13-03-2026, 07:14 AM
Part - 17
ఆలా తల్లి వైపు చూస్తూ రుద్ర భయంతో వణికిపోసాగాడు..
రుద్ర అరిచిన అరుపుకి బయట ఉన్న అందరూ వేగంగా పరిగెత్తుకుంటూ మేడపైకి వచ్చేసారు..
అతని పరిస్థితి గమనించిన గోవింద రావు
రుద్ర భుజం పై చేయి వేశాడు..
ఒక్కసారిగా ఉలిక్కిపడి, గోవింద రావు వైపు చూసాడు రుద్ర..
"ఇప్పటికైనా అర్థం అయ్యిందా..? ఈ విద్య నిన్ను ఎందుకు ఉపయోగించమన్నానో..!!"
అన్నారు గోవింద రావు...
కన్నీళ్లతో తల్లి వైపు చూస్తున్న రుద్ర ని చూసి అందరూ కంగారు పడసాగారు.
"ఏమైంది చిన్నాన్న..?" అని ఆందోళనగా అడిగాడు సత్యనారాయణ రావు..
మిగిలిన వారు కూడా అదే సందేహంతో గోవింద రావు వైపు రుద్ర వైపు చూడసాగారు..
రుద్ర తల్లికి సపర్యలు చేసే పని వాళ్లు కూడా ఏమైందొనని కంగారుగా బిత్తర చూపులు చూడసాగారు..
గోవింద రావు వాళ్ళవైపు చూసి.." ఈరోజుకి మీ పని ఇక్కడ ఏమీ లేదు. బయలుదేరండి.." అని వాళ్ళతో చెప్పి పంపించి వేశారు....
బాధతో తన తల్లి వంకే చూస్తూ ఉన్న రుద్ర ని అక్కడ నుంచి కిందకు తీసుకువచ్చాడు గోవింద రావు..
అందరూ కింద ఉన్న సోఫాలో కూర్చున్నారు..
రుద్ర మాత్రం ఎవరితోనూ మాట్లాడకుండా కన్నీళ్లతో శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు..
"ఏమయి ఉంటుంది సార్..!!" అని మెల్లగా అడిగాడు పురుషోత్తం, సత్యనారాయణ రావు తో
"నాకు అదే అర్థం కావటంలేదు..?అడిగి చూస్తా..!" అని అంటూ..
"అసలు ఏమైంది చిన్నాన్న..!?? రుద్ర ఎందుకలా బాధపడుతున్నాడు..? అతని తల్లి గారికి ఏమైంది...??"అని అడిగాడు సత్యనారాయణ రావు..
" రుద్ర తల్లి గారు.. రెండు భయంకరమైన ప్రేతాత్మలు చేత బంధింపబడి ఉన్నారు..
మెల్లగా ఆమె జీవశక్తిని పీల్చేస్తూ ఉన్నాయి.
ఒక విధంగా ఆవిడ ఇన్ని సంవత్సరాలుగా బ్రతికి ఉందంటే ఆమె దృఢమైన మనోనిబ్బరం కానీ కొడుకు మీద ఉన్న అమితమైన ప్రేమ కానీ కారణం కావచ్చు..
తనని అదృష్ట శక్తుల బారి నుంచి విడిపించే వారి కోసం ఇన్నాళ్ళు ఎదురు చూస్తోంది.."
అని ఆమె పరిస్థితి వాళ్ళందరికీ వివరించాడు..
" మరి రుద్ర కి తాంత్రిక విద్యలు తెలుసు కదా..!! మరి ఇప్పటి వరకు ఎలా తెలుసుకోలేకపోయాడు..??"మరి సందేహాన్ని వెలిబుచ్చాడు సత్యనారాయణ రావు..
" నువ్వు చెప్పేది నిజమే రావు..!!
రుద్ర ఒక శక్తివంతమైన తాంత్రికుడు..!!
కానీ...!! తన తండ్రి చనిపోవడం తన తల్లికి ఇలా జరగడం వల్ల, ఆవేశంలో
తన శక్తులను ఉపయోగించలేదు..!!
ఆనాడే కొంత సహనం వహించి, దీనికి కారణం తెలుసుకోగలిగి ఉంటే ఆమె
ఆ ప్రేతాత్మల నుండి ఎప్పుడో విముక్తి కలిగేది..!!"అంటూ వివరించాడు..
ఆ మాటలు మౌనంగా వింటున్న రుద్ర కళ్ళ నుంచి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి..
" మరి ఇప్పుడు ఆవిడని కాపాడడం ఎలాగ సార్..??"అని అడిగాడు రవి..
" అదే ఆలోచిస్తున్నాను..!! ఆవిడ పరిస్థితి ప్రస్తుతం అసలు బాగాలేదు..!! ఇప్పుడు ప్రేతాత్మలు నుంచి విడిపించడం నావల్ల అవుతుందో లేదో కూడా తెలియటం లేదు..!"అని చెప్పి మౌనం వహించారు గోవింద రావు...
అప్పటి వరకు ఆయన పక్కన కూర్చుని మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్న రుద్ర ఒక్కసారిగా ఆయన కాళ్ళ మీద పడి ఏడవసాగాడు...
" స్వామి దయచేసి నా తల్లిని కాపాడండి..!
ఆవేశంలో నేను తీసుకున్న నిర్ణయం వల్ల,
ఈరోజు నా తల్లి నరకం అనుభవిస్తుంది..
నా ప్రాణం పోయినా పర్వాలేదు. నా తల్లిని ఆ ప్రేతాత్మల నుంచి కాపాడండి.." అంటూ కన్నీళ్లతో ఆయన కాళ్లు కడగసాగాడు...
గోవింద రావు చిరునవ్వు నవ్వుతూ, రుద్ర ని పైకి లేపి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు..
తన తలపై నిమురుతూ...
"చూడు నాయనా..!! బాధపడకు, ధైర్యంగా ఉండు.. నీ తల్లిని కాపాడడానికి
నా శాయశక్తులా ప్రయత్నిస్తాను..
కానీ ఆమెను పూర్తిస్థాయిలో వాటి నుంచి కాపాడగలిగేది నువ్వు మాత్రమే....
నువ్వు తలుచుకుంటే కచ్చితంగా కాపాడగలవు.. నీకు అన్ని విధాలా
నా సహాయం ఉంటుంది ఈరోజు రాత్రికి మనం పూజ ప్రారంభిద్దాం..!!" అంటూ రుద్రని ఓదార్చారు..
ఆ మాటలకి రుద్ర ఆనందంతో
" థాంక్యూ స్వామి.. ఈరోజు రాత్రికి మనం దుష్టశక్తి అవాహనం చేద్దాం.."
"మంచిది..! ఈరోజు రాత్రి జరగవలసిన పూజకి కావలసిన ఏర్పాట్లు అవి మీరిద్దరూ చూసుకోండి.." అంటూ పురుషోత్తం రవి లకి అప్పజెప్పారు..
ఇద్దరు సరే అని అన్నారు...
గోవింద రావు రుద్ర వైపు చూసి "రాత్రికి చేయవలసిన దుష్టశక్తి ఆవాహన ప్రక్రియ ఒకసారి నెమరు వేసుకొ..! ఎందుకంటే ఇటువంటి ప్రక్రియలో పొరపాట్లు ఎట్టి పరిస్థితులలోనూ జరగకూడదు.."అని హెచ్చరించే సరికి "సరే స్వామి..!!" అంటూ రుద్ర తన గదిలోకి వెళ్ళిపోయాడు..
పురుషోత్తం రవి ఇద్దరూ మిగిలిన పనులు చూసుకోవటానికి బయటికి వెళ్లారు..
హాలులో గోవింద రావు, సత్యనారాయణ రావు మాత్రమే మిగిలారు..
సత్యనారాయణ రావు గోవింద రావు పక్కకు వచ్చి మెల్లగా అసలు ఆమెకు ఏమైంది చిన్నాన్న..?? నాకు ఏమీ అర్థం కావడం లేదు..??" అని అడిగాడు..
ఆ మాటకు సమాధానంగా గోవింద రావు "నాతో పాటు పైకి రా..!" అని రుద్రతల్లి ఉన్న గది వైపు తీసుకు వెళ్లారు..
ఇద్దరూ మేడపైన ఆమె వద్దకు చేరుకున్నారు..
ఆమె గది ముందు నుంచుని ఉన్నారు..
" ఇప్పుడు ఆవిడ గదిలో నీకేం కనిపిస్తోంది..??" అని సత్యనారాయణ రావు అని అడిగారు గోవింద రావు..
ఆ మాటకు సమాధానంగా ఆ గది లోపల చుట్టూ చూశాడు సత్యనారాయణ రావు.
" నాకు ఏమి కనిపించట్లేదు చిన్నాన్న..??"
"సరే నీకు ఒక మంత్రాన్ని చెప్తాను..
అది జపిస్తూ ఆ గదిలోకి అడుగుపెట్టు.."అని సత్యనారాయణ రావు చెవిలో ఒక మంత్రాన్ని చెప్పారు...
గోవింద రావు ఆ మంత్రాన్ని జపిస్తూ మరల తల్లి గదిలోకి అడుగుపెట్టి ఆమె వైపు చూశాడు...
అలా అడుగు పెట్టిన మరుక్షణం ఆమె వైపు చూసి సత్యనారాయణ రావు కళ్ళు ఆశ్చర్యంతో, భయంతో పెద్దవయ్యాయి..
ఎందుకంటే....!!
ఆమె శరీరాన్ని చుట్టుకుని రెండు ప్రేతాత్మలు ఉన్నాయి... అవి చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి.. ఎర్రటి కళ్ళతో వికృతంగా.. సామాన్యులు ఎవరైనా సరే.. చూస్తే జడుచుకునే విధంగా ఉన్నాయి..
అవి ఆమె శరీరాన్ని కదలనివ్వకుండా బంధించి,ఆమె జీవశక్తిని పీల్చేస్తున్నాయి.
ఆ పరిస్థితులలో ఆమెను చూసిన సత్యనారాయణ రావుకి శరీరమంతా చెమటలు పట్టేసాయి..వెంటనే గది నుండి బయటకు వచ్చేసాడు.. ఆ కంగారులో కిందకి తూలి పడిపోబోయాడు..
అక్కడే ఉన్న గోవింద రావు అతన్ని పడిపోకుండా పట్టుకొన్నారు...
సత్యనారాయణ రావు కంగారుపడుతూ..
" ఏంటిది చిన్నాన్న..!!?? ఒక శరీరాన్ని చుట్టుకుని రెండు ప్రేతాత్మల ని చూడటం ఇదే మొదటిసారి..!! మీరు చెప్పింది నిజమే.
ఇన్ని సంవత్సరాలుగా వీటి నుంచి ప్రాణం పోకుండా ఉండాలంటే చాలా దృఢమైన సంకల్పం మనోనిబ్బరం ఉండాలి.."అని అన్నాడు..
" ఆవిడ గొప్ప సాద్వి..!! మహా భక్తురాలు..!!
ఆమె చేసుకున్న పూజాఫలమే..!! ఇన్నాళ్ళు ఆవిడకి రక్షగా ప్రాణం పోకుండా నిలిపింది.
మనం ఇక్కడికి రావడం కూడా అంతా దైవేచ్ఛ..!! మనం ఎలాగైనా ఆవిడని కాపాడి తీరాలి..!!"
" కానీ చిన్నాన్న...!!మీరు తలుచుకుంటే ఆవిడని మీరొక్కరే కాపాడగలరు..
కానీ ఈ పనిని రుద్రకి ఎందుకు అప్పచెబుతున్నారు..??"
" చూడు రావు..!! నువ్వు అనుకున్నట్లు ఇది మామూలు క్రతువు కాదు.. ఇటువంటి క్రతువు తాంత్రిక విద్య తెలిసిన వారు మాత్రమే జరిపించగలరు..మామూలుగా నెల రోజులు, రెండు నెలలుగా ఒక శరీరాన్ని ప్రేతాత్మ ఆవహిస్తే దాన్ని వదిలించడానికి చాలా సమయం పడుతుంది.. అటువంటిది కొన్ని సంవత్సరాలుగా రెండు ప్రేతాత్మలు ఒకే శరీరాన్ని అంటిపెట్టుకునే ఉన్నాయి.. వాటిని ఆ శరీరం నుంచి వేరు చేయాలంటే దాదాపు అసాధ్యం..!! అలా ప్రేతాత్మలను బంధించే సమయంలో అవి ఆవహించిన మనిషి చనిపోవచ్చు..!! కాబట్టి మనం ఎలాగైనా రుద్ర కి సహాయం చేసే తీరాలి...!!"అదే చెప్పారు గోవింద రావు...
వీళ్లిద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో
చేతిలో కొన్ని తాళపత్రాలు పట్టుకొని రుద్ర అక్కడికి వచ్చాడు..
వాటిని గోవింద రావు ఇస్తూ..!!
" స్వామి నేను ఇప్పుడు పూర్తిగా దుష్టశక్తి ఆవాహన క్రతువు కి సిద్ధంగా ఉన్నాను..!
ఇది ఆ క్రతువుకి సంబంధించిన తాళపత్రం.
రాత్రి క్రతువులో మీరు కూడా ఉంటారు కాబట్టి...మీకు ఉపయోగపడుతుందని తీసుకు వచ్చాను..."అని అన్నాడు..
గోవింద రావు వాటిని తీసుకుని " మంచిది రుద్ర.. ఈ రోజు రాత్రి సరిగ్గా 11 గంటల 30 నిమిషాలకి ముహూర్తం ఉంది.. అర్ధరాత్రి 12గంటలు దాటే లోపు క్రతువు పూర్తి అయిపోవాలి.. లేదంటే శుభ ఘడియలు పోయి, అశుభ ఘడియలు మొదలవుతాయి. అది చాలా ప్రమాదకరం.
మనకున్నది కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే.. ఆలోపు
ఆ ప్రేతాత్మలని బంధించి తీరాలి...!" హెచ్చరికగా చెప్పారు...
ఆయన చెప్పిందంతా జాగ్రత్తగా విన్నాడు రుద్ర..
" సరే స్వామి...!! మీరు చెప్పినట్టుగా నేను
ఆ ఏర్పాట్లలో ఉంటాను..!"అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు..
సత్యనారాయణ రావు కూడా చిన్న పని చూసుకోని వస్తానని బయటికి వెళ్లాడు..
గోవింద రావు మాత్రం నేలపై పద్మాసనం వేసుకుని కూర్చుని, ఆ తాళపత్రాలను నిశితంగా పరిశీలించ సాగారు..
ఆ రోజు రాత్రి....
సమయం 11 గంటల ఇరవై నిమిషాలు..
రుద్ర ఇంటి వెనుక భాగంలో క్రతువుకి సంబంధించిన ఏర్పాట్లు చేయబడ్డాయి..
రుద్ర అక్కడికి వచ్చాడు..
మెడలో రుద్రాక్షమాలలతో, నల్లని వస్త్రములు ధరించి, నుదుటిపై పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని, చేతిలో దండం వంటి ఒక కర్ర పట్టుకొని చూడడానికి
భీతి గొలిపేలా ఉన్నాడు
10 నిమిషాలలో పూజ మొదలు అవుతుంది అనగా రుద్రని తన వద్దకి పిలిచారు గోవింద రావు..
గోవింద రావు రుద్ర తో మాట్లాడుతూ...!!
" చూడు నాయనా..!! నేను చదివిన దాని ప్రకారం ఈ క్రతువు చాలా ప్రమాదకరమైనది.. ఎందుకంటే మనం బంధించబోయేది ఒక ప్రేతాత్మ ని కాదు రెండిటిని పైగా అవి చాలా సంవత్సరాలుగా నీ తల్లి జీవశక్తి తీసుకోవడం వలన చాలా దృఢంగా ఉన్నాయి.. వాటి శక్తిని తక్కువగా అంచనా వేస్తే మనలో ఎవరు కూడా ప్రాణాలతో మిగలమూ.. అంత శక్తి వాటికి ఉంది.. కాబట్టి నువ్వు ఇప్పుడు జరిపించే
క్రతువులో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా ధైర్యం కోల్పోకుండా ఉండాలి..
అప్పుడే మన ప్రయత్నం విజయవంతమై మీ తల్లి గారి ని కాపాడగలము.."అంటూ జాగ్రత్తలు చెప్పారు..
ఇదిగో ఇవి తీసుకో అంటూ రెండు చెక్క బొమ్మలు చేతిలో పెట్టారు..
" మారేడు చెక్కతో చేసిన నేను మంత్రించిన బొమ్మలు..! ఆ దుష్టశక్తులను బంధించడానికి ఇవే సరైనవి..!!"
" తమరి ఆజ్ఞ స్వామి..! మీరు చెప్పినట్టే వింటాను.." అంటూ ఆయన కాళ్ళకు నమస్కరించాడు..
రుద్ర తల్లి గారిని ఒక స్ట్రెచర్ పై క్రతువు జరుగుతున్న చోటికి తీసుకువచ్చారు..
క్రతువులో మొదటిగా చేయవలసిన పని.
ఆమె శరీరం నుంచి ప్రేతాత్మలను దూరం చేయాలి.. తరువాత వాటిని ఆ మంత్రించిన చెక్కతో చేసిన బొమ్మలలో బంధించి భూస్థాపితం చేయాలి...
ఆ ప్రేతాత్మలని రుద్ర ఆవాహన చేస్తాడు..
అవి దూరం అయిన మరుక్షణం రుద్ర తల్లికి రక్షణ ఏర్పాట్లు గోవింద రావు చేస్తారు....
క్రతువు మొదలైంది....!!
మొదట రుద్ర దుష్టశక్తి ఆవాహన ప్రక్రియని ప్రారంభించాడు...
పెద్ద వలయం గీసి, అందులో ఒక హోమ గుండాన్ని వెలిగించారు... రుద్ర అందులో సమిధలు వేస్తూ మంత్రోచ్ఛారణ చేయసాగాడు.. ఆ హోమగుండం ముందు కుంకుమ తో ముగ్గు వేసి అందులో గోవింద రావు ఇచ్చిన బొమ్మలు ఉంచాడు... వాటిపై కుంకుమ జల్లుతూ మంత్ర పఠనం చేస్తూ ఉండగా... అక్కడ స్ట్రెచర్ పై ఉన్న రుద్ర తల్లి శరీరం గిలగిలా కొట్టుకోసాగింది.. కొంతసేపటికి అలా గిలగిలా కొట్టుకుంటూ ఆమె ఆగిపోయింది..
ఆమె కొట్టుకోవడం ఆగిపోయిన వెంటనే రుద్ర ముందు పడుకొబెట్టి ఉన్న రెండు బొమ్మలు లేచి నుంచున్నాయి..
అది గమనించిన గోవింద రావు మరుక్షణం
భద్ర తల్లి చుట్టూ ఒక వలయం గీసి, దాని లోపలకి ఏ దుష్ట శక్తి వెళ్లకుండా,
శక్తి ఆవాహన ప్రక్రియను మొదలుపెట్టారు..
అటువైపు రుద్ర ఆ ప్రేతాత్మ లను ఆ బొమ్మలలో బంధించడానికి తన మంత్ర శక్తితో శతవిధాల ప్రయత్నిస్తున్నాడు..
కానీ అవి ఏ మాత్రం తగ్గటం లేదు....
సమయం గడిచిపోతోంది...
క్రతువు పూర్తి అవుతుంది అనగా ఆ సమయంలో ఒక్కసారిగా రుద్ర కూర్చున్న వలయంలో గాలి బలంగా వీచింది..
అతని ముందు ఉన్న బొమ్మలు దూరంగా ఎగిరి పడ్డాయి.. ఆ బొమ్మలు ఎగిరిపడ్డగానే
అవి రుద్ర ని దూరంగా విసిరి కొట్టాయ్..
వలయం నుంచి ఎగిరి పడ్డాడు రుద్ర..
రుద్ర గీసిన వలయం నుంచి అవి బయటకు వేగంగా రుద్ర తల్లి వైపు వెళ్ళసాగాయి..
అవి వేగంగా రుద్ర తల్లి మీదకి వెళ్ళగా..
ఆమె చుట్టూ ఒక శక్తివంతమైన రక్షణ కవచం వాటిని అడ్డుకుంది...
కానీ అవి వదలకుండా రక్షణ కవచం మీద దాడి చేయసాగాయి..
ఆ రక్షణ కవచం గోవింద రావు ఏర్పాటు చేసినది.. అక్కడ కూర్చుని శక్తి కవచాన్ని ఏర్పాటు చేశారు.. నిరంతరం మంత్ర పఠనం వల్ల దానికి శక్తి చేకూరుతుంది.. అవి ఆ విషయం గ్రహించి నేరుగా అక్కడ పూజలో కూర్చున్న గోవింద రావు పై దాడి చేయడం మొదలు పెట్టాయి... అవి దాడి చేయడం వల్ల గోవింద రావు శరీరం కంపించసాగింది..
మెల్లగా ఆయన ముక్కు నుంచి రక్తం రావడం ప్రారంభమైంది.. దూరంగా గమనించిన రుద్ర వేగంగా ఆయనవైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉండగా....
రుద్ర ని సత్యనారాయణ రావు పట్టుకుని ఆపేశాడు...
" నన్ను ఆపకండి.. ఆయన చాలా ప్రమాదం లో ఉన్నారు. నా సాయం అవసరం.."అని రుద్ర అంటుండగా...
" ఇదంతా ముందుగానే గురువు గారికి తెలుసు..! ఈ పరిస్థితి వచ్చిన వెంటనే నాకు ఏం చెయ్యాలో ముందుగానే చెప్పారు..! వెంటనే ఆ బొమ్మలను వెతికి క్రతువు ప్రారంభించాలి.. లేకపోతే అందరి ప్రాణాలకి చాలా ప్రమాదం..!!
గురువుగారి చెప్పినట్టు ఇక మనకి పది నిమిషాలు మాత్రమే ఉంది." అంటూ సత్యనారాయణ రావు చెప్పగానే..
రుద్ర వెంటనే ఆ బొమ్మలని వెతకసాగాడు..
ఒక 5 నిమిషాల తరువాత అతని ప్రయత్నం ఫలించి, ఆ రెండు బొమ్మలు దొరికాయి...
రుద్ర ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిరిగి హోమగుండం దగ్గర పూజ ప్రారంభించాడు..
మరోవైపు ఆ ప్రేతాత్మల దాడి వల్ల గోవింద రావు శరీరం చిగురుటాకులాగా వణికిపోతోంది.. ముక్కు నుండి రక్తం కారుతూనే వుంది..
ఇంకొక్క నిమిషంలో పూజ ముగుస్తుంది అనగా తన ముందు ఉన్న రెండు బొమ్మలని తీసి గోవింద రావు వైపు విసిరి వేసాడు..రుద్ర.
ఆ బొమ్మలు రెండు ఎగురుకుంటూ వెళ్లి, గోవింద రావు ముందు పడ్డాయి.. అలా పడిన వెంటనే వాటి నుంచి ప్రకాశవంతమైన వెలుగులు పుట్టి, ఆ రెండు ప్రేతాత్మలు
ఆ బొమ్మల లోపలికి వెళ్ళి పోయాయి.. అవి వెళ్ళిపోయిన మరుక్షణం అప్పటివరకు కళ్ళు మూసుకొని మంత్రాలు జపిస్తున్న గోవింద రావు ఉన్నట్టుండి ఓ పక్కకి ఒరిగి పడిపోయారు...
ముక్కునుంచి నిరంతరంగా రక్తం కారడం వల్ల, ఆయన ఛాతి భాగం మొత్తం రక్తంతో తడిసిపోయింది... మిగిలిన వారు వెంటనే అక్కడి నుంచి గోవింద రావుని, రుద్ర తల్లిని హాస్పిటల్ కి తరలించారు....
ఇంకా ఉంది....!!!


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)