Thread Rating:
  • 2 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అయస్కాంతాలు
#2
హ్మ్మ్... ! 



పేరు శశాంక్. సికంద్రాబాద్ బస్సు కరీంనగర్ బస్టాండ్ లో ఆగింది. ఇక్కడ ఐదు నిమిషాలు ఇంజన్ ఆఫ్ చేస్తాడు డ్రైవర్, నాకుడా కొకకోలా తాగి బ్లాడర్ నిండిపోయింది. అలా దిగి పోయి ఉచ్చపోసుకొని తిరిగి బస్సు ఎక్కాను. 

వెళ్ళేటప్పుడు నా నల్ల లెదర్ బ్యాగు పక్క సీటు ఖాళీగానే ఉంది కదా అని పెట్టి పోయాను. ఇప్పుడేమో నేను కూర్చున్న చోట నా బ్యాగు ఉంది, పక్కనేమో ఎవరో అమ్మాయి కురుల్లో క్లిప్పు పెట్టుకుంటుంది. 

అబ్బ నా పక్కన ఎవరో అమ్మాయి పడింది, దేవుడున్నాడు అనుకున్న.

అప్పుడే ఇంజన్ స్టార్ట్ అయ్యింది. ముందుకి పోయి, “ కొంచెం జరగుతారా ” అని అడిగాను అమ్మాయిని. 

అప్పుడు తాను జుట్టు వెనక్కి వేసుకొని క్లిప్పు బిగించి మోకాళ్ళు పక్కకి జరుపుతూ నాకు దారిచ్చింది.

కూర్చున్న వెంటనే ఒక తాజా పెర్ఫ్యూమ్ సువాసన వచ్చింది. ఏదో నా పక్కన గులాబీ తోట కూర్చున్నట్టుగా. 

నేను అమ్మాయి వైపే మొహం తిప్పుకొని ఉన్నా మరుక్షణం తను నన్ను చూసింది. 

దయ్యం.

అవే చిన్ని మెరుపు కళ్ళు, అవే చిన్ని గులాబి పెదాలు, ముద్దొచ్చే చిట్టిచామంతి చెంపలు, నిండు పున్నమిలా కలలో వెలుగులు నింపే మొహము. తన కన్నుల మీద వాలే సిల్కు ముంగురులు అంటే ఇష్టం. 

ఇప్పుడు కూడా ఆశ్చర్యంగా చూస్తూ అడ్డు పడుతున్న ముంగురులు కుడి చెవి వెనక్కి తోసి, 
“ నువ్వా మబ్బుమొహంగా.... ” అని అసహ్యించుకుంది. 

అలా తిట్టడం దానికలవాటు లేండి. 

“ ఎటు పోతున్నావే దయ్యం మెహమ ”

ఇది నాకలవాటు.


ఉష్ దేవుడున్నాడు. అందుకే ఇప్పుడు ఈ నసను నాకంటగట్టాడు. దీనితో ఇంకో మూడు లేదా నాలుగు గంటలు ప్రయాణం చెయ్యాలా?

పేరు: శ్రీహిత. మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం.


-

ఎండ కిటికీ నుంచి మొహం మీద పడుతుంది. బస్సు కరీంనగర్ ప్రాంగణం దాటి హైదరాబాదు హైవే ఎక్కింది. 

కొన్ని నిమిషాల ముందు, 

“ ఎటు పోతున్నావే దయ్యం మొహమ ” అని దానికి ఎదురుచెప్పగానే గుడ్లప్పగించి చూసి టక్కున ముక్కు విరుచుకొని మొహం అటు తిప్పుకుంది. 

“ నీకెందుకు చెప్పాలి. సప్పుడేక అటు చూసుకుంటా కూర్చో లేకుంటే పండు. నన్ను గెలలకు. ”

పసుపు రంగు చుడీదార్ చున్నీ మెడ వరకు కప్పుకుంది. నేనేదో అక్కడ చూస్తున్నట్టు. 

“ నేనేమి చూస్తలేను... ఓ కప్పుకోకు...” అంటూ నవ్వాను. కావాలనే తనని పొడుస్తూ. “అయినా అక్కడేమంత ఉన్నాయని... ”

ఎడమ చేత్తో నా తొడ మీద గుద్దింది.

“ ఇందుకే అటు తిరుగు అన్నాను. ” మొహం తిప్పేసుకుంది. “ పోదా నీకు ఆ నోటి దూల? ” అనడిగింది. 

“ పోయిందనే అనుకున్నాను, నువు వచ్చావు కదా, ఇక మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది. ” అన్నాను.

“ ఐతే మూసుకొని కూకో. నువు కిటికీలో కనిపిస్తే అసలు బస్సే ఎక్కేదాన్ని కాదు. ”

“ అవునా... మరి దిగు. బొచ్చడి బస్సులు ఉన్నాయి బస్టాండ్ లో. ”

“ టికెట్ తీసుకున్న కదా. తప్పుద్దా? ” అని తల పట్టుకుంది. 

నేను మందహంగా తన ముడుచుకున్న గులాబీ పెదవులు చూసి తన ముద్దుతనాన్నీ చూసి నాకదో తృప్తి. 

“ అయినా బస్సు దిగి ఎటు పోయావురా? ” అంది నన్ను చూసి.

“ ఉచ్చకి పోయినా. ”

నా మీద చిరుకోపంతో, “ అస్సలు అస్సలు కొంచెం కూడా మారలేదు. చి... వాష్రూం పోయా అనొచ్చు కదా. ” 

“ నేను చేతులు కడుక్కోడానికి పోలేదే. ఉచ్చ పోసుకోడానికి పోయిన. పోసి చేతులు కడుక్కొని వచ్చిన. ”

“ ఈ.... చ...! చాలాపు. ఇల్లొదిలి చాలా రోజుల తర్వాత బయటకొస్తే నువ్వే తగలాలా నాకు. ” 

“ అంత చికాకేందుకే. సర్లే మూసుకుంటాను. ” అన్నాను కాసేపు విరామం ఇద్దాం అని. 

-

బస్సు హైవే ఎక్కింది. అలా కిటికీ లోంచి చూస్తూ కూర్చున్న. 

గాలి మా వైపు వీస్తుంటే తన కురులు  నా ముక్కు మీద ఎందుకు ఊసులాడుతున్నాయో అర్థం కాలేదు. తన సువాసన మాత్రం ఆహా... ! 

అలా అలుగునూర్ దాకా పోయినాక, ఊరుకుంటుందా మొగ ప్రాణం, తెలీకుండానే మత్తుగా తన మెడ మీద గడ్డం వాల్చేశాను. 

సట్క్ అని చెంప మీద కొట్టింది. 

ఉలిక్కిపడి చుట్టూ చూసాను ఎవరైనా చూసారా అని, అందరూ మొహాలు ఫోనులో పెట్టేసారు. 

ఏం బతుకు ఐపోయింది, స్మార్ట్ఫోనులు వచ్చాక పక్కకి ఉన్న వాళ్ళతో మాటలే కరువయ్యాయి. ఎక్కడ ఏమి జరుగుతుందో ముచ్చటలో తెలీకుండా కథలకు కొత్త విషయాలు ఎలా తెలుస్తాయి అసలు.

ఉష్... చిన్న కళ్ళు ఒకేసారి పెద్దగా ఎలా అవుతాయో తనవి. నా ముక్కు పచ్చడి చేసేలా చూస్తుంది. 

నేను తుంటరిగా, “ ఆడవాసన చూసి చాలా రోజులైందే ” అన్నాను పల్లెక్కిస్తూ. 

మళ్ళీ మొహం మీద చిన్నగా ఒక్కటి పీకింది. “ నీ మబ్బుమోహానికి అదొక్కటే తక్కువ. ” అని జుట్టు సరిచేసుకుంది. 

బస్సులో మంది ఉంటారు కదా, కెమెరా మాత్రం మా ఇద్దరి మీదే ఉండేంటి అనుకుంటున్నారా? 
భూమ్మీద ఎనిమిది వందల కోట్ల జనం ఉన్నారు, వాళ్ళందరి గురించీ పట్టించుకుంటామా. ఇదీ అంతే. 


పసుపు రంగు చుడిదార్, ఎర్రని సన్నగాజులూ, చిన్న టిక్లీ, చిన్న నెమలి ఆకారం స్టోన్ కమ్మలు, అవన్నీ నాకిష్టం. 

మా ఇంటర్ మొదటి ఏడాది, బతుకమ్మ పండక్కి కరీంనగర్ మార్కెట్, ఎస్... బీ... ఐ... బ్యాంకు దగ్గర బండీల మీద అమ్మే జూలరీ, చూసి నచ్చాయంటే నా దగ్గరున్న రెండు వందలూ పెట్టి కొనిచ్చాను. ఇంకా అవి పెట్టుకుంటుంది. అవి ఇష్టం కానీ నేను కాదు. 

నన్ను చూస్తూ కళ్ళెగరేసింది. మొహం అడ్డంగా ఊపి ఏం లేదని ఊరుకున్నాను.

“ బాగున్నానా ” అనడిగింది నా భుజం దువ్వుతూ. 

“ ఎప్పుడూ అలాగే ఉంటావులే దయ్యం ” అన్నాను నాలో నెను నవ్వుకుంటూ. 

మోకాళ్ళు నాదిక్కు తిప్పి, “ ఇంటర్ అయిపోయినప్పుడు పోయావు కరీంనగర్ వదిలి మీ వూరికి. మళ్ళీ ఒక్కసారి కూడా కనిపించలేదు. అసలేం చేసావు? ” అని ప్రశ్నేసింది. 

తన మోకాళ్ళనే చూస్తూ, “ డిగ్రీ హైదరాబాద్ ఉస్మానియాలో చేసాను. ” 

చిన్నగా, వ్యంగ్యపు నవ్వుతో, “ ఏంటి నీకు ఉస్మానియాలో వచ్చిందా? ”

సూటిగా చూసాను. నవ్వాపింది. 

“ వచ్చింది. ” అన్నాను ఖచ్చితంగా. 

“ నీకంత సీన్ అనుకోలేదు. ” అనింది. 

“ ఊ ” అని బదులిచ్చి కిటికీ దిక్కు చూసాను. 

ఎండా, చెట్లూ, పొలాలు, దూరంగా కొండలూ ఒకసారి బస్సు ముందు వైపు చూడగా అక్కడెక్కడో కారు మేఘాలు ఉన్నట్టుగా అనిపించింది. 

వర్షం గాని కురుస్తుందా ఏంటి అనుకున్న. 

“ శశీ... ” అని తియ్యగా పిలిచింది. 

తను ఊరికే పిలిచినా నాకలాగే అనిపిస్తుందిలేండి.

“ చెప్పు... ” అన్నాను మొహం తిప్పకుండా. 

“ డిగ్రీ పాస్ అయ్యావా అసలు? ” అనేసింది కావాలనే. 

తన భుజం గిచ్చి, “ ఇంకోసారి చదువులో డౌట్ పడితే కిటికీలోంచి నూకేస్తాను బక్కముండ. ” అని కొంచెం గట్టిగా అనేసాను. 

నన్ను గుడ్లప్పగించి చూసి, “ ఏంట్రా ఎక్కువ అవుతున్నాయి మాటలు ” అని కొట్టింది. 

ఆ నిండు జాబిలి మొహంలో, ఒక నిమిషం నెమలి కళ్ళు, మరు నిమిషం గుడ్లగూప కళ్ళు ఎలా పెడతాదో అసలు.

“ నేను నిజమే చెప్తున్న, నాకు నేనేమి డబ్బా కొట్టుకుంటలేను. సరేనా…. నువు ఊకె నన్ను ప్రతీదానికి ఫెయిల్ అయినట్టు చూడకు. ” 

“ సరేలే.... ”

ఆ తరువాత, “ ఇంతకీ నీసంగతేంటే ” అనడిగాను. 

గాజుల చేతి వేలు చూపి, “ నీకస్సలు చెప్పను ” అని విసుక్కుంది. 

“ ఒసేయ్ నువ్వు అడిగితే నేను చెప్పలేదా? ”

“ నువు వెళ్ళిపోయినప్పుడు నీకు చెప్పాలనిపించలేదు. ఇప్పుడు నాకు చెప్పాలని లేదు. చెప్పను అంతే... ” అంటూ మూతి ముడుచుకుంది. 

తెలుసు, మన గురించే పట్టించుకునే వారికి ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కోపం రాదా. ఇక్కడ కూడా అదే పొరపాటు జరిగింది. 

అయస్కాంతాల గోల ఇది. దూరంగా నెట్టే తప్పులున్నా, మరో దిక్కు దగ్గర చేసే జ్ఞాపకాలు కూడా ఉన్నాయి.

తన చేతు పట్టుకోబోతే అటు పెట్టేసుకుంది.

“ శ్రీహా.. చెప్పు.  ఏం చేసావు? ”

“ MBBS చేసాను. చాలా. ” అంది.

పూర్తిగా ఒళ్ళు తన దిక్కు తిరిగింది. 

“ ఇది చెప్పడానికి ఎందుకు విసుక్కుంటావు మరి? ”

“ ఏం లేదు... ”... అంటూ చేతులు కట్టుకుంది.

తనని చూస్తూ ఉండిపోతాను. అది తనకి కూడా తెలుసు. చూడలేక ఇటు చూడదు అంతే. 

“ నేనేమి కావాలని చెప్పకుండా పోలేదు. ” .... కొద్దిగా తన కుడి చూపుడు వేలు ముట్టుకున్న. “ ఎందుకు పోయామో తెలుసా? ”

నా చేతిని కొట్టింది తీయమ్మంటూ. “ తెలుసు... రవి చెప్పాడు. మీ నాన్నమ్మ చనిపోయిందంట కదా. ”

“ హ... మా తాతని మేమే చూసుకుంటూ అక్కడే ఉండిపోయాము. ”

చప్పుడు చెయ్యలేదు. 

మూడేళ్ళు ఫోను లేదు, ఫోటో లేదు. నెంబర్ కూడా తీసుకోలేదు. చామంతి చెంపలను ఊహించుకుంటూ ఉండిపోయాను.

మళ్ళీ చెయ్యి ముట్టుకున్న, ఈసారి ఏమి అనలేదు.

“ అక్కడ ఎలా ఉంది మరి. కొత్త పరిచయాలు ఏమైనా అయ్యాయా ” అనడిగింది. 

“ హ్మ్మ్... గోదావరిఖనిలో అమ్మాయిలైతే బాగున్నారే... ”. నవ్వి, “ నీలాంటి దయ్యం మొహాలైతే లేవులే అక్కడ. ”

కొట్టింది. దూరం జరిగిన. 

“ నేను అమ్మాయిల గురించి అడగలేదు. ” నా మాటలో అర్థం దానికర్థమయ్యే ఉంటుందిలే. “ ఏదో కొత్తగా ఫ్రెండ్స్ గురించి అడిగాను అంతే. ”

“ తరువాత నేనున్నది ఎక్కువ హైదరాబాదులోనే. అక్కడేం ఉన్నా. అంతా మాములులే. ”

“ మరి హైదరాబాదులో? అంది. నన్ను సూటిగా చూస్తూ తన కళ్ళు చిన్న అనుమానంగా అనిపించాయి. “ అదే ఉస్మానియా అన్నావు కదా. ”

మొహం ముందుకు పొడిచి, “ నీకెందుకు ” అన్నాను పొగరుగా. 

“ అవునులే... నాకెందుకు ” అని టక్కున మొహం తిప్పుకుంది నీకే ఉందా పొగరు అన్నట్టు.

మౌనంగా కూర్చున్నాము. తను ఫోను తీసి చూస్తూ కూర్చుంది.

బ్యాగులోంచి ఎయిర్పోన్స్ తీసి పెట్టుకుంది. 

ఇక నేనేమి మాట్లాడేది ఉంది. కళ్ళు మూసుకొని వెనక్కి ఒరిగాను.

-
[+] 5 users Like ITACHI639's post
Like Reply


Messages In This Thread
అయస్కాంతాలు - by ITACHI639 - 11-01-2026, 01:28 PM
RE: అయస్కాంతాలు - by ITACHI639 - 11-01-2026, 11:05 PM
RE: అయస్కాంతాలు - by k3vv3 - 12-01-2026, 08:56 AM
RE: అయస్కాంతాలు - by Uday - 12-01-2026, 12:57 PM



Users browsing this thread: 1 Guest(s)