Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - ప్రాప్తం
#29
సూర్యుడు పడమటి పక్క జారిపోతున్నాడు. శీతాకాలం సాయంత్రపు ఎండపొడ వెచ్చగా గిలిగింతలు పెడుతోంది. ఆదరబాదరా ఎక్కాలన్నీ చదివేసి బడికి జనగణమన పాడేశాం. పుస్తకాలు సంచీలో కుక్కేసుకుని అరుచుకుంటూ బడి పాక దాటేశాం. 'ఒరేయ్ ఒరేయ్' అని అరుస్తున్న మాస్టారి కేకలకి అందకుండా పరుగులు పెట్టాం. భూషి, రామం, భాస్కరం, శ్రీను మా జట్టంతా మువ్వల ముసిలోడి పెసరమడిలో దూకి పెసర కాయలు తెంపి మాడతల దండులా ఎగిరి పోయి, కొబ్బరితోట దాటిపోయి మా వీధిమొగ చేరాం.

మా ఇంటి దగ్గర పెద్దగుంపు. ఆడ, మగ. పిల్లా, జెల్లా, గుమికూడి ఉన్నారు. అంతా గోలగోలగా ఉంది. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ గుంపును చీల్చుకొంటూ ముందుకెళ్తాను.

"బహుషా నానమ్మ చచ్చిపోయిందేమో!" మరి నానమ్మ చచ్చిపోతే బాధపడవలసింది నేనే కదా. నాన్న పెద్దవాడయిపోయాడు. ఏడిస్తే బాగుండదు. అయినా మగాళ్ళు పెద్దయిం తర్వాత ఏడవరు కదా. అత్తగారు చచ్చిపోయినందుకు కోడలు సంబరపడుతుంది కదా. అందుకు అమ్మ ఏడవదు. ముసలిదాని పీడ విరగడయిందని అక్కలు సంతోషిస్తారు. ఇక నేనే రోజూ కథలు చెప్పే నానమ్మ, డబ్బులిచ్చి తాయిలం కొనిపెట్టే నానమ్మ. చదవలేదని నాన్న కోప్పడితే మద్దతు ఇచ్చే నానమ్మ చచ్చిపోయిందంటే... కళ్ళంట నీరు గిర్రున తిరిగింది. అడ్డొచ్చిన వారిని గుద్దుకుంటూ అభిమన్యుడిలా ముందు కురికాను. నా చేతిలో పుస్తకాల సంచీ గిర్రున తిరిగి చావడిలో పడింది.

అరుగుమీద ఒక అందమైన ఆడది. ఆమె పక్కనే చిన్న సూట్కేసు. ఒక చిన్న బట్టలమూట. తలనిండా పూలు పెట్టుకొని విపరీతంగా అలంకరించుకొంది. ఆమె కట్టిన చీర జిగేల్ మంటూ మెరుస్తోంది. చేతినిండా బంగారు గాజులు, తలపై పాపిడి పేరు. చెవులకు దిద్దులు, జంకాలు. మెడలో రాళ్ళ జిగినీ గొలుసు, పూసల దండ, మొగంనిండా ఒత్తుగా పౌడరు. స్టేజిమీద చంద్రమతిలా ఉంది. అందంగా ఉన్నప్పటికీ ఎదోలాగనిపిస్తోంది ఆమెను చూడగానే. చెంపసవరాలు, నాగారం పెట్టి జడగంటలు వేసిన పెద్ద జడను చేత్తో తిప్పుతూ అందరితో మాట్లాడుతోంది. ఆమె మాట్లాడుతుంటే ఎర్రటి పెదాలు విచిత్రంగా కదులుతున్నాయి. ఏదో వింత పరిమళం అల్లుకుంటోంది. ఆమె వయ్యారంగా లేచి నిల్చుని అటుఇటు నడుస్తూ మధ్య మధ్య కిటికిలోంచి ఇంట్లోకి చూస్తూ మాట్లాడుతోంది. "ఏంటి పెద్ద సంసారం. పిల్లలు - జెల్లలూ, పాడి - పంటా, యువసాయం - కంబార్లు, నౌకర్లు - సాకర్లు... ఇన్నింటిని మా యప్ప ఎంతకని సూసుకుంతాది? అటు సూత్తే ఇటు నేదు ఇటు సూత్తే అటునేదు. మా బాయ్యికి 'సబ్బు' అందిత్తాదా? తువ్వాలే అందిత్తాదా? పిక్కురోళ్ళకి అన్నమే ఎడ తాదా? ముసల్దాయికి ఫలహారమే సేత్తాదా? అన్నీ సూసుకొని నిబాయించుకోడానికి మా యప్పకి ఈలు కావడం నేదని నానొచ్చినా! మా బాయ్యకి ఈపురుద్దితానమాడించి తలకి సంపెంగి నూనె రాసి, ఇత్తిరి బట్టలేసి గుండెల మీన పులిగోరుపలక మెట్టి. ఓలమ్మ నాకు సిగ్గేత్తంది... మా బాయ్య పనులన్నీ సూసుకోడానికి నానొచ్చినా!"

"ఓలమ్మా! కుల్లికుల్లి నా కాసి అలా సూడకండి. సిన్నప్పటికాడి నుండి మా బాయ్య అంటే నాకు పేనం. ఆ కొరమీసాలు. ఆ తెల్లటి పీట సెక్కనాటి నడ్డి, ఉంగరాలు జుత్తు, ఏనుగు నాటి మనిషి, తెల్లటి ఇత్తిరి బట్టలేసుకొని వత్తుంటే తడి కల మాటునుంచి ఎన్నిమార్లు తొంగి సూసినాడో, మనువాడితే ఇలపింటి వోన్నే మనువాడాలని అనుకొన్నానో. అందుకే 'వత్తావేంటి గుంటా' అని బాయ్య పిలవగానే పారొచ్చినా"

అదెవర్తో, ఎందుకొచ్చిందో అర్ధం కాగానే ఏమిటో తెలియని కోపం నన్ను ఊపేసింది. మా ఫ్రెండ్స్ అందరూ నా వైపు జాలిగా చూస్తున్నట్లనిపించింది. చావడిలో పడివున్న నా పుస్తకాల సంచీని తీసి ఆమె పైకి విసిరాను.

"ఎవత్తివే నువ్వు" ఇక్కడ నుండిపో. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. ఇక్కడ నుంచి వెళ్ళకపోయావో దుడ్డు కర్రతో చితక పొడిచేస్తాను" బుసకొడుతూ వీధి అరుగు ఎక్కాను. కర్ర తెద్దామని ఇంట్లోకి దూసుకుపోతున్న నన్ను ఆమె పట్టుకోబోయింది.

"రా నాయినా! అలా కోపమైపోకురా. నాను మీ యమ్మనురా. నిన్నెత్తుకొని సెందమామని చూపిత్తు గోరుముద్దలెడతాన్రా. నిన్ను సంకనేసుకొని ఊరల్లా తిప్పిపాలు బువ్వ లెడతాన్రా" మొగం తిప్పుకొంటూ చేతులూపు కొంటూ పైపైకి వస్తున్న ఆమెను ఒక్క తోపు తోసి ఇంట్లోకి పరుగందుకొన్నాను.

కిటికీలోంచి వీధి వరండాలో జరుగుతున్న తంతును అక్కలిద్దరూ చూస్తున్నారు. నా కోపం నషాళానికి అంటింది.

"ఏమర్రా! ఏంటలా చూస్తున్నారు? చిన్నవాడిని నాకే ఇంత బుద్ధి ఉందే పెద్దవాళ్లు మీకా మాత్రం లేదా? దాన్ని తన్ని తగిలేయకుండా ఏంటా నవ్వులు? నేను గయ్ న లేచేసరికి నవ్వుతున్న అక్కలిద్దరూ మూతులు బిగించి 'ఫోరా' అని కసురుకొన్నారు. 'మీ పని తరువాత చెబుతాను' అనుకొంటూ దుడ్డుకర్ర కోసం వెతుకులాడుతున్నాను. వీధిలోంచి దాని మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

"కురుపాం రాజావారు కోటిసార్లు కబురెట్టినారు. ఒక్కపాలన్నా మా ఊరు రాయే" అని సీ... సీ... సీ ఈ రాజులు సెపలచిత్తులు. ఎవరునమ్మాల. నాకన్నా ఎర్రగా బుర్రగా ఉన్నదాయి రేపు కనబడితే దానివెనక పడుతారు. మరి నానేటి గావాలి? చిక్కవరం జమిందారు సినరాణిని సేత్తానన్నారు. సమితి పెసిడెంటు పట్నంల పెద్ద మేడ కట్టిత్తానన్నాడు. ఎంతమంది ఎన్ని కబుర్లెట్టినా, ఎందరెన్ని సెప్పినా నాకేల ఈ పరిగెట్టి పాలుతాగడము? అని నా నొప్పుగోనేదు. పొన్నూరు మనువయితే ఏటున్నది? ఉన్నూరు మనువయితే కట్టానికో సుఖానికో తల్లితోడు నాగుంతాది అని బాయ్యకి ఊకొట్టినా..."

"ఏటినాయినా మొగోళ్ళు అలా సూత్తారు? ఏటో కాసి ఆడదాయి వొరగక పోతే మీలాంటోళ్ళు బతకనిస్తారా? 'నాను... నాను' అని సంపెయ్యరూ? అయినా బాయ్యకి మీకు పోలికేంటి? బాయ్య కాలిగోరికి మీరు సరిపోత్తారా? సాల్లెండి సంబడం. పకపక నవ్వులు కూడానూ..."

చెవుల్లో దూరుతున్న మాటలను మరి వినలేక నానమ్మ చేతి కర్ర కోసం వంటింట్లోకి పరుగు తీశాను. ఏడుస్తున్న అమ్మను ఓదార్చాలనుకున్నాను. సవితి వస్తుంటే ఏ అమాయకురాలైనా ఎలా భరిస్తుంది? పెద్ద రాణిని చిన్న రాణి ఎన్నో బాధలు పెడుతుంది కదా. అమ్మ కూడా కథల్లోలా బాధలు పడవలసిందేనా? దీనికంతటికి మూల పురుషుడు నాన్న. నాన్నమీద విపరీతమైన కోపం వచ్చింది. నాన్న కనిపిస్తే చేతిలో కర్రని ఆయన మీదికే విసిరేద్దును.

నడవా దాటి వంటింట్లోకి వెళ్లాను. అమ్మ ఏడుస్తూ కూర్చోలేదు. చేటనిండా బియ్యం. దాని మీద ఇన్ని వంకాయలు. జబ్బిలో ఉల్లిపాయలు, చింతపండు ఉంది. ఎండు మిరపకాయలు సద్దుతోంది. అమ్మ చేట పట్టుకొంది. జబ్బి నాచేతిలో పెట్టింది నానమ్మ కబుర్లు చెవుతోంది. అమ్మ ముసిముసిగా నవ్వుతోంది. వాళ్ళ వాలకం చూస్తే ఏ ఒక్కరూ బాధ పడుతున్నట్లుగా నాకనిపించలేదు. 'అనవసరంగా నేనే కోపం తెచ్చీసుకొన్నానేమో' అని నా కనిపించింది.

చేతికర్ర టకటక లాడించుకొంటూ నానమ్మ, ఆ వెనుక నేను వీధిలోకి వచ్చాం. నానమ్మని చూడగానే టక్కున మాటలు ఆపేసి వంకదండం పెట్టింది ఆమె. నానమ్మ చేతికర్ర గాల్లో అటూ ఇటూ ఊగింది. ఆమె మూటా - ముడి తీసుకొని చప్పున అరుగు దిగిపోయింది. నానమ్మ చేతి కర్రకి ఎంత పవరుందో మరోమార అర్ధమయింది నాకు. నానమ్మ చేతి కర్రని చూస్తే ఇంట్లోవారే కాదు, ఊళ్ళో వాళ్ళు కూడా జడుస్తారన్నమాట. నాకు బలే బలే సంతోషమయింది.

అరుగు దిగిన ఆమె ఎంతో వినయంగా మూటలోంచి సంచి తీసింది. జబ్బిలో ఉల్లి, చేటలో బియ్యం సంచీలో పోసుకొంది. నానమ్మ రొంటినుండి తీసిన రెండు రూపాయల బిళ్లలను ఆమె ఎంతో వినయంగా అందుకొంది నమస్కారాలు చెబుతూ వెళ్లిపోయింది. ఆ తరువాత నానమ్మ చెప్పింది. "భడవ ఖానా! అది ఆడది కాదురా. అయ్యావారు అరసాడ అయ్యవారు. వాడలా వేషాలు కడుతూ ఊరూరా తిరుగుతుంటాడు. ఎవరికీ కలిగింది వాళ్ళు ఇస్తుంటారు. వీడు ప్రతీ సంవత్సరం ఏదో వేషంతో మన ఇంటికి వస్తాడు. మనకు కలిగింది మనం ఇస్తామన్నమాట" అని. నిజంగా ఆశ్చర్యపోవడం నా వంతయింది. "మగవాడేనా. ఆ వేషం కట్టింది, అచ్చం ఆడదాన్లా ఉన్నాడే. నేను నమ్మేటట్టు చేశాడే" అన్నాను. నానమ్మ పకపకా నవ్వింది.

ఆ తరువాత అయ్యవారిని చాలా వేషాల్లో చూశాను. మరొకడితో కలిసి రాముడు - ఆంజనేయుడు వేషాల్లో తిరగడం, 'శివపార్వతులు' వేషం వేసి గంగా వివాహం పాడడం, జాలరి భాగవతంలోని జాలరి సాయబు వేశాలు కట్టడం నాకు తెలుసు. వీధి బాగోతులు - నాటకాలు ఆదరణ కోల్పోతున్న కాలంలో రకరకాల వేషాలు వేసుకొంటూ ఊర్లంట తిరగడం, ఇచ్చిన ఏ వేషం వేసినా ఇతడో గొప్ప వినోదం. అయ్యవారు వేషంతో ఊర్లోకి వచ్చాడంటే చాలు - వెళ్లి పోయేంతవరకు తిళ్లు తిప్పలు మాని చిన్నా పెద్దా అనకుండా అంతా అతని వెనుకే ఉండేవారు - అతని మాటలకు చేష్టలకు పొట్ట పగిలేటట్టు నవ్వుకొంటూ. కానీ ఖర్చులేని వినోదం పొందేవారు. అలాంటి కళాకారుడు ఈనాడు ఎలా అయ్యాడంటే...

"ఏంటి తాతా! మరి వేషాలు కట్టడం లేదా?" అన్నాను.

ముగింపు తరువాయి భాగంలో!
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: వంశీ మెచ్చిన కథలు, వ్యాఖ్యానంతో - డాక్టర్ సుబ్రమణ్యం దవాఖానా - by k3vv3 - 21-11-2024, 12:55 PM



Users browsing this thread: 3 Guest(s)