Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - అందమైన అబద్ధం
"నీకు బొత్తిగా బేరం ఆడడమే రాదురా కుమార్.  కాయలు కుడా ఏం బాగాలేవు. మొత్తం నల్లమచ్చలు ఉన్నాయి. కొంచెం తగ్గించి అడగలేకపోయావా? ఎప్పుడూ మెత్తగా ఉంటే పనులు అవ్వవు!" అని తన కొడుకు మృదుస్వభావాన్ని ఉద్దేశించి అంది భారతమ్మ.



"అది జరిగిందమ్మా! బేరం ఆడడం నాకు రాకపోయినా, నీకోసం ధైర్యం చేసి అడిగాను. కొంటే కొను. లేకపోతే, పక్కకి వెళ్ళు. నా బేరం పోతుంది అని ముఖానికి పెట్టుకున్న మాస్క్ మూసుకుని వెనక్కి చూడకుండా వెళ్ళపోమన్నాడు కోపంగా!" అని విడమర్చి చెప్పాడు కుమార్.


సూర్యప్రకాశరావు కుర్చీలో నుంచి లేచి కుమార్ దగ్గరికి వస్తూ "కుమార్! నీ తప్పు లేదులే. ఇప్పుడే యి క్రోధి నామ సంవత్సర రాశిఫలాలు టివిలో చూశాను నీది మేషరాశి కదా, ఆదాయం 8 వ్యయం 14. నాది కుంభరాశి ఆదాయం 14 వ్యయం 14. నీ బదులు నేను వెళ్లి ఉంటే బాగుండేదేమో!" అని శాస్త్రపరంగా విశ్లేషించి చెప్పాడు.


"నాన్న! నా అవతారం చూసిన తర్వాత కుడా, మీకు అంత నమ్మకం ఉందా! బజారులో మామిడికాయలకి యిప్పుడు ఉన్న గిరాకీకి, నేను వెళ్ళాను కాబట్టి, కనీసం నలిగిన చొక్కాతో అయినా తిరిగి వచ్చాను. మీరు వెళ్లి ఉంటే, అమ్మకి మామిడికాయలు కోసి ముక్కలు చేసే శ్రమ తగ్గి ఉండేది!" అని వాస్తవాన్ని వివరించి చెప్పాడు కుమార్.


"అల్లుడు చెప్పింది నిజమే బావ! బయట పరిస్థితి అలానే ఉంది. సంతోషం ఏంటంటే, కనీసం వేపపువ్వు అయినా ప్రస్తుతానికి మాములుగా దొరుకుతుంది. తరువాత ఏడాదికి అది కూడా బజారులో పెట్టి అమ్మేస్తారేమో! అని నవ్వుతూ అన్నాడు ప్రసాద్.


"తర్వాత ఏడాది వరకు ఎందుకు మామయ్య! యిప్పుడే అమ్ముతున్నారు. క్యూలో రెండుగంటలు నిలబడితే, యి రెండు కాయలైనా దొరికాయి. ఇవి కూడా బ్లాక్ లో కొనడానికి చాలామంది కాచుకుని ఉన్నారు అక్కడ. మీకు వద్దంటే చెప్పండి!" అని కుమార్ చెప్తుంటే ఆశ్చర్యపోయి ముగ్గురు ముక్కున వేలేసుకున్నారు.


"ఇప్పుడు యి లెక్కలు ఎందుకు?  కాయలు ముక్కలు చేసి పచ్చడి చెయ్యమ్మా!" అని వంటింటి వైపు చూస్తూ చెప్పాడు కుమార్.


"ఇంకేం పచ్చడి! ఇంత టైం అయినప్పుడే, సగం ఆశ పోయింది.  చిన్న మామిడికాయలు యాభై రూపాయలు అంటుంటే, యాభై రూపాయలనే ముక్కలు చేస్తున్నట్టుగానే ఉంది!" అంటూ నిరాశగా చెప్తూ సంచి వంటింట్లోకి తీసుకెళ్ళడానికి తీసి, అందులోని మావిడాకులను చూపిస్తూ "ఏంటి కుమార్! యి మావిడాకులు? ఒక చిగురు కూడా లేదు. అన్ని నలిగిపోయి, ముక్కలైపోయాయి. చెట్టెక్కి తెంపలేకపోయావా?" అని భారతమ్మ అడిగింది.


"ఎక్కి తెంపడానికి చెట్లు ఎక్కడ ఉన్నాయమ్మా!  ఆకులు కూడా కొన్నాను!" అని కుమార్ చెప్తుంటే "ఏం రోజులు వచ్చాయిరా దేవుడా!" అని దిగాలుగా కుర్చీలో కూర్చుండిపోయింది భారతమ్మ. 


 "ఏమైందమ్మా! టైం అవుతుంది. నీచేతితో ఉగాది పచ్చడి చెయ్యమ్మా!" అంటూ కుర్చీలో కూర్చున్న భారతమ్మ దగ్గరకి వచ్చి కింద కూర్చుని అడిగాడు కుమార్.


"ఇంకేం ఉగాది!  ఆశ పోయింది!" అని ఏదో కోల్పోయినట్లు అంది భారతమ్మ.


"ఇప్పుడు ఏమైందని? పండుగపూట యి విచారం?" అని భారతమ్మని అలా చూడలేక అడిగాడు సూర్యప్రకాశరావు.


"ఇంకేం కావాలి? చిన్నప్పుడు ఎకరాల విస్తీర్ణంలో మామిడితోటలో ఆడుకున్న నా కొడుకు, ఈరోజున ఎక్కి తెంపడానికి చెట్లు ఎక్కడ ఉన్నాయమ్మా, మామిడి ఆకులు కొనుక్కుని వచ్చానమ్మా అని చెప్తున్నాడు. అసలు యి పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది? అదే మన ఊర్లో ఉండి ఉంటే, చక్కగా ఉగాది ముందు రోజు సాయంత్రం ఊరంతా రామమందిరం దగ్గర చేరి పంచాంగాలు వినేవాళ్ళం. పురోహితుడు సంవత్సరంలో పడే వర్షాలు, ఎవరెవరికి ఎన్ని సున్నాలు ఉన్నాయో, ఇంకా చాలా విషయాలు చెప్పేవారు.


ఉగాది రోజు తెల్లవారుజామున లేచి, కొత్త బట్టలు వేసుకుని, కొత్త నాగలి కట్టి, ఎద్దులకి మెడలో కట్టిన గంటలు ఘల్లుఘల్లులాడించుకుంటూ వెళ్లి, పొలంలో నేలతల్లికి మొక్కి, దుక్కి దున్నేసి, మన మామిడితోట మీదుగా వచ్చేదారిలో మామిడికాయలు, చిగురాకులు, వేపపువ్వులు, పనసకాయలు, అరటిపువ్వు, అరిటాకులు తీసుకొచ్చేవాళ్ళు. మీకోసం మేం యింటిదగ్గర పసుపు, కుంకుమ, అక్షింతలతో ఎదురుచూసేవాళ్ళం. మన దగ్గర ఉన్నది, పదిమందికి పంచుకుని, అందరం ఉగాది పచ్చడి చేసుకుని తినేవాళ్ళం. తోటల్లో పెద్ద పెద్ద చెట్లకి తాళ్లతో ఉయ్యాలలు కట్టి, చిన్నాపెద్దా, ఆడామగా తేడా లేకుండా సంతోషంగా ఉయ్యాలలు ఊగుతూ, పండుగ చేసుకునేవాళ్లం. ఇది ఉగాది అంటే, మరి యిప్పుడు ఏలా ఉంది?" అని ఉద్వేగంగా భారతమ్మ చెప్తుంటే ముగ్గురికి ఒకసారి పాత రోజులు కన్నుల్లో మెదిలాయి.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - మనసు తెలిసింది - by k3vv3 - 13-05-2026, 05:37 PM



Users browsing this thread: 1 Guest(s)