Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - ప్రాప్తం
#31
బోసి నోటితో భళ్ళున నవ్వాడు తాత.

"నా యేషాలు - నా పాటలు ఎవ్వరికి కావాలి కొడకా. మాదంతా పాతసింతకాయ పచ్చడి. ఇప్పుడు పెజలకి సినిమా పాటలు కావాలి. గుడ్డలూడదీసి చేసే డాన్సులు కావాల. అయినా మొగోడు ఏసం కడితే చూస వోడెవుడని? ఆ కలంలయితే అలా పెజలు బెమిసి పోయేవోరుగాని.

"ఏటి బాపూ ఏసాలంతాన్నారు మీరింకా. ఇప్పుడు గేమంలో ఏటి జరిగినా నాటకాలు, బుర్రకథలు, జముకుల పాటలు ఏటున్నాయేటి? అవి తెచ్చినా సూసేవాళ్ళు ఎవురున్నారు? ఏ పండుగొచ్చినా కార్యమొచ్చినా, యాతరొచ్చినా, పెళ్లయినా సమర్తయినా పోగ్రాం పెట్టించాలంతే. ఇప్పుడన్నిటికీ ఒక్కటే... సినిమా అరసాడరెడ్డోళ్ళ బావుకి సెబితే పెద్ద టీవి ఇసిపి తెత్తాడు. ఎత్తుగా టేబిల్ కాడ పెట్టేయడం, ఏ సిరంజీవి సినిమానో, బాలకృష్ణ సినిమానో ఏసేయడం. మరో నాల్గు డబ్బులు ఎక్కువ పారేత్తే చిన్న తెర సినిమా. ఆ సినిమా ముందు ఈ ఏసాలు ఏటి పడతాయి?" గంగన్న పెదవి విరిచాడు.

అంతా సినిమాలో పడి కొట్టుకుపోతన్నారు. ఇంక మాలాంటోల్లను ఎవరు సూత్తారు...? ఆ కాలమయిపోయింది... అంతే" తా మాటల్లో చెప్పలేనంత నిస్పృహ. ఆదరణ కంటే కళకు వృద్ధాప్యం లేదు కదా!

"తాతా! నీతో వేషం కట్టేవాడు - కొంచం పొట్టిగా ఉంటాడు అతను బాగున్నాడా?"

"ఆడా... మాసిన్నాయన కొడుకు. ఆడు సచ్చిపోయి సాన్నాళ్ళయిపోయింది. ఆడు నేను కలిసి తిరుగుతుండేవాళ్ళం. ఆడు పోయింతర్వాత నాను మరే ఊరు ఎల్ల నేదు. ఏ యేసము కట్టనేదు"

"ఈ వేషాలు కట్టడం నీకెప్పటినుండి అలవాటయింది. ఇది మీ కుల వృత్తి కాదు కదా. ఎలా దీన్లో ప్రవేశించావు" ఇంటర్వ్యూ చేస్తున్నట్లు ప్రశ్నించాను కాల క్షేపం కోసం.

"ఏటి సెప్పమంతావు నాయనా. అరసాడ శివకోవిల మాది - మా అయ్య పోయి నాక పెద్దరికమంతా మా సిన్నయ్య సేతికొచ్చింది. నానింతున్నప్పుడే మా అయ్య సచ్చిపోనాడు. మన కోవిల రాబడి తెల్సుకదా. కార్తీక సోమవారాలకి జనాలొత్తరు. మళ్ళీ శివరాత్రికొత్తరు. వుత్తప్పుడు ఎవులైనా అటుకాసి సూత్తరా? ఊహూ...! వొచ్చింది వోటాలేసుకోవా. మరి మాం బతకడమెలా? కోవిల మడిసెక్కల నాలుగు రైతుల కమర్సీసి నాడు మా సిన్నయ్య. అయ్యేల కాని, ఇయ్యేల బేడా బోడీసి ఆ బూములు క్రయం సేసీసినాడు. ఆడుమట్టుకు స్వయం పాకమంటూ సెంబొట్టుకొని ఇంటింటికి ఎల్లిపయేవోడు. మరో బతుకు తెరువు నేక కూలి పనులకెల్లిపోయే వోళ్ళం మేమంతా.

ఒకపాలి ఏసవుల్లో మనూరు బాగోతం వొచ్చింది. వాళ్ళ పాటలు, డేన్సులు, జిగేలుమనే బట్టలు నాకు నచ్చినాయి. ఇంట్లో కూడా సెప్పకుండా అల్లవెంట ఎల్లిపోనాను. దేశాలు తిరిగినాను. ఏసాలు కట్టినాను. పాటలు పాడినా. నాతో ఏసం కట్టే ఓ గుంతపాపతో నేస్తం కలిసింది. అలా అల్ల గుంటను లేపుకొచ్చి అన్నంటల్లా తిరిగి తిరిగి సివరకు మనూరు చేరినాను. నాను సచ్చినానో, బతికి ఉన్నానో, ఎన్నంట ఎల్లిపోనానో తెలియక ఓ ఏడు పేడ్చి మా వాల్లు నన్ను మర్సిపోనారు. ఆ గుంటతో నానొచ్చేసరికి - తిరిగొచ్చినందుకు సంతోసించినా కులం సెడినందుకు ఎలిపెట్టినారు. కోవిల్లోకి రానిచ్చినార కాదు. నాకేటి మంత్రాలా? పూజలా? ఏటి రావు కాబట్టి నానుకోవిల కాసెల్లలేదు. నాకు తెలిసిన ఇద్దే ఏసాలు కట్టడం గాబట్టి నలుగురు గుంటల్ని సేరదీసి బాగోతం కట్టి ఉర్లంట తిరగీసి బతికేసినాను. ఆ బాగోతాలకి కాలం సెల్లిపోతే మా సిన్నయ్య కొడుకు నాను మిగిలిపోనాం. ఆ ఏసాలతో ఊరు మీన బడి కానీ పరక దండుకొని కాలచ్చేపం సేసేసినాం. ఇప్పుడు మరా ఓపిక నేక ఇదో ఇలాగయిపోనాను" శూన్యంలోకి చూస్తూ చెప్పుకుపోతున్నాడు తాత.

"ఈ వయసులో ఇంకా ఎందుకిలా తిరుగుతావు? కసింత తిని నీడపట్టున కూర్చుని కృష్ణా రామా అనుకోక" యధాపలంగా అనేసాను. తరువాత ఎంతో విచారించాను. 'ఎందుకిలా మాట్లాడానా'? అని. కానీ అప్పటికే జరగవలసిన అనర్ధం జరిగిపోయింది. నా మాటలు చురకత్తులై తాత గుండెల్ని చీల్చేసాయి.

చిగురుటాకులా కంపించాడు తాత. ఊట చెలమలే అయ్యాయి కళ్ళు. గొంతులో సుడులు తిరిగింది దుఃఖం. ఎగిసిపడుతున్నాయి ఎండిన గుండెలు. తలను గుండెలకు ఆన్చి తనను తాను కంట్రోల్ చేసుకొంటున్నాడు తాత.

"నాయనా! కొన్ని కష్టజీవి పుట్టుకలు అలా ఎల్లిపోవలసిందే. పుడకల్లో కాలిపోయినప్పుడే ఆటికి విశ్రాంతి. కర్మాన్నెవ్వుడు తప్పించనేడు కదా. నా కర్మమిలా రాసి పెట్టి ఉంది. నా జల్మం ఇలా సాగిపోతోంది.

ఏ మూర్తాన పుట్టునానోగాని తండ్రిని తినేసినాను. కూలేసేసిందో - నాలేసేసిందో ఎన్ని ఇడుములు పడిందో నా తల్లి నన్ను పెంచడానికి. గాలోటంగానే పెరగేసినాను. ఆ ఆటలు, ఆ పాటు, ఆ తిరుగుళ్లు బతుకంతా అలాగే సాగిపోయేది. ఒక్క కొడుకు ఆడికేటి నాను నోపం సెయ్యనేదు. నాను తిన్నా తినకపోయినా ఆడికి పాలు, బువ్వా పెట్టినాను. ఆడు నానాగయిపోకూడదని పట్టాయుడి మేష్ట్రకాడికి సదువు కెట్టినాను. కొడుకన్నోడు సివరి దశలో సూసుకొంతాడనే కదా ఆస. నా కొడుకు అజ్జాడబడిలో పదోతరగతి సదివినాడు. టైలరింగు పని నేర్సినాడు. మెసను తిప్పి బట్టలు, పాతు కుట్టి పైసా పరక సంపాయించడం ప్రారంభించినాడు.

అంతా బాగానే ఉంది - కాలమంతా అలాగే గడిసిపోద్దనుకొన్నాడు. ఆడికి పెళ్లి చేసినాను. ఇద్దరు పిల్లల్ని కన్నాడు. ఆడిబతుకాడు బతికేత్తాడు. నా దినమిలా దిబ్బదీరిపోద్దని తలపోసినాను. ముండ బగమంతుడికి నా నేటి అపకారం చేసినాను కొడకా? నా కన్యాయం సేసినాడు బగమంతుడు. కలరా వొచ్చి నెట్టంత కొడుకు బుగ్గిల కలిసిపోనాడు. పిల్లల్ని సూసుకొంటు అత్తమామల్ని కనిపెట్టుకొంటు కూలికో నాలికో ఎల్తు ఆ ముండదాయి రెండు సంవత్సరాలు డేకెరింది. దానికేటి పోయేకాలమొచ్చిందో కాని, ఆ పెక్కురోల్లని ఒగ్గేసి మరో మొగుడి కెల్లి పోయాది. అద ఆగుంటలిద్దరు నా కాల్లకి సుట్టుకున్నారు. ఇనబడితే కనబడదు - కనబడితే ఇనబడదు నాగుంది ముసిల్దాయి ఏదో ఉడికించి పడేత్తంది.

నాయినా బతికనన్నాల్లు నాకీ యాతన తప్పదు కదా. సత్తే ఎవుడెలా పోతాడో అక్కర్నేదుగాని"

లోలోపల అణుచుకొంటున్న గుండెకోతను తన నోటంట చెప్పుకోవడం ఎంత దుర్భరం. నా అనాలోచితమైన మాట ఎంత వేదనను కలుగజేసింది. ఏమనాలో తెలియక తలపట్టుకొని కుర్చీలో అలాగే చేరబడ్డాను.

సూర్యుడు పడమటి కొండలవైపు జారి పోతున్నాడు. రెక్కల సాము చేసిన పక్షులు గూళ్ళకు మళ్ళుతున్నాయి. పశువులు ఇంటిమొకం పట్టాయి. గోర్జిలోంచి దుమ్ము రేగుతోంది. నూర్పుగొడ్లను కళ్లంలో వారగా విప్పారు. ఎడ్లను కుడితికి తోలతున్నాడు. మెందోడు. కొందరు రేకుపడుగు దులుపుతున్నారు. గంగన్న పడుగునుండి తోడిన గడ్డిని గడ్డి మేటుపై విసురుతున్నాడు.

"బాబూ మని నేను ఎల్లోత్తాను. సిత్తం సెలవిప్పించండి. సీకటి పడితే మరి నాకు కనిపించదు" తాత లేచాడు.

"గింజలలికిరిలో నాలుగు కల్లాలు తిరిగితే నాలుగ్గింజలు దొరికితే నెల్లాల్ల బత్తెం. ఏటి సేత్తాం మహారాజా. బుగ్గయే వరకు ఈ బతుకలా ఎల్లిపోవలసిందే" కర్రతో తాటించుకొంటూ తాత వెళ్ళిపోతున్నాడు.

ఎవరో గుండెల్ని నొక్కుతున్న అనుభూతి. మనిషి దరిద్రానికి తోడు వృద్ధాప్యం తోడయితే ఎంత దుర్భరం.

జనాలు లేకుండా బతికే కాలం ఎప్పుడైనా వస్తుందా? పిల్లలు స్వేచ్చగా ఆడుకొంటూ, యువత స్వతంత్రంగా శ్రమించి కూడబెడుతూ, వృద్ధులు బోసినవ్వులు నవ్వుతూ విశ్రాంతి పొందే రోజు - కలగానైనా కనిపిస్తే ఎంత బాగుండును. అటువంటి కలగూడా కనడం నాకు చేతగాదేమో!

దూరమవుతున్న తాత కంటికి మసకగా కనిపిస్తున్నాను. ఏదో విభ్రాంతి హృదయాన్ని పొడిచినట్లనిపించింది. జేబులోంచి పర్సు తీశాను. పదిరూపాయల నోట్లు మడిచి ఉన్నాయి. నా మధ్య తరగతి ఈవిని ప్రకటిస్తూ రెండో మూడో చేతికి వచ్చాయి. పరుగు పరుగున వెళ్ళి తాత చేతిలో కుక్కాను.

తాత కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనిపించే సంతృప్తి.

[Image: image-2024-12-01-165212650.png]
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - పగటివేషం - by k3vv3 - 01-12-2024, 04:52 PM



Users browsing this thread: 2 Guest(s)