Thread Rating:
  • 3 Vote(s) - 3.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సీనీవెర్స్ ఆఫ్ మ్యాడ్నెస్
#1
ఎక్కడో జరిగిన ఒక మొమెంట్ ఇంకెక్కడో జరిగిన ఇంకొక మొమెంట్ ని డిసైడ్ చేస్తుంది అని నాన్నకు ప్రేమతో సినిమాలో చూసాం. ఈ స్టోరీలో కూడా నలుగురి ప్రపంచంలో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనల వల్ల ఇద్దరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అన్నదే ఈ కథ
కర్నూల్ బస్టాండ్.....
ఉదయం ఏడున్నర...
"కర్నూల్ వచ్చింది దిగే వాళ్ళుంటే దిగండి" అని బస్సు కండక్టర్ గావు కేక పెట్టడంతో వైదేహి నిద్రలేచింది. రాత్రంతా ఏడుస్తూ ఉండడం వల్ల కళ్ళు మొత్తం ఎర్రగా ఉన్నాయ్.
వైదేహి తన బ్యాగ్ తీసుకుని బస్సు దిగి వాష్రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్ళింది. వాష్రూమ్లోకి వెళ్లి మొహం కడుక్కుని బయటికి వచ్చి తను వేసుకున్న చున్నీతోనే  మొహాన్ని తుడుచుకుంది.
బయట వాష్రూమ్ దగ్గర ఉన్నవాడు "రెండు రూపాయలమ్మ" అనడంతో తన పర్సు లోనుండి తీసి ఇచ్చింది.
తను అలానే తన బ్యాగ్ భుజాన వేసుకుని తను ఎక్కాల్సిన బస్సు దగ్గరికి వెళ్లబోతుంటే. బస్సు దిగుతూ ఒకడు " అది ఇక్కడ కూడా లేదు రా" అని తన పక్కనున్న వాడికి చెప్తుంటే తన కోసమే వెతుకుతున్నారని అర్థమైంది. ఒకసారి చుట్టూ చూసింది ఇంకా చాలా మంది వాళ్ళ మనుషులు తనని వెతుకుతున్నారని తెలుసుకుని వెంటనే వాష్రూమ్ వైపు పరిగెత్తింది. 
తన మొబైల్ తీసి చూడగా స్విచ్ ఆఫ్ అయి ఉంది. వెంటనే దానిని ఆన్ చేసి చూడగా దాదాపు పది మిస్సెడ్ కాల్స్ అనిత నుండి రావడంతో వెంటనే తనకు కాల్ చేసింది.
"హలో ఎక్కడున్నావే కాల్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యవ్ ఏంటి అంతా ఓకే కదా" అని కంగారుగా అనిత మాట్లాడుతుంటుంది.
"మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యిందే చూసుకొలేదు. అనిత నాకు భయంగా ఉందే ఇక్కడ కొంతమంది నా కోసం వెతుకుతున్నారు నన్ను కూడా చంపెయ్యడానికే వచుంటారు నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు" అని అంది వైదేహి ఏడుస్తూ.
" భయపడకు వైదేహి నీకేం కాదు నువ్వు అక్కడి నుండి తప్పించుకొని ఎలాగోలా హైదరాబాద్కి వచ్చేయి. ఇక్కడ మా మావయ్యకి పేరు పలుకుబడి ఉన్నాయి నేను మావయ్యతో మాట్లాడతాను మిగతా విషయాలన్నీ ఆయనే చూసుకుంటాడు" అని కాస్త ధైర్యం వచ్చేలా మాట్లాడ్తుంది అనిత.
"సరే" అని కాల్ కట్ చేసి తన చెంపల మీద జారుతున్న కన్నీటిని తుడుచుకుంటుంది వైదేహి.
అనిత కాల్ కట్ అయిన వెంటనే "ఈ విషయం ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు ముందు ఈ విషయం అజయ్  కు చెప్పి తన ద్వారా మావయ్యకు చెప్పి తనకు ఎలాగైనా హెల్ప్ చెయ్యాలి" అని  మనసులోనే అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చినదానిలా తన కాబోయే భర్త దగ్గరకు వెళ్తుంది.
రెండు రోజుల క్రితం....
వైదేహి తన బట్టలు సర్దుతుండగా ఫోన్ మోగడంతో అనితా అని చూసి "హలో చెప్పవే కొత్త పెళ్లి కూతురా ఎలా ఉన్నావు" అని మంచం పై ఉన్న బ్యాగ్ లో మడత పెట్టిన బట్టలు సర్దుతుంటుంది.
" ఇంకెలా ఉంటా, కోపంగా "
"ఏమైందే"
"ఏం కాలేదమ్మా కాలేజీలో నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ తిరిగే ఒకరు నా పెళ్లి వారం లో ఉన్నా ఇంకా రాలేదు అందుకు" 
"సారీ అను బుజ్జి నీకు తెలుసు కదా నా వీసా కూడా కంఫర్మ్ అయిపోయింది. సో చివరిసారిగా ఒకసారి తాతయ్య ని కలిసి తనకి చెప్పి వెళదామని" అనితను బుజ్జి అని పిలిస్తే తను ఐస్ అయిపోతుంది అని వైదేహికి తెలుసు.
"ఒసేయ్ నన్ను ఐస్ చెయ్యడం ఆపు ఇంకా ఈ మధ్య బాగా నేర్చుకున్నావు" అంటూ "అయినా మీ తాతయ్య చిన్నప్పటినుంచే నిన్ను పట్టించుకోలేదు. అందరూ ఉన్నా ఒక అనాథలా ఆశ్రమంలో పెరిగావ్. అలాంటి వాళ్ళు నువ్విప్పుడు దేశం దాటుతున్నానన్న ఎందుకు పట్టించుకుంటారు"
"అది కాదే ఎంతైనా వాళ్ళు నా ఫ్యామిలీనే వాళ్లకు ఒక మాట చెప్పాలి కదా"
"సరేలే నీ ఇష్టం నా మాట ఎప్పుడు విన్నావు కనుక. కానీ పని అయిపోగానే ఇక్కడికి వచ్చేయాలి చెప్తున్నా"
" సరే అను నేను మా ఊరికి వెళ్లి తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుని సరాసరి నీ పెళ్ళికే వస్తా సరేనా "
" పెళ్ళికి రావడం కాదు పెళ్ళికి కనీసం ఐదు రోజుల ముందు నువ్విక్కడ ఉండాలి లేదనుకో ముందే మా మావయ్య వాళ్ళ దగ్గర గన్నులు బాంబులు ఉన్నాయంట ఒక బాంబు తెచ్చి నీ మీద వేస్తా"
"వామ్మో అంటే అప్పుడే మీరు మీరు ఫ్యాక్షనిస్ట్ లు అయిపోయారెంటే స్టుపిడ్" అంటూ కాల్ కట్ చేసి నవ్వుకుంటూ వైదేహి తన తాత గారి ఊరి ప్రయాణానికి సిద్ధమైంది.
ప్రస్తుతం.... 
వైదేహి తన చున్నీని మాస్క్ లాగా మొహానికి చుట్టుకుని బయటికి వచ్చింది. బయట ఉన్నవాడికి రెండు రూపాయలు ఇచ్చి వేగంగా పరుగు లాంటి నడకతో అక్కడ నుండి ఆటోలు వరసగా ఉన్న చోటికి వచ్చింది.
అక్కడ ఉన్న వాళ్ళ మనుషుల్లో ఒకరు వాడి మొబైల్లో వైదేహి ఫోటోను అందరికి చూపిస్తూ ఉండడం చూసి కంఫర్మ్ గా  వీళ్ళు తన కోసమే వెతుకుతున్నారని అర్థమైంది.
తను వేగంగా నడుస్తుండగా వెనుక నుండి అక్కడే ఉన్న వాళ్ళ మనుషుల్లో ఒకరు "ఏయ్ ఒకసారి నీ మాస్క్ తీయ్" అనేసరికి వైదేహి గుండె ఝల్లుమంది. అలాగే భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తే....
వాడు ఇంకొక అమ్మాయిని మాస్క్ తీయమని అడుగుతుండడంతో పిలిచింది తనను కాదని తెలిసి ఒకసారి గట్టిగ ఊపిరి పీల్చుకొని ఎదురుగ ఉన్న ఆటోని ఎక్కేస్తుంది 
"ఎక్కడికి వెళ్ళాలమ్మ " అనడంతో ఆటో బయట వెనక్కి చూస్తున్న వైదేహి ఉలిక్కిపడి ఆటోవాడి వైపు చూసి
"పోనీ" అని అనింది 
"అరే ఎక్కడికెళ్లాలో చెప్పమ్మా" 
"ఎక్కడో ఒకటి ముందు పోనివ్వండి" అని అంది కంగారుగా వాళ్ళ మనుషులు ఇటు వస్తారేమో అని 
ఈలోపు వేరే ఒక పెద్దావిడ వచ్చి "బాబు కొండారెడ్డి సర్కిల్ కి వెళ్ళాలి వస్తావా" అని అనగా 
"కూర్చోండి" అంటూ ఆటోవాడు వైదేహిని జరగమని చెప్పి ఆ పెద్దావిడ ను కుర్చోపెట్టాడు.
"ఏమ్మా నువ్వు కూడా ఎక్కడికెళ్లాలో చెప్పు లేదంటే దిగిపో పొద్దున్నే వచ్చిన బేరాన్ని చెడకొట్టకు" అని ఆటోవాడు గదుముతుండడంతో
" నేను కూడా అక్కడే దిగాలండి కొండారెడ్డి సర్కిల్" అని ముందు ఆ బస్టాండ్ నుండి బయటపడాలని అనుకుంది వైదేహి
"మరి ఈ మాట ముందే చెప్పచ్చుగా" అంటూ విసుక్కోని ఆటో స్టార్ట్ చేసాడు.
అనంతపురం...
"ఏరా రాఘవ అమ్మాయి దొరికిందా" అని ముందరున్న రాగి సంకటి నాటుకోడి పులుసు తింటూ అడుగుతాడు చంగల్ రెడ్డి.
"ఇంకా లేదు అన్న బస్టాండ్ మొత్తం వెతికాం యాడ కనపడలేదు తప్పించుకున్నట్టు ఉంది" అని అన్నాడు తడబడుతూ.
"రేయ్..... " అని ఎదో చెప్పబోతుండగా పొలమారుతుంది.
"ఇటివ్వు నాయన నేను మాటాడత నువ్వు ముందు నీళ్లు తాగు" అని ఫోన్ అందుకుంటాడు ఇంటి పెద్దకొడుకు రామి రెడ్డి.
"రేయ్ రెండొందలు కోట్లురా రెండొందల కోట్లు అది ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోడానికి వీల్లేదు అది కానీ మిస్సయ్యిందా మీ అందరిని నరికేస్తా" అని గంభీరంగా చెప్తాడు రామి రెడ్డి.
 "అన్న అది ఎట్టి పరిస్థితిలోను ఈ కర్నూల్ దాటదు అన్ని చోట్ల మన మనుషులు ఉన్నారు ఈరోజు కల్లా దాన్ని సంపేసి ఆ బాక్స్ ను తీసుకుని వస్తాం" అని అంటాడు రాఘవ.
"రేయ్ గుర్తుపెట్టుకో ఆ బాక్స్ ను అదే దాని చేతుల్తో నీకు ఇయ్యాల ఆ తర్వాతనే నువ్వు దాన్ని సంపాల లేదంటే చేసిందంతా వృథా అవుతుంది" అని ఫోన్ పెట్టేస్తాడు రామి రెడ్డి.
"ఏమంటున్నాడ్రా వాడు" అని అడుగుతాడు చంగల్ రెడ్డి చేతులు కడుక్కుంటూ.
"ఈ రోజు కల్లా పనైపోతుంది అన్నాడు" అని అంటూ చంగల్ రెడ్డి వైపు చూసి "నాయనా కుర్నూల్లో కేశవ రెడ్డి కొడుకు శివా రెడ్డి ఉండాడు కదా ఇప్పుడు వాడు స్టేట్ కి హోమ్ మినిస్టర్ వాడికి చెప్తే కర్నూల్ లోనే ఉన్న వాడి తమ్ముడికి చెప్పి మనకు సాయంచేస్తాడు. ఇప్పుడు వోడి తమ్ముడే కర్నూల్ కి కింగ్. కర్నూల్లో వాడిని ఎదిరించేటోల్లే లేరు. వోడు సాయం సేస్తే అప్పుడు మన పని ఇంకా సులువుగా అవుతుందేమో " అని రామి రెడ్డి తన మనసులో మాట బయట పెడతాడు.
"వద్దురా ఈ విషయం ఇంకెవ్వరికి తెలియకూడదు మనమే ఈ పని ముందు పూర్తి చేద్దాం" అని అంటాడు

కొండారెడ్డి సర్కిల్...
కొండారెడ్డి సర్కిల్ వస్తుంది ముందుగా ఆ పెద్దావిడ ఆటో దిగగానే వైదేహి కూడా ఆటో దిగి డబ్బులిచ్చి అక్కడినుండి ముందుకు కదలడం మొదలుపెట్టింది.
కొద్దిదూరం నడిచాక తనకస్సలు ఎక్కడికి వెళ్లాలో తెలీక " ఇప్పుడు అస్సలు నేను అనితను ఎలా చేరుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు బస్టాండ్, రైల్వే స్టేషన్లో కూడా నా కోసం వెతుకుతుంటారు ఇప్పుడు ఏం చెయ్యాలి " అని ఆలోచిస్తుండగా కడుపులో శబ్దం రావడం మొదలైంది...
తను నిన్న రాత్రి బాధలో ఉండడం వలన ఆకలి కూడా అవ్వలేదు అలానే ఏడ్చుకుంటూ నిద్రపోయింది. అందుకని ముందు ఏదైనా తిని తర్వాత ఏమి చెయ్యాలో ఆలోచిద్దాం అని చుట్టూ చూడగా అక్కడ "బాషా హోటల్ (వెజ్ అండ్ నాన్ వెజ్)" అని పెద్ద అక్షరాలతో ఉన్న బోర్డు ని చూసి లోపలికి వెళ్ళింది. 
లోపలికి వెళ్లగా కౌంటర్ దగ్గర ఉన్న ముసలాయన "రా బేటీ లోపల కూర్చో" అని ఖాళీగా ఉన్న టేబుల్ వైపు చూపించగా వైదేహి అక్కడికి వెళ్లి కూర్చుంది. ఇంకా పొద్దున అవ్వడం వలన ఎక్కువ జనాలు లేరు.
"అరేయ్ మున్నాబేటా కస్టమర్ వచ్చారు ఇక్కడికి వచ్చి ఆర్డర్ తీసుకో" అని కౌంటర్ దగ్గర నుండే ముసలాయన అరిచాడు.
కిచెన్ నుండి ఒకడు వచ్చి "చెప్పండి అక్క ఏం కావాలి " అని అడిగాడు మున్నా.
"ఏమున్నాయి "
"దోశ, ఇడ్లి, పూరి, వడ, ఉగ్గాని బజ్జి,........ " అని టక టక వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని చెప్పడం మొదలుపెట్టాడు.
"ఒక ప్లేట్ పూరి" 
"ఒకే అక్కకు ఒక ప్లేట్ పూరి" అని అక్కడి నుండే అరిచాడు.
"రేయ్ ఈ రోజు ఎవరు రాలేదు మనమే అంతా చూసుకోవాలి మర్చిపోయావా" అని కౌంటర్ దగ్గరున్న ముసలాయన అరవగానే
"గుర్తుంది చాచా" అని లోపలికి వెళ్లబోయాడు.
వైదేహి తనను ఆపి " బాబు హ్యాండ్ వాష్ ఎక్కడ ఉంది" అని అడిగింది 
"బేటి  అక్కడ ట్యాప్ ఉంది అక్కడ హ్యాండ్ వాష్ చేసుకో" అని ముసలాయన తన చూపుడు వేలుని తన కౌంటర్ ముందు చూపించగా "థాంక్స్" అని అక్కడికి వెళ్లి వాష్ చేసుకోడానికి వచ్చింది.
అప్పుడే బయట తనను బస్టాండ్ వద్ద వెతుకుతున్న వారిలో ఒకడు కనిపించగానే భయంతో బ్యాగ్ తీసుకుని కిచెన్ లోపలికి పరిగెత్తింది వైదేహి.
కిచెన్ లోపల పూరీలు వేస్తున్న మున్నా ఒక్కసారిగా వైదేహిని చూసి "ఏమైందక్క ఎందుకు అలా భయపడుతున్నావ్" అని అడుగుతాడు.
"బయట వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు కనపడితే చంపేస్తారు ప్లీజ్ కాసేపు ఇక్కడే ఉండనివ్వండి" అంటూ ప్రాధేయపడుతుంది.
"భయపడకు అక్క నీకేం అవ్వదు చాచాజి చాలా మంచోడు నాకు కాలేజ్ ఫీజు కూడా ఆయనే చూసుకుంటాడు మేము చూసుకుంటాం నువ్విక్కడే ఉండు" అంటూ భరోసా ఇస్తూ బయటికి వెళ్ళాడు.
అప్పుడే  బాషా హోటల్ దగ్గరికి వచ్చి తన మొబైల్లో ఉన్న వైదేహి ఉన్న ఫోటోను చూపించి "ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా" అని భాషా భాయ్ ని అడుగుతాడు. 
"ఒక్క నిమిషం బాబు " అని తన కళ్ళద్దాలని తుడుచుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు చూసి " లేదు బాబు నేనెప్పుడూ ఈ అమ్మాయిని చూడలేదు" అని సమాధానం ఇస్తాడు.
అప్పుడే కిచెన్ లో నుండి మున్నా బయటికి వచ్చి ఆ మొబైల్లోని ఫోటోను చూస్తూ "ఈ అక్కని నేను ఇందాకే ఇటు పోవడం చుసిన" అంటూ ఒకవైపు చూపిస్తాడు. 
"నువ్వు చూసింది ఖచ్చితంగా తననేనా" అని అడుగుతాడు.
"అవునన్న నాకు బాగా గుర్తు ఈ అక్కనే" అని అనగానే 
" రేయ్  ఇటురండి " అని వాడి మనుషులని పిలిచి "అది ఇటు వైపు వెళ్ళిందంట వెళ్లి వెతకండి" అని అరుస్తాడు.
వాళ్లంతా వెళ్ళిపోయాక ఇద్దరు కిచెన్ లోపలికి వెళ్తారు. " వాళ్లంతా ఎవరు బేటి నిన్నెందుకు వెతుకుతున్నారు " అని బాషా భాయ్ అడుగుతాడు.
"వాళ్ళు నా దగ్గరున్న ఈ బాక్స్ కోసం వచ్చారు మా వాళ్ళందిరిని చంపేశారు ఇప్పుడు ఈ బాక్స్ తీసుకుని నన్ను కూడా చంపాలని చూస్తున్నారు" అని చెప్తూ గట్టిగా ఏడుస్తుంది వైదేహి.
ఆ బాక్స్ లో ఏముంది అని అడుగుదామనుకున్న బాషా భాయ్ తను ఏడుస్తుండడంతో తనను మరింత కంగారు పెట్టడం ఇష్టం లేక ఆపేసాడు.
"అక్క నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నావు " అని మున్నా అడుగుతాడు.
"హైదరాబాద్ అక్కడ నా ఫ్రెండ్ ఉంది తన దగ్గరికి వెల్దామనుకుంటే ప్రతీ చోట వీళ్ళున్నారు ఇప్పుడు కనీసం తనకు ఫోన్ చేద్దామంటే నా మొబైల్ స్విచ్ ఆఫ్ అవుతోంది రిపేర్ చేయించాలి ". అని అంటుంది కళ్ళు తుడుచుకుంటూ.
" ఫోన్ నా దగ్గర ఉంది ఇందులో నీ ఫ్రెండ్ కి ఫోన్ చేస్కో" అంటూ మొబైల్ ఇస్తూ "నువ్వేం భయపడకు బేటి నిన్ను ఈ కర్నూల్ దాటించే బాధ్యత నాది" అంటూ చాచాజీ భరోసా ఇస్తాడు
"థాంక్స్ అండి కానీ నాకు తన నెంబర్ గుర్తులేదు అన్నీ నా మొబైల్ల్లోనే సేవ్ చేసున్నాయి " 
"అవునా ఏది నీ ఫోన్ ఒకసారి ఇవ్వు " అని తీసుకుని "మున్నా బేటా మన హాజీ కి మొబైల్ రిపేర్ షాప్ ఉంది కదా వాడి దగ్గరికి వెళ్లి రిపేర్ చేయించుకొని రా డబ్బులు అడిగితే చాచాజీ మళ్ళీ ఇస్తాడని చెప్పు" అంటూ తనని పంపిస్తాడు.
"అయ్యో డబ్బులు నేనిస్తానండి ఏమనుకోకుండా కాస్త ఈ ఫోన్ ఒక్కటి రిపేర్ చేయించండి చాలు" అని తన దగ్గరున్న డబ్బుల్ని తీస్తుంది.
"తుం ఫికర్ మత్ కరో బేటి డబ్బులు కావాలంటే రిపేర్ అయిన తర్వాత ఇద్డువులే. నువ్వు కనీసం తినను కూడా లేదు ఆకలిగా ఉండుంటావు ఉండు " అని తను అడిగిన పూరీలను వేసి తనకు ఇచ్చి "లేవో బేటి ఖావో " అంటూ తనకిస్తాడు.
తను అప్పటికే ఆకలి మీద ఉండడంతో ప్లేట్ తీసుకుని తింటుంది. అప్పుడే కౌంటర్ దగ్గర కస్టమర్స్ తినేసి బిల్ పే చేయడానికి రావడంతో "నువ్వు తింటూ ఉండు బేటి నేను ఇప్పుడే వస్తా" అని వెళ్లి వాళ్ళు బిల్ పే చేసాక తిరిగి వస్తాడు.
కానీ ఒక్కసారిగా బయట ఎదో గొడవ జరుగుతుంటే ఇద్దరు కిచెన్ నుండి బయటికి వచ్చి చూస్తారు. అప్పుడే మున్నా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి వెంటనే షట్టర్ క్లోజ్ చేసి ఆయాసపడుతుంటాడు.
"క్యా హో గయా మున్నా బేటా  ఏం జరుగుతోంది బయట ఏంటా గోడవ తుం ఠీక్ హోనా " అని కంగారుగా అడుగుతాడు 
"హా చాచాజీ " అంటూ ఆయాస పడుతూ పక్కనే ఉన్న గ్లాస్ లో నీళ్లు తాగుతాడు. కాస్త అలసట తీరాక "బయట అన్నీ షాప్స్ బంద్ చేస్తున్నారు చాచాజీ " అని  చాచాజీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తాడు.
"ఎందుకు" అని అడుగుతాడు చాచాజీ 
"నా కోసం వచ్చిన వాళ్ళే ఇదంతా చేస్తున్నారా " అని కంగారు పడుతూ వైదేహి అడుగుతుంది.
"కాదక్కా నీకోసం కాదు. ఓబుల్ రెడ్డి మనుషులు ఇదంతా చేస్తున్నారు. ఓబుల్ రెడ్డి ని ఇక్కడే ఇందాక ఎవరో కొట్టారు" అని అంటాడు మున్నా.
"ఓబుల్ రెడ్డిని కొట్టాడా అదీ కర్నూల్లో కౌన్ హై రే ఓ " అని షాక్ అవుతాడు బాషా భాయ్
"ఎవరో తెలీదు చాచా కానీ నేను చూసాను. ఓబుల్ రెడ్డి ఎవరినో ఒక అమ్మాయిని బలవంతంగా తీసుకుని పోతుంటే. అప్పుడొచ్చాడు అతను నల్ల చొక్కా వేసుకుని అచ్చం హాలీవుడ్ హీరోల ఉన్నాడు. ఓబుల్ రెడ్డిని ఆపి ఒకే ఒక్క గుద్దు గుద్దాడు అంతే ఎగిరి పడి ట్రాన్స్ఫార్మర్ కి తగిలాడు"
"తర్వాత ఏమైంది" అని వైదేహి కుతూహలంగా అడిగింది
"ఏముంది ఓబుల్ రెడ్డిని కొట్టి సుమోలో ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు" అని చెప్పి తన దగ్గరున్న వైదేహి మొబైల్ ని వైదేహికి ఇచ్చేస్తాడు "సారీ అక్క అన్ని షాప్స్ బంద్ చేసేసారు అందుకే రిపేర్ చేయించలేదు".
"పర్లేదు మున్నా కానీ నేను ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళాలి కానీ ఎలా బయట అంత గొడవగా ఉంది" అని నిరాశపడుతుంది వైదేహి.
"ఇది కూడా మన మంచికే అనుకోవాలి బేటి గొడవ అంతా సద్దు మణిగాక మున్నా బేటా నిన్ను ఈ ఊరు దాటించేలా నేను చూసుకుంటా" అని అంటాడు బాషా భాయి. "అంతవరకు అస్సలు నువ్వెవరు వీళ్లేందుకు నిన్ను తరుముతున్నారు కాస్త వివరంగా చెప్పు బేటి" అనగా వైదేహి తన గురించి చెప్పడం మొదలుపెడుతుంది.... 
[+] 3 users Like zenitsu_a34's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
సీనీవెర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ - by zenitsu_a34 - 31-05-2024, 08:41 PM



Users browsing this thread: 1 Guest(s)