20-12-2024, 08:54 PM
(This post was last modified: 07-03-2025, 09:22 AM by Pallaki. Edited 2 times in total. Edited 2 times in total.)
CHAPTER - 1
EARLYHOOD OF SIVA
Episode - 001
సాయంత్రం 5:45 నిమిషాలు.. చలికాలం మొదలై సూర్యస్తమయం అయిపోయిన రోజు. మహాశివరాత్రి నేడు.. అందరూ భక్తితో ఉపవాసం, జాగారం ఉండే రోజు
ఇదే రోజున ఇదే సమయాన రక్తంతో తడిచిన బట్టలు, చినిగిన చొక్కా కాళ్ళకి చెప్పులు లేకుండా ఏడుస్తూ కూర్చున్నాడు తొమ్మిదేళ్ళ పిల్లాడు. ఏ ఊరో తెలీదు, ఏ రాష్ట్రమో కూడా తెలీదు, ఊరి చివరన చెరువు ప్రాంతం. వాడి ముందు రెండు జీవంలేని శరీరాలు.. ఒకరు అమ్మ ఇంకొకరు నాన్న.. చాలా సేపు ఏడ్చిన తరువాత లేచాడు. కడుపులో ఆకలి, నీళ్ల దెగ్గరికి వెళ్లి దొసిట పడుతుంటే వెనక ఆమడ దూరంలో పెద్ద మంట కనిపించింది. వెళ్లి చూస్తే అది స్మశానం అని తెలిసింది. లోపలికి నడిచాడు.
పెద్ద ఎత్తున లేచిన మంట వాసన పీలుస్తూ లోపలికి వెళ్ళాడు, చివరన చిన్న గుడిసె, అక్కడే తాగి పడిపోయిన కాటికాపరి, వాడి ఒంటి నుంచి వచ్చే వాసన కాదు కంపు. వాడి ఒంటి మీద చొక్కా లేదు.
లోపలికి వెళ్లి చూస్తే సట్టెలో అన్నం కనిపించింది, వెళ్లి తిని కుండలో మంచినీళ్లు తాగి బైటికి వచ్చాడు. కాటికాపరిని ఎన్నిసార్లు కదిలించినా లేవలేదు. చివరికి లేపాడు.
"ఓహ్ వచ్చావా ?" అని కాసేపు గురక పెట్టి మళ్ళీ లేచి "నీకోసమే ఎదురు చూస్తున్నాను ?" అని గట్టిగా పిచ్చిగా నవ్వాడు. వాడి నోటి నుంచి మందు వాసన గుప్పుమని కొట్టింది. గట్టిగా వాడి చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కెళుతుంటే నవ్వుతూనే తూలుతూ వచ్చాడు. బైట రక్తంలో పడున్న శవాలని చూసిన తరువాత కాసింత మత్తు దిగింది. కళ్ళు నలుపుకున్నాడు.
"మీ అమ్మ నాన్నా ?" అని అడిగితే అవునని తల ఊపాడు. "వీళ్ళని శివైక్యం చెయ్యాలా, నీ దెగ్గర ఎంతున్నాయి ?" అని నవ్వాడు మళ్ళీ
పిల్లాడు వెంటనే తన నాన్న చేతిలో ఉన్న పర్సు, అమ్మ మెడలో ఉన్న తాళి, రెండు చేతులకి ఉన్న బంగారు గాజులు తీసి వాడి చేతిలో పెట్టాడు.
చేతిలో పడ్డ బంగారం బరువు చూడగానే వాడి మత్తు దిగింది. ఒక్కడే ఇద్దరినీ లేపి భుజాన వేసుకుని స్మశానవాటికలోకి నడిచి వాళ్ళని ఓ పక్కన పడుకోబెట్టి పిల్లాడి వంక చూసి నవ్వుతూ కర్ర మొద్దులు పేర్చాడు. ఇద్దరినీ ఎత్తి కర్రల మీద విసిరేసి పిల్లాడి వంక చూసి నవ్వుతూ "కోప్పడకు శివా.. వాళ్లకి నొప్పి ఉండదులే" అని బిగ్గరగా నవ్వుతూ పక్కన కిరసనాయిల్ డబ్బా ఉంటే అది తీసి వాళ్ళ మీద పోసాడు. "ఓ సారి చూసుకో" అని కళ్ళు తిరుగుతున్న పిల్లాడి వంక చూస్తూ నవ్వాడు, వాడి ఒంట్లో ఓపిక లేదు. దెగ్గరికి వెళ్లి ఎత్తుకుని పిల్లాడితోనే నిప్పంటించి ఆ మంట పక్కనే కూర్చోపెట్టాడు. పక్కనే భూమిలో గుచ్చిన కర్ర దానికి చిన్న డమరుఖం, పిల్లాడి దెగ్గరికి వచ్చి తల మీద చెయ్యి పెట్టాడు. పిల్లాడికి స్పృహ పోవడం మొదలయింది. పిల్లాడిని చూసి పిచ్చిగా నవ్వుతూ.. "శివోహం.. అను.. శివోహం.. అను.. శివోహం.. అను.. " అని అరుస్తూ నవ్వుతుంటే పిల్లాడి నోట్లో నుంచి "శివోహం" అన్న మాట వాడి పెదవులలో పలికింది.
కాటికాపరి లేచి నిలుచుని గట్టిగా నవ్వుతూ "అవును.. నువ్వే శివుడివి" అని తల మీద కొట్టగానే కళ్ళు తిరిగి పడిపోయాడు. కాటికాపరి చేత్తో కర్ర పట్టుకుని బైటికి వెళ్ళిపోతూ కాలుతున్న మంటల్లో వాడికి మాత్రమే కనిపిస్తున్న ప్రాణ దీపాలని చేత్తో పట్టుకుని కర్ర ఢమరుఖం తిప్పుతూ "శివోహం.. శివోహం.. శివోఓఓఓఓవోహం" అని పాడుకుంటూ బైటికి వెళ్ళిపోయాడు.
తెల్లారి 3 గంటల 35 నిమిషాలు
పిల్లాడు ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా మంట లేదు, లేచి నిలబడి చూస్తే కాటికాపరి కూడా కనిపించలేదు. వాడి కాళ్ళు వణుకుతున్నాయి, చలికి ఒళ్ళంతా మంట పుడుతుంది.
"అమ్మా.. చలేస్తుంది.. నేను మీ దెగ్గరే పడుకుంటా.. ఎందుకు నన్ను వేరే రూములో పడుకోపెట్టారు" కోపంగా చిరాగ్గా అడిగాడు
"చెల్లి కావాలి అంటాడు, ఆ పని మాత్రం చెయ్యనివ్వడు" తల పట్టుకున్నాడు నాన్న
"ఛీ ఛీ ఏంటండీ ఆ మాటలు, శివా.. పడుకుందాం రా" అని అమ్మ పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్లి మధ్యలో వెచ్చగా ఇద్దరినీ వాటేసుకుని పడుకున్నాడు.
ఇదంతా గుర్తుకురాగానే మెల్లగా నవ్వాడు శివ. చలికి కట్టుకున్న చేతులు వదిలేసి మెల్లగా బూడిదలోకి నడిచాడు, అరికాళ్ళకి వెచ్చగా తగిలింది, సగం కాలిన కర్రని పక్కకి విసిరేసి మెల్లగా పడుకుని రెండు చేతులని అమ్మా నాన్న మీద వేస్తున్నట్టుగా వేసి కళ్ళు మూసుకున్నాడు.
ఎండ కొడుతుంటే మెలుకువ వచ్చింది శివకి, కళ్ళు తెరిచాడు. చేతిలో, ఒంటి మీద అంతా బూడిద. పిడికిలి బిగించి ఏవో గుర్తుచేసుకుంటుంటే ఏవో వినిపిస్తున్నాయి, చెవులు రెక్కించి వినగా ఎవరో మాటలు వినిపిస్తుంటే లేచాడు. అప్పుడే అటుగా వచ్చిన ఒకడికి ఉన్నట్టుండి బూడిదలో నుంచి శవం లేచినట్టు లేచిన శివని చూడగానే బెదిరిపోయాడు. అందులో శివ ఒంటి మీద బట్టలు కాలిపోయి, చర్మం నల్లగా అయిపోయి, జుట్టు మరియు కనురెప్పలు కాలిపోయి, వింత ఆకారంలో కనిపించేసరికి అక్కడే భయంతో ఉచ్చ పోస్తూనే బైటికి పరిగెత్తాడు.
శివ ఇదేది పట్టించుకోలేదు, లేచి గుడిసె వైపు నడుస్తుంటే బోరింగ్ పంపు కనిపించింది, ముందు దాని వైపు నడిచాడు.
శివోహం
మొదలు