Thread Rating:
  • 5 Vote(s) - 4.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏజెంట్ రూహి వాసుదేవ్
#11
[Image: cover?seriesId=485271&version=e0736d03-4...e122606d44]

ఏజెంట్ రూహి వాసుదేవ్...6





రూహి బృందం ఆ అర్ధరాత్రి వేళ జాంగ్ గ్వాన్ అనే అస్త్రం ఉపయోగించి సురక్షితంగా ఒక మధ్య తరగతి ఇంట్లోకి చేరుకున్నారు. అక్కడి ప్రజలు మిలిటరీ వాళ్ల చేతిలో పడుతున్న బాధలు విని కరిగిపోయారు. కాని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు.

సరిగ్గా అప్పుడే వారికి ఒక అమ్మాయి ఆర్త నాదాలు వినిపించాయి. ఆ అరుపులు వినగానే అందరూ కిటికీ లో నుంచి బయటకు తొంగి చూసారు. అక్కడ ఇద్దరు సైనికులు ఒక చిన్న పిల్లని లాక్కొని వెళ్తున్నారు. ఆ పాప వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆ పాప తల్లి దండ్రులు నిస్సహాయంగా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. మిగతా వారు దాన్ని చోద్యం లా చూస్తున్నారు

"ఇందాక చెప్పా కదా. ఆ రాక్షసులు ఈరోజు కూడా వచ్చారు. ఆ పాపకు సరిగ్గా 6 సంవత్సరాలు ఉంటాయేమో.. ఈరోజు ఆ మృగాల చేతిలో బలి అవుతుంది. " అని బ్లాక్ కోబ్రా టీం కి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి అన్నాడు. ఆ మాట అందరి మనసులని మరింతగా కలిచి వేసింది. రూహి రక్తం మరిగిపోయింది.

"ఈ దుర్మార్గులను ఆపాలంటే ఆ దేవుడే మరో అవతారం ఎత్తి రావాలేమో..." అని అతను మాట పూర్తి చేసే లోగా ఢాం అంటూ తూటా పేలింది.

ఒక్క క్షణం అక్కడ నుంచున్న అందరూ ఏమైందో అర్థం కాక ఆశ్చర్యం తో బిగుసుకొని ఉండిపోయారు. కాని వారు తేరుకునేలోగా మరో సారి రూహి చేతిలోని తుపాకీ నుంచి తూటా దూసుకొని వెళ్ళింది. అందరూ భయం భయంగా కిటికీ లో నుంచి బయటకు చూసారు. అక్కడ నార్త్ కొరియా సైనికులు ఇద్దరు అచేతనంగా పడి ఉన్నారు. వారి తలలో నుంచి నెత్తురు ధారగా కారుతుంది.

ఆ ఇంట్లో ఉన్న అందరూ రూహి వంక అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు. ఒక్క నిమిషం అక్కడ ఏం జరిగిందొ వారికి అర్థం కాలేదు. అర్థమయ్యాక నోట మాట పడిపోయింది.

రూహి మెల్లగా ఆ ఇంట్లో ఉన్న అతని వైపు తిరిగింది.
"దుర్మార్గులను చంపడానికి ప్రతి సారి దేవుడు మనిషి అవతారంలోనే పుట్టడు. కొన్ని సార్లు మనలో ధైర్యం, తెగింపు అనే ఆలోచనలలో పుడతాడు. " అని అంది. అతను రూహి వంక అలా చూస్తూ ఉండిపోయాడు.

రూహి మెల్లగా తలుపు తెరిచి బయటకు అడుగుపెట్టింది. ఆ సైనికులను చంపిన చోటుకు వెళ్ళింది. అక్కడ ఉన్న పాప తల్లిదండ్రులు రూహి చేతిలో ఉన్న తుపాకీ వంక చూసారు. తమ పాపను తనే కాపాడింది అని అర్థమై చేతులు ఎత్తి నమస్కారం చేసారు.

అప్పటికే అక్కడ చాలా మంది ఆ కాలనీ ప్రజలు గుమి గుడారు. అందరూ రూహి వాసుదేవ్ నే చూస్తున్నారు. వారి మొహాల్లో ఆ సైనికులు చచ్చారు అనే ఆనందం కనిపిస్తుంది. అదే సమయంలో ఇప్పుడు ఏమవుతుందా అనే భయం కూడా కనిపిస్తుంది.

రూహి వారి అందరి వంక చూస్తూ మెల్లగా పెదవి విప్పింది.
"చచ్చిన ఈ మృగాలను చూడటానికి చనిపోయిన మనుషులు చాలా మంది వచ్చారే..." అని నవ్వింది.

అక్కడున్న ప్రజలు అందరూ ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.

"నిజమే కదా.. కళ్ళ ముంది ఇంత అన్యాయం జరుగుతున్నా సరే నోరు మెదపక మౌనంగా ఉండిపోయిన మీరు బ్రతికి ఉన్నారని ఎలా అనుకోమంటారు. " అని ప్రశ్నించింది.

ఆ మాట వినగానే కొంతమంది తప్పు చేసిన వారి లాగా తల దించుకున్నారు.
"వారికి ఎదురు తిరిగితే మా ప్రాణాలు పోతాయి." అంటూ ఒకరు ధైర్యం తెచ్చుకొని బయటకు అన్నారు.

"భరిస్తే బ్రతుకంతా చావే. తెగిస్తే చావైనా విజయమే... పోరాడండి. మీరంతా కలిసి ఎదురుతిరిగితే మీ ముందు ఈ  దుర్మార్గులు అర క్షణమైనా నిలువ గలరా..."

"మా దగ్గర ఆయుధాలు లేవుగా ." ఇంకొకరు సందేహంగా అన్నారు.

"నీ భార్యను, కూతురుని నీ ముందే తీసుకొనివెళ్తుంటే నీ గుండెల్లో మంట రగులుతుంది చూడు... దాన్నే ఆయుధంగా చేసుకో.. శత్రువును ఆ మంటల్లో కాల్చేయ్.
భయపడే వాడి ముందు ఎన్ని ఉన్నా వృధానే,
అదే తెగించిన వాడికి వాడి చెయ్యే ఓ ఆయుధం.
రాళ్లు విసరండి. కర్రలతో కొట్టండి. ఇంట్లో కూరగాయలు బదులు ఈ దుర్మార్గుల తలలు నరకండి. అంతే కాని చేత కాదని, చేవ లేదని మౌనంగా మాత్రం ఉండకండి." అంటూ రూహి మరింత ఆవేశంగా పలికింది.

ఇంతలో రూహి కి ఆ కాలని లో పక్కనే ఉన్న పాడు బడ్డ బావి కనిపించింది. ఆ సైనికులను అందులోకి విసిరేసింది. తరువాత అక్కడున్న బండిలో నుంచి పెట్రోల్ తీసి వారి మీద చల్లింది.

"తెల్లారే సరికి ఈ సైనికుల శవాలు కూడా మిగలవు. ఎవరూ ఏమీ తెలియనట్టు మీ పనుల్లో మీరు మునిగిపోండి. ఎవడూ వీరి గురించి పట్టించుకోరు. ఈ దేశం లో మనిషి ప్రాణానికి ఎంత విలువ ఇస్తారో నాకంటే బాగా మీకే తెలుసు. ఒకవేళ రేపు కూడా ఎవరైనా ఇలాగే మీ ఇంట్లో ఆడవాళ్ళ కోసం వస్తే... ఏం చేయాలో మీకు అర్థమైంది అనుకుంటా. ఒక్క నాకొడుకును కూడా వదలకండి. నేను రగల్చిన ఈ మంటను మీ గుండెల్లో వెలిగించండి.." అంటూ అగ్గిపుల్ల గీసి అందులోకి వేసింది. ఆ మంటల్లో ఆ సైనికుల శవాలు కాలిపోతున్నాయి.

రూహి అక్కడి నుంచి మెల్లగా ముందుకు నడిచింది. ఆ కాలనీ వాసులు అందరికి రూహి ఆ క్షణం తమ ప్రాణాలు కాపాడడానికి వచ్చిన ఓ అపర భద్ర కాళీ లాగా కనిపించింది. అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెల్లో స్ఫూర్తి నిండింది. దాంతో ఇక ఎవరు వచ్చినా తెగించి పోరాడగలం అనే నమ్మకం అయితే కలిగింది.

రూహి ఇంట్లోకి రాగానే...
"ఏంటి మేడమ్ మీరు చేసింది." అని పార్వతి అదురుతున్న గుండె తో అడిగింది.

రూహి తన వంక నేనేం చేసానో చూడలేదా అన్నట్టు చూసింది.

"అది కాదు మేడమ్.. ఇక్కడికి మన దేశం పని మీద వచ్చాం. ఈ దేశ ప్రజలు ఎటు పోతే మనకెందుకు.. ఇవన్నీ మనకు అవసరమా..." అని అంది.

రూహి తన కళ్ళలోకి చూస్తూ...
"మనిషికి సరిహద్దులు ఉంటాయేమో, మానవత్వానికి కాదు.
అయినా నీకొక విషయం చెప్పనా...
మన దేశం లో సాటి మనిషికి సహాయం చేస్తే.. నన్ను రూహి అని పిలుస్తారు.
అదే పరాయి దేశం లో ఒకరికి సహాయం చేస్తే నన్ను ఏమంటారో తెలుసా.. ఒక ఇండియన్ అని అంటారు.
అది కూడా మన దేశానికే కదా గర్వ కారణం.
నా భారత దేశం అంటే మన ప్రజల మనసులోనే కాదు, ప్రపంచం దేశాల గుండెల్లో కూడా ఒక గౌరవం రావాలి."

రూహి చెప్పింది విని బ్లాక్ కోబ్రా టీం లో ఉన్న అందరి గుండెలు గర్వం తో ఉప్పొంగాయి. రూహి ని ఎలా పొగడాలో అర్థం కాలేదు. తన మీద గౌరవం మరింతగా పెరిగింది. గుండెల నిండా గాలి పీల్చుకొని సెల్యూట్ చేసారు. రూహి ఒక చిన్న చిరునవ్వు నవ్వి తన గదిలోకి వెళ్ళిపోయింది. అందరూ తన వంకే చూస్తూ ఉండిపోయారు.

ఆకాశం లో రూహి ని చూస్తూ విక్రమ్ వాసుదేవ్ మనస్ఫూర్తిగా మురిసిపోయాడు.

---------------------------------------------------------------

తరువాతి రోజు...

రూహి ఉదయం లేచే సమయానికి ఆ ఇంట్లో ఉండే పాప కాలేజ్ కి రెడీ అవుతుంది. రూహి లేవడం చూసి, మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి తనకు ఒక కాఫీ కప్పు ఇచ్చింది. రూహి కి ఆ పాప చాలా ముద్దుగా అనిపించింది. దగ్గరకు పిలిచింది.

ఆ పిల్ల కళ్ళు ఆశ్చర్యమో, భయమో తెలీదు కానీ టప టపమని మూసుకుంటున్నాయి. ఆ పాప తనని చూసి భయపడుతుంది అని రూహి కి అర్ధమై తన బ్యాగ్ లో నుంచి ఒక చాకొలేట్ తీసి ఇచ్చింది. ఆ పాప మెరుస్తున్న కళ్ళతో తీసుకుంది.

"నీ పేరేంటి?" అని రూహి చిన్నగా అడిగింది.

"Soo-A (సూయా) " అని ముద్దు ముద్దు మాటలతో చెప్పింది.

"అంటే అర్థం ఏంటి " అని రూహి ప్రశ్నించింది

"కలువ పువ్వు "అని ఆనందంగా చెప్పింది.

"అందమైన పేరు. నీ పేరు నీ కన్నులు చూసి పెట్టరేమో... నిజంగా అలాగే ఉన్నాయి. " అని రూహి అంటే ఆ పాప నవ్వుతూ సిగ్గు పడింది. తనని అలా చూస్తూ రూహి ముచ్చట పడింది. వెంటనే తన ఫోన్ లో ఆ పాప ఫోటో తీసింది. ఆ తరువాత ఆ పాపకు తన ఫోటో చూపించగానే, సూయా కళ్ళు నక్షత్రాలు మాదిరి మెరిసిపోయాయి. రూహి నవ్వుతూ ఆ పాపను చూస్తుంది.

ఇంతలో మేడమ్ అని పిలవడం తో రూహి వెంటనే వంశీ వైపు తిరిగి ఏమైంది అన్నట్టు చూసింది.

"మనల్ని విమానాశ్రయం దగ్గర నకిలీ అధికారుల వేషం లో వెంబడించిన వాళ్లు, అలాగే హోటల్ లో దాడి చేసిన వాడి దగ్గర ఒక గుర్తు చూసాం కదా.."
[Image: image?pratilipiId=6755373531477026&name=...0&type=jpg]

రూహి అవును అన్నట్టు తల ఊపింది.

"ఆ ఇద్దరి ఫోన్లు చెక్ చేశాను. వారికి చివరగా ఫోన్ వచ్చింది ఒకే నంబర్ నుంచి..."

"ఎవరిదా నంబర్?" అని రూహి ఆశ్చర్యంగా అడిగింది.

"ఎవరో లీ జాంగ్ అని ఉంది మేడమ్. అంతకు మించి మరే వివరాలు లేవు."

రూహి ఆలోచనలో పడిపోయింది. ఇంత పెద్ద నగరం లో ఆ పేరు, ఆ బొమ్మ తో వాడిని ఎలా వెతకాలో అర్థం కాలేదు. తను ఇలా ఆలోచనలో ఉండగానే... సూయా పాప పరుగున రూహి దగ్గరకు వచ్చింది. ఆ పాప రూహి ఫోన్ లో తన ఫోటో చూస్తూ... మరిన్ని ఫోటోల కోసం స్క్రీన్ పక్కకు జరిపింది. అప్పుడే... రూహి బృందం మాట్లాడుతున్న బొమ్మను చూసింది.

"ఇది నాకు తెలుసు.. " అని అంది.

అది వినగానే రూహి కళ్ళు పెద్దవి అయ్యాయి. నిటారుగా అయ్యింది.

"ఈ బొమ్మ నీకు తెలుసా? ఎక్కడ చూసావ్? " అని ప్రశ్నించింది.

ఇప్పుడే వస్తాను అని ఆ పాప ఇంట్లోకి పరుగు తీసింది. ఆ పాప ఏం చేస్తుందా అని రూహి ఎదురుచూస్తూ ఉంది. కాసేపటికి ఆ పాప పరిగెత్తుకుంటూ ఒక ఐడి కార్డు తీసుకొని వచ్చింది. ఆ ఐడి కార్డు లో అదే బొమ్మ ఉంది. దాన్ని చూడగానే బ్లాక్ కోబ్రా బృందం కళ్ళు ఆశ్చర్యపోయాయి.

"ఇది మా నాన్న ఐడి కార్డు... మా నాన్న ఆ కంపెనీ లోనే పని చేస్తాడు." అని అంది.

అయాన్ వెంటనే ఆ ఐడి కార్డు తన చేతిలోకి తీసుకొని ఆ కంపెనీ పేరు చదివాడు.
"లీజా ఆటోమొబైల్స్..." అని ఉంది. వెంటనే ఆ కంపెనీ గురించి నెట్ లో వెతికాడు. అందులో ఉన్నది చదివే కొద్ది తన నుదుటి మీద నుంచి చమట జారింది. అందరూ ఏమైంది అని అడిగారు.

"ఈ దేశం లో అత్యంత సంపన్నమైన కంపెనీ ఇది. దీని ఓనరే లీ జాంగ్.. అతని అపాయింట్మెంట్ కావాలి అన్నా సరే రెండు నెలలు ఆగాలి. తన చుట్టు పటిష్టమైన భద్రత ఉంటుంది. వాటి అన్నిటిని దాటి తనను చేరుకోవడం దాదాపు అసాధ్యం."

అది విని రూహి చిన్నగా నవ్వింది. అందరూ తన వంక ఆశ్చర్యంగా చూసారు.

"మన శత్రువు రావణుడంత బలవంతుడు అయినా, తన చుట్టు లంకంత కోట కట్టినా...
సీతమ్మను చేరాలనే రాముడి ప్రేమ ముందు, దేశాన్ని కాపాడాలనే మన ఆశయం ముందు క్షణం కూడా నిలువలేవు." అని దృడంగా పలికింది.

తన ధైర్యం చూసి బ్లాక్ కోబ్రా బృందం కూడా కొన్ని క్షణాలు ఆశ్చర్యంగా నిలబడిపోయారు.


" ఏజెంట్ రూహి వాసుదేవ్...6 " రచనకు రేటింగ్ ఇవ్వండి...
[+] 11 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 14-05-2026, 06:31 AM



Users browsing this thread: 1 Guest(s)