Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏజెంట్ రూహి వాసుదేవ్
#41
ఏజెంట్ రూహి వాసుదేవ్...17



Operation FISH

"మన భారతదేశంలో విధ్వంసం సృష్టించడానికి చైనా పెట్టుకున్న పేరు..." చెప్పడం ఆపి రూహి అందరి వంక చూసింది. మిగతా సభ్యులు అందరూ తనేం చెప్తుందా అని ఆసక్తిగా తననే చూస్తూ ఉన్నారు. బ్లాక్ కోబ్రా బృందం విజయవంతంగా చాంగ్ లీ మరియు అతని అనుచరుల స్థావరాన్ని సమూలంగా మట్టి కరిపించి అక్కడి నుంచి బయటకు వచ్చారు.

ఆ తరువాత రూహి తన వెంట తెచ్చిన హార్డ్ డిస్క్ లను సిస్టమ్ లో వేసి అందులో ఏముందో మొత్తం చూసింది. చైనా పథకం గురించి తెలిసి చాలా ఆశ్చర్యం మరియు ఆందోళన తనలో కలిగాయి.

అప్పుడే మిగతా అందరినీ సమావేశ పరిచి అసలు అదేంటో చెప్పడం మొదలుపెట్టింది.

"మీరు ఎప్పుడైనా Tsar బాంబ్ గురించి విన్నారా?"

ఆ పేరు వినగానే బ్లాక్ కోబ్రా బృందం లో ఉన్న అందరి మొహాల్లో ఒకలాంటి భయం పుట్టింది. నిలువునా వణికిపోయారు. చమటలు పట్టేసాయి.

"ఏంటి మేడమ్ మీరు అనేది. ఇప్పుడు ఆ బాంబు ఎందుకు గుర్తుకు వచ్చింది." అని వంశి వణుకుతున్న గొంతు తో అడిగాడు.

"చెప్పండి. ఆ బాంబు గురించి మీకు ఏమైనా తెలుసా?" అంటూ రూహి మరోసారి అడిగింది.

"బాగా తెలుసు మేడమ్. ఇప్పటిదాకా మన మానవ జాతి చూసిన అత్యంత భయంకరమైన అణు బాంబు అది.
Tsar అంటే రష్యన్ లో రాజులకే రాజు అని అర్థం.. అన్ని బాంబుల కంటే శక్తివంతమైనది కాబట్టే దానికి ఈ పేరు పెట్టారు. ఆ బాంబు కానీ పేలితే దాని చుట్టూ వంద కిలోమీటర్ల దాకా మొత్తం నామ రూపాలు లేకుండా నాశనం అవుతుంది. దానితో ఓ పెద్ద నగరాన్నే నాశనం చేయచ్చు. చనిపోయిన వారి బూడిద కూడా మిగలదు." అని పార్వతి తనకు తెలిసింది చెప్పింది. తను చెప్పింది వింటుంటేనే మిగతా వారిలో కాస్త భయం పుట్టింది.

రూహి తన వంక చూస్తూ...
"పార్వతి చెప్పింది నిజం. అంత శక్తివంతమైన బాంబు అది. కానీ దానిలో ఓ లోపం ఉంది. అదేంటంటే... ఆ బాంబు బరువు 27000 కేజీలు. అలాగే 30 అడుగుల వెడల్పు, 7 అడుగుల పొడువు ఉంటుంది. అంత పెద్ద బాంబు ను యుద్ధ విమానాల్లో తీసుకొని వెళ్లి శత్రువుల స్థావరం మీద దాడి చేయడం చాలా కష్టం. అందుకే దానిని అన్ని దేశాలు తయారు చేయడం ఆపేసి పక్కన పెట్టేసాయి. ప్రపంచ దేశాల శాంతి భద్రతల పరిరక్షణ లో భాగంగా ఐక్యరాజ సమతి కూడా దానిని ఉపయోగించడం నిషేధించింది.

కానీ చైనా మాత్రం చాలా రహస్యంగా తమ మనుషులను మరియు లెక్కకు మించిన డబ్బును ఉపయోగించి రష్యా లో అత్యంత భద్రంగా దాచిన ఆ బాంబు డాక్యుమెంట్స్ కాపీ ని కొట్టేసారు. నేడు వారి దగ్గర ఉన్న ఆధునాతనమైన టెక్నాలజీ మరియు శాస్త్రవేత్తల తో దాని బరువు గణనీయంగా తగ్గించి, విస్ఫోటనం ఎన్నో రెట్లు పెంచేలా డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగానే కొరియా, చైనా నుంచి చాలా నెలలుగా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను, తెలివైన విద్యార్థుల ను అపహారించి రహస్య పరిశోధనలు చేయించారు. ఎట్టకేలకు వారు విజయవంతం అయ్యారు.

సరిగ్గా అదే సమయం లో మన భారతదేశం అమెరికా తో చేసుకోబోయే ఒప్పందం గురించి వారికి తెలిసింది. అదే జరిగితే మన దేశం అభివృద్ధి వైపు చాలా వేగంగా అడుగులు వేస్తుంది. అది వారిలో మన మీద ద్వేషాన్ని మరింతగా పెంచింది. అప్పుడే ఈ బాంబు ను మన మీద ప్రయోగించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఒప్పందం జరిగే సమయం లో ఈ పేలుడు జరిగితే, సొంత ప్రజలనే కాపాడుకోలేని అసమర్థతులుగా మనం మిగిలిపోతాం. దాంతో మిగతా దేశాలు మనతో ఒప్పందాలు, సంబంధాలు పెంచుకోవాలంటే ఆలోచిస్తాయి. దెబ్బకు అభివృద్ధి లో మన దేశం మరో పది అడుగులు వెనక్కి వేయాల్సి వస్తుంది. మనం ప్రాణాలతో ఉండగా ఆ పని జరగనివ్వకూడదు.

ఆ బాంబుకు సంబంధించిన విడి విడి భాగాలను ఇక్కడ ఎత్తుకొచ్చిన మనలాంటి వారి దగ్గర తయారు చేయించి వాటిని చైనా రాజధాని బిజింగ్ కి  60 కిలోమీటర్లు దూరం లో ఉన్న ఓ మైదాన ప్రాంతానికి రవాణా చేసారు. ఇప్పటికే ఆ బాంబు కు కావాల్సిన అన్ని భాగాలు అక్కడికి చేరుకున్నాయి. దాన్ని మన దేశం మీద ఆగష్టు 15వ తేదీన ప్రయోగించునున్నారని ఈ వీడియో లో తెలుస్తుంది.

దీనికి వారు పెట్టుకున్న పేరే operation Fish. అసలు ఆ Fish అంటే ఏంటి? ఈ దాడి ఎప్పుడు, ఏ నగరం మీద చేయబోతున్నారు అనేది మాత్రం ఇప్పటికి సమాధానం దొరకని ప్రశ్నలు...
మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ నార్త్ కొరియా నుంచి చైనా చేరుకోవాలి. అక్కడ మన దేశం మీద జరగబోయే దాడి ని ఆపాలి. లేకపోతే చరిత్ర ఎప్పుడూ చూడని ఓ పెద్ద విద్వంసం మన భారతదేశం చూడబోతుంది. "

రూహి చెప్పింది విని మిగతా బృందం భయం తో నోరు వెళ్ళబెట్టారు. అందరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవహించింది.

కాసేపటికి వంశీ పెదవి విప్పాడు.
"మేడమ్, మీరు చెప్పింది వింటుంటేనే చాలా భయంగా ఉంది. ఈ దుర్మార్గులు ఇంత క్రూరమైన చర్యకు దిగుతారని కలలో కుడా అనుకోలేదు. ఇక్కడే నాదో సందేహం...
ఈ చైనా మన స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ బాంబు ప్రయోగించాలని ప్లాన్ చేస్తే, మరి అదే రోజు చైనా అధ్యక్షుడు మన దేశ పర్యటన కు ఎందుకు వస్తున్నట్టు..?" అంటూ సందేహంగా అడిగాడు.

"ఇంకా అర్థం కాలేదా... ఇది కూడా వారి పథకం లో భాగమే. చైనా అధ్యక్షుడు ఇక్కడ ఉన్న సమయం లో బాంబు పేలితే ఈ ప్రపంచానికి వారి మీద అనుమానం రాదు కదా.. వారి వైపు ఎవరూ వేలు చూపించకుండా ఉండటం కోసం ఇలా చేస్తున్నారు.
పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ, తనని ఎవరూ చూడటం లేదు అని అనుకుంటుంది అంట...
ఇప్పుడు చైనా కూడా అంతే.. కానీ వారికి మన భారతీయుల గురించి పూర్తిగా తెలీదు.
ఒక్కసారి రంగం లోకి దిగితే... శత్రువు పాతాళం లో దాక్కున్నా, ఆకాశం లో నక్కినా... వెతికి వెతికి పట్టుకుంటామని..."

"మేడమ్... మీరు చెప్పింది అంతా నిజమే.. ఇక్కడి నుంచి బీజింగ్ కు కేవలం 700 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. మనం విమానం లో వెళ్తే మన రాక ను శత్రువులు చాలా సులభంగా తెలుసుకొని జాగ్రత్త పడతారు. పోనీ రోడ్డు మార్గం లో వెళ్దాం అంటే, బార్డర్ దగ్గర చెకింగ్ చాలా కఠినంగా ఉంటుంది. మరి దాన్ని దాటుకొని అక్కడికెళ్లి ఈ బాంబు ను ఆపగలం అంటారా..." అంటూ పార్వతి సందేహాపడుతూ అడిగింది.


రూహి ఒకసారి గాఢంగా శ్వాస తీసుకొని పెదవి విప్పింది.
 "కురుక్షేత్రం లో అభిమన్యుడి కి పద్మవ్యూహం లోకి వెళ్లే దారి తెలుసు. కానీ తిరిగి వచ్చే దారి తెలియక పోరాడి వీర మరణం పొందాడు.
కానీ మనకు... ఈ దుర్మార్గ శత్రువులు వేసిన పద్మవ్యూహం లోకి ఎలా వెళ్లాలో కూడా తెలీదు. కానీ గుండెల నిండా దేశం కోసం చివరి శ్వాస దాకా పోరాడాలి అనే కాంక్ష మాత్రం రగులుతూనే ఉంది. దాని ముందు ఈ పరాయి కుక్కలు పన్నిన పథకం నిలువగలదా...
మన లక్ష్యం ఉన్నతంగా ఉంటే, అడ్డంకులు సైతం మన విజయానికి మెట్లుగా మారుతాయి.
పోరాడుదాం... ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు కాదు, ఉపిరి ఉన్నంత వరకు పోరాడుదాం..
ఈ పోరాటం లో గెలిస్తే మన దేశపు మట్టిని వీరతిలకం గా దిద్దుకుందాం.. ఓడిపోతే ఆ మట్టిలోనే కలిసి దేశానికి వీరతిలకం అవుదాం. వందేమాతరం... వందేమాతరం... " అంటూ రూహి గర్వంగా పలికింది.

తన మాటలు మిగతా బృందం లో కూడా గెలవాలి అనే స్ఫూర్తి ని నింపాయి. దేశ భక్తి తో అందరి గుండెలు నిండాయి.

తరువాత అందరూ కలిసి అక్కడి నుంచి ఎలా చైనా చేరుకోవాలి, ఎవరెవరు ఏమి చేయాలి లాంటివి మాట్లాడుకున్నారు. తరువాత అక్కడి నుంచి బయలుదేరడం కోసం వంశీ, పార్వతి వాహనం సిద్ధం చేయడానికి వెళ్లారు. దూరం నుంచి వారిని వెంబడిస్తూ వచ్చిన మనిషి అదంతా గమనిస్తూనే ఉన్నాడు.

వాళ్లు వెళ్ళిపోయాక రూహి, అయాన్ మాత్రం ఒంటరిగా ఉండిపోయారు. అయాన్ ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు కానీ బయట పడటం లేదు. రూహి కాసేపు ఎదురుచూసి చివరకు...
"అయాన్... నేను ఆ చాంగ్ లీ ని చంపిన తరువాత నాకు ఏదో చెప్తాను అన్నావు కదా. ఏంటది " అని అడిగింది.

రూహి ఆ ప్రశ్న అడుగుతుంది అని అయాన్ కు ముందే తెలుసు. ఆ క్షణం తన ప్రేమ గురించి చెప్పాలని అనుకున్నాడు. కానీ గుండెల్లో మాత్రం చాలా భయంగా ఉంది. చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. ప్రేమించడం సులువే, ఆ ప్రేమను తెలుపడమే చాలా కష్టమని మొదటిసారి తెలిసింది.

"మేడమ్.. అది... అది..." అంటూ చెప్పడం కోసం తడబడ్డాడు.

"అదే ఏంటి అయాన్..." రూహి తన కళ్ళలోకి చూస్తూ అడిగింది. అలా బయటకు అయితే అడిగింది కానీ, అయాన్ ఎలా చెప్తాడో, ఏం చెప్తాడో అని తన మనసులో కూడా కొంచెం సిగ్గు తో కూడిన బిడియం కదలాడుతుంది.

"ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు మేడమ్ ."

"ఎలా ఏముంది నోటి తో చెప్పు." అని రూహి నవ్వుతూ అంది.

ఆ నవ్వు చూసిన తరువాత అయాన్ మనసు లో భయం కొంత తగ్గింది. ఇన్ని రోజులు తన మీద పెంచుకున్న ప్రేమను ధైర్యం లా మారుస్తూ...
"రూహి..." అని పిలిచాడు.

ఇప్పటిదాకా తన నోటి నుంచి మేడమ్ అనే పిలుపు మాత్రమే విన్న రూహి... మొదటిసారి తనని పేరుతో పిలవడం తో తన పేరు తనకే కొత్తగా అనిపించింది. అయాన్ వంక ఆశ్చర్యంగా చూసింది.

అయాన్ మెల్లగా చెప్పడం ప్రారంభించాడు.
"రూహి.. ఈ పేరు నా జీవితం లోకి ఎప్పుడు వచ్చిందో తెలీదు కానీ నేడు అదే జీవితం అయ్యింది. ఎంతలా అంటే నా ఎద సవ్వడి కూడా మీ పేరే కలవరించే లాగా...

మీతో నడవడం ఇష్టం. పాదం అలిసే దాకా కాదు, ప్రాణం పోయేదాకా...
మీతో మాట్లాడటం ఇష్టం. జాము జారే దాకా కాదు, కాలం కరిగిపోయేదాకా...
చివరగా..  నా గుండె చప్పుడు ఆగేదాకా మిమ్మల్ని ప్రేమించడం అంటే చాలా చాలా ఇష్టం.

మీతో కలిసి ఉండటం కోసం ఏమైనా చేయాలి అనిపిస్తుంది.
మిమ్మల్ని చూడగానే తొలి చూపులోనే పడిపోయాను. ఎందుకు అని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ప్రేమ దూరమయ్యాక కారణాలు మిగులుతాయి కానీ ప్రేమ పుట్టడానికి కారణాలు ఉండవేమో...
నన్ను వేరే డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తాను అంటే మన RAW చీఫ్ ని బ్రతిమాలి మరీ బ్లాక్ కోబ్రా బృందం లోకి వచ్చాను. అసలు ఈ ఆపరేషన్ కోసం కొరియా దాకా వచ్చిందే మీకోసం...

మీ ధైర్యం, మీ నవ్వు, మీ తెగింపు, మీ మాటలు... ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అన్నిటికీ మించి దేశం కోసం ప్రాణాలను సైతం వదలడానికి సిద్ద పడే మీ దేశ ప్రేమను చూసి ప్రతి రోజు, ప్రతి క్షణం మీతో ప్రేమలో పడుతూ ఉంటాను.
మీరు మన దేశం మీద చూపించే ప్రేమలో... ఓ కొంచెం ఈ ప్రేమికుడి మీద చూపించండి. జీవితాంతం మీ చెయ్యి పట్టుకొని వెన్నంటే నడుస్తాను.
మీ విజయం లో చిరునవ్వు లా, ఓటమి లో ఓదార్పు లా... మీతోనే కలిసి బ్రతకాలని ఉంది. చివరకు దేశం కోసం ఊపిరి వదలాల్సి వస్తే మీతోనే కలిసి మువ్వన్నెల జెండా లో ఒదిగి ఈ మన్నులో కలిసిపోవాలని ఉంది.
I LOVE YOU రూహి... " అంటూ అయాన్ తన మనసులోనే మాట చెప్పాడు.

ఆ మాట వినగానే కొన్ని క్షణాలు రూహి అలాగే ఉండిపోయింది. తన మీద అయాన్ ఇంత ప్రేమను పెంచుకున్నాడు అని ఊహించలేకపోయింది. అలాంటి ప్రేమ దొరకడం తన అదృష్టం అనుకుంది. ఇప్పటికిప్పుడు తన కౌగిలి లో వాలిపోవాలని అనిపించింది. కానీ తన ప్రేమ కంటే ముందు తన కర్తవ్యం గుర్తొచ్చింది. అందుకే తన మదిలో ప్రేమను లోపలే దాచుకుంటూ...

"అయాన్, నువ్వు చెప్పింది వినగానే చాలా ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడు నా లక్ష్యం ఈ చైనా పథకం నుంచి మన దేశాన్ని కాపాడటం మీద మాత్రమే ఉంది.
నీ మనసులోని మాట చాంగ్ లీ ని చంపినప్పుడు చెప్పావు.. నా సమాధానం ఈ పోరాటం లో విజయం సాధించిన తరువాత చెప్తాను.
ఒకవేళ ఈ యుద్ధం లో మరణిస్తే, నువ్వు అన్నట్టు మన దేశపు మట్టి కౌగిలిలో కలుసుకుందాం." అంటూ స్థిరంగా చెప్పింది.

"మీ సమాధానం ఏమైనా, మీ మీద నేను చూపించే ప్రేమ, గౌరవం లో ఇసుమంతైనా మార్పు ఉండదు మేడమ్..." అంటూ అయాన్ అక్కడి నుంచి కళ్ళ నీళ్లతో ముందుకు కదిలాడు.

రూహి తననే చూస్తూ ఉండిపోయింది. అయాన్ మనసును ఏమైనా బాధపెట్టానా అని తనలో ఓ ఆలోచన వచ్చింది. కానీ వెంటనే తనకు విక్రమ్ వాసుదేవ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి...
"కుటుంబం,  ప్రేమ... ఈ రెండిటిలో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సిన సంఘర్షణ మొదలైనప్పుడే, సామాన్యుడి కి సైనికుడి కి తేడా తెలుస్తుంది."

ఆ మాట గుర్తుకురాగానే తనని తాను సమాధాన పర్చుకుంది. గుండెల నిండా శ్వాస తీసుకొని తన ముందున్న భారతదేశ జాతియ పతాకానికి సగర్వంగా సెల్యూట్ చేసింది.

ఆ క్షణం ఆ మువ్వన్నెల జెండా కూడా తన దేశ భక్తి చూసి మురిసిపోతూ గర్వంగా వీచింది.



" ఏజెంట్ రూహి వాసుదేవ్...17 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 9 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 20-05-2026, 07:18 AM



Users browsing this thread: 1 Guest(s)