22-05-2026, 08:06 AM
ఏజెంట్ రూహి వాసుదేవ్...23
అయాన్... అయాన్...
అంటూ రూహి గుండె పగిలేలా అరిచింది. కానీ అయాన్ తన పిలుపు వినలేనంత దూరంగా ఆ వాగులో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. రూహి అలాగే తను వెళ్లిన వంక చూస్తూ ఉండిపోయింది. చాలా సంవత్సరాల తరువాత తన కంటి నుంచి కన్నీరు ఆగకుండా జారుతూనే ఉంది. అలా చాలా సేపు అక్కడే నిలబడి ఉంది. వర్షం కురుస్తూనే ఉంది. ఆ వర్షం లో తన కన్నీరు కలిసి జారుతున్నాయి. తననలా చూసి పార్వతి, వంశీ కూడా భయపడ్డారు.
రూహి ఒక్కసారి కోపంగా నదికి అటు వైపు చూసింది. అక్కడ చాలా మంది నర మాంస భక్షకులు అలాగే నిలబడి ఉన్నారు. నది ప్రవాహం మరింతగా పెరగడం తో ఇటు వైపుకు రాలేక అక్కడే ఆగిపోయారు. వారిని చూడగానే రూహి లో కోపం మరింతగా పెరిగింది. తన ప్రేమను దూరం చేసినందుకు ఇప్పటికిప్పుడు వాళ్ళందరిని నరికేయాలని అనిపించింది. తన కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయా అన్నట్టు ఎర్ర బడ్డాయి. తన పిడికిలి కొండను సైతం పిండి చేస్తుందా అనేలా గట్టిగా బిగుసుకుంది. తన ఉగ్ర రూపం చూసి ఆకాశం కూడా జడిసిందేమో, ఆ అడవిలో వీరికి దూరంగా ఒక పిడుగు కురిపించింది.
ఇంతలో పార్వతి వచ్చి మెల్లగా రూహి ని ఓదార్చడానికి అన్నట్టు తన భుజం మీద చెయ్యి వేసింది. సరిగ్గా అప్పుడే రూహి చూపు పార్వతి వేసుకున్న చొక్కా మీద ముద్రించిన భారతీయ జెండా గుర్తు ను చూసింది. అది చూడగానే అప్పటిదాకా తనలో ఉన్న బాధ, కోపం తగ్గి కర్తవ్యం గుర్తొచ్చింది.
మన దేశాన్ని కాపాడాలి అనే ఆశయం ముందు తన ప్రేమ చాలా చిన్నదిగా అనిపించింది. అందుకే కళ్ళు తుడుచుకుంది. ఒక్కసారి గుండెల నిండా శ్వాస తీసుకొని ప్రవహించే నదిని చూస్తు అయాన్ ని ఎలాగైనా కాపాడమని వేడుకుంది.
తరువాత లగేజ్ భుజాన వేసుకొని..
"మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పదండి " అని అంది.
రూహి అంత త్వరగా ఆ బాధ నుంచి తేరుకుంటుంది అని మిగతా బృందం ఊహించలేదు. తన నుంచి ఆదేశం రాగానే వారు కూడా భుజాన బ్యాగ్ వేసుకొని బయలుదేరారు.
రూహి టార్చ్ ఆన్ చేసుకొని ముందు నడుస్తుంటే, తన వెనుక పార్వతి, వంశీ నడుస్తున్నారు. ఒక వైపు చీకటి, మరో వైపు జోరున కురిసే వర్షం, ఇంకో వైపు దట్టమైన అడవి... ఇవేవి వారిని ఆపలేకపోయాయి. చేతిలో ఆయుధాలు పట్టుకొని ఎటు వైపు నుంచి ప్రమాదం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఒక గంట పాటు ఆగకుండా ముందుకు నడుస్తూనే ఉన్నారు.
అప్పటికి వర్షం కురవడం ఆగిపోయింది. రూహి దగ్గర ఉన్న టార్చ్ లో బ్యాటరీ కూడా అయిపోవచ్చింది. చీకటి లో వెలుగు లేకుండా ముందుకు వెళ్లడం చాలా కష్టమని అనిపించింది. టైమ్ చూస్తే సరిగ్గా 1 గంట అయ్యింది. ఈ రాత్రికి అక్కడే పడుకొని ఉదయాన్నే తిరిగి బయలుదేరాలి అని నిర్ణయించుకున్నారు.
కానీ రూహి కి ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడే వర్షం తగ్గింది. పులి, సింహం లాంటి క్రూర మృగాలు ఎక్కువగా వేటకు వెళ్ళేది రాత్రి సమయం లోనే... కాబట్టి అక్కడ కింద పడుకుంటే అవి ఎప్పుడైనా సరే తమ మీద దాడి చేసే అవకాశం ఉంది. అందుకే ఒక ఆలోచనకు వచ్చింది. పక్కనే ఉన్న పెద్ద చెట్టు మీదకు ఎక్కి వాటి కొమ్మల మీద పడుకోవాలని అనుకుంది.
రూహి ఆలోచన విని పార్వతి, వంశీ కూడా అలాగే చేసారు. ముగ్గురూ ఆ చెట్టు మీదకు ఎక్కి పెద్ద పెద్ద కొమ్మల మీద, నిద్రలో కిందకు పడకుండా నడుముకు తాడు కట్టుకొని పడుకున్నారు. రోజంతా నడిచి అలిసిపోవడం తో పార్వతి, వంశీ త్వరగానే నిద్రలోకి జారుకున్నారు. కానీ రూహి కి మాత్రం ఇంకా అయాన్ కళ్ళ ముందే మెదులుతున్నాడు. తనతో గడిపిన ప్రతి క్షణం తన గుండెను మెలిపెడుతుంటే ఆ బాధను భరించలేకపోతుంది. తనలో ఆలోచనలు కమ్ముకుంటున్నాయి.
ఈ దేశం...
తన అక్క ఆరోహి ని దూరం చేసింది.
అందంగా సాగాల్సిన బాల్యం దూరం చేసింది.
తన ప్రాణం పోసిన తండ్రి విక్రమ్ ని దూరం చేసింది.
ఇప్పుడు తను ప్రేమించే అయాన్ ని దూరం చేసింది.
ఇన్నిటిని దూరం చేసిన దేశం కోసం తానేందుకు బ్రతకాలి అనే ఆలోచన తన ఆవేదన లో నుంచి పుట్టింది.
సరిగ్గా అప్పుడే విక్రమ్ వాసుదేవ్ తనతో చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది.
"రూహి... అమ్మ మనల్ని తొమ్మిది నెలలు మోస్తుంది. అలాంటి అమ్మంటే మనకు ప్రాణం. తనకోసం ఏమైనా చేస్తాం.
మరి నిన్ను, నన్ను, అమ్మను... ఇలా ఎందరినో పుట్టిన దగ్గర నుంచి తనలో కలిసిపోయేదాకా మోసే ఈ నేలను ఇంకెంత ప్రేమించాలి. ఇండియా అంటే ఒక వ్యక్తి కాదు. కొన్ని కోట్ల మంది హృదయచప్పుడు.
ఒక సామాన్యుడు ఈ దేశం నాకు ఏమి ఇచ్చింది అని అడుగుతాడు. కానీ సైనికుడు మాత్రం, ఈ దేశం కోసం ఇంకా ఏమి ఇవ్వగలనా అని ఆలోచిస్తాడు. అదే ఇద్దరికీ తేడా...
మనం చేసే ఈ పోరాటంలో మన దగ్గర ఉన్నవన్నీ దూరం అవ్వచ్చు. కానీ మన గుండె ఆగేదాకా దాని చప్పుడు ఒక్కటే అయ్యి ఉండాలి. అదే... వందేమాతరం.. వందేమాతరం..."
ఆ మాట గుర్తుకు రాగానే తనలో కొన్ని క్షణాలు పాటు రేగిన ఆలోచన కు సిగ్గు పడింది. మౌనంగా ఆ చీకటిలో కన్నీరు కారుస్తూ... అయాన్ తలపుల తో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది.
పక్షుల అరుపులు చేసే సంగీతంతో ఉదయం అందరికీ మెలుకువ వచ్చింది. రూహి లేచి కిందకు దిగింది. వర్షం లో తడిచిన నేల మీద అక్కడక్కడా పులి కాలి గుర్తులు కనిపించాయి. కింద కాకుండా చెట్టు మీద పడుకోవడం ఎంత మంచిదైందో అని మనసులోనే అనుకుంది. అప్పటికే పార్వతి, వంశీ కూడా నిద్ర లేచారు.
వెంటనే ముగ్గురూ ఫ్రెష్ అయ్యి, అక్కడ దొరికే పళ్ళతో ఆకలి తీర్చుకొని తిరిగి నడవడం మొదలుపెట్టారు. రూహి తన దగ్గర ఉన్న దిక్షుచి, మ్యాప్ సహాయం తో దారి చూపిస్తుంటే మిగతా ఇద్దరూ తనని అనుసరించారు.
అలా మరో గంట పాటు నడిచిన తరువాత వారికి ఒక చిన్న జలపాతం కనిపించింది. రూహి అక్కడ ఆగింది. దాహం గా ఉండటం తో ఆ నీళ్లతో వారి దాహం తీర్చుకున్నారు. చాలా తీయగా, చల్లగా ఉన్నాయి ఆ నీరు.. అలాంటి స్వచ్ఛమైన నీరు వారి జీవితంలో మొదటిసారి తాగారు. కాసేపు అక్కడే సేద తీరారు.
అప్పుడే రూహి...
"ఇంకాసేపట్లో మనం అడవి నుంచి బయటపడతాం." అని అంది.
ఆ మాట వినగానే పార్వతి, వంశీ మొహాలు ఆనందం తో వెలిగిపోయాయి.
రూహి వారి వంక చూస్తూ...
"అప్పుడే సంతోష పడకండి. మన ముందు ఈ అడవి కి మించిన ప్రమాదం ఒకటి ఎదురుచూస్తుంది. "
ఆ మాటకు వారి మొహాల్లో రంగులు మారిపోయాయి.
"ఏమంటున్నారు మేడమ్ మీరు.." అంటూ పార్వతి ఆశ్చర్యంగా అడిగింది.
"అవును. ఈ అడవికి ఆనుకొని ఓ ఎడారి ఉంది. దాన్ని దాటితేనే చైనా లో అడుగు పెట్టగలం. కానీ ఆ ఎడారి చాలా ప్రమాదకరం. తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం లాంటివేవి ఉండవు. నిప్పులు కక్కుతూ ఉంటుంది. అంతే కాకుండా కొన్ని ఎడారి మృగాలు కూడా తిరుగుతుంటాయి. కానీ మన అదృష్టం ఏంటంటే అది ఎక్కువ దూరం ఉండదు. నా అంచనా ప్రకారం ఆగకుండా నడిస్తే సాయంత్రానికి దాన్ని దాటేయచ్చు. కానీ అప్పటిదాకా బ్రతికి ఉండడమే పెద్ద సాహసం..."
రూహి మాటలు వినగానే ఇద్దరికీ గొంతులో తడి ఆరిపోయింది. నుదురు మీద చమటలు పట్టాయి.
"భయపడకండి. ఇండియా ను కాపాడాలి అనే మన ఆశయం సాధించేదాకా నా ఊపిరి ఆగదు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డెసి అయినా కాపాడుతాను." అని రూహి వారికి ధైర్యం చెప్పింది. ఆ మాటకు వారిలో భయం కొంచెం తగ్గింది.
ఎడారిలో నీళ్లు ఉండవని తెలిసి తమ దగ్గర ఉన్న బాటల్స్ లో నీళ్లు పట్టుకున్నారు. కానీ అవి ఎంత సేపు వారి దాహం ఆపుతాయో తెలియదు.
కాసేపటి తరువాత...
"సరే ఇక వెళ్దామా మేడమ్..." అని పార్వతి అడిగింది.
"వెళ్లే ముందు మనం ముందుగా ఒక పని చేయాలి." అని రూహి బదులిచ్చింది.
"ఏంటి మేడమ్ అది..."
రూహి వెంటనే ఆ జలపాతం పక్కనే ఉన్న ఒక చెట్టు దగ్గరకు వెళ్ళింది. దాని ఆకులు అరిటాకులు మాదిరి చాలా పెద్దగా ఉన్నాయి. వాటిని నిదానంగా ఒక్కోటి తెంపి తీసుకొని వచ్చింది.
ఆ తరువాత తన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న బట్టలు అన్ని పక్కకు విసిరేసింది. మిగతా వారిని కూడా అలాగే చేయమని చెప్పింది. ఎందుకో అర్థం కాకపోయినా కచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుందని అర్థమై అలాగే చేసారు. తరువాత రూహి వారి దగ్గర ఉన్న తుపాకీ లు, బాంబులు, ఫస్ట్ ఎయిడ్, అలాగే ఈ పోరాటం కోసం వారి వెంట తెచ్చిన మిగతా ఆయుధాలు అన్ని తన బ్యాగ్ లో మాత్రమే పెట్టి... పార్వతి, వంశీ బ్యాగ్ లు ఖాళీ చేసింది.
వారికి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. అయోమయంగా జరిగేది చూస్తూ ఉన్నారు. ఇంతలో రూహి, ఇందాక తెంపిన ఆకులకు వెనకాల తమ వెంట తెచ్చిన గమ్ రాసి ఖాళీ చేసిన రెండు బ్యాగ్స్ లో అతికించడం మొదలుపెట్టింది. అలా ఆ బ్యాగ్స్ లో కొంచెం కూడా చోటు లేకుండా బయటా, లోపలా చుట్టూ అతికించింది. ఆరడం కోసం కాసేపు అలా గాలికి పెట్టింది.
అప్పుడు...
"మేడమ్ ఆ ఆకులు ఏంటి.." అని వంశీ సందేహంగా అడిగాడు.
"ఇవి ముశాచి జాతి కి చెందిన చెట్టు ఆకులు... చాలా మందంగా ఉంటాయి. వీటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నీళ్లలో పెడితే ఎన్ని రోజులు అయినా తాజాగా ఉంటాయి. అదే సమయం లో ఆ నీటిని పీల్చుకోవు, దాని ద్వారా బయటకు కూడా వెళ్లనివ్వవు. "
రూహి చెప్పింది విన్న తరువాత తను ఎందుకలా చేసిందో ఇప్పుడు అర్థమైంది. రూహి ఆ బ్యాగ్ లు తీసుకొని వాటిలో ఆ జలపాతం నీళ్లు నిండుగా పట్టింది. తను చెప్పినట్టుగానే ఆ బ్యాగ్ లో నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాలేదు.
ఎడారిలో నీళ్లు అవసరమని అర్థమై... అసలు మరో దారే లేని చోట.. తన సూక్ష్మ బుద్ది తో ఆలోచించిన రూహి తెలివిని చూసి ఆ ఇద్దరూ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. పార్వతి, రూహి ఆ నీళ్లు ఉన్న బ్యాగ్ లు భుజాన వేసుకుంటే.. రూహి ఆయుధాలు ఉన్న బ్యాగ్ భుజాన తగిలించుకుంది. అన్ని ఆయుధాలు ఒక్కటే బ్యాగ్ లో ఉండటం తో చాలా బరువుగా ఉంది. అయినా సరే అలాగే ముందుకు నడిచింది.
అలా తిరిగి వారి ప్రయాణం మొదలుపెట్టారు. సరిగ్గా ఒక అరగంట నడిచిన తరువాత రూహి చెప్పినట్టుగానే వారి కళ్ళ ముందు ఎర్రని ఇసుక తివాచి స్వాగతం పలికింది.
కను చూపు మేరలో ఎటు చూసినా ఎర్రని ఇసుక తప్ప ఇంకేమి కనిపించడం లేదు. అప్పటికే ఎండ తో ఆ ఎడారి నిప్పులు కక్కుతుంది. దాని సెగ వారిని తాకింది. చూస్తుంటేనే భయం పుట్టింది. కానీ వారి ముందు మరొక దారి లేదు.
అందుకే ముందుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ముందుగా రూహి ఆ ఎడారిలో అడుగు పెట్టింది. కాల్చేసే వేడి గాలి వారిని తాకింది. ఆ వేడిలో ముందు ముందు వారి ప్రయాణం ఊహించుకుంటుంటేనే ఒక్కొక్కరికి వణుకు పుట్టింది.
-----------------------------------------------------------
హైదరాబాద్...
కూరగాయలు కొనడం కోసం సుజిత ఇంటి నుంచి మార్కెట్ కి బయలుదేరింది. ఆరోజు ఆదివారం కావడం తో చాలా మంది జనాల తో బాగా రద్దీగా ఉంది.
జలంధర్ మనుషులు సుజిత నే గమనిస్తూ ఉన్నారు. అంత మంది జనాల మధ్య నుంచి తనని కిడ్నాప్ చేయడం దాదాపు అసాధ్యం అని వారికి అర్థమైంది. అది కాక అక్కడక్కడా సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా అందరూ దొరికిపోతారు. ఏం చేయాలో అర్థం కాక వెంటనే జలంధర్ కు ఫోన్ చేశారు.
వీరు చెప్పింది విన్న తరువాత...
"సుజిత మార్కెట్ కు ఎలా వచ్చింది." అని అడిగాడు.
"ఆటో లో అన్న.."
"అయితే ఒక పని చేయండి. ఆ మార్కెట్ బయట ఉన్న ఆటో ని మీ చేతుల్లోకి తీసుకోండి. సుజిత ఆటో ఎక్కగానే అనుమానం రాకుండా నేరుగా ఇక్కడికి తీసుకొని రండి."
"అన్న, అక్కడ చాలా ఆటోలు ఉన్నాయి. సుజిత మన ఆటో నే ఎక్కుతుంది అని నమ్మకం ఏంటి." అంటూ సందేహంగా అడిగాడు.
ఆ మాటకు జలంధర్ కి కోపం వచ్చింది.
"అరేయ్ సువ్వర్... ఇరవై మంది ఉన్నారు. మీ చేతుల్లో ఉన్న కత్తుల తో అక్కడ ఆటో స్టాండ్ లో ఉన్న ఆటో డ్రైవర్ లు అందరినీ బెదిరించండి. అవసరమైతే చంపేయండి. నాకు మాత్రం ఆ సుజిత ఈరోజు కావాలి. తను లేకుండా వస్తే మీరంతా నా చేతుల్లో చస్తారు." అని అరిచాడు.
ఆ మాటకు వాడు భయపడి అలాగే అన్న అని ఫోన్ పెట్టేసి... ఆ రౌడీలు అందరూ ఆటో స్టాండ్ వైపు కదిలారు.
"ఒసేయ్ సుజిత.. ఈరోజు నువ్వు నా చేతుల్లో అయిపోయావు..." అంటూ జలంధర్ పళ్ళు పటపటమని కొరికాడు.
" ఏజెంట్ రూహి వాసుదేవ్...23 " రచనకు రేటింగ్ ఇవ్వండి



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)