12-05-2026, 06:38 AM
ఏజెంట్ రూహి వాసుదేవ్ - 1
"రూహి లేమ్మ. ఆఫీస్ కి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది." అంటూ వంటింట్లో నుంచి సుజిత అప్పటికి మూడో సారి కేక వేసింది.
రూహి మాత్రం ప్రశాంతంగా నిద్ర లో మునిగిపోయింది. తన చెవులకు చుట్టూ తలగడ అడ్డంగా పెట్టుకొని పడుకోవడం తో అమ్మ మాటలు అస్సలు వినిపించడం లేదు.
ఇలా కాదు అని సుజిత ఈసారి నేరుగా రూహి గదిలోకి వచ్చింది. బెడ్ మీద చిన్న పిల్ల మాదిరి పడుకున్న రూహి ని కాసేపు ముచ్చటగా చూసింది. తన రూపం కంటి నిండా నింపుకుంది. తరువాత మెల్లగా తన దగ్గరకు చేరి గట్టిగా తట్టి లేపింది.
"ఏంటమ్మ అప్పుడే లేపుతున్నావ్. ఇంకాసేపు పడుకోని" అంటూ రూహి అటు తిరిగి పడుకుంది.
"సరే మరి. టైం ఇప్పటికే ఎనిమిది అయ్యింది. తొమ్మిది గంటలకు ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉంది అని చెప్పావ్. ఆ తరువాత నీ ఇష్టం." అని అంది.
ఆ మాట వినగానే రూహి టక్కున లేచి కూర్చుంది. ఒక్కసారి గడియారం వంక చూసింది. నిజంగానే టైమ్ 8 అయ్యింది.
"ఏంటమ్మ నువ్వు. టైం అవుతుంది, చిన్న పిల్లని లేపాలని తెలియదా. లేక వంటలక్క లతో ముచ్చట్లలో పడి మర్చిపోయావా" అని కన్ను కొట్టింది.
"నిన్ను..." అంటూ తనని కొట్టడానికి సుజిత ముందుకు వెళ్ళింది.
రూహి తనకు దొరకకుండా పరిగెత్తుకుంటూ బాత్ రూమ్ లోకి తుర్రుమంది. సుజిత నవ్వుతూ తన వంకే చూస్తుంది.
ఈ క్షణం తమ మధ్య విక్రమ్ వాసుదేవ్ ఉంటే ఎంత బాగుండు అని మనసులో అనుకుంది. విక్రమ్ గుర్తుకురాగానే తన కళ్ళలో నీళ్లు తిరిగాయి.
15 సంవత్సరాల క్రితం విక్రమ్ ఈ దేశం కోసం తన కుటుంబాన్ని సైతం కాదని ప్రాణ త్యాగం చేశాడు. తన సాహసం, తెగింపు చూసి ఈ దేశం మొత్తం గర్వం తో ఉప్పొంగింది. తన పేరు మీద అవార్డు ఒకటి ఇచ్చారు. కొన్ని రోజులు తన గురించి అందరూ చెప్పుకున్నారు, కన్నీళ్లు కార్చారు, పేపర్లో రాసారు. ఆ తరువాత మెల్లగా జనాలు ఆ విషయం మర్చిపోయారు. కానీ తను మాత్రం ఎప్పటికి మర్చిపోలేదు. మర్చిపోవాలి అనుకున్నా మరువలేని జ్ఞాపకం తను.
నిజానికి విక్రమ్ చనిపోయే సమయానికి సుజిత గర్భవతి. ఆ తరువాత తనకు ఒక అబ్బాయి పుట్టాడు. ప్రస్తుతం తను IIT లో చదువుకుంటున్నాడు. విక్రమ్ లేకపోయినా తన ఆశయం ఎప్పటికి బ్రతకే ఉండాలని తన కూతురు రూహి వాసుదేవ్ ని మాత్రం ఒక secret ఏజెంట్ లా మార్చింది. రూహి కూడా తండ్రి లక్షణాలను పునికి పుచ్చుకుంది. ఎవరిని లెక్క చేయదు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, తీయడానికైనా సిద్ధంగా ఉంటుంది. అతి చిన్న వయసులోనే ఎవరికీ సాధ్యం కాని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తన పేరు చెప్తేనే శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది. డిపార్ట్మెంట్ అంతా తనని ఏజెంట్ వారసురాలు అంటే... శత్రువులు మాత్రం చోటా షేర్ అని పిలిచేవారు.
సుజిత ఇలా ఆలోచనల్లో మునిగిపోయి ఉండగానే రూహి బయటకు వచ్చింది.
"ఏమైంది మాతా శ్రీ. నన్ను కొట్టాల్సిన దెబ్బలను లెక్క పెడుతున్నావా" అని నవ్వుతూ అడిగింది.
సుజిత ఏమి మాట్లాడకపోతే రూహి తన దగ్గరగా వచ్చి తన కన్నీళ్లను చూసింది.
"నాన్న గుర్తొచ్చారా అమ్మ.." అని ప్రేమగా అడిగింది.
అవును అన్నట్టు సుజిత తల ఆడించింది.
"నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు గుర్తుందా అమ్మ... మన దేశపు జాతీయ పతాకం ఎగురుతున్నంత కాలం, ఆ స్వేచ్చా వాయువు ఆణువణువు లోను తను బ్రతికే ఉన్నాడని. నా దృష్టిలో నాన్న మన దగ్గరే మన చుట్టూనే ఉన్నాడు. మనం కన్నీరు కారుస్తూ నాన్నను బాధపెట్టకూడదు." అంటూ తన కన్నీరు తుడిచింది.
కళ్ళ ముందే ఎదిగిన కూతురుని చూసి సుజిత ఆప్యాయంగా తన తల నిమిరింది. రూహి కూడా ప్రేమగా తనని కౌగిలించుకుంది. కాసేపు ఇద్దరూ అలాగే ఉండిపోయారు.
"సరే, ఆలస్యం అవుతుంది. త్వరగా రెడీ అవ్వు. ఈలోగా టిఫిన్ వడ్డిస్తాను" అని అంటూ సుజిత అక్కడి నుంచి వెళ్ళింది. రూహి కూడా రెడీ అవ్వడం లో మునిగిపోయింది.
కాసేపటి తరువాత త్వరగా తినేసి బయలుదేరడానికి సిద్దమైంది.
"బండి మెల్లగా నడుపు. జాగ్రత్త " అని సుజిత మరోసారి హెచ్చరించింది.
రూహి తనకు చిరునవ్వుతోనే బదులు చెప్పి, ఇంటి ముందు ఉన్న బుల్లెట్ బండి ఎక్కి కూర్చుంది. ఒక్కసారి వాచ్ వంక చూసింది. ఇంకా 15 నిముషాలు మాత్రమే ఉండటం తో బైక్ ని వేగంగా దూకించింది. క్షణాల్లోనే బండి వేగం వంద దాటేసింది.
------------------------------------------------------------
ప్రధాన మంత్రి కార్యాలయం...
బోర్డు రూమ్ లో అందరూ ఇప్పుడు మన ప్రధాన మంత్రి ఏం చెప్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఏ విషయమైనా సరే కేంద్ర రక్షణా శాఖ మంత్రే ఎవరికి చెందిన విషయం వారికి తెలియజేస్తాడు. కాని ఈరోజు మాత్రం అందరినీ హుటా హుటున రమ్మని పిలిపించడం తో కారణం ఏమై ఉంటుందా అని అందరిలో ఆత్రుత మొదలయింది. కచ్చితంగా ఇది ఏదో పెద్ద విషయం అని మాత్రం అక్కడున్న అందరికీ అర్థమవుతుంది.
ఇలా అందరూ ఆలోచనల్లో మునిగిపోయి ఉండగానే తలుపు తెరుచుకొని ప్రధాన మంత్రి లోపలకు వచ్చారు. ఆయన రావడం తో అందరూ గౌరవ సూచికంగా లేచి నిలబడ్డారు. ఆయన ఆ టేబుల్ మధ్యలో ఉన్న కుర్చీలో కూర్చొని, అందరి వంక చూస్తూ కూర్చోమని సైగ చేసాడు. కాసేపు అక్కడ ఉన్న అందరినీ తీక్షణంగా గమనించాడు.
అక్కడ కూర్చున్న వారిలో చాలా మంది దేశం మీద ప్రేమ కంటే, డబ్బు మీద ఆశ తో బ్రతుకుతున్న వారే అని ఆయనకు కూడా తెలుసు. కాని ఏమి చేయలేరు. ఎందుకంటే అవినీతి సిస్టమ్ లోని మూల మూలల్లో పాతుకుపోయింది. వాటిని పెకిలించడం మొదలుపెడితే, తన ప్రభుత్వమే కూలిపోతుంది అని ఆయనకు తెలుసు. అందుకే కొన్ని సార్లు అన్ని తెలిసినా, ఏమి తెలియనట్టు మౌనంగా ఉండిపోతారు.
అందరూ తననే చూస్తూ ఉండటం తో గొంతు సవరించుకొని మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టారు.
"ఈ అత్యవసర సమావేశం ఎందుకంటే, మన దేశం ఒక పెద్ద ప్రమాదం లో ఉంది." అని పలికారు.
ఆ మాట వినగానే అక్కడున్న అందరూ అర్థం కాక ఒకరి మోహం ఒకరు చూసుకున్నారు.
మెల్లగా మరోసారి చెప్పడం మొదలుపెట్టారు.
"మన పొరుగున ఉన్న చైనా ఎప్పటి నుంచో మన మీద ఆధిపత్యం చెలాయించాలని, మనల్ని తన అదుపులో పెట్టుకోవాలని చూస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే.. ఆర్థికంగా, వైజ్ఞానికంగా, సైనికంగా మెల్లగా మన దేశం పురోగతి వైపు అడుగులు వేయడం చూసి తట్టుకోలేకపోతుంది. ఎలాగైనా మనల్ని తన అధీనం లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంది.
సరిగ్గా ఇదే సమయం లో మన దేశం ఇంకొన్ని రోజుల్లో అమెరికా తో ఒక ఒప్పందం చేసుకోబోతుంది. ఆ ఒప్పందం ప్రకారం, మన దేశం లో విరివిగా దొరికే కొన్నిటిని వారి దేశానికి ఎగుమతి చేయాలి. వారి దేశం నుంచి దిగుమతి చేసే వాటి మీద సుంకం తగ్గించాలి. దానికి బదులుగా మన దేశానికి కావాల్సిన యుద్ధ ట్యాంక్ లు, విమానాలు, అణు బాంబులు వారు మనకు సమకూర్చి పెడతారు. అంతే కాదు. ఇక నుంచి మన శత్రువులను ఆపడం కోసం, అలాగే రక్షణ శాఖ బలోపేతం కావడానికి ఆధునాతన ఆయుధాల కోసం చేసే పరిశోధనల్లో ఒకరికొకరు భాగస్వామ్యం అవ్వాలని. ఆ ఒప్పందం కాని జరిగితే, మన దేశం కోసం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మరింత వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ, తొందర్లోనే పవర్ ఫుల్ దేశాల పక్కన మనం కూడా చేరుతాం.
ఆ విషయం తెలిసినప్పటి నుంచి చైనా కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎలాగైనా ఆ ఒప్పందం ఆపాలని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా ఇంకొక 15 రోజుల్లో మన దేశ స్వాతంత్ర దినోత్సవం రానుంది. అదే రోజు మన దేశాన్ని కుప్ప కూల్చడానికి, ఆ ఒప్పందం జరగకుండా ఉండడానికి ఒక పథకం పన్నింది అని చైనా లో ఉన్న మన ఏజెంట్స్ ద్వారా మనకు సమాచారం అందింది.
చైనా లో మన మనుషులు చాలా మంది ఉన్నారు. అందుకని అక్కడ ఏం చేసినా మనకు తెలిసిపోతుంది అని అర్థమై... అత్యంత రహస్యంగా చైనా మిత్ర దేశమైన నార్త్ కొరియా తో చేతులు కలిపి, దాని రాజధాని pyongyang (ప్యోంగ్యాంగ్) లో ఏదో పెద్ద ఎత్తున చేస్తున్నారు. అదేంటో మన వారు తెలుసుకోలేక పోయారు. కాని వారు విన్న దాని ప్రకారం... చరిత్ర లో ఎవరూ ఊహించని వినాశనం సృష్టించనున్నారు. మన దేశం లో పెద్ద ఉన్మాదానికి తెర తీయనున్నారు. చైనా, కొరియా ఆ ప్లాన్ లో విజయవంతమైతే మన దేశం జీవితాంతం వారి చేతిలో కీలు బొమ్మ లాగా మారబోతుంది.
కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారి ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. అంతే కాకుండా దాన్ని నాశనం చేయాలి. లేకపోతే మన దేశం అభివృద్ధి లో మరో 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది."
ప్రధాన మంత్రి చెప్పింది వినగానే ఆ గదిలో ఉన్న అందరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. చీమ చిటుక్కు మన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవహించింది. ఆ నిశ్శబ్దాన్ని చేదిస్తూ మన దేశ రక్షణా శాఖ మంత్రి రాజ్ గోపాల్ పెదవి విప్పాడు.
"మీరు చెప్పింది వింటుంటేనే చాలా భయంగా ఉంది సార్. నార్త్ కొరియా... ప్రపంచం మొత్తం మీద అత్యంత క్రూరమైన నియంత, కిమ్ పాలన లో ఉంది. అక్కడ గాలి కూడా కిమ్ చెప్పినట్టుగానే వీస్తుంది. మనుషుల ప్రాణాలకు అస్సలు విలువ ఇవ్వడు. పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు తను.
అలాంటి తన దేశానికి వెళ్లి ఈ ఆపరేషన్ చేయడమంటే, మృత్యువు కు ఎదురు వెళ్లడమే..."
ఆ గది లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన మాటలతో ఏకిభవిస్తూ తల ఆడించారు.
"అందుకే ఆ పనిని ఒకరికి అప్పగించాను." అంటూ ప్రధాన మంత్రి తన ముందున్న బెల్ కొట్టారు.
మరు నిమిషం లో ఆ బోర్డు రూమ్ గది తలుపులు తెరుచుకున్నాయి. అందరూ తల తిప్పి అటు వైపు చూసారు.
చురుకైన చూపులతో, ఆత్మ విశ్వాసం నిండిన అడుగులు వేస్తూ... ఒక అమ్మాయి లోపలకు వచ్చింది. చూడటానికి తను పిన్ తీసేసిన బాంబు లాగా అనిపించింది. తనని చూడగానే అక్కడ ఉన్న సగం మంది ఆశ్చర్యపోయారు.
"ఇంత పెద్ద ఆపరేషన్ ని ఒక అమ్మాయి కి అప్పగించడమా... " అంటూ ఒక అధికారి బయటకే అన్నాడు.
"అమ్మాయి కాలిస్తే గన్ పెలదా? లేక శత్రువు గుండెల్లో బుల్లెట్ దిగదా?" అతని కంట్లోకి నేరుగా చూస్తూ చెప్పింది.
"నీలో అంత సత్తా ఉందా..."
"అయితే ఎప్పుడు వెళ్తున్నారు మరి "
"ఎక్కడికి?" అని ఆశ్చర్యంగా అడిగాడు.
"పైకి... ఎందుకంటే నా సత్తా చూసిన అందరూ ఇప్పుడు అక్కడే ఉన్నారు." అంటూ ఆ అమ్మాయి తన పిడికిలి బిగించింది. ఆ అధికారికి ఏం చెప్పాలో తెలియక బిక్క మోహం వేసాడు.
ఇంతలో...
"ఇలాంటి ఆపరేషన్స్ లో గెలవడానికి అనుభవం చాలా ముఖ్యం..." అంటూ మరో అధికారి సందేహంగా పలికాడు.
"మన పురాణాల ప్రకారం... ఒక క్రూర రాక్షస రాజు చనిపోయే సమయంలో తన వయసు లక్ష సంవత్సరాలు. అదే వాడిని జయించిన అతని వయసు 53. కొన్ని సార్లు గెలవడానికి అనుభవం కంటే సరైన లక్ష్యం, గెలవాలి అనే పట్టుదల ఉన్నా సరిపోతాయి."
ఆ మాటకు అక్కడున్న అందరూ మౌనంగా ఉండిపోయారు. ఆ అమ్మాయి స్థిరమైన మాటలు వింటుంటే అందరిలో కొంచెం నమ్మకం కలిగింది.
ఇంతలో ప్రధాన మంత్రి...
"ఈ అమ్మాయి మరెవరో కాదు. ఎదురుగా మరణం రంకెలు వేస్తున్నా సరే, కళ్ళలో భయం లేకుండా రొమ్ము విరిచి పోరాడి నిలిచిన విక్రమ్ వాసుదేవ్ వారసురాలు... ఏజెంట్ రూహి వాసుదేవ్..." అని అన్నారు.
ఆ పేరు వినగానే అక్కడ సీట్లలో కూలబడిన అందరూ నిటారుగా కూర్చున్నారు. రూహి వాసుదేవ్ వంక ఆశ్చర్యంగా చూసారు. నాన్న పేరు వినగానే రూహి గుండె కూడా గర్వం తో ఉప్పొంగింది.
"ఇప్పుడు ఎవరికైనా తన మీద సందేహంగా ఉందా..." అని ప్రధాన మంత్రి అందరి వైపు చూస్తూ అడిగారు. ఒక్కరు కూడా నోరు మెదపలేదు.
రూహి వైపు తిరిగి...
"రూహి... మన దేశ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. ఎలాగైనా విజయం సాధించి వస్తావని ఆశిస్తున్నాను."
"మన దేశపు జెండాను శత్రువుల గుండెల్లో సగర్వంగా ఎగరేసి వస్తాను సార్..."
"ఇదిగో మొత్తం వివరాలు. ఆల్ ది బెస్ట్ రూహి..."
"థాంక్ యు సార్..." అని ఆ ఫైల్ తీసుకొని రూహి బయటకు నడిచింది.
తను వెళ్తుంటే అందరూ తన వైపే చూస్తున్నారు. ఆ క్షణం తను అచ్చం విక్రమ్ వాసుదేవ్ లాగే కనిపించింది. తన నడకలో తడబాటు లేదు. తన కళ్ళలో గెలవగలను అనే నమ్మకం స్పష్టంగా కనిపిస్తుంది.
అందరికీ తను అడివిలో వేటడానికి వెళ్తున్న చిరుత పులి లాగా కనిపించింది. మరి ఆ వేట లో విజయం ఎవరిదో కాలమే నిర్ణయించాలి........


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)