23-05-2026, 05:22 AM
ఏజెంట్ రూహి వాసుదేవ్...27
ఎన్నో కఠినమైన ప్రమాదాలు దాటుకొని రూహి బృందం చైనా బోర్డర్ దగ్గరకు చేరుకున్నారు. ఆ కొండ మీద నుంచి చూస్తే దూరంగా చైనా జెండా ఎగురుతూ ఉండటం కనిపించింది. అది చూడగానే అప్పటిదాకా వారు పడిన శ్రమ మొత్తం మర్చిపోయారు. వారి కళ్ళలో ఆనందం కలిగింది.
ఎలాగోలా అటు వైపుకు చేరుకొని ఆ ఆపరేషన్ FISH అంటే ఏంటో తెలుసుకొని, ఆ విధ్వంసం ఎలాగైనా ఆపాలని రూహి మరోసారి దృడంగా అనుకుంది. అందుకే వేగంగా ఆ కొండ దిగడం మొదలుపెట్టింది. తన వెనుకే పార్వతి, వంశీ కూడా నడిచారు.
రూహి గుండెల్లో ఆత్మవిశ్వాసం అంతకంతకు పెరుగుతుంది. ఇక్కడిదాకా వచ్చాం, ఎలాగైనా గెలిచి తీరుతాం అనే నమ్మకం తనలో పెరిగింది. నిజంగా తన ధైర్యం, తెగింపు లేకపోతే ఈ బృందం ఇక్కడిదాకా రావడం అనుమానమే... ఇదంతా తన తండ్రి విక్రమ్ వాసుదేవ్ పంచిన రక్తం వల్లే అని మనసులోనే అనుకుంది.
అలా ఆలోచిస్తూనే కొండ దిగారు. బోర్డర్ వైపు అడుగులు వేసే కొద్ది వారి కళ్ళు ఆశ్చర్యం తో పెద్దవి అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే వారికి ఎదురుగా ఓ పెద్ద రాతి గోడ అడ్డుగా వచ్చింది. సుమారు 15 అడుగుల ఎత్తు ఉంది. ఎవరైనా ఈ ప్రమాదకరమైన అడవి నుంచి బయటపడినా, వారు తమ దేశంలోకి అక్రమంగా రాకుండా ఉండటం కోసం చైనా ఈ నిర్మాణం చేసింది అని అర్థమైంది. ఇప్పుడు దాన్ని ఎలా దాటాలో అర్థం కాలేదు.
ఎందుకంటే చుట్టూ గోడ కనిపిస్తుంది కాని ఎక్కడా తలుపు లాంటిది కనిపించలేదు. రూహి ఆ గోడ మీదకు ఎక్కాలని అనుకుంది. ప్రతి రాయికి మధ్య చిన్నని సందు ఉంది. ఆ సందులో వేలు పెట్టి ఎక్కడానికి ప్రయత్నించింది. సరిగ్గా సగం దూరం వెళ్ళగానే, అక్కడ గోడ మొత్తం ఏదో నూనె లాంటి ద్రవం తో నిండి ఉంది. దాంతో పట్టు దొరకక దబ్బున కింద పడిపోయింది. వంశీ, పార్వతి కూడా ఆ గోడ ఎక్కడానికి ప్రయత్నించారు. కాని వారు కూడా కొంచెం దూరం వెళ్ళగానే జారుతూ కింద పడ్డారు.
ఎవరూ పైకి ఎక్కకుండా ఉండటం కోసం చైనియులే ఇలా గోడ పై భాగం లో నూనె లాంటి ద్రవం పోశారు అని వారికి అర్థమైంది. ఇప్పుడు ఆ గోడ ను ఎలా దాటాలో అర్థం కాలేదు.
"మేడం మన బ్యాగ్ లో ఇంకా కొన్ని బాంబ్ లు ఉన్నాయి కదా. వాటి సాయం తో ఈ గోడను పెల్చేద్దామా..." అని పార్వతి తన ఆలోచన చెప్పింది.
"అలా పేలిస్తే సరిహద్దు దగ్గర కాపలా కాసే చైనా సైనికులకు ఆ చప్పుడు వినిపిస్తుంది. మనం వస్తున్నామని తెలిసిపోతుంది. చాలా సులభంగా మనం వారికి దొరికిపోతాం." అని వంశీ చెప్పాడు. తన మాటను ఏకిభవిస్తూ రూహి కూడా అవును అన్నట్టు తల ఊపింది.
అప్పుడే రూహి కి ఒక విషయం గుర్తొచ్చింది. RAW శిక్షణ లో భాగంగా ఒకరి భుజాల మీద మరొకరు నిలబడి తాడు పట్టుకొని పైకి పాకడం నేర్పించారు. ఇప్పుడు కూడా అలాగే చేయాలని అనుకుంది. ఆ మాట వినగానే వంశీ...
మీరు నా భుజాల మీదకు ఎక్కండి మేడం... నేను కింద నిలబడతాను అన్నాడు. రూహి సరే అంది.
వంశీ గోడకు ఆనుకొని కొంచెం ఒంగి నిలబడ్డాడు. రూహి వంశీ భుజాల మీదకు ఎక్కింది. తరువాత వంశీ నిదానంగా పైకి లేచాడు. పార్వతి వాళ్ళు ఇద్దరూ కింద పడకుండా పట్టుకుంది. వంశీ భుజాల మీద నుంచి రూహి ఆ గోడ అంచును అందుకోవాలని చూసింది. కాని అది కొన్ని అడుగుల దూరం లో ఉంది. ఒకరి మీదకు ఒకరు ఎక్కినా సరే వారి ఎత్తు ఆ గోడ అంచును అందుకోడానికి సరిపోవడం లేదు.
మళ్ళి పరిస్థితి మొదటికి వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా... వారికి దూరంగా ఒక పెద్ద బండ రాయి కనిపించింది. దాన్ని నిలబెట్టి, దాని మీదకు ఎక్కి ప్రయత్నిస్తే తప్పకుండా అందుతుంది అని రూహి కి అనిపించింది.
అందరూ కలిసి ఆ రాయిని తీసుకొద్దామని వెళ్లారు. అది చాలా బరువుగా ఉంది. దాన్ని లేపడానికి వీరి బలం సరిపోవడం లేదు. అక్కడ కొన్ని జూగాల్స్ జాతి మొక్కల తీగలు కనిపించాయి. అవి చాలా బలంగా ఉంటాయి. అలాంటి చాలా తీగలతో ఆ రాయి చుట్టూ కట్టి ముగ్గురు కలిసి దాన్ని లాగడం మొదలుపెట్టారు.
వారి చేతులు చాలా నొప్పిని కలిగించాయి. అయినా సరే వదలలేదు. కొన్ని క్షణాలకు వారి ప్రయత్నానికి ఆ రాయి కరిగిందేమో, ముందుకు కదిలింది. అది చూసి రెట్టింపు ఉత్సాహం తో ముందుకు లాగారు. దాన్ని లాగుతుంటే ఆ తీగలు వారి చేతులను కోస్తున్నాయి. రక్తాలు కారుతున్నాయి. ప్రాణం పోయినంత నొప్పిని కలిగిస్తుంది. అయినా సరే పంటి బిగువున ఓర్చుకుంటూ ముందుకు లాగారు. కాసేపటికి ఎలాగోలా ఆ రాయిని రాతి గోడ ముందుకు తీసుకొని వచ్చారు.
అప్పటికే అందరికీ బాగా ఆయాసం కావడం తో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. చేతుల వంక చూస్తే ఎర్రగా రక్తపు మరకలు ఉన్నాయి.
విక్రమ్ ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు.
అందరి ఆస్తి తమ దగ్గర ఉన్న డబ్బులతో లెక్కిస్తే, ఓ సైనికుడి ఆస్తి మాత్రం దేశం కోసం తాను చిందించిన రక్తం బిందువులలో లెక్కిస్తారు అని... ఆ మాట గుర్తుకురాగానే ఆ కాస్త నొప్పి కూడా మాయమైంది.
కాసేపటికి అందరూ కాస్త కుదుట పడ్డారు. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు అనిపించింది. ముందుగా వంశీ ఆ రాయి మీదకు ఎక్కి నిలబడ్డాడు. రూహి మరోసారి వంశీ భుజాల మీదకు ఎక్కింది. తన కాళ్ళను అలాగే పైకి లేపి ప్రయత్నించాక గోడ అంచు కొంచెం అందింది. ఆ మాత్రం చాలు, రూహి టక్కున దాన్ని పట్టుకొని పైకి పాకింది. కొన్ని క్షణాలు తరువాత గోడ పైకి చేరుకుంది.
అది చూసి మిగతా బృందం సంతోషించారు. తరువాత పార్వతి కూడా వంశీ భుజాల మీద నుంచి గోడ పైకి చేరుకుంది. ఈసారి రూహి ఆ గోడ పైన ఉన్న ఒక ఇనుప రాడ్ లాంటి దాని కింద కాళ్ళకు సపోర్ట్ తీసుకొని కిందకి జారింది.
వంశీ ఎగిరి తన చేతులను పట్టుకున్నాడు. రూహి తన బలమంతా ఉపయోగించి వంశీ ని పైకి లాగింది. కొన్ని క్షణాలకు బృందం మొత్తం గోడ పైకి చేరుకున్నారు. తరువాత అటు వైపుకు దూకారు.
ఎక్కడా చైనా సైనికులు కనిపించలేదు. వారికి కాస్త అనుమానంగా, ఆశ్చర్యంగా తోచింది. ఇక నుంచి వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలని అనుకున్నారు. ఆయుధాలు తీసి చేతిలో పట్టుకున్నారు. తలో వైపు చూస్తూ అడుగులో అడుగు వేస్తూ త్రికోణం లాగా మారి నడుస్తున్నారు. ఏ వైపు నుంచి, ఎలాంటి ప్రమాదం వచ్చినా సిద్ధంగా ఉన్నారు.
అలా కొంచెం దూరం నడవగానే ఈసారి వారికి ఓ ఇనుప కంచె అడ్డుగా వచ్చింది. రూహి జాగ్రత్తగా ఆ కంచెను గమనించింది. అక్కడక్కడా కొన్ని జంతువుల కలేబరాలు ఉన్నాయి. వాటిని చూడగానే ఆ కంచె కు కరెంట్ పెట్టారు అని అర్థమైంది. బ్యాగ్ లో నుంచి కట్టర్ బయటకు తీశారు.
ఆ కట్టర్ హ్యాండిల్ మొత్తం చెక్కతో చేసినది. కాబట్టి దాని ద్వారా వారికి షాక్ కొట్టే అవకాశం లేదు. రూహి భుజాలు రక్తం కారేలా దాన్ని బ్యాగ్ లో తీసుకొని రావడం మంచిది అయ్యింది. ఈరోజు వారికి అది బాగా ఉపయోగపడింది. పార్వతి చాలా జాగ్రత్తగా ఆ కంచె కు వారు పట్టేంత పెద్ద రంద్రం చేసింది.
మెల్లగా అందులో నుంచి అటు వైపుకు చేరుకున్నారు. కొన్ని అడుగులు వేయగానే వారికి మాటలు వినిపించాయి. అవి చైనా భాషలో ఉన్నాయని కాస్త వినగానే అర్థమైంది. రూహి ఒక్కసారి అటు ఇటు చూసింది. తనకు ఎదురుగా కొంచెం దూరం లో ఓ పెద్ద చెట్టు ఉంది. అందరు అటు వైపుకు కదిలారు. ఆ చెట్టు వెనకాల నిలబడి ముందుకు చూసి ఆశ్చర్యపోయారు.
అక్కడ చైనా సైనికుల క్యాంప్ ఉంది. సుమారు 50 మంది దాకా ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఆదునాతన ఆయుధాలు కూడా ఉన్నాయి. నిజంగా అంత మంది ఉంటారని తను ఊహించలేదు. చైనా లోకి అడుగు పెట్టాలి అంటే ఆ క్యాంపు దాటడం తప్ప మరో మార్గం లేదు.
వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇద్దరూ రూహి వంక చూసారు. రూహి ఆలోచనలో పడింది. తాము ఉన్నది ముగ్గురు, ఎదురుగా 50 మంది. అంతమందిని ఎదురించే అన్ని ఆయుధాలు కూడా లేవు. తెగించి పోరాటానికి దిగి ప్రాణాలు కోల్పోతే, ఇప్పటిదాకా చేసిన ప్రయాణం, సాహసం అంతా వృధా అవుతుంది.
రూహి బృందం మొత్తం ఆ చైనా సైనికుల స్థావరాన్ని చూస్తూ తమ వెనుక ఏం జరుగుతుందో అస్సలు గమనించలేదు.
రూహి అలా ఆలోచనలో ఉండగానే... ఓ తుపాకీ వచ్చి తన తలకు గురి పెట్టింది.
"ఇక మీ ఆట కట్టు..." అనే గొంతు వినిపించింది.
అది వినగానే అందరూ షాక్ అయ్యి వెనక్కి తిరిగారు. ఎదురుగా ఓ ముసుగు వ్యక్తిని చూసి అందరూ అలాగే షాక్ లో ఉండిపోయారు.
రూహి తలకు ఆ తుపాకీ ఎక్కు పెట్టింది మరెవరో కాదు...
వారిని ఇండియా నుంచి వెంబడిస్తూ కొరియా దాకా వచ్చిన అదే వ్యక్తి...
------------------------------------------------------------
హైదరాబాద్...
సుజిత తన ఫోన్ లో రూహి ఫోటోలు చూస్తుంది. రూహి రూపం కళ్ళ ముందు మెదలుగానే తన కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇప్పటికే తను వెళ్లి వారం దాటింది. వెళ్లినప్పటి నుంచి ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎలా ఉందో ఏంటో అని మనసులో చాలా భయంగా ఉంది.
తను ఇన్ని రోజులు దూరంగా ఉంది అంటే అదేదో చాలా ముఖ్యమైన ఆపరేషన్ అని తనకు బాగా తెలుసు. కాని ఈసారి ఎందుకో తన మనసు కీడు శంకించింది.
దేశం కోసం ఓ బిడ్డను, తన భర్తను పోగొట్టుకుంది. మరో బిడ్డ దూరమైతే తట్టుకునే శక్తి ఈ గుండెకు లేదు. ఎలాగైనా సరే తను విజయం సాధించి తిరిగి రావాలని మనసులోనే ఆ దేవుడిని కోరుకుంది.
అలా ఆలోచిస్తూ ఉండగానే ఆటో ఆగింది. ఇంటికి వచ్చానేమో అని కిందకు దిగి చుట్టూ చూసి కాసేపు షాక్ అయ్యింది. అది తన ఇళ్ళు కాదు... మరేదో చోటు...
అది జలంధర్ స్థావరం అని తనకు తెలీదు.
కోపంగా ఎక్కడికి తీసుకొచ్చావని డ్రైవర్ ని అడగాలని చూస్తే వాడు క్రూరంగా నవ్వుతున్నాడు.
ఈలోగా మరో పాతిక మంది రౌడీలు ఆయుధాలతో తనని చుట్టు ముట్టారు. తను తప్పించుకోడానికి అవకాశమే లేదని అర్థమైంది. ఇంత సులభంగా తమ చేతికి దొరుకుతుంది అని అస్సలు ఊహించకపోవడం తో ఆ రౌడీలు అందరూ నవ్వుతున్నారు. అది చూసి సుజిత భయపడుతూ నుంచుంది.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)