Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏజెంట్ రూహి వాసుదేవ్
#16
ఏజెంట్ రూహి వాసుదేవ్...8



రూహి వాసుదేవ్ తన తెలివి తో లీజా ఆటోమొబైల్స్ సీఈఓ లీ జాంగ్ ని ఆఫీస్ నుంచి గోల్ఫ్ కోర్టుకు వచ్చేలా చేసింది. అది చూసి బ్లాక్ కోబ్రా బృందం మొత్తం ఆశ్చర్యం లో మునిగిపోయారు.

"పొగ పెట్టి కలుగులో ఉన్న ఎలుకను బయటకు తీసుకొని వచ్చాం. ఇక దాన్ని బోనులో బందించడమే తరువాయి..." అని రూహి అనడం తో అందరూ ఈలోకం లోకి వచ్చారు.

"మేడమ్, ఇప్పుడు కూడా ఆ లీ జాంగ్ చుట్టూ చాలా మంది సెక్యూరిటీ వాళ్లు ఉన్నారు కదా.. వారిని దాటి అతన్ని ఎలా కిడ్నాప్ చేస్తాం. అది అసలు జరిగే పనేనా. వారికి దొరికితే మన ప్రాణాలు పోతాయి" అని వంశీ సందేహంగా తడబడుతూ చెప్పాడు.

"మీకొక విషయం చెప్పాలి. రావణాసురుడు సీతమ్మవారిని దండకారణ్యం నుంచి లంకకు ఎత్తుకొని వెళ్ళాడు. ఆ రెండిటి మధ్య దూరం సుమారు 2000 కిలోమీటర్లు... రాముడు అన్ని కిలోమీటర్లు దాటి వెళ్తే.. ఎదురుగా లంకను చేరాలి అంటే మధ్యలో ఓ పెద్ద సముద్రం అడ్డుగా ఉంది.
దాని లోతు తెలీదు. అందులో ఎలాంటి ప్రమాదం ఉందో తెలీదు. ఎంత దూరం విస్తరించి ఉందో తెలీదు.
కానీ తన గుండెల్లో మాత్రం సీతమ్మని చేరాలనే దృఢ సంకల్పం మాత్రం అలానే ఉంది. ఆ సంకల్పమే... ఎగసి పడే సముద్రపు అలల మీద నడిచి వెళ్లే రాజ మార్గం సృష్టించింది.

ఆనాడు ఆ సంద్రం చూసి ఆగిపోయి ఉంటే రామాయణం పూర్తి అయ్యేదా? రాముడు దేవుడు అయ్యేవాడా?
మన సంకల్పం బలంగా ఉంటే మనల్ని ఆపేది ఎవరు? మనకు అడ్డుగా నిలిచేది ఎవరు?"

రూహి చెప్పింది విని బృందం మొత్తం అవును అన్నట్టు తల ఆడించారు. అందరిలోనూ స్ఫూర్తి రగిలింది.

ఆ తరువాత రూహి అందరి వైపు తిరిగి, ఎవరెవరు ఏమేమి చేయాలో మొత్తం వివరంగా చెప్పింది.

"ఇప్పుడు ఈ లీ జాంగ్ కనీసం మరో గంట పాటు గోల్ఫ్ ఆడుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి అన్నా సరే ఈ గంట లోనే చేయాలి.
మనం ఆ లీ జాంగ్ ని ఈ సెక్యూరిటీ కళ్ళు గప్పి కిడ్నాప్ చేయడం చాలా కష్టం. కానీ ఒకే ఒక దారి ఉంది. అదే సొరంగం...
లీ జాంగ్ ఈ గోల్ఫ్ కోర్టు నుంచి ఇంటికి వెళ్లే దారిలో ఒక సొరంగం వస్తుంది.  అతని వాహనాలు అన్ని ఆ సొరంగం గుండానే వెళ్ళాలి. సుమారు 45 సెకండ్లు పాటు అవి అందులో ఉంటాయి. అంతకు మించిన అవకాశం మరొకటి దొరకదు. ఆ చీకటి లో మన పని ముగించేద్దాం."

అని అందరి వంక చూసింది. ఆ తర్వాత రూహి మిగతా వారికి కూడా ఏమేమి చేయాలో మొత్తం వివరంగా చెప్పింది. అందరూ చాలా శ్రద్దగా తను ఏం చెప్పిందో విని, అర్థమైంది అన్నట్టు తల ఆడించారు.

"గుర్తుంచుకోండి... మరో అవకాశం ఇవ్వడానికి మనం గెలుపు ఓటమి ఆట ఆడటం లేదు. చావు బ్రతుకుల ఆట ఆడుతున్నాం. ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండండి" అని రూహి హెచ్చరించింది. అందరూ సరే అంటూ అక్కడి నుంచి ఎవరికి అప్పగించిన పని వారు చేయడం కోసం విడిపోయారు.

ముందుగా... పార్వతి ఆ గోల్ఫ్ కోర్ట్ లో ఉన్న హోటల్ లోకి అడుగు పెట్టింది. అక్కడ ఉన్న సోఫా లో కాసేపు కూర్చొని అక్కడ పని చేసే వెయిటర్స్ ని గమనిస్తూ ఉంది. ఇంతలో ఒక వెయిటర్ మెట్ల మార్గం గుండా పైకి వెళ్లడం గమనించి మెల్లగా తన వెనుక వెళ్ళింది. ఒకసారి చుట్టూ చూసింది. సమీపంలో ఎవరూ కనిపించలేదు. అదే సరైన సమయం అని ఆ వెయిటర్ భుజం మీద చెయ్యి వేసి పిలిచింది. తను మెల్లగా వెనక్కి తిరిగింది. ఈలోగా పార్వతి తన దగ్గర ఉన్న మత్తు మందు చల్లిన కర్చీఫ్ తో ఆ వెయిటర్ ముక్కును గట్టిగా అదిమింది. కొన్ని క్షణాల్లోనే తను స్పృహ తప్పి పడిపోయింది. పార్వతి మెల్లగా తనని పక్కనే ఉన్న స్టోర్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళింది. ఆ తరువాత తన బట్టలు వెయిటర్ కు, వెయిటర్ బట్టలు తనకు మార్చింది. ఇప్పుడు పార్వతి అచ్చం వెయిటర్ లాగా తయారు అయ్యింది.

అక్కడి నుంచి నేరుగా క్యాంటీన్ లోకి వెళ్ళింది. అక్కడ చాలా రకాల జ్యూసులు ఉన్నాయి. వెంటనే వాటిని కొన్ని గ్లాసులలోకి పోసుకొని ఒక గ్లాస్ లో మాత్రం తన వెంట తెచ్చిన పౌడర్ కొంచెం కలిపింది. ఆ తరువాత మెల్లగా నడుస్తూ బయటకు వచ్చింది. తనకు కాస్త దూరం లో కొంతమంది యూనిఫామ్ వేసుకొని వరుసగా కూర్చున్నారు. వారికి ఆ గ్లాసులు ఇస్తూ వెళ్ళింది. తను పౌడర్ కలిపిన గ్లాస్ మాత్రం అందులో కూర్చున్న ఆరో వ్యక్తికి అందేలా చేసింది. ఆ వ్యక్తి మరెవరో కాదు... లీ జాంగ్ కారు డ్రైవర్.

అతను పార్వతి ఇచ్చిన జ్యూస్ తాగాడు. మొదట కొన్ని నిమిషాలు బాగానే ఉన్నాడు. కానీ ఆ తరువాత అతని కడుపులో గుడ గుడ మొదలైంది. ఇక ఆపుకోలేక లేచి బాత్ రూమ్ వైపు పరుగున వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే బాత్రూం బయట పార్వతి నిలబడింది.

"సార్.. ఇక్కడ వాష్ రూమ్స్ క్లీన్ చేస్తున్నారు. దయచేసి పై అంతస్తులో ఉన్న వాటిని ఉపయోగించండి. " అని అంది.

ఆ డ్రైవర్ పరిగెత్తుకుంటూ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు. వాష్ రూమ్ లోపలకు అడుగు పెట్టి తలుపు వేసాడు. సరిగ్గా అప్పుడే ఆ తలుపు వెనుక ఒకరు నిలబడి కనిపించారు. తను ఎవరో కాదు.. రూహి వాసుదేవ్..

తనని చూడగానే డ్రైవర్ కళ్ళు ఆశ్చర్యం తో పెద్దవి అయ్యాయి. అలా చూస్తూ ఉండిపోయాడు. అరుద్దామని నోరు తెరవబోయాడు. కానీ రూహి వాడికి మరో అవకాశం ఇవ్వకుండా అతని మెడ దగ్గర తన చూపుడి వేలు, మధ్య వేలి తో కలిపి ఓ పోటు పొడిచింది. దెబ్బకు ఆ డ్రైవర్ వెనక్కి విరుచుకుంటూ అలాగే స్పృహ తప్పి పడిపోయాడు.
అది చూసి రూహి వెంటనే ఫోన్ చేసి అయాన్ ని పిలిచింది.
అయాన్ వేగంగా అక్కడికి వచ్చి, ఆలస్యం చేయకుండా ఆ డ్రైవర్ బట్టలు తను వేసుకొని మొహాం సరిగా కనపడకుండా మాస్క్ పెట్టుకున్నాడు.

అలా చూస్తూ ఉండగానే గంట సమయం గడిచిపోయింది. ఇక లీ జాంగ్ గోల్ఫ్ కోర్ట్ ని వదిలి ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైంది. బ్లాక్ కోబ్రా బృందం కూడా దాని కోసమే ఎదురుచూస్తూ ఉన్నారు.

మోహం పూర్తిగా కనపడకపోవడం తో అయాన్ ని ఎవరూ గుర్తుపట్టలేదు. తను కూడా చాలా ధైర్యంగా, ఎక్కడా తొనకకుండా వెళ్లి లీ జాంగ్ కారు లో డ్రైవర్ లాగా కూర్చున్నాడు. అలా అతని కన్వాయ్ మొదలైంది. ముందు మూడు కార్లు, వెనుక మూడు కార్లు... మధ్యలో లీ జాంగ్ కారు వెళ్తుంది.

లీ జాంగ్ కారులో కూర్చొని ఫోన్ చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో తాము ఎదురుచూస్తున్న సొరంగం రానే వచ్చింది. ఆ కారు నడుపుతున్న అయాన్ గుండె వేగం అమాంతం పెరిగింది. ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. కారు వేగం కొంచెం తగ్గించాడు. దాంతో తన వెనుక వస్తున్న కార్ల వేగం కూడా తగ్గాయి. అలా కార్లు అన్ని మెల్లగా ఆ సొరంగం లోకి వెళ్లాయి.

సరిగ్గా దాని కోసమే ఎదురుచూస్తున్న వంశీ... తన కంప్యూటర్ తో ఆ సొరంగం లో విద్యుత్ దీపాలను ఆపరేట్ చేసే సిస్టమ్ ని హ్యాక్ చేసి ఉన్నపళంగా లైట్లు అన్ని ఆఫ్ చేశాడు. మొత్తం చీకటిగా మారిపోవడం తో ఒక్కసారిగా అందరికీ ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ కార్లు అన్ని ఆధునిక టెక్నాలజీ తో తయారు చేసినవి అవ్వడం కూడా బ్లాక్ కోబ్రా బృందానికి కలిసివచ్చింది. ఎందుకంటే వంశీ వాటిని కూడా హ్యాక్ చేసి కారు లైట్లు ఆన్ అవ్వకుండా చేశాడు.

సరిగ్గా అదే సమయం లో... లీ జాంగ్ ప్రయాణం చేసే కారును పోలిన ఓ కారు వేగంగా సొరంగం లోకి వచ్చింది.
ఆ కారును రూహి నే ఏర్పాటు చేసింది.  లీ జాంగ్ కారు నడుపుతున్న అయాన్ తన కారును వరుస లో నుంచి పక్కకు తప్పించడం, అలాంటి నకిలీ కారు వరుసలోకి రావడం... రెండు చక చకా జరిగిపోయాయి.

ఈలోగా కార్లు అన్ని సొరంగం నుంచి బయటకు వచ్చాయి. ముందు కారు కనిపించడం తో సెక్యూరిటీ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే... అది డూప్లికేట్ కారు... నిజమైన లీ జాంగ్ కారు ని రూహి బృందం అప్పటికే కిడ్నాప్ చేసింది అని...

అయాన్ తను నడుపుతున్న కారును వేరే దారిలోకి తీసుకొని వెళ్ళాడు. నగరానికి కొంచెం దూరం లో పాడుబడి ఉన్న ఓ భవంతి ముందు కారును ఆపాడు. లీ జాంగ్ అప్పటిదాకా ఫోన్ లో పడి దారి కూడా చూసుకోలేదు.కారు ఆగడం తో ఇంటికి వచ్చామేమో అని మెల్లగా కారు దిగి చుట్టూ చూసి షాక్ అయ్యాడు. కొన్ని క్షణాలు అలాగే కదలకుండా ఉండిపోయాడు.

సరిగ్గా అప్పుడే
"ప్రయాణం ఎలా జరిగింది..." అని ఓ గొంతు వినిపించింది.

లీ జాంగ్ ఉలిక్కిపడుతూ వెనక్కి తిరిగి చూసాడు. తన ముందున్న రూపం చూసి అతని గుండె కొన్ని క్షణాలు ఆగిపోయింది. ఒళ్ళంతా చమటలు పట్టేసాయి.
తన ముందు నవ్వుతూ నిలబడింది మరెవరో కాదు...
ఏజెంట్ రూహి వాసుదేవ్...

-----------------------------------------------------------

హైదరాబాద్ ...

సరిగ్గా అదే సమయం లో కిరాయి రౌడీ జలంధర్ ప్రశాంతంగా టీవీ చూస్తూ ఉండగా... అతని మనుషులు పరుగున తన దగ్గరకు వచ్చారు.

వారిని అలా చూసి..
"ఏమైంది రా " అని కటువుగా అడిగాడు

"మనం ఇప్పటిదాకా వెతుకుతున్న అమ్మాయి, అదే సుజిత ఎక్కడ ఉంటుందో తెలిసింది బాస్..." అని ఆయాసపడుతూ సమాధానం ఇచ్చారు.

ఆ మాట వినగానే జలంధర్ మోహం లో మెరుపు వచ్చింది. వెంటనే తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. కొన్ని క్షణాలు పాటు వారితో మాట్లాడాడు. ఆ తరువాత తన మనుషుల వైపు తిరిగాడు.

"మీరు వెంటనే వెళ్లి దాన్ని చంపేయండి రా..." అని ఆదేశించాడు.

ఆ మాట వినగానే నలుగురు రౌడీలు సరే అని తల ఊపుతూ కత్తులతో సుజితను చంపడానికి బయలుదేరారు. జలంధర్ తన మనిషులు వెళ్లిన వైపు చూసి తృప్తిగా నిట్టూర్చాడు.

" ఏజెంట్ రూహి వాసుదేవ్...8 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 10 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 15-05-2026, 06:21 AM



Users browsing this thread: 1 Guest(s)