23-05-2026, 05:17 AM
ఏజెంట్ రూహి వాసుదేవ్...24
రూహి బృందం నార్త్ కొరియా నుంచి చైనా వెళ్లడం కోసం ఎన్నో సాహసాలు చేసి చివరకు అడవి ని దాటి ఎడారిలో అడుగుపెట్టారు. అందులోకి అడుగు పెట్టగానే వేడి గాలి వారికి స్వాగతం పలికింది. నిప్పుల కొలిమి లో నడిచినట్టు అనిపించింది. ఎటు చూసినా ఎర్రని ఇసుక తప్ప ఇంకేమి కనిపించడం లేదు. ఈ ముగ్గురు తప్ప మరో జీవి ఈ ప్రపంచం లో ఉందా అని అనుమానం కలగక మానదు.
ఆ ఎండలో, ఇసుక లో ఒక్కో అడుగు తీసి ముందుకు వేయడం కూడా చాలా భారంగా అనిపించింది. కాని ఎలాగైనా గమ్యం చేరుకోవాలి అనే వారి ఆశయం నిలువనీయకుండా ముందుకు నడిపించింది.
అలా కొంచెం దూరం నడిచిన తరువాత రూహి దేనికోసమో తన జేబులు వెతుకుతూ కంగారు పడింది.
అది చూసి...
"ఏమైంది మేడమ్" అని వంశీ అడిగాడు.
"మనం వెంట తెచ్చిన దిక్షుచి కనిపించడం లేదు. "అని రూహి అంది.
"ఇప్పుడు అది లేకపోతే మనం ఈ ఎడారిలో ఎటు వైపని వెళ్తాం. బాగా చూడండి మేడమ్ మీ దగ్గరే ఎక్కడైనా ఉంటుంది."
"లేదు. మొత్తం వెతికాను. ఇందాక జలపాతం దగ్గర బ్యాగ్ లో నీళ్లు పట్టుకునే సమయంలో అక్కడే పడిపోయి ఉండాలి."
"అయితే నేను వెనక్కి వెళ్లి తీసుకొని రానా మేడమ్..." అని వంశీ అడిగాడు.
"వద్దు వంశీ. ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం. నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్లి, తిరిగి వచ్చే లోగా చాలా సమయం అవుతుంది. అసలే చీకటి పడే లోగా ఈ ఎడారి దాటాలి." అని రూహి అంది.
"ఎటు వైపు వెళ్లాలో తెలియనప్పుడు మనం ప్రయాణం ఎలా చేస్తాం మేడమ్..." అని పార్వతి సందేహంగా అడిగింది.
"ఈ కష్ట సమయం లో మనకు ఒక్కరు సహాయం చేయగలరు..."
"ఎవరు మేడమ్.."
రూహి ఆకాశం వంక చూపించింది. మిగతా ఇద్దరూ అర్థం కాక అయోమయంగా చూసారు. రూహి వెంటనే తన బ్యాగ్ లో నుంచి ఒక గన్ తీసి తన ముందు ఇసుక లో గుచ్చింది.
ఎండకు ఆ తుపాకీ నీడ ఒక వైపు పడింది. దాని చుట్టూ ఒక వృత్తం గీసింది. అప్పుడు రూహి ఏం చెప్తుందో వంశీ, పార్వతి లకు అర్థమైంది. సూర్యుడి ఎండకు పడే నీడను బట్టి దిక్కులు కనిపెట్టి ముందుకు నడవడం అని తెలిసింది.
"ఫోన్లు, దిక్షుచి లు లాంటివేవి లేని సమయం లో మన పూర్వీకులు దిక్కులు తెలుసుకోవడం పాటించిన ప్రక్రియ ఇది.. నేడు మనకు సాయం చేయనుంది." అని రూహి అంది. అర్థమైంది అన్నట్టు ఇద్దరూ తల ఆడించారు.
తరువాత అలా నీడ పడే తీరు బట్టి వెళ్లాల్సిన దారి వైపు వారి అడుగులు సాగాయి. సమయం గడిచే కొద్ది ఎండ, వేడి మరింత గా పెరిగాయి. ఉక్క పోత తో మొత్తం తడిచిపోయారు.
వారి భుజాల మీద ఉన్న బ్యాగ్ లు మరింత భారంగా మారాయి. ముఖ్యంగా రూహి వేసుకున్న బ్యాగ్... ఆయుధాలు అన్ని అందులోనే ఉండటం తో చాలా బరువుగా ఉంది. ఆ బరువు తగిలించుకొని నడవడం సాధారణ విషయం కాదు. అయినా సరే పంటి బిగువున నొప్పిని భరిస్తూ నడుస్తుంది.
చూస్తూ ఉండగానే సూర్యుడు నడి నెత్తి మీదకు కూడా వచ్చాడు. వారి ఒంట్లో ఉన్న శక్తి కొద్ది కొద్దిగా తగ్గుతుంది. వెంట తెచ్చుకున్న నీటిని తాగుతున్నారు. కాని ఆ వేడికి కొన్ని క్షణాల లోనే ఆ నీరు చమట గా మారి ఆవిరి అయిపోతుంది. అసలు ఆ బ్యాగ్ లలో నీళ్లు తీసుకురావాలి అనే ఆలోచన రాకపోతే దాహం తో ఇంత దూరం వచ్చేవారు కూడా కాదు.
ఇప్పటికైతే చాలా ఆకలిగా కూడా ఉంది. అందరూ కడుపు పట్టుకొని నడుస్తున్నారు. ఎక్కడా ఒక చిన్న చెట్టు కూడా లేదు కాసేపైనా నీడలో తల దాచుకోడానికి.
ఇంతలో వంశీ ఉన్నట్టుండి... ఒక చోట ఆగాడు. తన ముందు రెండు గుడ్లు కనిపించాయి. ఏదో పక్షి పెట్టిన గుడ్లు లాగా అనిపించింది. అప్పటికే బాగా ఆకలి మీద ఉన్నాడు. వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. అమృతం దొరికినట్టు అయ్యింది. వెంటనే అందులో నుంచి ఒక గుడ్డు చేతిలోకి తీసుకొని పగలకొట్ట బోయాడు.
ఇంతలో
"వంశీ... ఆగు." అని రూహి అరిచింది.
ఏమైంది మేడమ్ అన్నట్టు తన వంక చూసాడు. రూహి ఆ గుడ్డు ను తన చేతిలోకి తీసుకుంది. ఆ గుడ్డు బయట భాగం చాలా మెత్తగా అనిపించింది.
అది గమనించగానే...
"ఇది పక్షి గుడ్డు కాదు. ఇక్కడ తిరిగే పాము గుడ్డు. సాధారణంగా పాము గుడ్డు బయట భాగం మనం చూసే కోడి గుడ్డు కంటే చాలా పలచగా ఉంటుంది. ఇది విషపూరీతం. తినడం మంచిది కాదు." అని అంది.
వంశీ రూహి వైపు ఒక చూపు చూసాడు. ఆ చూపు లో చేతికి దొరికిన దాన్ని తిననీయకుండా ఏదేదో చెప్తారు ఏంటి అని ప్రశ్నించినట్టు అనిపించింది.
"ఈ ప్రపంచం కళ్ళ తో చూసే దాకా ఎవరూ నిజాలు నమ్మరు కదా.. కావాలంటే నువ్వే చూడు..." అంటూ రూహి తన చేతిలో ఉన్న గుడ్డు ను కొంచెం దూరం లో ఉన్న రాయి మీద బలంగా కొట్టింది.
ఆ గుడ్డు పగలగానే అందులో నుంచి రెండు పిల్ల పాములు బయటకు వచ్చి వేగంగా ఇసుక లోకి దూరిపోయాయి. వాటిని చూడగానే వంశీ భయపడి తన చేతిలో ఉన్న గుడ్డు ను కింద పడేసాడు. తరువాత సారీ మేడమ్ అని అన్నాడు.
"ఇందులో నీ తప్పు లేదు లే వంశీ. నేటి సమాజం మనకు నమ్మకం కంటే అనుమానమే ఎక్కువ నేర్పించింది."
ఆ మాటకు వంశీ మౌనంగా ఉండిపోయాడు. కాసేపు అక్కడే కూర్చోవాలి అనుకున్నారు. రూహి తను వేసుకున్న బ్యాగ్ కిందకు దింపింది. అప్పుడే తన భుజాల వంక చూసుకుంది. బ్యాగ్ బరువుగా ఉండటం తో భుజాలు కందిపోయి అక్కడక్కడా ఎర్రగా రక్తం వస్తుంది. దాన్ని ముట్టుకుంటే ప్రాణం విల విల లాడింది. ఆ నొప్పిని భరిస్తూ రక్తం ఇంకా ఎక్కువ రాకుండా ఉండటం కోసం పక్కనే ఉన్న వేడి ఇసుక ను తీసి ఆ గాయల మీద బలంగా నొక్కి పట్టుకుంది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. ప్రాణం పోతున్నట్టు ఉంది. కాని స్వేచ్ఛగా ఎగిరే మన జాతియ జెండా ను తలుచుకుంటూ ఆ నొప్పిని పిడికిలి చాటున ఓర్చుకుంది.
"మేడమ్, ఆ బ్యాగ్ ని కాసేపు నేను మోస్తాను." అంటూ వంశీ ముందుకు వచ్చాడు.
కాని రూహి వద్దంది. ఎందుకంటే వంశీ కొంచెం లావుగా ఉంటాడు. తనకు ఆకలి కూడా ఎక్కువ. ఈ బరువు కూడా మొస్తే తను కాసేపటికే అలిసిపోయి పడిపోతాడు. అందుకే ఎంత నొప్పి కలిగినా భరిస్తూ తానే నడవాలని దృడంగా అనుకుంది.
కాసేపటి తరువాత అందరూ తిరిగి నడవడం ప్రారంభించారు. ఎండకు వాళ్ళు వేసుకున్న బూట్లు కూడా కాలిపోతున్నాయి. శరీరం మీద ఎవరో ఆకాశం నుంచి సూదులతో దాడి చేస్తున్నట్టు ఉంది. ఓ వైపు ఆకలి, మరో వైపు వేడి... మృత్యువు అంటే ఏంటో కళ్ళ ముందు మెదిలింది.
నడవడానికి ఓపిక కూడా ఉండటం లేదు. సరిగ్గా అప్పుడే ఆ ఎండకు కళ్ళు తిరగడం తో పార్వతి అలాగే వెనక్కి వాలి కిందకు పడిపోయింది. రూహి, వంశీ వేగంగా వచ్చి తన మోహం మీద నీళ్లు చల్లి లేపారు. కాసేపటికి తనకు మెలుకువ వచ్చింది. కాని అప్పటికే ఓ ఘోరం జరిగిపోయింది. పార్వతి భుజాన తగిలించుకున్న బ్యాగ్ లో ఉన్న నీరు మొత్తం తను వెనక్కి కిందకు పడటం తో ఆ ఎడారి ఇసుకలో కలిసిపోయాయి. అది వారికి దెబ్బ మీద దెబ్బ లాగా అనిపించింది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. పార్వతి కళ్ళ నీళ్లు పెట్టుకుంది. రూహి ఏం కాదు ఇందులో నీ తప్పు ఏమి లేదు అని ఓదార్చించింది.
తనకైతే ఏమి కాదు అని ధైర్యం చెప్పింది. కాని రూహి గుండెల్లో మాత్రం చాలా భయం మొదటిసారిగా కలిగింది. ఎందుకంటే వంశీ బ్యాగ్ లో కూడా కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. అవి ఆ ముగ్గురికి కాసేపు కూడా చాలవు.
వంశీ ఇప్పటికే చాలా అలిసిపోయాడు. ఆకలికి నక నక లాడుతున్నాడు. పార్వతి కూడా ఇప్పటికే ఒకసారి స్పృహ తప్పింది. ఇంకా ఎంత దూరం నడవగలదో తెలియడం లేదు. ఈ పరిస్థితిలో గమ్యం చేరగలమా అని భయమేసింది. ఈ ఎడారి మార్గం ఎంచుకొని తప్పు చేసానా అని అనుమానం కలిగింది. కాని తన భయం బయటకు కనిపిస్తే బృందం మరింత డీలా పడుతుంది అని మనసులోనే దాచుకుంది.
ఓ నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం అదే... మదిలో టన్నుల కొద్ది భయం ఉన్నా, అందులో కొంచెం కూడా తన సైన్యానికి పంచకూడదు. పంచిన క్షణమే ఓటమికి మొదటి అడుగు పడినట్టు...
కాసేపటికి అందరూ తిరిగి నడవడం మొదలుపెట్టారు. రూహి ఊగించినట్టుగానే పావు గంట గడిచే లోగా తమ దగ్గర మిగిలిన నీళ్లు కూడా అయిపోయాయి. ఎండ మాత్రం తగ్గడం లేదు. ఒంట్లోని రక్తం కూడా ఆవిరి అవుతుందా అని అనుమానం కలిగింది. దారిలో అక్కడక్కడా కొన్ని జంతువుల కలేబరాలు కనిపించాయి. అలాగే కొంతమంది మనుషుల పుర్రెలు కూడా ఉన్నాయి. వాటిని చూస్తే తమ పరిస్థితి కూడా అంతేనా అని అనుమానం వచ్చింది. దాహం తో నోరు పిడచ కట్టుకుపోయింది. ఆకలి తో కడుపు ఎముకలని అతుక్కుంది. మరణం వారి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది.
ఇంతలో వారు నుంచున్న ఇసుక మేడ కు దూరంగా ఓ చిన్న చెరువు కనిపించింది. దాన్ని చూడగానే ముగ్గురి మొహాలలో ఓ చిరునవ్వు విరిసింది. ఆనందం తో ఎగిరి గంతులు వేశారు. ముందు వెనుక ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ అటు వైపు వెళ్లారు. తమ దాహం తీరనుంది అని అర్థమై ఒంట్లో ఉన్న శక్తి మొత్తం బయటకు తీసి పరిగెత్తారు.
ఆ చెరువు దగ్గరకు వెళ్లే కొద్ది వారి మోహం లో ఆనందం ఆవిరవడం మొదలైంది. ఆ ఇసుక మేడ నుంచి పూర్తిగా కిందకు వచ్చాక అర్థమైంది. అది చెరువు కాదు ఎండ మావి అని... అక్కడ నీళ్లు లేవని తెలిసిన తరువాత ఇక బ్రతుకుతామనే ఆశ బృందం లో చచ్చిపోయింది.
వంశీ అయితే శక్తి కొద్ది పరిగెత్తడం తో ఆయాసం తో అలాగే స్పృహ తప్పి పడిపోయాడు. లేపినా లేవడం లేవలేదు. తన మోహం మీద చల్లడానికి నీళ్లు కూడా లేవు. పార్వతి, రూహి లకు ఏం చేయాలో అర్థం కాలేదు. రూహి మ్యాప్ వంక చూసింది. సగం దూరం దాటేశామని అర్థమైంది. ఇంకా సగమే.. ఎలాగైనా గమ్యం చేరుకోవాలని అనుకున్నారు.
కాని వంశీ లేచి నడిచేలా లేడు. ఇక చేసేదేం లేక ఖాళీ అయినా బ్యాగ్ ల ని కింద వేసి దాని మీద వంశీ ని పడుకోబెట్టి... లాగుతూ పార్వతి, రూహి నడవడం మొదలుపెట్టారు. ఆ ఎండలో నడవడమే కష్టం.. అలాంటిది వంశీ ని లాగుతూ నడవడం ఇంకెంత కష్టమో మాటల్లో చెప్పలేము. అలా మరో అరగంట నడిచిన తరువాత పార్వతి శరీరం లో కూడా ఓపిక మొత్తం ఆవిరై స్పృహ తప్పి పడిపోయింది.
రూహి తనని లేపడానికి ప్రయత్నించింది. కాని లేవలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. చుట్టూ చూసింది. ఎక్కడా ఏమి కనిపించడం లేదు. ఆకాశం వంక చూసింది. నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు కనిపించాడు.
రూహి లో భయం మొదలైంది. కాని అది తనకేమైనా అవుతుంది అనేదానికంటే తనని నమ్మి వెంట వచ్చిన బృందానికి ఏమైనా అవుతుందా, దేశాన్ని కాపాడుతాను అనే మాటను నిలబెట్టుకోలేనేమో అనే భయం మరింత ఎక్కువగా ఉంది.
ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకొని ఎలాగైనా ఈ పోరాటం లో మృత్యువు మీద గెలవాలని అనుకుంది. అందుకే పార్వతి, వంశీ ఇద్దరి శరీరాలు లాగుతూ ముందుకు కదిలింది. పైన కాల్చేసే ఎండ.. భుజాల మీద మోయలేని బరువు... చేతులలో లాగాల్సిన బాధ్యత...
వెరసి విధి ని ఓడించడానికి ఓ పెద్ద సాహసమే చేస్తుంది. పైన వారికోసం అప్పటికే రాబందులు తిరగడం మొదలుపెట్టాయి.
బ్రతుకుతాము అనే నమ్మకం లేదు. కాని చివరి శ్వాస దాకా పోరాడాలని బలంగా నిర్ణయించుకుంది. ఓ వైపు తన శరీరం నుంచి రక్తం కారుతుంది. చేతులు రెండు శరీరం నుంచి ఊడిపోతాయా అన్నంత నొప్పిని కలిగిస్తున్నాయి. అయినా సరే విడువక ముందుకు నడిచింది.
అ క్షణం దేశం కోసం తను పడుతున్న కష్టం ఎవరైనా కళ్లారా చూసి ఉంటే... ఈ దేశం లో కులమతాల చిచ్చులు ఏనాడో సమసి పోయి అందరూ ఏకమై నిలిచేవారేమో...
అలా ప్రాణాలకు తెగించి రక్తమొడుతూ నడుస్తుండగా... రూహి చెవులను ఓ శబ్దం చేరింది. ఏంటా అని టక్కున వెనక్కి తిరిగి చూసింది.
ఎదురుగా రెండు ఎడారి తోడేళ్ళు... వాటి కలల్లో మాంసం దొరికింది అనే ఆశ కనిపిస్తుంది.
ఓ వైపు స్పృహ కోల్పోయిన బృందం...
మరో వైపు ఆకలి దప్పికాలతో సహకరించని శరీరం...
ఎదురుగా మృత్యువు...
వీటి మధ్య నుంచి తను ప్రాణాలతో బయటపడగలదా...
మృత్యువు తన కోసం ఎదురుచూస్తుంది. మరి దానిని ఎదురించి నిలువగలదా...



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)