Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"మ్యూచువల్ ఫండ్"
#2
తలుపు చప్పుడైంది. అప్పుడే బయటకి వెళ్లబోతున్న కుర్రాడొకడు తలుపు తీసాడు.

ఎదురుగా ఉన్న మనిషిని చూసి, "అక్కా"... అంటూ పెద్దగా పిలిచాడు.

లోపల గిన్నెలు కడుగుతున్న ఇరవై ఏళ్ళ అమ్మాయి బయటి గదిలోకి వచ్చింది.

విషయం అర్ధమైంది అమ్మాయికి.

"నేను కాలేజికెళ్తున్నా"... అంటూ బయటకెళ్ళిపోయాడు కుర్రాడు.

"కూర్చోండి"... అంది అమ్మాయి.

"మీ అమ్మెక్కడ?"

"బయటకెళ్ళిందండి, వచ్చేస్తుంది. కాఫీ తెస్తాను"... అంటూ లోపలికెళ్లబోయింది.

"ఈ మర్యాదలకేం తక్కువ లేదు. కాఫీ కాదు, అద్దె కావాలి నాకు, మీ అమ్మెక్కడ"... కోపంగా అన్నాడు ఓనర్.

"వచ్చేస్తుందండి"... నెమ్మదిగా చెప్పింది అమ్మాయి.

"నా అద్దె సంగతి చూడకుండా పొద్దున్నే ఈ పెత్తనాలేంటి?"

ఆ మాటకి కోపం వచ్చినా, ఎందుకు అన్నాడో తెలిసిన అమ్మాయి ఏమీ అనకుండా అలానే ఉంది.

"నెల దాటి ఎన్ని రోజులయింది, నా అద్దె ఎప్పుడిస్తారు?"

తల దించుకుంది అమ్మాయి.

"ఇప్పటికే రెండు నెలల అద్దె ఇవ్వాలి, ఇది మూడో నెల. ఇంకెన్ని నెలలు అద్దె ఇవ్వకుండా నా ఇంట్లో ఉంటారు?"... కోపంగా అన్నాడు ఓనర్.

తల దించుకునే ఉంది అమ్మాయి.

"గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ మీది, అయినా సరే మగదిక్కు లేని కుటుంబం అని అద్దె తక్కువ ఇస్తానన్నా ఇల్లు ఇచ్చాను, అవునా?"

తలూపింది అమ్మాయి.

"ఎంతమంది నన్ను అడుగుతూ ఉంటారో తెలుసా, గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ మాకిస్తారా అని, ఎక్కువ అద్దె వస్తుందని తెలిసినా మిమ్మల్ని ఎప్పుడన్నా ఖాళీ చెయ్యమన్నానా?"

తలూపింది అమ్మాయి.

"ఆ అద్దె కూడా కట్టట్లేదు మీరు"

"ఈ నెల ఇబ్బందిగా ఉందండి, అమ్మ వాళ్ల ఆఫీసులో ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఆ పని మీద తిరుగుతోంది అమ్మ, అందుకే అద్దె ఆలస్యం అయింది"

"ఇలాంటి కష్టాలు ఎన్నో విన్నాను నేను. నేను కూడా ఇలాంటి కష్టాలు పడ్డవాడినే. అవన్నీ గుర్తుండబట్టే మీ అద్దె ఆలస్యం అవుతున్నా ఏమీ అనకుండా ఉంటున్నా"

"నా డిగ్రీ అయిపోయిందండి, నేను కూడా జాబ్స్ వెతుక్కుంటున్నాను, వచ్చే నెల మూడు నెలల అద్దె ఒకేసారి ఇచ్చేస్తాము. ఈ ఒక్కసారికి ఏమీ అనుకోకండి"

"సరే కానీ. కష్టపడే పిల్లవి నువ్వు, నువ్వు చెప్పావని ఆగుతున్నా"... తలూపుతూ అన్నాడు ఓనర్.

"చాలా థాంక్స్ అండి. జాబ్ రాగానే, అడ్వాన్స్ ఇస్తారేమో అడిగి అద్దె ఇచ్చేస్తాను"... చెప్పింది అమ్మాయి.

తలూపుతూ వెళ్ళిపోయాడు ఓనర్.

వయసు చిన్నదైనా, కుటుంబాన్ని పట్టించుకోవడంలో పెద్దదైన అమ్మాయి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ, తల పట్టుకుంది, కళ్ళల్లో నీళ్ళు.

ఇంతలో మొబైల్లో అలారం మోగింది.

వెళ్ళాలని లేకపోయినా, వెళ్లకపోతే కష్టాలు పెరుగుతాయే కాని తగ్గవని తెలిసిన అమ్మాయి, రెడీ అవ్వడానికి వెళ్ళింది.

రెడీ అయ్యి తల్లి ఇంకా రాకపోవడంతో ఫోన్ చేసింది తల్లికి.

"అమ్మా ఎక్కడున్నావు?"

"వచ్చేస్తున్నా, వీధి మలుపు తిరుగుతున్నా"

ఫోన్ పెట్టేసి, పగిలిన మొబైల్ స్క్రీన్ మీద ముక్కలుగా కనిపిస్తున్న తన ముఖాన్ని చూసుకుని దిగులుగా, తల్లి కోసం ఎదురుచూడసాగింది అమ్మాయి.

ఈ అమ్మాయి కథేంటో వచ్చే భాగంలో చూద్దాం.
[+] 16 users Like earthman's post
Like Reply


Messages In This Thread
RE: "మ్యూచువల్ ఫండ్" - by earthman - 27-05-2024, 08:40 AM



Users browsing this thread: 6 Guest(s)