ చేస్తూ ఉండండి. ఈ లీలలు మీరు తెలుసుకోండి, మీకు తెలిసిన వారికి తెలియజేయండి, కనీసం కొందరిలోనైనా భక్తి బీజాలు నాటేందుకు మన ప్రయత్నం మనం చేద్దాం, ఫలితం భగవంతుడే చూసుకుంటాడు.

అందరికీ ఆ మహాదేవుని అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ... 
Sai Sankalp

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

Source:Internet/whats'up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
ఒక భక్తుని జీవితంలో జరిగిన అద్భుతమైన లీలలు - by Yuvak - 29-09-2019, 09:48 PM



Users browsing this thread: 1 Guest(s)