Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏజెంట్ రూహి వాసుదేవ్
#35
ఏజెంట్ రూహి వాసుదేవ్...15




[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]




చాంగ్ లీ మెల్లగా కళ్ళు తెరిచాడు. స్పృహలోకి వచ్చాక ఒక్కసారి చుట్టూ చూసి కాసేపు షాక్ అయ్యాడు. తన గదిలో తనే బందీగా కుర్చీలో కట్టేసి ఉన్నాడు. అలాగే తన మెడలో ఉండాల్సిన చైన్ కూడా లేదు. దాంతో అ గది నిఘా వ్యవస్థ ను కూడా ఆఫ్ చేసారు అని అర్థమైంది. అసలేం జరిగిందో గుర్తు చేసుకోడానికి ప్రయత్నించాడు. గదిలోకి వచ్చిన రూహి అంద చందాలు చూసి మైమరచిపోతూ తన చీర కొంగు ను గట్టిగా మొహానికి అద్దుకున్నాడు. ఆ తరువాత ఏం జరిగిందో అసలు గుర్తులేదు.

తను ఇలా ఆలోచిస్తూ ఉండగానే
"దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుందా..." అనే గొంతు వినిపించింది.

చాంగ్ లీ టక్కున తల తిప్పి కుడి వైపు చూసాడు. అక్కడ గోడకు తగిలించిన భారత జాతీయ పతాకం ముందు రూహి కూర్చొని ఉంది. తను ఆ జెండా మీద గుచ్చిన కత్తులు ఇప్పుడు రూహి చేతిలో ఉన్నాయి. అప్పుడు చాంగ్ లీ కి తానెవరో అర్థమైంది. ఇండియా నుంచి ఒక ఏజెంట్ ఇక్కడికి వచ్చింది అని తెలుసు. కానీ ఓ అమ్మాయి తన దాకా రాలేదు అని తనని అస్సలు పట్టించుకోలేదు. కానీ నేడు తన ఎదురుగా కూర్చుంది తనే అని తెలియగానే, తెలియకుండానే తనలో వణుకు పుట్టింది. నుదుటి మీద నుంచి చమటలు కారాయి.గుండెల్లో దడ మొదలయింది.

రూహి మెల్లగా తన వైపు అడుగులు వేసింది. వాడి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ...
"నేనెవరో అర్థమైందా చాంగ్ లీ..."

"నా పటిష్టమైన సైన్యం దాటి నువ్వు ఇక్కడిదాకా వచ్చావా? ఇదంతా నేను నమ్మలేను " అని ఆశ్చర్యపోతూ అడిగాడు.

"సీతమ్మ వారిని రావణుడు ఎత్తుకొని పోయి భద్రంగా అశోక వనం లో దాచాడు. తన చుట్టూ వందల మంది సైనికులు కాపలాగా ఉన్నారు. శత్రు దుర్బెధ్యమైన కోట కూడా తన సొంతం. అన్నిటికీ మించి రాముడికి సీత కు మధ్య ఓ పెద్ద సముద్రమే ఉంది. అయినా సరే సీతమ్మను కలవాలనే రాముడి ప్రేమ ముందు అవేవి ఆపలేకపోయాయి.
అలాగే నా మాతృ దేశాన్ని కాపాడాలనే నా ఆశయం ముందు నువ్వు, నీ సైన్యం నన్ను ఎప్పటికీ ఆపలేరు.
మన సంకల్పం ఎంత గొప్పదైతే మన అడ్డంకులు అంత చిన్నవి గా కనపడతాయి."

చాంగ్ లీ ఇంకా షాక్ లోనే ఉన్నాడు. వాడు తేరుకునేలోగా రూహి ఆ గది లో ఉన్న మానిటర్ దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుంచి ఆ మొత్తం ఫ్యాక్టరీ లో ఏం జరుగుతుందో స్పష్టంగా చూడచ్చు. వెంటనే తన దగ్గర ఉన్న రిమోట్ సాయం తో అయాన్ ఉన్న గదిలో లైట్ మూడు సార్లు ఆఫ్ చేసి ఆన్ చేసింది.

రూహి అక్కడికి వచ్చే ముందే అయాన్ కి అలాంటి సిగ్నల్ రాగానే తన పని మొదలుపెట్టమని చెప్పి వచ్చింది. రావాల్సిన సిగ్నల్ రాగానే అయాన్ మెల్లగా తన గది లో నుంచి బయటకు వచ్చాడు. అక్కడ కాపలా గా ఇద్దరు చైనా సైనికులు తిరుగుతున్నారు. వారి మీద చాలా చాక చక్యంగా దాడి చేసి స్పృహ తప్పించి తన గదిలో బందించాడు. ఆ తరువాత వారి బట్టలు ధరించి చాంగ్ లీ గది వైపు అడుగులు వేసాడు.

రూహి అప్పటికే అక్కడున్న సైనికులను వేరే చోటుకు వెళ్ళమని చాంగ్ లీ సెల్ నుంచి సందేశం పంపించింది. అది చాంగ్ లీ నే చెప్పాడు ఏమో అనుకొని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనకు అడ్డుగా ఎవరూ లేకపోవడం తో అయాన్ చాలా సులభంగా చాంగ్ లీ గది దాకా వచ్చాడు. రూహి వెంటనే తలుపు తెరిచి తనని లోపలకు రానిచ్చింది.

అయాన్ రూహి ని సురక్షితంగా చూసి గట్టిగా కౌగిలించుకున్నాడు. రూహి కూడా తనని అలాగే గుండెలకు హత్తుకుంది. ఇద్దరు కొన్ని క్షణాలు పాటు అలాగే ఉన్నారు. మాటల్లో చెప్పలేని మధుర భావాలు మది తో పంచుకున్నారు. కాసేపటికి అయాన్ అక్కడ కట్టేసి ఉంచిన చాంగ్ లీ ని చూసాడు. కోపంగా గన్ తీసుకొని తన వైపు అడుగు వేయబోయాడు. రూహి తనని ఆపేసింది.

"అయాన్... ముందు మనం చేయాల్సిన పని చాలా ఉంది. అసలు ఈ నార్త్ కొరియా మరియు చైనా కలిసి మన దేశం మీద ఏం చేయబోతున్నారో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే ఈ చాంగ్ లీ దాచిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయో వెతకాలి. వాటిని ఇక్కడే ఒక రహస్య గదిలో దాచాడు. ఆ గది ఎక్కడుందో వెతకాలి."

ఆ మాటకు అయాన్ అవును అన్నట్టు తల ఆడించాడు.
"మేడమ్ ఈ ఫ్యాక్టరీ చాలా పెద్దది. మొత్తం అన్ని గదులు వెతుకుతూ వెళ్లినా ఈ రాత్రి సరిపోదేమో. పైగా బయట గస్తీ కాస్తున్న చైనా సైనికుల కళ్ళు గప్పి వెతకడం అంటే పెద్ద సాహసమే. ఎలా ఆ పని పూర్తి చేస్తాం." అని అనుమానంగా అడిగాడు.

"దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది." రూహి స్పష్టంగా చెప్పింది.

"ఏంటి మేడమ్ అది." అంటూ అయాన్ ఆశ్చర్యంగా అడిగాడు.

రూహి వెంటనే తన ముందున్న ప్రాజెక్టర్ స్క్రీన్ వైపు చూపించింది.
"ఇదే ఈ ఫ్యాక్టరీ బ్లూ ప్రింట్.. మొత్తం 108 గదులు ఉన్నాయి. ప్రతి గది ముందు ఇద్దరు సైనికులు కాపలా గా ఉన్నారు. వారు ఈ చాంగ్ లీ ఆదేశానుసారం పని చేస్తారు. అంతే కాదు ప్రతి గది ముందు సీసీ కెమెరా లు ఉన్నాయి. కాబట్టి వీడి దగ్గర నుంచి వారిని ఆ గదులో ఒక్కోటి తెరవమని చెప్పిద్దాం. అందులో ఏముందో చూద్దాం. ఏ గదినైతే ఆ సైనికులు తెరవలేక పోతారో ఆ గదిలోనే మనకు కావాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే ఆ రహస్య గది తెరిచే తాళం చాంగ్ లీ దగ్గర మాత్రమే ఉంటుంది. అదే తన మెడలో వేసుకున్న ఈ కీ..." అంటూ రూహి తన పథకం చెప్పింది.

"అంతా బాగుంది కానీ, ఇప్పుడు చాంగ్ లీ వారిని తలుపులు తెరవమని చెప్తాడు అంటారా..."

"వాడు చెప్పక్కరలేదు. ఎలా చెప్పించాలో నాకు తెలుసు" అంటూ... తన వేలికి ఉన్న ఉంగరం బయటకు తీసి దానిని ఎదురుగా ఉన్న సిస్టమ్ కి కనెక్ట్ చేసింది. అందులో తను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాంగ్ లీ మాట్లాడిన ప్రతి మాట రికార్డు అయ్యి ఉంటుంది. అందులో నుంచి తనకు కావాల్సిన పదాలను వెతికి వాటిని కలుపుతూ ఓ ఆడియో టేప్ తయారు చేసింది. తరువాత దాన్ని ప్లే చేసింది.

"తొందరగా మీరు కాపలా కాస్తున్న గది తెరిచి అందులో ఏముందో చెప్పండి..." అని పలికింది.

ఆ మాట వింటే ఎవరైనా సరే చాంగ్ లీ నే చెప్పాడేమో అన్నట్టు ఉంది. రూహి తెలివి చూసి అయాన్ కూడా ఆశ్చర్యపోయాడు.

రూహి వెంటనే ఒక్కో గది ముందు ఉన్న సైనికులకు ఇంటర్ కామ్ లో కనెక్ట్ అయ్యి తను తయారు చేసిన ఆడియో వినిపించింది. అయాన్ కూడా ఇంకో వైపు నుంచి అదే పని చేస్తున్నాడు. అలా ఒక అరగంట తరువాత మొత్తం అన్ని గదులు వెతికేశారు. కానీ ఆ రహస్య గది మాత్రం ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు.

రూహి కి అయాన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. తాము ఎక్కడ తప్పు చేసారో తెలియలేదు. ఇప్పుడు ఎటు వైపు అడుగు వేయాలో తెలియక నిరాశ గా నిలబడి పోయారు.

అప్పుడే వారికి చాంగ్ లీ నవ్వు వినిపించింది. ఇద్దరు తల తిప్పి చూసారు.

"ఏంటి రూహి, నువ్వు వెతికేది దొరకలేదు కద. ఇందాక నువ్వు చెప్పినట్టుగా ఆ రావణాసురుడిని నేనే. రావణుడి ప్రాణం కడుపులో ఉన్నట్టు నా రహస్యం నాలోనే ఉంటుంది. నన్ను దాటి బయటకు రాదు. నీకు ఎప్పటికీ అది దొరకదు " అంటూ మరింత పెద్దగా నవ్వాడు.

ఎంత కష్టపడినా సరే అక్కడే ఆగిపోవడం తో రూహి లో కోపం కట్టలు తెంచుకుంది. తన పక్కన ఉన్న వస్తువులు అన్ని చెల్లా చెదురుగా విసిరేసింది. ఆ వస్తువులు వెళ్లి పక్కనే ఉన్న షెల్ఫ్ కి తగిలి అక్కడున్న బొమ్మలు కూడా కింద పడి విరిగిపోయాయి. చాంగ్ లీ నవ్వు మరింతగా పెరిగింది. ఆ నవ్వు వింటుంటే రూహి లో ఆవేశం మరింత ఎక్కువైంది. తన పక్కనే ఉన్న కత్తి తీసుకొని వాడి మీదకు వెళ్ళింది.

సరిగ్గా అప్పుడే...
"ఆవేశం కనిపించే వెలుగును కూడా కప్పేస్తుంది. ఆలోచన కటిక చీకటి లోను దారి చూపుతుంది." అనే మాట వినిపించింది.

రూహి టక్కున ఆగి వెనక్కి తిరిగి చూసింది.

"ఈ మాట మీ నాన్న గారు ఏజెంట్ విక్రమ్ వాసుదేవ్ చెప్పారు. అప్పుడే మర్చిపోయారా మేడమ్." అంటూ అయాన్ గుర్తుచేసాడు.

ఆ మాట తో రూహి ఆగిపోయింది. ప్రశాంతంగా అక్కడే కింద కూర్చుంది. నాన్న రూపం గుర్తురావడం తో తనలో ఆవేశం తగ్గి ఆలోచన మొదలైంది. ఆ ఆలోచనల్లో నుంచి ఇందాక చాంగ్ లీ చెప్పిన మాట గుర్తొచ్చింది.
"రావణుడి ప్రాణం తన కడుపులో ఉన్నట్టు ఆ రహస్యం కూడా నాలోనే ఉంటుంది. " అని..
ఆ మాట పదే పదే మనసులో మననం చేసుకుంది. ఈ ఫ్యాక్టరీ లో ఉన్న ప్రతి గది వెతికేసాం. ఇక మిగిలింది ఈ చాంగ్ లీ గది మాత్రమే.. అంటే ఆ రహస్య గది కూడా ఇక్కడే ఉందా.. ఆ ఆలోచన రాగానే రూహి కళ్ళు మెరిసాయి.

"అయాన్.. ఆ రహస్య గది కి చేరే మార్గం ఈ గదిలోనే ఉంది. జాగ్రత్తగా వెతుకు." అని ఆదేశించింది.

రూహి నుంచి ఆ మాట రాగానే చాంగ్ లీ మోహం లో నవ్వు మాయం అయ్యి రంగులు మారాయి. అది చూసాక రూహి అనుమానం నిజమైంది.

ఇద్దరు ఆ గది మొత్తం క్షుణ్ణంగా వెతికారు. కానీ ఎక్కడ ఎలాంటి ఆధారం దొరకలేదు. అది మీకు దొరకదు అన్నట్టు చాంగ్ లీ మనసులోనే నవ్వుకున్నాడు.

సరిగ్గా అప్పుడే రూహి చూపు... వారికి ఎదురుగా ఉన్న షోకేస్ షెల్ఫ్ మీద పడింది. అక్కడ చాలా రకాల బొమ్మలు ఉన్నాయి. ఇందాక కోపం లో వస్తువులు విసిరినప్పుడు ఆ షెల్ఫ్ లో ఉన్న అన్ని బొమ్మలు కొంచెమైనా పక్కకు జరిగాయి. కానీ మధ్యలో ఉన్న ఏనుగు బొమ్మ మాత్రం అలాగే కదలకుండా ఉంది.

రూహి మెల్లగా దాని దగ్గరకు వెళ్ళింది. ఆ ఏనుగు బొమ్మను చేతిలోకి తీసుకోవాలని చూసింది. కానీ అది రాలేదు. ఈసారి దాన్ని బలంగా ఎడమ వైపుకు తిప్పింది. అంతే...
పెద్ద శబ్దం చేస్తూ ఆ షెల్ఫ్ పక్కకు జరిగింది. రూహి, అయాన్ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి పోయారు. ఆ షెల్ఫ్ పక్కకు జరిగి అక్కడొక తలుపు ప్రత్యక్షం అయ్యింది. దాన్ని చూసి రూహి లో ఆనందం కలిగింది. వెంటనే తన దగ్గర ఉన్న కీ, మరియు చాంగ్ లీ వేలి ముద్ర సాయం తో దాన్ని తెరిచింది.

లోపల ఒక హార్డ్ డిస్క్ కనిపించింది. వాటిలోనే తమకు కావాల్సిన సమాచారం ఉందని అర్థమైంది. వాటిని చూస్తే అసలు చైనా ఇండియా మీద ఏం చేయబోతుందో అర్థమవుతుంది. అప్పుడు మనం సులభంగా కాపాడుకోవచ్చు అనుకొని తనలో సంతోషం కలిగింది. తను అలా ఆనందంలో మునిగిపోయి ఉండగా...

"మేడమ్.. ఒకసారి ఇటు రండి." అని అయాన్ గట్టిగా పిలిచాడు. రూహి వేగంగా అటు వెళ్ళింది.

"మేడమ్ ఇందాక నేను చంపిన సైనికులను మిగతా సైనికులు చూసారు అనుకుంటా.. వారంతా ఈ గది వైపే వేగంగా వస్తున్నారు. సుమారు వంద మంది దాకా ఉంటారు." అంటూ అయాన్ కంగారుగా పలికాడు.

రూహి వెంటనే అక్కడున్న శాటిలైట్ ఫోన్ నుంచి బయట తమ కబురు కోసం ఎదురుచూస్తున్న పార్వతి, వంశీ లకు ఫోన్ చేసింది.

"ఎలా ఉన్నారు మేడమ్." అని అడిగారు.

"కుశల ప్రశ్నలకు సమయం లేదు. దీపావళి పండగ చేసుకోవాలి. టపాసులు తీసుకొని లోనికి వచ్చేయండి." అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

"ఏంటి మేడమ్ మీరు అనేది. బయట వంద మంది ఉన్నారు. వారిని ఎదురించలేము. వెనుక వైపు నుంచి పారిపోదాం పదండి"

"ఎదురుగా ఎంత మంది ఉన్నా నేడు నా పాదం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయదు. పారిపోవడం కాదు పరిగెత్తిద్దాం..." అంటూ రూహి స్థిరంగా పలికింది.

"చావంటే భయం లేదా మేడమ్ మీకు." అని అయాన్ ఆశ్చర్యంగా అడిగాడు.

"సైనికుడంటే చావుకు భయపడటం కాదు, చావుకు భయం నేర్పాలి. ఒక్కొక్కడిని పరిగెత్తించి కొడదాం.. ఇంకోసారి ఇండియా పేరు చెప్తే వణికిపోవాలి."

అది విని చాంగ్ లీ పెద్దగా నవ్వాడు.
"అది నీ వల్ల కాదు. ఈరోజు మా వాళ్ళ చేతిలో మీ ప్రాణాలు పోవడం ఖాయం. ఆ తరువాత మీ దేశాన్ని ఓడించి మా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను." అంటూ బిగ్గరగా నవ్వాడు.

ఒక క్షణం తరువాత ఆ నవ్వు స్థానం లో పెద్ద ఆర్త నాదం మొదలయింది. ఎందుకంటే అప్పటికే రూహి చేతిలో నుంచి ఓ కత్తి వేగంగా వచ్చి చాంగ్ లీ చేతిని నరికేసింది.
చాంగ్ లీ నొప్పి తో విల విల లాడిపోయాడు.

రూహి వాడి కళ్ళలోకి చూస్తూ...
"మరుగుతున్న నా రక్తం మీద ఒట్టు, ఉవ్వెత్తున ఎగసిపడే నాలోని దేశ భక్తి మీద ఒట్టు,..
నీ యబ్బ నీకు, నీ దేశానికి దమ్ముంటే నా భారత దేశపు ఓ మట్టి గడ్డను తాకి చూడు రా చూద్దాం.. నిన్ను, నీలాంటి తీవ్రవాదుల తలలు నరికి నా దేశానికి కంచె వేయకపోతే నేనసలు విక్రమ్ వాసుదేవ్ కూతురినే కాదు. నా పేరసలు రూహి వాసుదేవే కాదు."
అంటూ తన చేతిలోని కత్తి ఆ చాంగ్ లీ గుండెల్లోకి దింపింది

రూహి పరాక్రమం చూసి అయాన్ గుండె కూడా క్షణ కాలం వణికింది. రూహి మాత్రం శత్రు సంహారం చేయడానికి తుపాకీ పట్టుకొని బయటకు నడిచింది.



" ఏజెంట్ రూహి వాసుదేవ్...15 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 7 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 19-05-2026, 08:20 AM



Users browsing this thread: 1 Guest(s)