22-05-2026, 08:04 AM
ఏజెంట్ రూహి వాసుదేవ్...22
రూహి తన తెలివి తో ఆ నర మాంస భక్షకుల స్థావరం నుంచి తప్పించుకొని, వాళ్ళ నాయకుడికి సరైన శిక్ష విధించింది.
ఆకాశం లో ఉరుములు, మెరుపుల తో వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఆ అర్ధరాత్రి చీకటి లో, వర్షం లోనే బృందం మొత్తం అక్కడి నుంచి తప్పించుకోడానికి బయలుదేరారు. సరిగ్గా అప్పుడే వారి దారికి అడ్డంగా పది మంది నర మాంస భక్షకులు వచ్చారు.
వారి చేతిలో పదునైన ఆయుధాలు కూడా ఉన్నాయి. వారు వీరందరికి ఒక రెండు వందల మీటర్ల దూరం లో నిలబడి ఉన్నారు. ఒక్కో అడుగు నిదానంగా వేస్తూ వీరి వైపే వస్తున్నారు. వారిని అలా ఎదురుగా చూడగానే అందరికీ గుండె కాసేపు ఆగినట్టు అనిపించింది. ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం వృధా అయ్యిందా అని భయం కలిగింది. కానీ రూహి మాత్రం భయపడకుండా వేగంగా ఆలోచించడం మొదలుపెట్టింది.
ఇంతలో...
"మేడమ్.. ఇప్పుడు మన ముందు కేవలం పది మంది మాత్రమే ఉన్నారు కదా.. మన దగ్గర ఉన్న తుపాకీ లతో వారిని కాల్చేద్దామా.." అని అయాన్ చిన్నగా అడిగాడు.
"గన్ పేలిస్తే ఆ శబ్దానికి మిగతా ప్రజలు అందరూ నిద్ర లేస్తారు. వారందరిని ఎదుర్కొనే అన్ని బుల్లెట్లు కానీ, సైన్యం కానీ మన దగ్గర లేవు కదా. అప్పుడు మన పరిస్థితి మొదటికి వస్తుంది." అని రూహి సమాధానం ఇచ్చింది.
"దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది." అని అయాన్ దృడంగా చెప్పాడు.
తన కళ్ళలో కనిపించిన ధైర్యం చూసి రూహికి నమ్మకం వచ్చింది. వెంటనే తన లగేజ్ లో నుంచి తుపాకీ బయటకు తీసింది. తనని చూసి మిగతా వారు కూడా తుపాకీలు బయటకు తీసి లోడ్ చేసారు. ఎదురుగా ఉన్న అడవి మనుషులకు ఆ తుపాకీ లు అంటే ఏంటో తెలీదు. కోపంగా చేతిలో బల్లెం, కత్తులు లాంటివి తీసుకొని ఒక్కో అడుగు వేస్తూ నిదానంగా వీరి వైపు వచ్చారు. వారి మధ్య దూరం మెల్లగా తగ్గుతుంది.
రూహి బృందం అందరికీ ఆ వర్షం లో కూడా చమటలు పడుతున్నాయి. తుపాకీలు ఎదురుగా వస్తున్న భక్షకుల వైపు గురి పెట్టి నుంచున్నారు. అయాన్ మాత్రం ఆకాశం వంక చూస్తున్నాడు. అందరూ అయాన్ ఏం చెప్తాడో అని తన వంకే చూస్తున్నారు.
ఇంతలో అయాన్
"షూట్ నౌ..." అని అరిచాడు.
ఆ మాటతో ఇంకేమి ఆలోచించకుండా అందరూ తాము గురి పెట్టిన వైపు కాల్చేశారు. సరిగ్గా అదే సమయం లో ఆకాశం లో ఓ పెద్ద ఉరుము మెరుపు కూడా వచ్చింది. ఆ శబ్దం లో వీరి తుపాకీ శబ్దం కలిసిపోయింది. దాంతో అక్కడ గుడిసెల్లో ఉండే వారికి ఇదంతా వినిపించే అవకాశమే లేకుండా పోయింది.
రూహి బృందం ప్రయత్నానికి మరోసారి ఆ ప్రకృతి సహకరించినట్టు అయ్యింది. అయాన్ తెలివి కి రూహి మనసులోనే మెచ్చుకుంది. ఎదురుగా ఉన్న పది మందిలో నలుగురూ నేల కూలిపోయారు. అయినా సరే మిగతా ఆరు మంది కొంచెం కూడా భయపడకుండా వీరి వైపే వస్తున్నారు. ఇంతలో మరోసారి ఉరుము రావడం, వీరు మరో నలుగురిని కాల్చడం చక చకా జరిగిపోయాయి.
దాంతో మిగిలిన ఇద్దరూ వీరి వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వారిని కాల్చుదామంటే సమయానికి ఉరుము కూడా రాలేదు. ఏం చేయాలో తెలియక అందరూ ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.
ఈలోగా రూహి తుపాకీ వెనక్కి దాచి, సింహం లా వారి మీదకు దూకింది. ఎదురుగా మరణం రంకెలు వేస్తున్నా దాననికి ముక్కు తాడు వేయడానికి దూకే రూహి ధైర్యం చూసి మిగతా బృందం ఆశ్చర్యంగా అలా నిలబడిపోయింది.
వారు అలా చూస్తూ ఉండగానే ఆ అడవి మనిషి ల్లో ఒకడు తన కత్తి వేగంగా రూహి మీదకు విసిరాడు. రూహి చాలా చాక చక్యంగా దాన్ని తన చేతిలోకి తీసుకొని ఎగిరి వాడి గుండెల మీద తన్నింది. వాడు దూరంగా పడ్డాడు. ఈలోగా తన మీదకు వచ్చిన రెండో వాడి గుండెల్లో ఆ కత్తి ని దింపింది. కాసేపు గిల గిల తన్నుకుంటూ వాడు చనిపోయాడు. ఈలోగా దూరంగా పడిన మొదటి వాడు అది చూసి ఏదో వింత వింత శబ్దాలు చేస్తూ పరిగెత్తుకుంటూ తమ గుడిసెల వైపు వెళ్ళాడు. రూహి కి వాడిని పట్టుకునే అవకాశం కూడా దొరకలేదు.
"వాడు వెళ్లి మిగతా వారిని తీసుకొని వచ్చేలోగా మనం త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం పదండి." అని రూహి అరవడం తో అందరూ ఈ లోకం లోకి వచ్చారు. తమ లగేజ్ తీసుకొని బలమంతా కాళ్ళలోకి తెచ్చి పరుగు పెట్టడం మొదలుపెట్టారు. అంత వర్షం లో రాళ్లు, రప్పలు, చెట్లు వేటిని లెక్క చేయకుండా ప్రాణాలు అర చేతిలో పట్టుకొని పరుగు తీశారు.
అలా వెళ్తూ ఉండగా వారి దారికి అడ్డంగా ఓ వాగు కనిపించింది. ఇందాక వారిని ఆ అడవి మనుషులు మోసుకొచ్చినప్పుడు ఆ వాగు మోకాళ్ళ దాకా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు వర్షం బాగా కురవడం తో ఎక్కువ ఉదృతంగా పొంగి పొరులుతుంది. ఇప్పుడు అది ఎంత లోతు ఉందో కూడా తెలియడం లేదు. దాన్ని దాటి ఇప్పుడు అటు వైపుకు వెళ్లడం చాలా సాహసమే, ఎందుకంటే అప్పటికే ఎక్కడి నుంచో కొట్టుకొని వస్తున్న మోసళ్ళు కూడా ఆ వాగులో అక్కడక్కడా కొట్టుకుపోతూ కనిపించాయి.. ఏం చేయాలో అర్థం కాక అందరూ ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.
ఇంతలో దూరంగా ఆ భక్షకులు తమ వైపుకే వస్తున్నట్టు శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయి. అది వింటుంటేనే అందరికీ ఒళ్ళు జలదరించింది.
ముందేమో ముంచేసే వాగు...
వెనుక చంపేసే రాక్షసులు... మధ్యలో ఎటూ పోలేని పరిస్థితుల్లో నిలబడ్డారు.
ఎదురుగా ఉన్న దారులు అన్ని మూసుకొని పోయాయి. సరిగ్గా అప్పుడే రూహి చూపు ఆ వాగు పక్కనే ఉన్న చెట్లు మీద పడింది. అక్కడంతా పొడువైన వెదురు బొంగు చెట్లు ఉన్నాయి. వాటిని చూడగానే రూహి కి ఒక ఆలోచన వచ్చింది. తన బ్యాగ్ లో నుంచి పదునైన గొడ్డలి తీసి దాన్ని నరికింది. రెండే రెండు దెబ్బలకు అది నేల కూలింది. రూహి వెంటనే ఆ పొడువైన బొంగు ను వాగుకు అటు వైపు కు వంతెన మాదిరి వేసింది.
అది చూసి మిగతా వారికి కూడా రూహి ఆలోచన అర్థమైంది. వారు కూడా పనిలో పడ్డారు. అలా కొన్ని క్షణాల్లోనే ఆ బొంగులతో అటు వైపుకు వంతెన మాదిరి కట్టారు.
ఈలోగా ఆ అడవి మనుషులు తమ వైపుకు వేగంగా వస్తున్నట్టు వారి అరుపుల శబ్దం పెరగడం తో అర్థమైంది. ఇక ఆలస్యం చేయకూడదు అని అర్థమైంది. కానీ ఆ బొంగులు వీరు ఒక్క అడుగు వేయగానే పక్కకు దొరులుతున్నాయి.
దాని మీద నడవడం అస్సలు సులభం కాదు. అందుకే మిగతా బృందాన్ని వాటిని కదలకుండా పట్టుకోమని చెప్పి రూహి ముందుగా అటు వైపుగా నడిచింది. మధ్యలో కింద పడబోతే, పట్టు కోసం ఆ కర్ర మీద కత్తి వేటు వేసి పడిపోకుండా పట్టుకుంది. తను కింద పడబోయే దగ్గర పదునైన రాయి కూడా ఉంది. రూహి చెయ్యి ఏ మాత్రం పట్టు జారినా అది తన గుండెల్లో దిగుతుంది. రూహి తన ధైర్యం కోల్పోకుండా కష్టపడి తిరిగి ఆ కొమ్మల మీదకు ఎక్కింది. ఊపిరి బిగబట్టి మిగతా బృందం రూహి నే చూస్తూ ఉన్నారు.
చివరికు ప్రాణాలకు తెగించి రూహి ఎలాగోలా ఆ వంతెన దాటి అటు వైపుకు చేరుకుంది. తర్వాత అటు వైపు కర్రలు కదలకుండా తాడు తో బిగించి పట్టుకుంది. మిగతా వారిని కూడా రమ్మని సైగ చేసింది. ఈలోగా అడవి మనుషులు వారి సమీపానికి వచ్చారు. ముందుగా పార్వతి వంశీ పరిగెత్తగా వారి వెనుక అయాన్ పరుగు తీసాడు. ఆ అడవి మనుషులు వారి మీదకు బాణాల తో దాడి చేస్తుంటే అయాన్ తప్పించుకుంటూ, వారిని తుపాకీ లతో కాలుస్తూ ఇద్దరిని కాపాడుతున్నాడు.
పార్వతి వంశీ ఇటు వైపుకు వచ్చేసారు. అయాన్ కూడా మరో నాలుగు అడుగులు వేస్తె ఇటు వైపుకు వచ్చేసేవాడు. కానీ సరిగ్గా అప్పుడే ఓ బాణం వేగంగా వచ్చి అయాన్ కడుపు లో దిగింది.
అది చూసి రూహి గుండె ఒక్క క్షణం ఆగినట్టు అనిపించింది. అయాన్ శరీరం నుంచి రక్తం రావడం మొదలైంది. అయాన్ కూడా రూహి కళ్ళలోకి చూసాడు. ఆ కళ్ళలో క్షమించు ప్రియతమా కడ దాకా రాలేకపోయాను అనే బాధ కనిపించింది. ఇంతలో ఇంకో బాణం కూడా వచ్చి అయాన్ కాలి లోకి దిగింది. అయాన్ అలాగే పక్కనే ఉన్న వాగులోకి పడిపోయాడు. వేగంగా పొంగి పొరులుతున్న వరద నీరు తనని ముందుకు తోసుకొని వెళ్ళిపోయింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది.
"అయాన్... అయాన్..." అంటూ రూహి ఏడుస్తూ అరిచింది. తను కూడా వాగులోకి దుకడానికి వెళ్తే పార్వతి తనని ఆపింది.
ఈలోగా అడవి మనుషులు వీరు వేసిన వెదురు బొంగుల వంతెన మీద నుంచి ఇటు వైపుకు రావడానికి బయలుదేరారు. వంశీ వేగంగా స్పందించి ఆ బొంగులకు ఇటు వైపు కట్టిన తాడు ను తేంపేసి వాటిని తమ చేతిలో ఉన్న గొడ్డలితో నరికేసాడు. దెబ్బకు దాని మీదకు వచ్చిన ఇద్దరూ భక్షకులు నీళ్లలో పడిపోయారు. మిగతా వారు అక్కడే ఆగిపోయారు. అది చూసి ఊపిరి పీల్చుకున్నాడు.
రూహి మాత్రం ఇంకా బాధలోనే ఉంది. వంశీ , పార్వతి మొదటి సారి తనని అలా చూస్తున్నారు. రూహి గుండె ముక్కలైంది. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి కళ్ళ ముందే దూరమైతే కలిగే బాధ ను మాటల్లో చెప్పలేం. గుండెలవిసేలా ఏడుస్తూ రోదించింది.
ఆ క్షణం తన శరీరం ప్రకృతి కురిపించే వర్షం లో తడవగా... తన మనసు మాత్రం కన్నీటి వర్షం లో తడిచింది.
" ఏజెంట్ రూహి వాసుదేవ్...22 " రచనకు రేటింగ్ ఇవ్వండి



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)