Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఏజెంట్ రూహి వాసుదేవ్
#5
ఏజెంట్ రూహి వాసుదేవ్...3




నార్త్ కొరియా భద్రతా అధికారుల వేషం లో వచ్చిన కొందరు రూహి బృందాన్ని తీసుకొని విమానాశ్రయం కు కాస్త దూరం లో ఉన్న తమ స్థావరానికి వచ్చారు. ఆ తరువాత ఐదు మంది రూహి బృందం మీద తుపాకీలు గురి పెట్టి నుంచున్నారు. అయినా సరే రూహి వాసుదేవ్ కంట్లో చిన్న పాటి భయం కూడ లేదు.

పైగా వారిని చూసి ఒక చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో మీరు నన్ను ఏమి చేయలేరు అనే ఆత్మ విశ్వాసం మెండుగా కనిపిస్తుంది. ఎదురుగా వంద మంది నిలబడినా తొణకని విక్రమ్ వాసుదేవ్ కూతురు తను... అలాంటిది ఈ ఐదు మందిని చూసి భయపడుతుందా...

ఒక్కసారి తన బృందం వైపు తిరిగి...
"Guys... it's show time" అని అంది.

అదేంటో అర్థం కాక ఎదురుగా ఆయుధాలతో నుంచున్న వారు ఆశ్చర్యం తో ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.

సరిగ్గా అప్పుడే రూహి...
"3... 2... 1... " అని చెప్పి తన చేతికి ఉన్న గడియారం లో ఏదో ప్రెస్ చేసింది.

అంతే... భూమ్ అంటూ ఆ నకిలీ అధికారుల వెనుక ఉన్న అద్దాలు పేలిపోయాయి. ఆ గదిలోకి వచ్చే సమయం లోనే రూహి కి వారి మీద అనుమానం వచ్చింది. అందుకే తను రహస్యంగా తెచ్చిన రెండు ఎలక్ట్రానిక్ బటన్ లు ఆ గది అద్దాలకు అతికించింది. రూహి బటన్ ప్రెస్ చేయగానే అవి అద్దాల మీద వైబ్రేషన్ సృష్టించాయి. దాంతో పెద్ద శబ్దం చేస్తూ అవి పేలిపోయాయి.

ఆ అద్దాలు కొన్ని వేగంగా వచ్చి ఆ నకిలీ అధికారులకు గుచ్చుకున్నాయి. రూహి బృందం ముందు వారు నిలబడి ఉండటం తో వారికి ఏమి అవ్వలేదు. ఊహించని ఆ చర్యకు, ఏం జరిగిందో చూద్దామని ఆ అధికారులు వెనక్కి తిరిగారు.

సరిగ్గా అదే అదునుగా భావించి, రూహి బృందం యాక్షన్ లోకి దిగింది.

రూహి తన ముందున్న ఒకడి చెయ్యి వెనక్కి విరిచి పట్టుకుంది. ఈలోగా రెండో వాడు తన మీదకు వచ్చాడు. పంజా విసిరే చిరుత పులి లాగా రూహి ఎగిరి వాడి గుండెల మీద  తన్నింది. దెబ్బకు వాడు దూరంగా పడ్డాడు. వాడి చేతిలోకి తుపాకీ కూడా కింద పడిపోయింది. రూహి అలాగే తను పట్టుకున్న వాడి చేతిలోని తుపాకీ లాక్కుంది.

ఈలోగా పార్వతి, అయాన్, వంశీ కూడ తమ ముందున్న వారిని మట్టి కరిపించారు. వాళ్లు తిరిగి వారి మీదకు రాబోతుంటే రూహి తన చేతిలో ఉన్న తుపాకీ తో అందరినీ  కాల్చేసింది. ఒక్క వారి నాయకుడిని తప్ప... కళ్ళు మూసి తెరిచేలోగా ఆ నకిలీ అధికారులు అందరూ నేల కూలారు.

కాని ఆ రౌడీలు ఇంకా చాలా మంది ఉన్నారని రూహి కి తెలుసు. ఏ క్షణమైనా వారు పైకి రావచ్చు అనిపించింది. అందుకే వెంటనే వారు ఉన్న గది, అలాగే ముందున్న గది తలుపులు కూడా వేసేయమని సైగ చేసింది. మిగతా బృందం అలాగే చేసారు.

రూహి ఆలస్యం చేయకుండా మిగిలిన వాడి తల మీద తుపాకీ గురి పెట్టింది.

"మమ్మల్ని చంపమని ఎవరు పంపించారు?" అని సూటిగా ఇంగ్లీష్ లో అడిగింది.

వాడు చెప్పను అన్నట్టు మోహం అటు వైపుకు తిప్పుకున్నాడు. రూహి కోపంగా వాడి మోహం మీద ఒక్క తన్ను తన్నింది. వాడి పెదవి చిట్లి రక్తం వచ్చింది.

"ఆ దేవుడు నాకు ధైర్య సాహసాలు ఎక్కువ ఇచ్చి, సహనం చాలా తక్కువ ఇచ్చాడు. దాన్ని పరీక్షించకు. ఎవరు పంపించారో త్వరగా చెప్పు..." అని మరోసారి రెట్టించి అడిగింది.

వాడు నోరు విప్పడం లేదు. రూహి లో కోపం ఎక్కువ అయ్యింది. సరిగ్గా అదే సమయం లో బయట నుంచి తలుపు బాదడం మొదలయింది. ఆ రౌడీల గ్యాంగ్ వచ్చింది అని అర్థమైంది. అందరూ తల తిప్పి అటు చూసారు. సరిగ్గా అప్పుడే... రూహి తుపాకీ కింద ఉన్న వాడు, ఆ తుపాకీ ట్రిగ్గర్ నొక్కుకొని తనని తాను కాల్చుకొని చనిపోయాడు. ఊహించని ఆ దృశ్యం చూసి బ్లాక్ కోబ్రా టీం మొత్తం షాక్ అయ్యింది. ఈలోగా ఆ తలుపు దగ్గర తుపాకీల చప్పుడు మొదలయింది.

ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు, వారి దగ్గర అసలు సమయం లేదు అని అనిపించింది. రూహి వెంటనే తన ఫోన్లో ఎదురుగా చనిపోయిన వాళ్ళ ఫోటోలు తీసుకుంది. ఆ తరువాత వాడి జేబులు వెతికింది. ఒక పర్స్ దొరికితే . దాన్ని తీసుకుంది. అలాగే ఆ రౌడీల దగ్గర ఉన్న తుపాకీలు కూడా బ్లాక్ కోబ్రా టీం స్వాధీనం చేసుకున్నారు.

రూహి ఒక్కసారి ఆ గది మొత్తం తీక్షణంగా చూసింది. ఎదురుగా ఉన్న గోడ మీద ఒక బొమ్మ కనిపించింది.
[Image: image?pratilipiId=6755373531337776&name=...0&type=jpg]


అది ఎందుకో తనకు చాలా అనుమానంగా అనిపించింది. దాని ఫోటో కూడా ఒకటి తీసుకుంది.

ఇంతలో తలుపు దాటి లోపలకు రావడానికి ఆ రౌడీలు దగ్గరపడినట్టు అనిపించింది.

"మేడమ్, ఇప్పుడు తలుపుకు అటువైపు ఎంత మంది రౌడీలు ఉన్నారో తెలీదు. వారిని దాటుకొని బయటకు వెళ్లడం ఎలా?" అని వంశీ సందేహంగా అడిగాడు.

దానికి రూహి నవ్వుతూ,
"గాల్లో ఎగురుకుంటూ తప్పించుకుందాం..." అని సమాధానం ఇచ్చింది.

అందరూ తన వంక ఆశ్చర్యంగా చూసారు. రూహి బృందం ఇప్పుడు పదో అంతస్తులో ఉంది. అక్కడి నుంచి కిందకు దూకితే ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే వారిలో ఆ ఆశ్చర్యం...

రూహి అందరి వంక చూస్తూ నవ్వుతూ... ఆ పక్కనే ఉన్న ఫైర్ ఎక్సటింగ్యూషర్ పైప్ చేతిలోకి తీసుకుంది. ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకుంది. ఎదురుగా అద్దాలు కనిపించాయి. పరిగెత్తుకుంటూ దాన్ని బద్దలు కొట్టుకొని కిందకు దూకింది. అక్కడున్న పైప్ వేగంగా సుడులు తిరుగుతూ దూసుకొని వెళ్ళింది.

బ్లాక్ కోబ్రా టీం షాక్ లో ఉన్నారు. అయాన్ తేరుకొని పరిగెత్తుకుంటూ ఆ అద్దాల దగ్గరకు వెళ్ళి కిందకు తొంగి చూసాడు. కింద రూహి సురక్షితంగా కనిపించడం తో ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తరువాత మిగతా బృందం కూడా వేగంగా ఆ పైప్ పట్టుకొని కిందకు దుకారు.

అక్కడ ఎక్కువ సేవు నిలబడి ఉండటం మంచిది కాదు అని అందరూ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఆ సిటీ సెంటర్ కి చేరుకున్నారు. తమని ఎవరూ తరమడం లేదని నిర్దారణ చేసుకొని, అప్పుడు కాస్త కుదుటపడ్డారు. వెంటనే అందరికీ బాగా ఆకలిగా ఉండటం తో ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్ లోకి వెళ్లారు. పార్వతి, వంశీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తే... రూహి, అయాన్ టేబుల్ దగ్గరే కూర్చొని ఉన్నారు.

రూహి ఒకసారి అయాన్ వంక చూసింది. తన మోహం లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది.
"మోహం మాడిపోయిన మసాలా దోసె లాగా పెట్టావ్. ఏమైంది అలా ఉన్నావ్ అయాన్" అని అడిగింది.

అయాన్ కోపంగా రూహి వంక చూసాడు.

"అయ్య బాబోయ్... అదంతా కోపమే... కాస్త కోపం పక్కనపెట్టి మాట్లాడండి సార్.." అని నవ్వుతూ అడిగింది.

"ఏంటి మేడమ్ మీరు. మీ మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తారా? ఒక్కసారి కూడా ముందు వెనుక ఆలోచించరా... అంత ఎత్తు నుంచి కిందకు దూకారు. పొరపాటున మీకేమైనా అయితే?" అని ఆవేశంగా అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని కళ్ళలో సన్నని నీటి పొర కనిపించింది.

"నష్టం గురించి ఆలోచిస్తే వ్యాపారి, మరణం గురించి ఆలోచిస్తే సైనికుడు ముందుకు అడుగు వేయలేరు అయాన్. అయినా నాకేమైనా అయితే ఏమవుతుంది" అని అతని వంక చూస్తూ అడిగింది.

"మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వారు ఏమవుతారు?"

"నన్ను నమ్ముకొని ఎవరున్నారు."

"ఎవరు అంటే నేను..."

ఆ మాటకు రూహి తన వంక ఆశ్చర్యంగా చూసింది.

అయాన్ తేరుకొని...
"నేను అంటే.. అది.. అది.. మన బృందం, మన దేశం" అంటూ తడబడుతూ చెప్పాడు.

"అయినా ఇలాంటి సాహసాలు చేస్తే ఏమవుతుంది. మహా అంటే నేను చచ్చిపోతాను. అంతే కదా..." అని రూహి అంటుంటే అయాన్ టక్కున చేతులతో తన నోటిని మూసేసాడు.

"కలలో కూడా అలా మాట్లాడకండి మేడమ్..." అని అన్నాడు.

రూహి తన కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోయింది. ఆ కళ్ళలో తనకు ఏమైనా అవుతుందేమో అని కంగారు, భయం కనిపిస్తున్నాయి. మనకోసం అలా తపించే వ్యక్తిని చూస్తే మనసులో ఒక విధమైన వింత భావం చెలరేగుతుంది. అలాంటిదే రూహి మదిలో కూడా కలిగింది.
ఇంతలో అక్కడికి పార్వతి, వంశీ రావడం తో ఇద్దరూ సర్దుకొని కూర్చున్నారు.

అయాన్ కు తనంటే ఇష్టమని రూహికి ఎప్పుడో తెలుసు, కాని తను ఇప్పటిదాకా అలా ఎప్పుడూ ఆలోచించలేదు. కాని నేడు మాత్రం రూహి మదిలో మొదటిసారి వింత అలజడి రేగింది. ఆ అలజడి మాత్రం బాగుంది అనిపించింది. ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోయింది.

ఆ క్షణం వారికి తెలియని విషయం ఏంటంటే... రూహి బృందం కూర్చన్న చోటుకు రెండు టేబుల్స్ వెనకాల ఒకరు వారినే గమనిస్తూ ఉన్నారు. అతను మరెవరో కాదు... రూహి బృందం ఇండియా నుంచి నార్త్ కొరియా బయలుదేరినప్పుడు విమానం లో వారిని వెంబడించిన అతనే.. అతని చూపులు ప్రతి క్షణం బ్లాక్ కోబ్రా బృందం మీదే ఉన్నాయి.

-------------------------------------------------------------

సరిగ్గా అదే సమయంలో...

ఇండియా లోని ఒక కిరాయి ముఠా కు ఫోన్ వచ్చింది. ఆ ముఠా నాయకుడు జలంధర్...

ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు.

"నీతో ఒక ముఖ్యమైన పని పడింది." అని అటు వైపు నుంచి ఓ గొంతు వినిపించింది.

"చెప్పండి భాయ్..." అని జలంధర్ అన్నాడు.

"ఒకరి ఫోటో పంపిస్తాను. ఇప్పుడు తను ఎక్కడుందో కనుక్కోవాలి. ఆ తరువాత నా నుంచి ఆదేశాలు రాగానే తనని పైకి పంపాలి."

"అంత చిన్న పనికి నేనేందుకు. మా కుర్రాళ్ళు ఉన్నారు. వారే చూసుకుంటారు."

"మొత్తం విషయం జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మీరు వెతకబోయే వ్యక్తి సామాన్యురాలు కాదు. ధైర్య సాహసాలు తన నర నరాల్లో ఉన్నాయి. ఇది చాలా రహస్యంగా చేయాలి. ఏ మాత్రం ఎవరికైనా అనుమానం వచ్చినా నీతో పాటు, నేను కూడ మిగలను."

"సరే భాయ్.. ముందైతే ఫోటో పెట్టండి. మూడు రోజుల్లో  పని పూర్తి చేస్తాను." అని జలంధర్ అన్నాడు.

"సరే..." అని అటు వైపు నుంచి ఫోన్ కట్ అయ్యింది.

కాసేపటికి జలంధర్ ఫోన్ కి ఒక ఫోటో వచ్చింది. మెల్లగా దాన్ని ఓపెన్ చేశాడు. అందులో విక్రమ్ వాసుదేవ్ భార్య సుజిత ఫోటో ఉంది. తనని చూస్తూ ఒకసారి వెకిలిగా నవ్వాడు. ఆ తరువాత తన దగ్గర పనిచేసే కుర్రాళ్లను పిలిచి ఆ ఫోటో లో ఉన్న తనని నగరంలో ఎక్కడున్నా సరే వెతకమని చెప్పి పంపించాడు....
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: ఏజెంట్ రూహి వాసుదేవ్ - by SivaSai - 13-05-2026, 05:40 AM



Users browsing this thread: