01-04-2025, 10:43 PM
(This post was last modified: 01-04-2025, 10:44 PM by anaamika. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒకరోజు రాత్రి పడుకునే సమయంలో తండ్రి తన గదికి వెళుతుండగా, తన కూతురి గది దాటుతున్నప్పుడు, కూతురు ప్రార్ధన చేసుకోవడం విని ఆగిపోయాడు. నవ్వుకుంటూ అసలు తన కూతురు ఏమని ప్రార్ధిస్తుందో తెలుసుకుందామని బయటే ఆగిపోయి విన్నాడు.
"దేవుడా ! మా అమ్మని దీవించు. దేవుడా ! మా నాన్నని దీవించు. దేవుడా ! మా తాతని దీవించు, అమ్మమ్మకి టాటా చెప్పు" అని కోరుకుంది.
ఇదేంటి ఇలా కోరుకుంది అనుకున్నాడు అయితే తాను విన్న సంగతి తన కూతురుకి తెలియడం ఇష్టం లేక అక్కడినుండి వెళ్ళిపోయాడు.
అయితే దురదృష్టవశాత్తూ, మరుసటి రోజు వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది. కొన్ని నెలలు గడిచిపోయాయి. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ నాన్న మళ్ళీ పడుకోవడానికి వెళుతున్నప్పుడు, మళ్ళీ తన కూతురు ప్రార్ధించుకోవడం విన్నాడు.
"దేవుడా ! మా అమ్మని దీవించు. దేవుడా ! మా నాన్నని దీవించు, మా తాతకి టాటా చెప్పు" అని కోరుకుంది.
అలా కోరుకోవడంలో తప్పేం ఉందిలే అని నాన్న అనుకున్నాడు అయితే మరుసటి రోజు ఉదయమే ఇంటికి టెలిగ్రామ్ వచ్చింది - తాత నిద్రలోనే చనిపోయాడని.
ఈసారి ఏడాది గడిచింది. మళ్ళీ పరిస్థితులు చక్కబడ్డాయి. మళ్ళీ ఒకరోజు వాళ్ళ నాన్న మళ్ళీ పడుకోవడానికి వెళుతున్నప్పుడు, మళ్ళీ తన కూతురు ప్రార్ధించుకోవడం విన్నాడు.
"దేవుడా ! మా అమ్మని దీవించు, మా నాన్నకి టాటా చెప్పు".
నాన్న భయంతో వణికిపోయాడు. రాత్రంతా నిద్రపోలేదు. ఒకవేళ నిద్రపోతే, అదే శాశ్వత నిద్ర అవుతుందేమో అని భయంతో పడుకోలేదు. మరుసటి ఉదయం తన ఆఫీస్ కి కారులో వెళ్లకుండా నడుస్తూ వెళ్ళాడు - కారులో వెళితే ఆక్సిడెంట్ అయి చనిపోతానేమో అని. అయితే ఆఫీసులో కూడా ఎటువంటి పనీ చెయ్యలేదు.
సాయంత్రం ఇంటికి చేరుకుంటూనే కుర్చీలో కూలబడ్డాడు. నరాలు తెగే ఉత్కంఠని భరించలేక తన భార్యతో ఆరోజు తాను పడ్డ టెన్షన్ గురించి చెప్పాడు (కూతురు ప్రార్ధించిన సంగతి గురించి చెప్పలేదు).
భార్య ఇలా సమాధానం ఇచ్చింది - "మీకు ఒక్కళ్లకే ఈరోజు మంచిరోజు కాదు. ఈరోజు ఉదయం నేను నిద్ర లేచి, తలుపు తెరవగానే, మనకి పాలు ఎప్పుడూ పోస్తున్న మనిషి, మన మెట్ల మీద చనిపోయి కనిపించాడు".