Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - అత్తగారు ఆవకాయ
#25
మరో వందేళ్లు
[Image: m.jpg]
రచన: సుజాత తిమ్మన
 
కనుకొలుకుల్లో అమ్మమ్మ రూపం కదలాడుతూ ఉంటే గుండెను కోసుకుని ఉబికి వెచ్చే కన్నీళ్లు చెంపలపై దారలు కట్టసాగాయి..



"చిన్నారి!"



అమ్మమ్మ ప్రేమతో పిలిచే పిలుపు ఇక మళ్ళీ నాకు వినిపించదు..



! నేనెంత తప్పు చేసాను.. దాదాపు పదకొండేళ్ళ అవుతుందేమో అమ్మమ్మని చూసి.. ఆవిడ అమ్మ కంటే ఎక్కువ.. పురిటిలోనే నన్ను తనచేతుల్లోకి తీసుకుంది.. నానమ్మ మూడోసంతానం కూడా ఆడపిల్లే.. అని మెటికలు విరుస్తుంటే.. అమ్మ గుక్కపట్టి ఏడుపు అట..



అందుకే నేనే పెంచుకుంటా.. అని తన ఊరుకి తీసుకొనిపోయి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అమ్మమ్మా తాతయ్యా.. పదమూడేళ్ల వయసులో తాతయ్య కాలం చేసారు.. అప్పటి నుంచి అన్ని తానై చూసుకుంది.. అమ్మ నాన్న ఎప్పుడైనా చుట్టం చూపుగా వచ్చేవాళ్ళు.. పల్లెటూరు కావడం మూలంగా పదవతరగతి అవగానే హాస్టల్ లో ఉంచి చదివించింది..



మొత్తానికి డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతూ ఉన్నా.. అప్పుడే అమ్మమ్మకి బాగా సుస్తీ చేసింది.. టవునుకి తీసుకోని వచ్చి పెద్దాసుపత్రిలో జాయిన్ చేసి పదిరోజులు అమ్మమ్మ దగ్గరే ఉన్నా.. అప్పుడు ఆమెకు నేను తన అమ్మలా కనిపించానట.. డిశ్చార్జ్ అయి వచ్చేస్తుంటే.. అమ్మమ్మకి ట్రీట్మెంట్ చేసిన డాక్టరు (కుర్ర డాక్టర్ ) రోజు ఎదో వంకతో నాతో మాట్లాడాలని చూసేవాడు..



గమనించినా.. నేను బయటపడలేదు.. అమ్మమ్మతో మాట్లాడుతూ వివరాలు అన్ని కనుక్కున్నాడు.. ఇంటికి వచ్చేసాక ఇక నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను గాక వెళ్ళను.. అని తెగేసి చెప్పేశా.. అలా చదువు ఆగిపోయింది.. అమ్మమ్మకి చెట్లన్నా.. పంటలన్నా.. చాలా ఇష్టం.. ప్రతి మొక్కని ఎంతో ప్రేమతో పెంచుకునేది.. తాతయ్య తరువాత తనే పొలంలోకి వెళ్లి ప్రతి పంట.. ప్రతి చెట్టు.. గురించి వాకబు చేస్తూ కూలీలతోటే గడిపేది పగలంతా.. ఆవిడతోటి నేనుకూడా.. పొలాల మధ్యలోనే పెరిగాను..



రోజుల్లో ఎరువులు కూడా సేంద్రియమే.. విత్తనాలు శుద్దిచేసుకోవటం అన్ని స్వయంగా చేసుకునేవాళ్ళు.. ప్రతి పనిలోనూ అమ్మమ్మ దగ్గర ఉండి చేయించేది.. అందుకే నాకు కూడా పొలం గురించి పంటల గురించి బాగా అవగాహనా ఏర్పడింది..



రెండునెలలు గడవక ముందే పేరయ్యగారు సంబంధం ఉంది అంటూ డాక్టరుగారి ఫొటో వివరాలు చూపించారు.. అమ్మమ్మకి కూడా బాగా నచ్చాడు.. నన్ను అడిగితె.. నేనేమంటాను.. సిగ్గుల మొగ్గయ్యాను..



అమ్మానాన్నలకు కబురుపెట్టి అటువైపు ఇటువైపు మాట్లాడుకుని.. మొత్తానికి నా పెళ్లి డాక్టరుగారితో జరగడము.. అయనకి ఢిల్లీలోని ఎయిమ్స్ లో సీటు రావడము.. అలా ఆయనతో పాటునేను అమ్మమ్మని వదిలి రాజధానికి వెళ్లిపోవడము జరిగిపోయింది..



రెండేళ్ల వ్యవధిలో ఒక కూతురు.. ఒక కొడుకు.. మధ్య మధ్యలో ఊరికి వెళ్లినా చాలా తక్కువగా ఉండడానికి సమయం చిక్కేది.. పిల్లల చదువులు.. ఉద్యోగాలు.. కూతురు అమెరికాలో సెటిల్ అవ్వడంతో అమ్మమ్మ వందేళ్ల పుట్టినరోజుకు కూడా రావడానికి కుదరలేదు.. వందేళ్లు నిండినవి అంటే అందరు ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు.. ఆవిడ అప్పటికి కూడా ఎంతో చురుకుగా తన పని తనే చేసుకునేదట.. తన నలుగురు కూతుళ్లు.. ఇద్దరు కొడుకులు కూడా వెళ్లిపోయారు.. మనవళ్లు.. మనవరాళ్లు.. ముని పిల్లలను కూడా చూసింది..



నిజంగా తన గురించి ఒక గ్రంధమే వ్రాయవచ్చు.. ఆవిడ దగ్గర నేను పెరగడం నేను జన్మలో చేసుకున్న పుణ్యమో..! ఎంత పుణ్యం చేసుకున్నా.. ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయానే అని బాధ.. నాకోసం చాలా కలవరించిందట..
కారు ఊరి పొలిమేర దగ్గరికి వచ్చేసింది.. ఎదో తెలియని తన్మయత్వం.. గాలిలోనే ఉంది.. అవును అమ్మమ్మ ఆత్మ మెత్తగా నన్ను తడుముతూ ఉంది..



***********
లాయరు గారు నా చేతిలో ఒక కవరు పెట్టారు.. "తులసమ్మగారు మీకు ఇవ్వమన్నారమ్మా.. మీ కోసం చాలా కళ్ళల్లో వత్తులు వేసుకుని చూసారు.. "యశోద వచ్చిందా.. "అని ఊరికే అడిగే వాళ్ళమ్మా.. " అయన కళ్ళు కూడా చెమరించాయి.. నిజమే మరి.. తులసమ్మ అంటే ఊరి మొత్తానికి ఆదుకున్న అపర అన్నపూర్ణమ్మ.. ఆవిడని తలచుకోనివాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదేమో.. !



కవరులో వీలునామాతో పాటు ఒక ఉత్తరం నన్ను ఉద్దేశించి వ్రాయించింది..



చిన్నారి ! బంధమో తెలియదు కానీ ఏడుగురు పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసిన తరువాత నీవు నాకు బాద్యతవి అయ్యావు.. మానవరాలిగా కాక నాలో భాగంగా పెంచుకున్నారా.. అందుకే నీమీదే నా ప్రాణం.. నీదగ్గర వచ్చి ఉండమన్నావు ఎన్నో సార్లు.. కానీ మట్టిని.. ఇంటిని వదిలి కూడా రాలేను.. అందుకే ఇక్కడే ఉండిపోయాను.. ఆస్తులన్నీ అందరికి పంచి ఇచ్చాను తాతగారి హయాములోనివి.. నీకు ఇస్తున్న పదెకరాల స్థలం మాత్రం నీవు ఊరికే బీడు పోనివ్వకుండా.. పచ్చని పొలాలుగా పంటలు పంచాలి.. ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ.. పాతరోజులు మళ్ళీ రావాలి.. వచ్చిన ఆదాయం శరణార్ధులకు ఖర్చుపెట్టు.. ఇది నా ఆఖరి కోరిక..



పొలం అంతా నేను అప్పుడు కొంత అప్పుడు కొంత కూడబెట్టి కొన్నది.. కాబట్టి దీనిలో ఎవరికీ హక్కు లేదు.. పూర్తిగా నీపేరు మీద దాఖలు చేయించాను.. అమ్మలు.. పచ్చదనంలో నన్ను చూసుకోరా..
ఇట్లు అమ్మమ్మ.. తులసమ్మ..



*********
Like Reply


Messages In This Thread
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:02 PM
RE: అమ్మమ్మ కథలు - by k3vv3 - 11-04-2025, 05:03 PM
RE: అమ్మమ్మ కథలు - అమ్మమ్మగారిల్లు - by k3vv3 - 01-09-2025, 05:17 PM



Users browsing this thread: 1 Guest(s)