Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Comedy హాస్య కథలు - కనురెప్ప
పాత చింతకాయపచ్చడి లాంటి కథ


రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
 
 
 
"హలో సుబ్రహ్మణ్యం బాగున్నావా.. పాత చింతకాయ పచ్చడి రుచి అదిరిపోద్ది. పంపమంటావా?”.



''ఎవరు మాట్లాడేది??”



"నేనురా.. రామచంద్రపురం నుండే శివరామకృష్ణయ్యని మాట్లాడుతున్నాను. మీ ఇంటి దగ్గర పని చేసే ఆ బాగా పొడవాటి కుర్రాడు పొడుగురాజును పంపు. వాడిని అటక ఎక్కించి, పచ్చడి జాడి దింపించి, పాత చింతకాయ పచ్చడి వాడి చేతికిచ్చి నీకు కూడా పంపుతాను."



"అరెరే.. వాడు నిన్ననే మానేశాడు రా''



"ఏడ్చావు.. ఆ సంగతి ముందుగానే చెప్పొచ్చు కదా. ఫోన్ పెట్టేయ్.. కాల్ వేస్ట్......"



"మరి పచ్చడి ఎప్పుడు పంపుతావ్. అసలు నాకు తెలియకుండా మీ ఇంట్లో ఆ పచ్చడి ఎలా ఉంది''



"ఆపు నీ వెధవ అనుమానం. నీకు తెలియకుండా ఉండబట్టే ఇన్నేళ్లు ఉంది. ఇదిగో ఎల్లుండి మా కొడుకులు, కోడలు, కూతుళ్లు, అల్లుళ్లు.. వాళ్ల వాళ్ల పిల్లలు అందరూ వస్తున్నారు. అందరం తిన్నాక మిగిలితే పంపుతాలే వింటున్నావా... '



"మళ్లీ ఏదో అరకాసులో తిరకాసు పెడుతున్నావు. వాళ్లంతా వచ్చి రెండు నెలలే కదా అయింది. మళ్ళీ ఎలా వస్తారు?".. అనుమానం తీరక అడిగాడు సుబ్రహ్మణ్యం.



"అదంతే.. నాకు చూడాలని ఉంది. పావులు కదుపుతున్నాను కదా.. వాళ్ళు వచ్చేస్తారు."
ఫోన్ పెట్టేసాడు శివరామకృష్ణయ్య.



********



"వెన్నెల్లో పిండారపోసినట్లు, ఆ పిండితో చేగోడీలు చేసుకుతిన్నట్టు నీ ముఖం ఎంత కరకరలాడుతుంది.. సారీ.. కళకళలాడుతుంది. బాగుందా నా కవిత్వం.. లే.. తెల్లవారబోతుంది.”



"కిర్రు కిర్రు కాలి చెప్పుల్లా
కిసుక్కున నవ్వే నీ నవ్వు శబ్దం
టెంక లేని తాటి పండులా
పళ్ళు లేని నీ నోటి అందo''



వహ్వా.. భలే కుదిరిందోయ్ ప్రాస.. కాత్యాయనీ నేను ఎన్ని కవితలు చదివినా నీకు మెలుకువ రాదేమిటి?''.. భార్యను లేపుతూ అన్నాడు శివరామకృష్ణయ్య.



అతను యవ్వనంలో శ్రీకృష్ణదేవరాయలు అంత దిట్ట. అన్ని పత్రికలు అవి బ్రతికినన్నాళ్లు అతని కవిత్వాన్ని ప్రచురించాయి.. తన ఫోటోనే కాకుండా భార్య కాత్యాయని ఫోటోతో సహా. అతని కవిత్వ గంధం లో కాస్తంత సుగంధం ఆమెకు కూడా అంటుకుంది... అలా వాళ్ల కవిత్వాలు ఆ ఇద్దరు ఫోటోలతో సహా మారుమోగిపోయేవి అప్పట్లో.. ఇదంతా మూడు పుష్కరాలు నాటి మాట. ఇప్పుడు అతనికి తొమ్మిదిపదులు ఆమెకు పది తక్కువ.
"లేచావా కూర్చో.. మన వాళ్ళందరినీ నీకు మళ్ళీ చూడాలని ఉందా?" ప్రశ్నించాడు.



"మీకు మాత్రం ఉండదా.. మీ ఆశ కాకపోతే వాళ్లు మళ్లీ ఇప్పుడు ఎలా వస్తారు?''



"ముందు నువ్వు మంచం దిగు.. కొంపతీసి నడుంకాని పట్టేసిందా మళ్లీ?''



"నేను చెప్తే విన్నారూ, ఆ అటక మీద పాతచింతకాయపచ్చడి జాడి గురించి మీరు శ్రమ పడటం కాకుండా నా చేత కూడా ఎక్సర్సైజులు చేయించారాయె. ఆ ముదనష్టపు జాడి మాట ఎలా ఉన్నా నా ఒళ్ళంతా నొప్పులు పట్టేసాయి.".. అంది కాత్యాయని నెమ్మదిగా క్రిందకు దిగుతూ.



"అది సరే కానీ ఎదురింటి అవతారం వచ్చాడా?.. ఖాళీ అయినప్పుడు వచ్చి అటక ఎక్కి చింతకాయ పచ్చడి జాడి కిందకు దింపుతానని మాట ఇచ్చాడు కదా."



"అతనికి అటక ఎక్కిన అవతారం అనే బిరుదు కూడా ఇస్తానని నమ్మబలికారు కదా."



"పచ్చడి జాడి కిందకి దింపుతాడని ఆశ పడి మాటిచ్చాను. ఆ ఆశ తీరకుండా నేను చస్తే మళ్లీ నిన్నే దెయ్యం అయిపోయి పీక్కుని తింటాను."



"అమ్మో ఇన్నాళ్లు పీక్కుతిన్నది చాలదూ!!'



"నీకేం తక్కువ చేశానోయ్''''



"అంతా తక్కువే.. చెప్పమంటారా.. పిల్లల్ని ఇంజనీర్లని చేశారు. కోడళ్ళు కూడా ఉద్యోగస్తులే. కూతుళ్ళని బ్యాంకు మేనేజర్లుగా చేశారు. బిజినెస్ మ్యాగ్నెట్లని అల్లుళ్ళుగా తెచ్చుకున్నారు. మనవలు కంప్యూటర్ మనుషులు అయిపోయారు. వాళ్ల పెళ్ళాళ్ళు కూడా జాబు హోల్డర్స్. అంతా బాగానే ఉంది నా బ్రతుకు మాత్రం ఇలా అయిపోయింది. చిన్నప్పుడు మా అమ్మగారు పెట్టిన వంటి రాయి పుడకని మూడురాళ్లు పుడకగా మార్చండి బాబోయ్ అంటే.. సుతారామూ వినిపించుకున్నారా?''



"దేనికైనా కాలం అంటూ ఒకటి కలిసి రావాలోయ్."



"మరే నాకు తెలియదు సుమండీ…”



"ఆ వెటకారం ఏంటి''



"మీ ఆశలన్నీ త్వర త్వరగా తీరిపోవాలి. లేకపోతే దయ్యమై పీక్కు తింటానంటున్నారు. నేను కోరుకునే దానికి మాత్రం కాలం అంటూ ఒకటి రావాలి అంటున్నారూ.. బాగుంది సంబడం'' భర్తతో సరదాగా పోట్లాడుతున్నట్టు అంది కాత్యాయని...



శివరామ కృష్ణయ్య సంతానం, వాళ్ళ వాళ్ల సంతానం.. అందరూ జంటలయ్యారు. అంతేకాకుండా వాళ్లంతా జంట నగరవాసుల కావడం విశేషం. అందరివి క్షణం తీరికలేని 5 అంకెల జీతాల ఉద్యోగాలే. ఏసీ బ్రతుకులు.. వాళ్ళందరికీ శివరామకృష్ణయ్య దంపతులంటే అభిమానమే.



ఎప్పటినుండో కాత్యాయని..
"పోనీ వాళ్లందరి దగ్గరికి వెళ్లి పోతే సరిపోతుంది కదా " అని భర్తతో అంటూ ఉండేది.



''నువ్వు వంద చెప్పు కాత్యాయని.. మీ అమ్మగారి ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న ఆ నల్లకావడి పెట్టె భూతంలా ఉంది భయమేస్తుంది దాన్ని అమ్మేస్తాను అంటే విన్నావా.. అదంటే నీకు అంత ప్రేమ మరి. అలాగే నాకు కూడా ఈ ఊరంటే అంత ప్రేమ... మన బ్రహ్మాండమైన చక్కని అంటే.. బీసీ బ్రతుకు వదిలి వాళ్ల.. ఏ. సీ. బ్రతుకులో ఇమడలేనోయ్."..
అంటూ ఆ ఆలోచన విరమింప చేసేవాడు.



ఇలా ఆ చిన్ని టౌన్ లో శివరామకృష్ణయ్య దంపతులు పాత జ్ఞాపకాల భవంతిలో ముసలి జంట గువ్వల్లా కాలం గడిపేస్తున్నారు. అదే వారికి ఇష్టంగా ఉంది. ఎవరు రమ్మన్నా వెళ్లరు వెళ్లిన ఉండలేరు.



"ముక్కుపుడక చేయించమన్నావుగా చేయిస్తాను. సరే ఆ టీపాయ్ మీద టాబ్లెట్లు ఉన్నాయి కాస్తంత తెచ్చి ఇస్తావా?''



"మీ ముక్కుపుడక కు ఒక దండం. నేను బలంగా ఉన్నాననుకుంటున్నారా? నా టాబ్లెట్లు బాక్స్ ముందు మీరు తెచ్చి ఇస్తే రెండు బిళ్ళలు మింగి మీ టాబ్లెట్లు తెచ్చి ఇవ్వగలను?''



"మా అమ్మ పెళ్లిరోజు నాడే అన్నది. ఒరేయ్ బడుద్దాయి.. ఈ పిల్ల వాలకం చూస్తుంటే నీ వార్ధక్యంలో నిన్ను సుఖ పెట్టేలా లేదురా అని. అన్నంత పని అయ్యింది. పోనీ ఆ మూలనున్న చేతి కర్ర తెచ్చి ఇస్తావు సహాయానికి."



"సింహద్వారం పక్కన నా చేతికర్ర ఉంది. అది కాస్త మీరు తెచ్చిస్తే.. ఆ మూడు కాళ్లతో వెళ్లి మీ మూడో కాలు తెచ్చి ఇవ్వగలను. సరే సరే ఎలాగోలా లేచి టీ కాచి ఇస్తాను. కాస్తంత గుటకేసి మీ పనులు మీరు చూసుకోండి బాబు.".. అంది చిరు చిరాగ్గా కాత్యాయని.



"నీకేo తెలుసు జీవితం అంటే దానికి కాచి వడబోసిన వాడిని."



"రోజు టీ కాఫీలు కాచి వడబోస్తూనే ఉన్నాను మీ కన్నా నేను ఏం తక్కువ కాదు."



"నీ సతాయింపు ఆపి కావలసిన కార్యక్రమం గురించి ఆలోచించరాదూ."



"మీరనేది అటక మీద పాతచింతకాయ పచ్చడిజాడి విషయమే కదా. అసలు ఆ జాడీకి మన వాళ్ళందరూ ఇక్కడకు రావడానికి దగ్గర సంబంధం ఏమిటి అంట" చిత్రంగా ముఖం పెట్టి ప్రశ్నించింది.



"కథ.. క్లైమాక్స్ లో అర్థమవుతుందిలే. మరీ అంత తెలివి తక్కువ వాడిని అనుకోకు."



****
అటక మీద ఉన్న పాత చింతకాయ పచ్చడి జాడి క్రిందకు దింపడం కోసం వారం రోజులుగా ప్రయత్నిస్తున్నారు ఆ వృద్ధ దంపతులు. పాత చింతకాయ పచ్చడి పెడితే తాను కూడా రుచి చూడొచ్చు అన్న ఆశతో పాలుపోసే పోతురాజు నిచ్చెన ఎక్కబోయి నిచ్చెన కాలే కాదు, తన కాలు కూడా ఇరగొట్టుకున్నాడు. బట్టలు ఉతికే అప్పిగాడు అతి కష్టం మీద అటక ఎక్కేసి.. తేలు కుట్టింది బాబోయ్.. అని క్రిందపడ్డాడు. అతని నడుమూ విరిగింది. ఆ నడుము కింద పడ్డ ఆ తేలు నడుమూ విరిగింది.



ఫోన్ రింగ్ అయ్యింది. శివరామకృష్ణయ్య రిసీవర్ అందుకున్నాడు.



"హలో శివరామకృష్ణయ్య.. నేను రా.. సుబ్రహ్మణ్యాన్ని. నేను ఎంత ఆలోచించినా అటక మీద ఆ చింతకాయ పచ్చడి జాడీకీ మీ పటాలమంతా జంటనగరాల నుండి దిగిరావడానికి లింకు కనిపించడం లేదు. ఏమిటి కథ.. ఎందుకు ఈ సస్పెన్స్. "అడిగాడు సుబ్రహ్మణ్యం.



"ఎవరు మాట్లాడేది. సారీ.. ఇది శివరామకృష్ణయ్యగారి ఇల్లు కాదు రాంగ్ నెంబర్. " రిసీవర్ కింద పెట్టేశాడు శివరామకృష్ణయ్య.



"పాయింట్ లీకు చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. నేను లీక్ అవనిస్తానా?''



"ఇంతకీ ఎవరిది ఆ ఫోను."



"ఎవడో ఏబ్రాసి సుబ్రహ్మణ్యం అంట."



"అయ్యో.. అయ్యో.. వరుసకు మా అన్నయ్య కదా అతను... మన సుబ్రహ్మణ్యమే''



"ఎవడో ఒకడు.. అనవసరమైన కూపీ లాగాలని ప్రయత్నిస్తే రాంగ్ నెంబరే."



"సర్లేండి నాకెందుకు. ఇంతకీ ఆ జాడీలో చింతకాయ పచ్చడి ఎన్ని సంవత్సరాల క్రితానిదట. ఎప్పుడు దాచారు. నాకు అసలు గుర్తులేదు''.



''నీకు పెళ్లి అవ్వని క్రితం మా తాతల కాలం నాటిది. నీకు ఇష్టం లేకపోతే తినడం మానేయి''.



"నాకు ఖాళీ జాడి ఇచ్చేసారనుకోండి.. అందులో ఉప్పు వేసుకుందామని."



"అది సరే కానీ కాత్యాయని.. మనిద్దరం మోడ్రన్ డ్రెస్సులో ఫోటో దిగడం గురించి ఏం ఆలోచించావు."



"ముందు పాతచింతకాయపచ్చడి జాడి అన్నారు..
ఇప్పుడేమో మోడ్రన్ డ్రెస్సు అంటున్నారు. చిన్నపిల్ల వాడిలా ఏమిటి ఆ కోరికలు. ఫోటోకు నేను రెడీ అనుకోండి..



మీరైతే పౌడర్ పూసుకుంటారు, కట్టుడు పళ్ళు తగిలించుకుంటారు, జోళ్ళు తుడుచుకుంటారు, తెల్ల వెంట్రుకలకు నల్ల రంగు రుద్దుతారు.. నాదేం పోతుంది గనుక. ఫోటో లో నేను ముసలిదానిగా కనపడి మీరు పడుచు కుర్రాడిలా కనపడితే చూసిన వాళ్లు నవ్విపోరూ."



"దాందేముంది.. నిన్ను పనిమనిషి తల్లివి.. అని చెప్తాలే. '... శివరామకృష్ణయ్య అలా అనడంతో కాత్యాయని మూతి ముడుచుకుంది.



శివరామకృష్ణయ్య అదే అటక మీద పాత ట్రంకు పెట్టిలో దాచిన పాత మోడల్ బట్టలతో సరదా ఫోటో తీయించుకోవాలని అతని ఉద్దేశం. ఎవరైనా పచ్చడి జాడి కోసం అటక ఎక్కితే దానితోపాటు ఈ ట్రంకు పెట్టిన కూడా క్రిందకు దింపించుకోవచ్చు అన్నది అతని అభిప్రాయం.



అది దృష్టిలో పెట్టుకునే తన ఫ్రెండ్ అబ్బిరాజు స్టూడియో లో పురమాయించాడు.. చాకులా బాగా పొడుగ్గా ఉండి.. ఫోటోలు బాగా తీసే వాడిని పంపమని.



ఆ అబ్బాయి వచ్చే టైం అయింది. అతను వచ్చాక ఎలాగోలాగా ఒప్పించి ముందు అటక ఎక్కించి ఈశాన్యం మూలన దాచిన పొడుగు ఫ్యాంటు, కురుస కాలరు షర్టు తనేసుకుని.. తనకు పెళ్లి అయిన కొత్తలో కాత్యాయని వేసుకుని వదిలేసిన లంగాఓణి బుట్ట చేతుల జాకెట్టు ఆమెచే ధరింపజేసి సరదాగా ఫోటో తీయించుకుని రోజు దాన్ని చూసుకుంటూ పాత జ్ఞాపకాల ఆనందాన్ని అనుభవిం చాలని... అదో చిలిపి కోరిక శివరామకృష్ణయ్యది. ఆ తీసిన ఫోటో సీక్రెట్ గా ఉంచుతాను అని భర్త మాట ఇవ్వడంతో తను కూడా రెడీ అంది కాత్యాయని ఫోటోకి.



శివరామకృష్ణయ్య స్నానం చేసి వచ్చేసరికి అబ్బిరాజు పంపిన ఫోటోఅబ్బాయి వీధిలో రెడీగా ఉన్నాడు.



"నిన్నేనా మా అబ్బిరాజు గాడు పంపింది.. నీ పేరేంటి?''



"సత్తిపండు."



"ఏడ్చినట్టు ఉంది. మామిడిపండు.. వెలగపండు.. అరటిపండు.. మరి ఈ సత్తిపండు ఏ చెట్టుకి పండు తుంది అబ్బాయ్. కొందరు పెద్దవాళ్ళకి బుద్ధులు ఉండవు అనడానికి ఇదే సాక్ష్యం. ఆలోచించి పెట్టాలి పేరు. ఆనందం అనో.. సంతోషం అనో పెట్టొచ్చు కదా. సరే మా అబ్బిరాజు గాడు.. ఆ వెధవ.. అదేనయ్యా ఏమవుతాడేంటి నీకు?.."



"మీ వెధవాoడి.. నాకు గురువవుతాడండి."



"అయ్యో అయ్యో నువ్వు కూడా వెధవా అని అంటావేంటి గౌరవం లేకుండా."



"అలాగంటేనే మీకు అర్థమవుతుందేమోనని....."



"సరే ఆ అప్రాచ్యుడు ఏం చెప్పాడేంటి నీకు??''



"మీరు చెప్పినట్టే నన్ను చేయమన్నారండి'



"అదిగది.. నేను చెప్పానులే వాడికి. నువ్వు వెళ్లేట ప్పుడు నీ చేతికి పాతచింతకాయ పచ్చడి ఇచ్చి పంపుతాననిి. ఆ వెధవ చింతకాయ పచ్చడి పెడతాను.. అంటే పెళ్ళాన్ని కూడా అమ్మేస్తాడు. అంత ఇష్టం వాడికి... ముందు ఆ ఎత్తుపీట మీద ఈ ముక్కాలు పీట వేసుకుని అటక ఎక్కుతావ''



అంతే.. ఆ అబ్బాయి ఎత్తుపీట మీద చిన్నపీట వేసుకుని జంపు చేసి అటక ఎక్కేశాడు. బ్యాటరీలైట్ సహాయంతో జాడీ వెతికాడు అదెక్కడ కనిపించలేదు.



"సత్తిపండు.. మా ఎదురింటి అవతారానికి అదృష్టం లేదు. అతనికిద్దామనుకున్నాను అటకెక్కిన అవతారం అనే బిరుదు.. ఇప్పుడు నీకు ఇస్తున్నాను అటక ఎక్కిన సత్తిపండు బిరుదు.. ఇదిగో అందుకో. పచ్చడి సువాసన మధురంగా ఉందా.. తొందరపడి నోట్లో వేసుకోకేే. క్రిందకు దించాక నీకు కొంచెం పెడతానని మాట ఇచ్చేగా'' అంటూ శివరామకృష్ణయ్య క్రింద నుండి డైరెక్షన్ ఇస్తున్న.. జాడి జాడ తెలుసుకోలేకపోయాడు సత్తిపండు.



"సరే.. పచ్చడి అంతా ఎలుకలు తినేసి ఉంటాయేమో''. శివరామకృష్ణయ్య తనే సర్ది చెప్పాడు.



"అవును కానీ జాడీ కనపడడం లేదంటున్నాడు. జాడీని కూడా ఎలుకలు తినేసి ఉంటాయంటారా?'' లోపల నుండి వస్తూ అంది కాత్యాయని.



హైటెక్ యుగం. ఎలుకలు తినేసిన తినేసి ఉండొచ్చు. సత్తిపండు.. జాడి తీరిగ్గా వెతికించి మీకు అందరికీ పచ్చడి పంపుతాను కానీ.. ఎలాగూ ఎక్కావు కనుక ఓ చిన్న పని చేసి పెడుతూ. అదిగో ఆ తూర్పు వైపు ఈశాన్యం మూలన.. కొంచెం దూరంగా చూడు ఆ చీకట్లో దెయ్యంలా నల్ల ట్రంకు పెట్టె కనిపించడం లేదూ... దాన్ని పట్టుకుని వచ్చేయ్'''



అంతే అతి కష్టం మీద సత్తిపండు ఆ పెట్టుతో సహా అటక దిగాడు. "పాత చింతకాయపచ్చడి అటక అటక అంటూ ఎక్కించారు.. చివరికి పాత ట్రంకు పెట్టుతో దింపించారు.. " చిరాకుపడ్డాడు సత్తిపండు.



"ఇదిగో అబ్బాయి మాలాంటి పెద్ద వాళ్ళందరినీ నీలాంటి కుర్రకుంకలు ఇలాగే అపార్థం చేసుకుంటారు ముందు.. అర్థం అయ్యాక సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తారు. గోచి పెట్టుకోవడం తెలియని కూర్మాపురం కుర్రోడు లాంటోడివి నీకు ఇది అర్థం కాదులే."



చివరికి శివరామకృష్ణయ్య దంపతులు ఆ పాత బట్టలు వేసుకొని రెడీ అయ్యారు. సత్తిపండుకి చాలా కోపం వచ్చింది వాళ్ళ డ్రస్ చూసి. తన గురువు అలాంటి ఫోటో తీస్తే కోప్పడతాడేమోనని అనుమానించాడు. శివరామకృష్ణయ్యకు అతని పరిస్థితి అర్థమైంది.



"చూడు సత్తిపండు ఈ ఫోటో చాలా సీక్రెట్.. నీకు నాకు మా ఆవిడకు తప్పించి ఏడో కంటికి తెలియ కూడదు. ఇంకో మాట జాగ్రత్తగా విను.. మీ పక్క వీధిలో ఉన్న శ్రీ కౌముదిపేపర్ ఎడిటర్. అతను నాకు మీ గురువుకి ప్రాణ స్నేహితుడు. రాష్ట్రమంతా పెద్ద సర్కులేషన్ పత్రిక అది. ఆ పత్రిక ఎడిటర్ కి మాత్రం నువ్వు ఈ ఫోటోని చచ్చినా కనపడనివ్వకు.".. చెప్తున్నాడు శివరామకృష్ణయ్య.



"మళ్లీ ఇంకో మలుపు తిప్పారు.. బుర్ర పగిలిపోతుంది సారూ " అన్నాడు సత్తిపండు.



"వస్తున్నా వస్తున్నా పాయింటు కరెక్ట్ గానే ఉంది.. నేను ఊసుపోని కాకమ్మ కథ చెప్పడం లేదు. నీకే అర్థమయ్యే ఏడుస్తుందిలే చివర్లో. సరే.. అసలు విషయం ఏమిటoటే ఆ ఎడిటర్ ఇలాంటి గమ్మత్తైన ఫోటోలు అన్నీ సేకరించి తన పేపర్లో తీపి గుర్తు శీర్షికలో వేస్తుంటాడు. ఇలాంటి ఫోటోలు ఇచ్చిన వాళ్లకే వెయ్యి రూపాయలు.. వినబడుతుందా.. అక్షరాల వెయ్యి రూపాయలు బహుమతి ఇస్తుంటాడు.



ఆ ఫోటో అతని పేపర్లో పడితే సర్కులేషన్ పెరిగిపో తుందన్నమాట. వింటున్నావా గొప్ప బిజినెస్ టెక్నిక్. నీకు తెలియదులే.. నిడదవోలు గేదెలపాలు పితికే కుర్రాడు వయసు నీది." సత్తిపండు వైపు వారగా చూస్తూ అన్నాడు శివరామకృష్ణయ్య.



"అమ్మో ఫోటో ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తాడా!".. ఆశ్చర్యపడ్డాడు తనలోనే సత్తిపండు.



"ఇదిగో ఆ వెయ్యి రూపాయలు కొట్టేయాలను కుంటున్నావా.. నీ ముఖం వాలకం చూస్తుంటే అలాగే చేస్తావనిపిస్తుంది... ఏది అలాంటి ఉద్దేశం నీకు లేదని నా కళ్ళలోకి చూసి చెప్ప.."



"అబ్బే.. నేనెందుకు చేస్తానండి.. చచ్చిన అలాంటి పని చేయను. " మొఖం అడ్డంగా తిప్పుతూ అన్నాడు సత్తిపండు.



"చచ్చాక నువ్వేంచేస్తావు.. ఏదైనా చేస్తే బ్రతికుండగానే చేయాలి. సత్తిపండు.. పోనీ నువ్వు ఫోటో ఆ ఎడిటర్ గారికి ఇచ్చిన పర్వాలేదు.. ఈ ఫోటో చిరాకుదంపతులది అని మాత్రం చెప్పకు."



"చిరాకుదంపతులు అంటే.. " అమాయకంగా అడిగాడు సత్తిపండు.



"అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్.. నా పేరు షార్టు కట్టులో.... శి.. రా.. కృ.. నా కవిత ఖండికలలో ఈ షార్ట్ కట్టు పేరుని శ్రీ కౌముది పేపర్ అతను తరచూ వేసేవాడు. రాను రాను నీలాంటి నోరు తిరగని కాకి ముక్కు రకం వెధవల వల్ల ఆ అందమైన పేరు కాస్త.. ' చిరాకు.. చిరాకు దంపతులు'.. గా రూపం మారిపోయి పెద్ద ప్రాచుర్యం పొందింది. ఇదంతా ఆ ఎడిటర్ కి గుర్తు చేసి మా ఫోటో అతనికిచ్చేసి అతనిచ్చే వెయ్యి రూపాయలు కొట్టే ద్దామని కచ్చితంగా నీ మనసులో తీర్మానం చేసు
కున్నట్టు కనిపిస్తున్నావు. బాబ్బాబు అలా చేయకే" శివరామకృష్ణయ్య బ్రతిమలాడాడు.



"అంత గొప్పవారా.. మీ పరువు నేనెందుకు తీస్తాను సార్. ఈ ఫోటో మీ తీపి వగరు కారం చేదు పులుపు.. వగైరా గుర్తు అని నాకు తెలుసు కదా."



"హమ్మయ్య... సత్తిపండు.. అసలు ఆ ఎడిటర్ నీకు తెలుసా''..



"తెలుసండీ.. సత్యనారాయణగారు.. వాడ్రేవు వారి వీధి. మా వీధి చివర.. ప్రతిరోజు తెల్లవారకుండా కబుర్లాడుకుంటూ చెరో చెంబుడు నీళ్లతో ఊరవతల ద్రాక్షారామం మైలురాయి దగ్గరకి కలిసే వెళ్తాం మేమిద్దరం."... చెప్పాడు సత్తిపండు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: హాస్య కథలు - BSC - by k3vv3 - 03-09-2025, 09:46 PM
RE: హాస్య కథలు - ఆనవాయితీతో ఆబ్దికం - by k3vv3 - 06-04-2026, 04:40 PM



Users browsing this thread: 2 Guest(s)