23-05-2026, 05:26 AM
ఏజెంట్ రూహి వాసుదేవ్...30
రూహి చైనా సైనికుల దుస్తులు వేసుకొని వారిలో కలిసిపోయి ఆ ఫ్యాక్టరీ లో ఉన్న లైట్ టవర్ ఎక్కింది. అక్కడి నుంచి తనకు ఎదురుగా ఒక పెద్ద అణుబాంబు లాంటిది కనిపించింది. దానితో ఒక నగరాన్ని మొత్తం నామరూపాలు లేకుండా చేయచ్చు అని తెలిసి తన గుండె ఆగినంత పనైంది. ఊపిరి వేగంగా మారింది.
సరిగ్గా అప్పుడే అమిర్, ఒకసారి ఇటు చూడండి మేడం అని పిలవడం తో రూహి తల తిప్పి చుట్టూ చూసింది. అక్కడ మొత్తం అలాంటి బాంబులు ఐదు ఉన్నాయి. వాటితో ఐదు నగరాలని నేల కూల్చచ్చు. అదే జరిగితే చరిత్రలో ఎవరూ చూడని విధ్వంసం మన భారత దేశం మీద జరుగుతుంది. ఊహిస్తుంటేనే రూహి గుండె వేగం రెట్టింపు అయ్యింది. తన ఒళ్ళంతా చమటలు పట్టాయి.
తర్వాత ఆ ఐదు బాంబులను తీక్షణంగా గమనించింది. తన అనుమానం నిజం చేస్తూ వాటిలో ఒక్కో బాంబు మీద ఒక్కో పేరు ఉంది. వాటి పేర్లు BLR, HYD, DEL, BOM, KOL
ఆ పేర్లను పరిశీలించిన తరువాత రూహి షాక్ అయ్యి అలా నిలబడిపోయింది. శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయింది.
ఇంతలో...
"మేడం... ఆ పేర్లకు అర్థం నేను ఊహిస్తున్నదే నా..." అని అమిర్ అనుమానంగా అడిగాడు.
"అదే అమిర్... బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా... ఈ ఐదు నగరాల మీద ఈ ఐదు బాంబులు ప్రయోగిస్తున్నారు."
"మన దేశం లో ఆ ఐదు చాలా ముఖ్యమైన ప్రముఖ నగరాలు. పొరపాటున ఈ అణుబాంబు లు వాటి మీద ప్రయోగిస్తే... అసలు ఊహించడానికే కష్టంగా ఉంది. దేశం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. మన దేశం లో పెట్టుబడులు పెట్టడానికి ఇంకెవరూ రారు. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతాం. అభివృద్ధి లో కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళిపోతాం. అన్నిటికీ మించి కొన్ని కోట్ల మంది భారతీయుల ప్రాణాలు పోతాయి. మరెంతోమంది ఆప్తులను కోల్పోతారు. మన నేల రక్తం తో తడుస్తుంది" అని అమిర్ తడబడుతూ చెప్పాడు.
"నేను ప్రాణాలతో ఉండగా అలా జరగనివ్వను అమిర్.
శత్రువులు మనం హిమాలయాల పక్కనే ఉంటాం... అందులో మంచులా మన భారతీయులు కూడా ఎప్పుడూ చల్లగా ఉంటామని అనుకుంటున్నారు.
కాని సునామి సృష్టించే సముద్రాలు కూడా మన పక్కనే ఉంటాయని వారు మరిచారేమో...
ఆ సంగతి మరోసారి చాటి చెప్పే సమయం ఆసన్నమైంది. ఒక్క రక్తపు బొట్టు కూడా మన నేల మీద పడకుండా కాపాడుకుందాం. " అని రూహి దృడంగా పలికింది.
"మనకు కేవలం ఈ బాంబులు గురించి మాత్రమే తెలుసు. వాటిని ఎప్పుడు ఎలా ప్రయోగించునున్నారో తెలీదు. అసలు ఈ ఆపరేషన్ FISH అంటే కూడా పూర్తిగా తెలీదు. అలాంటప్పుడు దాన్ని ఎలా ఆపగలం మేడం." అని అమిర్ సందేహంగా అడిగాడు.
"దానికి ఒకటే దారి..." రూహి స్పష్టంగా చెప్పింది.
"ఏంటి మేడం అది..."
రూహి ఆ లైట్ హౌస్ నుంచి తన చూపుడు వేలితో ఒక వైపు చూపించింది. అది ఆ చైనా మిలిటరీ చీఫ్ జిన్ పింగ్ ఆఫీస్.
అమిర్ ఆశ్చర్యంగా చూసాడు.
"అవును అమిర్... మనం వాడిని బందించగలిగితే ఈ ఆపరేషన్ కి సంబందించిన వివరాలు తెలుసుకోగలం."
"కాని అది చాలా ప్రమాదకరం మేడం. ఏ మాత్రం మనం దొరికినా మన ప్రాణాలు తీసేస్తారు."
"నన్ను చేరడానికి సరిపోయేంత ధైర్యం మృత్యువు దగ్గర లేదు లే అమిర్...." అని రూహి దృడంగా చెప్పింది.
రూహి మరోసారి జిన్ పింగ్ ఆఫీస్ వైపు చూసింది. దాని ముందు ఒక పది మంది సైనికులు కాపలాగా ఉన్నారు. వారిని దాటి లోపలకు వెళ్లడం దాదాపు అసాధ్యం. వారి దాకా వెళ్తే వీరి వేషం బయటపడి దొరికిపోవడం కూడా ఖాయం. అందుకే ఏం చేయాలా అని రూహి ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడే తనకు ఒక ఆలోచన వచ్చింది.
వెంటనే ఏం చేయాలో అమిర్ కి చెప్పింది. అమిర్ అర్థమైంది అన్నట్టు తల ఊపాడు. అక్కడి నుంచి కిందకు దిగుతూ రూహి వైపు తిరిగి...
"జాగ్రత్త మేడం.." అని చెప్పాడు.
"గెలిస్తే మన దేశపు నేల మీద కలుద్దాం. ఓడితే అదే నేల లోపల కలుద్దాం." అని రూహి నవ్వుతూ చెప్పింది.
అమిర్ కూడా నవ్వుతూ సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రూహి ఆ లైట్ హౌస్ మీద సిద్ధంగా ఉంది.
తన వెంట తెచ్చిన బ్యాగ్ లో నుంచి రోప్ గన్ బయటకు తీసి చేతిలో పట్టుకుంది. సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది.
ఇంతలో తను చెప్పినట్టుగానే జిన్ పింగ్ ఆఫీస్ కి వ్యతిరేక దిశలో ఉన్నట్టుండి కాల్పులు మొదలయ్యాయి. అది మొదలుపెట్టింది అమిర్ అని తనకు బాగా తెలుసు. ఆ కాల్పులు వినగానే చాలా మంది సైనికులు అక్కడ ఏం జరిగిందో అని అటు వైపు కదిలారు.
అందరి దృష్టి అటు వైపే ఉండటం తో రూహి తన పని మొదలుపెట్టింది. తన చేతిలో ఉన్న గన్ తో జిన్ పింగ్ ఆఫీస్ వెనుక ఉన్న చెట్టు మీదకు కాల్చింది. ఒక తాడు వెళ్లి ఆ చెట్టులో చిక్కుకుంది. ఇంకో చివరను లైట్ హౌస్ కి కట్టింది. రూహి వెంటనే తన బెల్ట్ తీసి ఆ తాడుకు వేసి జారింది.
సైనికులు అందరూ ఆ కాల్పులు వస్తున్న వైపు చూస్తూ ఉండటం తో రూహి ని ఎవరూ గమనించలేదు. అదే అదునుగా రూహి జారుకుంటూ జిన్ పింగ్ ఆఫీస్ బిల్డింగ్ పైకి చేరుకుంది.
అక్కడున్న తలుపు తెరిచి లోపలకు అడుగు పెట్టింది. అంత సెక్యూరిటీ దాటి లోపలకు ఎవరు వస్తారులే అనే ధైర్యమేమో... ఆ ఆఫీస్ లోపల ఎలాంటి సెక్యూరిటీ లేదు. రూహి శబ్దం రాకూడదు అని తన కాళ్లకు ఉన్న షూస్ తీసేసి అడుగులో అడుగు వేసుకుంటూ నడిచింది.
తన చేతిలోని తుపాకీ ఎవరైనా శత్రువు వస్తే అతని గుండెల్లో తూటా దింపడానికి సిద్ధంగా ఉంది. తన కళ్లు చురుకుగా చుట్టూ గమనిస్తున్నాయి.
అలా నడుస్తూ ఓ పెద్ద హాల్ లాంటి గదికి చేరుకుంది. ఆ గది మధ్యలో మన భారతదేశపు చిత్రపటం ఉంది. అందులో వారు బాంబులు పెల్చాలి అనుకుంటున్న ఐదు నగరాలు ఉన్న చోటులను కత్తులతో గుచ్చారు. అది చూడగానే రూహి రక్తం మరిగిపోయింది. అలా చూస్తూ ఉండగానే వెనుక నుంచి ఓ చెయ్యి తన మీద పడింది. టక్కున తల తిప్పి చూసింది. ఎదురుగా జిన్ పింగ్...
అతను తన ఎదురుగా చైనా సైనికుడు ఉన్నాడని అనుకున్నాడు. కాని రూహి మోహం చూడగానే తన ఎవరో అర్థమై అతని కళ్లు ఆశ్చర్యం తో పెద్దవి అయ్యాయి. వెంటనే తుపాకీ తో తనని కాల్చాలని అనుకున్నాడు. కాని రూహి తనకు ఆ అవకాశం ఇవ్వలేదు. వేగంగా తన చేతిలోని తుపాకీ తీసి అతని తలకు గురి పెట్టింది. జిన్ పింగ్ తన చేతులు రెండు పైకి ఎత్తి లొంగిపోయాడు.
రూహి వెంటనే తనని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోమన్నట్టు సైగ చేసింది. అతను అలాగే చేశాడు. రూహి తాడు తో తన కాళ్ళు చేతులు కట్టేసింది. అతని ముందు కూర్చొని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసింది. జిన్ పింగ్ మోహం లో కోపం, భయం రెండు ఉన్నాయి.
"నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావ్. ఈ పాటికే నిన్ను మావాళ్లు చంపేసి ఉంటారని అనుకున్నాను." అని ఆవేశంగా అరిచాడు.
ఆ మాటకు రూహి నవ్వుతూ...
"నన్ను కత్తులతో పొడవాలని చూస్తే గాలిలా మారుతా...
తుపాకీలతో కాల్చాలని చూస్తే నీరులా మారుతా...
నన్ను చంపే ఆయుధం ఇంకా ఆ దేవుడు తయారు చేయలేదు.. అయినా నీ లాంటి లుచ్చా గాళ్ళ చేతిలో చావడానికి నేనేవరో మర్చిపోయావా... ఏజెంట్ రూహి వాసుదేవ్ D/O ఏజెంట్ విక్రమ్ వాసుదేవ్..."
"నీ ధైర్యం గురించి విన్నాను. కావాలంటే నీకొక అవకాశం ఇస్తాను. మా దేశం లోని సైన్యం లో కలవు.. నీకు ఏం కావాలంటే అది ఇస్తాము."
"నీ దేశం ముందు తల దించి వంద సంవత్సరాలు బ్రతకడం కంటే, నా దేశం కోసం తల ఎత్తుకొని ఒక్క రోజు బ్రతికినా చాలు... నా నుంచి నా దేశాన్ని ఎవరూ వేరు చేయలేరు " రూహి స్పష్టంగా చెప్పింది.
ఆ మాటకు జిన్ పింగ్ నవ్వుతూ...
"రూహి, నువ్వు ఇక్కడికి చాలా ఆలస్యం గా వచ్చావ్. విధ్వంసానికి మొత్తం పూర్తి అయ్యింది. ఈరోజు మీ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం. అందరూ ఆనందం లో సంబరాలు జరుపుకుంటున్నారు. కాని వారికి తెలియదు మరికాసేపట్లో రక్తపు వర్షం కురుస్తుందని....
అసలు ఆపరేషన్ FISH అంటే ఏంటో తెలుసా...
Five cities to Sack Hindustan...
అంటే ఇంకాసేపట్లో మేము ఈ బాంబు ప్రయోగించగానే... అవి మీ దేశం లోని ఐదు నగరాలను చేరుతాయి. ఆ నగరాలు అన్ని నామ రూపాలు లేకుండా పోతాయి. అప్పుడు మీరు సహాయం కోసం మా దగ్గర తల వంచి అడుక్కోవాలి. చైనా దయతో మీరు మా కాళ్ళ కింద చెప్పులా బ్రతుకుతారు." అని అన్నాడు.
ఆ మాట పూర్తి కాగానే రూహి రక్తం ఉబికే లావా లాగా ఎగసిపడింది. ఎగిరి వాడి గుండెల మీద తన్నింది. తనకోస్తున్న కోపానికి వాడి గుండెను చీల్చి ఆ రక్తం తాగాలని అనిపించింది.
"ఏమన్నవ్ రా.. నా దేశం నిన్ను అడుక్కోవాలా...
మా భారతీయులకు గుండెల్లో నుంచి రక్తం కారుతున్నా, అడుగులు తదబడినా, చివరకు మా ఎదురుగా మృత్యువే నిలబడినా... రొమ్ము విరిచి శత్రువుల పైకి దూకుతాం తప్ప... వెన్ను చూపడమన్నది మా రక్తం లోనే లేదు.
నేను ఉండగా ఇక్కడ ఒక్క ప్రాణం కూడా పోనివ్వను. " అంటూ ఆవేశంగా వాడి గుండెల్లో తుపాకీ తో బుల్లెట్ల వర్షం కురిపించింది.
సరిగ్గా అప్పుడే తన ముందున్న స్క్రీన్ వంక చూసింది. అక్కడ పార్వతి, వంశీ చైనా సైనికులకు చిక్కారు. అది చూడగానే రూహి షాక్ అయ్యి అలాగే నిలబడిపోయింది.
ఒకవైపు బాంబు ప్రయోగించడానికి ఎక్కువ సమయం లేదు. ఎలాగైనా ఆపాలి. మరోవైపు తనని నమ్మి వచ్చిన బృందం ఆపదలో ఉంది. అమిర్ ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో కూడా తెలీదు.
ఇంతలో జిన్ పింగ్ ని కాల్చినప్పుడు వచ్చిన శబ్దం తో బయట ఉన్న సైనికులు వేగంగా లోపలకు వచ్చి రూహి ని చుట్టు ముట్టారు.
ఆ క్షణం రూహి వాసుదేవ్ ఓ పెద్ద పద్మవ్యూహం లో చిక్కుకుంది. మరి ప్రాణాలతో బయటపడగలదా....?



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)