Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Drama నేటి బాంధవ్యాలు - 11
#24
శివరామకృష్ణ.... కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సమాళించుకొని....

"వూరుకో అమ్మా!.... నిన్ను నీవే సమాళించుకోవాలి. ఈ మామయ్యను జాగ్రత్తగా చూచుకోవలసిన దానవు నీవే కదమ్మా!.... పిల్లలకు మామయ్యకు... మీవారికి వూరటను, శాంతిని నీ మంచిమాటల వలన కలిగించాలి. దైవాన్ని  నిత్యం కొలిచేదానివి ఆ దైవం మీద ఎంతో నమ్మకం వున్నదానివి. నీవు దిగాలు పడిపోతే... వీరంతా ఏమౌతారో ఆలోచించమ్మా!...." మెల్లగా అనునయంగా చెప్పాడు. శివరామకృష్ణ.  కైలాసపతి తన గదికి వెళ్ళిపోయాడు. మంచంపై పడుకొన్నాడు.
దీప్తి, సీతాపతి తల్లి వెనక చేరారు.
సమాళించుకొన్న ప్రణవి "కుర్చోండి బావగారూ!... అక్కా పిల్లలు అంతా బాగున్నారుగా!" అడిగింది.
అవునన్నట్లు తలాడించాడు శివరామకృష్ణ.
"మా తమ్ముడేడమ్మా?"
"మేడ పైన వారి గదిలో వున్నారు బావగారూ!"
"నేను వచ్చానని వాడికి చెబుతావా అమ్మా!"
"నేను చెబుతాను పెదనాన్నా!" పరుగున సీతాపతి మెట్లు ఎక్కాడు.
తల్లి వెనుక నిలబడి తననే చూస్తున్న దీప్తిని చూచాడు శివరామకృష్ణ.
దగ్గరకు రమ్మని చేతితో సౌంజ్ఞ చేశాడు.
"వెళ్ళు.... పిలిస్తున్నది మీ పెదనాన్నగారు!..." అంది ప్రణవి.
దీప్తి బెరుకు ముఖంతో శివరామకృష్ణను సమీపించింది.
ఆమె కుడిచేతిని తన చేతిలోనికి తీసుకొని...
"అమ్మా! ఏం చదువుతున్నావ్?"
"ఇంటర్ సెకండ్ ఇయర్"
"తర్వాత ఏం చేయాలనుకొంటున్నావ్!"
"డాక్టర్ చదవాలనుకొంటున్నాను"
"గుడ్.... నీవు తప్పక డాక్టర్‍వే అవుతావు... అమెరికా వెళతావు"
"ఆ విషయం మీకు ఎలా తెలుసు!..."
నవ్వి "తల్లీ! నీ ముఖం మా పెద్దమ్మ ముఖం... ముమ్ముర్తులా నీవు మా పెద్దమ్మవే!..."
"అందరూ నేను మా లావణ్య అత్తయ్యలా వుంటానని అంటారు. మరి మీరు!..."
"లావణ్య అత్తయ్య అమ్మగారెవరు!.. మీ నానీ!"
అవునన్నట్లు తలాడించింది దీప్తి అమాయకంగా.
"ఆఁ... నానీ పోలిక అత్తయ్య!... అత్తయ్య పోలిక నీవు!... మరి మొదటి స్థానం ఎవరిది?"
"మా నానీదే!"
"అందుకే అన్నాను. నీవు అంతా మా పెద్దమ్మవని!" నవ్వాడు శివరామకృష్ణ.
దీప్తి అందంగా నవ్వింది.
ఎంతో ఆవేదనతో అత్తగారి వియోగంతో బాధపడుతున్న ప్రణవి పెదవులపై చిరునవ్వు విరిసింది.
సీతాపతి మేడ దిగి వచ్చాడు.
"ఏడిరా మీ నాన్న!..." అడిగింది ప్రణవి.
"నిద్రపోతున్నాడు లేపాను, వస్తున్నాడమ్మా!"
ప్రజాపతి మెట్లు దిగసాగాడు.
శివరామకృష్ణ అతనికి ఎదురు నడిచాడు.
"ఏరా! దారితప్పి వచ్చినట్లున్నావ్?...." వ్యంగ్యంగా అడిగాడు ప్రజాపతి. 
"దారిని మరిచినవాడు... దారి తప్పటం సహజం. మరువని వాడు ఎన్నటికీ దారి తప్పడురా! నేను నా వూరిదారిని నా వాళ్ళను మరువలేదురా. ఇదిగో ప్రజా! అమ్మ వెళ్ళిపోయిందని హరి చెప్పగానే ఎంతగానో బాధపడ్డాను. దూరాన వున్నందున అంతిమ చూపులకు నోచుకోలేదు. ఇప్పుడు వచ్చాను. నావారైన మీ అందరినీ చూడాలని. పెదనాన్నకు వయసు మీరింది. వారిని జాగ్రత్తగా చూచుకోరా!... ప్రస్తుతంలో వారు ఎంతో బాధలో వున్నారు. వారికి ధైర్యం చెప్పి ఆసరగా నీవే కదరా నిలబడాలి. వారికి ఒంటరితనాన్ని కల్పించకు. రోజులో కొంత సమయం వారితో గడుపు... చిన్నవాడికి చెప్పడం నా ధర్మం చెప్పాను" ఎంతో అభిమానంతో చెప్పాడు శివరామకృష్ణ.
"ముగిసిందా!.... ఇంకా ఏమైనా ఉందా!" వ్యంగ్యంగా అడిగాడు ప్రజాపతి.
"నేను నీకు చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పేశానురా!"
"సంతోషం!.... నాకు పని వుంది బయటికి వెళుతున్నాను...."
"ఇప్పుడే కదండి బావగారు వచ్చారు! కొంతసేపు వారితో...." ప్రణవి మాట పూర్తిచేయక మునుపే....
"నీవు మాట్లాడు!" ప్రణవి ముఖంలోకి తీక్షణంగా చూచి ప్రజాపతి వెళ్ళిపోయాడు.
అతనిలో మార్పును... మాటతీరును చూచిన శివరామకృష్ణ ఆశ్చర్యపోయాడు.
"ఆయన పూర్తిగా మారిపోయారు బావగారూ!" కన్నీటితో చెప్పింది ప్రణవి.
"అమ్మా!.... మనిషిలో మార్పు రావడం సహజం. దానికి ఎన్నో కారణాలు!... ఈ ఇంట్లో మా పెదతల్లి స్థానంలో వున్న నీవే నిగ్రహంతో అన్నింటినీ అందరినీ జాగ్రత్తగా చూచుకోవాలి. సహనం, శాంతం వాటిని రెండు కళ్ళులా భావించాలి. నీకు నీ పిల్లలకు వాడికి ఆ దేవుడు తప్పక మేలు చేస్తాడు." అనునయంగా చెప్పాడు శివరామకృష్ణ.
"దీపూ! పద... తాతయ్య ఏం చేస్తున్నారో చూద్దాం" అన్నాడు శివరామకృష్ణ.
నలుగురూ కైలాసపతి గదిలో ప్రవేశించారు. వారు నిద్రపోతున్నారు. కళ్ళనుంచి కారిన కన్నీటి చారలు చెక్కిళ్ళపై కనిపిస్తున్నాయి.
"నిద్రపోతున్నారు... లేపవద్దు... పదండి" మెల్లగా చెప్పాడు శివరామకృష్ణ.
నలుగురూ వరండాలోకి వచ్చారు.
"అమ్మా దీపూ, బాబు సీతాపతీ బాగా చదవాలి. గొప్పవాళ్ళుగా కావాలి. అమ్మను, నాన్నను బాగా చూచుకోవాలి సరేనా!"
ఆ ఇరువురు పిల్లలు ’సరే’ అన్నట్లు తలలు ఆడించారు.
"అమ్మా ప్రణవీ! జాగ్రత్త... మామయ్యను జాగ్రత్తగా చూచుకోవలసిన బాధ్యత నీది"
అందరి ముఖాల్లోకి చూచి కనుసన్నతోనే వెళుతున్నానని చెప్పి... శివరామకృష్ణ గృహ ప్రాంగణాన్ని దాటి వీధిలోకి ప్రవేశించాడు.
హరికృష్ణ ఇంటికి చేరి... తనకు ప్రజాపతికి జరిగిన సంభాషణను వారికి వివరించాడు.
మరుదినం...
ఊరికి బయలుదేరాడు శివరామకృష్ణ.
"హరీ!... లావణ్యా!... పెదనాన్న ముందు వాణి విషయంలో నేను చెప్పింది ఒట్టిమాట కాదు. అది మా దంపతుల నిర్ణయం. మీరిరువురూ ఆలోచించుకోండి. మీ నిర్ణయాన్ని నాకు తెలియజేయండి" చిరునవ్వుతో చెప్పాడు శివరామకృష్ణ.
"అలాగే అన్నయ్యా!...." అంది లావణ్య.
దంపతులు ఇరువురూ స్టేషన్‍కు వచ్చి శివరామకృష్ణను రైలు ఎక్కించారు. 
అతను ఎక్కిన రైలు వైజాగ్ వైపుకు బయలుదేరింది.
====================================================================ఇంకా వుంది..
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 7 - by k3vv3 - 04-09-2026, 06:42 PM



Users browsing this thread: 1 Guest(s)