27-08-2026, 12:02 AM
(This post was last modified: 27-08-2026, 12:26 AM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
1
ఊరి మధ్యలో ఉన్న మెయిన్ రోడ్డు పక్కనే పెద్ద వేపచెట్టు ఉంది. చెంగాపురం అనే బోర్డు ఆ వేపచెట్టుకి కట్టి ఉంది. ఈ ఊరికి బస్సు స్టాప్ కూడా అదే.. చెట్టు పక్కనే గవర్నమెంటు వారు కూర్చోవడానికి వేసిన సిమెంటు బల్ల ఉంది. ఇంకో బల్ల రోడ్డుకి అటు వైపు వేశారు. ఇంతకముందు మూడు గంటలకో బస్సు ఉండేది, ఇప్పుడు ప్రతీ గంటన్నరకి ఓ బస్సు తిరుగుతుంది. సాయంత్రం ఐదు కావొస్తుంది. బండి పిల్లలు, కాలేజీ పిల్లలతో పల్లెవెలుగు బస్సు నిండా తాగినోడికి మల్లే తూలుతూ వస్తుంటాయి. ఆదివారం మినహా సాయంత్రం ఐదు దాటితేనే ఊళ్ళో సందడి. సెల్ ఫోను అనే జబ్బు ఇంకా ఈ ఊళ్ళకి సోకలేదు. బండి పిల్లలకి రెండు ఊర్లు అవతల బళ్ళున్నాయి కానీ కాలేజీ పిల్లలు మాత్రం చదువుకోవాలంటే గుంటూరు పోవాల్సిందే. కొంతమంది అక్కడే హాస్టల్లో జాయిన్ అయితే ఇంకొంతమంది అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. మనం మాటల్లో ఉండగానే సాయంత్రం బస్సు రానే వచ్చింది. ముందు చిన్న పిల్లలు, తరువాత పెద్ద పిల్లలు అందరూ దిగాక ఆఖరిన దిగింది కుమారి.
చెమట కంపుకి లోపల అందరినీ చీదరించుకుంటూ పైకి నవ్వుతూ బస్సు దిగగానే ఒంటికి తగిలిన గాలికి చల్లగా అనిపించి ఊపిరి పీల్చుకుంది. రాత్రి తన బట్టల కోసం ఇంట్లో జరిగిన గొడవకి పొద్దున్నే కోపంగా బైటికి వచ్చేసింది కుమారి. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అందరి మొహాలు చూడాలి. ఊళ్ళోకి నడుస్తుంటే కిరాణా కొట్టు ముందు అట్టముక్క తగిలించి ఉంది. దానిమీద సహాయం కావలెను, మంచి జీతం ఇస్తాము అని రాసి ఉంటే తెలీకుండానే రోడ్డు దాటి కొట్టు ముందుకు వెళ్ళింది. కొట్టు ముందు పది మంది వరకు జనం గుమిగూడి ఉన్నారు. లోపల యుద్ధం జరుగుతుంది. పక్కనుంచి సందు కనిపిస్తే లోపలికి తొంగి చూసింది. గిరి ఒక్కడే కష్టపడుతున్నాడు. చాలా సేపు నిలుచున్నా అక్కడ ఖాళీ అవలేదు. రేపు మాట్లాడచ్చులే అని ఇంటికి నడిచింది. ఒక్కో వీధి నడుస్తుంటే గిరి గురించి ఆలోచన మొదలయింది. తనకంటే మూడేళ్లు పెద్ద గిరి. పదవ తరగతి కూడా కలిసే చదివారు. గిరి నాలుగోసారి కూడా పది ఫెయిల్ అయ్యేసరికి వాళ్ళ నాన్న చేసేది లేక తనవెంట పనికి తీసుకుపోయేడు. మధ్యలో ఎవరో అమ్మాయిని లేవతీసుకుబోయాడని టాక్ వచ్చింది. ఆ తరువాత గిరి చాలా రోజులు కనిపించలేదు. మళ్ళీ ఈ రోజే గిరి మొహం చూసింది. ఆలోచిస్తుండగానే ఇల్లు వచ్చేసరికి, సరే రేపు చూద్దాంలే అనుకుంది.
రాత్రి అన్నం తిన్న తరువాత మొదలయింది మళ్ళీ గొడవ. కుమారి అమ్మ మెల్లగా అందుకుంటే కుమారి నాన్న దాన్ని పెద్దది చేశాడు. తమ్ముడు పక్కన నిలబడి ఎంజాయి చేస్తున్నాడు. వాదించుకోవడం అయిపోయిన తరువాత చిన్నగా మాట్లాడింది కుమారి వాళ్ళ అమ్మ. — చూడవే కుమరీ.. పంజాబీ డ్రస్సులు కావాలంటే అడుగు కొనిస్తాను, లంగావోణి కావాలా కొనిస్తాను, జీన్సులు టీషర్టులు మిడ్డీలు అని గోల చేశావంటే మాత్రం కాలేజీ మాన్పించి ఇంట్లో కూర్చోపెడతాను. కోపంగా చూసింది కుమారి.
కుమారి వాళ్ళ అమ్మ లోపలికి వెళుతు నువ్వు ఎలా చూసినా అదే ఫైనల్ అని టీవీలో ఈ మధ్యే విన్న ఇంగ్లేషు ముక్క వాడేసి లోపలికి వెళ్ళిపోయింది. కుమారి కోపంలో వేళ్ళు పిసుక్కుంటుంటే టీవీలో తమ్ముడు పెట్టిన పాట కరెంటు తీగ నుంచి పోతే పోనీ లేరా.. ఈ జీవితమెన్నడు అని వినగానే లేచి వాడి వీపు మీద నాలుగు వేసింది. వాడు ఏడుపు కేకలకి లేచాడు. అక్క ఎందుకు కొట్టిందో వాడికి అర్ధంకాలేదు. మా మీద కోపం వాడి మీద చూపిస్తున్నావా అని అరుస్తున్న అమ్మ మాటలు వినిపించకుండా ఇంటి పైకి ఎక్కింది.
***
కాలేజీకి రెడీ అయ్యి బ్యాగ్ భుజాన తగిలించింది కుమారి.
నేనేళుతున్న.. అని చెప్పేసి బైటికి వస్తుంటే ముక్కు మీద కోపం తగ్గించుకో అన్న అమ్మ మాటలు విని చిరాకుగా ఎల్లేహే అనుకుంది. గిరి వాళ్ళ కొట్టు అప్పుడే తీశారు. గిరి వాళ్ళ అమ్మ అనుకుంటా, కొట్టు ముందు ఊడుస్తుంది.
ఆంటీ.. అంటే తల ఎత్తి చూసింది ఆవిడ. పని కోసం వచ్చాను అంటే నువ్వు చేసే పనులేవి లేవమ్మా ఇక్కడ అని తల దించి ఊడుస్తూనే చెప్పింది. అది కాదాంటి అని కుమారి దగ్గరికి వస్తుంటే అప్పుడే బైటికి వచ్చిన గిరి ఏమైంది అని అడిగాడు. ఏమి లేదు, నువ్వెళ్ళి పూజ మొదలెట్టు అంటే అక్కడే నిలబడి ఉన్న కుమారిని చూసి, ఏం కుమారీ.. బాగున్నావా అని గిరి నవ్వుతూ పలకరించాడు. చీపిరి తిరగేసి గిరి పిర్ర మీద కొట్టింది వాళ్ళ అమ్మ. అబ్బా.. అమ్మేయి అని అరుస్తుంటే లోపలికి పొమ్మని గదిమింది. గిరి వెళ్ళిపోతే నువ్వు కూడా వెళ్ళు అన్నట్టు చూసింది కుమారి వంక. చేసేదిలేక బస్సు ఎక్కింది. అందరూ ఈ మధ్య కొత్తగా టాప్స్ వేస్తున్నారు. కింద జీన్స్ వేస్తున్నారు. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోను ఉంటుంది. మెడలో సన్నటి బంగారు గొలుసు, దానికి చిన్న లాకెట్ ఫ్యాషన్. స్టైలిష్ బ్యాగులు, ఖరీదైన చెప్పులు. ఇవన్నీ చూడగానే నాకు మాత్రమే ఎందుకు ఇలా అని మనసులోనే ఏడుస్తుంటే పక్క ఊళ్ళో బస్ ఎక్కిన పిల్లలు లోపలికి జరగమని అడుగుతుంటే ఏడుపు ఇంకా ఎక్కువయ్యింది.
క్లాసులు మొదలయ్యాయి కానీ మనసింకా గిరి వాళ్ళ అమ్మ చుట్టే తిరుగుతుంది. ఆమె ఎందుకలా ప్రవర్తించిందో కుమారికి అర్ధంకాలేదు. సాయంత్రం బస్ దిగి నడుస్తుంటే గిరి కొట్టు దాటుతూనే అవసరం మనది తప్పదు అని మళ్ళీ రోడ్డు దాటి కొట్టులో తొంగి చూసింది. ఈ సారి గిరి కుమారిని చూసి, ఏంటి అని సైగ చేస్తే అట్టముక్క చూపించింది. కందిపప్పు పార్సెల్ చేస్తూ ఒక క్షణం ఆగిపోయాడు గిరి. వెంటనే తేరుకుని సాయంత్రం ఎనిమిది తరువాత రమ్మని చెపితే అలాగే అని వెళ్ళిపోయింది. ఇంటికెళ్లి ఫ్రెష్ అయ్యి చకచకా తినేసి ఫ్రెండు ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి గిరి ఇంటి వైపు పరిగెత్తింది. కొట్టు లోపల ఏవో సర్దుతున్న గిరిని చూసి పేరు పెట్టి పిలిస్తే ఎక్కడ వాళ్ళ అమ్మ వస్తుందోనని శబ్దం చేసింది. గిరి కుమారిని చూసి బైటికి వచ్చాడు.
హా.. ఇప్పుడు చెప్పు, నీకు పని చెయ్యాల్సినంత అవసరం ఏంటి. మీరు బాగ సంపద కలిగినోళ్లే గదా అని అడిగాడు గిరి.
నా అవసరాలకి ఇవ్వట్లేదు అంది కుమారి. పార్ట్ టైం లాగ చేస్తాను అంటే గిరి నవ్వేడు.
ఇందులో అలా ఉండదు. ఉన్నా ఇది చాకిరీ పని. నువ్వు చెయ్యలేవు అని గిరి చెపుతుంటే ట్రై చేస్తా అంది కుమారి. మళ్ళీ తనే నువ్వైతే తెలిసినవాడివి, పైగా నీ దగ్గర పని చెయ్యడం నాకు ఇబ్బంది ఉండదు అంది. అంతా విని మీ ఇంట్లో వాళ్ళు ఏమనాలేదా అని అడిగాడు
ఇక్కడిదాక వచ్చాక ఈ కొంచెంలో పోతుందేమో అన్న భయంతో చెప్పాను అంది కుమారి.
మా దగ్గర అని చెప్పావా లేదా.. అసలే మాకు మీకు పడదు. మీ నాన్నకి నాకు అసలు పడదు.
ఎందుకు? అంది కుమారి
నీకేం తెలీదా అని ఆశ్చర్యపోతుంటే బిక్క మొహం వేసింది కుమారి. గిరికి అనుమానం రాకముందే తెలుసులే.. ఇంట్లో ఒప్పుకున్నారు అని అబద్దం చెప్పేసింది.
సరే.. నీ కాలేజీ అయిపోయాక ఐదు ఇంటి నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు ఇక్కడ చెయ్యాలి అంటే సరే అంది. ఆదివారం రోజంతా చెయ్యాలి. పొద్దున్నే వెళ్ళేటప్పుడు కొట్టు ముందు ఊడ్చి వెళ్ళాలి మరి అంటే సరే అంది అన్నిటికీ తల ఊపి. ఎప్పటి నుంచి వస్తావ్ అంటే రేపటి నుంచే వస్తాను అంది. గిరి సరే అన్నాడు.
ఇంటికి వెళ్ళగానే కాలేజీలో స్పెషల్ కోచింగ్ క్లాసులు ఉన్నాయని, ఫ్రీగానే చెపుతున్నారని అప్ప జెప్పేసింది.
ఏం క్లాసులు, ఎవరు చెపుతున్నారు. ఆ సార్ ఫోన్ నెంబర్ రాయి. ఏ టైముకి వస్తావ్ ? వరుస ప్రశ్నలు ఎక్కుపెట్టి లాగి వదిలింది కుమారి మీద తన అమ్మ. కుమారి వాళ్ళ నాన్న ఇదంతా చూస్తున్నాడు.
చెప్పాగా స్పెషల్ క్లాసులు అని. తొమ్మిది గంటల బస్సుకు వస్తాను. సార్ నెంబర్ రేపు కాలేజీలో అడిగి నీకు రాసిస్తా అంది కుమారి. ఇంత కాంఫిడెంటుగా చెపితే అమ్మ నమ్మేస్తుందని అనుభవం కుమారికి.
సరే రేపు నాన్న కాలేజీకి వచ్చి మాట్లాడతాడు. ఎల్లుండి నుంచి వెళుదువు అంది కుమారి అమ్మ.
నువ్వు చెప్పినట్టు ఉండదు అక్కడ. అయినా నాన్న వస్తే నాకే మంచిది. నాన్నా ఇవ్వాళ ఇద్దరం కలిసి వెళదాం. కాలేజీలో అందరూ ఎలాంటి డ్రస్సులు వేసుకొస్తున్నారో నీకే తెలుస్తుంది. చూస్తే నువ్వే నాకు నాలుగు జతల జీన్స్ కొంటావ్ అంది అమ్మ వైపు కచ్చిగా చూస్తూ
నాన్నా నేను రెడీ అని తమ్ముడు మాట వినిపించగానే వెళ్లి వాడి మాడు మీద ఒకటి పీకింది.
ఇప్పుడెందుకే వాడిని కొట్టావ్? అరిచింది కుమారి అమ్మ
వీడిని మాత్రం బండి మీద డ్రాప్ చేస్తాడు. నన్ను మాత్రం బస్సులో పంపించారు అని కుమారి కోపంగా చూస్తుంటే కుళ్ళుబోతుదానా అని తిట్టింది వాళ్ళ అమ్మ. కుమారి బ్యాగ్ తగిలించుకుని నేనొచ్చేసరికి తొమ్మిది అవుతుంది టాటా అని పరిగెత్తింది. కుమారి వాళ్ళ అమ్మ ఏదో అనబోతుంటే కుమారి నాన్న లేస్తూ కాలేజీనేగా పోనీలేవే అనేసరికి ఇంకేం అనలేకపోయింది ఆవిడ.
కుమారి వేగంగా నడుస్తూ గిరి వాళ్ళ కొట్టు ముందుకు వెళ్లేసరికి అప్పుడే గిరి వాళ్ళ అమ్మ చీపిరి పట్టుకుని వచ్చింది. ఆమె చూస్తుండగానే బ్యాగు లోపల బెంచి మీద పెట్టి ఆమె చేతిలో చీపిరి లాక్కుంది. గిరి కూడా బైటికి వచ్చాడు. గిరి వాళ్ళ అమ్మ గిరిని కోపంగా చూస్తుంటే గిరి లోపలికి పారిపోగా కుమారి వైపు చూసింది.
కుమారి బుద్దిగా ఊడ్చి, చాటతో చెత్త ఎత్తి గిరి వాళ్ళ అమ్మ వంక చూస్తే చెత్త బుట్ట చూపించింది వేలితో.. అందులో చెత్త వేసేసి అక్కడే గోడకి ఉన్న ట్యాపుతో చేతులు కడుక్కుని బ్యాగ్ అందుకుని బస్టాండ్ వైపు పరిగెత్తింది.
గిరి వాళ్ళ అమ్మ కొట్టులో చూస్తే గిరి పూజ చేస్తున్నాడు. కడ్డీలు వెలిగించి షాపు అంతా తిప్పి దేవుడి పటం ముందు పెట్టి కళ్ళు మూసుకున్నాడు. ఎంతకీ తెరవడే.. తను వెళ్లిపోయేదాకా గిరి కళ్ళు తెరవడని అర్ధమయ్యి నవ్వి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఒక కన్ను తెరిచి తొంగి చూసి హమ్మయ్యా అనుకుని కౌంటర్ తాళాలు తీస్తూ దణ్ణం పెట్టుకున్నాడు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)