Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం
#54
 ఎపిసోడ్ 19


ఫోన్లో లాయర్ హిరణ్య చెప్పిన మాట విని ఏమి మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడు ముకుల్.

************************

లండన్ తన ఇంట్లో హిరణ్యతో ఫోన్ మాట్లాడి ఆలోచిస్తూ టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఫోన్ తీసి జనార్ధన్ కి కాల్ చేశాడు ముకుల్ నంద.

ఫోన్ లిఫ్ట్ చేసి "అయ్యా చెప్పండి?" అంటూ వినయంగా అడిగాడు జనార్ధన్.

"నువ్వు వెంటనే బయలుదేరి ఢిల్లీ వేళ్ళు ఆ మురళీ జోషి గాడి పెళ్ళాం చచ్చింది అనుకున్నాను కానీ బతికే ఉంది రేపు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వస్తుంది. అక్కడ దాని నోటి వెంట నా కొడుకు పేరు రాకూడదు అంటే నువ్వు దానికి కనపడి ఒక్కసారి గతం గుర్తు చేయాలి." అని చెప్పాడు ముకుల్.

"సరే అయ్యా! కానీ అభిర్ నన్ను చూస్తే...!" అంటూ భయంగా అడిగాడు జనార్ధన్.

"కోర్టు దగ్గర నీతో పాటు నా మనుషులు కూడా ఉంటారు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చేసిన పాపం చాలు మళ్లీ ఎందుకు చేయడం అనుకున్నాను కానీ చేయక తప్పేటట్లు లేదు." అన్నాడు ముకుల్ నంద.

"సరే అయ్యా! మీరు ఉండగా నాకు భయం ఎందుకు! అయ్యినా వాడు 12 సంవత్సరాలుగా జైలు కూడా తిని అన్ని మర్చిపోయి ఉంటాడు, మీరు ఏమి కంగారు పడకండి అవసరం అయితే వాడిని కూడా లేపేసి నేను తిరిగి వెళ్ళిపోతాను." అంటూ సంతోషంగా చెప్పాడు జనార్ధన్.

"సరే! అక్కడ బిజినెస్ సరిగ్గా లేదన్నావు కదా! ఈ పని అయిన తర్వాత మైసూర్ లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ నీ పేరు మీద రాస్తాను." అని చెప్పాడు ముకుల్.

"మీ మనసు వెన్న అయ్యగారు! ఇప్పుడే ఇండియా బయలుదేరుతున్నాను." అంటూ సంతోషంగా చెప్పాడు జనార్ధన్.

"సరే! అక్కడికి వెళ్ళగానే మిచల్ కి కాల్ చెయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు మూకుల్ నంద.

************************

ఢిల్లీ తన ఎకౌంట్లో రెండు కోట్లు పడ్డాయి ఆనందంతో కాసేపు చాక్లెట్ తో కలిసి డాన్స్ చేసి

"ఒరేయ్ నేను ఈ కేస్ స్టడీ చేస్తూ ఉంటాను, నువ్వు వెళ్లి మనం ఇవ్వాల్సిన వాళ్లందరికీ డబ్బులు ఇచ్చి మనకి కావలసినవి అన్ని తీసుకొనిరా!" అని చెప్పింది మిత్ర.

"సరే అక్క! ముందు ఆ మార్వాడి మోహన డబ్బులు కొట్టి మన బండి తీసుకు వస్తాను." అంటూ బుర్రగోకుంటూ  "అక్క! నాకు బట్టలు తీసుకుంటాను అన్నావు." నెమ్మదిగా అడిగాడు చాక్లెట్.

"హ...! ముందు వెళ్లి నేను చెప్పిన పని చేసుకోరా! ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత బట్టలు, గిట్టలు చూద్దాము, లేకపోతే డబ్బులు వెనక్కి వెయ్యమన్నారు అంటే మన ఇద్దరి కిడ్నీలు అమ్మి ఇవ్వాలి." అంటు కోపంగా చూస్తూ చెప్పింది మిత్ర.

"కరెక్ట్ అక్క! ముందు మన దేవుడి గురించి తెలుసుకో!" అంటూ అక్కడి నుంచి పరిగెత్తాడు చాక్లెట్.

కేసు ఫైల్ చూస్తూ 'అభిర్ ని కావాలని దీంట్లో ఇరికించారని ఈజీగా తెలిసిపోతుంది. కానీ 12 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు అంటే ఈ కేసు వెనకాల ఏదో ఉంది.' అనుకుంటూ పేజీలు తిరగవేస్తూ

'అసలు పేరు కూడా తెలియకుండా ఎఫ్ఐఆర్ రాసిన దరిద్రుడు ఎవడు? ఈ కేసు వాదించే వెధవ ఎవడు? " అంటు చూస్తూ

"లాయర్ హిరణ్య! వీడొక వేస్ట్ ఫెలో గాడు డబ్బు కోసం ఏదైనా చేస్తాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది నిరంజన్ వీడు చచ్చి చాలా కాలం అయింది కదా!'

'ఈ 12 సంవత్సరాల్లో అభిర్ తరపున వాదించడానికి ఒక్క లాయర్ కూడా ముందుకు రాలేదా! చాలా విచిత్రంగా ఉందే తనని కలుసుకోవడానికి కూడా జైలుకు ఎవరూ రాలేదు." అంటూ ఆలోచిస్తూ ఉంది మిత్ర.

అంతలో అక్కడకు వస్తూ "అక్క మనం ఇవ్వాల్సిన బాకీలు మొత్తం క్లియర్! అందరిని ఫోన్ పే తో కొట్టాను, ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర మార్వాడి లేడు వాడి అసిస్టెంట్ ఉన్నాడు డబ్బులు ఇచ్చి బండి కూడా తీసుకొచ్చేసాను." అంటూ సంతోషంగా తాళాలు చూపించాడు చాక్లెట్.

ఆ మాటకి చాక్లెట్ వైపు సంతోషంగా చూస్తూ "ఇప్పుడేమన్నావురా...మార్వాడి అసిస్టెంట్ ఉన్నాడా?" అంటూ ఆలోచిస్తూ

"ఎస్సై! నిరంజన్ అసిస్టెంట్ ఎవడో ఒకడు ఉంటాడు కదా వాడిని పట్టుకుంటే అసలు అభిర్ ని ఎక్కడినుంచి తీసుకువచ్చారు ఎందుకు ఈ కేసులో ఇరికించారో తెలిసిపోతుంది." అంటూ సంతోషంగా అంది మిత్ర.

"అక్క! అలాగే చచ్చిపోయిన మురళి జోషి కూడా ఆఫీస్ రే కదా! తన అసిస్టెంట్ కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా! వాడిని కూడా పట్టుకుంటే అసలు మేటర్ బయటికి వస్తుంది." అంటూ కళ్ళు ఎగరేస్తూ చెప్పాడు చాక్లెట్.

"కరెక్టే రా! అసలు ఇంతకీ మనకి కేసు ఇచ్చిన పార్టీ అభిర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటుంది?" అంటూ చాక్లెట్ వైపు చూసి అనుమానంగా అడిగింది మిత్ర.

"ఆ విషయం గురించి మనకెందుకు అక్క! ఆ ఇద్దరి ఆఫీసర్ లా అసిస్టెంట్లు గురించి ముందు తెలుసుకుందాము." అన్నాడు చాక్లెట్.

"ఓకే! అభిర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన నోయిడా స్టేషన్ కి వెళ్దాము పద! అక్కడ రైటర్ ముఖేష్ ఉంటాడు కదా వాడికి డబ్బులు కొడితే ఏదైనా చేస్తాడు." అంటూ చాక్లెట్ తో కలిసి బయలుదేరింది మిత్ర.

కాసేపటికి స్టేషన్ దగ్గరకు వచ్చి "ఒరేయ్ చాక్లెట్! నేను ఆ బేకరిలో ఉంటాను నువ్వు వెళ్లి రైటర్ ని తీసుకురా!" అని చెప్పింది మిత్ర.

"ఓకే అక్క!" అంటూ హుషారుగా స్టేషన్ లోపలకి వెళ్లి  "నమస్తే ముఖేష్ సార్! మీకోసం అక్క బేకరీ దగ్గర వెయిట్ చేస్తుంది డబ్బులు వచ్చే పని తగిలిందంట వెంటనే రమ్మంది." అని చెప్పాడు చాక్లెట్.

"అవునా?" అంటూ చాక్లెట్ ని కింద నుంచి పైకి చూస్తూ "అసలు!  నీకు చాక్లెట్ అనే పేరు ఎవరు పెట్టారు రా..!" డౌట్ గా అడిగాడు ముఖేష్.

"మా అమ్మ కడుపులో నేను ఉన్నప్పుడు మా నాన్నని రోజు చాక్లెట్ అడిగేదంట! అందుకే అందరు నన్ను  చాక్లెట్ చాక్లెట్ అని పిలుస్తూ ఉండడం వల్ల అలా అలవాటైపోయింది." అంటూ నవ్వుతూ చెప్పాడు చాక్లెట్.

"అవునా? నీ అసలు పేరు ఏంట్రా?" అని అడిగాడు ముఖేష్.

"ఆ...! నా అసలు పేరు బిస్కెట్! మీరు తొందరగా వస్తే అక్క మాట్లాడుతుంది లేకపోతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు." అంటూ సీరియస్ గా చూస్తూ అక్కడ నుంచి వెళ్ళాడు చాక్లెట్.

"సరే ఆగు వస్తున్న!" అంటూ హడావుడిగా బేకరీ దగ్గరికి వచ్చి సమోసా తింటూ మిత్ర వైపు చూసి "ఏంటి విషయం?" అంటూ చుట్టూ చూస్తూ నెమ్మదిగా అడిగాడు ముఖేష్.

"ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి 12 సంవత్సరాల క్రితం మేటర్ నీవల్ల అవుతుందా?" అని అడిగింది మిత్ర.

"నా గురించి తెలుసు కదా! కానీ అమౌంట్ కరెక్ట్ గా ఇవ్వాలి వాయిదాల పద్ధతిలో మాత్రం కుదరదు." ఆనాడు ముఖేష్.

"నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఫోన్ పే పట్టు! ఏమాత్రం లేటు ఉండదు." అంటూ కేసు నెంబర్ చూపించి

"ఈ ఎఫ్ ఐ ఆర్ చేసిన ఎస్సై నిరంజన్ కి బాగా క్లోజ్ గా ఉండే ఆఫీసర్స్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి." అంటూ పేపర్ ఇచ్చింది మిత్ర.

"ఓకే!" అంటూ పేపర్ తీసుకుని జేబులో పెట్టుకుని  "మార్నింగ్ వచ్చి డీటెయిల్స్ తీసుకువెళ్లు! వెళ్లేటప్పుడు నా బిల్లు కూడా కట్టు!" అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు ముఖేష్.

బేకరీ లో నుంచి వెళ్ళిపోతున్న ముఖేష్ వైపు అసహ్యంగా చూస్తూ "ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రూపాయి బిళ్ళ ఇవ్వను." అంటూ కౌంటర్ లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి

"మా బిల్లు కూడా ముకేశ్ సార్ అకౌంట్లో రాసుకో!" అని చెప్పి చాక్లెట్ తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిత్ర.

బండి మీద వెళుతూ "అక్క! NIA ఆఫీస్ కి వెళదామా? సచ్చినోడు అసిస్టెంట్ గురించి తెలుసుకోవాలి కదా!" అని అడిగాడు చాక్లెట్.

"ఒరేయ్! NIA అంటే సెక్యూరిటీ ఆఫీసర్లు లాగా కాదు వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మనల్ని కూడా టెర్రరిస్టులు అని చెప్పి షూట్ చేస్తారు, ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ రానివ్వు  తర్వాత దాని సంగతి చూద్దాము." అంటూ ఎదురుగా షాపింగ్ మాల్ కనిపించడంతో "ఫస్ట్ నీకు బట్టలు కొందాము." అంటూ కాంప్లెక్స్ లోకి తీసుకు వెళ్లింది మిత్ర.

"సరే!" అంటూ బండి దిగుతూ "అక్క! నా కిడ్నీ మాత్రం ఇవ్వను." అన్నాడు చాక్లెట్.

ఆ మాటకి నవ్వుతూ "సరే పద! అవసరమైతే నాది ఇస్తానులే!" అంటూ లోపలికి తీసుకెళ్లింది మిత్ర.

*****************

మరుసటి రోజు ఉదయం వసుంధర ఇంటి దగ్గర నుంచి అభిర్, గీత లని కార్లో ఎక్కించుకొని ఫుల్ సెక్యూరిటీతో కోర్టుకి బయలుదేరడానికి రెడీ అయ్యాడు శ్రీకర్.

అంతలో అక్కడికి వస్తూ శ్రీకర్ వైపు చూసి "కోర్టుకు వెళ్లే దారిలో  సివిల్ డ్రెస్ లో మా ఆఫీసర్స్ ఉన్నారు ఎటువంటి ప్రాబ్లం ఉండదు." అని చెప్పి ఫోన్ లైన్ లో ఉన్న  ఆఫీసర్స్ తో మాట్లాడుతూ

"ఎవరి మీద అయినా అనుమానం వస్తే వెంటనే కస్టడీలోకి తీసుకోండి." అని చెప్పాడు దయ.

"ఓకే సర్!  రూట్ అంత క్లియర్ గా ఉంది." అని చెప్పాడు సురేష్.

"సార్! నేను కోర్టు దగ్గర రెడీగా ఉన్నాను ఇక్కడ కూడా అంత ప్రశాంతంగానే ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు." అని చెప్పాడు కమల్.

"ఓకే గుడ్! అంటూ శ్రీకర్ వైపు చూసి "స్టార్ట్ అవుదామా?" అని చెప్పి వసుంధర వైపు చూసి "మేడం మీరు కూడా స్టార్ట్ అవ్వండి." అని చెప్పాడు దయ.

"ఓకే!" అంటూ తన కార్ లో సుమతి నీలమ్ లని ఎక్కించుకొని స్టార్ట్ అయింది వసుంధర.

రెండు కార్ల వెనక వెళుతూ కోర్టు దగ్గరికి రావడంతో అభిర్, గీత లు కారు దిగిన వెంటనే లోపలికి తీసుకువెళ్లి కోర్ట్ హాల్ లో కూర్చోబెట్టడు దయ.

టెన్షన్ గా ఉన్న గీత దగ్గరకు వచ్చి "అమ్మ! కంగారు పడకు  మనం కోర్టు లోపలికి వచ్చేసాము ఇక్కడికి ఎవరు రాలేరు." అని చెప్పింది సుమతి.

అక్కడికి వస్తు అభిర్ వైపు చూసి "నువ్వు వెళ్లి అటువైపు కూర్చో ఇక్కడ కూర్చోకూడదు." అని చెప్పి గీత వైపు చూసి "మీరు ఇక్కడే కూర్చోండి ఎవరు పిలిచినా బయటకు వెళ్ళకండి." అని చెప్పింది వసుంధర.

"ఓకే మేడం!" అంటూ కూతురి వైపు చూసి "వాటర్!" అంది గీత.

"ఓకే!" అంటూ గబగబా బయటికి వెళ్ళింది సుమతి.

ఒంటరిగా కూర్చున్న గీత దగ్గరికి వచ్చి "నమస్తే మేడం! బాగున్నారా?" అంటూ నవ్వుతూ అడిగాడు జనార్ధన్.

తల పైకెత్తి జనార్ధన్ వైపు భయంగా చూస్తూ ఉండిపోయింది గీత.
[+] 8 users Like SivaSai's post
Like Reply


Messages In This Thread
RE: వేదం - by Manmadhsbanam143 - 22-12-2025, 04:13 PM
RE: ఖైదీ నెంబర్ 402 - నా మాటే శాసనం - by SivaSai - 07-01-2026, 08:35 AM



Users browsing this thread: 1 Guest(s)