19-05-2026, 08:22 AM
ఏజెంట్ రూహి వాసుదేవ్...16
"మేడమ్.. బయట చాలా మంది చైనా సైనికులు నిలబడి ఉన్నారు." అని అయాన్ కంగారుగా అన్నాడు.
"ఎంత మంది ఎదురుగా ఉన్నా, అడ్డుగా ఓ సంద్రమే వచ్చినా, నేడు ఆ తీవ్రవాదుల శవాలతో వంతెన నిర్మించి మరీ ముందుకు వెళ్తాను. నా ఒంట్లో ఆఖరి రక్తపు బొట్టు దాకా పోరాడుతూనే ఉంటాను." అంటూ రూహి స్థిరంగా చెప్పింది.
"మనం గెలవగలం అంటారా "
"ఉరకలు వేస్తున్న నా నెత్తురు మీద ఒట్టు... ఈరోజు వాళ్లలో ఒక్కడు కూడా మిగలడు."
"వారి దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి మేడమ్ "
"మన సంకల్పం బలంగా ఉంటే ప్రపంచమే మనతో నడుస్తుంది. " అంటూ రూహి తన పక్కనే ఉన్న ఒక షెల్ఫ్ తెరిచింది.
అందులో ఆధునాతనమైన చాలా తుపాకీలు వరుసగా ఉన్నాయి. ఇందాక రహస్య గది కోసం వెతుకుతున్న సమయం లో రూహి వాటిని చూసింది. చాంగ్ లీ దేశ విదేశాల నుంచి వాటిని తెప్పించాడు. కానీ నేడు అవి ఇలా తన శత్రువులకే ఉపయోగ పడతాయని కలలో కూడా ఊహించి ఉండడు.
రూహి, అయాన్ అందులో నుంచి తమకు కావాల్సిన ఆయుధాలు తీసుకున్నారు. అలాగే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మరియు హెల్మెట్ కూడా ధరించారు. రూహి సంపాదించిన హార్డ్ డిస్క్ భద్రంగా జేబులో దాచుకుంది. తరువాత అక్కడ సీసీ కెమెరా లో రికార్డు అవుతున్న దృశ్యాలని తన ఫోన్ కి కనెక్ట్ చేసింది.
"అయాన్, మన శత్రువు వేసే ప్రతి అడుగు మనకు ముందే తెలుస్తుంది. ఆ మాత్రం చాలు వారిని మట్టుబెట్టడానికి...
మన శత్రువుకు తన ముందు వారి దేశముంది అనే ధైర్యం ఉండచ్చు,
కానీ వాడికి తెలీయని విషయం ఏంటంటే.. ఒక ప్రమాదం ఎదురైతే మన భారతదేశ సరిహద్దు ముందు నిలబడి దానికి ఎదురు పడేది ముందు మనమే అని...
వీరికి, వీరి లాగే మన దేశం మీద ఆధిపత్యం చెలాయించి అణగదొక్కాలని చూసే వారికి... అందరికీ వినపడేలా, గుండెలు అదిరి పడేలా మన అడుగులు వేసే సమయం వచ్చింది."
అయాన్ అర్థమైంది అన్నట్టు తల ఆడించాడు. ఈ లోగా కెమెరా లో వారు ఉన్న గదికి రెండు వైపుల నుంచి ఒక ఇరవై మంది సైనికులు చుట్టు ముట్టి వారి వైపే వస్తున్నట్టు కనిపించింది.
ఇద్దరూ ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకొని.
"భారత్ మాతా కి జై..." అని ఒకేసారి అరిచి బరిలోకి దూకారు.
అప్పుడు ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. దానికి రెండు వైపులా కాస్త దూరం లో నిలబడిన తీవ్రవాదులు ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు. వారు తెరుకునే లోగా ఒక స్మోక్ బాంబు బయటకు వచ్చింది. కళ్ళు మూసి తెరిచే లోగా ఆ చోటు మొత్తం పొగ తో నిండిపోయింది.
చైనా సైనికులు కాసేపు తడబడి, కళ్ళు నులుముకుంటూ చూసారు. సరిగ్గా అప్పుడే ఆ పొగ లో నుంచి ఓ రూపం మెల్లగా బయటకు వచ్చింది. అది ఎవరో కాదు... ఏజెంట్ రూహి వాసుదేవ్.
తనని అలా చూసి వారు షాక్ అయ్యి నోరు తెరిచి ఉండిపోయారు.
రూహి వారి వంక చూస్తూ...
"హ్యాపీ దీపావళి..." అని అంటూ తుపాకీ ఎక్కుపెట్టి కాల్చింది.
అది నేరుగా తన ముందున్న తీవ్రవాది నుదుటి మీద దిగింది. అది చూసి మిగతా వాళ్లు భయపడిపోయారు. కానీ వారు తేరుకునే లోగా రూహి చెతిలోని ఆయుధం నుంచి బుల్లెట్ల వర్షం కురిసింది. ఈలోగా అయాన్ కూడా అటు వైపు నుంచి కాల్చడం మొదలుపెట్టాడు.
బుల్లెట్ల నుంచి చాలా ఒడుపుగా తప్పించుకుంటూ ఆ ఇద్దరూ కలిసి ఇరవై మందిని పదే పది నిమిషాల్లో మట్టి కరిపించారు. కానీ వారికి బాగా తెలుసు.. ఆ ఫ్యాక్టరీ లో ఇంకా ఎనభై మంది దాకా చైనా సైనికులు ఉన్నారని.. వారిని కూడా మట్టి కరిపించాలని అనుకున్నారు.
ఇంతలో మరికొంతమంది చైనీయులు వారి వైపు వస్తున్నట్టు రూహి ఫోన్ హెచ్చరించింది. వెంటనే ఒకసారి చూట్టు చూసింది. అక్కడ చనిపోయిన చైనా సైనికుల జేబులో నుంచి యువాన్ నోట్లు తీసుకొని వాటికి ఓ దారం కట్టింది. ఆ దారం మరో చివర తను ఇందాక చాంగ్ లీ గది లో తీసుకున్న బాంబ్ పిన్ కు కట్టింది.
తరువాత అయాన్ ను తీసుకొని ఆ చోటుకు దూరంగా వెళ్ళింది. ఇంతలో అక్కడికి చేరుకున్న చైనా సైనికులు.. ఆ నోట్ల కట్టను చూసి వారి కళ్ళు మిల మిలమంటూ మెరిసాయి. వెంటనే ఆ నోట్లను ఒకరికొకరు తమకే కావాలని లాక్కున్నారు. అలా లాగినప్పుడు దానికి కట్టిన బాంబు పిన్ బయటకు వచ్చింది. ఢాం అని పెద్ద శబ్దం చేస్తూ పేలింది. దెబ్బకు ఒకేసారి ఇరవై మంది చైనా సైనికుల శరీరాలు గాల్లోకి లేచి కిందపడ్డాయి. సైనికుడి చూపు ఎప్పుడూ కంటికి కనిపించే దాని మీదే కాదు, దాని వెనుక ఉన్న ప్రమాదం గురించి కూడా ఆలోచించాలి అని చెప్పే పాఠం అది.
మిగిలిన సైనికులు రూహి, అయాన్ తప్పించుకోకుండా ఫ్యాక్టరీ ని జల్లెడ పడుతున్నారు. ఈలోగా రూహి మిగతా వారి కోసం కూడా ఓ పథకం ఆలోచించింది. వేగంగా తాము రోజు పని చేసే ల్యాబ్ దగ్గరకు వెళ్ళింది. ఆ ల్యాబ్ లో కెమికల్స్ చాలా తక్కువ మొతాదు లోనే ఉంటాయి. ఏ రోజుకారోజు తెప్పిస్తుంటారు. అయినా సరే ఒక్కసారి అక్కడున్న కెమికల్స్ ని బాగా గమనించి అయాన్ కి ఏం చేయాలో చెప్పింది. ఇద్దరూ మొహానికి ల్యాబ్ మాస్క్ పెట్టుకొని ఆ పనిలో పడ్డారు. కొన్ని క్షణాల తరువాత వారు ఓ గ్యాస్ ని తయారు చేసారు. రూహి దాన్ని ఓ గ్లాస్ కంటైనర్ లో తీసుకుంది.
ఒకసారి తన ఫోన్ వంక చూసింది. మిగతా సైనికులు ఇంకా రూహి, అయాన్ కోసం వెతుకుతునే ఉన్నారు. ఈసారి రూహి వారికి తాము ల్యాబ్ లో ఉన్నట్టు తనే సందేశం పంపింది. ఆ తరువాత ఆ గ్యాస్ ఉంచిన కంటైనర్ కి ఒక బాంబు అతికించి దానికి టైం సెట్ చేసింది. అది సరిగ్గా ఒక ఐదు నిమిషాల్లో పేలుతుంది. చైనా సైనికులు ఇక్కడికి రావడానికి కూడా అంతే సమయం పడుతుంది.
ఈలోగా రూహి, అయాన్ ని తీసుకొని పక్కనే ఉన్న కిటికీ ద్వారా ఆ ల్యాబ్ లో నుంచి బయట పడింది. వారు అలా వెళ్లిన కాసేపటి తరువాత ఒక ముప్పై మంది సైనికులు తుపాకీల తో వచ్చి ఆ ల్యాబ్ ని నలువైపుల నుంచి చుట్టు ముట్టారు. వారు అలా వచ్చిన కొన్ని క్షణాల తరువాత రూహి ఉంచిన గ్లాస్ కంటైనర్ పేలి అందులో ఉన్న గ్యాస్ మొత్తం బయటకు వచ్చింది.
అక్కడికి వచ్చిన సైనికులకు ఏం జరిగిందో అర్ధమయ్యే లోగా ఆ గ్యాస్ వారి శ్వాస ద్వారా లోపలకు వెళ్ళింది. ఆ గ్యాస్ మరేదో కాదు. Tear Gas...
వారు దాన్ని పీల్చిన కాసేపటికి ఒళ్ళంతా చమటలు పట్టాయి. దగ్గు ఎక్కువై శ్వాస తీసుకోవడం భారంగా మారింది. చూపు మసకబారింది. ముక్కు, చెవులు మండటం మొదలైంది. కొన్ని క్షణాల తరువాత ఆ ల్యాబ్ లో ఉన్న చైనా సైనికులు అందరూ స్పృహ తప్పి పడిపోయారు. వారు తిరిగి లేవడానికి కనీసం మరో రెండు, మూడు గంటలు అయినా అవుతుంది.
రూహి, అయాన్ మిగతా వారి పని పట్టడం కోసం బయలుదేరారు. వారు ఆ ఫ్యాక్టరీ మధ్యలో ఉన్న మీటింగ్ హాల్ దగ్గర ఉన్నారని తెలిసింది. మెల్లగా అటు వైపు వెళ్లారు. మిగిలిన ఆ కొద్ది మందిని కూడా పూర్తి చేస్తే అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అని అనుకున్నారు. ఇంతలో వారు ఊహించినట్టుగానే వారికి ఎదురుగా ఒక నలుగురు చైనా సైనికులు నడుస్తూ కనిపించారు.
రూహి వెంటనే వారి వద్దకు వెళ్లి వెనుక నుంచి తుపాకీ ఎక్కు పెట్టింది. వారు మెల్లగా వెనక్కి తిరిగారు. కానీ రూహి ఊహించినట్టుగా వారి కళ్ళలో భయం లేదు. మోహం లో ఆనందం ఉంది. ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని అర్థమై ఒకసారి చుట్టు చూసింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది.
ఒక పాతిక మంది దాకా తమని తుపాకీ లతో చుట్టు ముట్టారు. వారంతా రూహి ని, అయాన్ ని చూసి నవ్వుతున్నారు.
"మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టావే.. ఈరోజు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నరకం చూపించి మరీ చంపుతాం." అని నవ్వుతూ అన్నారు.
కానీ రూహి మోహం లో భయం కానీ, ఆందోళన కానీ లేవు. పైగా నవ్వుతుంది. ఆ నవ్వు చూసి చైనీయిల నవ్వు ఆగిపోయి ఆశ్చర్యం మొదలయింది. రూహి వారి వంక చూస్తూ...
"నన్ను చంపాలంటే మీ చేతుల్లో తుపాకీలు ఉంటే సరిపోవు. ఆ తుపాకీ కాల్చే గుండెలో దమ్ము ఉండాలి. ఆ దమ్మున్న వాడిని ఆ దేవుడు ఇంకా పుట్టించలేదు.
అయినా మీకో విషయం చెప్పనా...
డిపార్ట్మెంట్ మొత్తం మా బృందాన్ని ముద్దుగా బ్లాక్ కోబ్రా టీం అంటారు. ఎందుకంటే ఆ పాము కాటు వేస్తె బ్రతకడం చాలా కష్టం. విషం నేరుగా నీ గుండెకు ఎక్కి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణం తీస్తుంది. ఇప్పుడు ఆ బ్లాక్ కోబ్రా కాటు వేస్తె ఎలా ఉంటుందో చూస్తారా..."
చైనా సైనికులు అందరూ ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.
ఇంతలో రూహి...
"బ్లాక్ కోబ్రా..." అని అరిచింది.
ఆ చైనా సైనికుల వెనుక నిలబడి ఉన్న వంశీ, పార్వతి.. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నారు. రూహి నుంచి ఆదేశం రాగానే ఇద్దరు చెరో వైపు నుంచి తుపాకీల తో చిరుత పులులు మాదిరి బరిలోకి దూకారు.
వారిని చూసి చైనా సైనికులు బిత్తర పోయారు. ఈలోగా రూహి, అయాన్ కూడా తమ పని మొదలుపెట్టారు. బ్లాక్ కోబ్రా బృందానికి కూడా కొన్ని గాయాలు అయ్యాయి. అయినా సరే లెక్క చేయకుండా ఆకలి తో పంజా విసిరే సింహం లాగా వేటాడటం మొదలుపెట్టారు. సరిగ్గా ఒక పది నిముషాలు తరువాత ఆ ఫ్యాక్టరీ లో ఒక్కడు కూడా మిగలలేదు. మొత్తం అందరినీ మట్టు బెట్టారు.
ఆ గది మధ్యలో రాణి రుద్రమదేవి మాదిరి తుపాకీ తో ధైర్యంగా రొమ్ము విరిచి నిలబడిన ఏజెంట్ రూహి వాసుదేవ్ ని చూసి బ్లాక్ కోబ్రా బృందం గర్వం తో సెల్యూట్ చేసారు.
వారి కళ్ళకు తను ఓ నడిచే డైనమేట్ లాగా కనిపించింది. అలాంటి ఓ గొప్ప సైనికురాలి ని చూసినందుకు అక్కడున్న అందరి గుండెల్లో దేశ భక్తి ఉప్పొంగింది.
-------------------------------------------------------------
హైదరాబాద్...
"అన్న.. నీకొక గుడ్ న్యూస్.. ఆ సుజిత ఇప్పుడే ఇంటి నుంచి మార్కెట్ కి బయలుదేరింది."
ఫోన్ లో ఆ మాట వినగానే జలంధర్ మోహం మతాబు లాగా వెలిగిపోయింది.
"తన వెంట ఎవరైనా ఉన్నారా?" అని అడిగాడు.
"ఎవరూ లేరు అన్న.. ఒంటరిగా వెళ్తుంది."
"మన వాళ్ళని ఓ ఇరవై మందిని తీసుకొని వెళ్ళండి. అదును చూసి తనని ఎత్తుకొని వచ్చేయండి. ఈరోజు దానికి సరైన గుణపాఠం చెప్పాలి." అని జలంధర్ అన్నాడు.
"సరే అన్న.." అంటూ అటు వైపు నుంచి ఫోన్ పెట్టేసారు.
'ఒసేయ్ సుజిత.. నా మనుషులకే చుక్కలు చుపిస్తావా. ఈరోజు నీకు నరకం చూపిస్తాను.' అని జలంధర్ మనసులోనే కసిగా అనుకున్నాడు.
" ఏజెంట్ రూహి వాసుదేవ్...16 " రచనకు రేటింగ్ ఇవ్వండి



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)