Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏజెంట్ రూహి వాసుదేవ్
#47
ఏజెంట్ రూహి వాసుదేవ్...19



రూహి బృందం కొరియా నుంచి చైనా వెళ్ళడానికి చాలా ప్రమాదం తో కూడిన చాంగ్ బై అడవుల మార్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ నిత్యం మరణం తాండవం చేస్తూ ఉంటుంది. అందుకు నిదర్శనంగా అడుగు పెట్టగానే పాముల తివాచి వారికి స్వాగతం చెప్పింది.

మొత్తానికి రూహి తెలివి వల్ల ఆ ప్రమాదం దాటి బయటకు రాగలిగారు. అలా మరి కాస్త దూరం నడిచిన తరువాత దాహం తీర్చుకుందామని ఒకచోట కాసేపు ఆగారు. ఇంతలో పార్వతి గట్టిగా అరవడం తో అందరూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు.

వారికి ఎదురుగా ఉన్న దాన్ని చూసి వారి గొంతు లో తడి ఆరిపోయింది. భయం తో అలాగే బిగుసుకుపోయారు. వారిని అంతలా భయపెట్టేలా వారి ముందు ఏముంది అంటే.... సింహం.

పెద్ద సింహం. జూలూ విదిల్చి వారి ముందు నిలబడి ఉంది. దాని కళ్ళు కోపం తో ఎర్రగా మండుతున్నాయి. ఆ కళ్ళ వైపు చూస్తుంటేనే వణుకు పుడుతుంది. అప్పుడే ఏదో జంతువు ను వేటాడి వచ్చిందేమో, దాని మోహం మొత్తం ఎర్రని రక్తం తో తడిసి ఉంది. ఆ రక్తం తో అది మరింత భయంకరంగా కనిపిస్తుంది.

ఇంతలో ఉన్నట్టుండి ఆ సింహం పెద్దగా గాండ్రించింది. ఆ అరుపుకు వారి చుట్టు పక్కల చెట్ల మీద ఉన్న పక్షులు అన్ని దూరంగా ఎగిరిపోయాయి. ఆ గర్జన వీరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. దాని కళ్ళ లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది.  ఇంతలో ఆ సింహం రూహి బృందం వైపు తీక్షణంగా చూస్తూ ఒక అడుగు ముందుకు వేసింది. అందరికీ గుండె ఆగినంత పనైంది. దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యం అని వీరికి బాగా తెలుసు.

ఆ సింహం కళ్ళు మరింత భయంకరంగా కనిపిస్తున్నాయి. అందరూ అలా షాక్ లో ఉండగానే సింహం ఒక్క ఉదుటున ఎగిరి పార్వతి చెయ్యి పట్టుకుంది. పార్వతి అరుపు తో అడవి మొత్తం ప్రతిధ్వనించింది. ఆ అరుపు విని రూహి ఈ లోకం లోకి వచ్చింది. ఎలా అయినా తనని కాపాడాలి అని నిర్ణయించుకుంది. తన పక్కనే ఉన్న పదునైన రాయి ఒకటి తీసుకొని బలమంతా ఉపయోగించి నేరుగా ఆ సింహం వైపు విసిరింది. అది వెళ్లి సింహం తల మీద బలంగా తగిలింది.

దెబ్బకు దాని నోటి తో కరిచి పట్టుకున్న పార్వతి చేతిని వదిలేసింది. పార్వతి చేతి నుంచి ఎర్రని రక్తం కారుతుంది. నొప్పి తో తను ఇంకా ఆర్త నాదాలు చేస్తూనే ఉంది. మరో వైపు దెబ్బ బలంగా తగలడం తో సింహానికి బాగా కోపం వచ్చింది. ఒక్కసారి గట్టిగా గాండ్రిస్తు ఆ రాయి విసిరిన రూహి వైపు తిరిగింది.

రూహి బెదరలేదు. తను కూడా సింహం కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుంది. ఆ క్షణం రెండు సింహలు ఎదురుపడితే ఎలా చూసుకుంటాయో అలా చూసుకుంటున్నారు. సింహం కళ్ళలో కోపం ఉంటే, రూహి కళ్ళలో ధైర్యమిచ్చిన తెగింపు కనపడతుంది. మిగతా బృందం ఇప్పుడు ఏమవుతుందా అని చూస్తున్నారు.

ఇంతలో సింహం కోపం గా రూహి వైపు పరుగు తీసింది. రూహి కూడా ఆ సింహానికి దొరకకుండా పరిగెత్తడం మొదలుపెట్టింది. మరో వైపు వంశీ పరుగున పార్వతి దగ్గరకు వెళ్లి తన చేతికి చికిత్స చేస్తున్నాడు. అయాన్ మాత్రం రూహి, సింహం వైపు పరిగెత్తాడు.

ముందు రూహి... వెనుక సింహం...
సింహం గర్జింపు లతో ఆ చోటు దద్దరిల్లింది.
క్షణాలు గడిచే కొద్ది వారి ఇద్దరి మధ్య దూరం తరిగింది.
ఇంతలో రూహి కి ఎదురుగా ఊడల మర్రి చెట్టు కనిపించింది. దాని ఊడలు, కొమ్మలతో ఆ ప్రాంతం మొత్తం నిండిపోయింది. అలాగే ఆ చెట్టు కు ఒక పెద్ద తొర్ర కూడా ఉంది. రూహి ఆలస్యం చేయకుండా పరుగున వెళ్లి ఆ తొర్ర లో నుంచి దూరి ఇటు వైపు కు వచ్చింది.

తననే వెంబడిస్తూ వచ్చిన సింహం ఏ మాత్రం ఆలోచించకుండా ఆ తొర్ర లోకి దూరింది. తల అటు వైపు వచ్చింది. కానీ దాని భారీ శరీరం మాత్రం ఇటు వైపు కు రాలేక ఇరుక్కుపోయింది. ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక అలాగే ఆగిపోయింది.

రూహి ఆయాస పడుతూ అక్కడే కూర్చుంది. ఇంతలో అయాన్ పరుగున తన దగ్గరకు వచ్చాడు.

"నీకేం కాలేదు గా రూహి..." అని కంగారుగా అడిగాడు.

"నాకేం కాలేదు అయాన్. నేను బాగానే ఉన్నాను "

ఆ తొర్ర లో నుంచి బయటపడాలి అని సింహం వేగంగా తన శక్తి మొత్తం ఉపయోగించి పెనుగులాడుతుంది. ఇంతలో అయాన్ సింహం వైపు కోపంగా చూస్తూ తన జేబులో నుంచి తుపాకీ బయటకు తీసి దానిని కాల్చబోయాడు. రూహి తనని వెంటనే ఆపేసింది.

"అయాన్.. ఆగు.. ఈ అడవిలోకి కొత్తగా వచ్చింది మనం. దాని స్థావరం లో అది నివసిస్తుంది. అలాంటి దాన్ని చంపడం న్యాయం కాదు. "

"కానీ మేడమ్ అది ఆ తొర్ర లో ఎక్కువ సేపు ఉండదు. ఏ క్షణమైనా బయటకు రావచ్చు. మనం ఇక్కడి నుంచి పారిపోయినా సరే ఎక్కువ దూరం వెళ్లలేం. తప్పకుండా అది మన వెనకే వస్తుంది."

అయాన్ చెప్పినట్టుగానే సింహం శరీరం లో చాలా భాగం ఇప్పటికే ఇటు వైపుకు వచ్చేసింది. కొన్ని క్షణాల్లో అది దాని నుంచి బయటకు రావచ్చు.

రూహి వేగంగా ఆలోచించింది. ఒక్కసారి చుట్టూ చూసింది. అప్పుడే తనకు కాస్త దూరంలో ఓ చిన్న గుహ లాంటిది కనిపించింది. ఆ గుహ బయట ఓ పెద్ద బండరాయి కూడా ఉంది. వాటిని అలా చూడగానే రూహి కి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అయాన్ కు ఏం చేయాలో చెప్పింది.

"మేడమ్ ఇది చాలా ప్రమాదకరం. ప్రాణాలు పోతాయి." అని అయాన్ కంగారుగా అన్నాడు.

"దేశం బాగుండాలి అంటే రాజకీయ నాయకుడు డబ్బును, సైనికుడు ప్రాణాన్ని లెక్క చేయకూడదు"

ఆ మాట తో అయాన్ మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో అక్కడికి వంశీ, పార్వతి కూడా వచ్చాడు. అయాన్ వారికి ఏం చేయాలో చెప్పాడు. ముగ్గురూ గుహ పక్కనే ఉన్న చెట్ల వెనుక దాక్కున్నారు.

రూహి మాత్రం ఆ సింహం వైపు తిరిగి దాని వంకే చూస్తుంది. కొన్ని క్షణాలు తరువాత సింహం నిజంగానే తొర్ర నుంచి బయటకు వచ్చేసింది. బయటకు రాగానే రూహి వంక చూసింది. దాని కళ్ళు చింత నిప్పులు మాదిరి ఎర్రగా మండుతున్నాయి. కోపం తో దాని కడుపు ఎగసి ఎగసి పడుతుంది. పెద్దగా గర్జిస్తూ రూహి వైపు వచ్చింది. దాని కోసమే ఎదురుచూస్తున్న రూహి వేగంగా ఇందాక చూసిన గుహ లోపలకు పరుగు తీసింది. సింహం కూడా గుహ లోకి వెళ్ళింది. అక్కడ మొత్తం చీకటిగా ఉంది. ఒక్క క్షణం దానికి ఏమి కనిపించలేదు.

అది తేరుకునే లోగా రూహి దాని మీద నుంచి దూకుతూ గుహ బయటకు దూకింది. దాని కోసమే చూస్తున్న వంశీ, అయాన్, పార్వతి వెంటనే అక్కడున్న బండ రాయి ని గుహ కు అడ్డంగా తోసారు. సింహం ఆ రాయి సందు లో నుంచి బయటకు రావాలని చూసింది. కానీ ఆ రాయి చాలా పెద్దది అవ్వడం, అందులో అది ఆ గుహ ముందున్న గుంత లో సరిగ్గా ఇరుక్కుపోవడం తో దాన్ని ఇంచు కూడా కదల్చలేక పోయింది. అలా బ్లాక్ కోబ్రా బృందం సింహాన్ని గుహ లో బందించి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

"మేడమ్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం పదండి." అని వంశీ అన్నాడు.

"ఒక్క క్షణం ఉండండి." అంటూ రూహి తన బ్యాగ్ లో నుంచి ఒక చిన్న టైం బాంబు ను బయటకు తీసింది. దాన్ని గుహ బయట ఉన్న రాయి కి అతికించి, మరో 8 గంటల్లో అది పేలే లాగా సెట్ చేసింది. మిగతా బృందం తన వంక ఆశ్చర్యంగా చూసారు.

"ఇలాగే వదిలేసి వెళ్తే ఆ సింహం చనిపోతుంది. ఇంకో 8 గంటల తరువాత ఈ బాంబు వల్ల రాయి పేలిపోతుంది. అప్పుడు ఆ సింహం దాని నుంచి బయటపడుతుంది. మన పని జరగడం కోసం ఓ జీవి ని చంపితే నా మనసు అది క్షమించదు. అందుకే ఇలా..." అంటూ అందరికీ అర్థమయ్యేలా చెప్పింది.

రూహి మాటలకు అందరూ తన వంక గర్వంగా చూసారు. దేశం కోసం ప్రాణాలు ఇస్తూ, శత్రువుల ప్రాణాలను తీస్తు... ఇలా అమాయక జీవిల గురించి కూడా ఆలోచించడం ఒక్క రూహి వాసుదేవ్ కే చెల్లింది అని మనసులోనే అనుకున్నారు.

ఆ తరువాత అందరూ తిరిగి అక్కడి నుంచి నడవడం మొదలుపెట్టారు. దారిలో వారికి ఎలుగు బంటి, తోడేలు లాంటి క్రూర మృగాలు కూడా ఎదురు అయ్యాయి. చాక చక్యంగా నలుగురూ కలిసి వాటిని ఎదురించి పోరాడి తప్పించుకున్నారు.

అలాగే మరోసారి ఆకులు కప్పిన ఊబీ లో వంశీ పడిపోయాడు. ఆ ఊబీ తన శరీరాన్ని అంతకంతకు లోపలకు లాగేసుకుంటుంది. మిగతా బృందం తమ దగ్గర ఉన్న తాడు సాయం తో తనని బలంగా లాగి బయటకు పడేసారు. ఇలా ఎన్నో సాహసాలు చేస్తూ ఆ అడవిలో ప్రయాణం చేస్తున్నారు. ప్రతి క్షణం వారికి ప్రాణాలతో చెల గాటం లాగానే ఉంది.

చూస్తూ ఉండగానే  సమయం గడిచిపోయింది. మెల్లగా సూర్యుడు పడమర కొండల్లో వాలిపోవడం మొదలయింది. అప్పటిదాకా గుబురు చెట్లతో చీకటిగా మారిన అడవి మరింత దట్టమైన కారు చీకటిగా మారింది. దూరంగా రకరకాల జంతువుల అరుపులు వీరి గుండెల్లో భయాన్ని పెంచుతున్నాయి.

ఇక ఆ రాత్రి వేళ ముందుకు నడవడం కష్టమని అర్థమై అక్కడే విశ్రమించాలని నిర్ణయించుకున్నారు. అలా అనుకోగానే బ్యాగ్ లో నుంచి టెంట్ లు బయటకు తీశారు.

సరిగ్గా అప్పుడే ఓ బల్లెం వేగంగా వచ్చి వారి ముందున్న చెట్టు లోకి దిగింది. అందరూ భయం తో అది వచ్చిన వైపు తల తిప్పి చూసారు. ఎదురుగా ఉన్న వారిని చూసి గుండె ఆగినంత పనైంది.

ఎదురుగా వందల మందిలో నర మాంస భక్షకుల జాతి నిలబడి ఉంది. వారి చేతుల్లో ఆయుధాలు... కాగడాల వెలుతురు లో వారు మరింత భయంకరంగా ఉన్నారు.

బ్లాక్ కోబ్రా బృందం అలా ఆశ్చర్యం లో మునిగిపోయి ఉండగానే వారిని చుట్టు ముట్టారు.

ఇక నేటి తో మన ప్రాణం పోవడం ఖాయం అని అందరూ భయం తో బిగుసుకుపోయారు...
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 21-05-2026, 07:14 AM



Users browsing this thread: 1 Guest(s)