Thread Rating:
  • 1 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అత్తగారి కథలు - శుచి శుభ్రత
#37
కొత్తకోడలికి అత్తగారి పరీక్షలు
[color][size][font]

Rated NaN out of 5 stars.[/font][/size][/color]

#అత్తగారికథలు #అత్తాకోడళ్ళకథలు, #LVJaya, #LVజయ, #కొత్తకోడలికిఅత్తగారిపరీక్షలు

[Image: acb93b_f89cdc00812f43f8ad27586d47c06bed~mv2.jpg]



Kottha Kodaliki Atthagari Pareekshalu - New Telugu Story Written By L. V. Jaya

Published in manatelugukathalu.com on 25/01/2026 

కొత్తకోడలికి అత్తగారి పరీక్షలు - తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 20)

రచన: L. V. జయ





సమర్థ్ తరపు బంధువులందరికీ జాగృతి చాలా నచ్చింది. ఇంజనీరింగ్ చదివి, ఐటీ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఎలాంటి పొగరు లేకుండా, నెమ్మదిగా ఉందని అనుకున్నారందరూ. జాగృతిని బంధువులందరూ పొగుడుతుండడం సమర్థ్ వాళ్ళ అమ్మ రాధకి నచ్చలేదు.



"మీరందరూ ఇలా పొగుడుతుంటే దానికి పొగరు పెరిగిపోతుంది." అని చెప్పింది రాధ.



"చక్కగా చదువుకున్న మంచి పిల్ల కోడలు వచ్చింది నీకు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి." అంది రాధ అక్క కాంతం.



కాంతానికి ఆరుగురు కొడుకులు. అప్పటికే అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. కాంతం కోడళ్ళందరిని రాధే ఎంచింది. అందరూ మంచివాళ్ళు, కాంతాన్ని చాలా బాగా చూసుకుంటారు. కానీ ఒక్కరూ కూడా పెద్దగా చదువుకున్నవాళ్ళు కాదన్న బాధ కాంతానికి ఉండిపోయింది. అందుకేనేమో, కాంతానికి జాగృతి బాగా నచ్చింది. కానీ చుట్టాలందరితో పాటు, తన అక్క కూడా జాగృతి పొగడడాన్ని తట్టుకోలేకపోయిన రాధ, జాగృతిని పొడుగుతున్న చుట్టాలందరిముందే కించపరచాలనుకుంది.



"నేనేం అదృష్టవంతురాలిని అక్క!! అదృష్టవంతమంటే నీది. మంచి కోడళ్ళను వెతికి వెతికి తెచ్చాను నీకు. చక్కగా ఇంటిపట్టునే ఉండి, వాళ్ళ భర్తలకి, పిల్లలకి, నీకూ అన్నీ పనులు దగ్గరుండి చూసుకుంటారు వాళ్ళందరూ. నాకు వచ్చింది ఈవిడ. చూస్తూ ఉండు. చదువుకుని, ఉద్యోగం చేస్తోందన్న గర్వంతో ఏ పని చెయ్యదు. అంతా నేనే చేసుకోవాలి. నా మాట వింటుందని, నన్ను బాగా చూసుకుంటుందని నాకు అనిపించటం లేదు." అంది రాధ ఏడుపు మొహంపెట్టి.



రాధ, కాంతం మాటలు వింటున్న చుట్టాలందరూ, 'రాధ మాటలు నిజం అయ్యే అవకాశం లేకపోలేదు. పాపం రాధ.' అనుకున్నారు. కాంతం మాత్రం, "నువ్వు అనవసరంగా భయపడుతున్నావ్ రాధా. జాగృతి మంచి పిల్లలాగానే అనిపిస్తోంది. నిన్ను బాగా చూసుకుంటుంది. నీ మాట వింటుంది. పనులు రాకపోతే ఏం పోయింది? చదువుకున్న పిల్లే కదా అన్నీ తొందరగానే నేర్చుకుంటుందిలే." అని రాధకి నచ్చచెప్పింది.



"నాకు అనుమానమే. నా మాట వింటుంది లేదో ఇప్పుడే తేల్చేస్తాను. మీరందరూ దాన్ని తెగ పొగుడుతున్నారు కదా. మీ ముందే నిజం బయటపెడతాను." అని జాగృతిని పిలిచింది రాధ.

రాధకి తన ముందు ఎవరిని పొగిడినా నచ్చదన్న విషయం కాంతానికి గుర్తుకొచ్చింది. 'ఇప్పుడు ఈ రాధ, జాగృతిని ఏమంటుందో ఏమో!!' అని కాంతం భయపడింది.



వచ్చిన జాగృతిని చూసి, కాంతం, "రాధా. నువ్వేం చెయ్యబోతున్నావో నాకు తెలియదు. కానీ, ఇప్పుడే పెళ్ళై, ఇంటికి వచ్చిన పిల్లని అందరి ఎదురుగా ఏమీ అనకు. ఎవరైనా చుస్తే బాగుండదు. నామాట విను." అని నచ్చచెప్పటానికి ప్రయత్నించింది.



"నన్ను ఆపకు అక్క. ఇప్పుడే దీని సంగతి తేల్చేస్తాను." అంది రాధ కోపంతో. కాంతం, కాంతం కోడళ్ళు రాధని ఆపటానికి ప్రయత్నించినా, రాధ వినలేదు.



జాగృతికి, తనని ఎందుకు పిలిచారో, అక్కడ ఏం జరుగుతోందో, అత్తగారు కోపంగా ఎందుకున్నారో అర్ధం కాలేదు. "నువ్వు చదువుకున్నదానివి కదా. నేను చెప్పినది చేస్తావో లేదోనని వీళ్ళందరికీ అనుమానంగా ఉంది. అందుకే పిలిచాను." అంది రాధ.



"ఏం చెయ్యాలో చెప్పండి. చేస్తాను." అంది జాగృతి.



"వంట చెయ్యడం వచ్చా నీకు?" అని జాగృతిని అడిగింది. వచ్చని చెప్పింది జాగృతి.



"అయితే ఈ రోజు అందరికీ నువ్వే వంట చేస్తున్నావ్." అంది రాధ. జాగృతి చుట్టాలందరిని చూసి, 'ఇంతమందికి నేనెలా వంట చెయ్యగలను. ఈవిడేంటి ఇలాంటి పని చెప్పింది?' అనుకుంది.



"ఇంతమందికి వంట చెయ్యమంటే ఎలా చేస్తుంది? మేమెవ్వరం లేనప్పుడు వండించుకో నీ కోడలి చేత" అంది కాంతం.



"ఏం చెయ్యలేదా? కత్తిపీట తెచ్చి, ఈ కూరలన్నీ తరుగు." అని గదమాయించింది రాధ.



"కత్తిపీటతో ఇన్ని కూరలా? నాకు అలవాటు లేదండి. కటింగ్ బోర్డుతో అయితే తొందరగా చెయ్యగలను." అంది జాగృతి నెమ్మదిగా.



రాధ వెటకారంగా, "కత్తిపీటతోనే. ఏం మేమందరం కత్తిపీటతో కూరలు తరిగినవాళ్ళం కాదా? కటింగ్ బోర్డు కావాలంట. చూసావా దీని ఇంగ్లీష్ పొగరు." అంది రాధ, కాంతంతో.



'కటింగ్ బోర్డుని తెలుగులో ఏమంటారబ్బా? ఈవిడెందుకు ఇంత కోపంగా ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?' అనుకుంది జాగృతి. రాధ, కొత్త కోడలికి ఎదో పరీక్ష పెడుతోంది అనుకున్నారు చుట్టాలందరూ.



"ఈ కాలంలో కత్తిపీట వాడేవాళ్ళు ఎవరున్నారు రాధా? నువ్వు చెప్పిన పని చేస్తానంది కదా. ఇంక వదిలెయ్యి." అంది కాంతం, రాధని బతిమాలుతూ.



"వీల్లేదు. అది కత్తిపీటతో అన్ని కూరలు తరగాలి." అంది రాధ గట్టిగా. జాగృతి కష్టపడి కత్తిపీటతో కూరలన్నీ తరిగింది.



"నువ్వు చెప్పిన పని చేసింది కదా." అని రాధతో అని, "ఇంక వెళ్ళమ్మా. నీ పని నువ్వు చూసుకో" అంది కాంతం.



"కూరలు మాత్రమే తరిగింది. వంట చెయ్యలేదు. అప్పుడే వెళ్ళిపోవడానికి." అంది రాధ.



"అంతమందికి వంట ఎలా చేస్తుంది చెప్పు. వదిలెయ్యి." అంది కాంతం.



"సరే. వంట చెయ్యక్కరలేదు. భర్త పనులు చేస్తుందో లేదో చూస్తాను. నూనె తెచ్చి, మా వాడికి రాయి." అంది రాధ.



'ఇదేమిటి? అందరిముందూ సమర్థ్ కి నూనె ఎలా రాయగలను. ఎలా పరిస్థితి నుండి తప్పించుకోవాలి?' అనుకుంది జాగృతి. జాగృతిని సరదాగా ఏడిపించడానికి రాధ ఇలా చేస్తోందేమో అనుకున్నారు సమర్థ్ తరపు బంధువులు. జాగృతి ఏం చేస్తుందా అని ఎదురుచూసారు. జాగృతి ఇల్లంతా వెతికి, "నూనె ఎక్కడుందో నాకు కనపడలేదండి." అని రాధతో చెప్పింది.



"చూసారా. నేను చెప్పింది నిజం. ఇది భర్త కి సంబంధించిన పనులు చెయ్యదు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది చూడండి." అని గట్టిగా అందరికీ వినపడేటట్టుగా అరిచింది రాధ. రాధ మాట విన్న చుట్టాలందరికీ, రాధ సరదా కోసం కాదు పంతంతో జాగృతి చేత పనులు చేయిస్తోందని అర్ధమయ్యింది.



"అందరిముందూ ఇలాంటి పనులు చెయ్యమంటే ఎలా చేస్తుంది పాపం? పెళ్ళై ఇంకా రెండు రోజులు కూడా కాలేదు. మొహమాటం ఉంటుంది కదా." అని రాధకి చెప్పింది కాంతం.



రాధ, "ఓహ్. అందరిముందూ ఇలాంటి పనులు చెయ్యలేదా? సరే. చూద్దాం. ఎవరు చూడకుండా చేస్తుందో లేదో?" అని, సమర్థ్ లోపల బట్టలు, బట్టలు ఉతికే సబ్బు తెచ్చి జాగృతి చేతిలో పెట్టింది. "ఎవరు చూడకుండా ఇవ్వన్నీ ఉతికిరా. ఇప్పుడు సబ్బు కనపడలేదని చెప్పి, తప్పించుకునే అవకాశం లేదు." అంది రాధ జాగృతితో.



రాధ ఇచ్చిన బట్టల్ని చూసి, "ఈ బట్టలు... నేనెలా...ఉతకగలను?" అంది జాగృతి అయోమయంగా.



"ఏం? ఫస్ట్ నైట్ లో లేని సిగ్గు ఇప్పుడెందుకు వచ్చిందో?" అంది రాధ కళ్ళు పెద్దవి చేస్తూ.



'ఏమిటి ఈవిడకి నాతో ఉన్న ప్రాబ్లెమ్? ఎందుకు అందరిముందూ ఇలా మాట్లాడుతోంది?' అనుకుంది జాగృతి. జాగృతికి కళ్ళలోంచి నీళ్ళు కారాయి.



"పాపమ్. ఇంక వదిలెయ్యండి." అంటూ రాధ దగ్గరకి వచ్చి నచ్చచెప్పటానికి ప్రయత్నించారు కాంతం కోడళ్ళు. అయినా రాధ కోపం తగ్గలేదు.



"నా కొడుకు దీన్ని చేసుకుంటానంటే, కాదనలేకపోయాను. మిమ్మలందరినీ నేనే ఎంచాను. చదువుకున్నది కావాలంటూ దీన్ని వాడు ఎంచుకున్నాడు. అందరూ దీన్ని పొగుడుతుంటే, నా నెత్తిమీదకి ఎక్కి కూర్చుంటుంది. నా కొడుకుని లొంగదీసుకుంటుంది. కొన్నాళ్ళ తరువాత పిల్లల్ని కని, నా మీద వదిలేసి, బాగ్ ఊపుకుంటూ ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. నన్ను పనిదాన్ని చేసేస్తుంది. నా బాధ ఎవరికి చెప్పుకోను. అంతా నా ఖర్మ." అని రాధ తల కొట్టుకుంటుంది.



జాగృతి బెదిరిపోయింది. రాధ మాటలకి, తన మీద రాధకున్న అనుమానాలకి, తనకి పెట్టిన పరీక్షలకి, అందరి ఎదురుగా చేసిన అవమానానికి తట్టుకోలేక జాగృతి కళ్ళలోంచి ఆగకుండా కన్నీళ్ళు వచ్చాయి.



కాంతం కోడళ్ళు రాధకి దూరంగా జాగృతిని తీసుకెళ్ళి, "ఆవిడ అంతేనమ్మా. మేము ఆవిడ అక్క కోడళ్ళమే అయినా మాతో కూడా ఆవిడ ఇలాగే మాట్లాడుతుంది. ఆవిడ మాట తీరే అంత. సిగ్గు, మొహమాటం, భయం అనేవి ఆవిడకి లేవు. చదువుకున్న కోడలు వస్తే ఈవిడ తిక్క కుదురుస్తుందని మేమందరం అనుకునేవాళ్ళం. నువ్వు ఇలా డీలా పడిపోతే ఎలా? నువ్వు ఈవిడ మాటలని పట్టించుకోకు. నీ భర్త సమర్థ్ మాత్రం చాలా మంచివాడు. జాగ్రత్త." అని చెప్పి జాగృతిని ఊరుకోబెట్టారు.



రాధ తన అసూయని, కసిని,అనుమానాన్ని బయటపెట్టి, అందరిముందూ జాగృతిని కించపరిచినందుకు చాలా ఆనందపడింది. కానీ చుట్టాలందరూ రాధ మాటలని, జాగృతితో రాధ ప్రవరిస్తున్న విధానాన్ని చూసి రాధనే అసహ్యించుకున్నారు.



చుట్టాలలో ఒకరిద్దరు ఆడవాళ్ళు, "ఇంటికి వచ్చిన కొత్త కోడలిని సాదరంగా ఆహ్వానించి, సొంత కూతురిలా చేసుకోవాల్సింది పోయి, అన్ని మాటలు అంటావా? భార్య, భర్తలు ఒకరికోసం ఒకరు పనులు చేస్తారు. చెయ్యాలి కూడా. కానీ పెళ్ళైన రెండు రోజుల్లోనే ఇన్ని పరీక్షలు పెడతావా? ఆ పిల్లని అన్ని మాటలు అన్నావ్. పాపం ఎలా ఏడుస్తోందో చూడు. ఆ పిల్ల మంచిది కాబట్టి నువ్వేమన్నా, చేసినా మాట్లాడకుండా ఉంది. ఈ కాలంలో ఇంత నెమ్మదిగా కోడలు దొరికింది నీకు. కానీ నువ్వే నీ మనసులోని చెత్తనంతా బయట పెట్టుకున్నావు." అని రాధని తిట్టారు. చుట్టాలందరూ జాగృతిని ఇంకా పొగుడుతూ, రాధని అసహ్యించుకున్నారు.



'ఎవరు తీసిన గొయ్యిలో వారే పడతారు.' అన్నట్టయ్యింది రాధ పరిస్థితి. 

***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: అత్తగారి కథలు - అత్తగారి నిజస్వరూపం - by k3vv3 - 26-05-2026, 09:44 AM



Users browsing this thread: 1 Guest(s)