Thread Rating:
  • 1 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అత్తగారి కథలు - శుచి శుభ్రత
#38
భక్తులు
 [Image: B.jpg]
 (అత్తగారి కథలు - పార్ట్ 19)

 
పెళ్ళి కార్యక్రమాలన్నీ అయ్యాక, కూతుర్ని అత్తగారింట్లో దింపడానికి జాగృతితో సహా వెళ్ళింది లత. జాగృతి అత్తగారు రాధ కంటే లత వయసులో పెద్దే అయినా ఆవిడ కోపిష్ఠిదని, చిరాకు మనిషని పెళ్ళిలో అందరూ చెప్పడం విన్న లత మాట్లాడడానికి భయపడింది. కానీ రాధే, లతతో మాట కలిపింది.

"ఈపాటికి కాశీలో ఉండాల్సినదాన్ని. ఏమిటో నా ఖర్మ. ఇక్కడే ఉండిపోయాను." అంది రాధ, లతతో.

"మీరు కాశీ వెళ్ళాలనుకున్నారా?" అని అడిగింది లత నెమ్మదిగా.

"వెళ్ళాలనుకోవడమేంటి? కార్తీకమాసం నెల రోజులు కాశీలోనే ఉంటాను. ప్రతి రోజూ గంగలో మునిగి, ఆ నీళ్ళు తీసుకెళ్ళి శివుడి మీద పోస్తే తప్ప నాకు మనశ్శాంతి రాదు." అంది రాధ.

రాధకున్న భక్తికి ఆనందపడింది లత.' అందరూ ఈవిడ అనవసరంగా చెడుగా మాట్లాడారు. ఈవిడ చాలా భక్తురాలిలాగా ఉంది' అనుకుంది లత. "మీరు ఎంత అదృష్టవంతులండి. నేను ఇప్పటికి కాశీ విశ్వేశరుడిని ఒక్కసారి మాత్రమే దర్శించుకోగలిగాను. మీరు ప్రతి సంవత్సరం దర్శించుకుంటున్నారంటే మీకెంత భక్తుందో తెలుస్తోంది." అంది లత.

"ఇదిగో ఈ సారి వీళ్ళ పెళ్ళి అడ్డు వచ్చింది. లేకపోతే ఈ సంవత్సరం కూడా కాశీలోనే ఉండేదాన్ని." అంది రాధ.

'ఆమ్మో. ఈవిడ నేను ఊహించిన దానికంటే చాలా పెద్ద భక్తురాలు అన్నమాట' అనుకుని, "చక్కగా పిల్లల పెళ్ళి చేసుకున్నాం కార్తీకమాసంలో. మంచే కదా జరిగింది." అంది లత, రాధ బాధని తగ్గించడానికి ప్రయత్నిస్తూ.

"మీకేం తెలుస్తుంది నాలాంటివాళ్ళ బాధ. మీరిద్దరూ కూడా బ్యాగ్లు ఒప్పుకుంటూ, ఉద్యోగాలకి వెళ్ళేబదులు, మానేసి, నాలాగా మంచి భక్తులు అవ్వండి." అంది రాధ.

అంతవరకూ రాధ, లత మాట్లాడుకుంటున్నది విన్న జాగృతి, 'ఇదేమిటి. ఈవిడ మమల్ని ఉద్యోగం మానెయ్యమంటున్నారు? మాకు వీలు దొరికినప్పుడు మేము కాశీ వెళ్తాము. దానికి కోసం ఉద్యోగాలు మానేయ్యం ఎందుకు?' అనుకుంది.

"నాకు ఇంకా 8 సంవత్సరాలు ఉందండి రిటైర్మెంట్ కి. అప్పటి వరకు చెయ్యాలి మరి. అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా కాశీ వెళ్తాను." అంది లత.

"సర్లెండి. మీరు వినరు. అసలు కాశీ వెళ్ళి వచ్చినవాళ్ళ కాళ్ళకి దణ్ణం పెట్టుకుంటే, కాశీ వెళ్ళినంత పుణ్యం వస్తుందంటారు. అదైనా తెలుసా?" అని అడిగింది రాధ.

"అయ్యో. తెలుసండి. జాగృతి మీ అత్తగారి కాళ్ళకి దణ్ణం పెట్టమ్మా." అని జాగృతి చెప్పింది లత. జాగృతి వెంటనే రాధ కాళ్ళకి దణ్ణం పెట్టింది.

"ఏం మీరు పెట్టారా?" అని లతని అడిగింది రాధ.

"మీరు నా కంటే వయసులో చిన్నవాళ్ళు కదా. దణ్ణం  పెట్టవచ్చో లేదోనని....." అంది లత.

"ఈ దేశంలోనున్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినదాన్ని నేను. అన్ని నదుల్లో మునిగాను. నాలాంటి భక్తురాలి కాళ్ళకి దణ్ణం పెట్టరా?" అని అరిచింది రాధ.

రాధ అరుపులకి భయపడి, కాళ్ళకి దణ్ణం పెట్టింది లత. అదే సమయంలో రాధ చిన్న నాటి స్నేహితురాలు లక్ష్మీకాంతం రాధ ఇంటికి వచ్చింది. "ఈవిడ ఎవరు? నీకెందుకు దణ్ణం పెడుతున్నారు?" అని అడిగింది.

"నా వియ్యపురాలు. నేను అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినదాన్ని కదా. నా కాళ్ళకి దణ్ణం పెడితే పుణ్యం వస్తుందని పెడుతున్నారు." అని చెప్పింది రాధ.

"నీకు దణ్ణం పెడితే పుణ్యం వస్తుందా? అయినా, నీకంటే పెద్దావిడలాగా కనపడుతున్నారు. నువ్వు పెట్టించుకుంటున్నావా? ఆవిడ పెడుతున్నారా? " అని అడిగింది లక్ష్మీకాంతం.

"ఆవిడే పెట్టారు. అది సర్లే కానీ, మావాడి పెళ్ళికి రాలేదేం నువ్వు?" అని మాట మార్చింది రాధ.

"మీ వాడి పెళ్ళి టైంకి మేము అనుకోకుండా కాశీ ప్రయాణం పెట్టుకున్నాం. అందుకని రాలేకపోయాను." అని చెప్పింది లక్ష్మీకాంతం.

"ఏమిటి నువ్వు కూడా కాశీ వెళ్ళావా? నాతో పోటీయా?" అంది రాధ.

"నీతో నాకు పోటీ ఏమిటి? నేను చెప్తేనే కదా నువ్వు కాశీ వెళ్ళడం మొదలు పెట్టావ్." అంది లక్ష్మీకాంతం.

"నువ్వు నాకు చెప్పడం ఏమిటి? నీకు కాశీ గురించి చెప్పిందే నేను. నీకంటే ముందునుండే నేను కాశీ వెళ్తున్నాను. మా నాన్న కాశీలో సన్యాసం తీసుకున్నారు తెలుసా?" అంది రాధ.

"అవును. గుర్తుంది. చిన్నప్పుడు ఊళ్ళోవాళ్ళందరూ చెప్పుకుంటుంటే విన్నాను. మీ అమ్మ పెట్టే బాధలు తట్టుకోలేక, ఎనిమిది మంది పిల్లల్ని వదిలేసి, ఎవరికీ చెప్పకుండా కాశీ వెళ్ళి, సన్యాసం తీసుకున్నారట కదా మీ నాన్న." అంది లక్ష్మీకాంతం.

"ఏం మాట్లాడుతున్నావే నువ్వు. మీలాంటివాళ్ళకి మాలాంటి భక్తులు తెలియటమే గొప్ప. అలాంటిది నువ్వు మమ్మల్ని అవమానిస్తావా?" అని కోపంగా లేచింది రాధ.

"కాశీ పేరు చెప్పి అందరిచేత కాళ్ళకి దణ్ణం పెట్టించుకుంటున్న నువ్వేం భక్తురాలివి? కాశీలో 9 రోజులు ఉండాలంటారు. నేను వెళ్ళిన ప్రతిసారి ఉంటాను. నీకూ అదైనా తెలుసా?" అంది లక్ష్మీకాంతం గొప్పగా.

"నాకు తెలుసే. అయినా నేను నీలా 9 రోజులు కాదు. కార్తీకమాసం నెల రోజులు అక్కడే ఉంటాను. అది నీకు తెలుసా?" అని అడిగింది రాధ.

"అవునా. ఏం గొప్ప పోతున్నావే. మేము కాశీలో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడికి వెళ్ళి, ఎన్ని రోజులు కావాలంటే అన్నీ రోజులు ఉండగలం. నీకూ కావాలంటే చెప్పు. మేము లేనప్పుడు అద్దెకి ఇస్తాం." అని గొప్పగా చెప్పింది లక్ష్మీకాంతం.

"నువ్వు కొన్నప్పుడు చూద్దాంలే. అయినా నీ ఇంట్లో అద్దెకుండాల్సిన అవసరం నాకు లేదు. మా నాన్నకి అక్కడ ఒక సత్రం ఉంది. మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడే ఉంటాం. నీకూ కావాలంటే చెప్పు. అక్కడ ఉండటానికి, తినడానికి కూడా అంతా ఫ్రీ. నీకూ పైసా ఖర్చు అవ్వదు." అంది రాధ.
 
నేను గొప్పంటే, నేనే గొప్పని, నేను భక్తురాలినంటే, నీకంటే గొప్ప భక్తురాలిని నేనని వాదించుకుంటున్న లక్ష్మీకాంతాన్ని, రాధని చూసి, 'భక్తులన్నవాళ్ళు ఇలా కూడా ఉంటారా?' అని ఆశ్చర్యపోయింది లత. గుండమ్మ కథ సినిమాలో సూర్యకాంతం, ఛాయాదేవి గొడవ గుర్తుకువచ్చి నవ్వుకుంది జాగృతి.

లత, జాగృతి అక్కడే ఉన్నారన్న ఆలోచన లేకుండా వాదనని పొడిగించారు రాధ, లక్ష్మీకాంతం. వీళ్ళ గొడవ ఇప్పట్లో ముగిసేతట్టులేదు అని అర్ధం చేసుకున్న లత, జాగృతి అక్కడనుండి తప్పుకున్నారు.

"ఇదేం భక్తో!!" అంది లత నిట్టూరుస్తూ.

"ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా, ఎన్ని నదుల్లో మునిగినా గొప్పలు,అహంకారం తగ్గనప్పుడు అవన్నీ చేసిన లాభం ఏమిటి?" అంది జాగృతి.

"అదే నాకు అర్ధం కావటంలేదు. మీ అత్తగారు కాశీ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషించాను. అన్నీ వదిలుకున్న కాశీ విశ్వేశ్వరుడు, మనల్ని కూడా అన్నీ వదులుకోమని చెప్తుంటే, వీళ్లేంటో కాశీ వెళ్ళడమే గొప్ప అని వాదించుకుంటున్నారు. ఏ పుణ్యక్షేత్రమైనా దర్శించుకున్నాక మనలో కొంత మార్పు రావాలి. భక్తి పెరగాలి. ఇవేవి జరగనప్పుడు కాశీయే కాదు ఏ పుణ్యక్షేత్రం అయినా వెళ్ళడం అనవసరం." అంది లత.

"పైగా ఈ సంవత్సరం కాశీ వెళ్ళలేకపోవడానికి ఆవిడకి మా పెళ్ళి అడ్డు వచ్చిందిట. మొదట నేను కూడా ఎంత భక్తో అనుకున్నాను. ఈవిడ గురించి అందరూ చెప్పే మాటలు నిజమేనన్నమాట." అంది జాగృతి.

"వీళ్ళ మాటలని బట్టి నీకేం అర్ధమయ్యింది?" అని అడిగింది లత, జాగృతిని.

జాగృతి నవ్వుతూ, "భక్తులు ఎలా ఉండకూడదో అర్ధంమయ్యింది. పుణ్యక్షేత్రాలు తిరిగివచ్చాక వాటి గురించి భక్తిగా చెప్పాలి గాని, గొప్పగా చెప్పకూడదని అర్ధమయ్యింది." అంది.

పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడాన్ని, పుణ్య నదుల్లో స్నానం చేయడాన్ని భక్తిగా కాక, గొప్ప కోసం వాడుకునే రాధ, లక్ష్మీకాంతం లాంటి భక్తులే ఈ మధ్య ఎక్కువగా ఉన్నారు. ఎక్కువ పుణ్యక్షత్రాలను దర్శించుకున్నవాళ్ళు భక్తులనుకుంటున్నారు. భక్తి అంటే దేవుడిలో లీనం కావడమని, భక్తులు అంటే భగవంతుడుని ఆరాధించేవాళ్ళు, భక్తిని ప్రసారం చేసేవాళ్ళన్న విషయాన్ని మర్చిపోతున్నారు.

***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అత్తగారి కథలు - అత్తగారి నిజస్వరూపం - by k3vv3 - 26-05-2026, 09:45 AM



Users browsing this thread: 1 Guest(s)