Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏజెంట్ రూహి వాసుదేవ్
#63
ఏజెంట్ రూహి వాసుదేవ్...28



రూహి బృందం నార్త్ కొరియా నుంచి చైనా బోర్డర్ దాకా వచ్చారు. అక్కడ వారికి మొదటగా ఓ పెద్ద గోడ అడ్డుగా కనిపించింది. దాన్ని తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నించి దాటారు. ఆ తరువాత కరెంట్ కంచె కూడా దాటారు. చివరికి వారు చైనా సైనికుల క్యాంపు దగ్గరకు చేరుకున్నారు.

అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అంటే ఆ క్యాంపు దాటక తప్పదు. కాని ఆ క్యాంపు లో సుమారు 50 మంది దాకా చైనా సైనికులు ఉన్నారు. రూహి బృందంలో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. పైగా అంతమందిని ఎదురించే ఆయుధాలు కూడా వీరి వద్ద లేవు. ఇప్పుడు ఎలా వారిని దాటాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు.

సరిగ్గా అదే సమయంలో ఓ తుపాకీ వచ్చి రూహి తలకు ఎక్కు పెట్టింది. అందరూ ఉలిక్కి పడి వెనక్కి తిరిగారు. ఎదురుగా ముసుగు మనిషి...
అతను మరెవరో కాదు. రూహి బృందాన్ని ఇండియా లో విమానం ఎక్కినప్పటి నుంచి వెంబడిస్తున్న మనిషి..

వంశీ, పార్వతి ముందుకు రావాలని చూసారు. రూహి తన చేతి సైగ తో వద్దని వారించింది.

ఇంతలో ముసుగు వ్యక్తి
"రూహి... ఈరోజు తో నీ ఆట కట్టు..." అని పలికాడు.

"నా ఆట కట్టించే ప్రాణం ఈ భూమి మీదకు రావడానికి ధైర్యం చాలక బ్రహ్మ దగ్గరే ఆగిపోయి ఉంటుంది. " అని రూహి సమాధానం ఇచ్చింది.

"ఎదురుగా మృత్యువు నిలబడ్డా సరే నీ పొగరు ఏ మాత్రం తగ్గలేదు."

"పొగరనేది నేను వేసుకునే బట్టల్లో కాదు, నా రక్తం లో ఉంది. అది ఎప్పటికీ పోదు."

"నా వెనుక చాలా మంది ఉన్నారు."

"కౌరవులు వంద మంది. పాండవులు ఐదుగురే... కాని విజయం ఎవరిని వరించిందో మరోసారి గుర్తుచేయాలా..."

"ఆ పాండవుల వెనుక శ్రీ కృష్ణుడు ఉన్నాడు. అందుకే గెలిచారు. మీ వెనుక ఎవరున్నారు."

"ఆ త్రివర్ణ పతాకం... అది ఒక్కటి చాలు. ఎంతమంది ఎదురుగా నిలబడినా వెన్ను విరిచి ధైర్యంగా నిలబడడానికి... కాదంటావా... మిస్టర్ అమిర్."

ఆ మాటకు ముసుగు మనిషి ఆశ్చర్యపోయి తన మొహానికి ఉన్న మాస్క్ తొలిగించాడు. ఎదురుగా రూహి నవ్వుతూ నిలబడింది. అమిర్ పరుగున వచ్చి రూహి ని కౌగిలించుకున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక పార్వతి, వంశీ ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.

కాసేపటికి రూహి వారి వైపు తిరిగి...
"మా నాన్న విక్రమ్ వాసుదేవ్ బ్లాక్ కోబ్రా బృందం గురించి విన్నారు కదా.. అందులో అక్బర్, పల్లవి అని ఇద్దరు ఉండేవారు. వారు తీవ్రవాదుల చేతికి దొరికి ప్రాణాలు కోల్పోయారు. ఆ అక్బర్ కొడుకే ఈ అమిర్...
చిన్నప్పుడే ఆ మసూద్ ఖాన్ లాంటి కుక్కలకు ఖురాన్ గురించి సరైన అర్థం వివరించిన గొప్ప సైనికుడు.."

ఆ మాటకు అమిర్ నవ్వుతూ పార్వతి, వంశీ వైపు చూసి పలకరించాడు.

"మీరు ఇక్కడికి ఎలా వచ్చారు." అని వంశీ ఆశ్చర్యంగా అడిగాడు.

"మీకు తెలిసి మీ బృందం లో ఉన్నది నలుగురే.. కాని మీకు తెలియని ఆ ఐదో ఏజెంట్ నేనే...
మీరు నార్త్ కొరియా బయలుదేరినప్పుడే.. ఇది చాలా ప్రమాదకర ఆపరేషన్ అని అర్థమైంది. అది కాక మన ప్రభుత్వం లోని కొంతమంది అవినీతి పరుల మూలంగా మీ సమాచారం శత్రువులకు చేరవచ్చు అని అనిపించింది.
అందుకే నేను రూహి కలిసి ఓ కొత్త ప్లాన్ వేసాం. అదే ముసుగు మనిషి వేషం..
మీకు తెలియకుండా నేను మీ వెనుకే వస్తున్నాను. నా గురించి ఇటు మన ప్రభుత్వానికి కాని, మన శత్రువులకు కాని తెలీదు.
ఎప్పటికప్పుడు నేను రూహి మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీరు ఈ అడవి మార్గం ద్వారా చైనా వస్తున్నారు అని చెప్పినప్పుడు నేను కూడా మీతో పాటు రావాలని అనుకున్నాను. కాని రూహి వద్దు అని నన్ను ఆపేసింది.
నన్ను ఓ సాధారణ టూరిస్ట్ లాగా విమానం లో రమ్మని చెప్పింది. నేనెవరో మన శత్రువులకు తెలీదు కాబట్టి ఎవరికీ అనుమానం రాలేదు. చైనా లో ఉన్న మన ఏజెంట్స్ ద్వారా బోర్డర్ చేరుకొని మీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఇంతలో మీరే వచ్చారు." అని అమిర్ అప్పటిదాకా జరిగింది మొత్తం వివరించాడు.

తమకు తెలియకుండా ఇంత జరిగిందా అని వంశీ, పార్వతి ఆశ్చర్యపోయారు. అలాగే రూహి ముందు చూపు ను మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

ఇంతలో...
"అయాన్ ఎక్కడ" అని అమిర్ అడిగాడు.

అయాన్ పేరు వినగానే రూహి గుండెను ఎవరో మెలిపెట్టినట్టు అయ్యింది. తన రూపం కళ్ళ ముందు మెదిలి కన్నీటి వర్షం మొదలయింది. అడుగులు తడబడ్డాయి. నిలబడలేక పక్కనే ఉన్న రాయి మీద కూర్చుంది.

ఈలోగా వంశీ జరిగింది మొత్తం అమిర్ కి చెప్పాడు. తనకు కూడా చాలా బాధగా అనిపించింది. కాసేపు అందరూ అలాగే మౌనంగా ఉండిపోయారు.

ఇంతలో అమిర్ జేబులో నుంచి బీప్ అనే శబ్దం వచ్చింది. అందరూ తల తిప్పి అటు వైపు చూసారు. అమిర్ ఒక శ్యాటిలైట్ ఫోన్ బయటకు తీసాడు. అది రింగ్ అవుతుంది.
ఎత్తి హలో అన్నాడు. కాసేపు మాట్లాడిన తరువాత ఫోన్ రూహి కి అందించాడు.

అటు వైపు నుంచి ఓ గంభీరమైన గొంతు వినిపించింది.
"హలో ఏజెంట్ రూహి వాసుదేవ్..."

ఆ గొంతు వినగానే అది మన భారత దేశ ప్రధాన మంత్రిది అని అర్థమైంది.

"హలో సార్..." అని రూహి పలకరించింది.

"రేపే మన స్వాతంత్ర దినోత్సవం... స్వేచ్ఛగా రెప రెప లాడే మన జెండా మీద నెత్తుటి వర్షం కురవదనే నమ్ముతున్నాను.
ప్రాణాలకు తెగించి మీరు చేస్తున్న పోరాటం మన దేశ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. కొన్ని కోట్ల మంది ప్రాణాలు ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఈ ఆపరేషన్ లో తప్పక విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను." అని పలికాడు.

"తప్పకుండా సార్... మా ప్రాణాలు పణంగా పెట్టి అయినా సరే ఆ విధ్వంసం ఆపుతాను." అని రూహి ధైర్యంగా పలికింది.

"ప్రజలందరూ దేశానికి రుణపడి ఉంటామని అంటారు. కాని అప్పుడప్పుడు మీ తెగింపు, ధైర్యం చూసి ఈ దేశం మాత్రం మీ కుటుంబానికి రుణ పడి ఉందేమో అనిపిస్తుంది.
ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్ రూహి..."

"థాంక్ యు సార్..." అని రూహి చెప్పింది.

ఫోన్ పెట్టేసాక రూహి తన బృందం వైపు తిరిగింది.
"మన దగ్గర ఎక్కువ సమయం లేదు. త్వరగా మనం వచ్చిన పని పూర్తి చేయాలి." అని చెప్పింది. వంశీ, పార్వతి సరే అన్నట్టు తల ఊపారు.

తరువాత అమిర్ వంక తిరిగి...
"ఇప్పుడు ఆ చైనా సైనికులను దాటి అటు వైపు వెళ్లడం ఎలా " అని అడిగింది.

"దానికి మన దగ్గర ఒక దారి ఉంది. అదే రహస్య మార్గం..." అని సమాధానం ఇచ్చాడు.

"రహస్య మార్గమా..." అని అందరూ ఆశ్చర్యంగా అడిగారు.

అమిర్ నవ్వుతూ వారు నుంచున్న చోటు నుంచి ఉత్తర దిక్కుకు నడిచాడు. కొంచెం దూరం వెళ్లిన తరువాత అక్కడొక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచి జారిన ఊడల్లో నుంచి ఒక చిన్న తీగ లాంటిది ఉంటే దాన్ని లాగాడు. తరువాత తన జేబులో నుంచి ఒక రిమోట్ తీసి నొక్కాడు. అంతే...
ఆ మర్రి చెట్టు మొదట్లో కీర్ మంటూ శబ్దం చేస్తూ ఒక పెద్ద తొర్ర లాంటిది ఏర్పడింది. అందరూ అది చూసి నోరు వెళ్ళబెట్టారు.

"ఇది ఇక్కడ చైనాలో ఉన్నా మన ఏజెంట్లు ఏర్పాటు చేసింది. ఈరోజు మనకు ఉపయోగపడింది." అని అమిర్ సమాధానం ఇచ్చాడు.

ముందుగా తను లోపలకు వెళ్తే, ఆ తరువాత అందరూ అందులోకి అడుగు పెట్టారు. మొత్తం చీకటిగా ఉంది. ఏమి కనిపించడం లేదు. అందరూ ఆ చెట్టు లోపలకు వచ్చాక, అమిర్ మరోసారి తన చేతిలో ఉన్న రిమోట్ నొక్కాడు. ఈసారి ఆ చెట్టు తొర్ర మరోసారి మూసుకుంది. బయట నుంచి చూస్తే చెట్టు తప్ప ఇంకేమి కనిపించదు. ఎవరికైనా అనుమానం వచ్చే అవకాశం కూడా లేదు. అంత పక్కడ్బందీ గా దాన్ని నిర్మించారు.

ఆ చెట్టు తొర్ర మూసుకున్న తరువాత అమిర్ పక్కనే ఉన్న ఒక మీట ను నొక్కాడు. అప్పటిదాకా కటిక చీకటి అలుముకున్న ఆ చోటు మొత్తం విద్యుత్ దీపాలతో వెలిగింది. అందరూ మెల్లగా అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదిలారు.

అది ఓ సొరంగ మార్గం అని అర్థమైంది. మట్టి కిందకు పడకుండా సిమెంట్ తో నిర్మించారు. దారి కనపడటం కోసం లైట్లు అమర్చారు. దానికి కావాల్సిన విద్యుత్ కూడా సూర్య రశ్మి నుంచి వచ్చేలా ఏర్పరిచారు. ఆ సోలార్ ప్లేట్స్ ఎవరికీ కనిపించకుండా చెట్టు ఆకులు మాదిరి తయారు చేసి ఆ దారిలో అక్కడక్కడా ఉన్న పెద్ద చెట్ల కొమ్మల్లో ఏర్పాటు చేసారు. ఒకవేళ శత్రువులు ఎవరైనా అందులోకి దిగితే వారిని అంతమోందించడానికి దారిలో అక్కడక్కడా బాంబు లు కూడా పెట్టారు.

ఈ సొరంగ మార్గం నిర్మించిన వారికి రూహి బృందం మనసులోనే కృతజ్ఞతలు చెప్పింది. అలాగే నడుస్తూ వెళ్తున్నారు. ఒక మూడు కిలోమీటర్లు నడిచిన తరువాత ఆ సొరంగ మార్గం ఒక చోట ఆగిపోయింది.

అక్కడ ఒక చిన్న నిచ్చెన లాంటిది ఉంది. అందరూ దాన్ని పట్టుకొని పైకి ఎక్కారు. అక్కడ ఒక చిన్న తలుపు లాంటిది ఉంది. అమిర్ రిమోట్ నొక్కిన తరువాత అది తెరుచుకుంది. ఆ తలుపు ద్వారా ఆ సొరంగ మార్గం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చాక చుట్టూ చూస్తే అది ఒక పాడుబడిన భవనం అని అర్థమైంది.

బోర్డర్ దగ్గర ఉన్న చైనా సైనికుల స్థావరం నుంచి చాలా దూరం వచ్చేసామని రూహి కి అర్థమైంది. అమిర్ ఆ భవనం పక్కనే చెట్టు పొదల్లో దాచిన తన కారు బయటకు తీసాడు. అందరిని అందులో ఎక్కమని చెప్పాడు. తరువాత కారును వేగంగా పోనిచ్చాడు.

రూహి కిటికీ లో నుంచి బయటకు చూస్తుంది. తన ఆలోచనలు చాలా వేగంగా వెళ్తున్నాయి. అసలు చైనా పెట్టుకున్న ఈ ఆపరేషన్ FISH అంటే ఏంటో అర్థం కాలేదు. రేపు ఏం జరగబోతుందో అని కొంచెం భయంగా కూడా ఉంది. ఎందుకో ఒకసారి అమ్మతో మాట్లాడాలి అనిపించింది. అమిర్ దగ్గర ఉన్న శాటిలైట్ ఫోన్ నుంచి సుజిత కు ఫోన్ చేసింది. కాని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. తను ఏమైనా ప్రమాదం లో ఉందా అనే ఆలోచన వచ్చింది. కాసేపటికి అనవసరంగా ఎక్కువ ఊహిస్తున్నాను. అమ్మకు ఏమి కాదు. ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది లే అని తనకు తను సర్దిచెప్పుకుంది.

ఇంతలో కారు ఒక చోట ఆగింది. అందరూ అమిర్ వంక చూసారు.

"ఇదే చైనా చేస్తున్న విధ్వంస రచన స్థావరం. ఇక్కడి నుంచి ఒక అర కిలోమీటర్ నడిస్తే అక్కడికి చేరుకుంటాం." అని చెప్పాడు.

అది వినగానే రూహి బృందం అలర్ట్ అయ్యారు. కారు దిగి తమ ఆయుధాలు చేత పట్టుకొని అటు వైపు నడవడం ప్రారంబించారు.

వీరి పోరాటం తుది అంకం కు చేరుకుంది. మరి విజయం ఎవరి వైపు నిలిచేనో కాలమే సమాధానం చెప్పాలి.
[+] 6 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 23-05-2026, 05:23 AM



Users browsing this thread: 1 Guest(s)