Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏజెంట్ రూహి వాసుదేవ్
#64
ఏజెంట్ రూహి వాసుదేవ్...29



అమిర్ సాయం తో రూహి బృందం రహస్య సొరంగ మార్గం ద్వారా చైనాలో అడుగు పెట్టింది. అమిర్ కారును ఒక చోట ఆపాడు.

అక్కడి నుంచి చైనా రహస్యంగా నిర్వహిస్తున్న విధ్వంస ప్రదేశాన్ని చేరుకోడానికి మరో అర కిలోమీటర్ దూరం మాత్రమే ఉందని చెప్పాడు. కారులో వెళ్తే శత్రువులకు దొరికిపోయే అవకాశం ఎక్కువ. అందుకే దిగి నడుద్దామని అమిర్ సూచించాడు. దానికి రూహి కూడా ఒప్పుకుంది. కారుని ఆ పక్కనే ఉన్న ముళ్ల పొదల్లో దాచేశారు. తరువాత ఒక్కో అడుగు వేస్తూ అమిర్ చెప్పిన వైపు నడిచారు.

నిజానికి వారు నార్త్ కొరియా వెళ్ళింది చైనా భారత దేశం మీద చేయబోయే దాడి గురించి తెలుసుకోడానికి...
కాని చిత్రంగా అక్కడ కేవలం విధ్వంసం చేయడానికి కావాల్సిన కెమికల్స్ మాత్రమే తయారు చేసి వాటిని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే చైనా లో అంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలకు సంబంధించిన పరిశోధనలు చేస్తే మన గుడాచారులకు తప్పక తెలుస్తుంది. అదే జరిగితే చైనా అంతర్జాతీయ సమాజం ముందు తన తప్పును దాచుకోలేక దోషి గా నిలబడాల్సి వస్తుంది. అందుకే చాలా తెలివిగా ఈ పనికి తన స్నేహ దేశమైన నార్త్ కొరియా ను వాడుకుంది.

కాని రూహి బృందం నార్త్ కొరియా లో వారి పరిశోధనకు సంబంధించిన అన్ని ఆధారాలు సంపాదించింది. కాని వాటితో ఏమి చేయబోతున్నారో తెలుసుకోలేకపోయారు. అది కనిపెట్టడానికే ఇప్పుడు ఈ చైనా వచ్చారు.

రూహి బృందం ఆయుధాలు చేత పట్టుకొని ఒక్కో అడుగు చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. ఎటు వైపు నుంచి ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదురుకునేలా అప్రమత్తంగా ఉన్నారు.
అడుగులు సాగే కొద్ది భరించలేని దుర్గంధం వారి ముక్కులను చేరింది. కడుపులో వాంతి వచ్చినట్టు అనిపించింది. ముక్కు మూసుకొని ఒక్కో అడుగు వేస్తున్నారు.

ఇంతలో ఏదో వాహనం వారి వైపు వస్తున్న శబ్దం రావడం తో అందరూ వేగంగా పక్కనే ఉన్న పొదల్లో దాక్కున్నారు. చూస్తూ ఉండగానే ఒక వ్యాన్ లాంటి వాహనం వారి వైపు వచ్చి కాస్త దూరం లో ఆగింది.

అందరూ ఊపిరి బిగబట్టి ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. ఇంతలో వ్యాన్ లో నుంచి కొంతమంది చైనా సైనికులు కిందకు దిగారు. వారి చేతుల్లో అత్యాధునికమైన ఆయుధాలు ఉన్నాయి. వారు దిగిన తరువాత ఆ వ్యాన్ లో నుంచి కొన్ని డ్రమ్ములు కిందకు దింపారు. వాటిని ఈడ్చుకుంటూ పక్కనే ఉన్న మైదానం లాంటి ప్రాంతానికి వెళ్తున్నారు.

అందులో ఏముందా అని రూహి బృందం ఆసక్తిగా చూస్తుంది. ఆ మైదానం దగ్గరకు చేరుకున్నాక ఆ డ్రమ్ములు ఒక్కొక్కటి గుమ్మరించారు. అందులో ఉన్నది చూసాక అందరి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. వారి కళ్ళను వారే నమ్మలేకపోయారు. ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. అంతకంటే భయంకరమైన దృశ్యం మరొకటి చూస్తారని కలలో కూడా అనుకోలేదు.

ఆ డ్రమ్ములలో మనుషుల అవయవాలు ఉన్నాయి. చేతులు, కాళ్ళు, తల ఇలా ఒక్కో భాగం విడి విడిగా నరికి... ఆ డ్రమ్ములో కుక్కి తీసుకొని వచ్చారు. అందులో నుంచి ఎర్రని రక్తం చిమ్మింది. ఆ రక్తం తో తడిచిన ఆ అవయవాలు చూస్తుంటే వారి గుండెల్లో వణుకు పుట్టింది.

పార్వతి తట్టుకోలేక భయ పడుతూ చిన్నగా అరిచింది. వంశీ వెంటనే తన నోరు మూసేసాడు. ఏదో శబ్దం రావడం తో ఓ సైనికుడు తల తిప్పి రూహి వాళ్ళు దాక్కున్న వైపు అనుమానంగా చూసాడు. ఇంతలో మరో సైనికుడు వచ్చి పనిని త్వరగా ముగించమని చెప్పడం తో మొదటి సైనికుడు ఆ విషయం మర్చిపోయి తన పనిలో పడిపోయాడు. రూహి ఊపిరి పీల్చుకుంది. పొరపాటున వారికి అనుమానం వచ్చి ఉంటే వారు చాలా ప్రమాదం లో పడిపోయేవారు అని అనిపించింది.

వీరు ఆ అవయవాలను చూసి భయపడిపోయినా...
ఆ చైనా సైనికులకి ఇదంతా చాలా సాధారణ విషయం అన్నట్టు... ఆ శరీర భాగాల మీద తమ వెంట తెచ్చిన పెట్రోల్ చల్లారు. తరువాత వాటికి నిప్పు అంటించారు. చూస్తు ఉండగానే ఆ మంటలు వేగంగా వ్యాపించాయి.

కాసేపటికి మొత్తం కాలిపోయి బూడిద అయ్యాక ఆ సైనికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారు అలా వెళ్ళిపోయాక అప్పటిదాకా ఆపుకున్న పార్వతి పరుగున పక్కకు వెళ్లి వాంతి చేసుకుంది. అందరి పరిస్థితి అలాగే ఉంది. మనుషులను ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో తెచ్చి కాల్చడం ఏంటి.. ఊహిస్తుంటేనే వారి వెన్నులో వణుకు పుట్టింది.

అందరూ అలా నిలబడి ఉండగానే రూహి వారు కాల్చిన చోటు కు వెళ్లి కాసేపు తీక్షణంగా చుట్టూ గమనించి వచ్చింది.

"ఏంటి మేడం ఇది... మనుషులను ఇంత దారుణంగా చంపారు. వారు అసలు మనుషులా? లేక రాక్షసులా? "అని వంశీ ఆవేశంగా అన్నాడు.

"వారు చేస్తున్న తప్పు కప్పిపుచ్చుకోవాలి కదా..."

రూహి మాట అందరిలో ఆశ్చర్యం కలిగించింది. అందరి వంక చూస్తూ ఇలా అంది.

"అవును మీరు విన్నది నిజమే... ఇలాంటి పేలుడు పదార్థాలు తో పని చేసేటప్పుడు.. రేడియేషన్ మూలంగా అంతుచిక్కని వ్యాధులు వస్తు ఉంటాయి. వారిని ఆసుపత్రి కి తరిలిస్తే ఇక్కడ వీరు చేస్తున్న రహస్య విధ్వంసం అందరికీ తెలుస్తుంది అని భయం తో అలాంటి వారిని అంతమోందించి.. ఎవరికీ తెలియకుండా ఇలా కాల్చేస్తున్నారు. " అని రూహి అందరికీ అర్థమయ్యేలా చెప్పింది.

"ఇంతమంది ఉసురు తీస్తున్న చైనా కు ఆ పాపం అంటదంటారా...."

ఆ మాటకు రూహి నవ్వుతూ
"నువ్వు చదివిన చరిత్ర మొత్తం వెతుకు... ఈ ప్రపంచం గెలిచిన తలలను మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. ఆ గెలుపు చేరే దారిలో అన్యాయంగా నేలకు ఒరిగిన తలలను కాదు."

రూహి సమాధానం విని మిగతా అందరూ అవును అన్నట్టు తల ఊపారు.

"ఆ పేలుడు పదార్థం దగ్గర పని చేసిన వారి పరిస్థితే ఇలా ఉంటే..  ఆ పేలుడు మన దేశం లో జరిగితే మన ప్రజలకు ఎలాంటి దుస్థితి వస్తుందో మీరే ఊహించుకోండి. ఎలాగైనా సరే దాన్ని ఆపాలి. త్వరగా వెళ్దాం పదండి." అని రూహి అనడం తో అందరూ ఆ పొదలలో నుంచి బయటకు వచ్చి మరోసారి నడవడం మొదలుపెట్టారు.

అలా కొంత దూరం నడిచిన తరువాత ఓ ఫ్యాక్టరి లాంటిది కనిపించింది. దూరం నుంచి చూడగానే ఆ గేట్ దగ్గర సుమారు పది మంది సైనికులు కాపలా గా కనిపించారు. అందుకే ఆ ఫ్యాక్టరీ వెనుక వైపు నుంచి వెళ్లాలని అందరూ అటు కదిలారు. ఫ్యాక్టరీ వెనుక వైపు ఎలాంటి బందోబస్త్ లేదు.

ఇంతలో రూహి అందరిని ఎక్కడివారిని అక్కడే ఆగమని ఆదేశించింది. ఏం జరిగిందో తెలియక అందరూ కదలకుండా అలాగే నిలబడ్డారు.

"ఈ ప్రదేశం అత్యంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం చైనా కు ఉంది. అలాంటిది ఫ్యాక్టరీ వెనుక వైపు కాపలా గా ఒక్కరు కూడా లేరు అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. కాసేపు కదలకుండా అలాగే ఉండండి..." అని రూహి చుట్టూ పరిసరాలను గమనించింది.

అప్పుడే తన చూపు నేల మీద పడింది. తన అనుమానం నిజమైంది.
"ఒక్కసారి ఇటు చూడండి. ఆ చైనా సైనికుల అడుగులు  ఈ నేల మీద అక్కడక్కడా మాత్రమే ఉన్నాయి. చాలా చోట్ల ఎలాంటి అడుగుల గుర్తులు లేవు. పైగా ఆ అడుగులు లేని చోట నేల తవ్వి ముసినట్టు అనిపిస్తుంది. అంటే అక్కడ ల్యాండ్ మైన్స్ పెట్టి ఉండాలి. వాటి మీద అడుగు వేస్తె మనమందరం క్షణం లో బూడిద అవుతాం..."

రూహి ముందు చూపును, సూక్ష్మ బుద్దిని బృందం మొత్తం మనసులోనే అభినందించకుండా ఉండలేకపోయారు.

"మరి ఇప్పుడు ఎలా మేడం..." అని వంశీ కంగారుగా అడిగాడు.

"ఈ నేల మీద ఆ చైనా సైనికుల అడుగుల గుర్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటి మీద మాత్రమే నడుస్తూ ముందుకు వెళ్దాం..." అని రూహి అలాగే నడవడం మొదలుపెట్టింది. తన వెనుకే మిగతా బృందం కూడా...
అందరూ ఒక్కో అడుగు చాలా జాగ్రత్తగా వేస్తున్నారు.

అలా చివరకు ఫ్యాక్టరీ వెనుకనున్న గోడను చేరుకున్నారు. అమిర్ దగ్గర ఉన్న తాడు కు S ఆకారం లో ఉండే ఒక ఇనుప చువ్వ ను తగిలించి ఆ గోడ పైకి విసిరింది. కొన్ని ప్రయత్నాల తరువాత అది పైనున్న కొక్కానికి తగిలి నిలిచింది.

రూహి ముందుగా ఆ తాడు పట్టుకొని పైకి పాకింది. ఆ ఫ్యాక్టరీ లోపల కూడా వెనుక వైపు గుబురుగా గడ్డి ఉండడం తో ఎవరూ కాపలా గా లేరు. అదే వీరికి కలిసి వచ్చింది. రూహి లోపలకు దూకింది. తన వెనుకే మిగతా బృందం కూడా తాడు సాయం తో లోపలకు చేరుకున్నారు.

ఆ ఫ్యాక్టరీ లో చాలా షెడ్డులు లాంటివి నిర్మించి ఉన్నాయి. ఒక్కో దాన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే ఇక్కడి నుంచి బృందం మొత్తం రెండు జట్లుగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పార్వతి, వంశీ ఒక వైపుకు వెళ్తే... రూహి, అమిర్ మరో వైపుకు అడుగు వేశారు.

వెళ్లే ముందు రూహి వారితో ఓ మాట చెప్పింది.
"ఓ ప్రాణం పోయాడానికి తొమ్మిది నెలలు పడుతుంది. కాని ఆధిపత్యం కోసం క్షణాల్లో ఆ ప్రాణం తీయాలని చూస్తున్న ఈ శత్రువుల కలను నేడు మనం కూల్చబోతున్నాం. దానికోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పిద్దాం... వందేమాతరం..."

ఆ మాటలు పంచిన స్ఫూర్తి తో వంశీ, పార్వతి ఒక వైపుకు వెళ్లారు. మరోవైపు రూహి, అమిర్ ఒక షెడ్డు దగ్గర కు చేరుకున్నారు. దాని ముందు ఇద్దరు సైనికులు కాపలాగా ఉన్నారు. ఒకసారి చుట్టూ చూసారు. ఇంకెవరూ కనిపించలేదు. ఇంతకంటే మంచి అవకాశం లేదని... రూహి, అయాన్ ఒకేసారి వారి ఇద్దరి మీద దాడి చేసారు. వారు నోరు తెరిచేలోగా వారి మెడ నరం మీద బలంగా కొట్టారు. గుండెకు ఓ క్షణం రక్త ప్రసరణ ఆగడం తో అలాగే స్పృహ తప్పి పడిపోయారు. రూహి, అమిర్ ఆ ఇద్దరిని అలాగే ఆ షెడ్డు లోపలకు లాగేసి ఒక మూలన దాచారు. ఆ షెడ్డులో చాలా ఆయుధాలు ఉన్నాయి. వాటిని చూసి ఇద్దరూ కాసేపు షాక్ అయ్యారు. ఇన్ని ఆయుధాలు ఉన్నాయంటే చాలా ఎక్కువ మందే ఇక్కడ ఉన్నారని అర్థమైంది.

ఇద్దరూ వెంటనే స్పృహ తప్పిన చైనా సైనికుల దుస్తులు వేసుకున్నారు. వారిలో కలిసిపోయి వారి రహస్యాలు తెలుసుకోవాలని.... ఎవరికీ అనుమానం రాకుండా ధైర్యంగా నడిచారు. మిగతా చైనా సైనికులకు మోహం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.

సరిగ్గా అప్పుడే రూహి చూపు అక్కడే ఉన్న ఒక లైట్ టవర్ మీద పడింది. దాని పైకి ఎక్కితే ఇక్కడ ఏం జరుగుతుందో ఓ అంచనా వస్తుంది అని అనిపించింది. అనుకున్నదే తడువుగా తన అడుగులు అటు వైపుకు కదిలాయి. వారు కూడా చైనా సైనికుల దుస్తుల్లో ఉండటం తో ఎవరికీ ఎలాంటి అనుమానం రావడం లేదు.

కాసేపటికి రూహి, అమిర్ ఇద్దరూ ఆ టవర్ పైకి చేరుకొని తమ ఎదురుగా చూసి షాక్ అయ్యారు. వారి ఎదురుగా ఓ పెద్ద అణుబాంబు లాంటిది కనిపించింది. అది మరికొద్ది సమయంలో పేల్చడానికి సిద్ధం చేస్తున్నట్టు అనిపించింది. అంత పెద్ద బాంబు ను చూసి ఇద్దరికీ నోట మాట రాలేదు.

"ఏంటి మేడం ఇది... ఇంత పెద్ద బాంబా " అని అమిర్ భయంగా పలికాడు.

"ఈ బాంబ్ తో మన దేశం లోని ఒక నగరం మొత్తం నామరూపాలు లేకుండా చేయచ్చు. ఓ నగరం అంటే ఎన్ని ప్రాణాలో ఊహించడానికే కష్టంగా ఉంది " అని రూహి చెప్పింది. తన నుదుటి మీద నుంచి చమట జారింది. గుండె వేగం పెరిగింది.

ఇంతలో అమిర్..
"మేడం ఒక్కసారి మన చుట్టూ చూడండి " అని చెప్పాడు.

ఆ మాటకు రూహి ఒక్కసారి చుట్టూ చూసి కాసేపు భయం తో అలాగే బిగుసుకుపోయింది. తన గుండె స్పందించడం ఆగిపోయింది. కాళ్ళు నిలబడలేకపోయాయి. ఊపిరి తీయడం కూడా మరిచింది.

వారి చుట్టూ... మొత్తం అలాంటివి ఐదు బాంబులు ఉన్నాయి.

వాటితో ఐదు నగరాలని నాశనం చేయచ్చు. అదే జరిగితే చరిత్ర ఎన్నడూ చూడని విధ్వంసం ఇది. కలలో కూడా ఊహించని కల్లోలం మన దేశం మీద జరగనుంది. ఆ ఊహకే రూహి గుండె ఓ క్షణం పాటు ఆగింది.
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:25 AM



Users browsing this thread: 1 Guest(s)