17-05-2025, 04:03 PM
"నిన్న దినేష్ చెప్తే ఏంటో అనుకున్న కానీ నిజమేనే అతను యంగెస్ట్ బిలియనీర్ అంట ఇదిగో ఇప్పుడే వే టూ న్యూస్ లో వచ్చింది చూడు" అంది రవళి
జాహ్నవి వెంటనే ఆసక్తిగా ఆ న్యూస్ చూసింది.
"సాత్విక్ దేవ్ నందన్, ది తెలుగు యంగెస్ట్ బిలియనీర్" అంటూ హెడ్డింగ్ ఉంది. పైన అతని ఫోటో. చూడటానికి చాలా బాగున్నాడు. అది చూసి తెలియకుండానే జాహ్నవి బుగ్గలు ఎరుపేక్కాయి. కానీ అంతలోనే మనసులో మరొక ఆలోచన, అసలు నేను తనకి గుర్తు ఉంటానా? నిన్న ఏదో తెలియకుండా మా మధ్య అలా జరిగిపోయింది. అతని స్థాయి ఎక్కడ నేను ఎక్కడ. అంత ఆశించటం కూడా తప్పే అనుకుంది.
"సరే పద టైం అవుతుంది" అంది జాహ్నవి
"హా పద" అంది రవళి పైకి లేచి
ఇద్దరు ఎప్పటిలానే అలవాటు అయిన దారిలో స్టోర్ కి బయలుదేరారు. మధ్యాహ్నం వరకు పని చేసి భోజనానికి పైకి వెళ్లారు. డ్రెస్సింగ్ రూమ్ దగ్గర ఉన్న గోడని చూస్తుంటే జాహ్నవి కళ్ళలో సాత్విక్ యే మెదులుతున్నాడు.
"వద్దు అతని గురించి ఆలోచించకు" అని మనసుకి సర్ది చెప్పుకుని తినటానికి కూర్చుంది. రవళి ఏవేవో మాట్లాడుతూ ఉంది. తిందామని అన్నం కలుపుకుని ముద్దలా చేసుకుంటుంటే నీరజ పైకి వచ్చింది.
"త్వరగా తిని కిందకి వెళ్ళు జాహ్నవి, మొన్న నైట్ వచ్చిన కస్టమర్ వచ్చారు. ఆయన నువ్వు ఉంటేనే కొంటాను అని కింద కూర్చున్నారు" అంది
అది విని జాహ్నవి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది.
"ఏంటి సాత్విక్ వచ్చారా?" అంది రవళి ఆశ్చర్యంగా
"ఏమో ఆయన పేరు నాకు తెలియదు, త్వరగా తిని రా జాహ్నవి" అని నీరజ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
"మనల్ని గుర్తు పడతారు అంటావా?" అంది రవళి, జాహ్నవి ని చూసి
"ఏమోనే తెలియదు" అంది జాహ్నవి మెల్లగా
తనకోసం సాత్విక్ ఎదురుచూస్తున్నాడు అంటేనే తినాలి అనిపించలేదు. తన పార్సెల్ క్లోజ్ చేసి
"నేను మళ్ళీ వచ్చి తింటానే, అతన్ని వెయిట్ చేయించటం బాగోదు" అంది జాహ్నవి
"ఏం కాదులేవే తినేసి వెళ్ళు" అంది రవళి
"పర్లేదు లే వచ్చి తింటాను" అని హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెల్లింది.
మళ్ళీ తన మనసులో వంద ప్రశ్నలు. ఎందుకు వచ్చాడు ఇక్కడికి మళ్ళీ. డ్రెస్ యే కొనాలి అంటే కింద చూపించటానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా నేనే ఎందుకు? నిన్న పబ్ లో జరిగిన విషయం గురించి మాట్లాడటానికా? అన్న ఆలోచన రాగానే ఒళ్ళంతా మెల్లగా వేడెక్కింది. కాసేపటికి లేదు లేదు అతనికి నేను సరిజోడీ కాదు, ఇలా ఆలోచించకు రా జాను అనుకుని తన నుదిటి మీద కొట్టుకుని కిందకి వెళ్ళింది. పై నుండి కింద చైర్ లో కూర్చున్న సాత్విక్ ని దొంగ చూపులు చూసింది. మళ్ళీ వద్దు చూడకు తల దించుకో అని సర్ది చెప్పుకుని తల దించుకుంది.
మెట్లు దిగుతూ వస్తున్న జాహ్నవిని నవ్వుతూ అలానే చూస్తున్నాడు సాత్విక్. జాహ్నవి అప్పుడే మెల్లగా తల పైకి లేపి అతన్ని చూసింది. అతని కళ్ళు, నవ్వు చూసి మనసు మళ్ళీ మెల్లగా కరగటం మొదలుపెట్టింది. అడుగులో అడుగు వేసుకుంటూ అతని వైపు నడిచింది.
"జాహ్నవి సార్ కి ఏం కావాలో చూడు" అన్నాడు ఆకాష్.
"సరే ఆకాష్" అంటూ సాత్విక్ దగ్గరికి నడిచింది.
ఎలా మాట్లాడాలి, ఏమని మాట్లాడాలి అని ఒకటే టెన్షన్ గా ఉంది. కింది పెదవిని పంటితో కొరుకుతూ అతని ముందు వెళ్లి నిలబడింది. మెల్లగా అతని కళ్ళలోకి చూసింది. అతని కళ్ళు కూడా జాహ్నవి కళ్ళతో కలిసాయి. వాటి భాష ఏంటో ఇద్దరికీ అర్థం కావట్లేదు. జాహ్నవి మెల్లగా నోరు తెరిచి అడగబోతుంటే
"తినకుండా ఎందుకు వచ్చావ్? ఇప్పుడే పైకి వెళ్ళావ్ అన్నారు. నేను వెయిట్ చేసేవాణ్ణి కదా" అన్నాడు సాత్విక్.
ఇంత మంచోడివి ఏంట్రా బాబు అనుకుంది జాహ్నవి మనసులో.
"పర్లేదు సార్" అంది మెల్లగా
ఇద్దరి మధ్య మౌనం.
"ఏం కావాలి సార్" అంది మళ్ళీ జాహ్నవి
"నిజం చెప్పనా?" అన్నాడు సాత్విక్ మెల్లగా చుట్టూ చూసి. జాహ్నవి కూడా చుట్టూ చూసింది. లంచ్ టైం కావటంతో ఎక్కువ స్టాఫ్ కూడా లేరు, ఉన్న కొంతమంది కూడా కొంచెం దూరంగా ఉన్నారు.
"హ్మ్ చెప్పండి" అంది జాహ్నవి. అతను ఏం చెప్తాడా అని మనసులో ఒకటే అలజడి. పబ్లో జరిగినదాని గురించి మాట్లాడతాడా అని.
"నిన్ను చూడాలి అనిపించింది. అందుకే వచ్చేసాను" అన్నాడు.
అది విని జాహ్నవి గుండె వేగం పెరిగింది. తన ఒళ్ళంతా సీతకోకచిలుకలు వాలి గిలిగింతలు పెట్టినట్టు అనిపించింది. బుగ్గలపై తెలియకుండానే సిగ్గు మొగ్గలేసింది. కళ్ళు పెద్దవి అయ్యాయి, పెదాల మీద ఉండాల్సిన నవ్వు తన కళ్ళలో కనపడుతుంది.
"ఎందుకు?" అంది ఒక్కొక్క మాట కూడబలుక్కుని.
"ఎందుకు అంటే ఏం చెప్తాను? నీకు తెలియదా?" అన్నాడు సాత్విక్ నవ్వుతూ.
ఆ మాటకి జాహ్నవి కి గుండె ఆగినట్టు అనిపించింది.
"తెలియదు" అంది మెల్లగా
"అయితే మెల్ల మెల్లగా తెలుస్తుంది లే" అన్నాడు నవ్వుతూనే.
జాహ్నవి ఏం మాట్లాడలేదు, అతని కళ్ళలోకి చూస్తూనే ఉంది. అతను కాసేపటికి నోరు తెరిచి
"జాను" అంటూ పిలిచాడు.
తన పేరు అతని నోటి వెంట వింటుంటే ఎంత బాగుందో అనుకుంది.
"హ్మ్" అంది మెల్లగా
"ఆ డ్రెస్ తీసి ప్యాక్ చేయించు, నేను ఏం తీసుకోకపోతే వీళ్ళు నిన్ను ఏమన్నా అంటారు" అన్నాడు మెల్లగా
జాహ్నవి మెల్లగా అతను చూపించిన డ్రెస్ తీసి ఫోల్డ్ చేస్తూ ఉంది. సాత్విక్ మెల్లగా తన దగ్గరికి వెళ్లి
"ఇలా ప్రతీరోజు నిన్ను చూడటానికి వచ్చి, ఇలా కొనాలి అంటే అవ్వదేమో. నీకు ఇబ్బంది లేకపోతే నీ ఫోన్ నెంబర్ ఇస్తావా?" అన్నాడు
అది విని జాహ్నవి గుండె జల్లుమంది. ఒక పక్క సంతోషం తను నెంబర్ అడిగాడు, తనకోసమే ఇక్కడికి వచ్చాడు అని, మరొక భయం తనకి నేను తగిన దానిని కాదు, అతని చేతి వాచ్ అంత ఉండదు నా జీవితం ఖరీదు అని. తన సంతోషాన్ని ఆ భయం పక్కకి నెట్టేసింది.
"నో సార్" అంది జాహ్నవి మెల్లగా అతని కళ్ళలోకి చూస్తూ
ఆ క్షణం అతని కళ్ళలో ఏదో బాధ కనిపించింది. అది చూసి జాహ్నవి కూడా బాధ పడింది. అతని పెదాల మీద ఉన్న చిరునవ్వు మాయం అయింది.
"హ్మ్ సరే జాను వెళ్తున్నాను" అన్నాడు మెల్లగా
"హ్మ్" అంది ప్యాకెట్ కౌంటర్ దగ్గర ఇచ్చి
సాత్విక్ కౌంటర్ దగ్గరికి వెళ్లి బిల్ పే చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి జాహ్నవిని చూసాడు. జాహ్నవి కి కూడా ఎందుకో బాధగా అనిపించింది. మళ్ళీ ఒక్కసారి తనని చూడాలి అనిపించింది. మెల్లగా బయటకు వెళ్ళింది. కానీ అతను కనిపించలేదు. ఛ అనుకుంది నిరాశగా.
అలానే మెల్లగా పైకి వెళ్ళింది కానీ ఆకలి అనిపించట్లేదు. నెంబర్ యే కదా ఇస్తే ఏమవుతుంది అని మనసు ఒకటే గొడవ పెట్టింది. మరొకపక్క వద్దు, ఎందుకు అతని గురించి ఆలోచిస్తున్నావు అని మరొక గొడవ. ఆ రోజు మొత్తం తన పరిస్థితి అలానే ఉంది.
"ఏంటే ఏదో ఆలోచనలో మునిగిపోయావ్?" అంది రవళి
"ఏం లేదే?" అంది జాహ్నవి
"సాత్విక్ ఏమన్నా అన్నారా ఏంటి నిన్న పబ్ దగ్గర చూసాను అని" అంది రవళి
"లేదు" అంది జాహ్నవి
"మరి ఎందుకు అలా ఉన్నావ్?" అంది రవళి
"ఏమోనే? ఎందుకో నీరసంగా ఉంది" అంది జాహ్నవి
"అవునా మరి చెప్పేసి వెళ్ళిపో, వెళ్లి రెస్ట్ తీసుకో" అంది రవళి
"అంతే అంటావా?" అంది జాహ్నవి
"అంతే వెళ్ళు" అంది రవళి
జాహ్నవి, ఆకాష్ దగ్గరికి వెళ్లి ఒంట్లో బాలేదు అని చెప్పి ఇంటికి వెళ్ళటానికి పర్మిషన్ అడిగింది. ఆకాష్ సరే అని ఒప్పుకున్నాడు. జాహ్నవి వెళ్ళబోతుంటే కౌంటర్ లో నుండి 2000 తీసి జాహ్నవికి ఇస్తూ
"ఇందాక ఆ సార్ మళ్ళీ ఈ టిప్ ఇచ్చారు. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడే వెళ్తున్నావ్ కదా తీసుకుని వెళ్ళు" అన్నాడు
అది చూసి జాహ్నవి మెల్లగా చేయి చాపి ఆ నోటుని తీసుకుంది. చూసావా నువ్వు రెండు రోజులు కష్టపడితే వస్తాయి ఈ 2000 అలాంటిది అతను దీనిని టిప్ లా ఇస్తున్నాడు. ఇప్పుడైనా అర్థం అయిందా నీ స్థాయి ఏంటో? అంటూ మనసులో మరొక ప్రశ్న.
మెల్లగా అక్కడ నుండి బయటకు వచ్చింది. ఇంటికి వెళ్తుంటే దారిలో సురేష్ ఎదురు వచ్చాడు. జాహ్నవిని ఆట పట్టిస్తూ తన వెనుక వెళ్తుంటే జాహ్నవికి పట్టరాని కోపం వచ్చింది. వెనక్కి తిరిగి వాడి చెంప మీద ఒక్కటి పీకింది.
"పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావ్ ఒళ్ళు ఎలా ఉంది?" అంది కోపంగా
దాంతో చుట్టు పక్కన వాళ్ళు కూడా అక్కడికి చేరారు. ఆడపిల్లని ఏడిపిస్తున్నావా రా అంటూ నలుగురు నాలుగు తన్ని వాడిని తరిమేసారు. జాహ్నవి చిరాకుగా ఇంటికి వచ్చి పడుకుంది. నెంబర్ ఇవ్వాల్సింది అంటూ మనసులో చిన్న గొడవ, దానికి సమాధానం గా మనసులో మరొక ఆలోచన. అలా సతమతమవుతూ కళ్ళు మూసుకుంది. కళ్ళముందు సాత్విక్ రూపం, పబ్ లో దాదాపు ఇద్దరి పెదాలు కలుసుకునేంత దగ్గరికి వచ్చాయి. అప్పుడు కలిసి ఉంటే నా ఆలోచన ఇలానే ఉండేదా అనుకుంది. అలా మెల్లగా నిద్రలోకి జారుకుంది.
రాత్రి 8 అవుతుంది అనగా మెలుకువ వచ్చింది. లేచి ఇంట్లో పనులు పూర్తి చేసి, వంట చేయటం మొదలుపెట్టింది. తన ఫోన్ తీసుకొని రవళి కి మెసేజ్ చేసింది వంట చేస్తున్నాను బయట నుండి ఏం తీసుకొని రావొద్దు అని. దానికి రవళి కూడా సరే అని రిప్లై ఇచ్చింది.
సరిగ్గా 11:00 గంటలకి రవళి వచ్చింది. రాగానే స్నానం పూర్తి చేసి వచ్చింది.
"తిన్నావా ఏమన్నా?" అంది రవళి
"లేదు" అంది జాహ్నవి
"మైండ్ ఉందా అసలు, ముందు తిందాం రా" అంది రవళి కూర్చుంటూ
ఇద్దరు కూర్చుని తినటం మొదలుపెట్టారు.
"అసలు మధ్యాహ్నం ఏమైంది?" అంది రవళి
"ఏమైంది?" అంది జాహ్నవి
"నా దగ్గర యాక్టింగ్ చేయకు, నీకు, సాత్విక్ మధ్యలో ఏం జరిగింది" అంది సూటిగా తన కళ్ళలోకి చూస్తూ
"ఏం జరగలేదు" అంది జాహ్నవి
"ఏం జరగకుండానే, నీ కోసం అతను స్టోర్ కి వచ్చాడా?" అంది రవళి
అది విని గుండె ఆగినట్టు అయింది.
"నా కోసం ఎందుకు వస్తాడు?" అంది జాహ్నవి తడబడుతూ
"మరి నా కోసం వచ్చాడా ఏంటి?" అంది రవళి
"ఏమో నాకేం తెలుసు" అంది మెల్లగా
"మళ్ళీ అబద్దం చెప్తున్నావ్" అంటూ తన చేత్తో జాహ్నవి తొడని గిల్లింది.
"ఆఆహ్" అంటూ అరిచింది జాహ్నవి
"మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాను కానీ నా దగ్గర కూడా చాలానే దాచిపెడుతున్నావ్" అంది రవళి మెల్లగా
అది విని జాహ్నవి కి బాధగా అనిపించింది.
"అది కాదే" అంటూ నిన్న పబ్ లో మనీష్ చేసిన పని, ఆ తర్వాత సాత్విక్ తో కలిసి డాన్స్ చేసిన విషయం మొత్తం చెప్పింది సాత్విక్ పెట్టిన ముద్దు విషయం తప్ప.
"అంత జరిగితే అసలు కొంచెం కూడా చెప్పాలి అనిపించలేదా?" అంది మళ్ళీ తొడని గిల్లుతూ
"ఆహ్" అంటూ మళ్ళీ అరిచింది జాహ్నవి
"అసలు చెప్పాలి అంటే ఆ మనీష్ గాడిని నీకు సెట్ చేద్దాం అనుకున్నాం. కానీ నువ్వు చెప్తుంటే అర్థం అయింది వాడు పెద్ద ఎదవ అని. దూరం పెట్టి మంచి పని చేసావ్" అంది రవళి
"అంటే ప్లాన్ చేసి నన్ను తీసుకొని వెళ్ళావా?" అంది జాహ్నవి ఈ సారి తన చేత్తో ఆమె తొడని గిల్లుతూ
"హాహా, మరి సాత్విక్ మీద నీ ఒపీనియన్ ఏంటి?" అంది మెల్లగా రవళి చేయి కడుక్కుంటూ
"ఏముంది, ఏం లేదు?" అంది జాహ్నవి
"నిజంగా ఏం లేదా?" అంది రవళి
"చూసావ్ కదా అతను ఎంత డబ్బు ఉన్న వాడో, మనల్ని ఎందుకు పట్టించుకుంటాడు చెప్పు" అంది జాహ్నవి
"నేను అతని గురించి అడగలేదు, అయినా డబ్బు విషయానికి వస్తే దినేష్ కూడా బాగా ఉన్నవాడే మరి నన్నెందుకు లవ్ చేసాడు అంటావ్?" అంది రవళి
జాహ్నవి నోటి వెంట సమాధానం రాలేదు.
"చూడు జాహ్నవి, ప్రేమ వేరు, డబ్బు వేరు రెండిటిని కలిపి చూడకు" అంది రవళి
"హ్మ్" అంది జాహ్నవి
"ఇప్పుడు చెప్పు అతని మీద నీ ఒపీనియన్ ఏంటి?" అంది రవళి
"ఏం చెప్పమంటావ్? ఒకవేళ ఉన్నా అతనెక్కడ, నేనెక్కడ? మళ్ళీ కలుస్తామో లేదో" అంది జాహ్నవి
"హాహా అనుకుంటే ఇప్పుడే కలవొచ్చు ఎందుకంటే నువ్వు ఏమో ఇక్కడ, అతనేమో కింద" అంది రవళి నవ్వుతూ.
"ఏంటి?" అంది జాహ్నవి ఆశ్చర్యంగా
"హా క్లోసింగ్ టైంలో నీ కోసం స్టోర్ బయట ఎదురు చూస్తూ ఉన్నాడు పాపం, నన్ను చూసి జాహ్నవి లేదా అన్నాడు, తనకి హెల్త్ బాలేక ఇంటికి వెళ్ళింది అని చెప్పాను. నిన్ను చూడాలి అని ఇక్కడ వరకు వచ్చాడు." అంది రవళి
"మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు" అంది జాహ్నవి చిరుకోపంతో
"తనే చెప్పొద్దూ అన్నాడు. తన కార్ లోనే నన్ను డ్రాప్ చేసాడు. మాటల్లో చెప్పాను నువ్వు మధ్యాహ్నం కూడా ఏం తినలేదని. అందుకే నువ్వు తినేవరకు ఉంటాను అని చెప్పాడు" అంది రవళి నవ్వుతూ
"అసలు నిన్ను......" అంటూ మళ్ళీ రవళి తొడని గిల్లింది జాహ్నవి
"ఆఆహ్....." అంటూ రవళి నవ్వుతూ అరిచి "ఇందాక నువ్వు చెప్పిన పిచ్చి ఆలోచనలు కాసేపు పక్కన పెట్టి వెళ్లి మాట్లాడి రా. నాకెందుకో నీకు పడిపోయాడు అనిపిస్తుంది" అంది రవళి నవ్వి
అది విని జాహ్నవి బుగ్గలు ఎరుపేక్కాయి.
"ఆపవే అదేం లేదు" అంటూ మెల్లగా పైకి లేచింది.
"త్వరగా వచ్చేయ్, ఏమన్నా అడిగితే కాదనకుండా ఇచ్చేసేయ్" అంది రవళి కన్ను కొట్టి
"చంపుతా నిన్ను" అంటూ జాహ్నవి నవ్వి రూమ్ నుండి మెల్లగా బయటకి వచ్చింది.
కిందకి ఒంగి చూసింది, ఎల్లో కలర్ మినీ కూపర్ కార్ కి ఆనుకుని సిగరెట్ తాగుతూ ఉన్నాడు సాత్విక్. అయ్యగారికి సిగరెట్ అలవాటు కూడా ఉన్నట్టు ఉంది అనుకుంటూ మెల్లగా కిందకి దిగింది. ఒక్కొక్క అడుగు కిందకి పడుతుంటే దానికి తగ్గట్టు గుండె వేగం కూడా పెరుగుతూ వెళ్తుంది. గేట్ చప్పుడికి సాత్విక్ తల ఎత్తి చూసాడు. ఎదురుగా జాహ్నవి నిలబడి ఉంది. వెంటనే సిగరెట్ పక్కన పడేసి చిన్నగా నవ్వాడు. ఇద్దరి కళ్ళు మళ్ళీ కలుసుకున్నాయి.
Connect me through Telegram: aaryan116 (If you're a gay don't message me)