Thread Rating:
  • 2 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - పుణ్యం కోసం

విజయవాడలో శారద బాల్య స్నేహితురాలు శివాని ఉంటుంది. ఆమె ఒక లాయర్. శారదను చూడగానే ఎగిరి గంతేసినంత పని చేసిందామె. ఫోన్ చేయగానే బస్టాండ్ కి వచ్చి శారదను తన ఇంటికి తీసుకెళ్ళింది. దారిలో తానడిగిన ప్రశ్నలకు అరకొరగా అన్యమనస్కంగా సమాధానాలు చెబుతున్న శారదను పరీక్షగా చూసిన శివాని నిస్తేజంగా పాలిపోయినట్టున్న మొహం, రాత్రంతా బస్సులో ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు చూసి జరుగరానిదేదో జరిగిందని అర్ధం చేసుకుని మరింక మాట్లాడలేదు.
 
 
పదిహేను నిమిషాలు కార్లో ప్రయాణించి ఇంటికి చేరాక కట్టుకోవడానికి బట్టలిచ్చి స్నానం చేసి రమ్మని శారదను బాత్రూం లోకి పంపింది శివాని. దాదాపు అరగంట స్నానం తరవాత కాస్త రిలీఫ్ అనిపించింది శారదకు. బయటకొచ్చేసరికి జీడిపప్పు ఉప్మా వేడి వేడిగా చేతికందించింది శివాని. ఆమెకు తెలుసు శారదకు ఉప్మా అంటే ఇష్టమని. శివాని మొహంలో శారద పట్ల గల ప్రేమ అభిమానం తొణకిసలాడుతున్నది. ఎన్నో రోజులు తరువాత మనస్ఫూర్తిగా ఆహారం తిన్నది శారద. వేడి వేడి కాఫీ కూడా తాగాక శారద మొహంలో కళ వచ్చి చేరింది. అలసటగా కన్నులు మూసుకున్న శారద కొద్ది నిమిషాల్లోనే నిద్రాదేవి ఒడిలోకి జారుకుంది.
అలా ఎంత సేపు పడుకుందో తెలియదు కానీ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా టీపాయ్ మీద కనపడిందొక కాగితం. 
"ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకోవే శారదా. నేను కోర్టుకెళ్ళి మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాను. కలిసి భోజనం చేద్దాం. ఈలోపులో ఆకలేస్తే డైనింగ్ టేబుల్ మీద అన్నీ రెడీగా ఉన్నాయి. తినేసెయ్యి - నీ శివాని" ముత్యాల్లాంటి అక్షరాలకేసి చూస్తూ మళ్ళీ నిద్రలోకి జారుకుంది శారద. 
అందానికి, ఆత్మాభిమానానికి మారుపేరు శివాని. అందుకేనేమో, ఆమె జీవితాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. జీవితం లో ఏ విషయంలోను కాంప్రమైజ్ కాలేని వాళ్ళు ఎవరితోనూ కలిసి జీవించలేరు.
 
ఎవరో తట్టి లేపినట్లు లేచి కూర్చుని చుట్టూ చూసిన శారదకు వంటింట్లోంచి ఆహార పదార్థాలు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దుతున్న శివాని కనిపించింది.
"లేచావా తల్లీ. తొందరగా రావే, ఆకలి దంచేస్తోంది నాకు" అన్నది శివాని నవ్వుతూ. బలహీనంగా నవ్వి "లేపొచ్చు కదే" డైనింగ్ ఛైర్లో కూర్చుంటూ అన్నది శారద.
ఇద్దరూ మాట్లాడుకుంటూ భోజనం ముగించారు. తరవాత సోఫాలో కూర్చుని చెప్పడం ప్రారంభించింది శారద. అంతా చెప్పి వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది.
కొద్దిసేపు ఆమెను ఏడవనిచ్చి "మీ ఆయనతో ఒక్కసారి మాట్లాడి ఉండవలసిందే శారదా" అన్నది శివాని‌ సాలోచనగా. నవీన్, సుకన్యల ఛాటింగ్, సుకన్యతో మాట్లాడనే లేదని నవీన్ చెప్పిన అబద్ధం, ఉన్నట్లుండి సుకన్య మొహం చాటేయడం ఇవన్నీ చూస్తుంటే శారద అనుమానం నిజమే అనిపించినా శారద తన భర్తతో మాట్లాడి ఉంటే మరింత స్పష్టత, ఆధారాలు దొరికుండేవి అనిపించింది శివాని లాయర్ బుర్రకి.
నిర్వికారంగా చూసింది శారద తన స్నేహితురాలికేసి. స్నేహితురాలికి ఏదో చెప్పాలని ప్రయత్నించి అలసటగా కళ్ళు మూసుకుంది.‌ అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు.
 
కళ్ళు తెరిచేసరికి ఎదురుగా నవ్వుతూ శివాని కనపడింది.‌ అయోమయంగా చుట్టూ చూసిన శారద తానొక ఆసుపత్రి బెడ్ మీద ఉన్నట్లు గ్రహించి, ఏం జరిగిదన్నట్లు శివానికేసి చూసింది.
ఉబికి వస్తున్న ఆనందాన్ని ఆపుకుంటూ శివాని "కంగ్రాచ్యులేషన్సే" అంది మెరుస్తున్న కళ్ళతో. మరింత అయోమయానికి గురైన శారద ఏదో చెప్పాలని నోరు తెరిచేలోపు "నువ్వు తల్లివి కాబోతున్నావే" అంది శివాని.
ఒక్క క్షణం శారదకు అర్ధం కాలేదు, తన స్నేహితురాలు మాట్లాడేది ఏమిటో. అర్ధం అయ్యాక సంభ్రమాశ్చర్యాలతో కళ్ళ వెంట నీళ్ళు కారుతుండగా శివాని చేతులు పట్టుకుని "థాంక్యూ శివానీ" అన్నది.
ఇంకా ఏదో మాట్లాడబోతున్న శివాని తన మొబైల్ మోగడంతో ఆగు అన్నట్లుగా శారదకు సైగ చేసి ఫోన్ లో హలో అన్నది. అవతల వ్యక్తి మాట్లాడిన మాటలు వినబడటంలేదు, కానీ శివాని మాటలు వినపడుతున్నాయి.
శివాని: అవును. నేనే శివాని. చెప్పండి 
అవతల వ్యక్తి: --------
శివాని: ఏం, ఇప్పటికి గుర్తొచ్చిందా మీ భార్య? 
అవతల వ్యక్తి: --------
శివాని: తన ఏ పరిస్థితుల్లో ఉందో తెలిస్తే మీరిలా మాట్లాడరు 
అవతల వ్యక్తి: --------
శివాని: ఆసలేమనుకుంటున్నారండీ మీరు? తనకు ఎవరూ లేరనుకుంటున్నారా? ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా?
అవతల వ్యక్తి: ---------
శివాని: లుక్ మిస్టర్.‌ డోంట్ థింక్ యు కెన్ గో స్కాట్ ఫ్రీ. ఐ విల్ నాట్ లెట్ యు. వెయిట్ ఫర్ ద కాన్సీక్వెన్సెస్ మీ...
ఆ మాటలు వింటుండగానే శారదకు అర్ధం అయిపోయింది అవతల వ్యక్తి తన భర్తే అని. తను గర్భం దాల్చిన సంతోషం క్షణం కూడా నిలవకుండా చేసిన భర్త పట్ల వళ్ళు తెలియని ఆగ్రహం ఆవహించింది.
ఆవేశంతో ఊగిపోతూ "ఛీ... ఉచ్ఛం నీచం లేని వాడితో మాటలేంటే? పెట్టెయ్. ఇంకెప్పుడూ ఫోన్ చెయ్యొద్దని చెప్పు..."  అని అరవసాగింది.
శివాని ఫోన్ లో కోపంగా "ఐ విల్ టాక్ టు యు లేటర్" అని ఫోన్ కట్ చేసి, శారద పక్కన కూర్చుని 'కూల్ డౌన్ శారదా కూల్ డౌన్. నువ్వు ఆవేశ పడకు' ఆన్నది లాలనగా.
*****
రోజులు, వారాలు గడుస్తున్నాయి.‌ స్నేహితురాలిని అపురూపంగా చూసుకుంటోంది శివాని.‌ శారద మెల్లగా మామూలు మనిషి అయ్యింది.‌ శివాని ఎంత చెప్పినా వినకుండా ఇంటి పని, వంట పని తానే చేయసాగింది. వంటల్లో శారదది అమృత హస్తం.‌ అద్భుతమైన వంటలు అలవోకగా చేసేది.‌ వాటిని ఆస్వాదిస్తూ "నాకు జీవితం ఇప్పుడే మొదలైంది అనిపిస్తోందే శారదా" అన్నది శివాని.
 
ఒకరోజు ఉదయం శారదను రొటీన్ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లడానికి రెడీ అవుతుండగా శివానికి ఫోన్ వచ్చింది.
శివాని హలో అనగానే "నేను హైదరాబాద్ నించి ధర్మారెడ్డిని మాట్లాడుతున్నాను.... అని కొద్ది సేపు మాట్లాడాడు. అది విన్న శివాని మొహం చుక్క రక్తం లేనట్లుగా పాలిపోయింది. అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేసి మెల్లగా నడుచుకుంటూ హాల్లోకి వెళ్ళి శారదకేసి తదేకంగా చూసింది. శారద నవ్వుతూ "ఏమిటే, అలా చూస్తున్నావు?" అన్నది. శివాని తల అడ్డంగా ఊపుతూ నిట్టూర్చి"మనం అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళాలి. ఎందుకు, ఏమిటి అని అడక్కు. పద " అన్నది.
***
ఇండో అమెరికన్ ఆంకాలజీ గేటు లోపలకు దూసుకు వచ్చి ఆగిన కారులోంచి శారద చేయి పట్టుకొని "మెల్లగా దిగు" అన్నది శివాని.
కారులోంచి దిగి చుట్టూ చూసిన శారద అయోమయంగా "ఇక్కడకు తీసుకొచ్చావెందుకే" అడిగింది. 
శివాని స్నేహితురాలి కేసి చూస్తూ"ఇప్పుడు ఇక చెప్పాలి. తప్పదు" అనుకుంటూ చెప్పింది మెల్లగా, స్పష్టంగా....
"చూడు శారదా... నువ్వు నేను కూడా మీ ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నాం. మీ ఆయన నీకు ఏ అన్యాయం తలపెట్టలేదు. నీకు న్యాయం చేయటానికే తాపత్రయ పడ్డాడు. సుకన్య దుర్మార్గురాలు కాదు. నీకు నీ కుటుంబానికి సహాయం చేయడానికే ప్రయత్నించింది" అంటూ ఆగింది.
శారద కళ్ళలోకి చూస్తూ "నువ్వు కడుపుతో ఉన్నావు.‌ ఆవేశ పడకు. నేను చెప్పేది శాంతంగా విని దృఢంగా ఉండు" అన్నది.
శారద మనసు కీడు శంకించ సాగింది. తనకు తెలియకుండా ఏదో దారుణం జరుగుతోంది అనిపించింది. అధికమవుతున్న ఆందోళనను అదుపులో పెట్టుకుంటూ అదురుతున్న గుండెలను చిక్కబట్టుకుని "ఏమైందే" అన్నది బేలగా 
శివాని మెల్లగా "మనం విజయవాడలో బయలుదేరేముందు మీ ఆయన ఫ్రెండ్ ధర్మారెడ్డి ఫోన్ చేశాడు. మీ ఆయనకి.. " అని ఒక్క క్షణం ఆగి శారదకేసే చూస్తూ "బ్లడ్ కేన్సర్" అన్నది.
మెదడులో ఏదో విస్ఫోటనం చెందినట్లు, వందల మెరుపులు ఒక్కసారిగా వెలిగి ఆరిపోయినట్లు... శారద మ్రాన్పడి నిలిచిపోయింది. 
శివాని శారద భుజం పట్టుకుని అనునయంగా తట్టుతూ... "ఆరోజు మీ ఆయన ఫోన్ లో నువ్వు చూసిన ఛాటింగ్  కేన్సర్ గురించే. ఊళ్ళో తన పేరున ఉన్న పొలం నీ పేరున మార్పించటానికి మీ ఆయన ఇన్నాళ్ళూ వాళ్ళ ఊరు చుట్టూ,  కోర్టు చుట్టూ తిరిగాడు. తాను పోయాక నీకు జీవితం భారం కాకూడదని తన కుటుంబ సభ్యులతో తగవులాడి తన పేరున ఉన్న ఆస్థి నీ పేరున మార్పించేందుకు ఎంతో శ్రమించాడు. లీగల్ పనులు అంటే అవే. నువ్వనుకున్నట్లు విడాకులు కాదు. ముందే తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, తాను చేయాల్సిన పనులు చేయలేనమో అని నీకు చెప్పకుండా సుకన్యను ఆపాడు" అని చెప్పి ఊపిరి పీల్చుకుంది శివాని. "సుకన్యను కలిసి విషయం కనుక్కుందామని వెళ్ళిన ధర్మారెడ్డికి సుకన్య నీ భర్త కేన్సర్ గురించిన వార్త చెప్పడంతో గుండెపోటు రావడంతో సుకన్య ఇదే హాస్పిటల్ లో చేర్పించింది” కొనసాగించింది శివాని.
 
“అనుమానం అనేది రంగుల కళ్ళద్దాల లాంటిది శారదా. ఒక్కసారి అది కళ్ళమీదకొచ్చాక ప్రపంచాన్ని మనం చూసే తీరే మారిపోతుంది. అందుకే ‘ఎన్ని నెలలు’ అనే పదం నీకు ‘ఎన్నో నెల’గా కనపడింది" కంట్లో నీళ్ళు సుడులు తిరుగుతుండగా చెప్పింది శివాని.
 
ప్రపంచం మొత్తం ఒక్కసారిగా గిర్రున తిరిగినట్లనిపించింది శారదకు. తూలి పడబోతున్న శారదను పట్టుకుని "నీ భర్త చివరి క్షణాల్లో ఉన్నాడు. వెళ్ళు. వెళ్ళి నీలో పెరుగుతున్న తన అంశను గురించి చెప్పు" అంటూ నవీన్ ఉన్న రూంలోకి తీసుకెళ్ళింది శివాని.
 
కాలం ఎటువంటి గాయాన్నైనా మాన్పుతుంది. తన కడుపులో పెరుగుతున్న పసి పాప కోసమైనా శారద పరిస్థితులతో పోరాడుతుందని శివానికి తెలుసు.
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply


Messages In This Thread
RE: నేను చదివిన కథలు - తిరప్తి - by k3vv3 - 23-02-2026, 04:52 PM



Users browsing this thread: 1 Guest(s)