Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Drama నేటి బాంధవ్యాలు - 11
#34
"పరిస్థితులకు తగిన రీతిగా మనస్సును మార్చుకొనేవారు ఊసరవెల్లి లాంటివారు. వారిని మనుషులని అనకూడదు. అన్ని పరిస్థితుల్లో సహనంతో శాంతంగా వుండేవారే అసలైన మనుషులు. స్వార్థం కన్నా పరమార్థం గొప్పది. మా మామయ్యలాగా!"



"అంటే మా నాన్న మంచివాడా!.. చెడ్డవాడా!.. వదినా!"
"మీ నాన్న.. మా మామయ్య.. ఎంతో మంచివారు. వారి సుపుత్రుడైన ఈ నీ అన్నయ్యకు చెప్పు. ఆ తండ్రిలా మంచిపేరును తెచ్చుకోవాలని శారూ!"
"అదేదో నీవు చెబితే బాగుంటుందిగా!"



"ఏయ్ శారూ!.. నేను అభిమానంగా మాట్లాడితే అర్థం చేసుకోని మనిషే మీ అన్నయ్యా! ఐదేళ్ళ తర్వాత వచ్చానా! ప్రీతిగా దీపూ! ఎలా వున్నావ్? తిరిగి వచ్చావు నాకు చాలా సంతోషం. ముందు ఏం చేయాలనుకొంటున్నావు? నా సాయం ఏమైనా కావాలా? అని అడగవలసిన ఈ మనిషి, ఎవరో.. తనకు ఏమీకాని పరాయి మనిషిని చూచినట్లు ఆ చూపు, మూతి ముడుచుకోవడం న్యాయమా!.. మా అందరికంటే చిన్నదానివైనా నీవు చిన్నప్పటి నుంచి తెలివికలదానివి. నీవే న్యాయం చెప్పు. నా స్థానంలో నీవుంటే ఎలా ఫీలవుతావో ఆలోచించి చెప్పు!" రోషంగా అంది దీప్తి.



ఓరకంట దీప్తి ముఖంలోకి చూచాడు ఈశ్వర్. దీప్తి ఎక్కిరించింది. అతని పెదవులపై చిరునవ్వు. కారణం ఆ ఫోజులో దీప్తి అతనికి చాలా అందంగా తోచింది.
"మామయ్య కారణంగా అన్నయ్య అలా మారిపోయాడు వదినా!.."
"నేనెవరు?.. చెప్పు!.."
"నా వదినవు."
"ఆయన ఎవరు?"
"నా అన్నయ్!"
"ఇద్దరం వేరేగా!.."
"అవును"
"అలాగే.. నేను వేరు.. మా నాన్న వేరు అనే ఆలోచన మీ అన్నయ్యగారికి అదే.." కుడిచేతిని ఈశ్వర్ వైపు చూపి.



"వారికి రాదా!"
"అన్నయ్యా!.. నీవే వదినకు జవాబు చెప్పాలి!"
"ఏం చెప్పాలి"
"తను అడిగిన దానికి!"
"తన టిక్కెట్‍ను బుక్ చేశానని చెప్పు"
"చూచావా!.. నామీద మీ అన్నగారికి ఎంత అభిమానమో!.. ఆయన నాకు చెప్పవలసిన విషయాన్ని నీవు నాకు చెప్పాలట!.." వ్యంగ్యంగా ఈశ్వర్ ముఖంలోకి చురచురా చూస్తూ అంది దీప్తి.
"అన్నయ్యా!"
"ఏమిటమ్మా!.." విసుగ్గా అడిగాడు ఈశ్వర్.



"నాతో చెప్పిన మాట నీవు నేరుగా వదినతోనే చెప్పవచ్చుగా!"
"తనకు చెవుడా ఏంటి?" నవ్వాడు ఈశ్వర్.
"ఏయ్ శారూ!.. చూడు.. చూడు.. ఆ నవ్వులో ఎంత కపటం వుందో!.. శారూ!.. చెప్పు.. నేను ఒక నిర్ణయానికి అంత తేలికగా రాను. వచ్చాననుకో దాని సాధించేవరకూ నా పట్టువదలను వదలను."
"అలాగా వదినా!" అమాయకంగా అడిగింది శార్వరి.
"అవును.."
"అయితే ఇప్పుడు ఏ నిర్ణయంతో వున్నావ్?"
"అది సస్పెన్స్!" వాలుకంట ఈశ్వర్ ముఖంలోకి చూచింది.
"కొద్దిరోజులు ఓపిక పట్టు అదేంటో నీకే తెలుస్తుంది. అప్పుడంటావ్.. వదినా ఆనాడు నీవు అన్నది నిజమే అని" నవ్వింది దీప్తి.



"ఏం చేస్తున్నార్రా!" లావణ్య వారి గదికి వచ్చింది.
"అమ్మా ఎల్లుండి సోమవారం మన ప్రయాణం టికెట్స్ బుక్ చేశాను."
"దీపూకు చేశావా"
దీప్తివంక చూస్తూ "ఆఁ.." అన్నాడు ఈశ్వర్.
"అత్తయ్యా!.. వాణి వదిన ఇంటి అడ్రస్ నా దగ్గర వుంది."
"అడ్రస్ నీకెలా దొరికింది?"
"నేను రామయోగి ఇంటికి వెళ్ళి కనుక్కున్నాను. మనం ఎయిర్‍పోర్ట్ నుంచి నేరుగా వాణి వదిన ఇంటికే పోవచ్చు" నవ్వింది దీప్తి.



"వదినా!.. మనలనందరినీ ఒక్కసారిగా చూచి అక్క!.." శార్వరి పూర్తిచేయకముందే..
"కలా.. నిజమా! అని ఉబ్బితబ్బిబై పోతుంది" గలగలా నవ్వింది దీప్తి. ఆమె స్వచ్ఛమైన నవ్వును చూచిన ఆ ముగ్గురు కూడా నవ్వారు.
"నేను బయలుదేరుతున్నానత్తయ్యా!"



"మంచిదిరా!. జాగ్రత్తగా వెళ్ళు" దీప్తి భుజంపై చెయ్యి వేసి చెప్పింది లావణ్య. 
ఓరకంట ఈశ్వర్‍ను చూచి "శారూ! బై.." చెప్పి దీప్తి వరండాలోకి వచ్చింది.
హరికృష్ణకు చెప్పి.. వెళ్ళి తన కార్లో కూర్చొని ఇంటివైపుకు బయలుదేరింది.
====================================================================
ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 10 - by k3vv3 - 07-10-2026, 12:32 PM



Users browsing this thread: 1 Guest(s)